బస్తర్ లో భారత యుద్దం..రగులుతున్న అడవి

బస్తర్

ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు నందినీ సుందర్ రాసిన The Burning Forest: Indiaʹs War in Bastar అనే పుస్తకాన్ని రివేరా తెలుగులోకి అనువాదం చేయగా బస్తర్ లో ʹభారత యుద్దం..రగులుతున్న అడవిʹ అనే పేరుతో మలుపు ప్రచురణలు ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ తెలుగు పుస్తకానికి ప్రొఫెసర్ జి.హరగోపాల్ ముందుమాట రాశారు. ఆ ముందు మాట మీకోసం....

నందిని సుందర్ దాదాపు మూడు దశాబ్దాల కాలం బస్తర్ పై జరిపిన పరిశోధన, పరిశోధనతో బాటు బస్తర్ ఆదివాసీల హక్కులకై నిలబడి చట్టబద్ద పోరాటాన్ని చేసి సామాజిక శాస్త్రాలకు ఒక కొత్త దశను, అర్థాన్ని కల్పించిన అరుదైన పుస్తకం ఇది. ఇది ఒక రకంగా మార్క్స్ సూత్రీకరించినట్టు ʹaction is the accomplishment of knowledge and knowledge is the fruit of actionʹ జ్ఞానానికి అంతిమ లక్ష్యం ఆచరణ, ఆచరణలో నుండి పండే ప్రతిఫలమే జ్ఞానం. సామాజిక శాస్త్రాలలో ఈ అంశంపై నిరంతరంగా చర్చ జరుగుతుంటుంది.
సామాజిక ఆచరణ (activism) జ్ఞాన సృష్టి ఒకే సమయంలో సాధ్యం కావని, ఇవి జ్ఞాన ఆవరణ భిన్న ప్రక్రియలనే వాదన చాలా బలంగా ఉంది.

ఆచరణ ఒక ప్రాపంచిక దృక్పథం మీద, వ్యక్తులు తాము మద్దతు ఇచ్చే భావజాలం మీద ఆధారపడి ఉంటుందని, ఇది నిష్పక్షపాత పరిశోధనకు ప్రతిబంధకమనే బలమైన వాదనను పరిశోధనా ప్రక్రియ (research methodology) ప్రవేశ పెట్టి చాలా కాలమైంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పని చేసే చాలామంది పరిశోధకులకు ఇది ఒక రాచబాట. అవుతే నిష్పక్షపాతమైన పరిశోధన అంటూ ఉండదని, అది ఆహ్వానించదగ్గ పరిశోధనా పద్దతి కాదని గున్నార్ మిర్డాల్ లాంటి శాస్త్రవేత్తలు చాలా బలంగా వాదించారు.

నిష్పక్షపాత పరిశోధన అనేది పలాయన వాదానికి మారుపేరని, వ్యవస్థ యథాతథ స్థితిని కాపాడాలనుకునే వారు నిష్పక్షపాతత అనే ముసుగులో తమ విలువల చట్రాన్ని దాచి ఉండడం తప్ప మరేం కాదని అంటూ నిష్పక్షపాతులైన సామాజిక శాస్త్రవేత్తలు అంటూ ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న లేవదీస్తూ అన్ని సామాజిక శాస్త్రాలు అటు పెట్టుబడి వైపో లేదా ఇటు శ్రమవైపో నిలబడతామే తప్ప మధ్యే మార్గమంటూ ఉండదనే ఒక వాదన ముందుకు వచ్చింది.

పాశ్చాత్య ఆర్థిక శాస్త్ర సిద్ధాంత చరిత్ర చూస్తే అదమ్స్మిత్నుండి అమర్త్యసేన్ దాకా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్టుబడి వైపు నిలబడ్డవాళ్ళే, దానికి భిన్నంగా మార్కిస్టు లేదా వామపక్ష శాస్త్రవేత్తలు శ్రమ పెట్టుబడికి మూలమని వాదించి శ్రమ వైపు నిలబడ్డ ఆర్థిక శాస్త్రవేత్తలున్నారు.
విచిత్రంగా వామపక్షం వాళ్ళది పక్షపాత పరిశోధన అని, పెట్టుబడి వైపు నిలబడ్డవాళ్ళది నిష్పక్షపాత పరిశోధన అనే ప్రచారం ఒకటి చలామణిలో ఉంది. ఇలాంటి చర్చ సామాజిక మార్పు గురించి కూడా జరుగుతుంటుంది.

