ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది


ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది

ఈ

విరసం 50 మహా సభల ఆహ్వాన సంఘం సమావేశం .. సెప్టెంబర్‌లో హైదరాబాదులో జరిగింది. అప్పుడు యాభై వసంతాలు అనే మాట విని ఓ మిత్రుడు ʹవిరసంలాంటి సంస్థకు వసంతాలేనా? శిశిరాలు కూడా ఉన్నాయి కదా? అన్నాడు. ఇది చాలా లోతైన మాట. విరసం చరిత్రలోకి వెళ్లి అన్నమాట. ప్రజా చరిత్ర నిర్మాణంలో విరసం పాత్రను గుర్తించి చేసిన వ్యాఖ్య.

అప్పుడు నేను ʹనిజమే .. విరసం యాభై వసంతాలేకాదు, యాభై శిశిరాలనూ అధిగమించిన సంస్థ. దానిలోని నిత్య ఉత్తేజం అదేʹ అన్నాను. అక్కడితో ఆగకుండా బహుశా శిశిరాలు దాడి చేసినా అంతిమంగా వసంతాల దిశగానే విప్లవోద్యమ చారిత్రక గమనం ఉంటుందʹని కూడా అన్నాను.

వారం తిరక్కుండానే విరసంపై గద్వాల కుట్ర కేసు నమోదైంది. కార్యవర్గ సభ్యుడు, స్టూడెంట్‌ మార్చ్‌ పత్రిక సంపాదకుడు కా. జగన్‌ మీద పోలీసులు గద్వాల్లో ఒక దుర్మార్గమైన కేసు పెట్టారు. ఐపిసి 120(బి) నేరపూరిత కుట్ర, 8(1)(2) దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం, ఉపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)18బి తీవ్రవాద చర్యకు ప్రోత్సహించడం, సహకరించడం, సెక్షన్‌ 20 నిషేధిత తీవ్రవాద సంస్థల్లో సభ్యులుగా ఉండటం తదితర ఆరోపణలు చేశారు. ఈ నెల4న తెలంగాణ విద్యార్థి వేదిక గద్వాల జిల్లా కన్వీనర్‌ నాగరాజును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆ రోజు ఆయన ఒక ధర్నాలో పాల్గొని వస్తుండగా పట్టుకున్నారు. 7వ తేదీ మధ్యాహ్నం ఆ సంస్థ రాష్ట్ర నాయకుడు బలరాంను మహబూబ్‌నగర్‌లో అరెస్టు చేశారు. వీళ్ల ఎఫ్‌ఐఆర్‌లో టీవీటీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, చైతన్యమహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శిల్ప, విరసం నాయకుడు జగన్‌ల పేర్లు చేర్చారు.

10వ తేదీ ఉదయం హైదరాబాదు నడి రోడ్డుమీద జగన్ను కిడ్నాప్‌లాంటి అరెస్టు చేశారు. సాయంకాలం మూడు గంటల దాకా అదుపులో ఉంచుకున్నారు. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టి ఇంటికి తీసుకపోయారు. ఇల్లంతా సోదా చేశారు. కొన్ని పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. మర్నాడు మధ్యాహ్నం గద్వాల కోర్డులో హాజరు పరిచారు.

నిన్నటి భీమా కొరేగావ్‌ కుట్ర కేసులో విరసం వ్యవస్థాపక సభ్యుడు కా. వరవరరావుతోపాటు మిగతా వాళ్ల బెయిల్‌ పిటీషన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఈలోగా గద్వాల కుట్ర కేసు.

జగన్‌ విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాడు. విద్యార్థి సంఘాల జేఏసీలో పని చేశాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, విద్యా రంగం ఆయన ప్రధాన కార్యరంగాలు. అయితే తన దృక్పథం వల్ల అక్కడికే పరిమితం కాలేదు. అర్థశాస్త్ర విద్యార్థిగా ఆయనకు సహజంగానే ఈ దృక్పథం పట్టుబడింది. సమాజంలో ఏ సమస్యా విడిగా ఉండదని, అన్నిటి మధ్య సంబంధం ఉంటుందని, అన్నిటినీ ఏక కాలంలో కదిలించే మౌలిక పోరాటాలు జరగాల్సిందేనని అవగాహన ఉన్నది. అందు వల్ల సహజంగానే విప్లవ రచయితల సంఘంలోకి వచ్చాడు. విద్యార్థి ఉద్యమ కాలంలోనే కార్యకర్తగానే కాక, పత్రికా నిర్వహణ కొనసాగించాడు. సుదీర్ఘకాలంగా ఆయన ఈ పనిలో ఉన్నాడు. అందువల్ల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాక కూడా విద్యార్థి ఉద్యమానికి దారి చూపేలా స్టూడెంట్‌ మార్చ్‌ పత్రికను నిర్వహిస్తున్నాడు.

ఏలినవారికి ఇది కంటగింపు అయింది. తుపాకులు, పోలీసులు, సైన్యం, జైళ్లు ఉన్నప్పటికీ పాలకులకు భావాలుంటే భయం. భావ వినిమయం వల్ల తమకు వచ్చే విపత్తు తెలుసు. విద్యార్థి సంఘమైనా, రచయితల సంఘమైనా, పత్రికలైనా, పుస్తకాలైనా అంతిమ సారంలో భావాలను ప్రచారం చేస్తాయి. సమాజాన్ని మార్చాల్సిన విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు భావాలను పరిచయం చేస్తాయి. ఏవి మంచి భావాలో తేల్చుకునే అవకాశం కల్పిస్తాయి.

అయితే విద్యార్థులకు కొత్త భావాలు పరిచయం అయితే వాళ్లు ఎలాంటి ప్రజ్వలన శక్తిగా మారుతారో ప్రభుత్వాలకు తెలుసు. అందుకే గద్వాల కుట్ర కేసు పెట్టారు. ఈ కేసు పెట్టడం వెనుక అసలైన కుట్ర ఉంది. భీమా కొరేగావ్‌ కేసులో దశాబ్దాల ప్రజా జీవితం, పటిష్టమైన నైతికత, అపారమైన అధ్యయనం, విస్తారమైన ప్రజా శ్రేణుల మీద ప్రభావం ఉన్న మేధావులను అరెస్టు చేశారు. అంటే పై నుంచి వచ్చారు. గద్వాల కుట్ర కేసు పూర్తిగా కింది నుంచి వచ్చారు. ఇవ్వాల్టి, రేపటి ప్రజా ఆకాంక్షలకు నాయకత్వం వహించగల యువతరాన్ని లక్ష్యం చేసుకున్నారు. అందునా విద్యార్థి ఉద్యమాన్ని లక్ష్యం చేసుకున్నారు. విద్యార్థులతో ఉండే సంబంధాలని ఛేదించే ఉద్దేశంతో బయల్దేరారు. తెలంగాణ సమాజంలో దశాబ్దాల నిర్బంధం, రక్తపాతం తర్వాత కూడా విద్యార్థులు ప్రజా జీవితంలో బలంగా నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తొలి దశ నుంచి, విప్లవ విద్యార్థి ఉద్యమ వెల్లువల కాలం నుంచి, మలి దశ తెలంగాణ ఉద్యమ కాలం దాకా ఈ చరిత్ర నడిచింది. అయితే అక్కడికి ఆగిపోలేదు. పోదు కూడా. అనేక పీడిత అస్తిత్వ చైతన్యంతో ఇంకా విస్తరించింది. విప్లవోద్యమ అవగాహనతో బలోపేతం అవుతోంది.

అంటే సమాజానికి కొత్త నాయకత్వం అంది వస్తోంది. వాళ్లను లేకుండా చేయాలి. విద్యార్థులకు మిగతా ఉద్యమాలతో సంబంధం లేకుండా చేయాలి. అసలు విద్యార్థి ఉద్యమాన్నే లేకుండా చేయాలి. ఈ కుట్ర గద్వాల కుట్ర కేసులో ఉంది. ఇది కేవలం తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు నాగరాజు, బలరాం అరెస్టులతో ఆగలేదు. జగన్‌ అరెస్టు దాకా వచ్చింది. టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి మీద, విద్యార్థి ఉద్యమం నుంచే వచ్చి మహిళా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న శిల్ప మీద కేసులు పెట్టారు. ఇంకా అనేక మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఇదంతా ఒక ఎత్తు. ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కత ఇంకోటి ఉంది.

ఈ అరెస్టుల గురించి 11వ తేదీన హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్‌ ఒక విలేఖరుల సమావేశం పెట్టాడు. గద్వాల కుట్ర కేసు విషయంలో పోలీసు కమిషనర్‌ మరిన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. ఆ కేసులో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వాళ్లందరూ అనేక నేరాలకు పాల్పడ్డారని జాబితా విప్పాడు. ముఖ్యంగా విద్యార్థులతో సంబంధం ఉండటమే ఒక నేరంగా ఆయన చూపదల్చుకున్నాడు. ఉదహరణకు విరసం కార్యవర్గ సభ్యుడు కా. కాశిం పదిహేనేళ్ల కింద విద్యార్థి జీవితం పూర్తయి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాడు. ఇప్పడు గద్వాల కేసు సందర్భంగా కమిషన్‌ ఆయన్ను టీవీవీగా ప్రకటించాడు. స్టూడెంట్‌ మార్చ్‌ పత్రికలో విరసం వాళ్లు హింసను ప్రేరేపిస్తూ రచనలు చేస్తుంటారని మరో వాదన చేశాడు. విరసం కార్యవర్గ సభ్యుడు క్రాంతి మీద మహారాష్ట్రలో కేసు ఉందని మరో ఆరోపణ చేశాడు. ఇలా అనేక మంది ప్రజాసంఘాల సభ్యులను నేరస్తులుగా చూపే ప్రయత్నం చేశాడు.

చివరికి టీవీవీ, విరసం, సీఎల్‌సీ, సీఎంఎస్‌, కెఎన్‌పీఎస్‌, ఏబీఎంఎస్‌ తదితర 23 ప్రజాసంఘాలు నిషేధిత సంస్థలని ప్రకటించాడు. మామూలుగా ప్రతి ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఐ మావోయిస్టు, దాని అనుబంధ సంఘాల మీద నిషేధాన్ని పొడిగిస్తుంటాయి. ఈసారి వాటితోపాటు ఈ 23 సంఘాల మీద నిషేధం పెట్టామని ఆయన చెప్పాడు. ఇంతక ముందు ప్రజాసంఘాల సభ్యులను అరెస్టు చేసినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులనో, ఆ పార్టీతో సంబంధాల్లో ఉన్నారనో రాసేవారు. ఇప్పుడు నిషేధిత టీవీవీ, విరసం తదితర సంఘాల సభ్యులు అని రాస్తున్నారు.

ఇంతకూ ఈ సంఘాలన్నిటినీ నిషేధించారా? ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం. భావ ప్రకటనా స్వేచ్ఛకు, సంఘటితం అయ్యే హక్కుకు వ్యతిరేకం. అందుకే నిషేధం అప్రజాస్వామికం. నిజానికి వేర్వేరు సందర్భాల్లో న్యాయ స్థానాలు చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీలో సభ్యులుగా ఉండటం కూడా నేరం కాదు.. అని స్పష్టం చేశాయి. ఇది సంఘాల, పార్టీల నిషేధాన్ని, ఆ పేరుతో వాటిలో ఉన్నవాళ్లను నిర్బంధించడాన్ని, లేదా నిర్బంధంలోకి తీసుకోవాలనుకన్న వారిని ఆ పార్టీల సభ్యులని, సానుభూతిపరులని ఆరోపించడాన్ని న్యాయస్థానాల తీర్పులు సవాల్‌ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వాలు తమ ప్రత్యర్థి రాజకీయాలను, వాటి నిర్మాణాలను నిషేధించడం, వ్యక్తులపై నిర్బధం తేవడం మానుకోలేదు.

ఇదంతా నిన్నటి వ్యవహారం. తాజా పరిణామం అంతకంటే చాలా ప్రమాదకరం. మామూలుగా నిషేధాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. ఇది పోలీసులకు సంబంధించింది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర స్థాయి సంస్థలు ఇరవై మూడింటిని నిషేధించినట్లు ఒక నగర కమిషన్‌ చెప్పాడు. ఇది ఆకతాయి మాట కాదు. నోరుజారడం కాదు. గత కొన్నేళ్లుగా వివిధ ప్రజా సంఘాల కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించేటప్పుడు మీది నిషేధిత సంఘం అంటున్నారు. పత్రికల్లో అలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్దేశం ప్రకారమే ఈ విషయాన్ని పోలీసు అధికారులు బైటికి తీసుకొచ్చారు.

ఆగస్టులో నిషేధం పెడితే ఇంత దాకా ఎందుకు చెప్పలేదు? నిషేధం ఎంత అప్రజాస్వామిక వ్యవహారమైనా దానికి ప్రభుత్వం కొన్ని పద్ధతులు పాటించాలి. అధికారికంగా నిషేధ ఉత్తర్వులను విడుదల చేయాలి. వాటిని గజిట్‌లో నమోదు చేయాలి. అన్ని పత్రికల్లో అచ్చు వేయించాలి. ఆ సంస్థల బాధ్యులకు నోటీసులు ఇవ్వాలి. తన ఆరోపణలు ఏమిటో ప్రకటించాలి. వాటి విచారణకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. అక్కడ వాదన వినిపించుకొనే స్వేచ్ఛను సదరు సంఘాలకు, పార్టీలకు ఇవ్వాలి. న్యాయ ప్రక్రియలో ప్రభుత్వ ఆరోపణలు నెగ్గితేనే నిషేధం అమలవుతుంది.

ఇదేమీ లేకుండా పోలీసులు ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి ఫలానా సంఘాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.. కాబట్టి నిషేధిస్తున్నామని అనడానికి లేదు. ఈ అధికారం పోలీసులుకు అసలు లేదు. 2005లో విప్లవ రచయితల సంఘాన్ని ప్రభుత్వం నిషేధించినప్పుడు పైన చెప్పిన క్రమం అంతా జరిగింది. చివరికి న్యాయమూర్తుల బృందం ముందు ప్రభుత్వం తన ఆరోపణలు నిరూపించుకోలేకపోయింది. గత యాభై ఏళ్లుగా విప్లవ రచయితల మీద, ప్రజాసంఘాల మీద కొన్ని వందల కేసులు పెట్టి న్యాయస్థానాల్లో ఎలా భంగపాటుకు గురైందో సరిగ్గా అదే విరసం నిషేధం విషయంలో కూడా జరిగింది.

గత అనుభవం తర్వాత ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నట్లుంది. ఇది మరింత దుర్మార్గం, అప్రజాస్వామికం. ఇప్పటికి నాలుగు రోజులుగా ప్రజాసంఘాలు దీన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నా ప్రభుత్వం ఏ వివరణ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతోంది.

ఇలా ప్రజాసంఘాల ఆచరణను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా నిషేధాస్త్రాన్ని తెలంగాణ ప్రభుత్వం బైటికి తీసింది. ప్రజాసంఘాలకు అక్రమ అరెస్టులు, అప్రకటిత నిషేధాలు కొత్తకాదు. ఈ తాజా కుట్ర కేసును, నిషేధ ప్రచారాన్ని తిప్పికొడతాయి.
- పాణి

Keywords : virasam, police, maoists
(2019-11-12 18:20:01)No. of visitors : 429

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
more..


ఈ