వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ


వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ

వరవరరావు

బీమా కోరేగావ్ కేసులో తప్పుడు అభియోగాలు ఎదుర్కుంటూ పూణేలోని ఎరవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవ రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆయన సహచరి పి. హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విడుదల చేశారు. వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాసిన బహిరంగ లేఖపై తెలంగాణకు చెందిన వంద మంది ప్రముఖులు, ప్రజాస్వామిక వాదులు సంతకాలు చేశారు. ఇదే లేఖను change.org లో కూడా పోస్టు చేయగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 660 మంది సంతకాలు చేశారు.

ఈ లేఖకు సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యావేత్త చుక్కారామయ్య, సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి. నర్సింహ్మారావు, ప్రొఫెసర్ రమ ఎస్. మెల్కొటే, ప్రొఫెసర్ వసంత కన్నాభిరన్, ప్రొఫెసర్ సూసీ థారు, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీ ప్రియ, ఐజేయూ అధ్యక్షులు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు దేవులపల్లి అమర్, మానవ హక్కుల ఫోరమ్ అధ్యక్షులు జీవన్ కుమార్, సియాసత్ డౌలీ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తదితరులు పాల్గొననారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు వరవరరావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి కల్పిత ఆధారాలతో అక్రమ కేసులో వరవరరావు సహా ఇతరులను ఇరికించారని వారు ఆరోపించారు.

పూర్తి పత్రికా ప్రకటన కింద చదువవచ్చు.

---------------------------------------------------------------------------------------------

పత్రికా ప్రకటన

వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ

సంఘీభావం తెలిపిన ఏడువందల మంది ప్రజాస్వామిక వాదులు

ఇవాళ హైదరాబాద్‌‌లోని ఒక పత్రికా సమావేశంలో విడుదల చేసిన ʹభారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖʹలో ప్రఖ్యాత విప్లవ కవి, ప్రజా మేధావి వరవర రావు సహచరి పి హేమలత.. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని, వరవరరావును విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించవలసిందిగా కోరారు. ఒక నేరపూరిత కుట్ర కేసులో నిందితుడిగా వరవర రావు ప్రస్తుతం పుణెలోని యరవాడ కేంద్ర కారాగారంలో ఉన్నారు.

ఆమె లేఖలోని ప్రధానాంశాలు:

వరవరరావును, తదితరులను నిందితులుగా చూపిన భీమా కోరేగాం హింసాకాండ కేసును తర్వాత నేరపూరిత కుట్ర కేసుగా, ఆ తర్వాత చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం కేసుగా మారుస్తూ వచ్చారు. భీమా కోరేగాం హింసాకాండకు నిజంగా కారకులైనవారి మీద ఇప్పటివరకూ ఏ చర్యలూ లేకపోగా, దానితో ఎటువంటి సంబంధం లేని వరవరరావుమీద, తదితరుల మీద ఆ కేసు బనాయించారు. ఆ కేసులో వరవరరావును ఇరికించడం పూర్తిగా కల్పిత ఆధారాల మీదనే జరిగింది. నా భర్తను ఆ కేసులో ఇరికించడం కేవలం ఆయన స్వరం బైట వినిపించకుండా చేయడానికేనని నాకు అనుమానంగా ఉంది.

వరవరరావు మూడు దశాబ్దాలకు పైగా కళాశాల అధ్యాపకుడుగా పనిచేసిన వరవర రావు వేలాది మంది ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సంబంధం లోకి వచ్చి, తన సాహిత్య, విద్యాసంబంధ వ్యక్తిత్వంతో వారికి ప్రేరణగా నిలిచారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయనతో పరిచయంలోకి, స్నేహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనను స్నేహశీలిగా, ప్రేమాస్పదుడిగా, ఇతరుల పట్ల సహానుభూతి చూపే ఉద్వేగభరిత, సున్నిత మనస్కుడిగా, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తిస్తారు. ఆయన కవిగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక వ్యాఖ్యాతగా, ప్రముఖ వక్తగా సుప్రసిద్ధుడు. ఆయన తన విభిన్నమైన, ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలను బలంగా చెప్పడానికే తన కలాన్నీ గళాన్నీ వినియోగించారు. ఆయన జీవితమంతా ఆ విలువలకోసం, సామాజిక సంస్పందనల కోసం నిలబడ్డారు. ఆయన దళితులు, ఆదివాసులు, స్త్రీలు, కార్మికులు, మైనారిటీలతో సహా అన్ని వర్గాల ప్రజల పోరాటాలను సమర్థిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన తన మద్దతు ఇచ్చారు. విప్లవపార్టీలతో ప్రభుత్వం చర్చలకు పూనుకున్నప్పుడు అర్థవంతమైన శాంతిని సాధించే ప్రయత్నాలలో భాగంగా ఆయన విప్లవ పార్టీ ప్రతినిధిగా పనిచేశారు.

