సంస్కరణలు-ప్రజాస్వామ్యం


సంస్కరణలు-ప్రజాస్వామ్యం

సంస్కరణలు-ప్రజాస్వామ్యం

1857 సిపాయి తిరుగుబాటుని ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పరిగణిస్తాం. ఆ తిరుగుబాటులోని
ఝాన్సీలక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాఫడ్నవీస్‌, మంగళ్‌పాండే లాంటి వారిని కీర్తిస్తాం. ఎందుకో ఈ పోరాటానికి యిష్టం లేకపోయినా నాయకత్వం వహించి బ్రిటీష్‌వారి క్రూరమైన శిక్షకు బలైన ఆఖరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌షాను మర్చిపోయాం. అంతేకాదు దాదాపు మరాఠీ యోధుల్ని తప్ప మరెవర్నీ మనం గుర్తుంచుకోలేదు. కానీ అది కాదు విషయం. ఈ తిరుగుబాటు, తరువాత విక్టోరియారాణి ప్రకటన, 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌,అతివాదులు మితవాదులు ,
గాంధీ ...ఈ జాతీయ ఉద్యమం 1857కి కొనసాగింపుగా సాగి 1947 వచ్చింది.

కానీ మనం ఎంతో ప్రేమించి గౌరవించే విప్లవ సంస్కర్త జ్యోతిరావుబా పూలే (1827`1890)1857 తిరుగుబాటుని వ్యతిరేకించాడు. కొంతమంది కమ్యూనిస్టులు బూటకపు స్వాతంత్య్రం అన్నారు. ఆనాటి సంస్కర్తలందరూ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని బలపరిచారే తప్ప వ్యతిరేకించ లేదు.అంబేద్కర్‌ జాతీయోద్యమంలో పాల్గొననే లేదు. భీమా కోరేగాం యుద్ధంలో బ్రిటిష్‌ వారి తరపున పాల్గొని పీష్వాబాజీరావు -2ని ఓడించిన దళిత సైనికుల స్మృత్యర్ధం 1927లో అంబేద్కర్‌ తొలిగా నివాళి ఘటించాడు. స్వదేశీ రాజుని ఓడించిన బ్రిటిష్‌ వారి సైన్యానికి నివాళి అర్పించడమేమిటీ? ఇది మన స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధం కాదా అనే ప్రశ్న వస్తుంది. ఆనాటి సంస్కర్తలందరూ ఎందుకు బ్రిటిష్‌ వారిని వ్యతిరేకించ
లేదు? ఎందుకు జాతీయోద్యమం పట్ల అనుమానంగా ఉన్నారు?
2
హిందూమతం అని మనం ఈవేళ పిలుస్తున్న మతం మొదట వైదిక మతంగా తరువాత బ్రాహ్మణ మతంగా మొదలైంది. ప్రాచీన షోడశ సామ్రాజ్యాలు కూలిపోయి ఆ గణతంత్ర సమాజాల స్థానంలో రాజ్యం అనేది ఏర్పడుతున్న కాలంలో సమాజాన్ని నిర్మించడానికి బ్రాహ్మణ మతం `బౌద్ధం రెండూ పోటీ పడ్డాయి.
గ్రామం పునాదిగా కుల వ్యవస్థ సామాజిక రూపంగా ఉండి బ్రాహ్మణ ఆధిపత్యం క్షత్రియ నాయకత్వం లోని వైదిక వర్ణవ్యవస్థని బ్రాహ్మణులు నిర్మించారు.
పట్టణాలు పునాదిగా వ్యవసాయం, వర్తకం ప్రధానంగా వర్ణకుల వ్యవస్థలేని సమాజంగా బ్రాహ్మణ ఆధిపత్యం లేని క్షత్రియ నాయకత్వంలోని సామాజిక వ్యవస్థని బౌద్ధులు నిర్మించారు.
