రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?

రాయలసీమకు


(రాయలసీమ విద్యావంతుల వేదిక సబ్యుడు అరుణ్ రాసిన ఈ వ్యాసం వీక్షణం జూలై, 2019 సంచికలో ప్రచురించబడినది)

ఈసారీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బిజెపి, వైఎస్‌ఆర్‌సిపిలు అనూహ్యమైన మెజారిటీతో విజయం సాధించి అందరినీ విస్మయ పరిచాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అనుకున్నారు. చివరిలో ఎన్నికల నిర్వహణ తీరుపై చంద్రబాబు పదే పదే అనుమానాలు వ్యక్తం చేయడం, ఏనాడు ధైర్యంగా మంత్రుల ముందు ప్రజలకు సంబంధించిన న్యాయమైన విషయాలలో కూడా నోరు విప్పని ప్రభుత్వ ఉన్నతాధికారుల ధిక్కార చర్యలు చంద్రబాబుకు ఓటమి తప్పదని విశ్లేషకులకు స్పష్టమయ్యింది.

అయితే ఈ ఎన్నికలు జరిగిన తీరు, నాయకుల ప్రచారశైలి, ఫలితాలు మాత్రం ఇప్పటికే మూగవోయిన ప్రజాస్వామ్యానికి మరింత చేటు అని చెప్పవచ్చు. ఏకపక్ష తీర్పు, అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నియంతృత్వ పోకడలను బలోపేతం చేశాయి కూడా. వ్యక్తి కేంద్రంగా జరిగిన ఎన్నికలు పార్లమెంటరీ తరహా ఎన్నికలుగా కాక, అధ్యక్ష తరహా ఎన్నికల లాగా నిర్వహించబడ్డాయి. ఇది భూస్వామ్య భావజాలం మన సమాజంలో ఎంతగా వేల్లూనుకుని ఉందో స్పష్టం చేస్తున్నది. ఇప్పటికే రాజ్యాంగ విలువలు, సెక్యూలరిజం, భావప్రకటనా స్వేచ్ఛనకు ఇస్తున్న తరుణంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి.

రాష్ట్రంలో జగన్‌ అత్యంత మెజారిటీతో గెలవడం, చంద్రబాబు ప్రభుత్వం అన్నివర్గాలలో ఎంత ఆదరణ కోల్పోయిందో విధితం చేస్తుంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో వైఎస్‌ఆర్‌సిపి తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచి పెట్టింది. దీనికి చంద్రబాబు రాయలసీమ ప్రాంతం పట్ల వహించిన నిర్లక్ష్య వైఖరి కూడా కారణంగా చెప్పవచ్చు. దానికి తగిన బుద్దే చెప్పారు సీమ ప్రాంతం వాళ్లు. దానికి తోడు రాయలసీమలో జగన్‌ సామాజికవర్గం బలంగా ఉంది. వారు 9 సంవత్సరాలుగా అధికార దాహంతో, అసంతృప్తితో ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రాన్ని ఏలడానికి ఇది వారికి చివరి అవకాశం అని తెలుసు. అందుకే, వారు చావో-రేవో తెల్చుకునేలా పనిచేయడం కూడా జగన్‌ విజయానికి దోహద పడిందని చెప్పవచ్చు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కోస్తా, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సేవకై వినియోగిస్తూ, తన రెండుకళ్లు అమరావతి, పోలవరం అంటూ వెనుకబడిన ప్రాంతాలయిన శ్రీకాకుళాంధ్ర, రాయలసీమ కనీస నీటి అవసరాలను పట్టించుకోక పోవడంతో, ఆ రెండు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ఏర్పడింది. కాపుల వ్యతిరేకత, దళితుల ఆగ్రహం, తెలుగుదేశం నాయకుల అవినీతి అరాచక చర్యలు-ఇవన్నీ ఇతర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ఓటమికి దోహదం చేశాయని చెప్పవచ్చు.

