ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం


ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం

ఫాసిజమై

వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించే పాత్ర గణనీయమైనది. ఇది ప్రజాస్వామ్యమే అని అవి నమ్మిస్తాయి. ఎంతో కొంత మార్పు సాధ్యమేనని ఒప్పించగలుగుతాయి. పాలకవర్గ ప్రయోజనాలు ఈడేర్చే బృహత్తర కార్యక్రమమంలో అవి పీడితులనే భాగస్వాములను చేస్తాయి. మార్క్స్‌ అన్నట్లు ఒక నియమిత కాలానికోసారి తమను అణచివేసే దోపిడీవర్గానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలో ప్రజలు ఎన్నుకుంటారు. నిజానికి సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు ప్రతి ఐదేళ్ళకోసారి తమ ఏజెంట్లను మార్చుకోడానికి ఎన్నికలు ఒక అవకాశం. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తే తమ ప్రతినిధులనే తాము ఎన్నుకుంటున్నామని, అన్ని మంచి చెడ్డలకు తామే బాధ్యులమని వాళ్లు అనుకుంటారు. ప్రజలు డబ్బు తీసుకొని ఓట్లేస్తుంటే, ఎవర్ని నిందించి ఏం లాభం అని మేధావులు గునుస్తుంటారు. యథా ప్రజా తథా రాజా అని ఈ మధ్య ఒక కొత్త సూత్రాన్ని కూడా కనిపెట్టారు.

వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోలేని మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ ప్రజల నైతిక వర్తనల గురించి సుభాషితాలు చెబుతూ ఉంటుంది. ʹఓటు వేయడం మీ బాధ్యత, నిజాయితీగా ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండిʹ అని. పాలకవర్గాల నిజాయితీని ప్రశ్నించకుండా ఈ విచిత్రమైన వాదన చేసి దేశ దుస్థితికంతా కారణం ప్రజలేనని తేల్చివేసే బూర్జువా మేధావితనాన్ని వ్యవస్థ కుప్పలుతెప్పలుగా ఉత్పత్తి చేస్తుంది. ఎన్నడూ గుర్తుకురాని ప్రజాస్వామ్యం ఎన్నికలప్పుడే ఎందుకు గుర్తుకువస్తుంది అంటే ప్రజలవైపు వేలెత్తి చూపడానికే. ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపుకునే పాలకవర్గ పార్టీలు వాళ్లలో ఎవర్నో ఒకర్ని ఎన్నుకునే ఆప్షన్‌ ప్రజలకు ఇస్తాయి గానీ అధికారంలో ఉన్నప్పుడు తమ దోపిడిని, దగుల్బాజీతనాన్ని వేలెత్తి చూపే అవకాశం ప్రజలకు ఇవ్వవు. బూర్జవా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం కూడా ప్రజల తరపున పనిచేయడానికి ప్రతినిధులను ఎన్నుకోవడంలో మాత్రమే కాదు, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయంలో, రూపొందించే ప్రతి విధానంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఏమైనా చేసే అధికారం మాకుందని విర్రవీగడానికి కాదు ఎన్నికలు ఉండాల్సింది. నియంతృత్వానికి సోపానంగా కాదు ఎన్నికలుండాల్సింది. అయితే బూర్జువా ప్రజాస్వామ్యం కూడా ఎక్కడ తేలిపోతుంది అంటే అది చెప్పే ప్రజాస్వామిక సూత్రాలన్నీ పాలకవర్గాలకు ఇబ్బంది కలిగించకుండా తమ దోపిడిని నిరంతరంగా కొనసాగేంత వరకే ఉంటాయి. ప్రజలు ఏ మాత్రం ఎదరించినా అణచివేయడానికి చట్టబద్ధంగానే దానికి అనేక అవకాశాలుంటాయి. మీకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ 30 యాక్ట్‌, 144 సెక్షన్‌ వంటి పేర్లతో ఆంక్షలుంటాయి. ఈ ఆంక్షలు ఏ ఆర్‌ఎస్‌ఎస్‌ వాడికో, లేక ఏ బూర్జువా పార్టీ సంఘానికో ఉండవు.

