సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
(ఉపాధ్యాయులు బీ.రామకృష్ణ రాసిన ఈ వ్యాసం వీక్షణం ఆగస్ట్ 2019 సంచికలో ప్రచురించబడినది)
2002లో గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన దారుణమైన మానవ హనన చర్య అనేది దేశంలో జరిగిన మత ఘర్షణలు, మారణకాండలు అన్నింటిలోకెల్లా అతి దుర్మార్గమైనది. గతంలో ముంబాయిలో జరిగినవి కావచ్చు, ఇందిరాగాంధీ హత్య తరువాత సిక్కులపై ఊచకోతలు కావచ్చు అన్నీ కూడా 2002 గుజరాత్ గాయం ముందు మరుగుజ్జులే, దిగదుడుపులే.
2019 ఫిబ్రవరి 27న గోద్రా వద్ద సబర్మతి రైలులో అయోధ్య నుండి తిరిగి వస్తున్న కర సేవకులున్నబోగిలో చెలరేగిన మంటల్లో 59 మంది చనిపోయిన ఘటనకు ముస్లిం సంస్థలే కారణమన్నది సాకుగా తీసుకుని తదనంతరం గుజరాత్‌లో జరిగిన దారుణ హత్యకాండలు, సామూహిక దాడులు, అత్యాచారాలు, లూటీలు, గృహ దహనాలు పెద్ద ఎత్తున జరిగిన ఘటన చరిత్రలో నిలిచిపోయింది. గోద్రా ఘటన జరిగిన రోజు హిందువులు ఆగ్రహావేశాలతో ఉన్నారని ఆ ఆగ్రహాలు బయటకు వెళ్లగక్కనీయండని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పాల్సిందేననే అర్థంలో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి తన నివాసంలో జరిగిన పోలీసు ఉన్నత అధికారుల సమావేశంలో చెప్పాడని సంజీవ్ భట్ అనే సీనియర్ పోలీసు అధికారి సుప్రీంకోర్టుకు తెలియచేశాడు. ఆ సమావేశంలో తాను కూడా ఉన్నానని సంజీవ్ భట్ చెప్పాడు. కాని తరువాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని ధృవీకరించలేదు అనేది వేరే విషయం అనుకోండి.
ఎనభై ఏళ్లుగా సంఘ పరివార్ శక్తులు చేస్తూ వస్తున్న ప్రయోగాలు, నిరంతర, విద్వేషపూరిత రాజకీయాలు, ప్రచారాలు గుజరాత్‌లో జరిగిన ముస్లింల హననానికి పునాదులు వేశాయి. 1990లలో అధ్వాని చేసిన రథయాత్ర అగ్నికి ఆజ్యం పోసినట్లు సంఘ్ శక్తులకు తోడయ్యింది. హెగ్డెవార్, గోల్వాల్కర్, మదన్‌మోహన్ మాలవ్య, వి.డి.సావర్కర్ వంటి వారు హిందుత్వ భావా జాలాన్ని వక్రీకరణల చరిత్రలను, విద్వేష పూరిత మత అసహనాలను పెంచుతూ వచ్చారు. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చారు. పురాణాలు, పురాతన సంస్కృతి, ఋషులు, మునుల పేరుతో హిందుత్వను ముందుకు తెస్తూ ఈ దేశ సంస్కృతి ముస్లింల రాకతో ఆ తరువాత ఆంగ్లేయుల వల్లనే విచ్చిన్నం అయిందని విష ప్రచారం చేస్తూ దానికి ఆమోదాన్ని తెచ్చే ప్రయత్నాలను తీవ్రంగా చేస్తూ వచ్చారు. సరస్వతీ శిశు మందిర్‌లను అనేక ఇతర విద్యా సంస్థలను, ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను స్థాపించి వాటి ద్వారా బాల్య దశ నుండే వీటిని నూరిపోస్తూ వచ్చారు. ప్రజల్లో ఉన్నటువంటి భక్తి కొన్ని రకాల మూఢ నమ్మకాలు, బలహీనతలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకుని గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ దేవాలయాలను కట్టడం అందులో పూజలు, ప్రార్థనలను ప్రోత్సహించడం, స్వాములను, సాధు సంతులను పోషిస్తూ వారి ద్వారా హిందూ మత ప్రచారాన్ని సాగించడం, పరమత ద్వేషాన్ని పరమత సంస్కృతులను కించపరిచేలా భావజాలాన్ని విస్తృతంగా వేళ్లూనుకునేల చేయడం, ఏ చిన్న మత పరమైన ఘర్షణ వచ్చినా దాన్ని పెద్దదిగా చేయడం దాడులకు హత్యలకు దిగుతూ అనేక రకాలుగా విస్తరిస్తూ పోయారు.