జగన్‌ ఎన్నికతో సీమవాసుల చిరకాల ఆకాంక్షలు తీరుతాయా? అంటే ఇక్కడి జగన్‌ అభిమానులు తప్పక అంటున్నారు. కాని ప్రతిపక్ష నాయకునిగా అతని గత చరిత్ర చూస్తే ఆ ఆశలు అడియాసలవుతాయని ఉద్యమకారుల అనుమానం. గత ఐదు సంవత్సరాలలో ఏనాడు సీమ న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడని జగన్‌ ఇప్పుడు కోస్తా ప్రాంత అంగ, అర్థబలాన్ని విస్మరించి, ధిక్కరించి సీమకు న్యాయం చేస్తాడా అనేది అనుమానంగా ఉంది. గతంలో కృష్ణా నదిపై తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నదనీ, అందువల్ల, (రాయలసీమ రైతాంగం కాదు) సాగర్‌, కృష్ణా ఆయకట్టుదారులు నష్టపోతారంటూ కర్నూల్‌లో రెండు రోజుల నిరసన దీక్షకు పూనినప్పుడే జగన్‌ ఏవైపు ఉన్నాడు అనేది అర్థమయ్యింది. కోస్తా ప్రాంత రైతులు నష్టపోతారని నిరసన తెలపడానికి సీమవాసులకే అభ్యంతరం లేదు, కాని ఆ దీక్షను ఏ ప్రకాశం బ్యారేజ్‌పైన జరపకుండా, సీమ సాగు, తాగునీటి ఊసు ఏనాడు ఎత్తని నాయకుడు, సాగర్‌, కృష్ణా ఆయకట్టుదారుల కోసం కర్నూల్‌లో నిరసన జరపడంలో ఔచిత్యం ఏమిటని మేం కరపత్రం వేసి నాడే ప్రశ్నించాం. ఆయన నిరసనను నిరసిస్తూ ఇక్కడి సీమ సంఘాలు ఒకరోజు నిరాహార దీక్ష జరిపాయి కూడా.

జగన్‌ పట్ల సీమ ఉద్యమకారులకు ఉన్న మరో అసంతృప్తి, అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు నోటిమాటకైనా రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని అనకపోవడం, శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం కనీసం హైకోర్టునైనా సీమలో ఏర్పాటు చేయాలని సీమ నాలుగు జిల్లాల్లో ఉవ్వెత్తున నెలల తరబడి ఉద్యమాలు కొనసాగినా జగన్‌ మౌనవ్రతం పాటించడం. సరే ఇవన్నీ తన కోస్తా అధినేతలకు ఆగ్రహం తెప్పిస్తాయని మౌనంగా ఉన్నాడనుకుందాం. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇవ్వబడ్డ బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీని గాని, కడపలో ఉక్కు కర్మాగారం విషయం లో గాని, హంద్రీ-నీవ, గాలేరు నగరి లాంటి నీటి ప్రాజెక్టుల పూర్తి విషయం గాని ఆయన నోరు విప్పలేదు. చివరకు తన జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు కర్మాగారం గురించి కొన్ని నెలల పాటు ఉద్యమాలు జరిగినా ఆయన పట్టించుకోకపోవడం ఏం సూచిస్తుంది. ఇక విభజన చట్టంలో ఎక్కడా విశాఖలో రైల్వే జోన్‌ అని పేర్కొనలేదు కదా. అయినా అందరిలాగే తానూ విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడ అవకాశం లేదని కేంద్రం స్పష్టంగా తెల్పినా, ఆ రైల్వే జోన్‌ను వెనుకబడిన ప్రాంతమైన గుంతకల్‌లో ఏర్పాటు చేయమని ఎందుకు మాట్లాడ లేదు అనే భాద సీమవాసులకుంది.

ఇవన్నీ వదిలేసినా కేసి ఆయకట్టుదారులకు కేటాయించిన సాగు నీరందేల గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి 2014 లోనే వివరమైన ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడ్డది కదా. ఆ విషయం ఆయన నంద్యాల ఉప ఎన్నికల వరకు మాట్లాడలేదు. అప్పుడు ఓట్ల కోసం మాట్లాడినా, ఆయన దాని నిర్మాణానికి చేసిన కృషి శూన్యం. ఎన్నికలలో ఓట్ల కోసం చంద్రబాబు సీమవాసుల కన్నీటి తుడుపుగా గుండ్రేవుల రిజర్వాయర్‌, వేదవతి ఎత్తిపోతల పథక నిర్మాణానికి ఉత్తర్వులిచ్చినా, ఇప్పుడు వస్తున్న సమాచారం బట్టి నిధుల కొరత పేరుతో వాటిని రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జగన్‌కు సీమ రైతాంగం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు.

అంతకన్నా దుర్మార్గం రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌ చేయకపోవడంతో సీమ యువతకు ఉద్యోగావకాశాలు లేవు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌ చేయాలని ఇక్కడి నిరుద్యోగ యువత ఘోషిస్తున్నా జగనే కాదు, ఏ రాజకీయ పార్టీ ఈ న్యాయమైన డిమాండ్‌ను పట్టించుకోలేదు.

