మోడీ కుట్ర విప్పిచెప్పిన సాహసికి లేఖ


మోడీ కుట్ర విప్పిచెప్పిన సాహసికి లేఖ

మోడీ


(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువాదం చేసిన ఈ లేఖ వీక్షణం జూలై , 20019 సంచికలో ప్రచురించబడినది)

ప్రియమైన సంజీవ్,

ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి వచ్చినప్పుడు కృతనిశ్చయురాలైన నీ సహచరి శ్వేతా భట్ ఈ ఉత్తరం ప్రతిని నీకు తెచ్చి ఇవ్వవచ్చు. కాని ఇప్పుడైతే ఆమె ఎంతో పోరాడవలసి ఉంది, ఎంతో సంబాళించుకోవలసి ఉంది. నా ఉత్తరం అనే చిన్న విషయం ఆమె మరిచిపోవచ్చు కూడ.

మొత్తానికి నీకీ ఉత్తరం చేరినప్పుడు, జామ్ నగర్ జిల్లాలోని ఆ కష్టభరితమైన జైలు బారక్ లో ఒంటరితనంలో నువ్విది ఎలా చదువుకుంటావా అని ఊహిస్తుంటేనే నాకు బాధగా ఉంది. సివిల్ సర్వీస్ అధికారిగా నేను దేశంలోని ఎన్నో జైళ్లలోపల ఎలా ఉంటుందో చూశాను. అది నీకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో నేనూహించగలను. రోజువెంటరోజు అదే అదే విసుగెత్తించే ఒకే రకమైన జీవితం, కటిక నేల మీద పడక, కంపు కొట్టే ఉమ్మడి పాయిఖానా, మండుటెండల వేడి నుంచీ, ఈగల నుంచీ, దోమల నుంచీ రక్షణ లేని పరిసరాలు.

ఇప్పటికే నువ్వు తొమ్మిది నెలలు జైలులో గడిపావు. ఆ కాలం ఎంత ఇబ్బందికరమైనదైనా అప్పుడు నీకు ఒక ఆశ ఉండి ఉంటుంది. ఏదో ఒక కోర్టు – అది జిల్లా సెషన్స్ కోర్టు గాని, లేదా అహ్మదాబాద్ లో, ఢిల్లీలో ఉన్న అత్యున్నత కోర్టులలో ఏదో ఒకటి గాని – న్యాయం చేస్తుందని ఆశ ఉండి ఉంటుంది.
అందుకు బదులుగా, జామ్ నగర్ జిల్లా సెషన్స్ కోర్టు నీకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించడం గొడ్డలిపెట్టులా తోచి ఉండవచ్చు. అయితే నువ్వు ధైర్యం, స్థిరనిశ్చయం నిండిన యోధుడివని నాకు తెలుసు. నువ్వు న్యాయం కోసం, నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం కోసం, ఒకానొక రోజున స్వేచ్ఛగా విడుదల కావడం కోసం పోరాడుతూనే ఉంటావు.

ఇబ్బందికరమైన, హింసాత్మకమైన నీ చెరసాల కొట్టులో ఏకాకిగా ఒంటరి క్షణాలు అనుభవిస్తున్న నీకు నేనొకటి చెప్పదలచాను. జీవితంలోకెల్లా కఠినమైన పోరాటాన్ని నువ్వు సాగిస్తున్నప్పుడు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎందరెందరో నీతోనే ఉన్నారు, నీకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాకు నువ్వు అమాయకుడివనే విశ్వాసం ఉంది. ఈ దేశంలోకెల్లా శక్తిమంతుడైన మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అపూర్వ సాహసం ప్రదర్శించినందుకు మాత్రమే నీ మీద ఈ వేధింపు జరుగుతున్నదని మాకు తెలుసు. 2002లో జరిగిన, స్వతంత్ర భారత చరిత్రలోకెల్లా అత్యంత దారుణమైన, క్రూరమైన మారణకాండలో ఆ మనిషి పాత్ర ఉన్నదనే నిజాన్ని నువ్వు స్థాపించదలచావు గనుకనే ఈ వేధింపు.

నీకు ఇప్పుడు జరుగుతున్నదంతా, ఆ మనిషికీ, దేశంలో ఇప్పుడు అత్యంత శక్తిమంతుడిన రెండో మనిషికీ ఉన్న మితిమీరిన అహంకారపు పర్యవసానమేనని తేటతెల్లమవుతున్నది. ఒక సాహసికుడైన, మడమ తిప్పని యోధుడి మీద చౌకబారు ప్రతీకారం తీసుకోవడానికి వాళ్లు రాజ్యాధికారాన్ని దారుణంగా వాడుకుంటున్నారు. దేశంలో నీలా జాగరూకుడైన కాపలాదారుగా ఉన్న మరొకరు నాకు గుర్తు రావడం లేదు. అత్యున్నత అధికారాన్ని ఆక్రమించినవారికి వ్యతిరేకంగా గొంతెత్తిన కాపలాదారుగా ఒక సీనియర్ అధికారి ఉన్న ఉదాహరణ లేదు. అలాగే రానున్న మూడు దశాబ్దాలు జైలులో గడపాలని నీ వంటి శిక్ష పొందిన అధికారి ఉదాహరణ కూడ లేదు.

నీకు ఇటువంటి శిక్ష విధించడం దేశంలో న్యాయవ్యవస్థ నిర్మాణాలు తమ సమగ్రతనూ, స్వాతంత్ర్యాన్నీ కోల్పోయి, కుప్పకూలిపోయాయనడానికి దర్పణం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, అధికారిక మానవహక్కుల సంస్థలు అన్నీ ధ్వంసమయ్యాయి. చివరికి ఖాకీ దుస్తులలో ఉన్న నీ సోదరులు, సోదరీమణులు కూడ నీ శిక్ష తర్వాత మౌనం వహించి నిన్ను వదిలేశారు.

ఈ శిక్ష మీద ప్రచారసాధనాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శ రాలేదంటే రాజ్యాధికారాన్ని ఇంత బహిరంగంగా, ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తుంటే ప్రచారసాధనాలు ఆగ్రహంతో నిరసన వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేవని అర్థం.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) తో సహా రాజ్యవ్యవస్థలన్నిటి విధ్వంసం కూడ నీ శిక్ష సందర్భంలో మరొకసారి ఘోరంగా బైటపడింది. సివిల్ సర్వీస్ అధికారుల స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి రాజ్యాంగం 315 అధికరణం ప్రకారం ఏర్పడిన యుపిఎస్ సి 2015లో నిన్ను సర్వీస్ నుంచి తొలగించినప్పుడు పిరికిగా మౌనం వహించింది. అప్పుడు స్క్రోల్ లో రాసిన వ్యాసంలో నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను. నిన్ను తొలగించడానికి వారు చూపినది నువ్వు కొద్ది రోజుల పాటు అనధికారికంగా సెలవు తీసుకున్నావనే అతి స్వల్ప కారణం.

కాని ఒక అధికారిని తొలగించడమనే శిక్ష అత్యంత తీవ్రమైన పాలనా చర్య. అది అరుదైనవాటిలోకెల్లా అరుదైన సందర్భంలోనే తీసుకోవాలి. ప్రభుత్వాధికారులు అతి తీవ్రమైన నేరాలు చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కాని యుపిఎస్ సి ఆ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నీకు నీ వాదన వినిపించుకోవడానికి కూడ అవకాశం ఇవ్వలేదు. నాకు తెలిసి ఎందరో ఐ ఎ ఎస్ అధికారులు చెప్పాపెట్టకుండా సంవత్సరాల తరబడి అనధికారిక సెలవులు తీసుకున్నారు. ఆ సమయంలో విదేశాలలోనో, ప్రైవేట్ కంపెనీలలోనో ఉద్యోగాలు కూడ చేశారు. కాని వారి మీద, తొలగింపు కాదు సరిగదా, కనీస చర్యలు కూడ తీసుకోలేదని నేనా వ్యాసంలో రాశాను.

నీ సెలవు అనధికారికమైనది కాదని నువ్వు ఖండించావు గాని, ఒకవేళ అది అనధికారికమైనదే అనుకున్నా, ʹఅటువంటి అనుచిత ప్రవర్తనకు సకారణమైన, ఉచితమైన శిక్ష ఒక లిఖితపూర్వక అసంతృప్తిప్రకటనా లేఖ తోనో, జీతం లేని సెలవుగా పరిగణించడం తోనో సరిపోయి ఉండేదిʹ అని నేనప్పుడు రాశాను.
దేశంలో అత్యున్నత అధికారంలో ఉన్నవారు నువ్వు ఎట్లాగైనా ఉద్యోగం నుంచి తొలగించబడాలని అంతగా ఎందుకు కోరుకున్నారనే చిక్కుముడి ఆ ʹఅనధికార సెలవుʹ రోజుల్లో నువ్వు ఏం చేశావనేది చూస్తే సులభంగా విడిపోతుంది. ఆ రోజుల్లో నువ్వు, ఇండియన్ పోలీస్ సర్వీస్ కు చెందిన గుజరాత్ కాడర్ అధికారిగా, ధైర్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నావు. మోడీకి జనహననపు మారణకాండతో సంబంధం ఉన్నదని చూపుతున్నావు.

నువ్వు ఆ సాక్ష్యాన్ని సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ముందు, సుప్రీం కోర్టుకు సహాయకుడుగా వ్యవహరిస్తున్న రాజు రామచంద్రన్ ముందు ఇచ్చావు (ఆ తర్వాత ఆ సాక్ష్యమే లిఖితపూర్వక అఫిడవిట్ గా సుప్రీం కోర్టుకు చేరింది). వారు అప్పుడు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపణలపై విచారిస్తున్నారు. ఎహ్సాన్ జాఫ్రీని, ఆయనతో పాటు మరొక 70 మందిని అహ్మదాబాద్ లో గుల్బర్గ్ సొసైటీలో, 2002లో అత్యంత దారుణంగా చంపారు. ప్రాణాలనూ ఆస్తులనూ కాపాడడంలో ʹఉద్దేశపూర్వకంగానే, తెలిసితెలిసీ వైఫల్యం చెందారుʹ అనే కారణంతో నరేంద్ర మోడీ ఈ హత్యాకాండలో మొదటి ముద్దాయి అని ఆమె ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ తన రాజ్యాంగబద్ధ విధులను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు.

నిన్ను ఉద్యోగం నుంచి తొలగించడం అసాధారణమూ దిగ్భ్రాంతికరమూ. కాని ఇక అంతకంటె దారుణం చేయలేరని మేమప్పుడు అనుకున్నాం. ఇంకా దారుణాలు రానున్నాయని అప్పుడు మేం ఊహించలేకపోయాం. నిన్ను జీవితాంతం జైలులో గడిపేలా చేసేదాకా వాళ్ల పగ చల్లారదని మేం ఊహించలేకపోయాం.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైన మతోన్మాద హింసా మారణకాండ నేరానికి సంబంధించిన కేసులో నీ సాక్ష్యం ఎంత బలమైనదో, నేరస్తులను ఎంత భయపెడుతున్నదో నీకు వేసిన శిక్షే చెప్పకనే చెపుతున్నది. నువ్వు వెల్లడించిన సాక్ష్యాధారాలు ఎంతో ప్రమాదకరమైనవి. ఈ శిక్ష నీ ఒక్కడికి మాత్రమే హెచ్చరిక కాదు, ఈ దేశంలో శక్తిమంతులైన మనుషులకు ఎదురుచెప్పే సాహసం చేసేవాళ్లందరికీ ఇది ఒక హెచ్చరిక. ఒక సీనియర్ పోలీస్ అధికారికే ఈ గతి పడితే, ఒక సాధారణ పౌరుడికి ఏం రక్షణ ఉంటుంది?

2002 ఫిబ్రవరి 27 రాత్రి పొద్దుపోయిన తర్వాత మోడీ నేతృత్వంలో జరిగిన అత్యంత వివాదాస్పద సమావేశంలో నీతోపాటు ఇతర పోలీసు అధికారులు కూడ పాల్గొన్నారు. కాని వాళ్లందరూ ఆ సమావేశానికి హాజరైనట్టు గుర్తు లేదన్నారు. లేదా, ఆ సమావేశంలో నువ్వు చెపుతున్నట్టుగా మోడీ ఆదేశాలు ఇచ్చిన సంగతి గుర్తు లేదన్నారు. లేదా ఆ సమావేశంలో నువ్వు ఉన్నట్టు గుర్తు లేదన్నారు. కాని నీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఆ సమావేశానికి వెళ్లడానికి ముందు నీతో ఉన్న బిబిసి విలేఖరి చెప్పిన ప్రకారం నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావన్నది నిస్సందేహం.

ఆ సమావేశంలో అధికారులకు మోడీ ఇచ్చిన ఆదేశాల గురించి బైటపెడితే విస్ఫోటనం సంభవిస్తుందని నీకు తెలుసు.

అయినా నువ్వు మాట్లాడదలచుకున్నావు. నువ్వు ఆ మాట అనడానికి, ఆ మాటకు కట్టుబడి ఉండడానికి హెచ్చుస్థాయిలో ధైర్యం కూడగట్టుకోవలసి ఉండింది. ʹహిందువులలో తీవ్రమైన భావోద్వేగాలున్నాయని, అందువల్ల వారు తమ కోపం తీర్చుకోవడానికి అనుమతించడమే ఉచితమʹని ఆ సమావేశంలో మోడీ అన్నాడని నువ్వు సిట్ ముందు, సుప్రీం కోర్టు ముందు చెప్పావు. ఈ ʹహిందూ ఆగ్రహంʹ అనబడేది సకారణమైన ప్రతిస్పందన అని మోడీ అప్పుడే తన బహిరంగ ప్రకటనల్లో కూడ అని ఉన్నాడు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో సహకరించడానికి వెళ్లి తిరిగివస్తూ రైలు బోగీలో గోధ్రాలో 58 మంది తగులబడిపోవడానికి ప్రతిస్పందన అది అని ఆయన అన్నాడు.

ఆనాటి సమావేశంలో ʹఎంతో కాలంగా గుజరాత్ లో మతకల్లోలాలతో వ్యవహరించేటప్పుడు గుజరాత్ పోలీసులు హిందువులకూ ముస్లింలకూ మధ్య సమతౌల్యం పాటించాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని, ప్రస్తుతం మాత్రం ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పవలసిందేʹనని అక్కడివారిని ముఖ్యమంత్రి మోడీ ఉద్బోధించాడని నువ్వు సుప్రీంకోర్టు ముందు చెప్పావు. నీ ఆరోపణలను అంగీకరిస్తే, మోడీ మీద అతి తీవ్రమైన నేరారోపణలు చేయవలసి వచ్చేది. దేశంలో అత్యున్నత అధికార పీఠానికి అధిరోహించకుండా అది ఆటంకమయ్యేది.

సిట్ లో ఉన్న నీ సహోద్యోగులు, ఐపిఎస్ అధికారులు, నీ ఆరోపణలను పూర్తిగా కొట్టివేశారు. నిన్ను అవిశ్వసనీయ సాక్షిగా ప్రకటించారు. అసలు ఆ సమావేశంలో నువ్వు పాల్గొననే లేదన్నారు. కాని, సుప్రీం కోర్టు సహాయకుడిగా పనిచేసిన రాజు రామచంద్రన్ నీ ఆరోపణలను సిట్ తోసివేయడాన్ని అంగీకరించలేదు. నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావా లేదా అనేది నిజానికి న్యాయస్థానంలో తేల్చాలని, సమావేశంలో పాల్గొన్నామని చెప్పిన కొందరు అధికారుల సాక్ష్యాన్నికూడ సిట్ తోసిపుచ్చింది గనుక, నీ ఆరోపణలను కూడ పూర్తిగా కొట్టివేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని అన్నారు. నీ మాటలను ఒక న్యాయస్థానంలో పరీక్షకు గురి చేయవలసిందేనని ఆయన అన్నారు. ఆయన సూచనను అంగీకరించి, నీ సాక్ష్యాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి ఉంటే భారత చరిత్రే మరొక రకంగా ఉండేది. నీ జీవితం కూడ మరొక రకంగా ఉండేది.

సిట్ కు అధినేతగా ఉండిన అధికారి ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండగానే ఒక అసాధారణ, గౌరవనీయ పదవికి ఎంపిక కావడం యాదృచ్చికం కావడానికి వీలు లేదు. ఆ పోలీసు అధికారికి పదవీ విరమణ తర్వాత విదేశంలో రాయబారి పదవి దక్కింది. మరొక పక్క నువ్వు యావజ్జీవితం జైలు శిక్షకు గురి చేయబడ్డావు.

దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన మనుషులు నీ మీద కోపం పెట్టుకోవడానికి తగిన కారణం ఉంది. కాని భారత రాజ్యాంగ సంస్థలు తమను తాము బలహీన పరచుకుని, ఆ వ్యక్తుల చౌకబారు ప్రతీకారవాంఛకు, రాజ్యాధికార దుర్వినియోగానికి వంతపాడి ఉండవలసింది కాదు.

ఇవాళ నీకు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు, కస్టడీలో ఒక వ్యక్తి మరణించడానికి నీకు సంబంధం ఉన్నదని న్యాయస్థానం నిర్ధారించిన తర్వాత, నిన్ను నేనెట్లా సమర్థిస్తానని వాళ్లు అడుగుతున్నారు.
నేను సివిల్ సర్వీస్ అధికారిగా ఉన్నప్పుడూ, అది అయిపోయి బైట ఉన్నప్పుడూ కూడ కస్టడీ హింసనూ, చట్టవ్యతిరేక హత్యలనూ గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. కాని, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే గుజరాత్ లో 2001 నుంచి 2016 వరకు 180 కస్టడీ మరణాలు సంభవించాయని, అన్ని మరణాలకుగాను ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారికి కూడ శిక్ష పడలేదని తెలుస్తున్నది. కనుక నీ మీద చర్య సక్రమంగా జరిగిందని నేను అంగీకరించలేను.

ఆ కస్టడీ మరణాలన్నీ లేదా కనీసం వాటిలో చాలభాగం దర్యాప్తు జరిగి ఉంటే, ఆ హత్యలకు కారకులైన చాలమంది పోలీసు అధికారులకు శిక్షలు పడి ఉంటే, ఇప్పుడు నీ మీద చర్యను కూడ నేను న్యాయమైనదని సమర్థించి ఉండేవాడిని. కాని, ముప్పై సంవత్సరాల కింద, కస్టడీ నుంచి విడుదల అయిన తొమ్మిది రోజుల తర్వాత మరణించిన ఒక వ్యక్తి విషయంలో నీకూ మరొక అధికారికీ శిక్ష పడడం నేను అంగీకరించలేను.
స్వతంత్ర భారతం చూసిన అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరి మీద, క్షమాగుణం అనేదే తెలియని వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంలో నువు చూపిన అద్భుతమైన సాహసానికి నిన్ను అభిమానించే వాళ్లెందరో ఉన్నారని తెలుసుకోవడం జైలులో నీ ఇబ్బందులనూ, వేదననూ ఎంతమాత్రం తగ్గించదు. నీ ముందున్న న్యాయపోరాటం దీర్ఘకాలికమైనదనీ, అనిశ్చితమైనదనీ, ఎన్నెన్నో నిరాశలకూ, హృదయవేదనలకూ దారి తీసేదనీ నీకూ, శ్వేతకూ, నీ పిల్లలకూ తెలిసినట్టుగానే నాకు కూడ తెలుసు.

కాని ధైర్యంగా నిలబడడానికి, తట్టుకోవడానికి, పోరాటం కొనసాగించడానికి, నువ్వు సత్యమనీ న్యాయమనీ విశ్వసించిన వాటికోసం దృఢంగా నిలబడడానికి కావలసిన శక్తీ, సహిష్ణుతా నీకున్నాయని నాకు తెలుసు. అలాగే ఏదో ఒక రోజు నువ్వు స్వేచ్ఛగా బైటికి వస్తావనీ నాకు తెలుసు. శ్వేతతో, పిల్లలతో, మన దేశపు అసంఖ్యాక స్త్రీ పురుషులతో నేను కూడ ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను.

- హర్ష్ మందర్

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Keywords : sanjeev bhat, n.venugopal, narendra modi
(2019-09-11 10:40:35)



No. of visitors : 458

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం

. అప్పటికే మన మిత్రుల బెయిల్ దరఖాస్తుల మీద మన న్యాయవాదుల వాదనలు, ప్రాసిక్యూషన్ ప్రతివాదనలు అన్నీ ఆయన విని ఉన్నారు. మే చివరి వారంలో బెయిల్ మీద ఆయన తీర్పు చెపుతారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో ఆయన సెలవు మీద వెళ్లడంతో ఆయన తిరిగి రాగానే తీర్పు చెపుతారని ఆశించారు.

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


మోడీ