కూడు, గూడు, గుడ్డ, విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలనే మౌలిక అవసరాలకు ఏమాత్రం దోహదం చేయనటువంటి బాబ్రీ మసీదు స్థానంలో రామునికి గుడి కట్టాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హిందూ పోలరైజేషన్‌ను చేస్తూపోయారు. రామ జన్మభూమి పేరుతో కరసేవకులను తయారు చేస్తూ ముస్లింలపై విద్వేషాల విషాన్ని కుమ్మరిస్తూ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, హిందూ వాహిని, దుర్గావాహిని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తదితర ఎన్నో జ్ఞాత, అజ్ఞాత సంస్థలు సంఘ్‌పరివార్‌గా కన్సాలిడేట్ అవుతూ దేశంలో ముస్లిం, క్రిస్టియన్‌లపై ద్వేషపూరిత భావజాలాన్ని రెచ్చగొడుతూ ఈ దేశం హిందువులదేనని ఇది హిందూ దేశమనీ, ఫాసిస్టు విధానాలను వ్యాప్తి చేస్తూ ఒకప్పుడు ఇద్దరు పార్లమెంటు సభ్యులున్న బిజెపి క్రమేపి 1999లో వాజ్‌పేయ్ ప్రధానిగా 2014 నుండి నరేంద్రమోదీ ప్రధానిగా అధికారిక పాలనలోకి వచ్చింది. తద్వారా పరోక్షంగా సంఘ్ పరివార్ అధికారం చేపట్టినట్లైంది. అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, విధాన నిర్ణయ కేంద్రాలలోకి తన భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయగలిగింది. అందులో భాగంగానే గుజరాత్‌లో 2002లో జరిగిన ముస్లింల హనన చర్యను, తరువాత నిరాఘాటంగా గుజరాత్‌లో నేటికీ బిజెపి గెలుస్తూ అధికారం చెలాయిస్తుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికాబద్ద కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా నేడు అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్నది. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ ఫాసిస్టు పాలనను సాగిస్తున్నది.
గుజరాత్ మారణకాండలో పాల్గొన్న వారంతా అగ్రవర్ణాల బ్రాహ్మలు కారు, నిమ్నకులాలు, వర్గాల వారేనన్నది తెల్సినదే. హిందూ మతం పేరుమీద వీరందరిని సమీకరించి వారి మెదళ్లను విషపూరితం చేయడంలో ఎంతగానో సఫలీకృతమయ్యారు. కూడు పెట్టని, గూడు నివ్వని, గుడ్డ నివ్వని మతం ఆసరగా ప్రజలను సమీకరించగలగడం ఎంతో ప్రమాదాన్ని సూచిస్తున్నది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రజల పక్షం నిలిచే వారు, ప్రగతిశీల శక్తులు ఆలోచించవల్సి ఉన్నది. కార్యాచరణలను రూపొందించుకోవల్సి ఉన్నది.
