లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!


లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!

లేబర్

మధ్య తరగతి జీవులు .. ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు వేళల్లో పని చేయడం.. వేర్వేరు ప్రాంతాల్లో పని చేయడం వల్ల వారి జీవితాలు ఎలా ఉంటాయి..? ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు సంపాదిస్తే గాని గడవని జీవిత గమనంలో ఎలాంటి ఆనందాలు ఉంటాయో ʹలేబర్ ఆఫ్ లవ్ʹ అనే బెంగాళీ చిత్రంలో చక్కగా వివరించారు. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని ʹరమా సుందరిʹ తన ఫేస్‌బుక్ వాల్‌పై పంచుకున్నారు. అది యధాతథంగా..

---------------------------------------------------------------------------------------------

కలకత్తా వీధుల్లో ఒక భార్య పొద్దున్నే పరుగులతో ట్రామ్ ఎక్కుతుంది. అది ఒక దగ్గర దిగి బస్ ఎక్కుతుంది. వడివడిగా నడుస్తూ బ్యాగులు ప్యాక్ చేసే ఫ్యాక్టరీకి చేరుతుంది. రోజంతా ఆ బిల్డింగ్ లో పైకీ కిందకూ నడుస్తూ బ్యాగుల కౌంట్ చూస్తూ పని చేస్తూ ఉంటుంది.

ఇంట్లో భర్త మొదట టీ కప్ తో కనబడతాడు. ఆమె ఉతికి బకెట్ లో ఉంచిన బట్టలు ఆరవేస్తాడు. స్నానం చేసి, సైకిలుతో బయటకు బయలుదేరుతాడు. ఆమె ఇంట్లో ఉంచి వెళ్లిన చెక్ (8100 రూపాయలు, ఆమె జీతం అయి ఉంటుంది) మారుస్తాడు. బజారు వెళ్ళి సరుకులు, చేపలు కొంటాడు. ఇంటికి వచ్చి చేపలు ఫ్రిజ్ లో పెట్టి, డబ్బులు బీరువాలో పెడతాడు. జేబులో మిగిలిన పైసలను హుండీలో వేస్తాడు. ఆమె ప్లేట్ లో ఉంచి వెళ్లిన అన్నం (చేపల కూరతోటే) తిని నిద్ర పోవటానికి ప్రయత్నిస్తాడు. పగలు రాత్రి చేసుకొనే ప్రయత్నంలో ఆ యింటికి ఉన్న ఒక్క కిటికీ తలుపులు మూసేస్తాడు. అసహజమైన నిద్రను అతి కష్టంమీద మొదలుపెడతాడు. మధ్యలో లేచి అలారం పెట్టుకొంటాడు. అలారం మోగిన టైమ్ కి లేచి ముఖం కడిగి తయారు అవుతాడు. బట్టలు సర్ఫ్ లో నానపెడతాడు. భార్య ఫ్రిజ్ లో బాక్సుల్లో ఉంచిన చపాతీలను, కూరను సర్దుకొంటాడు. చిరిగిపోయిన ఫాంట్ భార్యకు కనబడేలా ఆరవేస్తాడు. ఇంటికి తాళం వేసి భార్యకు తెలిసే స్థలంలో పెట్టి, డొక్కు సైకిలుతో ఆయన పని చేసే ప్రింటింగ్ ప్రెస్ కు వెళతాడు.

భార్య మళ్లీ బస్సు, ట్రాము ఎక్కీ దిగి ఇంటికి వస్తుంది. అతను దిగి వెళ్లిన మెట్లే ఎక్కి ఇంటి తాళం అందుకొని తలుపులు తెరుస్తుంది. ఒక్క క్షణం రిలాక్స్ అయ్యి పనికి లేస్తుంది. బీరువాలో ఉన్న డబ్బులతో లెక్కలు వేసుకొంటుంది. తన దగ్గర మిగిలిన పైసలను కూడా అదే హుండీలో వేస్తుంది. బట్టలు మార్చుకొని, అంట్లు కడిగి, భర్త కనిపించేలా పెట్టి వెళ్లిన ఫాంట్ చిరుగులు కుడుతుంది. గిన్నెల్లో మిగిలిన అన్నం, కూరలను తింటుంది. భర్త పడుకొని వెళ్లిన మంచం మీదే నిద్రకు ఉపక్రమిస్తుంది.

