ఈ తల్లికి మద్దతుగా నిలబడే మనసు, గుండె ధైర్యం మీకున్నాయా ?


ఈ తల్లికి మద్దతుగా నిలబడే మనసు, గుండె ధైర్యం మీకున్నాయా ?

ఈ

ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది ఉన్నావ్ బాధితురాలి కథే. తనపై ఒక బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేయడమే కాక ఆ తర్వాత కూడా ఆమెకు అన్ని రకాలుగా మద్దతు అనేదే రాకుండా చేశారు. గత వారం ఆమె ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురై విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పిన్నిని, లాయర్‌ను ఆ ప్రమాదంలో కోల్పోయింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై ʹరమా సుందరిʹ తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు రాశారు. ప్రతీ ఒక్కరు చదవాల్సిన ఆ పోస్టు కింద యధాతథంగా...

--------------------------------------------------------------------------

ఆ పిల్ల భారతదేశంలో పుట్టింది. అత్యంత పేదరికంలో పుట్టింది. అందులోనూ ఫ్యూడలిజం, మతోన్మాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ లో పుట్టింది. అదీ కుల్దీప్ సెన్గార్ అనే ధనవంతుడు, జన్మతః రాజకీయనాయకుడు, సర్వత్రా ఆధిపత్యం చూపించగలిగిన వాడి సొంత ఊరు అయిన ఉన్నావ్ జిల్లా మాఖీలో పుట్టింది.

అతడు ఎమ్మెల్యేగా 16 సంవత్సరాల నుండి ఏలుతున్నవాడు. రెండు పార్టీలు మారి (బీఎస్పీ, ఎస్పీ) 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నవాడు. అతని తల్లి ఆ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా 50 సంవత్సరాలు పరిపాలించింది. అతని భార్య ఉన్నావ్ జిల్లా అధ్యక్షురాలు. అతని వదిన మాఖీ గ్రామ ప్రధాన్.

అంతటి వ్యక్తితో ఆ పిల్ల తలబడింది. ఆ యుద్ధంలో తండ్రిని కోల్పోయింది. చిన్నాయన జైలు పాలు అయ్యాడు. పిన్నిని చంపేశారు. ఇప్పుడు ఆ పిల్ల ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది. ఆమె బతకటం బతకపోవటం భారత ప్రజాస్వామ్యం అంత అనిశ్చితం. బతికితే మళ్లీ చనిపోతుంది. ఇప్పుడే చనిపోతే నివాళులు అందుకొంటుంది. ఎందుకంటే నిర్భయ ఘటనను, తమ సొంత అనుభవంగా భయపడి, దానికి వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేవరకూ పోరాడిన చైతన్య సమూహాలు ఆమెకు మద్దతుగా లేవు. ఆమెకు చేరువగా ఉన్న సమూహాలు అత్యంత బలహీనమైనవి. ఆమె ఈ దేశంలో అత్యంత దుర్మార్గ కాలంలో పుట్టింది. బేటీ హటావో నినాద సమయంలో యవ్వనంలోకి వచ్చింది.

బాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ పిల్లలకు బోధిస్తాం. బాడ్ టచ్ అయితే మాత్రం చేయగలదు ఒక నిరుపేద పిల్ల? తల్లిదండ్రులకు చెబితే మాత్రం ఏమి చేయగలరు, వాళ్లు దేవుడిగా పూజిస్తూ, 15 ఏళ్లగా వాడి దగ్గరే పని చేస్తూ, అతని మీద ఆధారపడినవారైతే? ఆ పిల్ల తన పదకొండో ఏట నుండే ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెన్గార్ వికార లైంగిక చేష్టలకు గురి అయ్యింది. ఆమెను బడికి పోనీయకుండా తన గదిలో గంటల కొద్దీ బంధించి ఉండేవాడు. ఆమె బయటకు వస్తే అతని మనుషులు అల్లరి పెట్టేవాళ్లు. ఆ బాధ భరించలేక 8వ తరగతికే చదువు మానుకొని ఇంట్లో కూర్చోంది.