గుజరాత్‌లో 27 ఫిబ్రవరి 2002 నుండి కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన అరాచక మారణకాండ జరగిందనేది జగమెరిగిన సత్యమే. ప్రభుత్వ అండనే లేకుంటే ఇంత పాశవిక చర్యలు జరిగేవి కావు. పోలీసు యంత్రాంగం కాళ్లు, చేతులు చచ్చుబడినట్లుగా చేష్టలుడిగి మౌనసాక్షిగా మిగిలిపోయిందనే కంటే కూడా అగ్నికి ఆజ్యం పోసిందనేది వాస్తవం.
ప్రజల ఆస్తులను, ప్రాణాలను, ప్రజాస్వామిక పౌరహక్కులను కాపాడాల్సిన రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు తగు చర్యలు తీసుకోకుండా మిన్నకుండడం అనేది కుట్ర పూరితంగానే జరిగింది. కావాలనే అధికారాన్ని దుర్వినియోగం చేయబడిందన్నదాన్ని ఐపిఎస్ అధికారి అయిన సంజీవ్ భట్ బయటపెట్టాడు. కంచె చేను మేసినట్లుగా అధికారాలను దుర్వినియోగం చేస్తూ క్రిమినల్ చర్యలను చేపట్టి నడి బజారులో పట్టపగలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు, న్యాయం ధ్వంసం చేయబడడానికి కీలక పాత్రధారిగా ఉన్న ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యక్తిగత హోదాలో గొంతు విప్పడమంటే సామాన్యమైన విషయం కాదు. సుప్రీంకోర్టుకు, 2002లో అల్లర్లకు సంబంధించి నియమించిన నానావతి కమీషన్‌కు 2011లో నిజాలను చెప్పినందుకు సంజీవ్ భట్‌పై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కక్ష గట్టాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరినైనా సరే నిర్బంధించడం, హింసల పాల్జేయడం, తప్పుడు కేసులు మోపడం, జైలు పాల్జేయడం, చడీ చప్పుడు లేకుండా లేదా బహిరంగంగానే హత్యలు, దొమ్మీలు, లూటీలు, అత్యాచారాలు, మూకదాడులు, చేయించడమూ చాలా సులభం. ఇలాంటి వాటిపై కేసులుండవు. న్యాయస్థానాల్లో సాక్ష్యాలుండవు. అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని నేరస్తులను స్వేచ్ఛగా వదిలేయడం ఒక నేరమయ రాజ్యాన్ని విస్తరించడం జరుగుతున్నది. ఎప్పుడయితే సంజీవ్ భట్ మోదీకి వ్యతిరేకంగా బహిరంగంగా నోరు విప్పడం మొదలు పెట్టాడో ఇక అతనిపై కక్ష సాధింపు చర్యలు నిర్బంధాలు, మానసిక వేధింపులు తీవ్రమవుతూ వచ్చాయి. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయ్యాడని, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో 2011లో సంజీవ్ భట్‌ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఆ తరువాత 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాడు. ఆగస్ట్ 2015లో అతనిపైనున్న నేరారోపణలను గుజరాత్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నిర్ధారించిందని చెబుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అతన్ని ఏకంగా ఉద్యోగం నుండి తొలగించింది. అయితే గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణకు భట్ హాజరవలేదు. దాని కారణంగా అతనిపై చేసిన ఆరోపణలన్ని నిజమేననే నిర్ధారణకు ఆ కమిటీ వచ్చిందన్నమాట. ఒకవేళ భట్ నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గొంతువిప్పకపోతే ఇవన్ని లెక్కలోకి వచ్చేవేకాదు. అసలు విచారణ కమిటీనే వేయబడేది కాదు అనేది సత్యదూరం కాదు.