ఎవరైనా నిర్ద్వంద్వంగా చెప్పగలదేమంటే ఆయన తన 79 సంవత్సరాల జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ నేరపూరిత, హింసాపూరిత కార్యాచరణలో భాగం పంచుకోలేదు. ఆయన ఎప్పుడూ ఏ నేరమూ చేయలేదని, నిర్దోషి అని ఎన్నో న్యాయస్థానాలు ప్రకటించాయి. గత 45 సంవత్సరాలలో ఆయనను 25 కేసులలో ఇరికించిన పోలీసులు ఇప్పుడు ఆరోపిస్తున్నట్టుగానే ఎన్నో భయంకరమైన నేరాలు ఆరోపించారు. కాని ఆ 25 కేసులలో 13 కేసులను నిశితంగా, సుదీర్ఘకాలం విచారణ జరిపిన న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా ప్రకటించాయి. మిగిలిన 12 కేసులను విచారణ స్థాయికి కూడ రాకముందే పోలీసులే ఉపసంహరించుకున్నారు. ఒకటి 15 సంవత్సరాలు, మరొకటి 17 సంవత్సరాలు విచారణ జరిగిన రెండు భారీ కుట్రకేసులు చిట్టచివరికి ఆయనను నిర్దోషిగా విడుదల చేశాయి. ప్రాసిక్యూషన్ ఆయన మీద చేసిన నేరారోపణల్లో ఒక్కదాన్నయినా ఒక్క కేసులోనైనా రుజువు చేయలేకపోయింది. అయినప్పటికీ, ఈ కేసులలో విచారణలో ఉన్న ఖైదీగా ఆయన తన విలువైన జీవితంలో ఏడు సంవత్సరాలకు పైగా జైళ్లలో గడపవలసి వచ్చింది.

ఇప్పుడు పుణె పోలీసులు కూడ ఆయన మీద తీవ్రమైన నేరారోపణలు చేస్తున్నారు గాని న్యాయస్థానాల విచారణలో ఆ ఆరోపణలేమీ నిలవజాలవని, ఆయన ఏ హానీ లేకుండా తిరిగివస్తారని మేం విశ్వసిస్తున్నాం. ఒకవైపు ఈ కేసులో అరెస్టయి ఉండగానే ఆయనను గడ్చిరోలిలో 2016లో జరిగిన మరొక కేసులో ఇరికించారు. పుణె కేసులో బెయిల్ మీద బైటికి రాకుండా అడ్డుకోవడానికే ఈ రెండో కేసు బనాయించారు. ఇప్పుడు మమ్మల్ని ఆందోళన పరుస్తున్న అంశమూ, మీకు ఈ విజ్ఞప్తి చేయడానికి కారణమైన అంశమూ ఆయన వయసు, క్షీణిస్తున్న ఆరోగ్యం. గతంలో అబద్ధపు కేసులలో అనుభవించిన జైలు జీవితం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయింది. ఇప్పుడు ఆయనను మరొక అబద్ధపు కేసులో జైలు పాలు చేశారు. న్యాయవిచారణా క్రమపు విధివిధానాలను నేను ప్రశ్నించడం లేదు. న్యాయవిచారణ కొనసాగనివ్వండి, కాని ఎటువంటి నేరచరిత్ర లేని వ్యక్తిని, పాలకులకు రుచించని అభిప్రాయాలు ప్రకటిస్తున్నందుకు కక్షసాధింపుగా 25 కేసుల్లో ఇరికించినప్పటికీ న్యాయస్థానాలలో పోలీసులు ఒక్క నేరారోపణ కూడ రుజువు చేయలేకపోయిన వ్యక్తిని, 79 సంవత్సరాల వృద్ధుడిని, అనారోగ్య బాధితుడిని మరొక దఫా జైలు నిర్బంధానికీ, వేధింపుకూ గురి చేయడం సబబు కాదని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నిర్బంధానికీ, వేధింపుకూ కేవలం పోలీసులు సృష్టించిన అబద్ధపు ఆధారాలే మూలం కావడం విచారకరం.
ఈ కేసు వెనుక ఉన్న దురుద్దేశాలనూ, కేసు తయారుచేసిన అక్రమ పద్ధతినీ పరిశీలించవలసిందిగా, న్యాయవిచారణను ఆపకుండానే వరవరరావును తక్షణమే విడుదల చేయమని ఆదేశించవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆయన వయసు, ఆరోగ్యం, ప్రజామేధావిగా ఆయన ప్రతిపత్తి దృష్టిలో పెట్టుకుని మానవతా దృష్టితో తక్షణ చర్యలకు పూనుకోవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

హేమలత రాసిన బహిరంగ లేఖతో హైదరాబాద్ కు, తెలంగాణకు చెందిన దాదాపు వంద మంది ప్రజాస్వామిక వాదులు సంఘీభావం ప్రకటించారు. ఈ లేఖను ఆన్ లైన్ పిటిషన్ల వెబ్ సైట్ మీద ఉంచగా ప్రపంచవ్యాప్తంగా 660 మంది సంతకం చేసి సంఘీభావం ప్రకటించారు.

