బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?


బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?

బీమా

బీమా కోరేగావ్ కేసులో ఎంతో మంది పూణే పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయబడ్డారు. అసలు అక్కడ జరగని విషయాలను కూడా చార్జిషీటులో దాఖలు చేసి అందరినీ అరెస్టు చేశారు. రిమాండు పేరుతో పూణేలోని ఎరవాడ జైలులో అప్రకటిత శిక్షణ అనుభవిస్తూ.. ప్రతీ వారం కోర్టు ముందు హాజరవుతున్న వరవరరావు సహా ఎంతో మంది మేధావులను కలవాలని చాలా మంది ఆ కోర్టుకు చేరుకుంటున్నారు. అలా చేరుకున్న కొంత మంది స్పందనలను వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తన ఫేస్ బుక్ పేజీపై పంచుకున్నారు. అది యధాతథంగా..

-----------------------------------------------------------------------------------

మిత్రులారా, ఏప్రిల్ 4న పుణె కోర్టులో జరిగిన విషయాల మీద వివరమైన నివేదిక పనుల ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా మీతో పంచుకోలేకపోయాను. మీలో కొందరైనా ఎదురుచూస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఆ సాయంత్రమే నాలుగైదు వాక్యాల అప్ డేట్ పెట్టాను. ఆ రాత్రే షోమా సేన్ కూతురు కోయెల్ రాసిన చిన్న నోట్ షేర్ చేశాను. ఏప్రిల్ 5న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త కూడ షేర్ చేశాను.

ఇప్పుడిక పూర్తి నివేదిక:

ఈసారి హైదరాబాద్ నుంచి వివిని, ఇతర మిత్రులను చూడడానికి ఆరుగురం వెళ్లాం. మామూలుగా రైలు దిగే సమయానికీ, మన మిత్రులను కోర్టుకు తీసుకువచ్చే సమయానికీ మధ్య కనీసం నాలుగు గంటలు వ్యవధి ఉంటుంది. ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటే భీమా కోరేగాం కూడ వెళ్లి రావచ్చు. అది కుదరదనుకుంటే నగరంలోనే గంజ్ పేట లో ఉన్న సమతాభూమి (జోతిబా ఫులె – సావిత్రీ బాయి ల ఇల్లు) చూసి కోర్టు టైంకు కోర్టుకు చేరవచ్చు. ఈసారి భీమా కోరేగాం వెళ్లడానికి సమయం చాలదనుకుని మిత్రులందరం సమతాభూమి వెళ్లాం. జోతిబా ఫులే – సావిత్రి నడయాడిన ఆ ఇంటికి వెళ్లడం నాకిది నాలుగోసారి (దాదాపు నేనక్కడ గైడ్ అయిపోయాను!!) గాని మిగిలిన మిత్రులందరికీ మొదటిసారి గనుక ప్రతి ఒక్కరూ చాల ఉద్వేగానికి లోనయ్యారు. ఉత్తేజపడ్డారు.

అక్కడి నుంచి కోర్టుకు వెళ్లి పన్నెండింటి నుంచి పడిగాపులు పడుతుండగా, వారిని తీసుకువచ్చిన వ్యాన్ వచ్చిందని ఒకటిన్నర రెండు గంటలకు తెలిసింది. ఇక అప్పటి నుంచి న్యాయాధీన్ బందీ కోఠడీ ముందు పడిగాపులు. భయానకమైన పుణె ఎండ. ఆ సమయానికి హైదరాబాదులో ఉష్ణోగ్రత 36 డిగ్రీలుండగా పుణెలో 39 డిగ్రీలుంది. ఆ మండుటెండ వేడినంతా పీలుస్తూ పగలూ రాత్రీ లోపలికి చిమ్మే రాతిగోడల జైలులో, ఫాన్లు కూడ లేకుండా మన మిత్రులు ఎలా ఉన్నారోనని మరింత విచారం కలిగింది. అక్కడ ఒక గంట నిరీక్షణ తర్వాత, లంచ్ బ్రేక్ అయిపోయి, కోర్టు మళ్లీ మొదలయ్యాక, మూడింటికి ఎస్కార్ట్ పోలీసు కాపలాలో మొదట షోమా సేన్, సుధా భరద్వాజ్ లు, తర్వాత ఐదు పది నిమిషాలకు మిగిలిన మిత్రులందరూ ఆ ఆవరణ నుంచి బైటికి వచ్చారు.