అంతటితో గుజరాత్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాని ఆగలేదు. 1996లో గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలో సంజీవ్ భట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నప్పుడు డ్రగ్స్‌ను కలిగి ఉన్నాడని ఒక అడ్వకేట్ తప్పుగా కేసులో ఇరికించబడ్డాడనే ఆరోపణ కేసులో సంజీవ్ భట్‌కు బెయిల్ నిరాకరించబడి సెప్టెంబర్ 2018 నుండి పలన్‌పూర్ సబ్ జైలులో ఉంటున్నాడు. జైలులో ఉన్న సమయంలోనే 1990 నాటి కస్టోడియల్ మరణం కేసులో జూన్ 2019లో యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యాడు. బిజెపి సీనియర్ నాయకుడు వాజ్‌పేయ్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన లాల్‌కృష్ణ అధ్వాని దేశవ్యాప్తంగా రామ జన్మభూమి కోసం 1990లో రథయాత్ర చేశాడు. ఆ సందర్భంగా అధ్వాని యాత్రను అడ్డుకున్నందుకు బిజెపిి, సంఘ్‌పరివార్ శక్తులు ఆందోళనలు చేసాయి. అందులో భాగంగా గుజరాత్‌లో జామ్‌జోద్‌పూర్‌లో అల్లర్లు జరిగాయి. వందకు పైగా అరెస్టులు జరిగాయి. అప్పుడు అక్కడ ఎఎస్‌పిగా సంజీవ్ భట్ పనిచేస్తున్నాడు. అరెస్టైన వారిలో ఒకతను బెయిల్‌పై విడుదల అయ్యాక పది రోజుల్లోనే మృతి చెందాడు. ఆ మృతికి పోలీసులే కారణమని చనిపోయిన వ్యక్తి సోదరుడు కేసువేసాడు. ఇతడు విశ్వహిందూ పరిషత్ కార్యకర్త. అప్పటి నుండి ఈ కేసులో పురోగతి లేదు. దాని విచారణల పై అప్పటి గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. ఎప్పుడైతే భట్ మోదీకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టాడో ఇక ఆ కేసు ముందు వరుసలోకి వచ్చింది. 2011లో ఈ కేసుపై ఉన్న స్టే ఎత్తివేయడం జరిగింది. దానిపై విచారణ జరిగి కస్టోడియల్ డెత్‌కు సంజీవ్ భట్ కారణమని సంజీవ్ భట్ తో పాటు మరో పోలీస్ అధికారికి గుజరాత్‌లోని జామ్నానగర్ సెషన్స్‌కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అలా తమ చేతులకు నెత్తురంటకుండా కోర్టు ద్వారా ఆ పని చేయించగలిగారు. 2001 నుండి 2016 వరకు గుజరాత్‌లో జరిగిన దాదాపుగా రెండొందల కస్టోడియల్ మరణాలపై ఏ పోలీసు అధికారికి శిక్షలు పడలేదు. కేసుల్లో పురోగతి లేదు కాని సంజీవ్ భట్‌కు శిక్ష అమలవుతుంది. తమ నేరాలను బయటపెడితే, ఎదిరిస్తే ఎలా అణచేస్తారో, నిర్బందిస్తారో భవిస్యత్‌లో కూడా ఎవరైనా అలా చేయడానికి సాహసించకుండా ఉండడానకికి హెచ్చరికలను దీని ద్వారా పంపించదలిచారన్నమాట. భారతదేశంలో మునుపెన్నడు జరగనటువంటి కరమైన మారణకాండకు కారకుడైన శక్తిమంతున్ని ఎదుర్కోవడం వల్ల సంజీవ్ భట్ వంటి వారు కష్టాలనెదుర్కొంటున్నాడు. నేడు దేశాన్ని పాలిస్తున్న మిత్రద్వయం విద్వేష పూరిత కుట్రలను, అమానుషాలను ఆకృత్యాలను, అధికార దుర్వినియోగాన్ని, నేరపూరిత చర్యలను, బయట పెట్టినందుకు వారి బెదిరింపులకు లొంగనందుకు ఒక ప్రభుత్వ ఐపిఎస్ అధికారి ఎన్నో రకాల హింసలకు గురై చివరకు జైలు పాలు అయ్యాడు.
దేశంలో ఎందరో సామాన్య ప్రజలు, ఆదివాసులు, దళితులు సామాజిక ఉద్యమకారులు ఎన్నెన్నో అక్రమ కేసుల్లో జైళ్లలో మగ్గిపో తున్నారు. భీమా కోరేగావ్ అనే అబద్దపు కేసును పుట్టించి దేశవ్యాప్తంగా ప్రజలకోసం పాటు పడుతున్న బుద్దిజీవులను జైళ్లలో బంధించి బెయిల్ సహితం ఇవ్వ నిరాకరిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను అబద్దపు కేసులో ఇరికించి ఉపా చట్టం కింద శిక్షలు వేసారు. ఇవన్నీ చూస్తుంటే రాజ్య యంత్రంగాలైన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ తదితర ప్రభుత్వ సంస్థలన్ని కూడా పాలకుల అనుంగు వర్గీయులకు కొమ్ము కాసేవిగానే ఉంటూ నిజమైన అర్ధంలో రాజ్యాంగ విలువలకు స్పూర్తికి కట్టుబడి పనిచేయడం లేదని అనిపించకమానదు. ఇదే సంజీవ్ భట్ గనుక 2002లో మోడీ ఇచ్చిన సూచనలను పాటించి ఉంటే సిఐటి అధికారికి ఇచ్చినట్లుగానే ఉన్నత పదవులు లభించి ఉండేవి. అతనిపై మోపబడిన అన్నిరకాల అభియోగాలు గాలిలో ఎగిరిపోయేవి. లాకప్‌డెత్ కేసు అస్సలు బయటకి రాకపోయేది ఒకవేళ వచ్చినా పూర్తిగానే కొట్టేయబడేది.
అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి గతంలో చేసిన ఘోరనేరమైన మానవ హనాన్ని ఒక పోలీసు ఉన్నతాధికారిగా ధృవీకరించడం అనేది మింగుడు పడని విషయంగా మారడం వల్లనే భట్ కక్ష సాధింపులకు బలయ్యాడని ఎవరైనా సులభంగానే తెలుసుకోవచ్చు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇషాన్ జాఫ్రీని 2002లో గుజరాత్‌లోని మానవ హననంలో భాగంగా చంపేశారు. ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను, ప్రాణాలను, హక్కులను కాపాడాల్సిన రాజ్యాంగ కర్తవ్యాన్ని విస్మరించి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను నరేంద్రమోడీని మొదటి నేరస్థుడని ప్రకటించి శిక్షించాలని హత్యకు గురైన ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ప్రకటించింది. సొహ్రాబుద్దీన్ హత్యకు సంబంధించిన కేసులో నేరస్తులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే పరిస్థితిలో న్యాయమూర్తి లోయ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే పరిస్థితి ఉన్నందునే లోయ మరణం సంభవించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది సహజ మరణం కాదని, అతని శరీరంపై రక్తపు మరకలున్నాయని ఇది హత్యేనని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇటువంటి సందర్భంలో నరేంద్రమోదీని దోషిగా నిరూపించే ప్రయత్నం చేసినందుకు భట్ ప్రాణాలతో మిగిలి ఉండడమంటే ఆశ్చర్యపోవాలి కాని జైలుశిక్షకు గురయ్యాడంటే ఆశ్చర్య పోవల్సిందేమున్నది. లోయా మృతి తరువాత ఆయన స్థానంలో ఉండి తీర్పునిచ్చిన న్యాయమూర్తి సొహ్రాబుద్దీన్ కేసు విషయంలో అమిత్‌షాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అలాగే సంజీవ్ భట్ 2002లో గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన ఘోరమైన హనన చర్యకు మోదీ ఇచ్చిన సూచనలను పాటించకుండా బయట పెట్టినందుకు, ఆ చర్యను వ్యతిరేకించినందుకు భట్‌కు శిక్ష అమలవుతున్నది. దానిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తే అది మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు మోదీని నిర్ధోషిగా ప్రకటించింది. అటు లోయా చనిపోయాడు ఇటు అమిత్‌షా నిర్ధోషిగా ప్రకటించబడ్డాడు. అలాగే భట్ ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యాడు, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నరేంద్రమోదీ నిర్ధోషిగా ప్రకటించబడ్డాడు.