భర్త ప్రింటింగ్ ప్రెస్ లో రాత్రంతా పని చేస్తుంటాడు. మధ్యలో వెళ్లి బాక్సులో తెచ్చుకొన్నది తిని వస్తాడు. తెల్లవారు జామున ప్రింటింగ్ ప్రెస్ లాండ్ ఫోన్ నుండి ఆమెకు ఫోన్ చేస్తాడు. రెండు సార్లు ఫోన్ రింగ్ అయ్యాక ఆమె నిద్ర లేచి ఫోన్ కట్ చేస్తుంది. లేచి పని మొదలు పెడుతుంది. భర్త ఫ్రిజ్ లో ఉంచి వెళ్ళిన చేపలు కూరగాయలతో కలిపి వండుతుంది. ఉడికిన అన్నాన్ని రెండు భాగాలు చేస్తుంది. చపాతీలు చేసి రెండు బాక్సుల్లో సర్దుతుంది. ఒక బాక్స్ రాత్రికి భర్త కోసం దాస్తుంది. ఆమె ఒక బాక్స్ సర్దుకొంటుంది. బట్టలు ఉతికి బకెట్ లోనే ఉంచేస్తుంది.

అసలు భార్యాభర్తలు యిద్దరూ కలుస్తారా అని ప్రేక్షకులు సస్పెన్స్ లో ఉండగా, భర్త డ్యూటీ దిగి శరవేగంతో సైకిలు తొక్కుకుంటూ ఇంటికి వస్తాడు. ఆ సమయానికి భార్య సాంబ్రాణి వెలిగించి దండం పెట్టుకొంటూ ఉంటుంది. భర్తను చూడగానే ఆమె కళ్లు వెలుగుతాయి. నిన్న పొద్దుటి నుండి నలిగిన ముఖంలో నవ్వు పూస్తుంది. భర్త ప్రేమగా దగ్గరకు వస్తాడు. వారి చుట్టూ ఉన్న మురికి గది ఉద్యానవనంగా మారిపోతుంది. ఇద్దరూ ఆ ఉద్యానవనంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ, అందులో వేసి ఉన్న శయ్యకు చేరుతారు. ఒకరి సమక్షంలో ఒకరు రిలాక్స్ అవుతారు. ఆమె ఆయన చేతి గడియారంలో టైమ్ చూసి లేస్తుంది. ఆయనకు టీ కాచి ఇస్తుంది. కురులను దువ్వి జడవేస్తుంది. చీర పిన్ను పెట్టుకోవటానికి భర్త సహాయం చేస్తాడు. బ్యాగ్ తగిలించుకొని ఆమె మెట్లు దిగుతుంది. ఉద్యానవనం మళ్ళీ ఇరుకు గదిగా మారిపోతుంది. భర్త ముఖంలో ఆనందం మాయం అవుతుంది. భార్య యిచ్చి వెళ్లిన టీ కప్పును చేత్తో పట్టుకొని, విషాద వదనంతో వెళ్లి పోతున్న ఆమెను పై నుండి చూస్తుంటాడు.

ఇదంతా సోది కదా! ఒక సినిమాలో ఇలాగే చూపిస్తే ఎండిపోయిన పెయింట్ ను చూసినట్లు ఉంటుంది కదూ! కానీ ఈ బెంగాలీ సినిమా ʹలేబర్ ఆఫ్ లవ్ʹ (బెంగాలీ పేరు ఆశా జాయోర్ మఝే) ను చూస్తుంటే అలా అనిపించదు. లోలోపలి అంతరాత్మ ఏదో చెబుతూ ఉంటుంది. చాలా సంగతులు గుర్తుకు వస్తాయి. ʹఆ గోడకు ఒక కిటికీ ఉందిʹ నవల (సాహిత్య అకాడమీ వారిది) గుర్తుకు వస్తుంది. ఆ నవలలో దంపతులు గోడకు ఉండే, ఎవరికీ కనబడని కిటికీలోనుండి దూకి వెళ్లి అందమైన తోటలో ఏకాంతాన్ని అనుభవించినట్లుగా రాస్తారు. ఆ కిటికీ వారికి అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. అది అందరికీ కనబడదు. మనసు తెరిచి ఉంటేనే సాహచర్యంలో ఆనందం ఉంటుందని చెప్పటం ఆ రచయిత ఉద్దేశ్యం అయి ఉంటుంది.

ఈ సినిమాలో చెప్పదలుచుకొన్న విషయం కేవలం ఆ ఏకాంతం గురించి మాత్రమే కాదు. అది ʹఆర్థిక మాంధ్యం టైంలో ప్రేమ నిలిచి ఉండే అవకాశంʹ గురించి. సినిమాలో మధ్య మధ్య కొన్ని ఉపన్యాసాలు, కొన్ని స్లోగన్లు వినిపిస్తుంటాయి. ఫ్యాక్టరీ లాకౌట్ వలన ఆత్మహత్య చేసుకొన్న ఒక కార్మికుడి గురించిన ఉపన్యాసం అందులో ఒకటి. ʹరెసెషన్ వలన ఉద్యోగాలు తీసివేయడం సహించంʹ, ఇంక్విలాబ్ జిందాబాద్ʹ లాంటి నినాదాలు వినిపిస్తుంటాయి. భార్యభర్తలు వేరు వేరు వేళల్లో ఉద్యోగాలు చేయాల్సిన అగత్యం గురించిన బాగ్రౌండ్ ను అవి వివరిస్తాయి. ఇక్కడ వి. చంద్రశేఖరరావు రాసిన కథ ʹక్రానికల్స్ ఆఫ్ లవ్ʹ గుర్తుకు వస్తుంది. బెంగుళూర్, హైదారాబాద్ లలో ఉద్యోగం చేస్తూ శని, ఆదివారాలు మాత్రమే కలవగలిగే సాఫ్ట్ వేర్ భార్యాభర్తల గురించిన కథ అది.

సినిమా అంతా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా (ఇద్దరికీ సెల్ ఫోన్లు ఉన్నా కూడా) మాట్లాడుకోరు. దిగువ మధ్య తరగతి ఇల్లు, అందులో ఉండే వస్తువులు, మరకలు పడిన గోడలు, మాసిన బట్టల దండేలు కనిపిస్తాయి. ఒక వీధి నుండి భార్యాభర్తలు పనికి వెళుతుంటారు. ఆ వంటరి, సన్నటి వీధి మనకు కొన్ని ఇరానియన్ సినిమాలను గుర్తుకు తెస్తుంది.

నేటి వర్తమానాన్ని రికార్డ్ చేసే ఇలాంటి సినిమాలు ఇప్పటి అవసరం. మృణాల్ సేన్, బాసు చటర్జీ, గోవింద నిహ్లానీల తరం గడిచిన తరువాత ఇలాంటి సినిమాలు తీసే సాహసం ఎవరు చేయలేదు అనుకొంటాను. ఈ సినిమాకి గాను డైరక్టర్ ʹఆదిత్య విక్రమ్ సేన్ గుప్తʹ కు చాలా అవార్డులు వచ్చాయి. హీరోయిన్ వాసవ్ దత్త చటర్జీ (బెంగాలిలో బాసబ్ దత్త చటర్జీ) ఒక టీవీ యాక్టర్. ఇది ఆమె మొదటి సినిమా. కథానాయకుడు ఋత్విక్ చక్రవర్తి పాతవాడే. అన్నట్లు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

- రమా సుందరి,

URL : https://www.facebook.com/permalink.php?story_fbid=2368124956805107&id=100008228765507

Keywords : labour of love, bengali movie, లేబర్ ఆఫ్ లవ్, బెంగాళీ సినిమా
(2019-04-18 05:15:33)No. of visitors : 429

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
more..


లేబర్