అంటే రాయలసీమ వాళ్లు వారికేమీ చేయకపోయినా వ్యక్తి ఆరాధనతో ఓట్లు వేస్తారనే నమ్మకం ఆయనకుంది. అలాగే జరిగింది.

సరే గతం గతహాః అనుకుందాం ఇప్పుడు కూడా జగన్‌ ప్రమాణ స్వీకారం తిరుపతిలోనని ప్రకటించిన గంటలోనే కాదు ప్రమాణ స్వీకారం అమరావతిలోనని చెప్పడం వెనుక ఎవరి హస్తం ఉంది. గతంలో కూడా చంద్రబాబు ఇలానే మార్చాడు. ప్రమాణస్వీకారం తిరుపతిలో జరిగినంత మాత్రాన రాయలసీమకు ఏదో ఒరుగుతుందని కాదు. అదొక అస్తిత్వ సమస్య. క్షణాలలో జరిగిన స్థల మార్పు నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉంది అనేదానికి సూచనేమోనని సీమవాసులకు ఆందోళనగా ఉండడం సహజమే.

మరొక కారణం, ప్రభుత్వాలపై గుంటూరు, కృష్ణ జిల్లాల ధనిక రైతాంగపు భల్లూకపు పట్టు. తిరుగులేని నేతగా చెప్పబడే రాజశేఖరరెడ్డే తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పునరుద్ధరించి గుంటూరు, కృష్ణ జిల్లాల ధనిక రైతాంగపు ఒత్తిడికి లొంగి, రెండు నేలలలోపే రిజర్వాయర్‌ కనీస నీటిమట్టాన్ని తిరిగి 834 అడుగులకు కుదించాడు. ఈ నేపథ్యంలో జగన్‌ గుంటూరు, కృష్ణ జిల్లాల ధనిక రైతాంగపు కనుసన్నలలో మెలగకుండా ఉండగలడా?

ఏది ఏమైనా ఈ యువనాయకునిపై రాయలసీమ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. జగన్‌ ప్రమాణస్వీకారం నాడే అవినీతిరహిత ప్రభుత్వం అందిస్తానని హామీ ఇచ్చాడు. అది ఈ వ్యవస్థలో సాధ్యం కాదనీ తెలుసు. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టగానే, గతంలో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి విధేయులైన ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు అయన సేవకై క్యూ కట్టారు. నేడు ఏ అధికారైనా ప్రజల సేవకు కాకుండా పార్టీ అధినేతల సేవకే జీవితాలను అంకురార్పణ చేయడం చూస్తూనే ఉన్నాం. వారిలో ʹనాకింత ఇచ్చుకో - నీవింత పుచ్చుకోʹ ఆరోపణలున్న అధికారులుండడం కాకతాలీయమని అనుకోలేం. ఈ నేపథ్యంలో అవినీతిరహిత పాలన ఊహించడమూ కష్టమే.

ఏమైనా, ఇప్పుడు జగన్‌కు రాయలసీమకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే అవకాశం వచ్చింది.

అందులో ముఖ్యంగా చేయవలసింది- రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌ చేయాలి. అన్ని ప్రాంతాల వాళ్లకూ రాజధాని ప్రాంతంలో ఉద్యోగావ కాశాలు ఉండాలి. జిఒ 69ను రద్దు చేయాలి. ఇది రాయలసీమకు మరణశాసనం. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 854కు పునరుద్ధరించాలి. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుండి 80-120 టిఎంసిల నీరందుతున్నది కాబట్టే, ఇక శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల శ్రీశైలం రిజర్వాయర్‌ నుండి కృష్ణా డెల్టాకు నీరు ఆపివేయాలి.

