నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.

నేషనల్

(గుత్తా రోహిత్ అనే రచయిత తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన వ్యాసం మీ కోసం)

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ముఖ్య జాబితా ఈ రోజు విడుదల చేశారు పంతొమ్మిది లక్షల ఆరు వేల ఆరు వందల యాభై ఏడు మంది జాబితాలో పేరు దక్కించుకోలేకపోయారు. అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరనకి గురయ్యాయి.

కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి. దాని తరువాత ఇంకో లక్ష మంది పేర్లు కూడా జతచేశారు. అంటే ముసాయిదా జాబితాకి, ముఖ్య జాబితాకి మధ్య తేడా పన్నెండు లక్షలు. ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అంటే ఏమిటి? ఈ దేశపు నిజమైన పౌరుల జాబితా క్లుప్తంగా చెప్పాలంటే. మనం దేశంలో 1951 సంవత్సరంలో మొదటిసారిగా ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తయారు చేశారు. దాని తరువాత మళ్ళీ దానిని అప్డేట్ చెయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ అస్సాం రాష్ట్రానికి ప్రత్యేకంగా చేశారు.

అస్సాం రాష్ట్రాన్ని బర్మా రాజుల నుండి బ్రిటిష్ వారు తీసుకుని, ఈశాన్య భారతదేశంలో మిగతా రాజ్యాలని కలుపుకుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వారు. బర్మా రాజుల కన్నా ముందు అహోం రాజులు పరిపాలించేవారు. ఈ అహోం రాజులు ఇక్కడకి వాళ్ళు కాదు. ఆగ్నేయ ఆసియా నుండి వచ్చినవారు. అందుకే ʹప్రధాన స్రవంతిʹ అస్సాం ప్రజలని ఆహోమియా అంటారు. అస్సాం లో ఈ ప్రధాన స్రవంతి వారే కాక స్థానిక ఆదివాసీ తెగలు (ఉదాహరణకి మిసింగ్ ఒక తెగ పేరు), టీ ట్రైబ్స్ (అస్సాం తేయాకు తోటలలో పని చెయ్యటానికి ఝార్ఖండ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకురాబడిన ఆదివాసీలు. మన కొమరం భీం కూడా కొన్నాళ్ళు ఈ తేయాకు తోటలలో పని చేశాడు),

బెంగాలి భాష మాతృ భాషగా కలిగిన వారు, బెంగాల్ ప్రాంతం నుండి వచ్చినవారు (వీరి మాతృ భాష అస్సామీ. అయితే వీరు బెంగాల్ నుండి వలస వచ్చినవారు), ఇక దేశంలో ఏ మూలకి పోయిన కనిపించే మార్వాడీలు ఉన్నారు. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాక బెంగాల్ ప్రాంతం నుండి (అప్పటికి బెంగాల్ ఇంకా విడిపోలేదు. ఇది పంతొమ్మిదో శతాబ్దం సంగతి) ఇక్కడ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చెయ్యడానికి హిందువులు, ముస్లింలు ఇద్దరినీ ఇక్కడ సెటిల్ చేశారు.

అలాగే బెంగాలి భాషని అధికారిక భాష చేశారు. అప్పటి నుండి మొదలయ్యింది అస్సామీ ప్రజల అసంతృప్తి. అయితే అస్సామీ ప్రజలు గొడవ చెయ్యటంతో తిరిగి అస్సామీ భాషనే అధికారిక భాష చేశారు. అయితే అప్పటివరకు బెంగాలి భాష అధికార భాషగా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక పదవులలో బెంగాలీ వాళ్ళే ఉండేవారు. అది కూడా అసంతృప్తికి కారణం (ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.

మద్రాస్ ప్రభుత్వంలో తమిళ బ్రాహ్మల ఆధిపత్యం ఉందని తెలుగు బ్రాహ్మలు గొడవ మొదలెట్టారు. అది కాస్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకి దారి తీసింది. అదేమీ మంచిది కాదు అని కాదు కానీ ఎవరి ప్రయోజనాలు అందులో ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవటం అవసరం). తరువాత కాలంలో పక్కన ఉన్న బెంగాల్ ని తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విడదీసారు. ఇది ఒక రకంగా మతం ఆధారిత విభజన. తూరుపు బెంగాల్ లో ఎక్కువ మంది ముస్లింలు, పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ మంది హిందువులు.

