మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్


మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్

మోడీ

మిత్రులారా, మూడు రోజుల కింద వరవరరావు సహచరి హేమలత మోడీ-సంఘ్ పరివార్ అబద్ధాల మీద గంభీర ప్రవచనాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు. మోడీ పట్ల మీ వ్యతిరేకత నిజమే అయితే, అవే అబద్ధాలతో, అక్రమ ఆరోపణలతో తయారైన భీమా కోరేగాం హింసాకాండ కేసు మీద, ఆ దొంగకేసులో నిందితునిగా చూపిన వరవరరావు గారి అక్రమ నిర్బంధం మీద మీ వైఖరి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ఆ బహిరంగ లేఖ వెలువడి ఇంకా నిండా మూడు రోజులు కాలేదు. వరవరరావు గారి మీద పెట్టిన కేసును తాను సమర్థిస్తున్నానని, అంటే మోడీ-సంఘ్ పరివార్ అబద్ధాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని చూపుకోవడానికి కెసిఆర్ కు అవకాశం వచ్చింది. మోడీకి కెసిఆర్ మద్దతు సంగతి మే 23 తర్వాత తేలుతుందని ఎవరైనా అమాయకంగా వేచి చూస్తుంటే, వారికి అంత పని ఇవ్వకుండా, తాను మోడీ మద్దతుదారునని, మోడీ తానూ ఒకే తానులోని ముక్కలమని, ఆ మాటకొస్తే తాను మరింత కాషాయపు ముక్కనని చూపుకోవడానికి కెసిఆర్ కు ఏప్రిల్ 13నే అవకాశం వచ్చింది.

భీమా కోరేగాం హింసాకాండ కేసు అబద్ధాల మీద, వరవరరావు, తదితర మేధావుల అక్రమ అరెస్టుల మీద, ప్రొఫెసర్ సాయిబాబా అనారోగ్యాన్ని కూడ పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతున్న వేధింపుల మీద తన సభ్యులకు అవగాహన కల్పించేందుకు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) ఏప్రిల్ 13న ఒక సదస్సు ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు దాకా జరగాలని తలపెట్టిన ఈ సదస్సులో దాదాపు పది మంది వక్తలు మాట్లాడవలసి ఉండింది. ఎంతోకాలంగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాదులో అన్ని ప్రజాసంఘాల సభలకూ సమావేశాలకూ అవకాశమిచ్చిన స్థలం తెలంగాణ ఎన్ జి వోస్ భవన్లోని హాలు. ఆ హాలులోనే డిటిఎఫ్ గతంలో ఎన్నో సమావేశాలు నిర్వహించింది. ఈసారి కూడ ఆ హాలు బుక్ చేసుకుని, వక్తలకు చెప్పి, కరపత్రాలు అచ్చువేసి, రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థ సభ్యులకు ప్రచారం చేసుకున్నారు.

హఠాత్తుగా ఏప్రిల్ 12 రాత్రి టిఎన్ జి వో ల సంఘం బాధ్యులు సభా నిర్వాహకులకు ఫోన్ చేసి ఈ సభకు అనుమతి లేదని, హాలు ఇవ్వవద్దని పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, కనుక తాము హాలు ఇవ్వలేమని అన్నారు. వెంటనే సభా నిర్వాహకులు సభలో ప్రధాన వక్తగా ఉన్న ప్రొ. హరగోపాల్ గారి ద్వారా పోలీసు ఉన్నతాధికారులను, టిఆర్ ఎస్ నాయకులను సంప్రదించారు. మర్నాడు ఉదయం 9 దాకా సాగిన ఈ సంభాషణల్లో సభ జరుపుకోవడానికి వీలు లేదని ఒకసారి, సభ జరుపుకోవచ్చునని ఒకసారి భిన్నమైన సందేశాలు అందాయి. కాని ఉదయం 9 కల్లా హాలు తాళాలు తెరవకుండా పోలీసులు అడ్డుకున్నారు. మెయిన్ రోడ్ నుంచి హాలు వైపు వెళ్లే రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనాలతో, బారికేడ్లతో, వందలాది మంది పోలీసులను మోహరించారు. సభకు వస్తున్నవారిని వచ్చినవారిని వచ్చినట్టుగా పోలీసు వ్యాన్లలోకి తోశారు.

ఆ సభను ప్రధాన వక్తగా హరగోపాల్ గారు ప్రారంభిస్తారని, ఉదయం సెషన్ లో మరి కొందరు వక్తలున్నారని, భోజనానంతరం సెషన్ లో నేను మాట్లాడవలసి ఉంటుందని నిర్వాహకులన్నారు. అయినా ఉదయం నుంచే సభలో పాల్గొంటానని నేను బయల్దేరాను. హాలుకు అడ్డంగా పోలీసులు మోహరించి ఉన్నారని, హాలులోకి వెళ్లే అవకాశం లేదని నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. హాలుకు వందగజాల దూరంలో, పొరుగున ఉన్న గాంధీభవన్ కాంటీన్ లో కూచుని సభకు ఎక్కడన్నా ప్రత్యామ్నాయ స్థలం సంపాదించగలమా ఆలోచిస్తున్నామని అక్కడికే రమ్మని అన్నారు.

నేను ఆటోలో ఆ క్యాంటీన్ ముందు దిగేసరికే క్యాంటీన్ ముందు అడ్డంగా వందలాది మంది పోలీసులు. నేను క్యాంటీన్ లోకి వెళ్లి కూచుని టీ తాగుతుండగానే పోలీసులు లోపల ప్రవేశించి ఒక్కొక్కరినీ లాక్కుపోయి బైట వ్యాన్ ఎక్కిస్తున్నారు. నా టీ తాగడం అయిపోగానే నన్నూ అలాగే లాక్కుపోయారు. ఆ క్యాంటీన్ లో మామూలుగా టీ తాగడానికి వచ్చినవాళ్లను కూడ లాగడం, వాళ్లు తమకూ ఈ సభకూ సంబంధం లేదని మొత్తుకుంటుంటే వాళ్ల ఐడెంటిటీ ప్రూఫులు అడగడం, సరిగ్గా 1930ల జర్మనీలో హిట్లర్ నియోగించిన గెస్టపో పోలీసుల దౌర్జన్యాలను గురించి చదివిన ఘట్టాలను గుర్తు తెచ్చాయి. దాదాపు నలబై మందిని మా వ్యాన్ లో ఎక్కించి రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లి సాయంత్రం దాకా అక్కడ నిర్బంధించారు. మరికొంతమందిని నాంపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ప్రొ హరగోపాల్ ను కూడ అలాగే అరెస్టు చేసి, మరొక ఐదారుగురితో కలిపి నారాయణగూడ పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు. సభా స్థలానికి వచ్చిన మరొక వంద, రెండు వందల మందిని చెదరగొట్టి బెదరగొట్టి పంపేశారు.

ఈ బీభత్సకాండకంతా పోలీసులు చెప్పిన కారణం ʹసభకు అనుమతి లేదుʹ అని. నిజానికి చట్టప్రకారం సభకు ʹఅనుమతిʹ తీసుకోవలసిన అవసరమే లేదు. ఇంటిలోపల, ఆవరణలోపల జరిగే సభకు అనుమతి తీసుకోవలసిన అవసరం మాత్రమే కాదు, పోలీసులకు సమాచారం ఇవ్వవలసిన అవసరం కూడ లేదు. బహిరంగ ప్రదేశంలో జరిగే సభకు కూడ పోలీసుల ʹఅనుమతిʹ అవసరం లేదు. కాని మైక్ వల్ల ఇరుగుపొరుగు వారికి కలిగే ఇబ్బందిని, సమూహం గుమిగూడడం వల్ల ట్రాఫిక్ కు కలిగే ఇబ్బందిని సవరించడం కోసం పోలీసులకు సమాచారం మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. కాని పోలీసు వ్యవస్థ, వారిని నడిపే రాజకీయ వ్యవస్థ ఈ ప్రజల సభా నిర్వహణ హక్కును కాలరాస్తూ, ʹపోలీసు అనుమతిʹ అనే కొత్త ఆనవాయితీని ప్రవేశపెట్టారు. టిఎన్ జీవోస్ హాలులో గత ఇరవై సంవత్సరాల్లో, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో, వేరువేరు సంఘాలు, సంస్థలు నిర్వహించిన సభల్లో నేనే వంద సార్లు ఉపన్యాసం ఇచ్చి ఉంటాను. ఒక్క సభకు కూడ పోలీసు అనుమతి ఎవరూ ఎప్పుడూ అడగలేదు. అనుమతి తీసుకోవాలని ఎవరూ అనుకోలేదు.