ఆ కస్టడీ ముందే వేచిచూస్తున్న మా ఆరుగురినీ చూసి వివి సంతోషించారు. మాలో కొందరి రాకను ఊహించినట్టు లేరు గనుక ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో అనారోగ్యంతో కూడ ఉన్న బి ఎస్ రాజు గారు ఇంత శ్రమ తీసుకుని వచ్చారని చూసి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. అక్కడే, దారిలో, ఎండలో ఒక్కొక్కరినీ కౌగిలించుకున్నారు. మేం మిగిలినవాళ్లందరితో చేతులు కలిపి, కౌగిలించుకుని మా, బహుశా మీ అందరి, సంఘీభావ స్పర్శ అందించాం.

లెక్క ప్రకారం ఆ రోజు వివి, మహేశ్ రౌత్ ల బెయిల్ దరఖాస్తుల మీద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వలా పవార్ తన ప్రతివాదనలు వినిపించవలసి ఉంది. కాని, కోర్టు హాల్లోకి తీసుకువెళ్లి మన మిత్రులందరినీ బోనులో కూచోబెట్టేటప్పటికి, ఆమె లేచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పుణె ఎ ఎస్ పి శివాజీ పవార్ ఇవాళ ఎన్నికల బందోబస్తు వల్ల రాలేకపోయాడని, తాను వాదన వినిపించాలనంటే ఆయన ఉండవలసిందేనని, కనుక వాయిదా ఇమ్మని కోరారు. అది కూడ తనకు ఒక రోజు కోర్టు సమయం (సాధారణంగా రెండు గంటలు) సరిపోదని, రెండు రోజులు కావాలని కోరారు. జడ్జి ఆమె వాదనల కోసం ఏప్రిల్ 8, ఏప్రిల్ 10 కేటాయించారు.

నిజానికి ఆ ఉత్తర్వుతో ఆరోజు కోర్టు పని అయిపోయినట్టే. కాని అంతకుముందు మహేశ్ రౌత్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రైట్స్ డిప్లొమా కోర్సుకు అప్లై చేస్తే జైలు అధికారులు ఆ అప్లికేషన్ పంపడానికి నిరాకరించారు. దాని మీద మహేశ్ ఈ జడ్జిదగ్గర వేసిన పిటిషన్ కూడ విచారణకు ఉంది. జైలు అధికారి అప్పటికి రాలేదు గనుక ఆ అధికారి వచ్చేలోగా తనకు మరొక పని ఉందని ప్రాసిక్యూటర్ వెళ్లిపోగా, దాదాపు అరగంట, నలబై నిమిషాలు బోనులో మనవాళ్లు ఊరికే కూచున్నారు. మనవాళ్లతో ఒక్కొక్కరం వెళ్లి ఒక నిమిషమో రెండు నిమిషాలో మాట్లాడే అవకాశం దొరికింది. వివి చూడవలసిన పుస్తకాలు, కరపత్రాలు అక్కడే చూశారు. షోమా సేన్ కూతురు కోయెల్ సేన్ వచ్చింది. మహేశ్ మిత్రులు ముగ్గురు వచ్చారు. ఈ మధ్యలో మాటలు ఎక్కువవుతున్నాయని జడ్జి అసహనం ప్రదర్శిస్తే ఆయన తరఫున బెంచి గుమస్తా అందరినీ అక్కడి నుంచి పక్కకు పంపండి అని కేక వేసింది.