అస్సాం కి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ రెండూ సరిహద్దు రాష్ట్రాలే. ఒకపక్క ఇదంతా జరుగుతానే ఉండగా ఉపఖండాన్ని విభజించారు. ఉపఖండం విభజన కూడా మతం ఆధారంగానే జరిగింది. అది పశ్చిమాన అయినా, తూర్పున అయినా. దానితో తూర్పు బెంగాల్ పాకిస్థాన్ లో భాగం అయ్యింది. అలాగే అస్సాంలోని సిల్హెట్ ప్రాంతంలో చాలా భాగం తూర్పు బెంగాల్ లో భాగం అయ్యింది.

విభజన జరిగినప్పుడు జరిగిన మత కల్లోలాలు గురించి మనకి తెలుసు. బెంగాల్ లో జరిగిన మత కల్లోలాలు అప్పుడే గాంధీ అక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఆ విభజన కారణంగా, ఈ మత కల్లోలాల కారణంగా జనాభా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు మారారు. బ్రిటిష్ వాడు గీసిన గీతకి భారతదేశ ప్రజలు భారీ మూల్యాన్నే చెల్లించారు. ఒక పక్క కల్లోలాలు, ఇంకో పక్క జనాల రాకపోకాలు సాగినాయి.

ఇటువంటి పరిస్థితులలోనే 1951లో మొదటి సారి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తయారు చేశారు. మనలాంటి ప్రదేశంలో అది తయారు చెయ్యటం వేరు, అస్సాం, బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో చెయ్యటం వేరు. విభజన ప్రభావం మన మీద ఏమీ లేదు. కానీ ఈ మూడు రాష్ట్రాల పరిస్థితి అలా కాదు. అంతా అల్లకల్లోలంగా ఉండింది అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో, పెద్దగా అక్షరాస్యత లేని రోజుల్లో ఎంత మంది దగ్గర సరైన కాగితాలు ఉంటాయి? ఆ గణనలో పాల్గొన్న ఉద్యోగుల గురించి ఒక వార్తా కధనం వచ్చింది.

వారికి పెద్దగా ఇష్టం లేకపోయినా బలవంతానా ఈ పనిలోకి దింపారు అని. అందులో పాల్గొన్న వారందరూ ప్రభుత్వ ఉద్యోగులే. వారికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి దీనికి పంపారు. ఆసక్త్ఘి లేకపోయినా పంపటం, కొన్ని రోజులే అని చెప్పి చాలా రోజులు కొనసాగించటం, అప్పటికి ఇవన్నీ ఎవరికీ తెలియకపోవటం ఇన్ని కారణాల మధ్య ఆ కార్యక్రమం ఎంత వరకు సాఫీగా జరిగుంటదో మనం ఊహించుకోవచ్చు. అలా మొదటి సారి ఆ జాబితా తయారు చేశారు.

దాని తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అస్సాం మిగాత కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కలిపి అస్సాం రాష్ట్రంగా ఏర్పడింది. అన్ని చోట్ల లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినాక కేవలం అస్సాం భాషనే అధికారిక భాషగా చెయ్యటానికి నిర్ణయించుకుంది. దానికి బెంగాలీల నుండి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బరాక్ లోయ నుండి. బరాక్ లోయలో ఉండేవారు సిల్హెటి బెంగాలి మాట్లాడతారు. ఈ నిరసనలు హింసాత్మకం అయ్యాయి. బ్రహ్మపుత్ర లోయలో బెంగాలీల మీద దాడులు కూడా జరిగాయి అంటారు.

