పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!


పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!

పుణె

బీమా కోరేగావ్ అబద్దపు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ పూణేలోని ఎరవాడ జైల్లో రిమాండు ఖైదీలుగా ఉంటూ కోర్టుకు హాజరవుతున్న వరవరరావు సహా మిగతా హక్కుల కార్యకర్తలను కలవడానికి సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ అక్కడకు వెళ్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేసులో తాజా పరిస్థితి ఏమిటి..? మార్చి 11న జరిగే వాయిదా సమయానికి అక్కడకు వెళ్లిన వేణుగోపాల్‌కి ఎదురైన సంఘటనలు ఏమిటో తన ఫేస్‌బుక్ వాల్‌పై రాసుకున్నారు. అది యధాతథంగా..

మిత్రులారా...
భీమా కోరేగాం హింసాకాండ కేసులో అసలు విచారణ ఇంకా ప్రారంభమే కాలేదు గాని ఈలోగా ఖైదీల బెయిల్ దరఖాస్తుల మీద, ఇతర అంశాల దరఖాస్తుల మీద వాదనలు జరగకపోయినా విరివిగా వాయిదాలు మాత్రం పడుతున్నాయి. ఫిబ్రవరి 15 వాయిదాకు వెళ్లి.. ఆనాడు జరిగిన విషయాలు ఫిబ్రవరి 16న ఇక్కడ పంచుకున్నాను. ఆనాడు ఫిబ్రవరి 22కు వాయిదా పడింది, అది ఫిబ్రవరి 26కు, అది ఫిబ్రవరి 28కి, అది మార్చ్ 8కి, తర్వాత మార్చి 11కు వాయిదా పడింది. ముందరి మూడు వాయిదాల్లో ఒకసారి అక్కయ్య వెళ్లగలిగింది గాని.. మిగిలిన వాయిదాలకు ఎవరమూ వెళ్లలేకపోయాం.

అందువల్ల మార్చి 11కు ఎవరమో ఒకరం తప్పనిసరిగా వెళ్లవలసిందేనని బయల్దేరాను. మహబూబ్‌నగర్ రాఘవాచారి కూడ నాతో వచ్చాడు. ఈసారి వీవీ, మహేశ్‌రౌత్‌ల బెయిల్ పిటిషన్ల మీద వాదనలు ఉంటాయని.. అందువల్ల ఉదయం సెషన్‌లోనే వాళ్లను తీసుకురావచ్చునని న్యాయవాది చెప్పారు.

తీరా, పదకొండున్నరకల్లా మేం కోర్టుకు వెళ్లేసరికి హాలు ఖాళీగా ఉంది. రెగ్యులర్ న్యాయమూర్తి సెలవులో ఉన్నాడన్నారు. అందువల్ల ఈ కేసును మరొక న్యాయమూర్తి దగ్గరికి మారుస్తారని.. కొత్త న్యాయమూర్తి కేవలం మరొక వాయిదా తేదీ మాత్రమే చెపుతాడని అన్నారు. అప్పటికింకా కొత్త న్యాయమూర్తి ఎవరో తెలియలేదు గనుక ఖైదీలను ఇక్కడికి తీసుకువస్తారని అంటే ఎదురుచూస్తూ కూచున్నాం. అసలు న్యాయమూర్తి సెలవు అని తెలిస్తే ఖైదీలను జైలు నుంచి తీసుకురాక పోవచ్చునని కూడ అన్నారు. పన్నెండు గంటల ప్రయాణం చేసి వస్తే, రెండు మూడు గంటలు పడిగాపులు పడి, చివరికి జైలు నుంచి తీసుకురాలేదనే వార్తతో, ఆశాభంగంతో వెళ్లవలసిందేనా అని విచారపడ్డాం.

హఠాత్తుగా ఒంటిగంటకు సుధా భరద్వాజ్‌ను, షోమా సేన్‌ను తీసుకువచ్చారని, కోర్టు ఆవరణలోని పోలీసు బ్లాక్‌లో వాళ్లు ఉన్నారని తెలిసింది. మరి కొద్ది నిమిషాలకే అందరినీ తీసుకొచ్చారని కూడ తెలిసింది. హఠాత్తుగా విద్యుల్లతలు. ఒకటిన్నర ప్రాంతంలో కొత్త న్యాయమూర్తి కూడ నిర్ణయమయ్యారని.. నిందితులను నేరుగా ఆయన దగ్గరికి తీసుకువెళ్తున్నారని కబురు తెలిసి ఉరుకులు పరుగుల మీద ఆ భవనం దగ్గరికి వెళ్లాం. రెండు గంటలకు మధ్యాహ్న భోజన విరామం మొదలవుతుంది గనుక ఆలోపే ఖైదీలను చూసి వాయిదా తేదీ చెప్పేస్తారని తెలిసింది. న్యాయాధీన్ బందీ కోఠడీ ముందుకు వెళ్లి ఎదురుచూపులు చూస్తుండగా తొమ్మిది మందినీ నడిపించుకొచ్చారు. దారిలోనే ఒక్కొక్కరినీ కౌగిలించుకుని, వారితో కలిసి అక్కడికి రెండు మూడు నిమిషాల దూరంలోని కొత్త న్యాయమూర్తి హాలు దగ్గరికి నడక. మాటలు...

ఒక్కొక్కరినీ హాజరు పిలిచి మార్చి 19 అని కొత్త వాయిదా చెప్పడంతో ఇవాళ్టి కోర్టు వాయిదా అయిపోయింది. ఖైదీలతో న్యాయవాదులు, కొందరి కోసం వచ్చిన బంధువులు, మిత్రులు మాట్లాడడానికి అనుమతించమని అడగగా కొత్త న్యాయమూర్తి ఐదు నిమిషాలు అని అనుమతించారు. అలా రాఘవాచారీ నేనూ వీవీకి చెరోపక్కన కూచుని ఓ పది, పదిహేను నిమిషాలు మాట్లాడగలిగాం. కొన్ని కొత్త పుస్తకాలు చూపెట్టగలిగాం. వీవీ తెలుసుకోదలచుకున్న విషయాల్లో కొన్ని చెప్పగలిగాం. వీవీ చెప్పదలచుకున్న విషయాల్లో కొన్ని వినగలిగాం. సుధా భరద్వాజ్‌కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా అందిన అరుదైన గౌరవానికి అందరమూ అభినందనలు చెప్పాం. మాయ్షా మంచి ఇంటర్వ్యూ ఇచ్చిందని సుధకూ, మహిళా దినోత్సవం రోజున కోయెల్ తన గురించి ఒక మంచి నోట్ రాసిందని షోమాకూ చెప్పి వాళ్ల కళ్లలో విద్యుల్లతలు మెరవడం చూశాను. గుల్జార్ కవిత్వ సంపుటం మరాఠీలోకి అనువదించడం పూర్తి చేశానని మహేశ్ శుభవార్త చెప్పాడు.

మళ్లీ వెనక్కి తీసుకువెళ్తున్నప్పుడు మూడు నాలుగు నిమిషాల నడక-మాటలు. మళ్లీ న్యాయాధీన్ బందీ కోఠడీ గేటు ముందు మరొకసారి గాఢాలింగనం.

ప్రతిసారీ సాయంత్రం దాకా కోర్టులోనే ఉండి, అది అయిపోగానే హైదరాబాద్ బయల్దేరేవాళ్లం. ఈసారి మధ్యాహ్నం రెండుంపావు కల్లా కోర్టు పని అయిపోయి, సాయంత్రం దాకా సమయం ఉంది గనుక రాఘవాచారీ నేనూ కాస్త పుణె తిరుగుదామనుకున్నాం.

మహాత్మా జోతిబా ఫులే పేరు మీద సంగ్రహాలయ్ ఉంటే అది ఫులే జీవితం గురించి చెప్పేదని పొరపాటు పడి అక్కడికి వెళ్లాం గాని అది మామూలు మ్యూజియం. అక్కడి నుంచి గంజ్‌పేటలోని ఫులే స్మారక్ – సమతా భూమి – కి వెళ్లాం. అది ఫులే నివసించిన ఇల్లు. సోమవారం సెలవు కావడంతో ఆ ఇంట్లో ఉన్న ప్రదర్శనశాల చూడలేకపోయాం గాని, బైట ఆవరణలో కుడ్యచిత్రాలు, ఫులే సమాధి చూస్తూ.. ఫులే నడయాడిన, బోధించిన నేల మీద, ఫులే పీల్చిన గాలి పీలుస్తూ, ఫులే గడిపిన రావిచెట్టు నీడలో కాసేపు గడిపాం. ఫులే, సావిత్రీబాయి విగ్రహాలతో ఫొటో దిగాం. ఆ ప్రాంగణంలో పనిచేస్తున్న ఒక వృద్ధురాలు మా మాటలు విని, తెలుగువాళ్లా అని ప్రాణం లేచి వచ్చినట్టు పలకరించింది.

పాలమూరు గోపాల్ పేట నుంచి వలస వచ్చిన లక్ష్మి, ఆమె భర్త ఆ ప్రాంగణంలో పని చేస్తున్నారట. రాఘవాచారి కూడ పాలమూరు వలస మనిషిని చూసి కదిలిపోయాడు. ఇది ఈసారి పుణె ప్రయాణపు అదనపు విశేషం. మరొక విద్యుల్లత.

- ఎన్. వేణుగోపాల్,
ఎడిటర్ - వీక్షణం పత్రిక

Keywords : వీవీ, వరవరరావు, బీమా కోరేగావ్, మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్, పూణే కోర్టు, ఎరవాడ జైలు, పూలే, రిమాండ్ ఖైదీలు, Varavararao, maoists, urban naxals, pune court
(2019-03-20 04:28:38)No. of visitors : 183

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


పుణె