బౌద్ధం చాలావరకూ పై చేయి సాధించింది. ఉపఖండం అంతా వ్యాపించింది. ఒక నిర్మాణాత్మమైన మతంగా అది ప్రజల్ని సంఘటితం చేసింది. కానీ వ్యవసాయ విస్తరణ జరగడం బ్రాహ్మణ మతాన్ని పెంచింది. రాజుల కొత్తరకపు రాజ్యాధికారాన్ని, నిరంకుశత్వాన్నీ,క్రూరత్వాన్ని, హింసనీ బ్రాహ్మణ మతం అడ్డూఅదుపు లేకుండా సమర్ధించడమే కాక దానికోసం అనేక పురాణాల్ని సృష్టించింది. తద్వారా బ్రాహ్మణ మతం బౌద్ధాన్ని ఓడించగలిగింది.
ఈ క్రమంలో బ్రాహ్మణ మతం తీసుకున్న వ్యూహాత్మక సర్దుబాటు ఈనాటికీ కొరుకుడు పడదు. తనకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి భావజాలాన్నీ అది తనలో కలిపేసుకుంది. సమర్ధకుల్నీ వ్యతిరేకుల్నీ అందర్నీ తనలో భాగంగా మార్చేసుకుంది. నాయకుల్ని విగ్రహాలుగా స్వీకరించి వారి భావజాలాన్ని అపభ్రంశంచేయడం, లేదా కప్పిపుచ్చేయడం మనకి కనిపిస్తుంది.
యిది పూర్తిగా విజయం సాధించాకా ,
గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థ పూర్తిగా బ్రాహ్మణ మతం పట్టులోకి వచ్చాకా మన దేశంలో చీకటి యుగం ప్రారంభమైంది. వ్యక్తి కులంగా మాత్రమే మిగిలాడు. కులానికి దాని సామాజిక సంబంధంలో మాత్రమే అస్తిత్వం. చదువు విజ్ఞానం ఏదీ లేదు. శూద్ర కులాలపై భయంకర అణచివేత స్త్రీల పైన అణచివేత... మొత్తం సమాజమంతా అంధకారంలోకి పోయింది.
3.
ఒక నిర్మాణాత్మకమైన మత వ్యవస్థ కలిగిన ముస్లీంలు ఉపఖండాన్నంతా ఆక్రమించుకున్నారు. అయితే బ్రాహ్మణ మతం ఇస్లాం భావజాలాన్ని కలుపుకోలేకపోయింది. కారణం అది ఉపఖండంలోని పరిస్థితుల
వల్ల ఆవిర్భవించినది కాదు. దానికి ప్రత్యేకమైన సంస్కృతీ సంప్రదాయాలు ఉండడం వల్ల అది బ్రాహ్మణిజంలోకి కలవలేదు. రెండు రకాల భావజాలాలు కలిసి అణగారిన ప్రజలకి స్వాంతన కలిగించే గురువులు వచ్చారు తప్ప రెండూ కలవలేదు. దీనికి మరో కారణం ఇస్లాంలో కులం లేకపోవడం. బ్రాహ్మణ మతానికి కులం అనేది ప్రధాన ఆయుధం. ఒక వ్యక్తి మతం ధర్మం ఏమిటి అనేది ప్రధానం కాదు అతడి కుల ప్రధానం. అతడికి కులం అంటూ ఉంటే అతడు బ్రాహ్మణిజం పాశం నుంచి తప్పించుకోలేడు.
4.
ఈస్టిండియా కంపెనీ దేశంలోకి ప్రవేశించి 1757లో ప్లాసీ యుద్ధంతో అధికారం వైపు అడుగులేసింది. అగ్రహారాలూ , జమీందారీలూ రాసిచ్చేసే అలవాటున్న రాజులు బ్రిటిష్‌ కంపెనీకి కూడా అలాగే వ్యాపారం కోసం ఊళ్ళకుఊళ్ళు రాసిచ్చేసారు. అక్కడ కుంఫినీ పరిపాలన వచ్చింది.

యూరప్‌లో రాజకీయ మార్పు సామాజిక మార్పు కొనసాగుతున్న కాలమది. అంధకారయుగపు సంకెళ్ళని ఛేదించుకుని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పవనాలు బలంగా వీస్తున్నాయి. క్రీస్టియన్‌ మతం మీదా దానిలోని ఛాందసత్వం మూఢనమ్మకాల మీదా తిరుగుబాట్లు లేస్తున్నాయి. మత సంస్కరణ,సామాజిక మార్పు, రాజ్యం ప్రజాస్వామికం వైపు అడుగులైడం మొదలైంది.
ఇదే సమయంలో ఉపఖండంలో కూడా నూతన ఆలోచనలు మొదలైనాయి. సమాజాన్ని సంస్కరించాలనీ, అందుకు మత సంస్కరణ జరగాలనీ భావించిన అనేక మంది సంస్కర్తలు పోరాటం మొదలు
పెట్టారు. సాంఘిక దురాచారాలూ ,
మతంలోని దురాచారాలూ , స్త్రీ అణచివేత, కుల అణచివేతకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలునడిచాయి. నిజానికి దేశం,జాతీయత,దేశభక్తి అనే భావనల్ని ఈ సంస్కర్తలే తీసుకువచ్చారు. దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి తొలిఅడుగు సంస్కరణ రూపంలోనే పడిందని చెప్పవచ్చు. దానికి ప్రాథమిక రూపం రాజారామ మోహనరాయ్‌ అయితే విరాడ్రూపం జోతిబా పూలే. ప్రజాస్వామిక విప్లవ ఎజెండాని రూపొందిన వాడు జోతిబా పూలే అని చెప్పవచ్చు.
సంస్కరణ ఉద్యమాలతో పాటే సంస్కరణ వ్యతిరేక ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. ఛాందస హిందూవాద భావజాలం క్రిస్టలైజ్‌ కావడం మొదలుపెట్టింది కూడా ఈ కాలంలోనే. క్రైస్తవ మతం, యూరప్‌ ప్రజాస్వామ్య భావజాలం, సంఘ సంస్కరణా, హిందూమతం మీద దాడిగా చిత్రించి ఆ ప్రొవేకేషన్‌ మీద సంఘటితం చేయాలనే ప్రయత్నాలు మొదయ్యాయి. వీటి ఘర్షణ ఆనాటి సాహిత్యంలో ముఖ్యంగా బెంగాల్‌, హిందీ సాహిత్యాలో చూడొచ్చు.
5.
ఒకపక్క సంస్కరణలు లేదా సాంస్కృతిక పునరుజ్జీవనం మరోపక్క ఛాందస హిందూ మత ధోరణి ఘర్షణ పడుతున్న కాలంలోనే బ్రిటిష్‌ వలస వాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం ప్రారంభమైంది.జాతీయ వాదం, దేశభక్తి లాంటి భావజాలాన్ని రూపొందించి పెంపొందించింది పునరుజ్జీవవాదులే అయినా హిందూ ఛాందసవాదం ఉన్న వారినించే స్వరాజ్యం అనే నినాదం బయలు దేరడం గమనించవచ్చు. పునరుజ్జీవవాదులు సంస్కరణకీ, ఉత్తమ సమాజ నిర్మాణానికీ జాతీయవాదాన్ని దేశభక్తిని ప్రచారం చేస్తే అందకు విరుద్దంగా హిందూ ఛాందసవాదులు వాటిని ఛాందసత్వానికీ బ్రిటిష్‌ వ్యతిరేకతకీ ఉపయోగించుకున్నారు.
బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం ప్రబల శక్తిగా విస్తరించింది. ఇక్కడ నాలుగు పాయల్ని మనం గమనించవచ్చు. 1. సంస్కరణ వాదం, 2. సనాతన వాదం 3. బ్రిటిష్‌ వ్యతిరేకవాదం 4. వలస వ్యతిరేక వాదం. ఈ నాలుగు రకాల రాజకీయ భావజాలాలకీ వేరు వేరు లక్ష్యాలున్నాయి. సంస్కరణలు కోరిన వారు ఆంగ్లేయపాలన ఉండాలని కోరుకున్నారు. హిందూ ఛాందసవాదులు ముస్లీం వ్యతిరేక అగ్రకుల మత జాతీయోన్మాదాన్ని కోరుకున్నారు. బ్రిటిష్‌ వ్యతిరేకులు ప్రజాస్వామ్యం ఉండే స్వరాజ్యాన్ని కోరుకున్నారు. వలస వ్యతిరేకవాదులు సోషలిజాన్ని కోరుకున్నారు.
బ్రిటిష్‌ వ్యతిరేక స్వరాజ్య ఉద్యమం అనివార్యంగా ప్రథమ స్థానంలోకి రావడంతో మిగిలిన మూడూ దానిలో చేరడమో దూరంగా ఉండిపోవడమో చేసాయి. దూరంగా ఉండిపోయినవి సంస్కరణలు,
ఛాందసవాదాలు. సంస్కరణలు కోరిన వారు జాతీయోద్యమంలో కలిసి సంస్కరణలని పక్కకితోసి గాంధీ అనుయాయులుగా మిగిలిపోయారు. వలసవాద వ్యతిరేకులు జాతీయోద్యమం ఆనాటి అవసరంగా భావించి జాతీయ కాంగ్రెస్‌లో అంతస్స్రవంతిగా కొనసాగారు. సనాతన భావజాలం ఉన్న రెండో శ్రేణి అగ్రకులాల నాయకులు కొత్త రకపు ఆధిపత్యంలోకి ప్రవేశించడానికి కాచుకుని ఉన్నారు.
అంబేద్కర్‌ తన కాలంలోని తాత్విక రాజకీయ ఆర్థిక భావాలతో ప్రభావితుడైన వాడు. ఆనాడు యూరప్‌ అమెరికాలు వెళ్ళి చదువుకున్న వారు ప్రజాస్వామ్యభావాలకీ,
సోషలిస్టు భావాలకీ ప్రభావితమయ్యారు. కులం కారణంగానే అంబేద్కర్‌ ప్రజాస్వామ్య భావాల వైపు ఆకర్షితులయ్యారు. భారత దేశంలో కులం ఉన్న ప్రతివ్యక్తి ఆలోచనలోనూ, అతను పొందే ప్రభావంలోనూ అతని కులం తాలూకూ ఇన్‌స్టింక్ట్‌ ఉంటుంది. తనకు తాను యథాలాపంగా ఒక జాతిగా పరిగణించుకునే కులం ఆధునిక రాజకీయ భావాలన్నీ తననే ప్రతిబింబించాలనీ, తన అస్థిత్వాన్నే అవి చాటాలనీ కోరుకుంటుంది. ప్రజాస్వామ్య భావాలకి ఆకర్షితులైన ఆనాటి వారు భారతీయ ఫ్యూడలిజం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళే. అందుకే వారందరూ కులం, చదువు, స్త్రీ అణచివేత లాంటి వాటిని పట్టించుకున్నారు. సంస్కరణ వ్యతిరేక మత ఛాందసత్వం ఉన్న వారిని బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమం ఎకామిడేట్‌ చేయడంతో వీళ్లు ప్రజా జీవనంలోకి వచ్చారు.
చాలా సహజంగా అంబేద్కర్‌ దీన్ని గుర్తుపట్టాడు. అంబేద్కర్‌ ఒక్కడే దీన్ని గుర్తుపట్టాడు. కమ్యూనిస్టులు చేసిన అనేక తప్పిదాలలో దీన్ని గుర్తించలేకపోవడం ఒకటి. అంబేద్కర్‌ సంస్కరణ పట్ల విప్లవాత్మకమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడు. అందుకే కులమతవాదుల నాయకత్వంలోని జాతీయోద్యమాన్ని లెక్క చేయకుండా పోరాటాలు చేసాడు. భారత స్వాతంత్య్రోద్యమమూ, ప్రజాస్వామిక విప్లవమూ రెండూ ఒకటి కాదు. ప్రజాస్వామిక విప్లవంలో స్వాతంత్య్రోద్యమం ఒక భాగం మాత్రమే. అయితే చిత్రమైన విషయం ఏమంటే సంస్కరణోద్యమంతో ప్రారంభమైన జాతీయోద్యమంలో సంస్కరణలు అప్రధాన అంశంగా ఉండిపోవడం. స్వాతంత్య్రోద్యమ భావ జాలంలో సంస్కరణలు ప్రజాస్వామ్యంలో భాగమనే భావం బలంగా లేకపోవడం మనం గమనించవచ్చు. మన దేశంలో సంస్కరణలు ప్రజాస్వామిక విప్లవంలో భాగమని గుర్తుపెట్టుకోవాలి. అవి కేవలం ఉదారవాద మేధావుల డిసెంట్‌ మాత్రమే కాదు. ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాంటే సంస్కరణ పట్ల విప్లవాత్మక దృక్పథం ఉండి తీరాలి.

భగత్‌సింగ్‌ భారత దేశపు లెనిన్‌ అయిఉండేవాడని అనుకున్నట్టే అంబేద్కర్‌ కమ్యూనిస్టు నాయకుడు అయి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ ఆయన మార్క్సిజం వైపు ప్రభావితం కాలేదు. పైగా దాని పట్ల వ్యతిరేకత ఉన్నవాడు. ఆ వ్యతిరేకత సిద్ధాంత పరమైనది. ప్రజాస్వామ్యమే సామాజిక జీవనంలోకి రాని సమాజంలో ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిజంలోకి రావాలని లేదు. భారతదేశ జాతీయోద్యమం అగ్రవర్ణాలకు చెందినదిగా భావించడానికీ, వాళ్ళు అధికారంలోకి వస్తే తమని అణచి వేస్తారని భావించడానికీ అనేక కారణాలు ఉన్నాయి. పూలే ఈ కారణంగానే 1857ని వ్యతిరేకించాడు. సంస్కరణలని కోరుకున్న వాళ్ళు బ్రిటిష్‌ పరిపాలన తమకి స్వేచ్ఛ యిచ్చిందనీ,
తమని ఆధునికతలోకి తీసుకు వచ్చిందనీ వాళ్ళు వెళ్ళి పోవడం తమని తిరిగి అణచివేతలోకి దింపుతుందనీ భావించారు. ఆ భావనకి పునాది 18వ శతాబ్దం నించీ ఉంది. ఈవేళ అది సాకారమై కనిపిస్తోంది.
6
గడిచిన రెండు వందల ఏళ్ళ పరిణామాల్ని గమనించినపుడు సమాజంలో బలపడిన విషయాలు ఆశ్యర్యంగానూ దిగులుగానూ ఉంటాయి. కులం లేని హిందూ మతాన్ని నిర్మించాలని మత సంస్కర్తలు కలలు కన్నారు. కానీ కులం లేని హిందూ మతాన్ని ఊహించలేని పరిస్థితి ఇవాళ ఉంది. కులం హిందూ సమాజానికి ప్రాధమిక యూనిట్‌. ఎవరికైనా ఇష్టం లేకపోతే మతం మార్చుకోగరు. కానీ కులాన్ని మాత్రం మార్చుకోలేరు అంబేద్కర్‌కి కులం ఉంది కాబట్టి అతడు బౌద్ధుడే అయినా రామ్‌జీ అంబేద్కర్‌ అయి హిందూ నాయకుల పక్కన ఉంటాడు. భగత్‌సింగ్‌ నాస్తికుడు సోషలిస్టు. అయినా జాట్‌ కాబట్టి అతడు దేశభక్తికి ప్రతీక అయి హిందూ నాయకుడు అవుతాడు. పురాణాలనీ, పురాణ దేవతల్నీ తూర్పారపట్టిన జోతిబా పూలేకి మాలి కులం ఉంది. కాబట్టి అతడు శూద్ర కుల నాయకుడిగా హిందూ నాయకుడౌతాడు. తనను ఖండించి, తనని నిర్మూలించాలని అలుపులేని పోరాటం చేసిన ప్రతివ్యక్తీ తమకున్న కులం కారణంగా హిందూత్వంలో కలిసిపోతారు. హిందూమతం కలిపేసుకుంటుంది. మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టిన అంబేద్కర్ని ఆధునిక మనువు అనగలుగు తుంది. కులం అస్తిత్వం బలపడుతున్న కొద్దీ హిందూ మతం కుల అణచివేతా బలపడుతూ ఉండడం చరిత్ర పొడుగునా మనకి కనిపిస్తుంది. పాశ్చాత్య సమాజాలలో మతం మత్తుమందు అయితే భారత సమాజంలో కులం మత్తుమందు.

