రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !


రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !

రైతు

నల్లమడ రైతు సంఘం సభ్యులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రాసిన ఈ వ్యాసం జూన్, 2019 వీక్షణం సంచికలో ప్ర‌చురించబడినది

గుజరాత్‌ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ రైతులపై రణానికి సిద్ధమయింది. అదేమంటే పేటెంట్‌ చట్టం అంటున్నది.ʹపెప్సికో ఇండియా హోల్డింగ్‌ ఎఫ్‌ ఎల్‌ 2027ʹ అని పిలవబడే బంగాళదుంప రకాలను పేటెంట్‌ చట్టం కింద నమోదు చేసుకున్నాం కాబట్టి తన అనుమతి లైసెన్సు లేకుండా ఎవరూ పండించడానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ బంగాళా దుంపలను ప్రత్యేకంగా ʹలేʹ అనే పేరున చిప్స్‌ తయారీకి పెప్సీ కంపెనీ వాడుకుంటున్నది.

ఈ చిప్స్‌ను ప్రత్యేక రకానికి చెందిన బంగాళాదుంపలతో తయారు చేస్తామని ఆ కంపెనీ చెబుతోంది. మేథోసంపత్తి హక్కుల వలన, డబ్ల్యుటిఓ ఒప్పందం వలన, పేటెంట్‌ చట్టం వలన తమకు మాత్రమే బంగాళా దుంపలపై హక్కులు ఉన్నాయని పెప్సీకో వాదిస్తోంది. ప్రైవేటు డిటెక్టివులను నియమించి రైతుల పంటల పై రహస్యంగా గూఢచారి చర్యలు జరిపింది. బంగాళాదుంపలను పండించే రైతుల వివరాలు సేకరించి 2018 నుండి కేసులు పెడుతున్న సంగతి అందరికీ తెలియదు. ఎందుకనో మీడియా తగిన ప్రచారం ఇవ్వలేదు.ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో పెప్సీ కంపెనీ రైతులపై వేసిన కేసులు బహుళ ప్రచారం పొందాయి.

నలుగురు రైతులు ఎఫ్‌.ఎల్‌ 2027 అని పిలవబడే బంగాళాదుంప రకాలను లైసెన్సు లేకుండా పండించడం, పెప్సీ కంపెనీ హక్కులను ఉల్లంఘించటమనీ, చట్ట విరుద్ధమనీ గుజరాత్‌లో అహమ్మదాబాద్‌ వాణిజ్య కోర్టులో రైతులపై కేసులను నమోదు చేసింది. కంపెనీ హక్కులను ఉల్లంఘించినందుకుగాను, ఒక్కొక రైతు ఒక కోటి ఐదు లక్షల రూపాయలను నష్టపరిహారంగా కంపెనీకి చెల్లించాలని కేసులో పేర్కొన్నారు. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది.

తమ సొంతమైన బంగాళాదుంప పంటను ఆ రైతులు వేశారట! నిజానికి బంగాళాదుంపలు ఆదిమకాలం నుంచి పండిస్తున్నారు. వీటిని పెప్సీ కంపెనీ కనిపెట్టలేదు. కానీ, ఉన్న బంగాళదుంపకు జెనెటిక్‌గా కొద్దిగా మార్పులు చేసింది. పేటెంట్‌ హక్కులు పొందింది. హక్కులు పొందిన విధానం వక్రమే కాదు, నేరం కూడా. పంటలోని ఒక బంగాళాదుంప లోని ఒక కణం లో కొద్దిగా మార్పు చేస్తేనే పెప్సీకో హక్కులు పొందితే, తరతరాలుగా ఆ పంటల్ని పండిస్తున్న వారికి ఇంకా ఎన్ని హక్కులు ఉండాలి? అయినా పెప్సీ కంపెనీ మాత్రం అంతర్జాతీయంగా కుదుర్చుకున్న డబ్ల్యుటిఒ, ట్రిప్స్‌, పేటెంట్‌ చట్టాలను, ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపిస్తున్నది. తామే ఈ బంగాళా దుంపలను సృష్టించామని దబాయిస్తున్నారు. పండించిన ప్రతి రైతూ ప్రతి సంవత్సరం తనకు కప్పాన్ని రాయల్టీగా చెల్లించాలంటున్నారు.

ఈ రైతులందరూ 3-4 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న చిన్న రైతులు. 2009 నుండి తమ పంటలో వచ్చిన మంచి విత్తనాలను దాచుకుని, ఆ విత్తనాలను నాటుకుని పంటను పండించుకుంటూ ఉండగా, ప్రైవేటు డిటెక్టివులు పంటను కొనే దళారీల వేషంలో వచ్చి శాంపుల్స్‌ తీసుకున్నారు. రహస్యంగా వీడియోలు చిత్రీకరించి అహమ్మదాబాద్‌ వాణిజ్య కోర్టులో కేసును ఫైల్‌ చేశారు. తమ కంపెనీ తయారు చేస్తున్న ʹలేస్‌ʹ బ్రాండ్‌ చిప్స్‌ను ఏ బంగాళా దుంపలతో అయితే తయారు చేస్తారో అలాంటి రకం బంగాళాదుంపలను ఈ రైతులు సాగు చేస్తున్నారని, వాటిని సాగు చేసే హక్కు తమకు మాత్రమే ఉందని పెప్సీకో వాదన.బనస్కాంత, సబర్‌కాంత, అరవల్లి జిల్లాలలోని తొమ్మిదిమంది రైతులపై మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో అయిదుగురు రైతులపై 2018 లోనే కేసులు పెట్టారు. అయితే 2018 లోనే కేసులు పెట్టినా వెలుగులోకి రాలేదు. సోషల్‌ మీడియా, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ప్రభావం వలన 2019 లో మొత్తం కేసులన్నీ భారత ప్రజల దృష్టికి వచ్చాయి.

ఎక్స్‌ పార్టీ డిక్రీ

ఏప్రిల్‌ 8న అలహాబాదు సిటీ సివిల్‌ వాణిజ్య కోర్టు జడ్జి మూల్చంద్‌ త్యాగి రైతులు కోర్టులో లేకుండానే, రైతులను విచారించకుండానే, రైతుల తరఫున లాయర్‌ లేకుండానే పెప్సీ కంపెనీకి అనుకూలంగా ఎక్స్‌ పార్టీ డిక్రీ ఇచ్చారు. కంపెనీ వాదనలకు పివిపి యాక్ట్‌ సెక్షన్‌ 64, 65 ప్రకారం ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే కంపెనీకి పూడ్చలేనంత నష్టం జరుగుతుందన్నారు. మధ్యంతర ఉత్తర్వుల అమలుకు కమిషనర్‌ను నియమించి, శాంపుల్స్‌ తీసి లాబొరెటరీకి పంపమన్నారు. కమిషనర్‌కు పోలీసు రక్షణను కూడా కల్పించారు. ఈ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.

ఎక్కడిదీ పెప్సీ కంపెనీ?

1965 లో రెండు కంపెనీల కలయికతో అమెరికాలో పెప్సీ కంపెనీ ఏర్పడింది. కాలక్రమంలో అనేక కంపెనీలను మింగేసి ఈనాటికి ఈ అవతారం ఎత్తింది. సోవియట్‌ యూనియన్‌లో కృశ్చేవ్‌ అధికారానికి వచ్చిన తరువాత అమెరికాతో దోస్తీ పెరిగింది. 1959లో అమెరికాలోని న్యూయార్క్‌
నగరంలో సోవియట్‌ సంస్కృతి-టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ ను ఏర్పాటు చేశారు. రష్యాలోని మాస్కో పట్టణంలో వెంటనే ఏర్పాటు చేసిన అమెరికా ఎగ్జిబిషన్‌కు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌, సోవియట్‌ ప్రధాని నికిటా కృశ్చేవ్‌లు హాజరయ్యారు. పెప్సీ కూల్‌ డ్రింకులను చప్పరిస్తూ సరదాగా మాట్లాడుకుంటున్న రెండు వ్యతిరేక వ్యవస్థల అగ్ర నాయకుల ఫొటోలు సోవియట్‌లో విపరీతంగా ప్రచారమయ్యాయి. ఆ దెబ్బతో సోవియట్‌ కూల్‌ డ్రింకుల కంపెనీలన్నీ దివాళా తీసి, తమ కంపెనీలను పెప్సీ కంపెనీకే అమ్ముకున్నాయి.

అలాగే రుమేనియా అధ్యక్షుడు సెసెక్యూస్‌తో ఫొటోలు దిగి 1966లో రుమేనియా కూల్‌ డ్రింకుల కంపెనీలన్నీ దివాళా తీయించి, తనలో కలుపుకుంది. ఇపుడు, అరబ్‌ దేశాలు పెప్సీ కూల్‌డ్రింకులకు పెద్ద మార్కెట్‌. ఇజ్రాయల్‌ దేశస్థులు పెప్సీ కూల్‌ డ్రింకులను తాగితే, బద్ధ వైరం
ఉన్న అరబ్‌ ప్రజలు పెప్సీని తాగరేమోనని 1991 వరకూ ఆ దేశాలలో పెప్సీ ఉత్పత్తులను ప్రవేశపెట్టనే లేదు.కారప్పూస, మురుకులు, బూందీ, బికనీర్‌ భుజియా, ద్రాక్ష, సుగంధ పాలు, ఆరంజి, నిమ్మకాయ సోడా, గోలీ సోడాలను మింగేసింది.

ఎత్తైనకొండ ప్రాంతంలోనైనా, కాకులు దూరని కారడవిలోనైనా పెప్సీ కూల్‌ డ్రింక్స్‌, కురుకురేలు, చిప్స్‌ దొరకని ప్రదేశం లేదు. విపరీతమైన అడ్వర్‌టైజ్మెంట్లతో, చిల్లరకొట్ల వ్యాపారులకు అధిక కమీషన్‌లతో ప్రజలను ఆకట్టుకుని, రంగు నీళ్లు, చిరు తిళ్లు అమ్మి ప్రజల జేబులను కొల్లకొడుతున్న కంపెనీలలో పెప్సీ కంపెనీ ముందుభాగాన ఉన్నది. ఇంట్లో వండుకుని తినే చిరుతిళ్ల అలవాటును మెల్లగా తప్పిస్తున్నారు. తెలుగు ప్రజల కారప్పూస, మురుకులు, బూందీ, పకోడీలు మాయమౌతున్నాయి. రాజస్థాన్‌లో ప్రజలు ఇష్టంగా తినే బికనీర్‌ భుజియాను కురుకురే బికనీర్‌ భుజియాని అని అందమైన ప్లాస్టిక్‌ పొట్లాలలో పెట్టి మారుమూల గ్రామాలకు కూడా అందిస్తున్నది.

ఒక్క బికనీర్‌ భుజియా పెప్సీ కంపెనీ సొంతం కావడం వలన, బికనీర్‌లో 50 వేల మంది మహిళల జీవనోపాధి నాశనమయింది. ʹకురుకురే మురుకులుʹ తెలుగు ప్రజలకు అందుబాటులో లేని ప్రదేశమేలేదు. ఈ విధంగా రంగునీళ్లు, చిరుతిళ్లు అమ్మి తన వ్యాపార సామ్రాజ్యాన్ని 200 దేశాలకు వ్యాపింపచేసి లక్షల కోట్లను సంపాదిస్తున్నది. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న అతిపెద్ద ఆహార పానీయాల సంస్థ. చిరుతిళ్లు, కూల్‌ డ్రింక్సు తయారుచేసే కంపెనీలలో పెప్సీ కంపెనీ అతి పెద్దది. అమెరికా దేశంలోని న్యూయార్క్‌ నుండి 200 దేశాలలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. మన దేశంలో 1989 నుండి వ్యాపారాన్ని కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటూ పోతున్నది.

గత సంవత్సరం మన దేశం నుంచి పొందిన ఆదాయం 4.52 లక్షల కోట్ల రూపాయలు. మూడుచోట్ల చిరుతిళ్లు తయారుచేసే ఆహార ఫ్యాక్టరీలు, 38 చోట్ల కూల్‌ డ్రింక్సు తయారుచేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశంలో 12 రాష్ట్రాలలో 24,000 వేల మంది రైతులకు లైసెన్సుపై బంగాళాదుంప విత్తనాలను అమ్మి, పెప్సీ కంపెనీ కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్నది.ఆ సంస్థ గుజరాత్‌లోని తొమ్మిది మంది రైతులపై కేసులు పెట్టింది. వీరందరూ మూడు, నాలుగు ఎకరాలున్న రైతులే. వీరి వల్ల కానీ.. వీరు వేసే పంట వల్ల కానీ.. పెప్సీకో ఆర్థిక ప్రయోజనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఒకేళ ఉందనుకున్నా ఆ నష్టం నామమాత్రమే. అదే సమయంలో ఈ సామాన్య రైతులు ఓ మల్టినేషనల్‌ కంపెనీపై.. న్యాయపోరాటం చేయడం సాధ్యమా? పెప్సీ కంపెనీ భారతీయ కంపెనీ కాదు. అయినప్పటికీ మన దేశంలో మన రైతులపై దావా వేయడం ఏమిటి? అహ్మదాబాద్‌లో దాఖలైన ఈ పిటిషన్‌పై అక్కడి కోర్టు కూడా పెప్సీ కంపెనీకి అనుకూలంగా స్పందించింది.

రైతుల, దేశభక్తుల ఆగ్రహం

దేశంలోని రైతు సంఘాలు వెంటనే స్పందించాయి. రైతులపై కేసులను వెంటనే రద్దు చేయాలన్నారు. ముఖ్య పట్టణాలలో ప్రదర్శనలు చేశారు. పెప్సీ కంపెనీల ముందు ధర్నాలు చేశారు. పెప్సీ కంపెనీ ఉత్పత్తులైన లే చిప్స్‌, కురుకురే పొట్లాలను గుట్టబోసి తగలపెట్టి తమ కోపాన్ని ప్రదర్శంచారు. 2009 నుండి సాగు చేసుకుంటున్న బంగాళాదుంపలపై 2016లో పేటెంట్‌ ఏమిటని ప్రశ్నించారు. భారత దేశరైతులను భయపెట్టి, బెదిరించి లొంగదీసుకోవడానికి కంపెనీ నాటకమని అన్నారు. పెప్సీ కంపెనీ చిరుతిళ్లను, కూల్‌ డ్రింకులను బహిష్కరించాలని పిలుపిచ్చారు.

గుజరాత్‌లోని రైతు సంఘాలు. మేధావులు, సభ్యసమాజ నాయకులు, సంఘసేవకులు, హక్కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, లాయర్ల సంఘాలు ఆగ్రహించారు.అహ్మదాబాద్‌ పట్టణంలో 200 మంది రైతు నాయకులు, మేధావులు, ఒకచోట చేరి మీటింగు పెట్టుకున్నారు. రైతులకు అండగా నిలబడ్డారు. సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విత్తన హక్కులను రక్షించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే జోక్యం చేసుకుని రైతులపై అబద్ధపు కేసులను ఎత్తివేయించమని ప్లాంట్‌ వెరైటీ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మర్‌ రైట్స్‌ సంస్థ ఛైర్‌పర్సన్‌ డా కె వి ప్రభు, రిజిస్ట్రార్‌ డా ఆర్‌.సి. అగర్వాల్‌కు, కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్‌ సింగ్‌కు మెమొరాండాలను పంపారు.
రైతులకు, జిల్లా వ్యవసాయ అధికారికి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు అనుమతి లేకుండా రైతుల పొలాలలోనికి వెళ్లరాదని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జతన్‌ ట్రస్ట్‌ నాయకుడు కపిల షా కన్వీనర్‌గా అందరూ ఐక్యమై పెప్సీ కంపెనీకి హెచ్చరిక జారీచేశారు. కేసులను రద్దు చేయకపోతే పెప్సీ కంపెనీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.చట్టపరంగా కూడా రైతుకు విత్తనంపై సంపూర్ణ హక్కులున్నాయి. ప్లాంట్‌ వెరైటీ ప్రొటెక్షన్‌ చట్టం సెక్షన్‌ 39 ప్రకారం, (పివిపి ఆక్ట్‌ సెక్షన్‌ 39) రైతులకు పంట విత్తనాలపైకొన్ని ప్రత్యేకమైన హక్కులున్నాయి. బ్రాండెడ్‌ విత్తనాలు అమ్మనంతకాలం, ఏ విత్తనాలనైనా రైతులు సాగుచేసు కోవటానికీ, ఇతరులతో పంచుకోవటానికీ, ఇతరులకు అమ్ముకోవడానికి అవకాశం ఉంది.

పంటలో తీసిన విత్తనం నాదే

పెప్సీ, మోన్‌సాంటో, బేయర్‌ లాటి బడా బడా కంపెనీల విత్తన వ్యాపారం లోకి రాక పూర్వం రైతులు విత్తనాలు తయారు చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి ప్రపంచంలో ఎక్కడా ఏవిధమైన అడ్డంకులూ లేవు. విత్తన కంపెనీలు బలోపేతమై, ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగిన తరువాత, తమకు అనుకూలమైన చట్టాలను చేయించుకుని, రైతుల పొట్టలను కొట్టి లెక్కలేనంత సంపదను పొందుతున్నారు. ʹపంటలో తీసిన విత్తనం నాదేʹ అని ప్రపంచ వ్యాప్తంగా రైతులు తిరగబడుతున్నారు. పంట నుండి విత్తనాన్ని తయారు చేసుకునే హక్కును
నిలబెట్టుకుంటున్నారు.

రాజీ ప్రతిపాదనలు

గుజరాత్‌ బంగాళాదుంప రైతులకు వ్యతిరేకంగా నడుస్తున్న కేసును పరిష్కరించుకునేందుకు కంపెనీ 26న రాజీ ప్రతిపాదనలు చేసింది. రైతులు, లేస్‌ చిప్స్‌లో ఉపయోగించే రిజిస్టర్డ్‌ బంగాళాదుంప రకం సాగుచేయకుండా కట్టడి చేయడానికి పెప్సికంపెనీ కొత్త ఎత్తు వేసింది. కేసులను పరిష్కరించుకునేందుకు రైతులకు కంపెనీ ఇచ్చిన గొప్ప అవకాశంగా పెప్సీ చెప్పుకున్నది. అహ్మదాబాద్‌ కోర్టులో, పెప్సికో న్యాయవాది ఈ కేసుకు పరిష్కారంగా 3 షరతులను ప్రతిపాదించాడు.

1) రైతులు తమ రిజిస్టర్డ్‌ రకాన్ని బంగాళాదుంపల వెరైటీని ఉపయోగించరాదు. 2) రైతులు వారి ప్రస్తుత స్టాకును నాశనం చేయాలి. 3) పెప్సికో వ్యవసాయ గ్రూపులలో చేరి కంపెనీకి సంబంధించిన నిబంధనలను పాటించాలి.రైతుల న్యాయవాది యాగ్నిక్‌ పెప్సీ ప్రతిపాదనను పరిశీలించడానికి సమయం కావాలని, కోర్టుకు చెప్పారు. తదుపరి విచారణ జూన్‌ 12కు వాయిదా వేశారు.

రైతుల హక్కుల చట్టం, 2001

పెప్సికో దావా వేయడానికి, ప్లాంట్‌ రకాలు, రైతుల హక్కుల (పిపివి & ఎఫ్‌ఆర్‌) చట్టం, 2001 లోని సెక్షన్‌ 64 ను ఉపయోగించారు.రైతులు అదే చట్టం సెక్షన్‌ 39 ను ఉదహరించారు. ʹతన వ్యవసాయ ఉత్పత్తికి విత్తనాలను దాచుకోవడం, వాడడం, విత్తనాలను నాటడం, తిరిగి నాటడం, మార్చుకోవడం, పంచుకోవడం లేదా విక్రయించడాన్ని, ఈ చట్టం కింద రైతు రక్షించబడతాడు. ఈ చట్టం అమలులోకి రాకముందు లాగానే రైతు హక్కులన్నీ ఉంటాయి. అయితే ఈ చట్టం కింద రక్షించబడిన ʹబ్రాండ్‌ సీడ్‌ʹ విక్రయించకూడదు.

దేశంలోని రైతుల పైన, పంటలపైన, ఆదాయాలపైన, ఆహారభద్రత పైన, వ్యవసాయ స్వాతంత్య్రంపైన, దేశ సార్వభౌమాధికారంపైన ఈ కేసు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని ʹది హిందూʹ, ʹవైర్‌ʹ, వామపక్ష పత్రికలు ప్రజలను అప్రమత్తం చేశాయి.భారతదేశంలో రైతులకు వ్యతిరేకంగా ఈ కేసులో తప్పుగా నిర్ణయిస్తే రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం ఉండడమే కాకుండా ఒక తప్పుడు సంప్రదాయం అనవాయితిగా ఏర్పడుతుంది. బడా బహుళజాతి సంస్థలు విజృంభిస్తాయి. రైతులపై స్వారీ చేస్తాయి. ఇది ఒక పరీక్షా కేసు. రైతులు, రైతు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా వుండి రానున్న
ప్రమాదాన్ని నివారించాలని వామపక్ష పార్టీలు, పత్రికలు పిలుపునిచ్చాయి.

కేసుల ఉపసంహరణ- రైతుల విజయం

పంటకు మూలమైన విత్తనంపై సహజసిద్ధంగావున్న రైతుల హక్కులను రక్షించటానికి యావత్‌ భారతదేశం మెరుపువేగంతో స్పందించింది. ప్రజల స్పందన, ప్రజలు ఆందోళనలకు సిద్ధంకావడం పెప్సీకంపెనీకి వణుకు పుట్టించింది. కోర్టులలో లిటిగేషన్‌ లాయర్ల సహాయ సహకారాలతో
రైతులను భయపెట్టి కోర్టువెలుపల సెటిల్‌మెంట్‌ చేసుకోవడం బహుళజాతి కంపెనీలకు అలవాటే. రైతులపై కేసులను రద్దు చేసుకోవడం బహుళజాతి కంపెనీలకు ఒక కొత్త అనుభవం.

దీర్ఘకాల విషయాలను ప్రభుత్వంతో చర్చించామని కంపెనీ చెప్తున్నా ప్రభుత్వ వర్గాలు నోరు విప్పలేదు.రైతుల హక్కులను రక్షించడానికి భారత ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత వహించకపోవడాన్ని గమనించాలి. భారతదేశ ప్రభుత్వం రైతుల విత్తనస్వేచ్ఛలపైనా, చట్టపరమైన పరిస్థితిపైనా నిశ్శబ్దాన్ని కొనసాగించింది. ఎన్నికల రంగం మధ్యలో ఉండడం వలన భారతీయ జనతా పార్టీ నాయకత్వాన ఉన్న ప్రభుత్వం పబ్లిక్‌గా పెప్సీ కంపెనీ అనుకూల వైఖరి తీసుకోలేకపోయింది. లోపాయికారీగా పెప్సీ కంపెనీకి కేసులను రద్దు చేసుకోమని సలహా ఇచ్చిందనే ప్రచారం కూడా వుంది. పెప్సీ ఉత్పత్తులను కొనవద్దు అనే బాయ్‌కాట్‌ పిలుపు వలన కంపెనీ కూల్‌ డ్రింకులు, చిప్స్‌ అమ్మకాలు తగ్గుతాయేమోనని పెప్సీ కంపెనీకి భయం కలిగింది, కాబట్టి కేసులను రద్దు చేసుకొనివుండవచ్చు. భారతదేశంలోని రైతులు, రైతుసంఘాలు ఐక్యంగా రోడ్‌ మీదకు రావడం వలన పెప్సీకంపెనీకి తిరుగులేని దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా మరొక దెబ్బ తీసింది.

మదించిన ఏనుగులాంటి పెప్సీ కంపెనీ

ఏది ఏమైనప్పటికీ, మే 10, 2019: న అహ్మదాబాద్‌ లోని వాణిజ్య న్యాయస్థానంలో నలుగురు గుజరాత్‌ బంగాళాదుంప రైతులపైనా, మాడాసా జిల్లా కోర్టులో ఐదుగురు రైతులకు వ్యతిరేకంగా పెట్టిన కేసులనన్నిటినీ పెప్సికో ఇండియా కంపెనీ రద్దు చేసుకున్నది. ఏప్రిల్‌ 2019 లో సబర్కాంత జిల్లా రైతులపై దాఖలు చేసిన 4 సూట్ల రద్దుకు కూడా కంపెనీ దరఖాస్తు చేసింది. దావాలు ఉపసంహరించు కోవడం బహుళజాతి సంస్థలకు ఒక కొత్త పాఠం.

మదించిన ఏనుగులాంటి పెప్సీ కంపెనీని రైతులు అంకుశంతో అదిలించడం, ఒక్క అడుగయినా వెనక్కు వేయించడం రైతులకు తాత్కాలిక విజయం. అమెరికాలో మోన్‌సాంటో కంపెనీ రైతులపై పెట్టిన 700 కేసులను కోర్టు వెలుపలనే సెటిల్మెంటు చేసుకున్నది. అపరాధ రుసుమును వసూలు చేసుకున్నది. కానీ కేసులను రద్దు చేసుకోలేదు. రైతులపై కేసులను రద్దు చేసుకోవడం కంపెనీకి ఒక కొత్త అనుభవం. ఈ విజయం వలన పోరాటం, ప్రచారం ముగిసిందని అర్థం కాదు. యుద్ధంలో సగం మాత్రమే విజయం లభించింది.

ఫైనాన్స్‌ కేపిటల్‌ ఒక్క అడుగే వెనక్కుతగ్గింది.అయితే బహుళజాతి కంపెనీలు ముఖ్యంగా రైతుతో వివాదాలలో ప్రపంచంలో ఎక్కడా వెనక్కు తగ్గడంలేదు. ఒంటి కాలు మీద లేచి కోర్టు కేసులు పెట్టి భయపెట్టి కోర్టు వెలుపల సెటిల్మెంటు చేసుకుని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. సెటిల్మెంటుకి రాని రైతులను కోర్టుల చుట్టూ తిప్పటం మామూలయింది.ఇపుడు బేయర్‌ కంపెనీగా మారిన మోన్‌సాంటో కంపెనీ ఒక్క పేటెంట్‌ కేసులో కూడా ఓడిపోలేదు. ప్రభుత్వాలు, కోర్టులు కంపెనీలకు అనుకూలంగానే ఉండటం ఒక చారిత్రక సత్యం. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనా మార్గం చేపట్టినపుడే న్యాయం గెలుస్తుంది.

వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న సబర్కాంతా, అరావళి, బనస్కాంతా రైతులకు వ్యతిరేకంగా దావాలను వెనక్కి తీసుకున్న మొదటి ఉదాహరణ ఇదే. బహుళజాతి కంపెనీ తన చట్టపరమైన దావాలను ఉపసంహరించుకోవటం చాలా అరుదు అని రైతుల న్యాయవాది ఆనంద్‌ యాగ్నిక్‌ అభిప్రాయపడ్డారు. అది కూడా పేద రైతులపై కొంతకాలం కోర్టులో కేసు నడిపించిన తర్వాత ఉపసంహరించుకోవడం ప్రపంచంలోనే అరుదు అన్న విషయాన్ని రైతు కార్యకర్తలు గమనించాలి. ఈ ఉపసంహరణతో, రైతులను భయపెట్టాలన్న, పెప్సికో దుష్ట ప్రయత్నం ప్రస్తుతానికి ముగిసింది.ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఏర్పడిన తరువాత భారతదేశంలో మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులలో గుజరాత్‌ కేసులే ప్రథమం.ప్రపంచంలోనే బలవంతమైన పెప్సీ కంపెనీ రైతులపై కేసులను రద్దు చేయడం రైతులకు, రైతు కార్యకర్తలకు, రైతు సంఘాలకు, దేశభక్తులకు, ఎంఎన్‌సి వ్యతిరేక పోరాటానికి గొప్ప విజయం. ఎందుకంటే భారతదేశంలోని రైతుల హక్కులు, ప్రయోజనాలు. బహుళజాతి సంస్థల హక్కుల కంటే చాలా ఉన్నతమైనవిగా ప్రజలు పరిగణించారు.అయితే ఈ విజయం తాత్కాలికమే. భారతీయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫైనాన్స్‌ కేపిటల్‌ ఊరకుండిపోదు. మరో దెబ్బకు రెడీ అవుతుంది. ప్రజలు మరో విజయానికి రెడీ కావాలి.

- డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం సభ్యులు

Keywords : pepsico, gujarat, farmers, court,
(2020-07-02 19:40:15)No. of visitors : 468

Suggested Posts


0 results

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


రైతు