పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి


పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి

పులివెందుల

(వరలక్ష్మి రాసిన ఈ వ్యాసం అరుణతార సెప్టెంబర్ 2019 సంచికలో ప్రచురించబడినది)

నల్లమలలో యురేనియం తవ్వకాల గురించి మాట్లాడే ముందు కడప జిల్లా తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు నిర్వాకం గురించి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యు.సి.ఐ.ఎల్‌.) సమాధానం చెప్పాలి. యుసిఐఎల్‌ పదేళ్ల నుండి యురేనియం తోడుకుంటూ, దానితో పాటుగా ప్రజల ప్రాణాలను కూడా తోడేసుకుంటోంది. వారి జీవనాధారమైన పంటపొలాలు నాశనమై, పశువులు అంతుబట్టని రోగాలతో చచ్చిపోతున్నాయి. 2006లో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ప్రజలు ఈ కర్మాగారం అసలు పెట్టవద్దని అభ్యంతరం తెలిపారు. ఆనాడు ప్రజల గొంతునొక్కి దౌర్జన్యంతో తమకు అనుకూలమైన అభిప్రాయాన్ని నమోదుచేసుకొని పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాంటు నడుపుతామని, పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని, ఉద్యోగాలివ్వడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేసారు. ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదు.

వీళ్ల అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే అసలు యురేనియం వెలికితీతలోనే సాంకేతిక వైఫల్యాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలా తక్కువ శాతం యురేనియం లభిస్తుంది. కాబట్టి ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే క్రమంలో వచ్చే వ్యర్థాల శాతం చాలా ఎక్కువగా ఉంటుందని ముందుగానే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తవ్వకాలు మొదలు పెట్టాక అయిదేళ్లకుపైగా ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో యురేనియం వెలికితీతకు ప్రయత్నించారు. ప్రయోగంగా రసాయనాలు వాడి అసంపూర్తిగా యురేనియం వెలికితీసి, మిగిలిన వ్యర్థాలను టైలింగ్‌ పాండ్‌ (వ్యర్థాలను నిలువచేసే చెరువు)లో పారబోసారు. టైలింగ్‌ పాండ్‌ నిర్మాణం, నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైన అణుధార్మికతతో పాటు విషతుల్యమైన పదార్థాలు కలిగి ఉంటాయి. ఇవి భూమిలోకి ఇంకితే భూగర్భజాలాలు తీవ్రంగా కలుషితమవుతాయి. వర్షాకాలం చెరువు పొంగి పొర్లితే ఆ వ్యర్థాలు ప్రవహించినమేరా నేల నాశనం అవుతుంది. ఈ రెండూ జరక్కుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

అయితే ఈ విషయంలో మనదేశంలో పర్యావరణ మంత్రిత్వశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అణుశక్తి నియంత్రణ సంస్థలకే సమగ్ర నిబంధనలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక యుసిఐఎల్‌ అధికారులు టెయిలింగ్‌ పాండును అత్యంత నిర్లక్ష్యంగా మునిపల్‌ చెత్తకుప్పలాగా నిర్వహిస్తున్నారని పదేళ్లుగా ఇక్కడి కాలుష్యాన్ని అధ్యయనం చేస్తున్న సైంటిస్ట్‌ బూబూరావు గారు అంటున్నారు. యురేనియం ప్లాంటుకు అనుమతి ఇచ్చేటపుడు పర్యావరణ శాఖ టైలింగ్‌ పాండు నిర్మాణం, నిర్వహణ గురించి కొన్ని షరతులు పెట్టింది. టైలింగ్‌ పాండ్‌ అడుగుకు, గోడలకు అర మీటరు మందం బెంటొనైట్‌ మట్టితో పూతపూయాలి. దానిపైన హెచ్‌డిపిఎల్‌ (అధిక సాంద్రత కలిగిన) ప్లాస్టిక్‌ పొరవేయాలి. ఈ వ్యర్థాల చెరువు పక్కనే దిగువకు మరొక చెరువు ఏర్పాటు చేసి ఆ వ్యర్థాలను ఇందులోకి పారించి ఎప్పటికప్పుడు రీసైక్లింగ్‌ కోసం పంపించాలి. టైలింగ్‌ చెరువు నిండితే, వర్షం పడి పొంగితే వాటిని పట్టుకోడానికి కూడా ఇది ఉండాలి. ఇందులో ఒక్కటి కూడా యుసిఐఎల్‌ పాటించలేదు. కనీసం కర్మాగారం చుట్టూ 50 మీటర్లు మందంతో చెట్లు పెంచాలనే నిబంధనను కూడా పాటించలేదు.

యుసిఐఎల్‌ చరిత్రంతా నేరమయం. దానికి పర్యావరణం అన్నా, ప్రజల ప్రాణాలన్నా లెక్కలేదని చెప్పడానికి యాభై ఏళ్లుగా జాదూగూడలో అది చేస్తున్న విధ్వంసమే సాక్ష్యం. జాదూగూడను న్యూక్లియర్‌ శ్మశానం అంటారు. అక్కడ 68 శాతం ప్రజలు ఆయుష్షు తీరకుండానే చనిపోతారు. ప్రతి ఇంట్లో అవిటి బిడ్డలు ఉంటారు. ప్రతి ఒంట్లో రోగాలుంటాయి. ఒక ప్రభుత్వ సంస్థ ఇంత యధేచ్ఛగా

నేరాలు చేస్తూపోయే అవకాశం ఉండటం అసలు దుర్మార్గం. కడప జిల్లాలో కూడా అదే కొనసాగింది. కొన్ని సంవత్సరాలకే తుమ్మలపల్లె చుట్టుపక్కల గ్రామల్లో భూగర్భ జలమట్టం విపరీతంగా పడిపోవడం మొదలైంది. వరుసగా బోర్లు ఫెయిలవుతూ వచ్చాయి. నీళ్లు జిడ్డుగా ఉండటం, అవి నిలువుంచిన పాత్రల్లో సుద్దవంటి పదార్థం పేరుకుపోవడం ప్రజలు గమనించి ఫిర్యాదు చేసారు. మనుషుల్లో, పశువుల్లో తలెత్తుతున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పారు. యుసిఐఎల్‌ వీటిని తోసిపుచ్చింది. అసలు ఆ భూములే అంతని, సహజంగానే వాటిలో లవణాల శాతం అధికంగా ఉంటుందని తేల్చిచెప్పింది. ఇన్నేళ్లు లేని సమస్యలు మీ ఫ్యాక్టరీ వచ్చాకే ఎందుకొస్తున్నాయంటే సమాధానం లేదు. మానవ హక్కుల వేదిక చొరవ చేసి స్వతంత్ర శాస్త్రవేత్తల చేత పరిశీలన జరిపించింది. మైనింగ్‌ లోతు భూగర్భజలం కన్నా దిగువ ఉండటం వల్ల బోర్లు ఎండిపోయాయని, క్రమంగా ఇక్కడి నీటివనరులు అంతరించిపోయే అవకాశం ఉందని వారు తేల్చారు. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతం, దాని పరిసరాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, టైలింగ్‌ పాండ్‌ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్మించారని, వ్యర్థాలు భూమిలోకి సులువుగా ఇంకుతున్నాయని కూడా చెప్పారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకున్న పాపాన పోలేదు.

ఈలోగా యుసిఐఎల్‌ యురేనియం ఉత్పత్తి పెంచాలని ప్లాంటు విస్తరణకోసం మరో 2400 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేసింది. (మొదట సేకరించింది 2240 ఎకరాలు). మొదటి ప్లాంటు పెట్టినప్పుడు ఇచ్చిన అరకొరా నష్టపరిహారం, ఇవ్వని ఉద్యోగాల గురించే కాక పంటపొలాలు దెబ్బతినడం, ఇతర సమస్యల గురించి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండో ప్లాంటు కట్టేముందు వీటి సంగతి తేల్చండని అడిగారు. అలా 2011-2013 మధ్య మూడు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ ఆగిపోయి ఆ ప్రతిపాదన తాత్కాలికంగా వెనక్కిపోయింది.

2013 లో టైలింగ్‌ పాండ్‌ దాకా వేసిన పైప్‌లైన్‌ మబ్బుచింతలపల్లె ప్రాంతంలో లీకై దామోదర్‌ రెడ్డి అనే రెండెకరాల రైతు పొలంలో వ్యర్థాలు మడుగు కట్టాయి. అందులోకి దిగిన ఇరవై గొర్రెలు చనిపోయాయి. 50కి పైగా తీవ్రంగా జబ్బుపడ్డాయి. ఇలా రెండుసార్లు జరిగింది. ఆ రసాయనాలు తాకిన చోట చర్మం కాలిపోయిందని ఇంత నిర్లక్ష్యంగా యురేనియం వ్యర్థాలను ఎలా వదిలేస్తారని రైతులు ఆందోళన చేసారు. ఇంతకూ యుసిఐఎల్‌ ఈ పైప్‌లైన్‌ వేసేందుకు భూమి సొంతదార్ల అనుమతి తీసుకోలేదు. విషయం బైటికి తెలిసాక హడావిడిగా రైతులకు నష్టపరిహారం చెల్లించి, పశువులకు వైద్యం చేయించి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసారు. ఇది జరిగాక కొద్ది రోజులకు తుమ్మలపల్లెలో మరో లీకేజీ అయ్యి 11 గేదెలు జబ్బుపడ్డాయి. ఇలా రెండు మూడు సంఘటనలు కాదు, అనేకసార్లు లీకేజీల వల్ల పశువులు చనిపోయాయి కానీ విషయం బైటికి రానివ్వలేదని తెలిసింది. ఇది క్రిమినల్‌ నిర్లక్ష్యానికి పరాకాష్ట. రసాయన పరిశ్రమల వ్యర్థాలను ఇలా పొలాల్లోకి పంపడం నేరం అయితే యురేనియం వ్యర్థాలతో ఇట్లా వ్యవహరించడం అందుకు వందరెట్లు ఎక్కువ నేరం కింద లెక్కవేయాలి. అణుధార్మిక వ్యర్థాల పైప్‌లైన్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఉండాలి. అణుధార్మికత నేల, నీరు, గాలిలో కూడా వ్యాపిస్తుంది కాబట్టి వాటి దగ్గరికి ఎవరూ వెళ్లకుండా కంపెనీయే జాగ్రత్త తీసుకోవాలి. యుసిఐఎల్‌ జాదూగూడలో ఇటువంటి అనేక నేరాలకు పాల్పడింది. ఏం చేసినా దాన్ని ప్రభుత్వం ఏమీ అనదు.

క్రమంగా భూగర్భజలం అంతకంతకూ కలుషితం అవుతూ పంటల మీద దాని ప్రభావం 2017 ప్రాంతంలో స్పష్టంగా బైటపడింది. మహేశ్వర్‌ రెడ్డి అరటితోట నిలువునా ఎండిపోతే అక్కడ భూసార పరీక్షల్లో ఇక ఆ భూమి వ్యవసాయానికి పనికిరాదని తేలింది. మహమ్మారి వ్యాపించినట్లు వరుసగా అరటితోటలు నాశనం కావడం మొదలైంది. కంపెనీలో ఉద్యోగాలకు ఆశపడి, పరిహారానికి లోబడి చాలా మంది రైతులు మౌనంగా ఉండిపోయారు. కనంపల్లెలో చంద్రనాయక్‌ అరటి తోట పెడితే అవి గెలలు వేసినా అరటిపండ్లు చేతివేళ్లకన్నా ఎక్కువ పెరగలేదు. తను కష్టపడి వేసిన పంటను తానే తగలబెట్టుకున్నాడు. అరటి చెట్లే కాదు, అక్కడ ఏ మొక్కా మొలవలేని విధంగా భూములు విషతుల్యం అయ్యాయి. వరుస ఫిర్యాదుల తర్వాత 2018లో గాని కాలుష్య నియంత్రణ మండలి యుసిఐఎల్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదు. టైలింగ్‌ పాండ్‌కు లైనింగ్‌ వేయలేదని స్వతంత్ర అధ్యయనంలో బాబూరావు గారు కనుక్కొని కంప్లెయింట్‌ చేసాక పదేళ్లకు గానీ కాలుష్య నియంత్రణ మండలి కదల్లేదు. ఇక యుసిఐఎల్‌ అన్ని ఆరోపణలు అబద్ధాలనే అంటుంది. కొంత మంది ఎన్‌జివోలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని అది బహిరంగ ప్రకటనలు చేసింది. పర్యావరణ నేరాలకు చెక్‌ పెట్టి ప్రజల తరపున కంపెనీలను అదుపు చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా లొంగుబాటు ధోరణి అవలంబిస్తుంది. ఈ ఆగస్టు 5వ తేదీ కాలుష్య నియంత్రణ మండలి న్యాయవిచారణకు పూనుకొని ఫిర్యాదులను అహ్వానించేనాటికి తుమ్మలపల్లె, కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె తదితర గ్రామాలన్నీ కలుషితమయ్యాయి. ఇటీవలి ఆ పల్లెలకు పోతే మాకు ఎదురైన అనుభవాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి.

ʹʹమా జీవాలు (గొర్రెలు, మేకలు) గడ్డి తినడం మానేసినాయి. గుట్టెక్కుతాంటే గసపోసుకోబట్టె. నోట్లోనుంచి సొంగ కార్చుకునె. బురుగులు (నురగలు) కక్కుకోని అట్టనే పడి సచ్చిపాయె..ʹʹ కనంపల్లెలో ఉండేదంతా సుగాలీలే. గుట్టల వాలుగా ఊరు. ఆ గుట్టల్లోకి గొర్లు తోలుకొనిపోయి మేపుకుంటారు. గొప్పగా బతికేవాళ్ళు కాదుగానీ, ఏదో బతుకుతెరువుకింత ఉండేది. కొంత మందికి భూములు కూడా ఉన్నాయి. యురేనియం తవ్వకాలు మొదలై వ్యర్థాలు ఏ నియంత్రణ లేకుండా అక్కడ పారబోయడం మొదలైయ్యాక ఊర్లు జబ్బుపడ్డాయి. ఇప్పుడా భూముల్లో పంటలు పండవు. వందలకొద్దీ జీవాలు చచ్చిపోతే నష్టపరిహారం కాదు కదా పట్టించున్న నాధుడే లేడు. టైలింగ్‌ పాండ్‌ ఉండే కొట్టాల గ్రామంలోనైతే ఎవరిని పలకరించినా అంతుచిక్కని రోగాల గురించి చెప్తారు. ఒళ్ళంతా దురదలు, మంటలు పుట్టి చర్మం రంగు మారడం, పొడిబారి చిట్లిపోవడం, దద్దుర్లు, పొక్కులు రావడం అక్కడ మామూలు. వీటికి తోడు కాళ్ళు, చేతులు ఒకటే నొప్పులు. అలర్జీలు, నొప్పులు తగ్గడానికి వాడుతున్న మందులు తాత్కాలికంగానే పనిచేస్తాయి. స్థానిక డాక్టర్ల దగ్గరి నుండి దూరప్రాంతాల ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కావడం లేదని, చాలా డబ్బు ఖర్చవుతోందని జనం వాపోతున్నారు.

భూమయ్యగారి పల్లె, మబ్బుచింతల పల్లె రైతులు యురేనియం మైనింగ్‌ ప్లాంటును తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసు కేసులయ్యి జైలుకెళ్ళారు. చివరికి వైఎస్‌ కుటుంబం ముందు ఓడిపోయారు. భూమయ్యగారి పల్లె కాస్త తగ్గులో ఉంది. అక్కడా, చుట్టుపక్కల ఊర్లలో అంతా బోరు వ్యవసాయం. ఎక్కడ చూసినా అరటి తోటలు కనిపిస్తాయి. ఇది రాయలసీమలా లేదు అన్నారు అప్పట్లో మాతో పాటు ఆ ఊర్లు చూడ్డానికి వచ్చినవాళ్ళు. ఇప్పుడక్కడ 1200 అడుగులు బోరు వేస్తే కానీ నీళ్ళు పడవు. పడినా కొన్ని నెలల లోపలే నీళ్ళు పడిపోతాయి. రైతులు కదా, పంట మీద ఆశ చావక మళ్ళీ బోరు వేస్తారు. ఇట్లా ఊరంతా చెట్లు మొలిచినట్లు బోర్లు వెలిసాయి. ఒక్కో రైతు పది పన్నెండు బోర్లు వేసాడు. ఇట్లా ఇంకెన్ని రోజులు వేయగలరో, ఎంత ధార మిగిలి ఉందో గానీ ఆ నీళ్ళు చూస్తే భయమేసింది. బాత్రూం వెళితే ఏదో హారర్‌ సినిమాలాగా బకెట్‌లో ఎర్రగా నీళ్ళు. ఒక్కోసారి జిడ్డుగా వస్తాయట. నీళ్ళు నిలువ చేసిన పాత్రల్లో సుద్దలాగా తెల్లని పొడి పేరుకుపోతుంది. ఈ నీళ్ళతో స్నానం చేస్తున్నందుకే ఒళ్ళంతా దురదలు, పుండ్లు. ఈ ఊర్లో చిన్న పిల్లలకు కూడా ఒళ్ళు నొప్పులే అని చేత్తో నాలుగడుగుల ఎత్తు చూపించి ʹʹఇదో ఇంత పిల్లోల్లు కూడా నొప్పులు అంటాండారుʹʹ అని చెప్పారు. గిడ్డంగివారిపల్లెలో ఈ లక్షణాలు ఇటీవలే మొదలయ్యాయి. సుమారు యాభై ఏళ్ళ వయసున్న ఒక రైతు ʹʹఈ ఊర్లో ఇంగ మాదే చివరి తరంʹʹ అన్నాడు. ఆ పక్కనే ఉన్న బక్కన్నగారి పల్లెలోనూ ఇదే కథ. చాలా విషయాలు బైటికి పోక్కనివ్వడం లేదు గానీ ఇప్పటికి బైటికొచ్చిన సమాచారం ప్రకారం ముగ్గురు గనికార్మికులు కాన్సర్‌తో మరణించారు. వారిలో ఇద్దరిది మూడుపదుల వయసు. పశువుల్లో గర్భాలు నిలవకపోవడం, మనుషులకు గర్భస్రావాలు, నపుంసకత్వం, కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తున్నది.

ఇంత విధ్వంసం చేసి, ఇంకా చేస్తూ యుసిఐఎల్‌ ఇప్పుడు నల్లమలకొచ్చే ప్రయత్నం చేస్తోంది. నిజానికి జాదూగూడ అనుభవం తర్వాత ఎవరూ యుసిఐఎల్‌ను రానివ్వలేదు. అనేక చోట్ల తిరస్కరణకు గురై వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన దన్నుతో అది కడపకొచ్చింది. వై.ఎస్‌.ముఠా దౌర్జన్యాలకు భయపడి, లొంగిపోయిన ప్రజలు ఇప్పుడు జీవితాలనే కోల్పోతున్నారు. తరతరాలపాటు వెన్నంటే శాపాన్ని మోస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా యుసిఐఎల్‌ మాయమాటలు చెప్తోంది. ఉద్యోగాలంటుంది. డబ్బు ప్యాకేజీలంటుంది. ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తుంది. అందుకని ఆ విషయాలు కూడా మాట్లాడుకోవాలి.

ఈ కర్మాగారంవల్ల వచ్చే అరకొర ఉద్యోగాలు ఎంతవరకు సురక్షితం? కడప, జాదూగూడలలో స్థానికులు ఎక్కువ భాగం గని కార్మికులుగా పని చేస్తున్నారు. గనిలో పని చేసేటప్పుడు మొట్టమొదట అణుధార్మికతకు గురయ్యేది వీళ్లే. రేడాన్‌ - 222 అనే విషవాయువు ప్రభావం వీళ్లపై భారీస్థాయిలో వుండి శ్వాసకోశ సంబంధిత జబ్బులకు, ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురిచేస్తుంది. అత్యున్నత స్థాయి ఉద్యోగులకుండే వైద్యసదుపాయం వీళ్లకు ఉండదు. నిజానికి అణు కేంద్రాల వద్ద పనిచేసే వారెవరైనా రేడియేషన్‌కు గురికావల్సిందే. ముంబాయికి చెందిన చేతన్‌ కొఠారి అనే సామాజిక కార్యకర్త 1995 నుంచి 2010 మార్చి వరకు మన దేశంలోని వివిధ అణుసంబంధిత సంస్థల్లో పనిచేస్తూ మరణించిన 1930 మంది శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు సంబంధించిన ఒక రహస్య నివేదికను బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బిఏఆర్‌సి) నుండి చేజిక్కించుకున్నాడు. అందులో నిగ్గుతేలిన నిజాలేమంటే వీరిలో 193 మంది మానసిక రుగ్మతకు గురై ఆత్మహత్యలకు పాల్పడగా, అందులోనూ 74 మంది కేవలం జార్ఖాండ్‌ యుసిఐయల్‌ లో పనిచేసే వాళ్లే కావడం గమనార్హం. మిగతా 1737 మంది గుండె జబ్బులు, క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలు వంటి ఇతర జబ్బులకు బలైనట్లు వెల్లడైనది. వీళ్లలో అధికశాతం 29-50 ఏండ్ల మధ్య వయస్కులు కావడం విషాదం.

అణుధార్మిక కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనది. కానీ అణువిద్యుత్తు సురక్షితమని చెప్తారు. బొగ్గుకన్నా యురేనియం వాడకం సేఫ్‌ అని చెప్తారు. ఈ విషయం వాళ్ల శాస్త్రవేత్తలతో కూడా పలికిస్తారు. పులివెందుల ప్రజలు మాకు యురేనియం ఫ్యాక్టరీ వద్దు అంటే, మీకు వద్దకుంటే మాక్కావాలి అన్నాడట వివేకానందరెడ్డి. నిజానికి అణువిద్యుత్తు పాలకులకెంతో ముద్దు. ఎందుకంటే దేశరక్షణ పేరు చెప్పి అక్కడ లక్షల కోట్ల అవినీతి సంపాదనకు అస్కారం ఉంటుంది. తుమ్మలపల్లె యురేనియం ప్లాంటులో 970 కోట్ల అవినీతి జరిగినట్లు బైటపడింది. అంత నాసిరకం పనుల వెనక ఉన్నత స్థాయి అవినీతి ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వాలు విదేశాలతో చేసుకునే అణు ఒప్పందాలన్నీ భారీ బడ్జెట్‌తో కూడుకున్నవి. అటు కాంగ్రెస్‌ హయాంలో ఇటు బిజెపి హయాంలో ఇండియా 14 దేశాలతో యురేనియం దిగుమతులు, అణు రియాక్టర్‌ భాగాల కొనుగోలు కోసం అణు ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అణు ఒప్పందం సందర్భంలో ఆ దేశం పెట్టిన ఆంక్షలకు మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తలొగ్గింది. అణుప్రమాదాలు జరిగితే అణురియాక్టర్‌ భాగాలను సరఫరా చేసిన కంపెనీని బాధ్యురాల్ని చేయాలనే నిబంధనను తొలగించి మరీ రియాక్టర్లు కొనుగోలు చేస్తున్నది ఎవరి కోసం? జపాన్‌లో ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత అనేక దేశాలు అణు విద్యుత్‌ ఉత్పత్తి నుండి వెనక్కి తగ్గాయి. వాళ్లు పక్కకు పెట్టిన రియాక్టర్లను మనం కొనుక్కోవడం అంత సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా?

అణుశక్తి ఎంత ప్రమాదమో, నల్లమల అడవి అంతకన్నా పెద్ద రక్షణ కవచం. అడవి ధ్వంసం చేసి అణుబాంబును పెట్టుకోవడం అవివేకం, ప్రకృతి పట్ల నేరం, భవిష్యత్‌ తరాల పట్ల చెయ్యకూడని అన్యాయం. అమేజాన్‌ కాలిపోతుంటే అహంకారంతో వ్యవహరిస్తున్న బ్రెజిల్‌ ప్రభుత్వాన్ని ప్రపంచమంతా తిడుతోంది. మన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చాలా మంది అమేజాన్‌ కోసం మాట్లాడుతున్నారు. కానీ విధ్వంసం మన ఇంటనే జరుగుతుంటే కళ్లు మూసుకొని ఉన్నారు. అమేజాన్‌ అడవులు భూమికి ఊపిరితిత్తులని అంటున్నారు. అడవులు ఏవైనా అంతే కదా. మరి మన ఊపిరిని, మన పంటపొలాలను, మన నీటి వనరులను, మన అడవిని, మన ప్రకృతిని మనం కాపాడుకోవద్దా?
- వరలక్ష్మి

Keywords : uranium, nallamala, pulivendula, virasam
(2020-09-20 12:14:13)No. of visitors : 822

Suggested Posts


పాలకులారా...! ఈ తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పగలరా ?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం,తిర్మలపూర్ గ్రామంలో... తమ ఊరును ఖాళీ చేయిస్తారన్న ప్రభుత్వం ఆలోచనపై ఓ తల్లి తన ఆవేదనను వెల్లడించింది. పాలకులకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆ వీడియో మీ కోసం...

నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

నల్లమల అడవి ప్రాంతంలో అమ్రాబాద్,పదర తదితర ప్రాంతంలోని ప్రజలను నిర్వాసితులను చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట‌నున్న యురేనియం త్రవ్వకాలను సి.పి.ఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.యురేనియం త్రవ్వకాల ప్రయత్నాలు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము.

Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?

ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్బన్ నక్సలైటా ? పర్యావరణం నాశ‌నమవుతుంది అంటే దేశద్రోహా ? నల్లమలను కాపాడాలంటే చైనా ఏజెంటా ? అవునట !

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


పులివెందుల