హిందూ కాలం లేక యుగం కూడా విచిత్రంగా ఉంటుంది. కృత,త్రేతా,
ద్వాపర,కలి యుగాలంటూ విభజన ఉంటుంది. ధర్మం నాలుగు పాదాలా నడవడం లాంటి భాష ఉంటుంది. ధర్మం అంటే మనిషి తన విధి తాను నిర్వర్తించడం అని అర్ధం చేసుకున్నా మనిషి విధిగా తన కుల ధర్మాన్ని పాటించాలి. ఎటువంటి ప్రశ్నాలేకుండా వినయంగా తన కులాన్ని తాను మోసుకు తిరగడమే ధర్మం. ఇది ఖచ్చితంగా అమలు జరిగిన యుగాలు ముందు యుగాలు. మనలో చాలా మందికి ʹగతకాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌ ʹఅనే భావన బలంగా ఉంటుంది. పూర్వం అంతా బాగుండేదని యిప్పుడు చెడిపోయిందనీ కాబట్టి మళ్ళీ పాతకాలంలో కి పోవాలనీ తెగ కలలు కంటారు.
కులమూ,మతమూ,సంప్రదాయమూ చట్టానికి అతీతంగా ఉండాని కోరుకుం టారు. మొత్తంగా అగ్రకులాధిపత్య ఫ్యూడల్‌ సమాజాన్ని మళ్ళీ తీసుకురావాని కల కనడమే ఇది. ఇలాంటి దానికోసమే చాలా సంస్థలు హింసాత్మకంగా పనిచేస్తున్నాయి. రూపంలో భారతీయులు ఆలోచనల్లో ఆంగ్లేయుల్నీ తయారు చేయానుకున్నాడు మెకాలె. ఇప్పుడు రూపంలో ఆధునికులు ఆలోచనల్లో పురాతనులు తయారయ్యారు.రాజకీయ ఉద్యమాల్లో సంస్కరణకి సంబంధించిన కార్యక్రమాలూ, ఆ భావాలూ లేకపోవడం చాలా అనర్థాలకి కారణం. కమ్యూనిస్టు రాజకీయాలో సైతం ప్రముఖంగా లేదు. దీని వల్ల మతోన్మాద కులోన్మాద భావజాలం అడ్డూ అదుపూలేకుండా రాజకీయాలోకి చేరి ఈవేళ అందరూ అదే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
-ప్రభు
(ప్రజా కాంక్ష పత్రికలో వచ్చిన వ్యాసం)

Keywords : india, ambedkar, phule, Buddhism, communism
(2019-11-13 06:56:32)No. of visitors : 419

Suggested Posts


0 results

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


సంస్కరణలు-ప్రజాస్వామ్యం