దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి


దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి

దప్పికగొన్న

(విప్లవరచయితల సంఘం సభులు పి.వరలక్ష్మి రాసిన ఈ వ్యాసం అరుణతార జూన్ సంచికలో ప్రచురితమైనది)

మనుషులు జీవించడానికి నీరు అత్యవసరం. మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు, మొక్కలకు జీవకోటి సమస్తానికి నీరు ప్రాణాధారం. అసలు జీవి ఆవిర్భావం జరిగిందే నీటిలో. ఇవాళ భూగ్రహమంతా విస్తరించిన కోట్లాది జీవరాశుల మూలం నీటిలో ఉంది. అందుకే జీవరాశుల (జంతువులు, మొక్కలు) శరీరాల్లో 60 నుండి 65 శాతం నీరే ఉంటుంది. అంతెందుకు, మొత్తం భూమి ఉపరితలాన్ని 71 శాతం నీళ్లే కప్పివేస్తున్నాయి. అంతరిక్షం నుండి చూస్తే నీలి వర్ణంలో కనపడే భూమిని బ్లూ ప్లానెట్‌ (నీలి గ్రహం) అంటారు. భూమి అస్తిత్వం, ప్రాణుల ఉనికి నీరు వలన, నీరు తోటి అని చెప్తే అతిశయోక్తి కాదు. సుమారుగా జీవక్రియలన్నీ శరీరంలో ఉన్న నీటి మాధ్యమంలోనే జరుగుతాయి. నీళ్లెక్కువ తాగండి అంటారు కదా, ఇందుకే. మానవ నాగరికతా వికాసమంతా నదీ తీరాల వెంటే, నీటి ఆవాసాల పక్కనేనని మనకు తెలుసు. వ్యవసాయం, పరిశ్రమలు విస్తరించేకొద్దీ నీటి అవసరాలు పెరుగుతూ వచ్చాయి. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గిపోయి నీరు ప్రియం అవుతూ వస్తున్న విషయం మన అనుభవంలో ఉన్నదే. ఒక ఆందోళనతో కూడిన ప్రశ్న ఏమిటంటే నిజంగా భూమ్మీద నీళ్లు తరిగిపోతున్నాయా? ఈ ప్రాణాధారమైన ప్రాకృతిక వనరు ఇప్పుడు క్షీణిస్తున్నదా? నీటితో ముడిపడిన భూమి అస్తిత్వం ఏమవుతుంది?

మనం నీటి కరువు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ భూమ్మీద నలుదిక్కులా నీరే. అయితే వాటిలో 97 శాతం ఉప్పు నీరు. మనకు పనికిరాదు కానీ సముద్ర జీవులకు అవి ఆధారం. ఉన్న మూడు శాతం మంచినీటిలో అత్యధికభాగం మంచు రూపంలో గడ్డకట్టుకొని ఉండడంతో, చివరికి మనం (మనతో పాటి సముద్రం బయట నివశిస్తున్న జీవరాశులు) ఉపయోగించగలిగేది 0.3 శాతం మాత్రమే.1 అనాదిగా నదులు, సరస్సులు, కాలువలు వంటి ఉపరితల నీటి ప్రవాహం సులువుగా అందుబాటులో ఉండి ప్రజల నీటి అవసరాలను ఎక్కువగా తీరుస్తుంది, కానీ రోజురోజుకూ ఈ నీరు కలుషితమైపోవడం వల్ల భూగర్భ జల వినియోగం పెరిగిపోతున్నది. ఈ విషయాల్లోకి తర్వాత వద్దాం. ముందుగా మనం మంచినీరుగా వ్యవహరించే ఉపరితల, భూగర్భ జలాలు ఎక్కడి నుండి వస్తాయో మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తుచేసుకుందాం.

జలచక్రం లేదా నీటిచక్రం (వాటర్‌ సైకిల్‌) వాతావరణంలో నిరంతరం చలనంలో ఉంటుంది. వర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయి. నీటి ప్రవాహాలు నదుల్లో కలిసి, నదులు సముద్రాలలోకి, మహా సముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది. వేసవి కాలంలోని అధిక వేడిమివల్ల ఎక్కువ మొత్తంలో సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి నీరు ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది.2 జలచక్రంలో వివిధ ప్రక్రియల ద్వారా నీరు శుద్ధి అయిపోయి భూమ్మీద జీవరాశికి చేరడం నిజంగా ఒక అద్భుతం.