2002లో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన ఇషాన్ జాఫ్రీ హత్యకు వ్యతిరేకంగా అతని భార్య జకియా జాఫ్రీ న్యాయ పోరాటం చేస్తున్నది. ఆమెకు అండగా మరితర దారుణాలకు వ్యతిరేకంగా నేరస్థులకు శిక్షలు పడేలా న్యాయాస్థానాల్లో తీవ్రమైన పోరాటం చేస్తున్న తీస్తా సెతల్వాద్‌ను అటు గుజరాత్ ప్రభుత్వం ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. ఈ న్యాయ పోరాటాల ఫలితంగా నరోడా పాటియాలో 2002లో జరిగిన దాదాపు వందమంది హత్యకు సంబంధించిన హత్య కేసులో మాజీ మంత్రి మాయాకొద్నానితో పాటు మరితర 34 మందికి శిక్షలు పడ్డాయి. ఈ సందర్భంలో సంజీవ్ భట్ నరేంద్రమోదీకి బహిరంగ ఉత్తరం రాశాడు. తీర్పు వచ్చినరోజు మాయా కొద్నానికి దూరంగా, మౌనంగా ఎందుకు ఉండవల్సి వచ్చిందో తెలపాలని, మీ విధానాల్లో పావులుగా నిందితులు శిక్షలకు గురవుతున్నప్పుడు ఒక్కసారైనా వారి గురించి ఆలోచించారా? వీటికి నిజాయితీగా సత్యాలతో కూడిన జవాబులు చెప్పడానికి మీకు సమయం, విజ్ఞత, అవకాశం లభించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని ఆ లేఖలో వివరించాడు. ఇది మోదీకి అసహనాన్ని, చికాకును, కోపాన్ని కక్షను పెంచకుండా ఉంటుందా. భట్‌కు శిక్షలు త్వరగా పడేలా చేయకుండా ఉంటుందా.
2014లో మోదీకి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్.బి. శ్రీకుమార్ ఉత్తరం రాశాడు. అందులో నిజాయితీగా విధులను నిర్వహించిన పోలీసు అధికారులను, మీరు చేసిన చర్యల పట్ల వ్యతిరేకంగా ఉన్న వారిని వేధించడం మానుకోవాలని కోరాడు. 2002లో గుజరాత్‌లో జరిగిన మానవహననం, అరాచకదాడులు, లూటీలు చేసిన అరాచక మూకలను, శక్తులను వారి వెనుక ఉన్న కుట్రదారులను నిరోధించకుండా, వారందరికి కావాలనే సహకరించి ఇండియన్ పీనల్ కోడ్ 186, 188 సెక్షన్‌ల కింద నేరాలు చేసిన అధికారులను శిక్షించాలని కోరాడు. జనరల్ పోలీస్ మాన్యువల్ ||| లోని నాలుగైదు అధ్యాయాల్లో చెప్పబడిన వృత్తి ధర్మాలను ఉల్లంఘించిన పోలీసు అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరాడు. నిజానికి ప్రజలకోసం పనిచేసే ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైన చేయవల్సింది ఇదే. అలా చేస్తారని బిజెపిి ప్రభుత్వాల నుండి ఆశించడం అమాయకత్వమే అవుతుంది.
జకియా జాఫ్రీ డిమాండ్ చేసినట్లుగా రాజ్యాంగ విధులను విస్మరించి వాటికి వ్యతిరేకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన కర్తవ్యానికి శిక్షలెప్పుడు పడతాయో ఎదురు చూడవల్సిందే. అందుకోసం ఒక పోలీస్ అధికారిగా అలాగే వ్యక్తిగత స్థాయిలో తనవంతుగా ధైర్యంగా నిలబడిన సంజీవ్ భట్‌ను, ఆయన సహచరి శ్వేతభట్, వారి పిల్లలను అభినందించకుండా ఉండలేము.
- బీ.రామకృష్ణ
Keywords : sanjiv bhatt, gujarat, ips, narendra modi, amit shah, Gujarat riots
(2023-05-30 06:38:05)
No. of visitors : 2208
Suggested Posts
| After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University PollsAkhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) has lost the student body election held in Gujarat Central University by a big margin, reports National Herald. This loss comes ahead of a hotly-contested Assembly elections in Gujarat.... |
| పెప్సీని, లేస్ ను బహిష్కరిద్దాం... రైతులను కాపాడదాం !
ఏప్రిల్ మొదట్లో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో... పెప్సీ కంపెనీ ఓ లా సూట్ ఫైల్ చేసింది. ఫలితంగా సబర్‌కాంతా జిల్లాలో... రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు బంగాళా దుంపల పెంపకం, అమ్మకాలు జరిపేందుకు వీలు లేకుండా పోయింది. |
| ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం పేదల ప్రాణాలమీదికొచ్చింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఆయన పర్యటించనున్నారు. ఆయన తిరిగే ప్రాంతంలో పేదలెవ్వరూ ఆయనకు కనపడవద్దని భావించిన |
| ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వంప్రపంచ పోలీసుగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం వస్తున్న సందర్భంగా మోడీ చేస్తున్న పని విమర్షలకు తావిస్తోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ట్రంప్ వస్తున్నాడు. |
| ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఓ వృద్ధ ముస్లిం మహిళ, ఆమె కొడుకుపై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దుర్మార్గంగా దాడి చేశారు. మహిళ చేతి వేళ్ళను నరికేసిన భజరంగ్ దళ్ ముష్కరులు ఆమె కొడుకు చేతులను విరగొట్టారు. |
| ʹNot Joining Congress, But Aim To Bring BJP Down,ʹ Says Gujarat Dalit Leader Jignesh MevaniThe 36-year-old lawyer and activist, who has led protests in Gujarat against attacks on Dalits after four men were stripped and brutally thrashed with iron rods by cow vigilantes in the stateʹs Una last year, declined an invitation to meet Congress president Rahul Gandhi in Ahmedabad today.... |
| షరతులు విధిస్తూ రైతులపై కేసు ఉపసంహరించుకున్న పెప్సికో....ఇక పోరాటం ఆపేద్దామా !రాబోయే కాలాన మన భూములమీదా, మన పంటల మీదా, మన భూగర్భ జలాల మీదా ఆఖరికి మనం ఎలా, ఏది తినాలి అనే విషయం మీదా ఆ కంపెనీ ఆధిపత్యాన్ని ఆపగలగాలా వద్దా? అంటే బ్యాన్ పెప్సీ, బ్యాన్ లేస్ అనేది తాత్కాలిక నినాదంగా ఆగిపోకూడదు. |
| ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారుగుజరాత్లోని దాహోద్ జిల్లా జేసావాడా పట్టణ పోలీసు స్టేషన్ లో కమేశ్ గమారా అనే ఆదివాసీని పోలీసులు కొట్టి చంపారు. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన 500 మంది ఆదివాసులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే అదివాసీ ప్రాణాలు కోల్పోయాడు. |
| శిక్ష పడకుండానే... పన్నెండేండ్లుగా జైలులోనే మగ్గుతున్న 78 మంది12 సంవత్సరాలు గడచిపోయినా, గుజరాత్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 78 మంది నిందితులు యింకా జైల్లోనే ఉన్నారు |
| కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేగుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్లు ఈ నెల (జూలై, 2019) 14 న సమావేశమయ్యారు. ఠాకూర్లు అంటే ఆ కులపు స్త్రీ పురుషులందరూ కాదు మగోళ్ళు మాత్రమే అన్ని గ్రామాల్లోని 800 మంది మగోళ్ళు సమావేశమయ్యారు. సమాజం మనువు చెప్పినట్టు నడవడం లేదని గుండెలు బాదుకున్నారు. పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతున్నారని, మగ పిల్లలు ఎలా ఉన్నా పర్వా |