ఉదాహరణకు చంద్రబాబునాయుడు ఏ నియోజకవర్గానికో వస్తున్నాడంటే అక్కడి ప్రజాసంఘాల వాళ్లను ముందుగానే అరెస్టులు చేయడం ఎప్పటి నుండో పరిపాటిగా మారింది. ధర్నాచౌక్‌ను చంద్రశేఖరరావు ఏం చేసాడో చూసాం. భజనలు తప్ప వినతులు చేసుకునే అవకాశం కూడా ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇవ్వరు. ఇక ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో, ఏ చట్టాలు తెస్తున్నారో అవేవీ ప్రజలకు సంబంధించని వ్యవహారంలా మార్చివేసారు. ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తున్నప్పుడు, తమ పీకమీద కత్తి పెట్టినప్పుడు, తమ భూములు కబ్జాచేసేటప్పుడు కూడా ప్రజలు కిమ్మనకూడదు. ఒకప్పుడు ఎన్నికల సమయంలోనైనా ప్రభుత్వ విధానాల గురించి విమర్శలుండేవి. ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనా సరికాదనో, ఫలానా ప్రైవేటీకరణ సరికాదనో అవతలి పార్టీలు విమర్శించేవి. ఆ తరహా చర్చలు కూడా లేక చాలాకాలమైంది. ఎవరికీ అర్థం కానీ ʹఅభివృద్ధిʹ గురించి గోలగోలగా మాట్లాడుతుంటారు. అది ఉద్యోగాలిచ్చే అభివృద్ధి అని, జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి అని ప్రజలు భ్రమపడుతూ ఉంటారు. నిజానికి ఆ అభివృద్ధి పాలసీలు సరిగ్గా అర్థం చేసుకునేది పెట్టుబడిదారులే. ఫలానా ప్రతినిధి తమ కోసం ఎంత అభివృద్ధి చేయగలడో వాళ్ళకు అంచనాలుంటాయి. మీరిలా చేయాలి అని ప్రభుత్వాన్ని వాళ్ళు ఆదేశించగలరు కూడా. దానికోసం ముందు వాళ్ళు ఎన్నికల్లో పెట్టుబడి పెడతారు. ఈ పార్టీలన్నిటికీ ఫండ్‌ రూపంలో, ప్రచార సాధనాల్లో ప్రమోషన్‌ రూపంలో, ఓటు వేయమని జనానికి నీతులు చెప్పే ప్రకటనల రూపంలో ఇంకా జనాన్ని మాయ చేసే అనేక రూపాల్లో అది ఉంటుంది. ఇట్లా ఎన్నికల పార్టీలకిచ్చే డొనేషన్లకు లెక్కా పత్రాలే కాదు, పేరు కూడా చెప్పనక్కలేదని మోడీ పూణ్యమా అని దర్జాగా అన్ని పార్టీలు కలిసి పార్లమెంటులో చట్టం కూడా చేసుకున్నాయి.

వాళ్ళూవాళ్ళూ కలిసి జనాన్ని దోచుకోడం మాత్రమే మిగిలింది. ఇక ప్రజలకు చేసే వాగ్దానాలు కూడా ఏముంటాయి? పెన్షెన్లు, నిరుద్యోగ భృతి, బియ్యం, పప్పూ తలా పిడికెడేసి విదిలించడం తప్ప. ప్రజల సంపదను దర్జాగా దోపిడి చేస్తూ కాసింత చిల్లర పడేసి గొప్పగా చెప్పుకునే బరితెగింపు తప్ప. ఉద్యోగాలివ్వడం ప్రభుత్వాల పని కాదు. విద్యా, వైద్యం ప్రభుత్వాల పని కాదు. మహిళలకు రక్షణ లేదంటే రోడ్లమీదికొచ్చేందుకు మీకేం పని అని కూడా నాయకులు మాట్లాడతారు. పన్నులు వేయడం, పోరాడేవాళ్ళను అణిచేయడం తప్ప ఏదీ ప్రభుత్వాల పని కాదు. ఇంత ఫార్స్‌ జరుగుతున్నా, పాలకులందరూ తమ విశ్వాసం కోల్పోయినా వ్యవస్థ ఎక్కడో బాగా మేనేజ్‌ చేయగలుగుతోంది. రిగ్గింగ్‌ అక్కర్లేకుండా ప్రజల్ని తమవైపు తిప్పుకొని ఓట్లేయించుకోవడంలో, అందరినీ లబ్దిదారులను చేసి ఓటు బాధ్యత నెత్తిమీద రుద్దడంలో, మొత్తంగా ఈ ఫార్స్‌లో ఎక్కువమందిని భాగస్వాములను చేయడంలో అది విజయం సాధించగలుగుతోంది.

ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చాయి. అయితే ఇప్పటి దాకా జరిగిన ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒకటి కావు అని కాస్త ప్రజాస్వామ్య స్పృహ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ముందుకుపోయి బిజెపి వస్తే మరింక ఎన్నికలుండవు, ఇవే చివరి ఎన్నికలు అని కూడా అంటున్నారు. కానీ నిజానికి ఈ ఎన్నికల డ్రామా వల్ల సంఘపరివార్‌కు తన ప్రయోజనాలు బ్రహ్మాండంగా నెరవేరాయి. ఎన్నికల రాజకీయాల కిటుకు వాళ్ళు అందరికాన్న బాగా అర్థం చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళు సాధించింది రెండు స్థానాల నుండి 268 స్థానాలకు ఎగబాకడమో, చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమో మాత్రమే కాదు, దేశంలో మెజారిటీ భావజాలాన్ని, ఎంతోకొంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్న వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలగడం. 1948లోనే నిషేధానికి గురైన ఆర్‌ఎస్‌ఎస్‌, పార్లమెంటరీ రాజకీయాలను వాడుకొని, అందులోకి నేరుగా ప్రవేశించి ఇప్పుడు ప్రధాన రాజకీయ శక్తి కాగలిగింది. ఈ ఎన్నికల్లో గెలుపోటములు రాజ్యంలో దాని ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని మాత్రమే కొంత ప్రభావితం చేస్తాయి. కానీ ఫాసిస్టు భావజాలం లోతుగా ప్రవేశించింది. దాన్ని కాంగ్రెస్‌ లేదా ఏ ఇతర పాలక పార్టీ అయినా భేషుగ్గా వాడుకుంటుంది. ఇప్పుడు భ్రష్టుపట్టి పోయాయనుకున్న ఏ వ్యవస్థనూ... అది విద్యావ్యవస్థ కావచ్చు, న్యాయవ్యవస్థ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు... వేరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బాగుపరిచేది ఉండదు. ఉదాహరణకు ఛత్తీస్‌ఘడ్‌లో అధికారం మారింది. ఆదివాసుల హత్యలు, దొంగ ఎదురు కాల్పులు ఆగలేదు. అది ఇంకాస్త ముందుకుపోయి లక్షా డెభ్బైవేల హెక్టార్ల అడవిని మైనింగ్‌ కంపెనీలకు ఇచ్చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అన్ని విధాలా సహకరించి హత్యాకాండను కొనసాగిస్తుంది.

కాంగ్రెస్‌ దిగిపోయి బిజెపి రావడం కార్పొరేట్‌ అవసరం. అది దేశాన్ని ఫాసిజంలోకి దిగజార్చడం కూడా ఆ తరహా ఆర్థిక విధానాలకు అవసరం. అవినీతిని అరికడతానని, విదేశాల్లోని నల్లధనం రప్పించి అందరి అకౌంట్‌లో 15 లక్షలు జమచేస్తానని, కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తానని, రైతు పెట్టిన పెట్టుబడికి 150 శాతం గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పడంతో పాటు అది హిందూ మతోన్మాదాన్ని కలిపి ప్రచారం చేసి అధికారంలోకి రావడం ఒక ఐడియలాజికల్‌ గేమ్‌ ప్లాన్‌. పైవేవీ నెరవేర్చకపోయినా జనాన్ని గుప్పిట్లో పెట్టుకోడానికి దానికి విద్వేష భావజాలం ఉంది. ఈ పోటీలో ఫాసిజం ఎంత పైచేయి సాధిస్తుంది అంటే అన్ని పార్టీలు తనమాటే మాట్లాడేలా చేస్తుంది. ఉదాహరణకు అది కేరళలో శబరిమల వివాదాన్ని రేపితే, మీకే కాదు మాకూ సెంటిమెంట్లున్నాయి అని కాంగ్రెస్‌ కూడా ఎగేసుకొని దొమ్మీలో పాల్గొంది. ఇక చివరి నిమిషంలో అది అందరూ యుద్ధం తప్ప వేరే ఏమీ మాట్లాడని స్థితిని తీసుకొచ్చింది. కశ్మీర్‌ విషయం ఎత్తితే ఆ ఉన్మత్త దేశభక్తి ప్రేలాపనల్లో అందరూ మునిగిపోవాల్సిందే. నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతుల ఆత్మహత్యలు ఏమీ గుర్తుకురావు. ప్రత్యర్థులందరూ నిరాయుధులైపోతారు.

ఇక్కడొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. దేశవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావితం చేసేంతగా యుద్ధము, దేశభక్తి హాట్‌ టాపిక్‌గా ముందుకు రావడానికి ఏ కశ్మీర్‌ కారణమైందో ఆ కశ్మీర్‌ ప్రజల సమస్య పట్టింపునకు ఎలాగూ రాదు. కానీ అక్కడి ఎన్నికల గురించైనా ఎక్కడా చర్చ జరగదు. మిలిటరీ అక్కడి జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపున్న నేపథ్యంలో నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్‌ పాలన విధించారు. బిజెపి తన మద్దతు ఉపసంహరించుకున్నాక పిడిపి మైనార్టీలో పడిపోయింది కానీ ఇతర రాజకీయ పక్షాలు తమ మద్దతు ఉంటుందని చెప్పినా మెహబూబా ముఫ్తీ ప్రభుతాన్ని తన చెప్పుచేతల్లో ఉండే గవర్నర్‌ ద్వారా కేంద్రం రద్దు చేయించింది. కశ్మీర్‌తో ఇలాంటి ఆటలాడటం భారత ప్రభుత్వానికి కొత్త కాదు. రాజ్యాంగం ప్రకారం కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని అది ఏనాడూ ఖాతరు చేయలేదు. పాకిస్తాన్‌ బూచి చూపించి, ప్రజలందరినీ దేశభక్తి మాయలో పడెయ్యడానికి కశ్మీర్‌ ఒక రెడీమేడ్‌ సరుకుగా దానికి పనికొస్తుంది. కశ్మీర్‌ ఎంతగా రక్తమోడిస్తే అంత ఓట్ల పంట పండిచుకోడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి ఒకదానికొకటి ఏ మాత్రం తీసిపోవు. లెక్క ప్రకారం ఈ మే నాటికి ఇప్పుడు ఎన్నికలకు పోతున్న రాష్ట్రాలతో సహా జమ్మూ కశ్మీర్‌లో కూడా ఎన్నికలు జరగాలి. కానీ లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుపుతామని ఎన్నికల కమిషన్‌ తేల్చేసింది.

నిజానికి మీ ఎన్నికల డ్రామాలో మేం పాల్గొనమని గతంలో కశ్మీర్‌ ప్రజలు అనేకసార్లు చెప్పారు. 5 శాతం, 3 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాల నుండి కూడా అభ్యర్థుల గెలిపు ప్రకటించి ప్రజాప్రతినిధులుగా వారిని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపిన సందర్భాలున్నాయి. గెలిచిన అభ్యర్థికి పడిన ఓట్లు ఒక్కశాతం అయినా అతను ప్రజలెన్నుకున్న నాయకుడైపోతాడన్నమాట. ఇది కూడా ప్రజాస్వామ్యమే. తుపాకీ చూపించి ఓట్లేయించి, పోలింగ్‌ శాతాన్ని బలవంతంగా పెంచి ప్రజాస్వామ్యమని నమ్మించిన సందర్భాలు మరెన్నో. అక్కడ ఎన్నిక కాబోయే ప్రభుత్వం కేంద్రానికి అన్ని విధాలా తలొగ్గి ఉంటేనే ఈ ఎన్నికల డ్రామా నడుస్తుంది. లేదంటే అది కూడా ఉండదు. సరిగ్గా ఇలానే దేశవ్యాప్తంగా ఎన్నికైన అభ్యర్థులు కూడా కార్పొరేట్‌ ప్రయోజనాలకు పనిచేయక తప్పదు.

ఇందులో చంద్రబాబు నాయుడు నాలుగాకులు ఎక్కువే చదివాడు. సింగపూర్‌ తరహా రాజధానిని కడతానని అందుకు 10రెట్లు ఎక్కువ భూమిని సేకరించి మంత్రి నారాయణ వంటి వ్యాపారస్తులతో రియలెస్టేట్‌ మాఫియాను పెంచడం దగ్గరి నుండి ఎర్రచందనం కూలీలను దొంగ ఎన్‌కౌంటర్‌లో చంపడం, బాక్సైట్‌ కోసం దేశ చరిత్రలోనే ఎన్‌కౌంటర్‌ పేరుతో అతిపెద్ద మారణకాండ జరిపించడం దాకా అన్నీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమేనని చెప్పనక్కర్లేదు. ఇసుక మాఫియా, అగ్రిగోల్డ్‌ కుంభకోణం, పోలవరం, నవ్యాంధ్ర అభివృద్ధి పేరుతో విమానాశ్రయాలు, పరిశ్రమల కింద వేల ఎకరాల భూముల కబ్జా, చివరికి తిత్లీ తుఫానును కూడా సొమ్ముచేసుకోవడం ఒక అంశమైతే ప్రతిఘటించినవారిని తీవ్రంగా హింసించడంలో, మానసిక దాడులు చేయడంలో కూడా చంద్రబాబు తన మర్క్‌ బలంగా నిలబెట్టుకున్నాడు. తుఫాను బాధితులకు బియ్యం పంచితే రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఆయనకే చెల్లింది. చివరి నిమిషంలో తన మీది వ్యతిరేకతను మోడీ ఎట్లైతే పొరుగుదేశం మీదికి మల్లించాడో, చంద్రబాబు పక్కరాష్ట్రం మీదికి, కేంద్రం మీదికి మల్లించే ప్రచారం ఎత్తుకున్నాడు. అందరికందరూ మీడియాను చేతుల్లో పెట్టుకొని సొంత డబ్బా వాయించుకుంటూ, కనీసం వాస్తవాలు తెలుసుకోడానికి తటస్థంగా ఉండే మీడియాను కూడా ప్రజలకు లేకుండా చేసేపని ఈ ఐదేళ్ళలో పూర్తి చేసారు. పనిలోపనిగా సోషల్‌ మీడియాను కూడా తమ చేతుల్లోకే తీసుకుని తమ వ్యతిరేకంగా ఉండే భావప్రచారాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టారు. మీడియా మేనెజ్‌మెంట్‌లో అన్ని పార్టీలు పోటీపడ్డాయి గానీ మొదటి నుండి అపద్ధాలు ప్రచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి పైచేయి సాధించింది.

అన్ని అవలక్షణాలను (నిజానికి బూర్జువా ప్రజాస్వామ్య సహజ లక్షణాలు) పరాకాష్టకు తీసుకుపోయిన ఐదేళ్ళ బిజెపి పాలన చవిచూసాక మైనారిటీ మతస్తులు, ప్రజాస్వామికవాదులందరూ ప్రభుత్వం మారితే బాగుండుననుకుంటున్నారు. మరీ ఆవు పేరు చెప్పి కూడా జనాన్ని చంపుతుంటే క్రాంగ్రెసే నయం కదా అనుకుంటున్నారు. సిక్కుల ఊచకోత గురించి చెప్పక్కర్లేదు గానీ 2002 గుజరాత్‌ మారణకాండ దోషులను కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఏమీ చేయలేదు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసాన్ని చూస్తూ కూడా అది ఏమీ చేయలేదు. సంఘ్‌ విద్వేష ప్రచారాలను అదెక్కడా అడ్డుకోలేదు, అడ్డుకోదు కూడా. ఎందుకంటే మతం, కుల ఆధిపత్యం, పితృస్వామ్యం- ఏ హింసారూపమైనా రాజ్యప్రయోజనం. ఒక్క బిజెపి ప్రయోజనం మాత్రమే కాదు. అందుకే అది ప్రత్యామ్నాయ రాజకీయాలను మాత్రమే అడ్డుకుంటుంది. ఇవాళ కేరళలో అత్యధికంగా ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలున్నాయంటే సిపియం ప్రభుత్వం మతంతో ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవాలి. అయితే బిజెపి దిగిపోతే కొంచెంలో కొంచెంలో కొంచెమైనా మార్పు ఉండదా అంటే ఎంతో కొంత ఉన్నా, ఫాసిజాన్ని కొద్ది ఘడియలు ముందుకు జరపొచ్చునేమో గాని, ఈ పరిణామాలు మాత్రం ఖాయంగా ఫాసిజానికే దారితీయక తప్పదు. తప్పించుకోవాలంటే పార్లమెంటు బయట ప్రజాసమీకరణల్ని, వ్యవస్థ ప్రత్యామ్నాయాన్ని తయారుచేసుకోవాలి. అదెంత కష్టమైనా మరోదారి లేదు.

- పి. వరలక్ష్మీ (అరుణతార సంపాదకీయం)

Keywords : కార్ల్ మార్క్స్, ఎన్నికలు, బాధితులు, పీడితులు, ఫాసిజం, బీజేపీ, మోడీ, బూటకం, పార్లమెంటు, carl marx, fascism, elections, bjp, parliament
(2020-05-29 14:52:19)No. of visitors : 398

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


ఫాసిజమై