పోతిరెడ్డిపాడు నుండి సీమ సాగునీటి పథకాలకు సరైన సమయంలో నీరందాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తప్పని సరి. దీనిని ముగ్గురు ఇంజనీర్స్‌-ఇన్‌-చీఫ్స్‌ సిపారసు చేశారు కూడా. రాయలసీమ యువతకు ఉపాధి కల్పించేలా గుంతకల్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పథకాలకు నికర జలాలు అందించేలా చర్యలు చేపట్టాలి. చింతలపూడి, వైకుంటపురం, పులిచింతల లాంటి స్కీంల వల్ల ఆదా అయ్యే నీటిని కృష్ణా డెల్టాకు వినియోగిస్తూ, కృష్ణా జలాల పునః పంపిణీ చేసి రాయలసీమలో కనీసం ప్రతి ఎకరాకు ఒక పంటకైనా నీరందివ్వాలి. వేదవతిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలి. ఆర్‌డిఎస్‌ కుడి వరద కాలువ నిర్మాణంతో వృథా అవుతున్నా తుంగభద్రా వరద జలాలను కరువుసీమకు అందజేయాలి. కర్నాటక రాష్ట్రంతో చర్చలు జరిపి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం చేపట్టి అనంతపురం జిల్లా ను సస్యస్యామలం చేయాలి. రాయలసీమకు ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదు. రాయలసీమకు, దక్షిణ తెలంగాణకు శ్రీశైలం రిజర్వాయర్‌ నీటిని పూర్తిగా కేటాయించాలంటే ఏ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకొని ప్రజల ఓట్లు పొందారో, ఆ నేత ప్రారంభించిన, దాదాపు రు. 500 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన దుమ్ముగూడెం-నాగార్జున సాగర్‌ టైల్‌ పాండ్‌ ప్రాజెక్టును సాధించాలి.

అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలూ ఒకే ప్రాంతంలో ఉండకుండా వికేంద్రీకరణ జరగాలి. అందులో భాగంగా కేంద్ర లేక రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒక దానిని నంద్యాలలో ఏర్పాటు చేయాలి. నంద్యాల వ్యవసాయ పరిశోధన సంస్థకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సోనా మసూరి, నరసింహ పత్తి వంగడం కనిపెట్టిన ఘనత ఉంది.

ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు కాదు. ఇతర ప్రాంతాల రైతాంగపు హక్కుల దోపిడీ కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ది ఉంటే చేపట్టవలసిన ప్రజాహిత కార్యక్రమాలు. ఇలాంటి పథకాల పూర్తితో నవరత్నాలతో పని ఉండదు. ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా బతికే అవకాశాలు కల్పించే పథకాలివి.

ఇంతవరకు ఎవ్వరికీ రాని అవకాశం జగన్‌కు వచ్చింది. అందు లోనూ తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్‌కు సత్సంబంధాలున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కూడా విరోధం లేదు. ఆ విషయమై ఆయన తొలి నుండి స్పష్టంగా ఉన్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ గొంతు చించుకొని అరుస్తూ పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజినామలిచ్చారు సభ్యులు. అది తమ చిత్తశుద్ధికి సంకేతం అని డప్పాలు కొట్టుకున్నారు కూడా. ఇప్పుడు జగన్‌ ప్లేటు ఫిరాయించాడు. మోడీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, అందువల్ల ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పాడు. మొన్నటివరకు విభజన చట్టంలోని ʹప్రత్యేక ప్యాకేజీʹ డిమాండ్‌ చేయక చట్టంలో లేని ʹప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట జగన్‌తో సహా అన్ని పార్టీలు ప్రజల్ని పరిగెత్తించాయి. గెలిచాక ఇప్పుడు ʹప్రత్యేక హోదాʹ సాధ్యం కాదని తోకముడుచడం ఎంత సబబు? జగన్‌, తన నిజాయితీని నిరూపించుకునే అవసరం ఇంత త్వరలో వస్తుందనుకొని ఉండడు.

చంద్రబాబుకు లేని అనుకూల వాతావరణం ఈయనకుంది. ఈ పథకాలు చేపట్టి పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటారో? లేక గత ముఖ్యమంత్రులలాగే ద్రోహిగా మిగులుతారో జగనే నిర్ణయించుకోవాలి. జగన్‌ను గుడ్డిగా ఆరాధించే ఆయన సీమ అభిమానులకూ ఆయనపై తగినంత ఒత్తిడి తేవడమనే ప్రత్యేక బాధ్యత ఉంది. లేకపోతే చరిత్రహీను లుగా నిలిచిపోతారు.

- అరుణ్, రాయలసీమ విద్యావంతుల వేదిక

Keywords : andhrapradesh, rayalaseema, ys jagan
(2024-03-15 10:17:22)



No. of visitors : 771

Suggested Posts


రాయలసీమ విద్యార్థి నాయకుడి అక్రమ అరెస్టు - ఖండించిన విద్యావంతుల వేదిక

తరతరాలుగా దోపిడికి, అణిచివేతలకు గురవుతున్న రాయలసీమ మేల్కొని గొంతు విప్పుతూ ఉంటే పాలకులు గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునే రాజకీయుల కుట్రలను చేధిస్తూ విద్యార్థులు యువకులు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాయలసీమకు