ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం


ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం

ఒక

బీమా కోరేగావ్ కేసులో పూణే జైల్లో ఉన్న వరవరరావుతో సహా మిగతా వారిని పూణే కోర్టు వద్ద కలిసి వారికి తమ సంఘీభావం ప్రకటించడానికి ఈ సారి తెలంగాణ నుంచి 30 మంది వెళ్ళారు. గొప్ప సంఘీభావ ప్రదర్శనగా, ఒకింత విచారంగా, మరెంతో ఉత్తేజకరంగా సాగిన రెండు రాత్రులూ ఒక పగలూ నిండిన పుణె ప్రయాణపై వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ నివేదిక‌..

---------------------------------------------------------------------------------------------------------

మిత్రులారా, ఈసారి రెండు రాత్రులూ ఒక పగలూ నిండిన పుణె ప్రయాణం ఒక గొప్ప సంఘీభావ ప్రదర్శనగా, ఒకింత విచారంగా, మరెంతో ఉత్తేజకరంగా సాగింది.

నవంబర్ 17న వివిని అరెస్టు చేసి పుణెకు తీసుకువెళ్లి, వారంరోజుల పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత 25న పోలీసు కస్టడీలో, 26న కోర్టులో కలిసి వచ్చినప్పటి నుంచీ, ఆ తర్వాత కలిసి వచ్చినప్పుడల్లా నేను రాస్తూ వచ్చిన నివేదికలు చదివిన ప్రతిసారీ ఎంతో మంది తామూ పుణె వస్తామని, వివిని కలిసి తమ సంఘీభావం ప్రకటిస్తామనీ, ఈ అబద్ధపు కేసు పట్ల తమ నిరసన తెలియజేస్తామనీ అంటున్నారు. ఈ నాలుగు నెలల్లో కొందరు తమంతట తామే పుణె వెళ్లి వివిని కోర్టులో కలిశారు.

వివిని కలిసి తమ సంఘీభావం ప్రకటించి, రాజ్యనిర్బంధం పట్ల తమ నిరసనను నమోదు చేయాలని ఆయన మిత్రులు, అభిమానులు, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు తలపెడుతున్న ఆలోచనలు మహబూబ్ నగర్ లో ఫిబ్రవరి 3న జరిగిన ఒక సభలో మరింత నిర్దిష్టరూపం తీసుకున్నాయి. ʹవివి కవిత్వంతో ఒకరోజుʹ అనే పేరుతో పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన ఆ సదస్సులో సీనియర్ కవి దేవిప్రియ గారు ʹవివిని అభిమానించే, ప్రేమించే, ఆయన మీద నిర్బంధాన్ని ఖండించే కవులం, రచయితలం, కళాకారులం ఇంతమందిమి ఉన్నాము గదా, అందరమూ కలిసికట్టుగా ఒక బస్సు తీసుకుని పుణె వెళ్లి మన సంఘీభావాన్ని ప్రకటించి, మన నిరసనను తెలియజేసి వద్దాంʹ అన్నారు.

ఈ సంఘీభావం వివి ఒక్కరికి మాత్రమే కాదు, రాజ్య నిర్బంధానికి గురవుతున్న ప్రజా మేధావులకూ, కార్యకర్తలకూ అందరికీ. ఈ నిరసన ఒక్క వివి మీద నిర్బంధానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, భీమా కోరేగాం కేసు, అంతకుముందరి సాయిబాబా కేసు, మొత్తంగా ఆదివాసులమీద, దళితులమీద, ముస్లింల మీద, స్త్రీలమీద, ప్రజాఉద్యమకారులమీద రాజ్యం అమలు చేస్తున్న మొత్తం నిర్బంధం పట్ల నిరసన.