వాతావరణ మార్పు-అతివృష్టి, అనావృష్టి

భూమ్మీద నుండి ఆవిరైన నీరంతా సుమారుగా తిరిగి భూమ్మీదకు చేరాల్సిందే. చాలా తక్కువ ప్రమాణంలో అక్కడక్కడా వర్షం పడుతూండగానే గాలిలోనే ఆవిరైపోతుంది. ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. వర్షపాతం వాతావరణ స్థితిగతులను బట్టి, భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఒక్కోచోట అధికంగా, ఒక్కోచోట అల్పంగా ఉంటుంది. ఉదాహరణకు తేమతో కూడిన గాలులు వీచే దిశలో (రుతుపవనాలు సంభవించినప్పుడు) ఎత్తైన పర్వతాలు వాటిని అడ్డుకుంటే వర్షం కురుస్తుంది. అయితే గాలికి ఎదురుగా ఉన్న పర్వత పార్శ్వంలో వర్షపాతం ఎక్కువగా, వెనకవైపు తక్కువగా ఉంటుంది. భారతదేశంలో పశ్చిమ కనుమల పక్క భారీ వర్షం కురుస్తుండగా, వాటికి తూర్పు వైపు ఉన్న దక్కన్‌ పీఠభూమికి పశ్చిమ ప్రాంతాన అత్యల్ప వర్షపాతం కురుస్తుంది. ఒక ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి, తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది. వర్షం అన్ని చోట్ల ఒకేలా కురవనట్లే, వాతావరణ మార్పుల వల్ల కూడా అన్నిచోట్లా కరువులు రావు. వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపం (భూమి వేడెక్కడం) పెరగడం వల్ల వర్షపాతంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయనే విషయంపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. భూతాపానికి కారణం వాతావరణలోకి విడుదలవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌, క్లోరో ఫ్లోరో కార్బన్లు, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి వాయివులు. ఇవి సూర్యరశ్మిలోని ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను భూ ఉపరితలంపై పట్టి ఉంచి భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. మరోవైపు అడవుల నరికివేత, కొండలు, గుట్టలు తొలిచేయడం వల్ల మరింతగా భూమి సెగలు కక్కుతున్నది.

ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ వాతావరణంలో తేమశాతం పెరుగుతుంది. ఎందుకటే వేడి వాతావరణం ఎక్కువ తేమను పట్టి ఉంచుతుంది. ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే 7 శాతం నీటి ఆవిరి పెరుగుతుందని అంచనా. సాధారణంగా దీనివల్ల వర్షపాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇది అతివృష్టికి దారితీస్తుంది. మరో ప్రాంతంలో అనావృష్టి సంభవిస్తుంది. ఒక రకంగా తడి ప్రాంతాలు మరింత తడిగా, పొడి ప్రాంతాలు మరింత పొడిగా తయారవుతాయి. అటు వరదలు, ఇటు కరువులు ఎక్కువవుతాయన్న మాట.3 అంతే కాదు. ఏడాదిలో వర్షాలు కురిసే క్రమ పద్ధతి కూడా మారిపోతుంది. వర్షఋతువు పొడవునా పడాల్సిన వర్షం కొద్దిరోజులే నీళ్లు కుమ్మరించినట్లు పడి పోతుంది. తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఏడాదిలో సగటున ప్రపంచం మొత్తం మీద కురిసే వర్షంలో సగం కేవలం 12 రోజుల్లో కురుస్తోంది.4 ఈ తరహా అరాచక వర్షపాతం వల్ల వ్యవసాయం ఘోరంగా దెబ్బతింటోంది. తుఫానులు, వరదలు, కరువుల వంటి ప్రకృతి వైపరిత్యాలు తరచుగా దాడి చేస్తున్నాయి. 90 శాతం ప్రకృతి వైపరీత్యాలు నీటికి సంబంధించినవే.