అస్సాం సాహిత్య పరిషత్ అస్సాం భాషని ప్రచారం చెయ్యటానికి ఎంతో పని చేసింది. అప్పటికే అస్సామీలలో బెంగాలీలు అంటే ఒక రకమైన కోపం ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. ద్వేషం స్థాయికి చేరుకొని అని చెప్పవచ్చేమో. ఇదిలా కొనసాగుతుండగా నాటి తూర్పు బెంగాల్ నుండి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. గీత అయితే గీశాడు కానీ తెల్లోడు సంబంధాలని ఆపలేడు కదా. ఈ నాటికి బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుకి ఇరువైపులా ఉండే వారి మధ్య సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి.

పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. అప్పుడు అలాగే ఉండేది. నాటి తూర్పు బంగ్లాదేశ్ లో మత కల్లోలాలు జరుగుండటంతో చాలా మంది ఇటువైపుకి వచ్చేసేవారు. ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్ తూర్పు బెంగాల్ ప్రాంతం మీద ఉర్దూ రుద్దటానికి విపరీతమైన ప్రయత్నాలు జరుపుతున్నది అప్పట్లో. తూర్పు బెంగాల్ అంతా బెంగాలీ మాట్లాడేవాళ్ళు. ముస్లింలు అయినా హిందువులు అయినా. మన రాష్ట్రంలో ఉర్దూ, అరబిక్, పర్షియన్ వచ్చిన ముస్లింలు బహు తక్కువ, అక్కడ కూడా అంతే.

ఇలా ఉర్దూ రుద్దే ప్రయత్నాలని తూర్పు బెంగాల్ నిరసించింది. అది కాస్త హింసాత్మకం అయ్యింది. దాని ఫలితం బంగ్లాదేశ్ అనే భాష ప్రయుక్త దేశం. ఈ బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారతదేశం కూడా ఎంతో సహాయం చేసింది. బంగ్లాదేశ్ గెరిల్లాలకి శిక్షణ కూడా ఇచ్చింది. బంగ్లాదేశ్ జాతిపితగా ముజిబుర్ రెహ్మాన్ ని భావిస్తారు. మీకు ఈనాటికి ఈ పేరు అటు బంగ్లాదేశ్ లో, ఇటు బెంగాల్, అస్సాంలలో వినపడుతుంది. చాలా మంది తమ పిల్లలకి ఈ పేరే పెట్టారు. అంటే అర్థం చేసుకోండి బంగ్లాదేశ్ స్థాపనకి ఇక్కడ వారి మద్దతు ఎంత ఉందో.

మార్చ్ 24, 1971 నాడు బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఇదే తారీఖుని ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ కి కట్ ఆఫ్ డేట్ గా పెట్టారు. బంగ్లాదేశ్ ఏర్పడిన కాడి నుండి ఎంతో మంది అక్రమంగా భారతదేశంలోకి-ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలోకి- ప్రవేశించారు కాబట్టి ఆ రోజునే కట్ ఆఫ్ డేట్ గా పెట్టాలి అని డిమాండ్. ఇది జరిగిన తరువాత జరిగిన ఇంకొక ముఖ్య ఘట్టం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) ఏర్పడటం. స్వాతంత్రం వచ్చిన కాడి నుండి భారతదేశం అస్సాం ని దోచుకుంటుంది, ఇక్కడ సంస్కృతి వేరు, మా వనరులు మాకే అన్న నినాదంతో ప్రత్యేక దేశం కోసం ఈ సాయుధ సంస్థ ఏర్పడింది.

సామ్యవాద, లౌకిక అస్సాం దేశం మా లక్ష్యం అని వాళ్ళు ప్రకటించారు. ఇటువంటి సాయుధ సంస్థలు ఈశాన్యలో మిగతా చోట్ల కూడా ఏర్పడ్డాయి. అందులో కొన్ని ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి. అయితే వారి డిమాండ్ న్యాయమైనది. స్వయం నిర్ణయాధికారం అందరి హక్కు. దాన్ని ఐక్యరాజ సమితి కూడా గుర్తించింది. కశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహిస్తామని నిర్వహించకపోవటం భారత దేశం పాకిస్థాన్ రెండూ చేసిన మోసం. దాని ఫలితం మనం ఈ నాడు చూస్తున్నాము. ఈ ఉల్ఫా పోరాటానికి చాలా మద్దతు ఉండేది.

ఒకప్పుడు మన దగ్గర నక్సలైట్ ఉద్యమనకి ప్రజాబాహుళ్యంలో ఇతోధిక మద్దతు లభించినట్టే ఉల్ఫా పోరాటానికి కూడా లభించింది. ఎంతో మంది మేధావులు, కళకారులు, పాత్రికేయులు బహిరంగంగా మద్దతు ప్రకటించేవారు. భారతదేశం మమ్మల్ని దోచుకుంటున్నది అన్న నినాదంతో వీళ్ళు పోరాడేవాళ్ళు. వీళ్ళ పోరాటం కూడా అస్సాం అస్థిత్వం గట్టిపడటానికి కారణం అయ్యింది. ఇదే సమయంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యునియన్ (ఆసు)ఏర్పడింది (యువ అని సినిమా ఒకటి ఉంది ఆసు వ్యవస్థాపకులు, తరువాత అస్సాం ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత విజయాన్ని ఆధారంగా తీసుకుని తీసిన సినిమా అది).

వాళ్ళు ఆరు సంవత్సరాలు పాటు అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు మా వనరులు దోచుకుంటున్నారు, మా సంస్కృతిని మాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇక్కడ నుండి పంపించివేయ్యాలి అని ఉద్యమం చేసారు. ఇది కూడా హింసాత్మకమైన ఉద్యమమే. దానితో ఆరు సంవత్సరాల తరువాత 1985లో ఆసు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరంది.

అదే అస్సాం అకార్డ్. ఆ అస్సాం అకార్డ్ లో ఒక పాయింటే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్. ఇంతక ముందు చెప్పుకున్నాము బ్రిటిష్ కాలం నుండి అస్సాం ప్రజలకి బెంగాలీ వాళ్ళ మీద అసంతృప్తి ఉంది అని. తరువాత అది తీవ్ర రూపం దాల్చింది. ఉల్ఫా ఉద్యమం, ఆసు ఉద్యమం ఆ అస్థిత్వాన్ని మరింతగా గట్టిపరిచాయి. ఈ సెట్లర్లు వల్లే స్థానిక ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి అనే అసంతృప్తి ఆదివాసీలలో ఉంది, అస్సాం ప్రజలలో కూడా ఉంది. ఒక రకంగా మన తెలంగాణా ఉద్యమం కారణం లాంటిదే.

ఈ మధ్యలోలోనే ఈ బెంగాలీ వ్యతిరేక ఉద్యమం ముస్లిం వ్యతిరేక రూపు రేఖలు సంతరించుకోవడం మొదలయ్యింది. 1983లో నెల్లిలో జరిగిన ఊచకోతలో రెండు వేలకు పైగా ముస్లింలని హతమార్చారు. అంటే గోద్రా మారణకాండ జరగటానికి ఇరవై సంవత్సరాల ముందే ఇక్కడ జరిగింది అటువంటిది. ఆ ముస్లిం వ్యతిరేకత పెరుగుకుంటూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఇటు పక్క బెంగాలీ వ్యతిరేకత, అటు పక్క ముస్లిం వ్యతిరేకత.

ఈ రెండిటికి సరిపోయిన వారు ఎవరంటే బంగ్లాదేశీ ముస్లింలు. బంగ్లాదేశ్ నుండి జనం రాలేదు అని ఎవరూ అనటం లేదు. వచ్చారు. ఎన్నో కారణాలతో వచ్చారు. అక్కడ అవకాశాలు లేక, అక్కడ నియంతృత్వ ప్రభుత్వాలలో ఉండలేక ఇలా ఎన్నో కారణలు ఉంటాయి. మన దేశం వాళ్ళు మాత్రం ఆఫ్రికా వెళ్ళలేదా, తెల్ల తోలు దేశాలకి వెళ్ళటానికి గుడ్డలు చించుకోరా. అదేమన్నా పెద్ద విషయమా. తొంభైవ దశకం తరువాత నుండి దేశంలో హిందుత్వ బలపడుతూ వచ్చింది. అస్సాంలో కూడా అదే జరిగింది.

1984 అకార్డ్ తరువాత అది పెద్దగా ముందుకి సాగలేదు. అక్కడ అక్రమ వలసదారుల నియంత్రణ చట్టం ఒకటి చేశారు. దీని ద్వారా అక్రమంగా అస్సాం లో ఉంటున్న వారిని గుర్తించడానికి వీలు అవుతుంది. అయితే ఈ చట్టంలో ఉన్న నిబంధనలు అలా గుర్తించడానికి సులువుగా లేవని సుప్రీం కోర్టులో కేసు వేయాగా 2003లో అనుకుంటా ఆ నిబంధనలని కోర్టు కొట్టివేసింది. ఇలా అక్రమంగా ఉంటున్నారు అని గుర్తించిన వారిని డిటెన్షన్ కేంద్రాలకి పంపుతారు.

అంతకన్నా ముందు వీరు అక్రమ పౌరుల కాదా అనేది ఫారినర్ ట్రిబ్యునల్స్ నిర్ణయిస్తాయి. ఇవేమీ జ్యుడిషియల్ సంస్థలు కాదు. కొన్ని సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం ఉన్నవారెవరైనా సరే ఈ ట్రిబ్యునల్ సభ్యులు అవ్వొచ్చు. ఈ ట్రిబ్యునల్స్ కి వెళ్ళటం అంటే నరకంలో అడుగుపెట్టడమే అని చాలా మంది అభిప్రాయం. అవి అలాగే ఉంటాయి కూడా. ఇక డిటెన్షన్ కేంద్రాలని ఒక ముక్కలో చెప్పాలంటే అవి మరణ కూపాలు. అంతకన్నా చెప్పటం కూడా అనవసరం. అంత ఘోరమైనవి.

2003లో ఆ కఠినమైన నిబంధన కొట్టివేసాక ఆరు సంవత్సరాలకి శర్మ అనేబడే ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అస్సాం అకార్డ్ ప్రకారం అస్సాం రాష్ట్రంలో రెండవ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితా తయారు చెయ్యాలి అని. ఆ కేసు పుణ్యమే ఈ ఎం.ఆర్.సి. ఈ తంతూ అంతా 2013 నుండి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. మొదటి నుండి దీన్ని పర్యవేక్షిస్తుంది నేటి మన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్. ఆయన అస్సాం కి చెందిన వ్యక్తి.

మరి అస్సాం కి చెందిన వ్యక్తి అస్సాం కి చెందిన ఇటువంటి చాలా సున్నితమైన అంశాన్ని తన పరిధిలోకి ఎలా తీసుకుంటాడు? అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి రాదా అనే ప్రశ్నలు మన న్యాయస్థానం పట్టించుకున్న పాపాన పోలేదు. సుప్రీం కోర్టే ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చుకుంటా వచ్చి చివరికీ ఈ రోజున తేలింది. ఈ మధ్యలో తమ పేరు ఈ జాబితాలోకి నమోదు చేయించుకోవటానికి ప్రజలు పడిన హింస అంతా మనం చూసాము. ఆత్మహత్యలు, ప్రాణాలు పోవటం, డిప్రెషన్, పిలల్లు-తల్లి తండ్రులు విడిపోవటం, కుటుంబంలో ఒకరి పేరుంటే మరొకరిది లేకపోవడం, ఆస్తులు అమ్ముకోవడం ఎన్ని చూడలేదు మనం. అంత హింస తరువాత ఈ రోజు సుమారుగా ఇరవై లక్షల మంది శాశ్వతంగా పౌరులే కాదు అని తేల్చారు.