సమాజంలో యథాతథ స్థితిని సమర్థించే వారు నిష్పక్షపాతులని, మౌలిక మార్పు కావాలనే వాళ్ళది పక్షపాత వైఖరి అనే వాదన ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ప్రజా పోరాటాలకు మద్దతు ఇచ్చే వాళ్ళు చేసే పరిశోధనకు ప్రామాణికత ఉండదని తటస్థ వైఖరి అవలంబించే వాళ్లది నిష్పక్షపాత పరిశోధన అని వాదించే వారున్నారు. నిష్పక్షపాతత పేరున అంతర్జాతీయ గుర్తింపు, నోబెల్ బహుమతులు ఇచ్చి, ప్రజల వైపు, మార్పు వైపు నిలబడ్డ పరిశోధనకి గుర్తింపు రాకుండా చాలా పకడ్బందీ చట్టాన్ని అంతర్జాతీయ జ్ఞాన వ్యవస్థ రూపొందించింది.. |

నందిని సుందర్ తన బస్తర్ పరిశోధనకు ఒక స్పష్టమైన లక్షాన్ని ఎన్నుకుంది. ఆమె మాటల్లోనే ʹఈ పుస్తకంలో దోపిడీ ప్రతిఘటన చుట్టూ అల్లుకున్న సామాజిక చట్రంలో నుండి యుద్దాన్ని చూడడానికి ప్రయత్నించానుʹ. ఈ దృష్టిని కొనసాగిస్తూ ʹపటిష్టమైన నిర్మాణాలు కార్పొరేటు రాజకీయ ధనదాహం, అధికారుల ఉదాసీనత ముందు తల వంచాయి.ʹ ఇంకా స్పష్టంగా చెపుతూ ʹనా పరిచయంలోకి వచ్చిన ఆదివాసీల వరకు ఈ పుస్తక రచన చేసాను... ఇంకా చెప్పాలంటే నా కోసం నేను రాసుకున్న పుస్తకం ఇది. మనుషులను, వారి జీవన తీరులను నిర్మూలం చేస్తుండడం పట్ల పశ్చాత్తాప హృదయంతోను, నిస్సహాయ నేత్రంతోను, ఆగ్రహ కంఠంలోను నేనీ రచనకు పూనుకున్నానుʹ నిజానికి ఆమె అక్కడ ఆగలేదు.

సల్వాజుడుం లాంటి అతిక్రూర అమానవీయ మూకను ఎండగట్టడానికి వారి దుశ్చర్యలని నిరోధించడానికి న్యాయస్థానంలో అతి సాహసోపేత పోరాటాన్ని చేసింది. ఈ పోరాటంలో ఆమె చేసిన కృషి నమ్మశక్యం కానిది. ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో బోధించే ఒక అధ్యాపకురాలు పడ్డ బాధలు, ఎదుర్కొన్న అవరోధాలు, వ్యక్తిగతంగా అనుభవించిన అనిశ్చితత అడుగడుగునా ఏం జరుగుతుందోనన్న బాధ, భయం, దుఃఖం, కన్నీళ్ళు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నంత కాలం తాను గురైన ఉద్వేగాన్ని, కేసు గెలిచినప్పుడు ఆమె అనిర్వచనీయ ఆనందాన్ని చూస్తే ఈమె ఒక పరిశోధకురాలేనా లేదా గిరిజనులను ప్రేమించి మానవత్వాన్ని మూట కట్టుకున్న మనిషా అనే భావోద్వేగం పుస్తకం చదివే వాళ్ళకు కలుగవచ్చు.

ఆదివాసీలు భాగస్వాములై వాళ్ళ జీవితాలు మెరుగుపడి మరింత సంతృప్తిగా సంతోషంగా జీవించే వాతావరణం ఏర్పడేది. దీనికి భిన్నంగా వాళ్ళను నిర్వాసితులను చేసి, అక్కడి నుండి వాళ్ళని తరిమేసి, వాళ్ళ కాళ్ళ కింది భూమిని ఆక్రమించుకునే దురాలోచనే ఇవ్వాళ ఆదివాసీల దుఃఖానికి వాళ్ళ పోరాటానికి మూల కారణం. మన ఇంట్లో నుండి మనని తరిమేస్తే మనం ఏం చేస్తాం అని మన దేశ మధ్య తరగతి ఆలోచించే దాకా ఈ అప్రజాస్వామిక ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి.

ఇవ్వాళ ఒక్క బస్తరే కాదు దేశ వ్యాప్తంగా అన్ని ఆదివాసీ ప్రాంతాలు ఒక ఉధృత పోరాటంలో ఉన్నాయి. ఆ ప్రాంతానికి పరిశోధన కొరకు వెళ్ళిన నందిని సుందర్ లాంటి వాళ్ళకు, ఆదివాసీల పోరాటంలోని న్యాయం ప్రత్యక్షమయ్యింది. మానవత్వం, న్యాయభావన ఉన్న ఎవ్వరైనా అలాగే ప్రభావితమౌతారు. పోరాడుతున్న ఆదివాసీల నుండి, పోరాటానికి అండగా నిలిచిన మావోయిస్టు పార్టీ పట్ల అభిమానమేర్పడింది. మావోయిస్టు పార్టీ పోరాట క్రమంలో చేసే తప్పులను ఆమె నిర్మొహమాటంగా ఎత్తి చూపించింది. ఏ ప్రజా పోరాటానికైనా ఇలా నిజాయితీగా, నిర్భయంగా పొరపాట్లను ఎత్తి చూపే వాళ్ళ అవసరం చాలా ఉంటుంది.

ఆమె పరిశోధనా కాలంలోనే పోరాటాలని రాజ్యం తన పోలీసు యంత్రాంగం ద్వారా అణచడానికే నిర్ణయించుకుంది. ఆదివాసీల జీవన విధానాన్ని, ప్రకృతితో వాళ్ళకేర్పడిన మానవీయ సంబంధాన్ని గురించి కాని, తమ అభివృద్ధి నమూనా దుర్మార్గాన్ని కాని రాజ్యం చూడడానికి నిరాకరించడంతో, హింస పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. దీనికి నందిని సుందర్ ప్రత్యక్ష సాక్షి కావడంతో రాజ్యం ఎన్నుకొన్న పద్దతితో తాను విబేధించింది. రాజ్యహింస పెరిగిన కొద్దీ ఆదివాసీల పట్ల ఆమె ఆరాటం పెరుగుతూ వచ్చింది. ఆమె పరిశోధనలో తన దృష్టికి వచ్చిన ప్రతి సంఘటనను, సందర్భాన్ని సవివరంగా రికార్డు చేసింది. హింస పెరిగిన కొద్దీ ప్రతిఘటన కూడా అదే స్థాయిలో పెరుగుతూ రావడంతో ఆమె భౌతికంగా దాంట్లో చిక్కుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ధైర్యాన్ని కూడగట్టుకొని యుద్ధభూమిలో నిలబడే పరిశోధకులు నాకు తెలిసి చాలా అరుదు.

ఆదివాసీలతో నిలబడ్డ మావోయిస్టు పార్టీలో ప్రతిఘటన తీవ్రతరమై, రాజ్యం తాను పెట్టుకున్న ఏ నియంత్రణను కూడా ఖాతరు చేయని దశ వచ్చింది. ఉదార రాజనీతి శాస్త్రంలో రాజ్య ఆవిర్భావము ఒక సామాజిక అవసరం నుండి వచ్చిందని, మనుషులు తమకు కావలసిన భద్రత కొరకు రాజ్యాన్ని నిర్మించుకున్నారని, రాజ్యం మనిషి ప్రాణాన్ని కాపాడేందుకే ఏర్పడిందని సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. సమూహాల మధ్య, వ్యక్తుల మధ్య, ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడప్పుడు రాజ్యం బలప్రయోగం చేసే అధికారాన్ని అప్పచెప్పుతూ, ఈ అధికారాన్ని చట్టబద్ద పరిమితులలోనే ఉపయోగించాలనే అందరు యువ పరిశోధకుల లాగే నందిని సుందర్ తన పిహెచ్.డి కొరకు బస్తర్ ను ఎన్నుకుంది. అలా 1990 ప్రాంతంలో బస్తర్లో ప్రవేశించి నందిని సుందర్ జీవితం గత మూడు దశాబ్దాలుగా అక్కడి గిరిజనుల జీవితాలతో వాళ్ళ సంఘర్షణతో ముడిపడిపోయింది. ఒకవైపు పరిశోధన మరోవైపు వాళ్ళ హక్కుల కొరకు ఆరాటం.

రెండు కలగలిపి పరిశోధన కొనసాగించింది. బహుశా భారతదేశంలో అత్యంత ఘర్షణాయుత ప్రాంతం బస్తర్. ఈ ప్రాంతం ఆదివాసీలు దాదాపు గత రెండు శతాబ్దాలుగా ఏదో ఒక పోరాటంలో భాగంగా ఉన్నారు. నేటికి ఆ పోరాటం కొనసాగుతున్నది. నందిని సుందర్ ప్రవేశించే కాలంలోనే సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధి కూడా తీవ్రతరమౌతున్నది. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగంలో పొందుపరచబడిన సాంఘిక సమానత్వ, సోషలిస్టు ప్రయోగం బదులుగా ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెహ్రూ ప్రభుత్వం ప్రవేశపెట్టడంలో, ప్రైవేటు పెట్టుబడి, మార్కెట్ సామాజిక సమానత్వాన్ని, న్యాయభావనని వెనక్కినెట్టి క్రమక్రమంగా తమ ఆధిపత్యాన్ని సాధించుకొన్నాయి.

నిజానికి 1980లలో దేశ అభివృద్ధి పూర్తిగా రైలు పట్టాలు తప్పింది. ఈ కాలంలోనే అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గర షరతులతో కూడిన అప్పును తీసుకోవడం, దాంతో స్వావలంబన, సార్వభౌమత్వం సామ్రాజ్యవాదుల పాదాల దగ్గర పెట్టడం జరిగింది. అంతిమంగా అంత కాలంగా అమలులో ఉన్న అభివృద్ధి నమూనాకు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలిచ్చి, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. కనుసన్నలలో పని చేయడం ప్రారంభించింది. బస్తర్ ఆదివాసీల పాపమల్లా వాళ్ళు వేలాది సంవత్సరాలుగా నివసించే ప్రాంతంలో అతి విలువైన ఖనిజ సంపద ఉండడమే! భారత కార్పోరేట్లకి బహుళ జాతి కంపెనీలకి ఈ వనరుల మీద పట్టు కావాలి.

దేశ అభివృద్ధి కొరకు ఖనిజ సంపద ఉపయోగించడం తప్పా? దేశం ఎలా అభివృద్ది చెందుతుంది? మనం ప్రపంచ పోటీలో ముఖ్యంగా చైనాతో ఎలా పోటీ పడగలం? లాంటి ప్రశ్నలు దోపిడీదార్లు, కొందరు అమాయకులు అడుగుతుంటారు. అభివృద్ధి ఎవరికొరకు, అభివృద్ధిలో ఆదివాసీలు భాగస్వాములా కాదా అని అడిగేవారు అభివృద్ధి నిరోధకులలా కనిపిస్తారు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బిజెపికి ఇలాంటి వాళ్ళు సరాసరి దేశద్రోహులుగానే కనిపిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యావసాయక దేశాలు పారిశ్రామిక దేశాలుగా మారడానికి దేశ ఖనిజ సంపద, అలాగే తాము పరిపాలిస్తున్న వలస దేశాల ప్రకృతి వనరులు బాగా ఉపయోగపడ్డాయి. మన పరిస్థితి అది కాదు. వలస పాలన కాలంలో మొదలైన దోపిడియే కొనసాగుతున్నది.

మన సహజ వనరులను వేరే దేశాల ప్రయోజనానికి కట్టబెట్టడం, వాళ్ళు ఇచ్చే రాయల్టీలను చూసి మురిసిపోవడం తప్ప ఇది ఏమాత్రం దేశ ప్రజల కేంద్రిత అభివృద్ధి మాత్రం కాదు. నిజానికి బస్తర్ ఖనిజ వనరులతో స్థానిక అభివృద్ధి చేపడితే ఆ అభివృద్ధిలో నియమమున్నది. రాజ్య బలప్రయోగానికి ప్రైవేటు బలప్రయోగానికి తేడా ప్రధానంగా అదే. రాజ్యం చట్టం నిర్దేశించిన హద్దులను దాటకూడదు. అంటే ఏ చట్టమైతే రాజ్యానికి అధికారాన్ని ఇస్తుందో ఆ చట్టమే పరిమితులను విధిస్తుంది. రాజ్యం చట్ట వ్యతిరేక లేదా చట్ట అతీత బలప్రయోగాన్ని ప్రయోగిస్తే దాని అధికారానికి విశ్వసనీయత ఉండదు.

అప్పుడు ప్రైవేటు గుండాలకు రాజ్యానికి ఉండే సరిహద్దు రేఖ చెరిగిపోతుంది. అందువల్లే బస్తర్లో రాజ్యం చట్ట పరిధులు దాటినప్పుడల్లా పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల బృందాలు, న్యాయస్థానాలు దానిని నిరంతరంగా ఎత్తి చూపుతూనే ఉన్నారు. తన వృద్ధి నమూనాకు కట్టుబడిన రాజ్యం ప్రైవేటు సైన్యాలని ప్రోత్సహించి తమ చేతికి నెత్తురు అంటకుండా సల్వాజుడుంలాంటి అసాంఘిక, అమానవీయ గ్యాంగులను ముందుకు తోసింది.

ఈ మొత్తం పరిశోధనలో సల్వాజుడుం చేసిన అతిక్రూరమైన వందల సంఘటనలను నందిని సుందర్ కళ్ళకు కట్టినట్లు వివరించారు. మనుషులు ఇంత క్రూరంగా ఎలా తయారౌతారు, ఇంత ఎత్తున హింసకు ఎలా పాల్పడుతారు, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అన్న కొన్ని మౌలిక ప్రశ్నలు తట్టక మానవు. అమాయక ఆదివాసీలను, ఏ. దోపిడీకి పాల్పడని వాళ్ళను, తమ మానాన తాము జీవిస్తున్న వాళ్ళ జీవితంలోకి దుర్మార్గ అభివృద్ధి నమూనా చొప్పించి వాళ్ళ జీవితాలను ఇంత అస్తవ్యస్తం చేయడం విస్మయాన్ని, భయాన్ని కలిగిస్తుంది.

మనుషులను నిలువునా కాల్చడం, కాలుతున్న ఇళ్ళలోకి మనుషులను నెట్టడం, గొడ్డళ్ళతో గొంతులు నరకడం, నిలువుగా నరకడం, చిన్న పిల్లలను చంపడం - ఇవి దేన్ని సూచిస్తున్నవి. మానవ ప్రవృత్తిలో ఇంత దానవత్వం ఎక్కడి నుండి వస్తుందో అన్న ఆలోచన మన అవగాహనకు మించిన భారం. ఇక మహిళల విషయంలో ఊహించలేని దుర్మార్గాలు - వివస్త్రలను చేయడం దగ్గరి నుండి సామూహిక అత్యాచారాలు చేసి వాళ్ళను నిలువునా కాల్చివేయడం చూస్తే మనం మనుషులుగా పుట్టినందుకు తలదించుకోవాలి అనిపిస్తుంది.

సల్వాజుడుం అకృత్యాలని ప్రత్యక్షంగా గమనించిన నందిని సుందర్ ధర్మాగ్రహానికి గురయ్యారు. ఈ అమానుష చట్ట వ్యతిరేక చర్యలకు ఎలాగైన ఒక అడ్డుకట్ట వేయాలని చట్టబద్ద పోరాటానికి సిద్దమయ్యింది. ఈ పోరాటాన్ని రాజీ లేకుండా చివరి దాకా కొనసాగించింది. దీనికి ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ, అలాగే రాజ్యంలో భాగంగా పనిచేసి తన పదవికి మధ్యంతరంగా రాజీనామా చేసి ప్రజాపక్షం నిలబడ్డ ఇ.ఎ.ఎస్ శర్మతో కలిసి సుప్రీంకోర్టులో పోరాడి సల్వాజుడుంను రద్దు చేయాలనే జడ్జిమెంట్ ను న్యాయస్థానం నుండి సాధించింది. ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం ఒక దశలో సల్వాజుడుం అకృత్యాలని రాజ్యహింసలో భాగంగానే పరిగణించడం మొదలుపెట్టారు.

ఇది చట్టవ్యతిరేకమని అత్యున్నత న్యాయస్థానం అనడంతో వీళ్ళని పోలీసు యంత్రాంగంలో అంతర్ భాగం చేస్తూ ఆజ్ఞలు జారీ చేసారు. అంతవరకు ఏ చట్టాన్ని ఏ అధికారిని ఖాతరు చేయని సల్వాజుడుం సభ్యులని పోలీసు యంత్రాంగ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది ఆదివాసీలకు కొంత కాకున్నా కొంత ఊరటనిచ్చింది. ఒక పరిశోధకురాలు ఇలాంటి విజయాన్ని సాధించడం సామాజిక శాస్త్ర పరిశోధనా చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా రికార్డు చేయవలసి ఉంటుంది.

బస్తర్ వనరుల మీద బహుళ జాతి కంపెనీల కన్నుంత వరకు యుద్ధం ఆగడం కష్టమే. మావోయిస్టు పార్టీ తమ ముగ్గురు అగ్రనాయకులను రాజ్యం హత్య చేయడంతో తమ రక్షణ కొరకు పి.ఎల్.జి.ఎ. సైన్యాన్ని అభివృద్ది చేస్తారు. దాని పరిధిని పెంచుతూ పోతున్నారు. సల్వాజుడుం ప్రయోగం విఫలమయ్యాక రాజ్యం సరాసరి యుద్దాన్నే ప్రకటిస్తూ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేర మరో దాడికి పూనుకున్నది. అమెరికాలో తెల్లవాళ్ళు ఆదివాసీ ప్రాంతంలో చొరబడి అక్కడి రెడ్ ఇండియన్స్ ని ఊచకోత కోసిన దుర్మార్గానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పేరును తమ బలగానికి పెట్టుకున్నారంటేనే వాళ్ళ అంతిమ ఉద్దేశమేమిటో స్పష్టంగానే తెలిసిపోతుంది.

బస్తర్లో పారామిలటరీ బలగాలను దించి మొత్తం అధికారాన్ని వాళ్ళకు అంటగట్టారు. ఒకవైపు సల్వాజుడుం మరో వైపు ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడికి తట్టుకోలేక వేలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు. తమ గూడాలను వదిలి పక్క రాష్ట్రాలకు వలసపోయి పడరాని కష్టాలు పడుతున్నారు. పారామిలటరీ బలగాలు వస్తున్నాయంటే గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి ఎక్కడో తలదాచుకుంటున్నారు. వేల సంవత్సరాలుగా అడవిని నమ్ముకుని, భూమిని నమ్ముకుని, తమ దేవతలను పూజిస్తూ నిరాడంబర జీవితం గడిపే ఆదివాసీలు నిరాశ్రయులై నిర్వాసితులుగా జీవించే వైనాన్ని చూస్తే, ఒక అభివృద్ధి నమూనా బలిపీఠం మీద ఎంత మంది జీవితాలో బలైతే తప్ప, ఎంతో ప్రాణనష్టం జరిగితే తప్ప తాము వాగాడంబరంగా చెప్పుకునే ʹవృద్ధిరేటుʹ పెరగదు.

ఈ పరిశోధనలో మూడవ భాగంలో మూడు కీలకమైన అంశాలను నందిని చర్చకు పెట్టారు. ఒకటి- ʹశాంతిభద్రతలు - అభివృద్ధిʹ, రెండు - స్మృతిపథంలో ప్రజాస్వామ్యం, మూడు - మానవ హక్కులు, వెలుగు నీడలు. ఈ మూడు అంశాలలో కొన్ని మౌలికమైన, సైద్ధాంతికపరమైన వివాదస్పదమైన ప్రశ్నలను అడుగుతూ చర్చను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు. ఇందులో లేవదీసిన ప్రశ్నలు కేవలం బస్తర్ కు పరిమితమైనవి కావు. ఇవి మానవాళి అభివృద్ధి దిశను స్పర్శిస్తున్న సార్వజనీనమైన ప్రశ్నలు. నందిని సుందర్ ఒక సామాజిక శాస్త్రవేత్తగా బస్తర్ పరిశోధనలో తన అనుభవాన్ని సిద్ధాంతీకరిస్తూ దీని పరిధిని పెంచి విస్తృతమైన విలువైన సవాళ్ళను మన ముందుంచారు.