అడుగంటుతున్న భూగర్భజలాలు

మామూలుగా భూగర్భ జలాలు ఉపరితల నీటి కన్నా 35-60 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఉపరితలంలో నీటి ప్రవాహం ఎలా ఉంటుందో, ఆక్విఫెర్‌ల రూపంలో నేల లోపల రాతి పొరల మధ్య మెల్లగా పారే నీటి ప్రవాహాలు ఉంటాయి. నేల మీది నీరు లోపలికి ఇంకినట్లుగానే భూగర్భ జలం పైకి ఉబికి వచ్చి ఉపరితల నీటి నిల్వల్లో లుస్తుంటుంది. ఇది జలచక్రంలా నిరంతర ప్రక్రియ. నీటి సమస్య ఎక్కువయ్యే కొద్దీ భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవాల ప్రపంచవ్యాప్తంగా 50 శాతం తాగునీటి అవసరాలు, 38 శాతం సాగునీటి అవసరాలు భూగర్భ జలాలు తీరుస్తున్నాయి. మొత్తం భూగర్భ జలాల వినియేగంలో వ్యవసాయం కోసం వాడుతున్నది సుమారు 70 శాతం. హరిత విప్లవం తర్వాత పంటలకు నీటి వినియోగం విపరీతంగా పెరగడం వల్ల వచ్చిన దుష్ఫలితం ఇది. వీటితో పాటు పరిశ్రమలు కూడా భూగర్భ జలాలను తోడేస్తున్నాయి. ఇది అంతకంతకూ పెరుగుతోంది. భారతదేశంలో భూగర్భ జలాల వినియోగం ప్రపంచంలోనే అత్యధికం. అది ఎంతగానంటే ఈ భూగోళపు నేల పొరల్లో ఉన్న మొత్తం నీటిలో సుమారు 24 శాతం ఇక్కడే తోడేస్తున్నారు. ఇందులో 90 శాతం వినియోగం వ్యవసాయం కోసమే. కేంద్ర భూగర్భజల మండలి అధ్యయనాల ప్రకారం 2007 నుండి 2017 మధ్య బావుల్లో నీటి నిలువలు 67 శాతం పడిపోయాయి. విపరీతంగా గనుల తవ్వకం, ఇష్టానుసారంగా నదీ ప్రాంతాల నుండి ఇసుక తరలించడం, చెరువుల వ్యవస్థ విచ్ఛిన్నం కావడం నేలలోపలి నీటి నిల్వలను హరించివేస్తున్నాయి. నేల మీద పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలు, సిమెంటు, తారు పూతల రోడ్లు, ఆవరణాలు వగైరాల వల్ల నీళ్లు భూమిలోపలికి ఇంకడం కూడా తగ్గిపోతున్నది. ఏ ప్రణాళికా లేని, ఉన్నా అమలు చేయని అస్తవ్యస్థ నీటి నిర్వహరణ పద్ధతుల వల్ల ఈ అమూల్యమైన జలసంపద ఎంత వేగంగా తరిగిపోతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా లేదు. ప్రకృతి పట్ల ప్రపంచంలోనే అత్యంత అమానుష వైఖరి బహుశా మన పాలకులదే.

ముంచుకొస్తున్న ఎడారీకరణ ముప్పు

భూగర్భ జలాలు అడుగంటి, తేమ లేక ఎండిపోయిన భూములు, పోషకాలు కోల్పోయి సారహీనమైపోయిన భూములు ఉత్పాదకతను కోల్పోతాయి. అటువంటి నేలల మీద మొక్కలు పెరగవు. నేల ఉత్పాదకత 10 శాతం తగ్గితే ఎడారీకరణ క్రమం మొదలైనట్లు. ఇది క్రమంగా పెరిగి నేల పూర్తి అనుత్పాదకంగా తయారవుతుంది. గాలి ఉధృతంగా వీచినా లేదా వరద వచ్చి నీటి ప్రవాహంలో భూమి పైపొర కొట్టుకుపోయినా నేల సారం కోల్పోతుంది. దీనిని భూక్షయం లేదా మృత్తికా క్షయం అంటారు. అడవుల నరికివేత, గనులు, క్వారీల తవ్వకాలు, పచ్చిక బయళ్ల తరుగుదల వల్ల భూక్షయం, ఎడారీకరణ పెరుగుతుంది. చెట్ల పెంపకానికి భూమి తగ్గిపోయే కొద్దీ ఎడారీకరణ పెరుగుతుంది. పచ్చదనంతో అలరారే నేలలు మృతభూముగా మారతాయి. ఇసుక మేటలు వేస్తుంది. ఒకసారి ఇసుక దిబ్బలు ఏర్పడితే వేడిగాలులు, ఈదురుగాలులు వీచి, ఇసుక కొట్టుకొచ్చి చుట్టుపక్కల భూముల్ని కూడా దెబ్బతీస్తాయి. అలా ఎడారీకరణ విస్తరించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో సుమారు 30 శాతం భూమి పాక్షికంగానో, పూర్తిగానో ఎడారీకరణ చెందిందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.5

2013 నాటికే ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.4 శాతం భూభాగం ఎడారీకరణ ముప్పులో ఉందని అధ్యయనాలు తెలిపాయి. ఎ.పి.లో అనంతపురం జిల్లా పరిస్థితి ఘోరంగా ఉంది. గత ఇరవై ఏళ్లలో 17 సంవత్సరాలు కరువులే. ఎడారీకరణలో ఆ తర్వాతి స్థానంలో కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలున్నాయి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో ఎడారీకరణ ముప్పు అధికంగా ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూడా ఈ ముప్పు ముంచుకోస్తోంది. 6