ఇది ఎందుకు ప్రమాదకరం? మూడు కోట్ల ముప్పై లక్షల మంది జనాభాలో ఇరవై లక్షల మంది ఏపాటికి? ఆరు శాతం కంటే తక్కువ. వీళ్ళ వాళ్ళ అస్సాం సంపదకి, సంస్కృతికి వచ్చిన నష్టం ఏమిటి? మన దగ్గర ఎల్.టి.ఆర్ చట్టం ఉన్నట్టు అక్కడ లేదు. ఆదివాసీల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి అంటే దానికి ఈ ఇరవై లక్షలు మంది కారణమా? ఇక నుండి అవ్వవా? ఎల్.టి.ఆర్ లాంటి చట్టం చేస్తే సరిపోయేదానికి ఇదెందుకు? అయినా ఎవరి సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. ముస్లింలు ఎన్నో శతాబ్దాల నుండి అక్కడ ఉంటున్నారు.

కలగలిసి ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవటం అంటూ ఉంటుంది. శుద్ధమైన సంస్కృతి అంటూ ఎక్కడా ఉండదు ఫాసిస్టుల వెట్ డ్రీమ్స్ లో తప్ప. పూర్తిగా ఫాసిస్టు మూకలు రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఇది ఎంత వరకు సమంజసం? ముస్లింలని పూర్తిగా నిర్మూలించాలి అని కంకణం కట్టుకున్న ఈ ఫాసిస్టు మూకలు అధికారం చెలాయిస్తున్నప్పుడు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ ఇరవై లక్షల మందిని ఏమి చేస్తారు.

మళ్ళీ ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్ లో, హై కోర్టులో, సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అంత స్థోమత, వనరులు ఎంత మందికి ఉంటాయి? అక్కడ కూడా ఓడిపోయిన వారి పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ తో మనకేమి జనాలని తిరిగి పంపించే ఒప్పందం లేదు. వీళ్ళతో ఏమి చేస్తాము? ఇప్పుడు ఈ జాబితా వచ్చాక ఏమయ్యింది అంటే ఇందులో ముస్లిం ల కన్నా హిందువులు ఎక్కువ ఉన్నారు అని అనధికారికంగా తేలింది.

అందుకే బిజెపి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఎన్ ఆర్ సి అమలు మీద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పౌరసత్వం సవరణ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈ మధ్య అన్ని బిల్లులు ఎలాగైనా ఆమోదింప చేసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. ఈ సవరణ ప్రకారం మన పొరుగు దేశాల నుండి వచ్చే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు- అంటే ముస్లింలు కానివరెవరైనా సరే- ఈ దేశంలోకి వస్తే వారికి తొందరాగానే పౌరసత్వం లభిస్తుంది. అంటే ఈ ఎన్ ఆర్ సి లో అక్రమ పౌరులుగా తెలిన హిందువులకి ఎటువంటి ఢోకా లేదు. వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. ఎటొచ్చి బలయ్యేది ముస్లింలు. ఈ రోజు ముస్లింలు అందరికీ అంటరానివాళ్ళు అయ్యారు.

ఏనాడో బ్రిటిష్ వాడు ఆక్రమించి, తనకి నచ్చిన విధానాలు అమలు చేసి, దాని కారణంగా ద్వేషాన్ని పెంపొందించి, తనకి నచ్చిన రేతిలో దేశాన్ని విభజిస్తే దానికి ఈనాడు ఎవరైనా ఎందుకు మూల్యం చెల్లించాలి? అక్రమ పౌరులుగా తేలిన ముస్లింలు అందరినీ తమ దేశంలోకి తీసుకుంటారా మరి ఇప్పుడు? తీసుకోరు. తాము బాంబులు వేసి చంపేసిన దేశాల నుండి జనాలు వస్తేనే రానివ్వటం లేదు. ఇక వీళ్ళనేమి తీసుకుంటారు.

ఈ సరిహద్దులు, పౌరసత్వం అనేది రాయిలో రాసినవేమి కాదు. ఒక అస్సాం దేశం ఏర్పడి ఉంటే ఇలా ఉండేదా? ఏమో మరి. సరిహద్దు ప్రాంతాలలో నివసించే వారిలో అటు ఇటు రావటం పోవటం సహజం. దానికి ఇంత బిరుసుగా ఉండే పౌరసత్వం నియమాలు, జాతీయవాదం కుదరదు.