ఈ యుద్ధ వాతావరణంలోనే ఆదివాసీలు జనతన సర్కార్ ను ఏర్పరచుకుని తమ స్వయం పరిపాలనను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇందులో నుండే ఒక కొత్త రాజ్య వ్యవస్థ పుట్టుక వస్తున్నదని నందిని సుందర్ విశ్లేషించారు. ఈ జనతన రాజ్యం మీద విరసం పాణి ఒక సమగ్రమైన ప్రామాణికమైన గ్రంథాన్నే వ్రాసారు. బలమైన భారత రాజ్య వ్యవస్థ దాడులకు కొత్తగా చిగురించే ప్రత్యామ్నాయ రాజ్యం నిలబడుతోంది అనేది చరిత్ర గమనం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా మనం గమనించవలసిన అవసరం ఉంది.

ఆమె తన చివరి అధ్యాయంలో ముగింపుగా ఒక సుందర స్వప్నాన్ని ఆవిష్కరించారు. ఆ స్వప్నంలో ఆమెకు భవిష్యత్తు మీద ఉండే బలమైన విశ్వాసం కనిపిస్తుంది. స్వప్నాలు లేకుండా ప్రజాపోరాటాలుండవు. ప్రయోజనకరమైన పరిశోధన ఉండదు.
ఈ మొత్తం పరిశోధనలో అంతర్లీనంగా నందిని సుందర్ సున్నితమైన వ్యక్తిత్వం ఉంది. ఆమెలో ఒక అరుదైన సహజత్వం ఉంది. ఆమె ఎవ్వరితోనైనా స్నేహపూరితంగా మాట్లాడగలదు, చాలా తొందరగానే మనుషులకు దగ్గర కాగలదు. ఆ వ్యక్తిత్వం వల్లే ఆమె బస్తర్ ఆదివాసీలతోనే కాదు, భిన్న వ్యక్తులతో, సమూహాలతో స్నేహపూరితంగా మాట్లాడి అతి క్లిష్టమైన సమాచారాన్ని సేకరించగలిగింది.

ఒకవైపు మావోయిస్టు పార్టీ నాయకులతో, మరో వైపు సల్వాజుడుం నాయకులతో కలిసి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం అంత సులభమైన పనికాదు. అలాగే రాజ్యంలో భాగమైన సి.ఆర్.పి.ఎఫ్. ఇతర పోలీసు అధికారులతో అంతే స్నేహపూరితంగా ప్రవర్తించింది. తన పరిశోధనకు కావలసిన సమాచారాన్ని అతి సులువుగా సమీకరించకలిగింది. ఆమెను అందరూ గౌరవంగానే చూస్తారు. సల్వాజుడుం మీద సుప్రీంకోర్టులో పోరాడుతున్న కాలంలో కూడ బస్తర్లో తన కేసుకు కావలసిన సాక్ష్యాధారాలు సేకరించడానికి తానే వెళ్ళింది.

సాక్షులకి ఆత్మ విశ్వాసాన్నిచ్చి నిలబెట్టింది. బస్తర్ ఘర్షణల మధ్య కత్తిమీద సాము చేస్తూ ఏ దశలో కూడా బస్తర్ ఆదివాసీల పట్ల తన నిష్కల్మషమైన ప్రేమతో రాజీపడలేదు. సామాజిక శాస్త్ర, పరిశోధనా రంగానికి నందిని సుందర్ స్ఫూర్తిదాతే కాక ఒక విలువైన రోల్ మాడల్. | ఈ పుస్తకాన్ని ఆంగ్లం నుండి తెలుగులోకి రివేరా అనువదించారు. తెలుగులో చదువుతున్నప్పుడు ఇది అనువాదమని ఎక్కడా అనిపించదు. ఇంగ్లీషు ʹబర్నింగ్ ఫారెస్ట్ చదివినప్పటికంటే తెలుగులో ʹమండుతున్న మహారణ్యంʹ చదివినప్పుడు నేను తీవ్రమైన ఉద్రిక్తతకు గురయ్యాను. ఇంత అద్భుతమైన అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించిన రివేరా ఎంతో అభినందనీయుడు.

Keywords : bastar, nadini sundar, maoists, police, adivasi
(2024-04-03 19:18:29)



No. of visitors : 2380

Suggested Posts


మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం

జూన్ 18 నుండి 20 వతేదీ వరకు మూడు రోజులు... 10 వేల మంది ప్రజలు... 300 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు....ఎర్ర జెండాల రెపరెపల మధ్య క్రీడా కార్యక్రమాలు...సాంస్కృతిక కార్యక్రమాలు.... నాయకుల ఉపన్యాసాలు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


బస్తర్