హంతక వ్యవస్థ వంటి నీటి కాలుష్యం

యుద్ధాలు, వివిధ హింసాత్మక ఘటనల్లో కన్నా ఎక్కువగా ప్రతి ఏటా కలుషిత నీటి వల్ల మనుషులు చనిపోతున్నారంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం తాగడానికి రక్షిత మంచి నీరు లేకపోవడం వల్ల ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారు. అపరిశుభ్ర నీళ్లు తాగడం వల్ల ప్రతి రోజూ అయిదేళ్లలోపు పిల్లలు 800 మంది దాకా చనిపోతున్నారు. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి తాగడానికి మంచి నీళ్లు లేవు. ఇక ఇండియాలో 80 శాతం ఉపరితల నీరు కలుషితమైపోయింది. జాతీయ నదిగా, పవిత్ర నదిగా పేరుపొందిన గంగ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనదిగా తయారైంది. తర్వాతి స్థానంలో యమునా నది ఉంది. దేశంలో 50 కోట్ల మంది గంగా తీరప్రాంతంలోనే, ఆ నది మీదనే ఆధారపడి నివసిస్తున్నారు. మోడీ ప్రభుత్వం 20వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా శుద్ధి ప్రాజెక్టు ఆ నదిని ఏమాత్రం బాగు చేయకపోగా కాలుష్యం మరింతగా పెరిగింది. కానీ శుద్ధి ప్రాజెక్టును ప్రైవేటువారికి అప్పగిస్తూ క్రమంగా నీటి వనరుల నిర్వహణ పేర నదులను కూడా ప్రైవేటీకరించే రహస్య ఎజెండా మాత్రం మెల్లగా అమలులోకి వస్తున్నది. దీని దగ్గరికి తర్వాత వద్దాం. పట్టణ ప్రాంతాల మురుగు నీరు, వ్యవసాయంలో వినియోగిస్తున్న ఎరువులు, పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వంటి ఘనవ్యర్థాలు నీటిలో కలవడం మూలంగా నీరు విషతుల్యమై జలచరాలు వేగంగా అంతరిస్తున్నాయి. మన దేశంలోనే ఉన్న విచిత్రమైన మతవిశ్వాసాల వల్ల పండుగలు, పుష్కరాలు నదులు, చెరువులు, కుంటలే కాక సముద్రాలను కూడా కలుషితమవుతున్నాయి. ఉదాహరణకు గంగానదిలో ప్రతిరోజూ 20 లక్షల మంది పవిత్ర స్నానం చేస్తారు. గంగానదిలో స్నానం సురక్షితం కాదని, అందులో బ్యాక్టీరియా అధికంగా ఉందని సిసియంబి (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ) శాస్త్రవేత్తలు ఇటీవలే సూచించారు. లక్షల కొద్దీ విగ్రహాలను ప్రతి ఏటా నిమజ్జనం పేర నీళ్లలో వేయడం వల్ల జరిగే కాలుష్యం అంతా ఇంతా కాదు.

మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే అనేక చోట్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. ఉపరితల నీటినైనా శుద్ధి చేయవచ్చేమోగానీ భూగర్భ జలాలను శుద్ధి చేయడం చాలా కష్టం. నైట్రేట్‌, ఫ్లోరైడ్‌, ఇనుము, ఆర్సెనిక్‌, లెడ్‌, క్రోమియం, కాడ్‌మియం కలిసిన భూగర్భ జలాలు సుమారు అన్ని రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్నాయి. భూగర్భ నీటి మట్టం లోతుకుపోయే కొద్దీ వాటిలో లవణాలు, లోహాలు, ఇతర రసాయనాల శాతం పెరుగుతూ వస్తుంది. ఉపరితల కలుషితాలు భూమిలోకి ఇంకడం వల్ల ప్రమదకర పారిశ్రామిక వ్యర్థాలు కూడా బోరు నీళ్లలో కలుస్తున్నాయి. హైదరాబాదులో జీడిమెట్ల, పాటన్‌చెరువు, బొల్లారం ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థాలు భూగర్భ నీటిని మొత్తం కలుషితం చేసేసాయి.

ఇటువంటి స్థితిలో ప్రజలకు తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. పరిస్థితిని కనీసంగానైనా బాగుచేసే ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వాలు రక్షిత మంచినీరు పేరుతో నీటివ్యాపారానికి తెరతీసాయి. నిజానికి చాలా ప్రాంతాల్లో తాగునీరే కాదు, ఇతర అవసరాల కోసం కూడా జనం ప్రైవేట్‌ ట్యాంకర్ల వద్ద నీటిని కొనుక్కుంటున్నారు.

దాహంతో అమానుష వ్యాపారం, మరింతగా నీటి సంక్షోభం

2020 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు సహా 21 భారతదేశ ప్రధాన నగరాల్లో 10 కోట్ల మంది తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడవలసి వస్తుందని నీతి ఆయోగ్‌ నివేదిక చెప్పింది. అంతే కాదు, 2030 నాటికి దేశంలో 40 శాతం ప్రజలకు తాగునీరు అందుబాటులో లేని పరిస్థితి వస్తుందని అది అంచనా వేసింది. ఇప్పటికే భూగర్భ జలం కూడా తాగడానికి అనువుగా లేకపోవడం వల్ల జనం ప్రైవేటు వ్యాపారస్తులు శుద్ధి చేసిన నీటి పేరుతో ఏ ప్రమాణాలు పాటించకుండా అమ్ముతున్న నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. నీళ్లు కొనుక్కోవలసి వస్తుందని రెండు దశాబ్దాల క్రితం బహుశా ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఫోర్చూన్‌ అనే అమెరికన్‌ బిజినెస్‌ పత్రిక 2000 సంవత్సరం మే సంచికలో నీరే 21వ శతాబ్దపు చమురు అని రాసింది. ఎట్లైతే 20వ శతాబ్దపు వ్యాపార రంగాన్ని చమురు నియంత్రించిందో 21వ శతాబ్దంలో నీరు ఆ పని చేస్తుందని అది అంచనా వేసింది. నిజానికి దీనికన్నా చాలా ముందుగానే నీటి వ్యాపారానికి సన్నాహాలు మొదలయ్యాయి. 1992లో నీరు, పర్యావరణ పరిరక్షణ మీద డబ్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు నీటిని ఆర్థిక వస్తువుగా గుర్తించాలని తీర్మానించింది. అలా గుర్తించినప్పుడే కొరతగా ఉన్న నీటి వనరుల్ని సంరక్షించగలం అని సూత్రీకరణ చేసింది.

పర్యావరణ సంక్షోభానికి కారణమైన మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థే, మార్కెట్‌ సూత్రాలను బాగా అమలు చేస్తే పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టవచ్చని సిద్ధాంతాలను తయారుచేసింది. దానికి తగినట్లు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు నీటి కొరతను గురించిన అధ్యయనాలు చేసి ప్రమాద తీవ్రతను చెప్తూ తక్షణం నీటి వనరుల్ని కాపాడుకోవాలి అంటాయి. వెనువెంటనే పబ్లిక్‌ ఆస్తిగా ఉంటే నీటిని ఇట్లాగే ఇష్టం వచ్చినట్లు వృథా చేస్తారు కనక, పైసలు చెల్లించే ఏర్పాటు చేస్తే అందరూ పొదుపు చేస్తారనే పెట్టుబడిదారీ పర్యావరణవాదం రంగం మీదికి వస్తుంది. ప్రకృతి వనరు ఏదైనా సరుకుగా మారితే లాభాలు పిండుకోవడం కోసం దానిని ఎలా ధ్వంసం చేస్తారో ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వొచ్చు.

ప్రకృతి అంటే సప్లై, డిమాండ్‌ నియమాల ప్రకారం మార్కెట్లో అమ్మడానికి ఉత్పత్తి చేసే సరుకు కాదు. వినియోగదారుల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థీకృతమైన మార్కెట్‌ కాదు. ప్రకృతి ప్రైవేట్‌ ఆస్తి కూడా కాదు, కాకూడదు. ప్రకృతి వనరుల నిర్వహణ, వినియోగం, పంపిణీ సూత్రబద్ధంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. అది ప్రజల ప్రస్తుత అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, ఆవరణ వ్యవస్థ విధ్వంసం కాని సుస్థిరాభివృద్ధి భవిష్యత్‌ తరాల మనుగడ, అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకున్నదై ఉండాలి. పర్యావరణం ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి స్థితిగా పరిగణించవచ్చు, కానీ సరుకుల చలామణీ ప్రవాహంలో దాన్ని భాగం చేయలేం. ప్రకృతితో మనకున్న సంబంధాన్ని అమానుషమైన లాభనష్టాల దృక్పథం నిర్దేశించకూడదు. అటువంటి ఏ ప్రయత్నమైనా ఘోరవిపత్తుకు దారితీస్తుంది. పర్యావరణ పునరుత్పత్తికి కావలసిన పరిస్థితులు నాశమవ్వడానికి (చెట్లు-అడవి, నీటి వనరులు వంటివి ఎప్పటికప్పుడు పనరుత్పత్తి కావడం ప్రకృతి సజీవత్వానికి నిదర్శనం) కారణం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోకపోవడమే కాదు, అంతకన్నా పర్యావరణాన్ని సరుకుల ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం అని మనం ప్రాథమికంగా గుర్తించాలి.

మనుషులకే కాదు ప్రాణులందరికీ సహజసిద్ధంగా లభించేది, జీవించేందుకు అత్యవసరమైనది అయిన నీటిని సరుకు చేస్తే అది ఉపయోగపు విలువను కోల్పోతుంది. నీళ్లుంటాయి కానీ డబ్బాలో ప్యాక్‌ చేసి ఉంటాయి. కొనలేని వారికి అవి ఉపయోగంలోకి రావు. ఉమ్మడి వనరుల నుండి మనుషుల్ని బేదఖల్‌ చేసి జరిగే సంచయం (పోగుపడడం) కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణమని ప్రముఖ మార్క్సిస్టు మేధావి డేవిడ్‌ హార్వీ అంటాడు. ఈ రకమైన సంచయం సంపదను పేద వర్గాల నుండి ధనిక వర్గాలకు, పెట్టుబడిని ప్రభుత్వ రంగం నుండి ప్రైవేటు రంగానికి మళ్లిస్తుందని అంటాడు.9 ఇది సామాజిక అసమానతల్ని మరింత పెంచి ప్రకృతి వనరులను వాటి భౌగోళిక ఆవరణ నుండి వేరు చేసి, భూగోళమంతటా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది.

నీటి నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకొని (నీటి శుద్ధి చేయడం, నాణ్యమైన నీటిని సరఫరా చేయడం, ఆనకట్టలు కట్టడం) ప్రైవేటు కంపెనీలు చేస్తున్నది సంరక్షణ కాదు, దోపిడి అన్న విషయం ప్రతిచోటా రుజువవుతున్నది. ఇవి నీటి మీద సహజసిద్ధమైన మానవ హక్కుల్ని రద్దు చేస్తాయి. పంటలు ఎండిపోయి, జనం దాహంతో అల్లాడుతుంటే అవి ఇష్టానుసారంగా నీటిని తోడేసి అమ్ముకుంటాయి. ఏ నిబంధనలూ పాటించకుండా భూగర్భ జలాలను దోపిడి చేస్తాయి. మన దేశంలో 1990ల నాటి నుండే ఈ విధానం అమలవుతోంది. 20 ఏళ్ల క్రితం ఛత్తీస్‌ఘడ్‌ (అప్పుడు మహారాష్ట్ర) ప్రభుత్వం 23.5 కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్న శివ్‌నాథ్‌ నదీ జలాల హక్కుల్ని రైడియస్‌ వాటర్‌ లిమిటెడ్‌ (ఆర్‌.వై.ఎల్‌.) అనే కంపెనీకి అమ్మేసింది. ఆ నది మీద ఒక బ్యారేజ్‌ కట్టి పరిశ్రమలకు నీటిని సరఫరా చేసే తన బాధ్యతను నిధుల లేమి వల్ల ప్రేవేటు కంపెనీకి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని తక్షణ ఫలితం ఏమిటంటే నది చుట్టూ కంచె వేయడం వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న వేలాది ప్రజలకు ఆ నీటి మీద హక్కు లేకుండా పోయింది. నిజానికక్కడ ప్రత్యేకంగా ఆనకట్ట కట్టాల్సిన అవసరమే లేదు. ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న భారీ అవినీతిని కూడా తెహెల్కా రిపోర్టు చేసింది. ఇలాంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి.10 పెప్సీ, కోకాకోలా కంపెనీలు చేస్తున్న భూగర్భ జల దోపిడీకి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తిన విషయం కూడా ఇక్కడ గుర్తుచేసుకోవాలి.

రక్షిత మంచినీరు పేరుతో చిన్నా, పెద్దా ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే మినరల్‌ వాటర్‌ వల్ల ప్రజారోగ్యం గుల్ల అవుతున్న సంగతి కూడా గుర్తించాలి. నిజానికి నేడది ఎంతగానో చర్చించాల్సిన విషయం. మంచి నీళ్లే తాగుతున్నాం అనుకునే వాళ్లు వాటిలో మంచి ఎంత అని తెలుసుకుంటే సుమారుగా అందరూ రక్షిత మంచి నీటి వినియోగం వెలుపలే ఉన్నారని నిర్ధారణకు రావలసి వస్తుంది. ఇవాల డబ్బా నీళ్ల మీద ఎంత వివాదం నడుస్తున్నా ప్రభుత్వాలకు అది ఏ మాత్రం పట్టలేదు. నీటి వనరులను ప్రైవేటు వాళ్లకు అప్పగించి చేతులు దులిపేసుకుని నిద్ర నటించే ప్రభుత్వాలను లేపి నిలదియ్యగలిగే పరిస్థితి రాకపోతే అతి తొందరలో నీళ్లు లేని సంక్షోభంలో మనందరం మునిగిపోవాల్సిందే.