ఇపుడు ఇది అస్సాంతో ఆగదు. ఈ రోజే బిజెపి వాళ్ళు ప్రకటన ఇచ్చారు. తెలంగాణాలో కూడా ఎన్ ఆర్ సి తయారు చెయ్యాలి అని. ఆలాగే దిల్లీలో కూడా. ఫాసిస్టుల తదుపరి లక్ష్యం తెలంగాణా అని మనకు తెలుసు. అలాగే హైదరాబాద్ లో బంగ్లాదేశ్ నుండి, ఇతర దేశాల నుండి వచ్చి జీవిస్తున్న ముస్లింలు ఉన్నారని కూడా తెలుసు.

ఏ దిక్కూ లేని రోహింగ్యాలు ఎలాగోలా బతుకు ఈడుస్తున్నారని మనకి తెలుసు. ఈ రోహింగ్యాల మీద కూడా ఈ ఫాసిస్టులు దాడులు చేసారు. బౌద్ధ తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం రెండూ బెడ్ పార్ట్నర్స్. ఈ ఫాసిస్టులు ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని ఇక్కడ ఆ నరక కూపాలని తయారు చేసే పనిలో ఉన్నారు.

అందుకే ఈ ఎన్ ఆర్ సి ని మనం వ్యతిరేకించాలి. చేపట్టిన ఎన్ ఆర్ సి రద్దు చేసి అస్సాంలో ఎవరి మానాన వారిని బ్రతకనివ్వమని డిమాండ్ పెట్టాలి. అలాగే ఇంకెక్కడా ఎన్ ఆర్ సి తయారు చెయ్యకూడదు అని, ఎన్ ఆర్ సి తయారు చేసే అధికారం స్థానిక కలెక్టర్లకి ఇస్తూ మొన్నీ మధ్య ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చెయ్యాలి అని, పౌరసత్వ సవరణ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేద్దాము.

- గుత్తా రోహిత్.

Keywords : NRC, Assam, bjp, narendra modi
(2024-04-13 13:00:58)



No. of visitors : 2173

Suggested Posts


ఇది సిరియా కాదు భారతదేశ చిత్రపటం! క్రూరత్వం కూడా సిగ్గుపడే సన్నివేశం

వీడియో మొదటి ఫ్రేమ్‌లో ఏడుగురు పోలీసులు కనిపిస్తారు. అంతకంటే ఎక్కువమంది ఉండవచ్చు. పోలీసులందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నారు. విభిన్న శబ్దాలు వస్తున్నాయి.

ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు...

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ భట్టాచార్జీ ఎలియాస్ కాంచన్ దా ను అస్సాంలోని కాచర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

Assam: ఇళ్ళు ఖాళీ చేయాలని ప్రజలపై పోలీసుల దాడి ‍- పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి !

అస్సాంలో దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌ రణరంగంగా మారింది. 1970ల నుండి ధోల్పూర్ ఉంటున్న ప్రజలపై గురువారంనాడు దాడులు చేసిన పోలీసులు వాళ్ళ ఇళ్ళను కూల్చి వేశారు. అడ్డుచెప్పిన ప్రజలను లాఠీలతో చితకబాదారు. పోలీసులు ప్రజల వెంటపడి మరీ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకవైపు ఇళ్ల కూల్చివేత, మరో వైపు తమ‌పై పోలీసుల దాడి స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు

అవును మేము గుండాలమే హిందువులు చర్చిలకు వెళ్తే దాడులు చేస్తాం....భజరంగ్ దళ్ నేత‌

ʹʹఅవును మేము గుండాలమే చర్చిలకు వెళ్ళే హిందువుల మీద దాడులు చేస్తాంʹʹ అని అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత మిథు నాథ్ రెచ్చిపోయాడు. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిథు నాథ్ ఈ విధమైన గుండా భాషను మాట్లాడాడు.

సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !

మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు 50 మందికి పైగా గాయపడ్డారు. అసోం, కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయాలపాలయ్యారు. అస్సాం పోలీసులు తమపై గ్రైనేడ్లు ప్రయోగించడం వల్ల తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని మిజోరాం పోలీసులు తెలిపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేషనల్