కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక


కశ్మీర్ లో దుర్మార్గం పై మహిళల నివేదిక

కశ్మీర్

(ఢిల్లీ నుంచి మూడు మహిళా సంఘాలకు చెందిన ఐదుగురు మహిళల బృందం కశ్మీర్ లో పర్యటించి ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో ఓ రిపోర్ట్ ను విడుదల చేశారు. ఇంగ్లీష్ లో ఉన్న ఆ రిపోర్ట్ ను వీక్షణం పత్రిక ఆక్టోబర్ సంచిక కోసం ఆ పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించారు.)

ఢిల్లీ నుంచి మూడు మహిళా సంఘాలకు చెందిన ఐదుగురు మహిళల బృందం కశ్మీర్ లో పర్యటించి ప్రకటించిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక

వసంతకాలపు మొగ్గలు వికసిస్తాయి
కోయిలల వేదన అంతమవుతుంది
ప్రేమికుల గాయాలు మానడం మొదలవుతుంది
వ్యాధి పీడితులను వదిలిపోతుంది రోగం
రంజూర్ హృదయాకాంక్ష నెరవేరుతుంది
అట్టడుగు పేద మనిషి పాలించినప్పుడు
వైభవ కిరీటం ధరించినప్పుడు

మూసివేసి, తాళాలు బిగించిన కశ్మీర్ అనే నేల మీద మా నాలుగు రోజుల పర్యటనలో మాకు కరదీపికగా నిలిచినవి 1990లో హత్యకు గురైన కామ్రేడ్ అబ్దుల్ సత్తార్ రంజూర్ రాసిన ఈ కవితాపాదాలే.

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ తరఫున ఆనీ రాజా, కవల్ జిత్ కౌర్, పంఖురి జహీర్, ప్రగతిశీల్ మహిళా సంఘటన్ తరఫున పూనమ్ కౌశిక్, ముస్లిం విమెన్స్ ఫోరమ్ తరఫున సయిదా హమీద్ – ఐదుగురు మహిళల బృందంగా మేం సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు కశ్మీర్ లో పర్యటించాం. నలబై మూడు రోజుల దిగ్బంధం కశ్మీర్ ప్రజల మీద, ముఖ్యంగా స్త్రీల మీద, పిల్లల మీద ఎటువంటి ప్రభావాన్ని వేసిందో మాకళ్లతో మేం చూడదలిచాం.

మా పర్యటనలో శ్రీనగర్ లో కొంత సమయం గడిపాం. షోపియన్, పుల్వామా, బండిపొరా జిల్లాల్లో ఎన్నో గ్రామాలకు వెళ్లాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఆసుపత్రులకు, పాఠశాలలకు, ఇళ్లకు వెళ్లి ఎందరో పురుషులతో, స్త్రీలతో, యువతతో, పిల్లలతో మాట్లాడాం. ఉక్కుపాదం కింద నిర్బంధంలో 43 రోజులుగా జీవిస్తున్న సాధారణ ప్రజల బాధలకూ, గాథలకూ మా ప్రత్యక్ష సాక్షి కథనం ఈ నివేదిక.

మేం విమానాశ్రయంలో దిగి నగరంలోకి వాహనంలో వెళ్తూ ఉంటే కొట్టవచ్చినట్టు కనిపించిన దృశ్యం మూసి ఉన్న దుకాణాలు, మూసి ఉన్న హోటళ్లు, మూసి ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, నిర్జనమైన వీథులు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడాన్ని కూడ అడ్డుకుంటున్న శిక్షా వాతావరణం అక్కడ నెలకొని ఉన్నదని మాకు అనిపించింది.

మా కళ్ల ముందు కనిపించినది కశ్మీర్ అంటే సాధారణంగా ఉండే చిత్రం కాదు. శికారాలు, హౌజ్ బోట్లు, తామర పూలు, దాల్ సరస్సు అనే సాధారణ చిత్రం ఇప్పుడక్కడ లేదు. తమ వాళ్ల కోసం ఎదురుచూస్తూ గుమ్మంలో నిలబడి ఉన్న జుబేదా, షమీమా, ఖుర్షీదా వంటి స్త్రీలు మాకక్కడ కనిపించారు. వాళ్లు కళ్లు కాయలు కాచేట్టు ఎదురుచూస్తున్నది తమ పద్నాలుగేళ్ల, పదిహేనేళ్ల, పదిహేడేళ్ల, పందొమ్మిదేళ్ల కొడుకుల కోసం. ఆ యువకులు తమ తల్లులను వదిలిపోయినప్పటి చిట్టచివరి దృశ్యం, చిట్టచివరి చూపు ప్రతి హృదయం మీద చెక్కి ఉంది. ఏమి జరిగినా ఆ తల్లులు తమ ఆశ వదులుకోదలచలేదు. చిత్రహింసలకు గురైన తమ బిడ్డల శరీరాలనో, మృతదేహాలనో చూడడానికి ఎంతో కాలం ఎదురు చూడాలని వాళ్లకు తెలుసు. అసలెప్పటికైనా చూస్తారో లేదో కూడ వాళ్లకు తెలియదు.

ʹమమ్మల్ని బోనులో బంధించారుʹ అనే మాటే మాకు ఎక్కడికి వెళ్లినా వినబడింది. ʹమీ ఢిల్లీలో ఇంటర్నెట్ ను ఐదు నిమిషాల పాటు లేకుండా చేస్తే మీరేం చేస్తారుʹ అని మమ్మల్ని డాక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు అడిగారు. మా దగ్గర జవాబు లేదు.

మేం తిరిగిన నాలుగు జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోనూ ప్రజల అనుభవం ఒకే రకంగా ఉంది. రాత్రి ఎనిమిదింటికి, మఘ్రేబ్ ప్రార్థన అయిపోగానే ఇళ్లలో లైట్లు ఆర్పేసి చీకటి చేయాల్సి ఉంటుందని వాళ్లందరూ చెప్పారు. బడి మళ్లీ తెరుస్తారేమో, పరీక్షలకు చదువుకోకపోతే ఎట్లా అని బండిపొరాలో ఒక అమ్మాయి లైటు ఆర్పకుండా తప్పు చేసింది. అలా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు సైనికులకు చాల కోపం వచ్చింది. గోడ దూకి ఇంట్లోకి తోసుకొచ్చారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మగవాళ్లను, తండ్రినీ కొడుకునూ ప్రశ్నించడానికనే పేరుతో తీసుకుపోయారు. ఏం ప్రశ్నించడానికి అని ప్రశ్నించే సాహసం ఎవరికీ లేదు. అప్పటి నుంచి ఆ తండ్రీకొడుకులను నిర్బంధంలోనే ఉంచారు. ʹసాయంత్రం ఆరింటికల్లా మా మగవాళ్లందరినీ ఇంటిలోపలికి వచ్చెయ్యమంటున్నాం. మగవాళ్లు పెద్దవాళ్లైనా, పిల్లవాళ్లైనా చీకటిపడ్డాక వీథుల్లో కనబడడం చాల పెద్ద ప్రమాదం. అత్యవసరమైతే, మేం స్త్రీలమే బైటికి వెళ్తున్నాంʹ అన్నది బండిపొరా జిల్లా కేంద్రానికి పొరుగున ఉన్న ఒక గ్రామంలో జరీనా అనే స్త్రీ. ʹమాకిది ఎంత అలవాటై పోయిందంటే చీకటి పడ్డాక బైట వీథిలో కుక్క మొరగగానే నా నాలుగేళ్ల కూతురు వెంటనే మూతి మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దం అని సూచిస్తుంది. కుక్కలు మొరుగుతున్నాయంటే సైనికులు రాబోతున్నారని అర్థం. చివరికి నా చిన్నారిని మూత్రానికి తీసుకుపోవడానికి నా ఫోన్ లైట్ వేయడానికి కూడ వీల్లేదు. అటువంటి వెలుగురేఖ దూరానికి కూడ కనబడుతుంది. అది కనబడిందంటే మా మగవాళ్లు తమ ప్రాణాలతో మూల్యం చెలించవలసి వస్తుందిʹ అందామె.

బతికి ఉన్నవాళ్లను చనిపోయినవాళ్లు కూడ హింసకు గురి చేస్తున్నారు. ʹమనుషులు చెప్పి, హెచ్చరించి, ఏడ్చి చచ్చిపోతారా? ఊరికే చచ్చి పోతారంతే. అమ్మ చచ్చిపోయిందని నేను నా అక్కచెల్లెళ్లకు కబురు ఎట్లా పంపను?ʹ అంటున్నప్పుడు గులామ్ అహ్మద్ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ʹనా అక్కచెల్లెళ్లు ట్రాల్ లో, పట్టన్ లో ఉంటారు. కన్నబిడ్డలు రాకుండానే నేను మా అమ్మ అంత్యక్రియలు నిర్వహించవలసి వచ్చిందిʹ అన్నాడాయన.

మేం ఎక్కడికి వెళ్లినా ఇదే కథ. అత్యంత ప్రియమైన తమ సమీప బంధువులకు కబురు పంపించడానికి మార్గమేమీ లేదు. ఈ నలబై మూడు రోజులూ మృత్యు శాంతి తాండవించింది.

ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది. తమ సొంత కార్లున్నవాళ్లు కూడ అత్యవసరమైన పనుల కోసం మాత్రమే వాటిని బైటికి తీస్తున్నారు. స్త్రీలు రోడ్ల పక్కన నిలబడి వచ్చిపోయే కార్లనూ, బైక్ లనూ లిఫ్టు ఇమ్మని అడగడం కనబడుతున్నది. సాధారణంగా అలా వాహనాల మీద వెళ్లేవాళ్లందరూ ఆగి సహాయం చేస్తున్నారు. లిఫ్టు ఇచ్చేవారినీ, లిఫ్టు అడిగేవారినీ కూడ ఇద్దరమూ నిస్సహాయులమే అనే పైకి చెప్పని బంధమే కలుపుతున్నది. ʹనేను నా బైక్ మీద అవంతిపొరా వైపు వెళ్తున్నాను. ఒక స్త్రీ నన్ను ఆపమని చెయ్యి ఊపింది. ఆమెను ఎక్కించుకున్నాక కొంత దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర నా బైక్ ఎగిరిపడి ఆమె కింద పడిపోయింది. నేనామెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లాను. ఆమె కోమా లోకి వెళ్లింది. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆమెకు నేనెట్లా చికిత్స చేయించగలను? ఆమె ఎవరో కూడ నాకు తెలియదే. ఎవరికి ఎట్లా చెప్పగలను?ʹ ఇటువంటి రోజువారీ ఘటనల గురించి మేం వెళ్లినచోటల్లా విన్నాం.

అధికరణం 370 రద్దు జరిగిననాటి నుంచీ తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి శ్రీనగర్ లో లాలా దేడ్ ఆస్పత్రిలో యువ మహిళా డాక్టర్లెందరో తమ నిరాశానిస్పృహలను మాతో పంచుకున్నారు. ʹప్రసవానికి స్త్రీలను తగిన సమయంలో తీసుకురాలేకపోయిన సందర్భాలున్నాయి. చాల తక్కువ ఆంబులెన్సులున్నాయి. ఉన్న కాసిన్నిటిని కూడ దారిలో సైనిక పికెట్ల దగ్గర అడ్డగిస్తున్నారు. దాని ఫలితం ఏమిటి? ప్రసవం ఆలస్యం కావడం వల్ల జనన సమయంలో అంగవైకల్యంతో, ఇతర రకాల సమస్యలతో పిల్లలు పుడుతున్నారు. అది ఆ పిల్లలకు జీవితాంతం ఉండే సమస్య. తల్లిదండ్రులకైతే జీవన్మరణమే. మరొకపక్క, చాల మంది స్త్రీలు ప్రస్తుత స్థితిలోని ఒత్తిడి వల్ల, భయం వల్ల సమయానికి ముందే ప్రసవిస్తున్నారుʹ అన్నారొక డాక్టర్. ʹప్రభుత్వం మమ్మల్ని గొంతు నులిమి చంపాలని అనుకుంటున్నదని అనిపిస్తున్నది. అలా గొంతు నొక్కుతూనే రాక్షసానందంతో మమ్మల్ని మాట్లాడమని కూడ అంటున్నదిʹ అంటూ ఒక యువ మహిళా డాక్టర్ తన గొంతు నొక్కుకుంటూ చెప్పింది.

బండిపొరా ఆస్పత్రిలో ఒక సీనియర్ డాక్టర్ తమ ఆస్పత్రికి కుల్గాం, కుప్వారా, తదితర జిల్లాల నుంచి కూడ జనం వస్తున్నారని అన్నారు. తన అనుభవం మొత్తంలోనూ ఎన్నడూ చూడనన్ని మానసిక వ్యాధుల, గుండె పోట్ల కేసులు వస్తున్నాయన్నారు. అత్యవసరమైన కేసులలో సాధారణంగా జూనియర్ డాక్టర్లు తమ సీనియర్ల కోసం చూస్తారు. కాని సీనియర్ డాక్టర్లను సంప్రదించడానికి ఫోన్ సౌకర్యం లేదు. సీనియర్లు దగ్గర్లోనే ఉన్నారని తెలిస్తే వీథుల్లో అరుస్తూ, వెతుకుతూ, పిలుస్తూ జూనియర్ డాక్టర్లు పరుగెత్తుతున్న సందర్భాలు ఉన్నాయి. విధి నిర్వహణ కోసం వెళ్తుండగా స్కిమ్స్ లోని ఒక ఆర్తోపెడిక్ డాక్టర్ ను సైనికులు ఆపేసి ఆయనను ఏడు రోజులు నిర్బంధంలో ఉంచుకున్నారు.

షోపియన్ లో కాన్సర్ కోసం శస్త్రచికిత్స చేయించుకున్న సఫియా ʹకాన్సర్ తిరగబెట్టిందా పరిశీలించడానికి నేను తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాలి. అక్కా, నేను నా డాక్టర్ ను కలవడానికి, మాట్లాడడానికి వీలే లేదు. నగరానికి వెళ్లడం ఒకటే మిగిలిన మార్గం. కాని ఎట్లా వెళ్లాలి? ఒకవేళ కష్టపడి వెళ్లినా, ఆయన ఆ సమయానికి ఉంటారా?ʹ ఇంటర్నెట్ మీద మాత్రమే పనిచేసే ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని వాడుకోవడానికి డాక్టర్లకూ, రోగులకూ కూడ అవకాశం లేదు.

గ్రామాల్లో మా ముందు నిలబడిన మహిళల కళ్లలో శూన్యం కొట్టవచ్చినట్టు కనబడింది. ʹవాళ్లు ఎక్కడున్నారో మాకెట్లా తెలుస్తుంది? మా పిల్లలను తీసుకుపోయారు. మా ఇళ్లలోనుంచి ఎత్తుకుపోయారు. మా మగవాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడిగితే అక్కడ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అడగమంటున్నారు. ఎవరో ఒకరిని లిఫ్టు ఇమ్మని బతిమిలాడి, బామాలి ఏదో ఒకరకంగా ప్రధాన కార్యాలయానికి చేరితే, అక్కడ ʹరాళ్లు విసిరినవాళ్లుʹ అని బోర్డుల మీద జాబితాలు పెట్టారు. ఆ జాబితాల్లో ఉన్నవాళ్లు ఆగ్రా, జోద్ పూర్, అంబేడ్కర్, జజ్జర్ జైళ్లలో ఉన్నారుʹ అన్నారొకరు. ʹఅక్కా, మమ్మల్ని తొక్కేశారు. బతిమిలాడో, అప్పుచేసో, మాలో కొద్ది మంది అన్ని వందల మైళ్లు ప్రయాణం చేసి వెళ్లినా, మాకు ఎంతమాత్రం తెలియని ఆ నగరాల్లో మేమంటే పడని జైలు గార్డులు మమ్మల్ని తోసేస్తారు. అంతేʹ అన్నాడు పక్కన నిలబడిన వ్యక్తి.

తాము ఎల్లప్పుడూ కశ్మీర్ లో సురక్షితంగా ఉన్నామని గురుద్వారాల్లో కలిసిన స్త్రీలు అన్నారు. ʹమిగిలిన భారతదేశంలో విపరీతంగా మహిళల మీద అత్యాచారాల వార్తలు వస్తుండగా, అలాంటివి కశ్మీర్ లో మేమెప్పుడూ వినలేదుʹ అన్నారు వాళ్లు. సైనికులు తమను వేధిస్తున్నారని, చివరికి తమ ముఖం మీది ముసుగును తొలగించి చూపమని ఒత్తిడి చేస్తున్నారని కొందరు యువతులు అన్నారు.

ʹయువకులు, ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న పిల్లలు కనబడ్డారంటే సైనికులు వారి మీద విరుచుకుపడతారు. అసలు వాళ్లను చూస్తేనే సైనికులకు ద్వేషం పొంగుకొస్తుంది. తమ పిల్లలను కాపాడడానికి తండ్రులు వెళ్లగానే వాళ్లనుంచి డబ్బులు లాగడం మొదలుపెడతారు. ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల నుంచి అరవై వేలు వసూలు చేస్తారు.ʹ కశ్మీరీ యువత పట్ల సైనికుల ద్వేషం ఎంత సుప్రసిద్ధమైనదంటే, ఇంటి తలుపు తట్టిన చప్పుడు వినబడగానే, ఇంట్లోని వృద్ధుడిని మాత్రమే తలుపు తీయడానికి పంపుతారు. ʹవృద్ధుడిని, పెద్దమనిషిని చూస్తే వాళ్లు వదిలేస్తారని ఆశిస్తాం, వదిలేయాలని ప్రార్థిస్తాం. కాని ఎదురుగా ఉన్నది వృద్ధుడైనా, యువకుడైనా, చివరికి చిన్నపిల్లవాడైనా సరే చెంపదెబ్బలు, ముఖం మీద పిడిగుద్దులు తప్పవు. అయినా, అక్కా, అసలు మా తలుపుల గొళ్లాలు ఎంత వదులుగా పెడతామంటే సైనికులు ఒక్క తన్ను తన్నగానే తలుపులు ఊడిపోతాయి!ʹ ఈ మామూలు మాటల్లో ఎంత వ్యంగ్యం, విషాదం వ్యక్తమవుతున్నాయి!

పద్నాలుగు, పదిహేనేళ్ల పిల్లలను కూడ తీసుకుపోతున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు. కొందరినైతే 45 రోజులుగా నిర్బంధంలోనే ఉంచుకున్నారు. వారికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకుపోయారు. కుటుంబాలకు కనీస సమాచారం కూడ లేదు. పాత ఎఫ్ ఐ ఆర్ లు తవ్వి తీస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కుపోతూ, సైన్యం క్యాంపుకు వచ్చి తీసుకొమ్మంటున్నారు. సైనికుల గురించి తెలిసినవాళ్లెవరూ, అది ఎంత ఖరీదైన ఫోన్ అయినా సరే, తెచ్చుకోవడానికి క్యాంపుకు వెళ్లలేదు. తన 22 ఏళ్ల కొడుకును తీసుకుపోవడానికి సైనికులు ఎలా వచ్చారో ఒక మహిళ చెప్పింది. ఆ సమయానికి ఆ అబ్బాయి చెయ్యి విరిగి కట్టుతో ఉన్నాడు. అందుకని పద్నాలుగేళ్ల తమ్ముడిని తీసుకువెళ్లారు. మరొక గ్రామంలో ఇద్దరు పురుషులను తీసుకువెళ్లి ఎట్లా విపరీతంగా కొట్టారో విన్నాం. కొట్టడానికి కారణమేమీ లేదు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై రోజుల తర్వాత వెనక్కి వచ్చారు గాని శరీరమూ మనసూ పచ్చి పుండు అయిపోయి ఉంది. మరొకరు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఈ నిర్బంధకాలంలో మొత్తం 13,000 మంది మగ పిల్లలను తీసుకుపోయారుని తెలుస్తున్నది. చివరికి ఇంట్లో ఉన్న తిండి దినుసులను కూడ సైనికులు వదలలేదు. అర్ధరాత్రి, అపరాత్రి ఇళ్లమీద జరిగే దాడుల్లో, సోదాల్లో సైనికులు ఇళ్లలో ప్రవేశించి, కుటుంబాన్ని బైటికి వెళ్లగొడతారు. ʹఎప్పుడెలా ఉంటుందో అని మేం బియ్యం, పప్పులు, నూనె కాస్త ఎక్కువగానే నిలువ ఉంచుకుంటాం. ఆ దినుసుల డబ్బాల్లో కిరసనాయిలు గుమ్మరించారు. కొన్నిచోట్ల బొగ్గుపొడి కలిపారు.ʹ

ʹఇంకో బిడ్డను కందాం. మన ఫైజ్ ను వాళ్లు చంపేస్తే కనీసం మనకు మరొక బిడ్డ అయినా ఉంటాడుʹ అని అనంతనాగ్ లో తెహ్మీనా తన భర్తతో అంది. భర్త అబ్దుల్ హమీద్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ మాటలు వింటుంటేనే ఆయనకు తన చేతుల్లో తన చిన్నారి కొడుకు మృతదేహం ఉన్నట్టనిపించింది. ʹఆ మాట నా చెవిన పడగానే నా హృదయం బద్దలయిందిʹ అన్నాడాయన.

కర్నాలో ముప్పై ఏళ్ల వయసున్న ఒక న్యాయవాది అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతదేహంగా మిగిలాడు. ఆయన అంతకు ముందు తీవ్రవిచారంలో ఉన్నట్టు కనిపించాడని చూసినవాళ్లన్నారు. స్థానిక న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఒక సంతాప ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన విడుదల కాగానే ఆ కార్యదర్శిని అరెస్టు చేశారు. ఎందుకు?

మేమొక జమ్ము కశ్మీర్ పోలీసును కూడ కలిశాం. వారి దగ్గరి నుంచి తుపాకులు తీసేసుకుని లాఠీలు ఇచ్చారు. ʹతుపాకి వెనక్కి తీసుకున్నారంటే, మీకేమనిపిస్తున్నది?ʹ అని అడిగాం. ʹదాంట్లో మంచీ ఉంది, చెడూ ఉందిʹ అన్నాడాయన. ʹఎందుకు?ʹ ʹవాటిని ఎప్పుడు ఎవరు ఎత్తుకుపోతారో అని భయపడుతూ ఉండేవాళ్లం, అందువల్ల అది లేకపోవడమే మంచిది. కాకపోతే ఇప్పుడు కాల్పులు జరిగితే మమ్మల్ని మేం రక్షించుకోవడానికి కూడ అవకాశం లేదు. అది చెడ్డదిʹ అన్నాడాయన.

ʹభారత ప్రభుత్వం మమ్మల్ని పాలస్తీనా లాగ మార్చదలచుకుంది. మేం, కశ్మీరీలం దాన్ని ఎదిరిస్తాంʹ అన్నది ఒక మహిళా సెక్యూరిటీ గార్డ్. ʹమాకు స్వేచ్ఛ కావాలి. మాకు భారత దేశమూ వద్దు, పాకిస్తానూ వద్దు. మా స్వేచ్ఛ కోసం మేం ఎంత మూల్యమైనా చెల్లిస్తాం. ఇది కశ్మీరీ రక్తం. ఎంత త్యాగమైనా చేస్తుందిʹ అన్నాడు ఒక యువ నిపుణుడు.

మేం ఎక్కడికి వెళ్లినా రెండు భావోద్వేగాలు కొట్టవచ్చినట్టు కనిపించాయి.

మొదటిది, ఆజాదీ కోసం, స్వేచ్చ కోసం తపన. వాళ్లకు ఇటు భారతదేశమూ వద్దు, అటు పాకిస్తానూ వద్దు. డెబ్బై సంవత్సరాల పాటు వాళ్లు అనుభవించిన అవమానాలూ చిత్రహింసలూ ఇక వెనక్కి తిరగలేని దశకు చేరాయి. అధికరణం 370 రద్దుతో భారతదేశంతో వారికి ఉన్న చిట్టచివరి బంధం తెగిపోయిందని కొందరన్నారు. ఇంతకాలమూ ప్రతి సందర్భంలోనూ భారత రాజ్యాన్ని సమర్థించినవాళ్లను కూడ ఇప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది. ʹఅంటే, మేం సాధారణ కశ్మీరీలం, వాళ్ల కంటికి ఆనుతామా?ʹ అంటున్నారు వాళ్లు. వాళ్ల నాయకులందరినీ ప్రజాభద్రతా చట్టం కింద అరెస్టు చేయడమో, గృహ నిర్బంధంలో పెట్టడమో జరిగింది గనుక, సాధారణ ప్రజలే తమకు తాము నాయకులయ్యారు. వాళ్లు అనుభవిస్తున్న వేదన చెప్పరానిది, వాళ్ల ఓపిక కూడ అంతే.

ఇక రెండోది, తల్లుల విషాద విలాపాలు. ఆ తల్లులు ఎందరో పిల్లల మృతదేహాలను, చిత్రహింసల గాయాల మృతదేహాలను చూశారు. వారు ఈ అమాయకుల మీద జరుగుతున్న పాశవిక దాడి తక్షణమే ఆగిపోవాలని కోరుతున్నారు. తుపాకుల కింద, జాక్ బూట్ల పదఘట్టనల కింద తమ పిల్లల జీవితాలు అంతరించిపోగూడదని వాళ్లు కోరుతున్నారు.

కశ్మీర్ లో మా పర్యటన అనుభవాలను, పరిశీలనలను నివేదిస్తున్న క్రమంలో, రెండు నిర్ధారణలతో మేమీ నివేదికను ముగించదలచాం:

ఒకటి, గత యాబై రోజుల్లో భారత ప్రభుత్వమూ సైన్యమూ సాగించిన పాశవికత్వం ముందు, నిర్బంధకాండ ముందు కశ్మీరీ ప్రజలు ఆశ్చర్యకరమైన పద్ధతిలో తమ ఓరిమిని ప్రదర్శించారు. వారు మాకు చెప్పిన సంఘటనలు వింటుంటే మా ఒళ్లు జలదరించింది. ఈ నివేదిక వారు చెప్పినవాటిలో కొన్నిటి సారాంశం మాత్రమే. కశ్మీరీ ప్రజల దైర్యసాహసాలకు, దృఢ చిత్తానికి మేం మా అభినందనలు తెలియజేస్తున్నాం.

రెండవది, అక్కడి పరిస్థితి ఎంతమాత్రం ప్రశాంతంగా లేదని మేం మరొకసారి నొక్కి చెప్పదలచాం. పరిస్థితి క్రమంగా ప్రశాంతత దిశగా సాగుతున్నదని ప్రకటిస్తున్న వాళ్లందరూ వాస్తవాల వక్రీకరణతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.

కవులు మానవత్వం గురించి, మొత్తంగా మానవజాతి గురించి మాట్లాడతారు. మేం ఈ నివేదికను కశ్మీరీ కవి రంజూర్ కవితా పాదాలతో ప్రారంభించాం. హిందీ కవి దుష్యంత్ కవితా పాదాలతో ముగించదలచాం. ఈ రెండు కవితా చరణాలూ కశ్మీర్ లో ఏం జరగవలసి ఉన్నదో సూచిస్తున్నాయి.

కొండలా ఘనీభవించిన ఈ వేదన కరగవలసిందే
ఈ హిమాలయాల నుంచి ఏదో ఒక గంగ ప్రవహించవలసిందే

మా డిమాండ్లు:

1. ప్రశాంత పరిస్థితి నెలకొనేందుకు: తక్షణమే సైన్యాన్ని, అర్ధసైనిక బలగాలను ఉపసంహరించాలి.
2. ప్రజలలో విశ్వాసం నెలకొనేందుకు: తక్షణమే అన్ని కేసులనూ ఎఫ్ ఐ ఆర్ లనూ రద్దు చేయాలి. అధికరణం 370 రద్దు నాటినుంచీ నిర్బంధంలో, జైలులో ఉంచిన అందరినీ, ప్రత్యేకించి యువకులను తక్షణమే విడుదల చేయాలి.
3. న్యాయాన్ని నెలకొల్పేందుకు: సైన్యమూ, ఇతర భద్రతా బలగాలూ అమలు చేసిన విస్తృతమైన హింస మీద, చితహింసల మీద విచారణ జరిపించాలి.
4. నష్టపరిహారం: రవాణా సౌకర్యాలు, సమాచార సంబంధాలు లేనందువల్ల తమ సన్నిహితుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలి.

అదనంగా:
• కశ్మీర్ లో ఇంటర్నెట్, మొబైల్ నెట్ వర్క్స్ తో సహా అన్ని సమాచార సంబంధాల వ్యవస్థలనూ తక్షణమే పునరుద్ధరించాలి.
• అధికరణం 370, 35ఎ లను పునరుద్ధరించాలి.
• జమ్ము కశ్మీర్ రాజకీయ భవిష్యత్తు గురించి తీసుకోనున్న నిర్ణయాలన్నిటినీ జమ్ము కశ్మీర్ ప్రజలతో సంభాషణా ప్రక్రియ ద్వారా మాత్రమే తీసుకోవాలి.
• జమ్ము కశ్మీర్ పౌర ప్రాంతాలన్నిటి నుంచీ సైనికాధికారులను ఉపసంహరించాలి.
• సైన్యం జరిపిన అత్యాచారాలన్నిటిమీద విచారణ జరపడానికి నిర్ణీత వ్యవధి విచారణ సంఘాన్ని నియమించాలి.

( మేం కలిసిన వ్యక్తుల భద్రత దృష్ట్యా వారి పేర్లను మార్చడం జరిగింది. ఆ కారణం వల్లనే మేం పర్యటించిన గ్రామాల పేర్లు కూడ రాయడం లేదు.)

Keywords : kashmir, army, article 370, 35a, women, children, report
(2019-10-13 01:44:51)No. of visitors : 682

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

Search Engine

మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు !
పార్టీ స్వర్ణోత్సవాలను పల్లెపల్లెనా జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు
more..


కశ్మీర్