నీటి యుద్ధాలు కాదు, ఉద్యమాలు రావాలి

మన చుట్టూ వేగంగా మ్ముకొస్తున్న నీటి కొరత సూచించే విపత్తు ఒకటైతే, ఇది దేశంలో ఏమాత్రం చర్చనీయాశం కాకపోవడం ప్రమాదకరం. వర్షాలు పడక, డ్యాముల్లో నీళ్లు అడుక్కుచేరి తాగునీటికి కూడా కటకటలాడే స్థితికి కారణం ఎవరని నిందించాలనే ప్రశ్న సాధారణం. ఎవరు మాత్రం ఏం చేస్తారు అని జనం అనుకోవడం సహజం. కాస్త ముందుకు పోయి పొరుగు రాష్ట్రం వాళ్లు కట్టే ఆనకట్టల వల్ల మనకు నీళ్లు రాకుండాపోతున్నాయని ప్రభుత్వ మీడియా ప్రచారం వల్ల అనుకోవడం కూడా సహజం. నీటి యుద్ధాల గురించి తరచుగా వింటూ ఉంటాం. యుద్ధం అంటేనే పాలకవర్గాల పరిభాష. రెండు ప్రాంతాల మధ్యనో, రాష్ట్రాల మధ్యనో, దేశాల మధ్యలో నీటి వివాదాలు పాలకులు సృష్టించేవి. ఏ పాలకులైతే పర్యావరణ విధ్వంసానికి కారణమవుతారో, ఎవరైతే నీటి కరువును సృష్టిస్తారో వారే నీటి వివాదాలను రెచ్చగొడుతుంటారు. బాధ్యతాయితంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా దప్పికగొన్న రెండు కరువు ప్రాంతాల ప్రజల మధ్య వారు ఒక యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తారు. మరోవైపు ప్రజాస్వామిక ఉద్యమాలు నీటి పంపకాల్లో ఉన్న అసమానతల గురించిన సహేతుక చర్చ చేస్తాయి. ప్రాంతాల మధ్య సమాన పంపకం కోసం ప్రజలు చేసేవి న్యాయమైన పోరాటాలు. అవి యుద్ధాలు కాదు, ఉద్యమాలు. ప్రాంతీయ ప్రజా ఉద్యమాలు మరికాస్త ముందుకుపోయి అసమ పంపిణీ మాత్రమే కాదు, తమ తమ ప్రాంతాలలో నీటి కరువుకు గల స్థానిక కారణాలను కూడా గుర్తించగలిగితే వాటి నుండి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వికసిస్తుంది. నిజానికి నీటి అసమ పంపిణీ సవరించగలిగితే ఒక ప్రాంతంలో నీళ్లు లేక బీడుబడే నేలను బతికించుకున్నట్లే, ఇంకోచోట నీళ్లు అధికంగా నిలిచి బురదమయమై పాడైపోయే భూములను బాగుచేసుకోవచ్చు. అందుకు సుస్థిర వ్యవసాయ విధానం అవసరమవుతుంది. నీటి వినిమయాన్ని విపరీతంగా పెంచేసిన అపసవ్య వ్యవసాయ విధానమే ఇటువంటి సమస్యలను సృష్టించింది. ఈ విధానాలే నీటి వివాదాలకు కారణమయ్యింది. ఇక్కడ ప్రాంతాల మధ్య ప్రజాస్వామిక చర్చకు పర్యావరణ అవగాహన దోహదం చేయగలదు.

పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, ప్రజా ఉద్యమాలు పూనుకున్నప్పుడు మాత్రమే ఫలితముంటుంది. ఆయా ప్రాంతాలలో చెరువుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, సామాజిక అడవుల పెంపకం, వాటర్‌ షెడ్‌ సక్రమ నిర్వహణ వంటి అంశాలను ప్రజాఉద్యమాలు తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు కాగితాల్లో ఉన్న లక్ష్యాలు నేలమీదికొస్తాయి. లేకపోతే నర్సరీలో కుండీలు కొనుక్కొచ్చి పంపీణీ చేసే పర్యావరణ దినోత్సవ ప్రభుత్వ ఆర్భాటాలు మాత్రమే ఉంటాయి తప్ప పనేమీ జరగదు. పర్యావరణవాదులతోపాటు ప్రజాస్వామికవాదులు, ఉద్యమ సంస్థలు ప్రజల జీవికకు అత్యంత ప్రాథమిక అవసరమైన నీటి లభ్యత మొత్తంగా ఎందుకు తగ్గిపోతోంది, దానిని అధిగమించడం ఎలా అని హేతుబద్ధంగా చర్చించకపోతే కళ్ల ఎదుటే జరిగే నిశ్శబ్ద విధ్వంసానికి మౌన ప్రేక్షకులు అవుతారు.

తరిగిపోతున్న పచ్చదనం, విస్తరిస్తున్న ఎడారులు, ఒట్టిపోతున్న భూగర్భం, కేవలం దాహంతో మరణిస్తున్న కోట్లాది పశుపక్ష్యాదులు, మొక్కలు ఈ భూమ్మీద అత్యంత మేధోసంపన్న మనవజాతిని నిలదీస్తున్నాయి. వేరెవ్వరికన్నా ఎక్కువగా ప్రకృతి సూత్రాలు అర్థం చేసుకునే, భూమి గుండె సవ్వడిని చెవి ఒగ్గి వినగలిగే, ఆకాశం నుండి మేఘాలు చెప్పే ఊసులు ఆలకించే మానిషిని ఈ విపత్తు వెనక కారణం అడుగుతున్నాయి. మనిషే దీనికి కారణమా? మానవులు తమకు ఆవాసమైన భూమినే నాశనం చేస్తున్నారా? అవును. అయితే మనిషి తన మితిమీరిన తెలివితేటలతో చేయగలిగేది విధ్వంసమేనా? కాదు. మానవులు మనసు పెడితే ధ్వంసమైన భూభాగాలను పునర్నిర్మాణం చేయగలరు. ఉమ్మడి శ్రమతో ఎడారిలో నందనవనాలు పూయించగలరు. మనిషికీ, ప్రకృతికీ వైరుధ్యం ఉన్న మాట నిజమే. కానీ అది శతృపూరితం కాదు. అదే అయితే గనక మనిషి మనుగడ భూమ్మీద ఉండదు. ఇంతటి విధ్వంసానికి కారణం సహజ మానవ నైజం కాదు. మరి ఏమిటి? అందరికీ చెందిన ఉమ్మడి ప్రకృతి వనరులను కబ్జా చేసుకొని తమ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పి సంపదను పోగుచేసుకొన్న పిడికెడు మంది మొత్తం మానవజాతిని పరాయీకరించి, తోటి మనుషులనూ, ప్రకృతినీ కొల్లగొడుతున్నారు. ఉమ్మడి అనుభవంలో ఉన్న భూమిపై కొంతమంది యాజమాన్య హక్కును పొందినట్లుగానే ఇప్పుడు అందరికీ చెందిన నీటిని తమ సొంతం చేసుకొని మార్కెట్‌లో సరుకుగా అమ్ముకుంటున్నారు. దీని మీద ఉద్యమాలు రావాలి. సమాజానికీ, ప్రకృతికి (అంటే ఒక రకంగా భవిష్యత్తు తరానికి) శతృవులుగా తయారైన దోపిడీ శక్తులపై అవి ఎక్కుపెట్టాలి.

పర్యావరణ ప్రజా ఉద్యమాలు తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండాలి. ఉదాహరణకు నీటి సంక్షోభాన్నే తీసుకుంటే తక్షణం ఎక్కడికక్కడ కాలుష్యానికి వ్యతిరేకంగా, నదుల్లో ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా, నీటి వనరుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంది. అడవులు, కొండలు, గుట్టల విధ్వంసం అడ్డుకోవాలి. శాస్త్రీయ, పర్యావరణహిత వ్యవసాయ విధానాల రూపకల్పన వంటి ప్రత్యామ్నాయ ఆలోచనలను వర్గపోరాటం సొంతం చేసుకోవాలి. వీటి మీద మరిన్ని ఆలోచనలు ముందుముందు పంచుకుందాం, చర్చిద్దాం.

పి.వరలక్ష్మి

Keywords : Environment, andhrapradesh, telangana
(2020-05-30 00:52:29)No. of visitors : 2683

Suggested Posts


0 results

Search Engine

వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి - విరసం
యోగి సర్కార్ మరో దుర్మార్గ చర్య...ఆరు నెలల పాటు ఎస్మా
వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌
more..


దప్పికగొన్న