బహిరంగ లేఖకు మద్దతు తెలిపినవారిలో చుక్కా రామయ్య (విద్యావేత్త), పొత్తూరి వేంకటేశ్వర రావు, కె. రామచంద్రమూర్తి, కె శ్రీనివాస్, సిఎచ్ ప్రశాంత్ రెడ్డి, ఎస్ వీరయ్య, జహీరుద్దీన్ అలీ ఖాన్, జి ఎస్ వాసు, కె సతీష్ చందర్, దేవులపల్లి అమర్, కె శ్రీనివాస రెడ్డి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, సుమంతా బెనర్జీ, వి వసంతలక్ష్మి, కె సత్యవతి (సంపాదకులు, జర్నలిస్టులు), ఎస్ వి సత్యనారాయణ, కె సీతారామ రావు, ఎస్ రామచంద్రం, ఎన్ గోపి, ఎన్ లింగమూర్తి (వైస్ చాన్సలర్లు, మాజీ వైస్ చాన్సలర్లు), జి హరగోపాల్, వసంత్ కన్నబిరాన, రమా మేల్కోటే, జాకబ్ థారు, సుజీ థారు, బి విజయభారతి, ఎం కోదండరాం, ఇ రేవతి, వి ఎస్ ప్రసాద్, డి నర్సింహారెడ్డి, ఎం వనమాల, టి పాపిరెడ్డి, ఘంటా చక్రపాణి, కె కాత్యాయని, బన్న అయిలయ్య (విద్యావేత్తలు), నందిని సిధారెడ్డి, కె శివారెడ్డి, నిఖిలేశ్వర్, దేవిప్రియ, ఓల్గా, కొండేపూడి నిర్మల, కాకరాల, రామా చంద్రమౌళి, యాకూబ్, అరణ్యకృష్ణ, అల్లం రాజయ్య (కవులు, రచయితలు), కె. మాధవరావు, పి లక్ష్మినారాయణ (మాజీ ఐ ఎ ఎస్ అధికారులు), లక్ష్మణ్ ఏలె, నర్సిమ్ (చిత్రకారులు), జి దేవి ప్రసాద్ , ఎం రాఘవాచారి, దుడ్డు ప్రభాకర్, ఎన్ నారాయణరావు, జె కోటి, డివి రామకృష్ణారావు (ఉద్యోగసంఘాల, ప్రజాసంఘాల నాయకులు) ఉన్నారు.

అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రొమేనియా, థాయిలాండ్, ఖతర్, హవాయి, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, శ్రీలంకల నుంచీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ ఆన్ లైన్ పిటిషన్ మీద సంతకం చేసిన 660 మందిలో మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్, విద్యావేత్తలు పద్మజా షా, ఘనశ్యామ్ షా, హర్జిందర్ (లాల్టూ) సింగ్, ఎస్ ఎ ఆర్ జిలానీ, భంగ్యా భూక్యా, కె లక్ష్మినారాయణ, కె సునీతారాణి, సతీష్ పొడువాల్, రేఖా పప్పు, ఉమా భృగుబండ, నందితా నారాయన్, శేషయ్య సేపూరి, ఎస్ జీవన్ కుమార్, జీనా ఒబెరాయ్, భావనా గోపరాజు, సామాజిక కార్యకర్తలు స్టాన్ స్వామి, ఉజ్రా బిల్ గ్రామి, మీరా సంఘమిత్ర, దర్శన్ పాల్, రచయితలు ఫ్రెనీ మానెక్ షా, జాన్ దయాల్, రవి శంకర్, తుషార్ కాంతి, దివి కుమార్, కొత్తపల్లి రవిబాబు, వాసిరెడ్డి నవీన్, ఆర్ ఎం ఉమామహేశ్వర రావు, చంద్ర కన్నెగంటి, నారాయణస్వామి వెంకటయోగి, రవి వీరెల్లి, ఖాదర్ మొహియుద్దీన్, దాట్ల దేవదానం రాజు, కాశి రాజు, ఎస్ హరగోపాల్, కె ఎన్ మల్లీశ్వరి, వివిన మూర్తి, జమీందర్ బుడ్డిగ, వేల్పుల నారాయణ, సజయ, సుధాకర్ ఉణుదుర్తి, సి కాశీం, బమ్మిడి జగదీశ్వర రావు, గీతాంజలి, మెర్సీ మార్గరెట్, దేశరాజు, శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, ఆర్ మహదేవన్ ఉన్నారు.

Keywords : వరవరరావు, పి. హేమలత, బీమా కోరేగావ్, పూణే పోలీసు, ఎల్గార్ పరిషత్, విరసం, varavararao, p. hemalatha, virasam, bima koregoan, pune police
(2019-05-21 07:23:33)No. of visitors : 497

Suggested Posts


0 results

Search Engine

కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?
Boycott the EU Elections - Britain and Ireland communist parties
ఈ నేల 25న ఏవోబి బంద్ కు పిలునిచ్చిన మావోయిస్టు పార్టీ
ధిక్కారస్వరాలను వినిపిద్దాం...పీడితుల కోసం పోరాడుతున్న వారిని విడిపించుకుందాం
కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
more..


వరవరరావు