ఆ సూచన మరింత నిర్దిష్టరూపం ధరించి నిన్న మార్చ్ 19 వాయిదా సందర్భంగా వివిని కలవడానికి మహబూబ్ నగర్ నుంచి 15 మంది, హైదరాబాదు నుంచి 10 మంది కవులు, రచయితలు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, వివి కుటుంబ సభ్యులు మార్చ్ 18 సాయంత్రం ఒక బస్సు తీసుకుని బయల్దేరారు. ఇందులో పదకొండేళ్ల అల, పదహారేళ్ల వెన్నెల నుంచి డెబ్బయో పడిలో ఉన్న బిచ్చారెడ్డి, అంపయ్య, యాదగిరిల దాకా అన్ని వయసుల వాళ్లు ఉన్నారు. రాఘవాచారి, దుడ్డు ప్రభాకర్, కోటి, నారాయణరావు, ఉజ్వల్, ఉదయ్, చంద్రశేఖర్, స్వరూప, రాంకి వంటి ఎందరో ఉన్నారు. ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించినవాళ్లు, ఎన్నో నిర్బంధాలు చవిచూసినవాళ్లు, ఎంతో జీవితానుభవం ఉన్నవాళ్లు, ఎంతో అధ్యయనం ఉన్నవాళ్లు, ఎంతో వ్యక్తీకరణ శక్తి ఉన్నవాళ్లు. కుల నిర్మూలన పోరాట సమితి, పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, ప్రజాకళామండలి, పాలమూరు అధ్యయన వేదిక వంటి విభిన్న ప్రజాసంఘాల కార్యకర్తలు. సాగుతున్న రాజ్య దమనకాండ పట్ల వ్యతిరేకత, ఈ రాజ్య దమనకాండలో వేధింపులకు గురవుతున్న ప్రజా మేధావుల పట్ల అభిమానం, ప్రత్యేకించి వివి పట్ల ప్రేమ ఈ యాత్రికులందరినీ ఒక్కదగ్గరికి చేర్చాయి.

కోర్టు ఎట్లాగూ పదకొండున్నర, పన్నెండుకు ముందు మొదలు కాదు గనుక ఉదయం పూట దొరికే సమయాన్ని సద్వినియోగ పరచడానికి ఈ బృందం భీమా కోరేగాం విజయ స్థంభాన్ని, సాయంత్రం కోర్టు అయిపోయాక తిరుగు ప్రయాణానికి ముందు సమయం ఉంటే మహాత్మా జోతిబా ఫులే ఇంటిని, స్మారక కేంద్రాన్ని సందర్శించాలని ప్రణాళిక వేసుకుంది.

భీమా కోరేగాం యుద్ధానికి, పీష్వాల పరాజయానికి 200 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరిగిన శౌర్య దివస్ ఉత్సవాలు, ఆ సందర్భంగా పెల్లుబికిన ʹనయీ పీష్వాహీ నహీ చలేగీʹ నినాదం, ఆ ఉత్సవం మీద సంఘ్ పరివార్ శక్తుల హింసాకాండ, ఆ హింసాకాండ పేరుతో దళిత, విప్లవ శక్తుల మీద నిర్బంధం, దేశవ్యాప్తంగా ప్రజా మేధావులందరినీ ఆ అబద్ధపు కేసులో ఇరికించడం ఈ బృందంలోని ప్రతి ఒక్కరినీ గత పద్నాలుగు నెలలుగా ఆలోచింపజేస్తున్న విషయాలే. ఈ ఇరవై ఐదు మందిలో అందరూ భీమా కోరేగాం గురించి చదివిన, విన్న వారే గాని, ఎన్నడూ భీమా కోరేగాంకో, పుణెకో వెళ్లినవాళ్లు కాదు. అందువల్ల విజయస్థంభపు సందర్శన గొప్ప ఉద్వేగ పూరితంగా ఉండింది.

పుణె నుంచి ఉదయం ఎనిమిదికల్లా విజయ స్థంభం దగ్గరికి చేరితే, అక్కడ ఒక పోలీసు క్యాంపు. చుట్టూ సాయుధ పోలీసుల పహరా. విజయ స్థంభం చుట్టూ ప్రాంగణానికి పెద్ద పోషణ ఏమీ లేదు గాని ఆ లోపల నాలుగైదు పోలీసు గుడారాలు. గేటు మీద డిఫెన్స్ లాండ్ అని బోర్డు. గేటు బైట రెండు వాహనాలు, ఒక గుడారం, ఒక ఎత్తైన కాపలా మంచె. అక్కడ ఒక సాయుధ జవాను దగ్గర ఒక రిజిస్టర్ పెట్టి ఎవరెవరు వచ్చారో నమోదు చేసుకుంటున్నారు.ఒక చారిత్రక స్థలానికి, అందునా ఒక దుర్మార్గమైన బ్రాహ్మణీయ హిందూ పాలన అంతరించిన చిహ్నానికి ఇంత బందోబస్తు ఉండడం ఇవాళ్టి పాలన ఎటువంటిదో తెలుపుతుంది. కాకపోతే, ఆ విజయ స్థంభం మహారాష్ట్ర దళిత బహుజనుల్లో పెద్ద యాత్రాస్థలం గనుక (మేం అక్కడ ఉన్న గంట సేపట్లోనే మూడు టూరిస్టు బస్సుల నిండా జనం వచ్చారు!) అక్కడి పోలీసులకు యాత్రికుల రాక అలవాటైపోయినట్టుంది. ఆ పోలీసు బందోబస్తు చూసి, స్తంభం దగ్గరికి వెళ్లనిస్తారా లేదా అని అడగడానికి వెళ్తుండగానే, ʹలోపలికి వెళ్లి చూడొచ్చు, గద్దె మాత్రం ఎక్కకండిʹ అని పోలీసులు చెప్పారు.

ఆ విజయస్థంభం నీడలో విడివిడిగానూ, బృందాలుగానూ ఫొటోలు దిగాం. అందరమూ కలిసి ఒక జవానుతో ఫొటో తీయించుకున్నాం.

పుణె తిరిగివచ్చి, భయానకమైన ట్రాఫిక్ రద్దీలో ఈదుతూ పుణె మిత్రులు ఏర్పాటు చేసిన వసతి స్థలంలో గబగబా కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ కోర్టు దారిన పడ్డాం. ʹభారత పారిశ్రామిక పరిణామంʹ అనే అద్భుతమైన పుస్తకం రాసిన సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త డి ఆర్ గాడ్గిల్ ఇల్లు, ఆయన కూతురు, ప్లానింగ్ ఫర్ మిలియన్స్ వంటి మంచి పుస్తకం రాసిన ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త సులభా బ్రహ్మె ఇల్లు, ఆర్ ఎస్ రావు 1970ల మొదట్లో పనిచేసి, చిన్న మార్క్సిస్టు అధ్యయన బృందాన్ని తయారుచేసిన గోఖలే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్, సుప్రసిద్ధమైన భండార్కర్ ఓరియెంటల్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నెన్నో ఎప్పటికైనా చూడవలసిన, కొన్ని గంటలో, రోజులో గడపవలసిన ప్రాంతాలన్నీ బస్సులో వెళ్తూ బోర్డులు మాత్రం చూశాం.

కోర్టు ఆవరణలో పన్నెండింటి నుంచి పడిగాపులు పడుతుండగా, ఒకటిన్నరకు మిత్రులు సుధా భరద్వాజ్, షోమా సేన్ పోలీసు పహరా మధ్య వస్తూ కనబడ్డారు. ʹఇవాళ వాళ్లను తీసుకురావడం లేదని ఎస్కార్ట్ పోలీసులు చెపుతున్నారు. మమ్మల్ని కోర్టులో మూడున్నరకు హాజరు పరుస్తారుʹ అంటూ సుధ న్యాయాధీన్ బందీ కోఠడీ లోకి వెళ్లిపోయింది. ఆ మాట నిజమేనా, ఈ ఎస్కార్ట్ పోలీసులు ఊరికే బురిడీ కొట్టించడానికి అలా చెప్పి ఉంటారా అని సందేహంలో, నిజం కావచ్చునని నిరాశలో, నిజం కాగూడదనే ఆశతో తర్వాత రెండు గంటలు ఆ ఎండలో, ఆ పోలీసు కస్టడీ ఆవరణ ముందు పడిగాపులు పడ్డాం.

చివరికి మూడున్నరకు వాళ్లద్దరిని మాత్రమే తీసుకుని పోలీసులు బైటికి వచ్చారు. ఇక వివితో సహా మిగిలిన భీమా కోరేగాం నిందితులెవ్వరినీ తీసుకురాలేదని తేలిపోయింది. అక్కడినుంచి కోర్టు హాలు దాకా ఏడెనిమిది నిమిషాలు సుధ, షోమాల పక్కన ఒకటీ అరా మాట్లాడుతూ నడిచాం.

ఎన్నికల బందోబస్తు పనుల వల్ల పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం కుదరలేదని, అందువల్ల మిగిలిన ఖైదీల్ని తీసుకురాలేకపొయామని పిపి కోర్టుకు తెలియజేశారు. కాని అది పచ్చి అబద్ధం. సుధకు, షోమాకూ ఎస్కార్ట్ ఏర్పాటు చేయగలిగినప్పుడు, మేం అక్కడ ఉన్నప్పుడే కొన్ని డజన్ల మంది మామూలు ఖైదీల్ని జైలు నుంచి ఎస్కార్ట్ తో తీసుకువచ్చినప్పుడు వివికి, మిగిలిన ఆరుగురికి మాత్రమే ఎస్కార్ట్ ఇబ్బంది వచ్చిందనడం బుకాయింపు తప్ప వాస్తవం కాదు. బహుశా ఇవాళ ఇలా సంఘీభావంగా ఒక పెద్ద బృందం వస్తున్నదని సమాచారం ఉన్నందువల్లనే, అటు నిందితులకు, ఇటు సందర్శకులకు ఆశాభంగం కలిగించి, వేధించేందుకే ఈ ఎత్తు వేసి ఉంటారు.

కాని లెక్క ప్రకారం వివి, మహేశ్ రౌత్ ల బెయిల్ దరఖాస్తుల మీద వాదనలు జరగవలసి ఉండింది. ʹఆ వాదనలు వినిపించాలంటే నా క్లైంట్ ఉండాలి, నా వాదన మీద ఆయన ఎలా స్పందిస్తారో, ఏ అదనపు ఆదేశాలు, సూచనలు చేస్తారో నాకు తెలియదుʹ అని వివి తరఫు న్యాయవాది కోర్టుకు తన అభ్యంతరం తెలియజేశారు. తప్పనిసరిగా హాజరు పరచవలసిన రోజున కూడ ఇలా తప్పించడం మీద తన నిరసన తెలిపారు. అప్పుడు ఏ సాకులూ చెప్పకుండా వచ్చే వాయిదాకు తప్పనిసరిగా తీసుకురావాలని జైలు అధికారులను ఆదేశిస్తూ జడ్జి ఉత్తరం పంపారు. మార్చ్ 25కు మరుసటి వాయిదా వేశారు.

ఆ తర్వాత పుణెకు చెందిన మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ పత్రికల విలేకరులు హైదరాబాద్ నుంచి వెళ్లిన బృందంతో మాట్లాడారు, ఫొటోలు తీసుకున్నారు.

ఆ తర్వాత హైదరాబాద్ బృందం విచారంతోనే, నిరాశతోనే వెనుదిరిగినప్పటికీ, వివితో, మిగిలిన నిందితులతో తమ కలయికకు, కనీసం ఒక చూపుకు, పలకరింపుకు కూడ భయపడుతున్నదంటే రాజ్యం ఎంత పిరికిదో అర్థం చేసుకుని, ఇదే విజయం అనుకున్నారు. ʹవివిని ఎన్నోసార్లు చూశాం, కలిశాం, మాట్లాడాం, ఆయన మాటలతో ప్రేరణ పొందాం, ఇవాళ కలవనివ్వకపోవడం విచారమే గాని, దానికన్న రాజ్యం ఎంత భయపడుతున్నదో తెలిసిపోయిందిʹ అని అన్నారు.

ఒకరకంగా ఆ విచారాన్ని పోగొట్టినది, ఆ తర్వాత రెండు గంటల పాటు వాళ్లు గడిపిన మహాత్మా జోతిబా ఫులే గృహ సందర్శన. ఆ చల్లని మహావృక్షం నీడలో, ఆ నూట యాబై సంవత్సరాల కింది ఇంట్లో, అడుగడుగునా జోతిబా, సావిత్రిల సామాజిక విప్లవ స్ఫూర్తి కదలాడుతున్న ఆ నేలలో, ఆ గాలిలో ఆ ఇరవై ఐదు మందీ రెండు గంటలు సేద తీరారు. జోతిబా గురించీ సావిత్రాబాయి గురించీ మాట్లాడుకున్నారు. వారి విగ్రహాలతో ఫొటోలు తీసుకున్నారు. వారి జీవన సాఫల్య పరిణామాలను చిత్రించిన కుడ్య చిత్రాలను చూశారు. వారు పాఠాలు చెప్పిన నేల మీద, వారు నీళ్లు తోడిన బావి పక్కన, వారు తిరుగాడిన గదుల్లో తిరిగి గొప్ప ఉత్తేజాన్ని పొందారు.

తిరుగు ప్రయాణం మరొక గొప్ప అనుభవం. మధ్యలో ఒక చాయ్ విరామం, ఒక భోజన విరామంతో కలిపి ఎనిమిదింటి నుంచి పన్నెండింటిదాకా ఆ బస్సులోనే ప్రజాకళామండలి కోటి అధ్యక్షతన ఇరవై ఐదు మందీ తమ అభిప్రాయాలు, అనుభూతులు పంచుకున్న ఒక ఉజ్వలమైన సభ జరిగింది. ఈ నిర్బంధం మీద, ప్రజా ప్రతిఘటన మీద, ఇతర విషయాల మీద అందరూ ఏ మొహమాటాలూ కల్మషాలూ భేషజాలూ లేకుండా మనసు విప్పి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జరిగిన పనులను సమీక్షించుకున్నారు. చేయవలసిన పనులను నిర్దేశించుకున్నారు.

నావరకు నాకు ఇది ఒక అద్భుతమైన, ఉజ్వలమైన, ఉత్తేజకరమైన అనుభవం.

- ఎన్. వేణుగోపాల్, ఎడిటర్ - వీక్షణం.

Keywords : వీవీ, వరవరరావు, పూణే, బీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్, పోలీసులు, మావోయిస్టులు, Pune Police, varavararao, bima koregoan, police,
(2019-06-25 13:42:16)No. of visitors : 293

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


ఒక