ఇదంతా అయిపోయాక, చివరికి యరవాడ జైలు అధికారి వచ్చాడు, ఆయన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడ వచ్చారు. ఆ అధికారి బోనెక్కి తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడం మొదలుపెట్టాడు. ఆయనకు వత్తాసుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓపెన్ యూనివర్సిటీకి కాంటాక్ట్ క్లాసులుంటాయి గనుక, వాటికి తీసుకువెళ్లి తీసుకురావడం కష్టం గనుక అనుమతి నిరాకరించామని వాదించాడు. జైలు లోపల యూనివర్సిటీ సెంటర్ పెడుతున్నామని, కాంటాక్ట్ క్లాసులు లోపలే జరుగుతాయని యూనివర్సిటీకి జైలు అధికారులు అంతకు ముందెప్పుడో రాసిన ఉత్తరం మన న్యాయవాది చదివి వినిపించాడు. ʹఅయినా ఓపెన్ యూనివర్సిటీ అంటే క్లాసులు లేకుండా కూడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది గదాʹ అని జడ్జి అడిగాడు. మొత్తం మీద మహేశ్ ను ఆ కోర్సులో చేరడానికి అనుమతించాలని జడ్జి జైలు అధికారులను ఆదేశించాడు.

దానితో ఆరోజటి విచారణలు అయిపోయి, పోలీసులు వాళ్లను వెనక్కి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుండగా, ʹనా బంధువులు వచ్చారు, మాట్లాడుకోవడానికి అనుమతించండిʹ అని ఆనవాయితీ ప్రకారం వివి జడ్జిని అడిగారు. ʹబంధువులంటే? రక్తబంధువులకు మాత్రమే అనుమతిʹ అన్నాడు జడ్జి. ʹఅవును, నా రక్తబంధువే. నా అక్క కొడుకుʹ అని వివి చెప్పారు. ʹరక్తబంధువులు ఎలా అవుతాడు? అనుమతి లేదుʹ అన్నాడు జడ్జి. భార్యా బిడ్డలను మాత్రమే రక్తబంధువులుగా గుర్తిస్తాడట. నిజానికి మామూలుగా చూస్తే భార్య రక్త బంధువు కానక్కరలేదు. బిడ్డలు రక్త బంధువులు అవుతారు. తోడబుట్టినవాళ్లు, వాళ్ల పిల్లలు కూడ రక్త బంధువులవుతారు. వివి విషయంలోనైతే, ఆయన తన అక్క కూతురునే చేసుకున్నారు గనుక ఆమె కూడ రక్తబంధువే. ఇంతకీ ఈ లోకజ్ఞానం, తర్కం, న్యాయసూత్రాలు ఏవైనా తెలిస్తే గదా...

అసలింతకీ, 1974లో సికిందరాబాద్ కుట్రకేసులో ముద్దాయిగా ఉన్నప్పటి నుంచీ 45 ఏళ్లుగా వివిని జైలులో (ఒక్క జైలులో కాదు, వరంగల్, ముషీరాబాద్, చంచల్ గూడ జైళ్లలో కూడ), ఎన్నో కోర్టులలో ఎన్నో సార్లు కలిశాను. న్యాయమూర్తుల, జైలు అధికారుల అనుమతితో కూడ కలిశాను. లోకం తలకిందులుగా వెనక్కి నడుస్తున్నట్టున్నది. విలువలూ మానవత్వమూ చట్టమూ కూడ తిరగబడి, అధికారమూ అనాగరికతా దౌర్జన్యమూ చట్టవ్యతిరేకతా అమానుషత్వమూ రోజురోజుకూ పెరిగిపోతున్నట్టున్నాయి.

ఆ నిరాశతో, అయినా కోఠడీ నుంచి కోర్టు దాకా, మళ్లీ వెనక్కూ ఓ పది నిమిషాలూ, బోనులో ఓ ఐదారు నిమిషాలూ మాట్లాడగలిగాం గదా అనీ, ఓ గంట గంటన్నర చూడగలిగాం గదా అనీ సంతృప్తితో వెనుదిరిగాం.

- ఎన్. వేణుగోపాల్,
ఎడిటర్, వీక్షణం.

Keywords : వరవరరావు, వేణుగోపాల్, ఉద్యమం, మావోయిస్టు, నక్సలైట్లు, పూణే పోలీసు, పూణే, ఎరవాడ, జైలు, మోడీ, Varavararao, Maoist, Pune Police, Bima Koregaon, Elgar Parishad
(2019-04-17 08:38:55)No. of visitors : 227

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
more..


బీమా