విచిత్రంగా, లేదా విషాదకరంగా, ఈ అరెస్టుకు కొద్ది గంటల ముందే నేను తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణలో వట్టికోట ఆళ్వారుస్వామి గారి ప్రజల మనిషి నవల గురించి మాట్లాడాను. ఏడవ నిజాం పరిపాలనలో అమలైన గష్తీ నిషాన్ 53 ప్రకారం 1921 నుంచి 1948 వరకూ సభల్లో ఏమి మాట్లాడతామో చెప్పి పోలీసుల అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండేది. ప్రజల మనిషి నవలలో దాని గురించి ఒక అధ్యాయమే ఉంటుంది. ఆ రాచరికం, ఆ గష్తీ నిషాన్ 53 ఇప్పుడు లేవని, ఇది ప్రజాస్వామ్యమని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇచ్చిన రాజ్యాంగం అమలులో ఉన్నదని ఎవరన్నా అనుకుంటే వారు అమాయకులని పోలీసులు చెప్పదలచుకున్నట్టున్నారు.

ఇంకా హాస్యాస్పదమైన సంగతి, మా అరెస్ట్ ʹప్రివెంటివ్ అరెస్ట్ʹ (నిరోధించడానికి నిర్బంధం) అని మమ్మల్ని నిర్బంధించిన ఒక ఎస్ ఐ అన్నాడు. దేనికి ప్రివెంటివ్? ఏమి ప్రివెంట్ చేయడానికి అరెస్టు చేశారు? ఒక సభను ప్రివెంట్ చేయవలసిన అవసరం ఏమిటి? మహారాష్ట్రలో విచారణ జరుగుతున్న ఒక కేసు గురించి మాట్లాడుకునే సభను ఎందుకు ప్రివెంట్ చేయాలి? ఏ కేసైనా విచారణ జరుగుతున్నప్పుడు దాని మీద అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలతో, అభిప్రాయాలతో దేశవ్యాప్తంగా, ప్రచారసాధనాల్లో, సభల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ ఒక్క కేసు మీద చర్చను మాత్రం ప్రివెంట్ చేయవలసిన అవసరం తెలంగాణ పోలీసులకు ఎందుకు వచ్చింది? ఒకవేళ ఈ సభ జరగనివ్వవద్దని పోలీసులు అనుకుంటే కూడ, అప్పటికే హాలు యాజమన్యాన్ని బెదిరించారు గనుక, హాలు తాళాలు తీయనివ్వలేదు గనుక వారి లక్ష్యం నెరవేరినట్టే కదా, ఇక అరెస్టుల అవసరం ఏమిటి? సభను రద్దు చేసుకొమ్మని నిర్వాహకులకు చెపితే సరిపోయేదానికి అరెస్టులు ఎందుకు? అయినా సభ నిర్వహిస్తామని నిర్వాహకులు పట్టుబడితే అరెస్టుల అవసరం రావచ్చుగాని కథ అంతదూరం రానే లేదు గదా?

ఇటువంటి సందర్భాలలో, ఎంత నియంతృత్వ పాలనలోనైనా, నాగరికంగా ప్రవర్తించిన పాలకులు నిర్వాహకుల మీద ఆంక్షలు పెట్టారు గాని, అతిథుల మీద, వక్తల మీద ఆంక్షలు పెట్టలేదు. ఇప్పుడు ఈ సభను ప్రారంభించవలసి ఉన్న ప్రొ. హరగోపాల్ ను అరెస్టు చేసి ఆరేడు గంటల పాటు పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం ఏ చట్టప్రకారం? ఏ నాగరికతా సూత్రాల ప్రకారం? ఇంతకూ 2014 ఎన్నికల ప్రణాళికలో ఈ తెరాస పాలకులే ఒక నిపుణుల సలహా మండలి అభిప్రాయాల ప్రకారం రాష్ట్ర పాలన జరుపుతామని, తాము తీసుకునే ప్రతి చర్యనూ, విధానాన్ని ఆ నిపుణుల మండలికి ముందే ఇచ్చి, వారు చెప్పినట్టే చేస్తామని రాశారు. అలా ప్రతిపాదించిన నిపుణుల సలహా మండలికి అధ్యక్షుడిగా ఉండమని ఇవాళ మాట్లాడే హక్కు నిరాకరించి నిర్బంధంలోకి తోసిన ఈ ప్రొ. హరగోపాల్ గారినే కోరారు.

ఈ సభలో ఒక వక్తనైన నన్ను కూడ అరెస్టు చేసి ఏడు గంటల పాటు నిర్బంధించారు. 1982లో విద్యార్థి కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనల్లో, రోడ్లమీద ఊరేగింపుల్లో, ధర్నాల్లో వందల సార్లు పాల్గొన్నాను గాని ఒక్కసారి కూడ ఇటువంటి నిర్బంధ అనుభవం లేదు. ʹబంగారు తెలంగాణʹ ఐదు సంవత్సరాల పాలనలోనే ఇది మూడో అరెస్టు. మూడు సార్లు కూడ ధర్నాల్లో కాదు, నిరసన ప్రదర్శనల్లో కాదు. ఒకసారి ఒక సభలో శ్రోతగా పాల్గొనడానికి రోడ్డుమీద నడిచి వెళ్తుండగా, రెండవసారి నాకు సంబంధంలేని సంఘం ఎక్కడో నిరసన ప్రదర్శనకు పిలుపు ఇస్తే, దానితో ఏ సంబంధమూ లేకుండా నేను ఇంటి నుంచి నా ఆఫీసుకు వెళ్తూ ఉండగా, మూడోసారి ఇప్పుడు ఒక క్యాంటీన్ లో టీ తాగుతుండగా. అబ్బ ఎంత బంగారు తెలంగాణ ఏర్పడింది!!!

అయితే రాజ్యం, పోలీసులు చెదరగొట్టిన ఒక్క సభ ఐదు సభలుగా జరిగింది. ఒక కథ ఉంది. చంద్రుడిని అడ్డుకోవాలని ఒక కారు నల్లని మేఘం అడ్డుగా వచ్చిందట. కాసేపటి కోసం చంద్రుడు కనబడకుండా పోయాడట. వెన్నెల ఆగిపోయిందట. కాని నిండు మేఘం కదా, కురిసి నీరు కారక తప్పలేదట. నేల మీద వందలాది నీటి మడుగులు ఏర్పరచిందట. ఆ మడుగుల్లో ఒక్కొక్కదానిలో ఒక్కక్క చంద్రుడు, వందలాది చంద్రులు ప్రతిఫలించారట. ఒక్క చంద్రుడిని ఆపబోయిన మేఘం వందల చంద్రులకు కారణమైందట. అలాగే రెండు వందల మందితో నాలుగు గోడల మధ్యన సాదాసీదాగా జరిగిపోయే సభను అడ్డుకున్న పోలీసులు, రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ లో, నాంపల్లి పోలీసు స్టేషన్ లో, నారాయణ గూడ పోలీసు స్టేషన్ లో మూడు సభలకు, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో, సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో సభల లాగ జరిగిన రెండు పత్రికా సమావేశాలకు కారణమయ్యారు. సభ జరిగి ఉంటే సభికులకు తప్ప ఎక్కువ మందికి తెలియకుండా ఉండిపోయే విషయాలు నిర్బంధం వల్ల మరెంతో మందికి తెలిసి వచ్చాయి. టిఎన్ జివో హాలులో ఎక్కువలో ఎక్కువ ఏడెనిమిదిమంది వక్తలు మాట్లాడి ఉండేవారేమో, ఒక్క రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ సభలోనే కనీసం ఇరవై ఐదు మంది ఉపన్యసించారు. నారాయణగూడ పోలీసు స్టేషన్ కు ఉపాధ్యాయ శాసనసభ్యులు అల్గుబెల్లి నర్సిరెడ్డి గారు వచ్చి అక్కడి నిర్బంధితులను పరామర్శించారు.

మొత్తం మీద మహారాష్ట్ర పోలీసుల అబద్ధపు కేసు మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైంది.
- ఎన్. వేణుగోపాల్.
సీనియర్ జర్నలిస్టు.

Keywords : మహారాష్ట్ర, పూణే పోలీసులు, బీమా కోరేగావ్, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, Maharashtra, Pune Police, Telangana, KCR< Varavara Ro
(2019-04-18 08:12:12)No. of visitors : 128

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
more..


మోడీ