2017, జూన్ 4న, ఆమెకు 16 సంవత్సరాల వయసప్పుడు, ఎమ్మెల్యే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇంటికి పిలిపించుకొన్నాడు. ఒక అనుచరుడు బయట కాపలా కాస్తుండగా, తన గదిలో ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆమె అరిచిన అరుపులు కారిడార్ లో ఉన్న వాళ్లకు కూడా వినబడతాయి. ఎవరూ ఆమె సహాయానికి రాలేదు. ఎవరికి చెప్పవద్దని, చెబితే ఆమె తండ్రినీ నాలుగేళ్ల తమ్ముడ్నీ చంపేస్తానని బెదిరించాడు. ఆమె కళ్లనీళ్లు తుడిచి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆ పిల్ల ఇంటికి వచ్చి ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఇదంతా ఆదిత్య నాథ్ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉత్తర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన రెండు నెలల తరువాత జరిగింది.

ఆ ఘటన అంతటితో ఆగి ఉంటే ఏమయ్యేదో. ఆగలేదు. ఏడు రోజుల తరువాత ఆమెను ముగ్గురు ఎమ్మెల్యే బంధువులు బలవంతంగా పట్టుకొని పోయారు. 9 రోజులు ఆమెను మత్తులో ఉంచి గాంగ్ రేప్ చేశారు. రకరకాల ప్రదేశాలకు మార్చారు. ఆమెను 60000లకు అమ్మటానికి కూడా ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ పిల్ల తల్లి ఆమె గురించి వెతకటం మొదలు పెట్టింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇచ్చింది. ఆమె ఎంత మొత్తుకొన్నా దాన్ని కిడ్నాపింగ్ కేసు కింద నమోదు చేయలేదు. పోలీసులు మామూలుగా వాడే పరిభాషలో ʹఎవడితోనే లేచి పోయి ఉంటుందిʹ అనే అన్నారు. ఆ పిల్ల తల్లి తొమ్మిది రోజులు, రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూర్చోనేది. మొత్తానికి ఆమె ప్రయత్నాల సంగతి తెలిసి ఆ పిల్లను వదిలి వేశారు. పోలీసులు ఆ కేసును పోస్కో (POCSO- Protection of Children from Sexual Offences) చట్టం కిందా, గాంగ్ రేప్ కిందా, కిడ్నాపింగ్ కిందా జూన్ 20నే బుక్ చేశామని చెప్పారు. అయితే పిల్ల బయటకు వచ్చిన ఐదు రోజుల దాకా మెడికల్ పరీక్ష ఎందుకు చేయించలేదో మాత్రం సరిగ్గా చెప్పలేదు.

తరువాత ఆ పిల్ల పినతండ్రి దగ్గర ఉండటానికి ఉన్నావ్ నుండి ఢిల్లీ వెళ్లింది. అక్కడ తన పిన్నికి జరిగిన విషయం చెప్పింది. ఆమె పిన్ని ద్వారా కుల్దీప్ నిర్వాకం ఆమె కుటుంబానికి తెలిసింది. ఆగ్రహంతో ఆమె తండ్రి ఎమ్మెల్యే యింటికి వెళ్లాడు. ఆ సమయానికి ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో లేడు. ఆ పిల్లను ఢిల్లీ నుండి వెనక్కి పిలిపించి ఆగస్ట్ లో ఆమె చేత ఉన్నావ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు యథావిధిగానే కేసు రిజిస్టర్ చేయలేదు. తన కేసును పట్టించుకోవటం లేదంటూ సీయం ఆఫీసుకు ఉత్తరం రాసిందా పిల్ల. సీయం ఆఫీసు సిబ్బంది, ఆ ఉత్తరాన్ని ఉన్నావ్ జిల్లా అధికారులకు పంపించి చేతులు దులుపుకొన్నారు. తరువాత ఆమె ఈ విషయంగా కోర్టుకు వెళ్లింది. అయినా ఎనిమిది నెలలు కూడా ఆ కేసు రిజిస్టర్ కాలేదు. ఈ క్రమంలో ఆ కుటుంబం ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నది. పిల్ల తండ్రి పప్పూ సింగ్ (అలియాస్ సురేంద్ర్ సింగ్) ను మాఖీ గ్రామంలో లోనే నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ కొట్టిన వారిలో కుల్దీప్ సింగ్ తమ్ముడు అతుల్ సింగ్ ఉన్నాడు. అతని మీద పాత ఆయుధాల కేసు పెట్టారు. ఇరువర్గాల వాళ్లు, ప్రత్యర్థులుగా కేసులు పెట్టుకొన్నపుడు పోలీసులు బలవంతుల వైపే తలవొగ్గాలి అనే రాజ్య సూత్రం ప్రకారం ఆ పిల్ల తండ్రి పప్పూ సింగ్ ను ఆయుధాల కేసు కింద పోలీసులు అరెష్టు చేసి జుడీషియల్ కష్టడీకి పంపారు. ఈ వేదన భరించలేక ఆ పిల్ల కుటుంబం సీయం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఏప్రిల్ 8న తగలపెట్టుకోవటానికి ప్రయత్నించింది.

ఈ సంఘటనలు మొత్తం ఉత్తరప్రదేశ్ లో రాజకీయ, పోలీస్, శాంతి భద్రతల వ్యవస్థ పని తీరు ఎలా ఉందో తెలియచేస్తాయి. రెండు రోజుల తరువాత, ఏప్రిల్ 10న; ఆ పిల్ల తండ్రి పోలీసులు, అతుల్ సింగ్ తదితరులు కొట్టిన దెబ్బలకు కస్టడీలో చనిపోయాడు. ఆ రెండు రోజులు, కేసు విరమింప చేసుకోమని అతడిని పోలీసు సహాయంతో కుల్దీప్ అన్నదమ్ములు హింసించారు. పరిస్థితి విషమించాక ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఆసుపత్రిలో అతను తనను హింసించిన వారి పేర్లను విలేఖరులకు వెల్లడి చేశాడు. వారిలో కుల్దీప్ సింగ్ తమ్ముడు అతుల్ సింగ్ కూడా ఉన్నాడు. అతుల్ సింగ్ కొడుతుంటే అక్కడే ఉండే పోలీసులు చూస్తూ ఊరుకొన్నారు కానీ, తనకు సహాయంగా రాలేదని అతను చెప్పాడు. అతను మరణించిన తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అతని శరీరం మీద 14 గాయాలను డాక్టర్లు గుర్తించారు. అతని ఆహార నాళాలు పగిలిపోయి ఉన్నాయని కూడా ఆ రిపోర్ట్ లో వెల్లడించారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంగా సమాచారం అడుగుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికీ, ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ కూ ఉత్తరాలు రాసింది. జుడీషియల్ మరణం జరిగాక 24 గంటల లోపు మానవ హక్కుల కమీషన్ కు ఎందుకు రిపోర్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఆ పిల్ల కుటుంబానికి పూర్తి రక్షణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. కానీ పోలీసులు ఆ కుటుంబాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకంటూ ఒక హోటల్ రూమ్ కు పరిమితం చేశారు. రక్షణ పేరు మీద వారిని బయటకు పోనీయకుండా నిర్బంధించారు. వారికి ఆహార పానీయాలు ఇవ్వటానికి నిరాకరించారు. ʹదెబ్బలు తగిలిన నా తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కస్టడీలోకి తీసుకొని అతని చావుకు పోలీసులు కూడా కారణం అయ్యారు. ఈ యుద్ధంలో నేను ఓడిపోయాను. నేను ఈ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాల్సింది. కనీసం నా తండ్రి అయినా బతికి ఉండేవాడుʹ అన్నది అప్పుడా పిల్ల. కేసును సిబిఐ కి అప్పగించాలని ఆ పిల్ల అప్పుడే కోరింది.

ఇంత జరిగినా ఆ ఎమ్మెల్యే మీద రేప్ కేసు పెట్టలేదు. పప్పూ సింగ్ ను కొట్టిన అతని తమ్ముడు అతుల్ సింగ్ ని తప్పించి మిగతా వారి మీద మర్డర్ కేస్ పెట్టారు. ʹసంఘటనకీ, కంప్లయింట్ కీ మధ్య మూడు నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు; కేసు పెట్టే ముందు విచారణ జరగాలిʹ అని నీతులు చెబుతూ విచారణకు సిట్ (Standing Investigation Team) ను వేసింది పోలీసు శాఖ. ʹఆ పిల్ల చెప్పిన విషయాలలో ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి. గౌరవనీయులైన ఎమ్మెల్యే మీద అంత తీవ్ర ఆరోపణలు చేస్తున్నపుడు అన్ని విషయాలు జాగ్రత్తగా పట్టించుకోవాలిʹ అని కూడా ఉత్తర ప్రదేశ్ పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ ప్రవచించారు.

ఈ సమయంలోనే సీనియర్ లాయర్ గోపాల్ స్వరూప్ చతుర్వేది ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్లి ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయమైన విచారణకు ఆదేశాలు ఇవ్వమని కోరాడు. జస్టిస్ డీబీ భోసలే, జస్టిస్ సునీత్ కుమార్ తో కూడిన కోర్టు బెంచ్ ఈ గాంగ్ రేప్ సంఘటనను గుర్తించి పప్పూ సింగ్ శరీరాన్ని ఖననం చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటో తెలియచేయమని కూడా కోరింది. అయితే అప్పటికే పప్పూ సింగ్ అంత్యక్రియలు జరిగిపోయాయి. కోర్టు కలగచేసుకొన్నాక, అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కదిలి ఎమ్మెల్యే మీద ఎఫ్ఫైయ్యార్ పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. ఆ పిల్ల గాంగ్ రేప్ కేసు, తండ్రి కస్టోడియల్ డెత్ కేసులను సిబిఐకి అప్పగించింది. జైలు డాక్టర్లు ముగ్గురినీ, పోలీసు కానిస్టేబుళ్లు నలుగురినీ సస్పెండ్ చేసింది. ఇదంతా ఆ పిల్ల కేసు పెట్టిన తొమ్మిది నెలల తరువాత జరిగింది.

ఎఫ్ఫైయ్యార్ పెట్టిన తరువాత కూడా ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదు. ఏప్రిల్ 12న మళ్లీ అలహాబాద్ హైకోర్టు మళ్లీ కలగచేసుకొని ఎందుకు అతడిని అరెష్టు చేయలేదని ప్రశ్నించింది. భోజన విరామం లోపల ప్రభుత్వం ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరింది. అప్పటికి కేసు ఇంకా సీట్, సిబిఐ ఇద్దరి చేతుల్లో వుండింది. కుల్దీప్ సింగ్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవనీ, అతను రేప్ చేసినట్లు సాక్ష్యాలు లేవని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు ఈ విషయం పై వ్యాఖ్యానిస్తూ ʹసిట్ రిపోర్ట్ ప్రకారం డాక్టర్లు, పోలీసు ఆఫీసర్లు, అందరూ చేతులు కలిపి నేరస్తులను రక్షించపూనుకొన్నారు. ఆ ఆఫీసర్లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యా తీసుకోకుండా ఇంకా విచారణ జరగాలని మీరు అంటున్నారుʹ అన్నది. ʹపోలీసుల ప్రవర్తన ఇలాగే ఉంటే బాధితులు ఎవరిని ఆశ్రయిస్తారు? మీరు ఇలాంటి విధానాలనే అవలంబిస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పడిపోయాయని మేము చెప్పాల్సి వస్తుందిʹ అని కూడా వ్యాఖ్యానించింది. అలహాబాద్ హైకోర్ట్ ఇంత బాధ్యతగా స్పందిస్తే అదే సమయంలో సుప్రీం కోర్టు స్పందన దానికి విరుద్ధంగా ఉండింది. ఎమ్మేల్యేలు, ఎంపీలు, మంత్రులు లాంటి అధికారంలో ఉన్నవ్యక్తుల మీద ఎఫ్ఫైయ్యార్లు వేయటానికి పోలీసులు వెనకాడుతున్నారనీ, ఉన్నావ్ రేప్ కేసు విషయంలో ఇదే జరిగిందనీ, ఈ కేసులో సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ ఎం ఎల్ శర్మ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో వేశాడు. జస్టిస్ ఎస్ ఎ బొబ్దే, ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్ క్రిమినల్ కేసుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పనికి రావనీ, ʹమీ ఇంట్లో ఎవరైనా రేప్ కు గురయ్యారా?ʹ అని అవమానకరంగా ప్రశ్నిస్తూ ఆ వ్యాజ్యాన్ని కొట్టి వేసింది.

హైకోర్టు, జాతీయ మానవహక్కుల వేదిక, పౌర ప్రపంచాల వత్తిడి పెరగటం; ఇంకో పక్క రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీ వాల్, చివరకు శివసేన అధ్యక్షుడు రాజ్ థాకేరేతో సహా విమర్శల వర్షం గుప్పించటంతో ఎట్టకేలకు 2018 ఏప్రిల్ 13న కుల్దీప్ సింగ్ సెన్గర్ ను అదుపులోకి తీసుకొన్నారు. అప్పుడే కఠువలో 8 సంవత్సరాల బాలిక ఆసిఫా అత్యాచారం, హత్యల మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. అదే సమయంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర ప్రజాగ్రహానికి గురి అయింది. అప్పటికే బాలివుడ్ యాక్టర్లు రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ, సమీరా రెడ్డి, ట్వింకిల్ ఖన్నా, హెలెన్ లాంటి వారు కూడా వీధుల్లోకి వచ్చారు. ఆనంద్ మహేంద్ర లాంటి వ్యాపార వేత్తలు మౌనం వీడి మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకపోయింది. ప్రభుత్వ ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగి కుల్దీప్ మీద చార్జి షీట్ పెట్టింది.

ఈ పరిణామాలకు ఆ పిల్ల పినతండ్రి హర్షం వ్యక్తం చేశాడు. అధికార యంత్రాంగం కొద్దిగా ముందుగా స్పందించి ఉంటే తన అన్న బతికేవాడని అన్నాడు. తనకు న్యాయ వ్యవస్థ మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుందని కూడా అన్నాడు. అదే సమయంలో తన కుటుంబానికి ప్రాణ రక్షణ ప్రమాదం కూడా ఉందని భయాన్ని వ్యక్తం చేశాడు. కుల్దీప్ సింగ్ సెన్గార్ ను ఉన్నావ్ జైలు నుండి తరలించాలని కోరుతూ బాధిత కుటుంబం పెట్టుకొన్న పిటిషన్ ను స్వీకరించి అతన్ని సీతాపూర్ జైలుకు తరలించారు. ఇంకో పక్క ఆ పిల్ల తల్లి తన భర్త మీద ఆయుధాల కేసు పెట్టిన పింకూ సింగ్ ఎవరో తెలపాలని కోర్టులో పిటిషన్ వేసింది.

మే 21కి సిబిఐ అలహాబాద్ కోర్టుకు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించింది. మే 25న అతని పై చార్జ్ షీట్ దాఖలు చేసింది. అంతా సజావుగా సాగుతుంది అని బయట సమాజం అనుకొంటున్నసమయంలో బాధిత కుటుంబం నిజానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతోంది. జైలు నుండి కుల్దీప్ సింగ్ పిల్ల తండ్రికి బెదిరింపు ఫోన్లు చేస్తున్నాడు. పిల్ల తల్లి బయటకి వెళ్లాలంటే భయపడుతోంది. ఆమెకు ఆ పిల్ల కాకుండా ఇంకా ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. ʹఅంతటా వాళ్ల మనుషులే మమ్మల్ని వెంటాడుతున్నారుʹ అని ఆమె చెప్పింది. గ్రామంనుండి వారికీ ఎలాంటి తోడ్పాటు, మద్దతూ లేవు. పప్పూ సింగ్ అంత్యక్రియలకు కూడా ఊరు నుండి ఎవరూ రాలేదు. జులై నెల 12న భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఉత్తరంలో ʹఎమ్మెల్యే తమ్ముళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాపాడమనిʹ ఆ కుటుంబ సభ్యులు వేడుకొన్నారు. ఆ ఉత్తరం తనకు అందలేదని ఒక మహిళ విషయంలో స్వయానా లైంగిక ఆరోపణలకు గురి అయిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గంగోయి అంటున్నాడు. అదే ఉత్తరాన్ని ఉన్నావ్ పోలీస్ సిఐకు కూడా ఇచ్చారు. ఎవరూ పట్టించుకోలేదు. ʹరాజీ చేసుకొని, కథకు ముగింపు పలకండిʹ అనే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎప్పుడూ పాడే పాత పాటే మళ్లీ పాడారు.

ఇదంతా జరుగుతుండగానే ఆ కుటుంబానికి ఇప్పుడు ఏకైక అండగా ఉన్న పిల్ల పినతండ్రిని గత నవంబర్ లో తప్పుడు కేసులో అరెష్టు చేశారు. 18 సంవత్సరాల క్రితం ఆయన సొంత గ్రామం అయిన మాఖీలో, పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆయనకు ఆయుధాలు ఉన్నాయనే నెపంతో ఇప్పుడు ఈ అరెష్టు చేశారు. ఢిల్లీలో ఉంటున్న అతడిని ఉన్నావ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు కలిసి అరెష్టు చేయటం విశేషం. పిల్ల తండ్రి పప్పూ సింగ్ హత్య కేసులో కీలక సాక్షి యూనస్ అహమ్మద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. ఆ విషయం గురించి కూడా పిల్ల పినతండ్రి అనుమానం వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

తండ్రి చనిపోయి, పినతండ్రి జైల్లో ఉండి, బయట ప్రపంచం ఉన్నావ్ కేసును మర్చిపోతున్న సమయంలో నిందితులు మాత్రమే వారిని మర్చిపోలేదు. రాయ్ బరేలి జైల్లో ఉన్న బాబాయ్ ని చూడటానికి పిన్నితో సహా బయలుదేరిన ఆ పిల్ల కారును ట్రక్ గుద్దేసింది. కారులో ప్రయాణం చేస్తున్న పిల్ల పిన్ని (పినతండ్రి భార్య), పిన్ని చెల్లి ఇద్దరూ చనిపోయారు. ఆ పిల్లకూ, లాయర్ కూ తీవ్ర గాయాలు అయ్యి చావు బతుకుల్లో లక్నో మెడికల్ హాస్పిటల్ లో ఉన్నారు. భార్య అంత్యక్రియలకైనా ఆ పిల్ల పినతండ్రిని విడుదల చేయమని పిల్ల బంధువులు ధర్నాకు దిగారు.

నిన్నటి వరకూ బీజేపీ పార్టీ కుల్దీప్ సింగ్ సెన్గార్ ను తన పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని ప్రకటించక పోవడం ʹబేటీ బచావోʹ నినాదానికి నిర్వచనంగా తీసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న విమర్శలకు సమాధానంగా అతడ్ని ఎప్పుడో బహిష్కరించాము అని బుకాయిస్తున్నారు. ఆ పిల్ల చావు బతుకుల్లో వెంటిలేటర్ల మీద ఉన్నప్పుడు భారత పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. ముస్లిం మహిళలకు భర్తల నుండి రక్షణ యిచ్చామని బోర విరుచుకొంటున్న బీజేపీ పార్టీ తన సొంత ఎమ్మెల్యే చేస్తున్న దురాగతాలకు కొమ్ము కాసి, హంతకులనూ రేపిష్టులనూ, పోలీసుల అండతో భుజాన ఎత్తుకొని ఊరేగుతోంది.

తాజా పరిణామం: ఆ పిల్ల సొంత ఊరు అయిన మాఖి గ్రామస్తులు ఆమెకు మద్దతుగా ఊరేగింపు చేశారు. కోర్టులు, పోలీసులు, రాజకీయ నాయకుల వాగ్దానాల కంటే ఈ పరిణామం ఎక్కువ ఆశాజనకంగా ఉంది.

- రమా సుందరి

ఫేస్‌బుక్ పోస్టు : https://www.facebook.com/photo.php?fbid=2452114751739460

Keywords : Unnao, Rape, Victim, Road Accident, BJP MLA, UP
(2019-11-19 16:04:05)No. of visitors : 489

Suggested Posts


0 results

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


ఈ