ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం


ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం

ʹఆ

ప్రధానిపై హత్యకు కుట్ర అనే తప్పుడు కేసులో ఇరికించబడి పూణే ఎరవాడ జైల్లో ఉన్న వరవరరావు, సోమా సేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరేరా, మహేష్ రావత్, సురేంద్ర గాండ్లింగ్, వెర్నన్ గోజాల్వెస్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్ లను చూడడానికి పూణే కోర్టు వద్దకు వెళ్ళి వాళ్ళను కలిసిన రచయిత ఆక్టివిస్ట్ , రమా సుందరి తన ఫేస్ బుక్ వాల్ పై రాసిన వ్యాసం మీకోసం...

అంత హడావుడిగా జరిగి పోయింది. నేనూ వరలక్ష్మీ మాట్లాడుకొన్న ఒకానొక సంభాషణలో వివిగారు అనివార్యంగా వచ్చారు. వరలక్ష్మి బెంగపడిపోయింది. ఆమె బెంగ నాకూ పాకింది. ʹవెళదామాʹ అని ఒక మాట అనుకొన్నాం. త్వరత్వరగా ప్రయాణపు ఏర్పాట్లు జరిగిపోయాయి. రెండు రోజుల్లో మేమిద్దరం రెండు దారుల్లో ప్రయాణం చేసి పుణె చేరుకోన్నాం.
...
పుణె సెషన్స్ కోర్టు మూడవ అంతస్తులో ఆదుర్దాగా వేచి ఉన్నాము. మాకు అక్కడ గైడ్ చేయటానికి వచ్చిన శ్రీకాంత్, లాయర్ తో మాట్లాడి వచ్చాడు. త్వరలో రాబోతున్నారని చెప్పాడు. ఈ లోపల వెర్నన్ గోజాల్వెస్ సహచరి సుసాన్ అబ్రహాం, అరుణ్ ఫెరేరా సహచరి కలిశారు. సుసాన్ కూడా లాయర్. సహచరులిద్దరూ ఇద్దరూ ధైర్యంగానే ఉన్నారు. వెర్నన్ ను గతంలో కూడా ఉట్టి పుణ్యానికి జైలుకి పంపించారు. జైలు జీవితం, జైలు బయట జీవితం కూడా వాళ్ళకు కఠినంగానే ఉంటాయని అర్థం అయ్యింది.

సందడిగా పోలీసుల పహరా మధ్య కదులుతున్న ఉత్తేజ సైన్యంలాగా ʹఆ తొమ్మిది మందిʹ వచ్చారు. ముందు కళ్ళు వీవీగారి కోసం వెతికాయి. ఆ నవ్వులో తేడా లేదు. మనుషులనందరినీ ప్రేమించే నవ్వు. రాజీ లేని ఉద్యమపు నవ్వు. పెదాలతో పాటు కళ్లూ, మనసు కూడా ఆ నవ్వులో వెలుగుతాయి. నేను అత్యంత గౌరవించే విప్లవనాయకుల్లో ఒకరు వివి నల్లబడి నీరసంగా కనిపించారు. ఏం మాట్లాడాలి? ఏ ప్రశ్న అయినా అక్కడ ప్లాస్టిక్ పువ్వే. ʹఆరోగ్యం ఎలా ఉంది?ʹ అనే పేలవమైన ప్రశ్న. ఏవో కొన్ని ఆరోగ్య సమస్యలు చెప్పారు. ఆయన చెప్పిన విధానం ఆ సమస్యలు ఎవరికో ఉన్నట్లుగా చెబుతున్నట్లుగా ఉంది కానీ తనకు ఉన్నట్లుగా లేదు. వరలక్ష్మి ఆయనను అంటి పెట్టుకొని బెంగ తీర్చుకొంటోంది. నేను సుధా భరద్వాజ్, సోమా సేన్ ఉన్న వైపు కదిలాను.

సోమా సేన్ నేను పీవోడబ్ల్యూ అని చెప్పగానే ʹఏ పీవోడబ్ల్యూ. సంధ్య వాళ్ళదేనా?ʹ అని అడిగారు. ఒంగోలు అని చెప్పగానే ʹనేను ఇరవై ఏళ్ల క్రితం ఒంగోలు వచ్చాననిʹ చెప్పారు. ఆమె చెప్పిన సందర్భం నాకు గుర్తు రాలేదు. ʹఆరోగ్యంʹ అంటూ మళ్ళీ అదే ప్లాస్టిక్ ప్రశ్న వేశాను. ʹఅర్థైటీస్, కూర్చోవటానికి కుర్చీ కూడా ఇవ్వలేదుʹ చెప్పారు. కుర్చీ లేకుండా అర్థ్రైటీస్ తో, కింద కూర్చొని లేవటానికి ఆమె పడే బాధ స్పృహలోకి రాగానే నేను ఇంకా ఏమి మాట్లాడగలను? ʹపత్రికలు ఏమంటున్నాయి? మా గురించి ఏమైనా రాస్తున్నాయా?ʹ అని అడిగారు. ఏమి చెప్పాలి, అడ్డంగా తలఊపటం తప్ప. ʹబీజేపీ మళ్ళీ వస్తుందా?ʹ ఎంత కఠినమైన ప్రశ్నలు. ఒక్కదానికి కూడా సమాధానం పాసిటివ్ గా చెప్పలేక నీళ్ళు నమిలాను. ఏమి మాట్లాడాలో తెలియక నా దగ్గర ఉన్న ʹఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిస్టులేʹ పుస్తకం చూపించాను. మురిపంగా చూశారు ఇద్దరూ. కవర్ మీద బొమ్మలో వాళ్ళ కెరికేచర్ చూసి నవ్వుకొన్నారు. సుధా భరద్వాజ్ స్టాలిన్ స్వామి ని చూపించి ఎవరూ అని అడిగింది. (తెలుగు తెలియక) ʹమమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అనే అంటున్నారా?ʹ ఉన్నట్లుండి షార్ప్ ప్రశ్న వేసారు సోమాసేన్. నేను ఆ పుస్తకంలోని ఉద్దేశ్యాన్నికొద్దిగా వివరించాను. ʹఈ పుస్తకం రచయితలు ఎవరు?; అని అడిగారు. నా సమాధానం విని ʹత్వరలోనే వాళ్ళకు మా పక్క సెల్ లో అకామిడేట్ చేస్తారు.ʹ అన్నారు. ʹమహిళా మార్చ్ జరిగిందా?ʹ అని అడిగారు. హైదారాబాద్ లో జరిగిందని చెప్పాను. గొప్పగా సంతోషం. సుధా భరద్వాజ్ చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా చిరునవ్వు నవ్వుతారు అని అర్థం అయ్యింది. ఇంతలో చిన్న పేపర్ కప్పులో చల్లబడిపోయిన టీని తీసుకొని వచ్చారు సుశాన్ ʹఇద్దరూ పంచుకోండిʹ అంటూ. ఆ చల్లబడిన అరకప్పు టీ అక్కడి ఆడపోలీసుల అభ్యంతరాల మధ్య వారిద్దరరూ తాగారు.

మహేశ్ రావత్ జైల్లో ఉన్న వాళ్ళలో చిన్నవాడు. 29 సంవత్సరాలు అన్నారు. చురుగ్గా ఉన్నాడు. వెర్నన్ వెర్నన్ గోజాల్వెస్ వరవరరావు గారి తరువాత పెద్ద ఆయన. ఆయన ముఖం చాలా ఎక్స్ ప్రెసివ్ . ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే దగ్గరకు వెళ్ళి నిల్చోన్నాను. ఆయన ఒకరితో మాట్లాడుతున్నా అందరినీ ఉద్దేశించి మాట్లాడతారని అర్థం అయ్యింది. ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ. జైలు కఠిన జీవితం ఆయన్ను ఏమి కుంగ దీయలేదు. నా ప్లాస్టిక్ ప్రశ్నకు ʹఆరోగ్య సమస్యలు ఏవీ ఉండవు. బయటకు రావటమే ఇప్పటి సమస్యʹ అని నవ్వుతూ అన్నారు. సుధీర్ ధావ్లే చిరునవ్వుతో శ్రోతగానే ఉన్నారు. అరుణ్ ఫెరేరా ʹcolours of cageʹ మనిషి, కార్టూనిష్టు... తనలోని కళాకారుడి వలన అయ్యుండొచ్చు ఉత్సాహంగానే కనిపించారు. రీసెంట్ పోలీస్ కష్టడీలో మళ్ళీ దెబ్బలు తిన్న వ్యక్తి అరుణ్ ఫెరేరా. సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ ఒక పక్కగా నిల్చోని మాట్లాడుకొంటున్నారు. అర్బన్ మావోయిస్టులు పుస్తకం చూపిస్తే ఆసక్తిగా తిరగవేశారు. సాయి బాబా కేస్ వాదిస్తున్న లాయర్ సురేంద్ర గాడ్లింగ్. ఇప్పుడు ఆయనే జైల్లో ఉన్నారు.

వారికి ఎన్నో ప్రశ్నలు ఉండి ఉంటాయి. ఆ ప్రశ్నలు నాకు తెలుసు. నా ప్రశ్నలు నాకున్నాయి. బయట ప్రపంచం వారి గురించి ఏమి అనుకొంటుంది? బయట సమాజం వారి జైలు జీవితం గురించి ఏ మాత్రమైనా ఫరక్ పడుతుందా? అసలెంత మందికి తెలుసు ప్రజల కోసం వాళ్ళు జైలుకు వెళ్లారని? వాళ్ళు బయటకు రావాలనుకోవటం వారి కోసం కాదు, ప్రజలకోసమేననే స్పృహ మాబోటి వాళ్ళం ఎంతమందికని కలిగించగలం? ఈ ఫాసిస్టు ప్రభుత్వాలు, అమ్ముడు పోయిన వార్తా మాధ్యమాలు, రాజ్య గులాము పోలీసులు, కళ్లూ చెవులూ లేని న్యాయ పీఠాలు వీటన్నిటి ఇనప చట్రాల నుండి వీళ్ళను విడిపించుకోవటానికి ఎన్ని చేతులు, ఎన్ని గొంతులు, ఎన్ని కలాలు, ఎన్ని ఉద్యమాలు కలవాలి?

గట్టిగా అరవాలని అనిపించింది. దళితులు ఆదివాసీల కోసం న్యాయ, ధర్మ, వీధి పోరాటాలు చేసిన వాళ్ళు; ఇప్పుడు వారికి ఆ భుజాన్ని కూడా ఆసరాగా ఇవ్వలేక బంధిచబడ్డారనీ, మళ్ళీ వీళ్ళను విడిపించికోవటానికి యుద్ధాలు జరగాలనీ, ఆ యుద్ధాలు జైల్లో ఉన్న వాళ్ళ కోసం కాదు, సమస్త పీడిత ప్రజలకోసమనీ గొంతు పగిలేలా చెప్పాలని ఉంది. ఒక్క మాట పెగలలేదు. గొంతు రుద్ధమౌటం తప్ప.

ఆ రోజు మా అదృష్టం. మూడున్నర వరకు వాళ్ళను కోర్టు ఆవరణలోనే ఉంచారు. వచ్చిన గార్డ్ పోలీసులు కూడా మంచివాళ్లలాగానే ఉన్నారు. ఎక్కువ కలగచేసుకోలేదు. మూడున్నరకు కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం అయ్యాయి. వీరి తరఫున గ్రూప్ ఆఫ్ లాయర్లు అక్కడ పని చేస్తున్నారు. చట్టం, న్యాయం వెక్కిరింతకు గురి అయ్యే మహరాష్ట్రలో ఇలాంటి లాయర్ల ఉనికి కూడా ఆశ్చర్యమే. న్యాయం పూర్తిగా తిరస్కరించబడే చోట ఇలాంటి నిజ న్యాయ నిపుణుల పుట్టుక అనివార్యం అవుతుందేమో. Indian Association of Peopleʹs Lawers ప్రెసిడెంట్ సురేంద్ర గాడ్లింగ్, దాని కోశాధికారి అరుణ్ ఫెరేరా ఇద్దరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు అనే వాస్తవం అనేక ప్రశ్నలకు దారి ఇచ్చింది.

వైట్ శారీ, బ్లాక్ షార్ట్ కోర్టు తో ఉజ్వలా పవార్ ప్రొసీక్యూషన్ మొదలు పెట్టింది. వాళ్ళకు బెయిలు ఇవ్వాలనే డిఫెన్స్ లాయర్ల పిటిషన్ తరువాత, ఎందుకు ఇవ్వకూడదో చెప్పటానికి ఆమె మూడు రోజులు తీసుకొంది. ఆ రోజు రెండో రోజు. పెద్ద సంచిలో పుస్తకాలతో ఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆమెకు దగ్గరలో కూర్చొని పుస్తకాలు అందిస్తున్నాడు. పోలీసులు, ప్రాసిక్యూటర్ కలిసి చాలా హోం వర్క్ చేసి వచ్చారని అర్థం అయ్యింది. ఆ రోజు రెండున్నర గంటల్లో ఆమె మాటలు నాకు చాలా అర్థం కాలేదు. వినబడలేదు. బల్ల గుద్ది మాట్లాడిన కొన్ని మాటల్లో ʹసుప్రీం కొర్టే బెయిల్ తిరస్కరిస్తే మీరు ఇక్కడ బెయిల్ ఎలా ఇస్తారు?ʹ అనే ప్రశ్న అర్థం అయ్యింది. నేపాల్ మావోయిస్టు వసంతా (బసంతా అంటుంది ఆవిడ), మణిపురీ మావోయిష్టు ఇంకెవరో అంటూ ఏదో లింక్ పెట్టింది. ఒక సారి జర్మన్ మావోయిష్టు అని కూడా అన్నట్లుంది. వివిగారిని చాలా సార్లు అధినాయకుడు అని సంబోధించింది. 1800 పేజీల చార్జ్ షీట్ లో ముఖ్యాంశాలను ఎన్ లైట్ చేసుకొని వచ్చారు. కొన్ని సార్లు కొన్ని పేపర్స్ ను జడ్జి మొహానికి చూపిస్తుంది. మైల్ పాస్ వర్డ్ చాలా పెద్దగా పెట్టుకొని హాకింగ్ చేయకుండా జాగ్రత్త పడ్డారని అంటోంది. దేశ ద్రోహం చేస్తున్నారని అంటుంది. సెడిషన్ అనే పదం చాలా సార్లు వినబడింది.

ఒక చెయ్యి వెనక్కి మడుచుకొని, రెండో చేతి వేలు చూపిస్తూ ఆమె చేస్తున్న వాదనకు జడ్జి ఎలా ప్రతిస్పందిస్తున్నాడా అని కుతూహలం కలిగింది. చెక్కగా, భావాతీతంగా ఉన్న ఆయన ముఖం చాలా సేపు యాక్షన్ చేయలేకపోయింది. ఆమె వాదనకు ఆయన ముఖంలో అంగీకారమే కనిపించింది నాకైతే. అదంతా ప్రాక్టీస్ చేయని నాటకం అని తోచింది.

ఆమె వాదనకు ఆ పది మంది ఎలా ప్రతిస్పందిస్తున్నారో అని వారి వైపు చూశాను. వెనకాల ఆనుకోవటానికి ఏమి లేని బెంచ్ మీద వాళ్ళు అప్పటికి రెండున్నర గంటల నుండి కూర్చొని ఉన్నారు. (పొద్దుట నుండి వారి పరిస్తితి అదే)

వాళ్ళు పాలనవ్వులు నవ్వుతున్నారు. ప్రజాస్వామ్యం, న్యాయం, ధర్మం అని చెబుతున్న వాటికి పైన నిలబడి వాటి బోలుతనాన్ని, నకిలీతనాన్ని చూసి నవ్వుకొంటున్నారు వాళ్లు. వారి వారి రాజకీయ ఆచరణలో శతాబ్ధాల తరబడి కొనసాగుతున్న వాళ్ళూ, అత్యంత అణగారిన సమూహాలతో పని చేస్తున్న వాళ్ళని ఈ రోజు దోషులుగా బోనులో కూర్చోబెట్టి రాజ్యం పగదీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంటే నవ్వు రాక ఏం వస్తుంది?

అన్నీ అబద్దాలతో రక్తి కట్టించ చూస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసులు రాజ్యానికి అంగాలు అయితే అయి ఉండొచ్చు కాక, వారి ఆత్మలకు ఏమి సమాధానం చెప్పుకొంటారు? నిద్ర పోయే ముందు గుండెల మీద చెయ్యి వేసుకొని ఎలా నిద్రపోతారు? పిచ్చి ప్రశ్నలు. ʹకోర్ట్ʹ సినిమా వాటికి సమాధానం చెబుతుంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపణ చేస్తున్న విషయాల్లో పదే పదే వినబడిన మాట ʹదళితుల్ని ఆర్గనైజ్ చేస్తున్నారుʹ అని. దళితుల్ని ఆర్గనైజ్ చేస్తే తప్పేంటి? ఆదివాసులకు సహాయపడితే తప్పు ఏంటీ? ఆలోచిస్తుంటే వారి తప్పులు నాకు తెలిసాయి. ఈ రోజు సామూహికంగా ఆర్గనైజ్ అవగలిగిన, అవుతున్న వాళ్లు దళితులు. వారి సామూహికత్వం హిందూ ఆధిపత్య కుల సమాజాన్ని కొనసాగించాలనుకొన్న రాజ్యానికి ప్రమాదం. దళితులకు ఎవరు సరైన రాజకీయ పరికరాలను అందచేసినా వారు ఆ బోన్ లో నిలబడాల్సిందే. ఆ పని చేసిన సుధీర్ ధావలే బోనులో ఉన్నాడు.

భారతదేశంలో అత్యధికంగా ఉన్న అటవీ సంపదను దోచి కార్పొరేట్లకు పంచాలనుకొన్న వారికి ఆదివాసులను తరిమేయటం ఒక తక్షణ కర్తవ్యం. అందుకు గాను న్యాయ స్థానాలు, మిలటరీ పని చేస్తాయి. దానికి భిన్నంగా, ఆదివాసీలకు న్యాయపరంగా సహాయం చేస్తున్నసుధా భరద్వాజ్ వాళ్ళకు శత్రువు. వారి తరఫున వాదిస్తున్న సురేంద్ర గాడ్లింగ్, అరుణ్ ఫెరారాలు కూడా రాజ్యానికి శత్రువులు అయ్యి బోనులో ఉన్నారు. సుధా భరద్వాజ్ తీసుకొన్న ఒక కేసు అంబానికి వ్యతిరేకంగా ఆదివాసీల పక్షాన ఉన్నది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రీసర్చ్ చేసి, ప్రతిష్టాత్మక ʹప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవెలప్మెంట్ʹ స్కాలర్షిప్ పొందిన మహేశ్ రావత్ కెరీర్ కోసం సంపన్న దేశాలకు పోకుండా ఆదివాసులకు తునికాకు సేకరణలో సరైన రేట్లు రావాలని పోరాడినందుకు అతగాడు ఈ రోజు బోనులో ఉన్నాడు. జీవితకాల ఉద్యమకారిణి సోమా సేన్ ఈ రోజు బోన్ లో ఉంది. ఇంకా ఆ బోను లో పట్టనంత మందిని చేర్చటానికి వలలు పన్ని ఉన్నారు. కొత్త బోనులు తయారు అవుతున్నాయి.

మహేశ్ రావత్ ను చూడడానికి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఫ్రెండ్స్ అయి ఉంటారు. తోటి కామ్రేడ్స్ కూడా అయి ఉండొచ్చు. 29 ఏళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ తో, వీక్ ఎండ్ పార్టీలతో గడుపుతూ ఉంటారు. వరవరరావు గారీలాంటి 79 ఏళ్ల వృద్ధులు మన ఇళ్ళలో ఏమి చేస్తుంటారు? మనుమలు, మనమరాళ్లతో ఆడుకొంటూ ఉన్నారు. కానీ వీరంతా వయసుకు అతీతంగా, కోరుకొని జీవితాన్ని బోనులో నిలబెట్టుకొన్నవారు.

- రమా సుందరి

Keywords : Bhima Koregaon, Pune police, varavara rao
(2019-11-13 04:06:58)No. of visitors : 352

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


ʹఆ