భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు


భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు

భగత్

భగత్ సింగ్‌కు సంబంధించిన ప్రత్యేక వస్తువు ఒకటుంది. అది తెరమీద, కార్లు, గోడలపై ఉన్న ఆయన చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. అది దాదాపు 85 ఏండ్ల తర్వాత దొరికిందట. దాని గురించే వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ తన ఫేస్‌బుక్ వాల్‌పై రాసుకొచ్చారు. అది యధాతథంగా..

---------------------------------------------

నవంబర్ 2-3 తేదీల్లో ఆర్మూరులో రైటర్స్ మీట్ నిర్వహించిన కథా ఉత్సవంలో కలిసిన జుపిందర్ జిత్ సింగ్ అమరవీరుడు భగత్ సింగ్ గురించి అనేక జ్ఞాపకాలకు తెర తీశాడు. ఈసారి కథా ఉత్సవానికి ʹడిస్కవరీ ఆఫ్ భగత్ సింగ్స్ పిస్టల్ అండ్ హిజ్ అహింసʹ పుస్తక రచయిత, జర్నలిస్టు, కథా రచయిత జుపిందర్ జిత్ సింగ్ వస్తున్నాడని ఖదీర్ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టినప్పుడే ఆసక్తి కలిగి, ఆయన ఫేస్ బుక్ మీద ఉన్నాడని చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపాను. చిరకాల మిత్రుడు, పంజాబీ ప్రజా ఉద్యమాల నాయకుడు, ఇటీవలి కాలంలో రైతాంగ సమస్యలపై పనిచేస్తున్న దర్శన్ పాల్ కూడా ఉమ్మడి స్నేహితులలో ఉండడం చూసి జుపిందర్ మీద ఆసక్తి ఇంకా పెరిగింది. నవంబర్ 1 సాయంత్రం ఆర్మూరుకు బయల్దేరేటప్పుడు ఆయన మర్నాడు సాయంత్రానికి వస్తాడని ఖదీర్ చెప్పాడు.

ఆ మర్నాడు సాయంత్రం ఆర్మూరులో అరగంట సేపు ఆపకుండా భోరున వాన. కరెంటు పోయింది. ఆ చీకట్లోనే వెలుగుల రవ్వల జడిగా జహా ఆరా గారి ఉపన్యాసం. హిందుత్వ ఫాసిజం కేవలం ముస్లిం ప్రజానీకానికి మాత్రమే కాక మొత్తంగా భారత సమాజానికి ఎంత హానికరమో, ప్రగతిశీలంగా కనబడేవారిలో కూడ హిందుత్వ ఎలా ప్రచ్ఛన్నంగా ఉంటుందో ఆమె వాగ్ధారతో మరొకసారి మరింత బలంగా ఆర్ద్రంగా అర్థమవుతూ ఆలోచిస్తూ ఉండగానే కరెంటు వచ్చి మరొక సెషన్ జరుగుతుండగా జుపిందర్ ప్రవేశించాడు. ప్రగతిశీల రచయితలందరూ నాస్తికులూ హేతువాదులూ కావాలని ఆశించడం అత్యాశేనేమో గాని, ʹనేనెందుకు నాస్తికుణ్నయానుʹ అని అద్భుతమైన రచన చేసిన భగత్ సింగ్ ను ప్రేరణగా తీసుకున్న వ్యక్తులు ఆస్తికులుగా ఉన్నారంటే ఆశ్చర్యపోతాను. అలాగే నుదుట కుంకుమ బొట్టుతో ప్రవేశించిన జుపిందర్ ను చూసి కాస్త దిగులు పడ్డాను. దిగగానే అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్లాలన్నాడని, అక్కడ బొట్టు పెట్టుకున్నాడని తెలిసింది. ఒకవైపేమో అంత గొప్ప విషయం మీద పుస్తకం రాసిన అభినివేశం, మరొకవైపు ఈ హిందుత్వ దుర్మార్గ వేళ బహిరంగ హిందుత్వ చిహ్న ప్రదర్శన. ఏమిటిది అని విచారమే ఆ రాత్రంతా.

మర్నాడు హైదరాబాదులో జరూరు పని వల్ల ఉదయమే బయల్దేరుతానని అంటే ఖదీర్ మొదటి సెషన్ లోనే జుపిందర్ తో మాట్లాడిస్తానని, దానికి అధ్యక్షత వహించి వెళ్లిపొమ్మని అన్నాడు. మర్నాడు ఉదయమే ఆ సెషన్ కు అధ్యక్షత వహించే ముందు, చూస్తారా అని సురేష్ డిస్కవరీ ఆఫ్ భగత్ సింగ్స్ పిస్టల్ నా చేతిలో పెట్టాడు. భగత్ సింగ్ ఆ ఆయుధాన్ని ఒకే ఒక్కసారి పోలీసు అధికారి సాండర్స్ ను చంపడానికి వాడడం మినహా, మొత్తంగా అహింసావాది అనే వైఖరి తీసుకున్నాడని పుస్తకం శీర్షిక, ముందుమాట చెపుతున్నాయి. భగత్ సింగ్ వ్యక్తిత్వం గురించి ఈ కోణం కాస్త ఆసక్తి కలిగించి అక్కడక్కడా తిరగేస్తూ పుస్తకంలో ఏమున్నదో దాదాపుగా గ్రహించాను.

సైమన్ కమిషన్ ను బహిష్కరిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రదర్శనల్లో భాగంగా లాహోర్ లో జరిగిన ఊరేగింపు మీద అక్కడి పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ ఆదేశాల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న లాలా లాజపత్ రాయ్ మీద లాఠీలు విరగ్గొట్టారు. అత్యంత గౌరవనీయుడైన పుర ప్రముఖుడు, జాతీయవాది లాజపత్ రాయ్ ఆ దెబ్బలతో రెండువారాల తర్వాత మరణించాడు. అందుకు కారణమైన స్కాట్ కు శిక్ష విధించి దేశంలో బ్రిటిష్ పాలకులకు పాఠం చెప్పాలని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆ పనిని చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ కు అప్పజెప్పి, ఒక అమెరికన్ తయారీ కోల్ట్ పాయింట్ 32 పిస్టల్ ఇచ్చాడు. స్కాట్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బైటికి వస్తుండగా కాల్చి చంపాలని ప్రణాళిక వేసుకున్నారు. బైటికి రాగానే అక్కడ నిలబడిన జయగోపాల్ (?) సైగ చేయాలి. ఆ సైగ చూసి రాజ్ గురు కాల్పులు జరపాలి. అయినా తప్పించుకుంటే భగత్ సింగ్ కాల్పులు జరపాలి. పని అయిపోగానే ముగ్గురూ తప్పుకోవాలి. ఇదీ ప్రణాళిక. లాజ్ పత్ రాయ్ మరణించిన నలబై రోజులకు, 1928 డిసెంబర్ 17 సాయంత్రం వేళ పోలీసు కార్యాలయం నుంచి ఒక తెల్ల పోలీసు అధికారి మోటర్ సైకిల్ మీద బైటికి వస్తుంటే, అతనే స్కాట్ అనుకుని సుఖదేవ్ సైగ చేశాడు. వెంటనే భగత్ సింగ్ తన చేతిలో పిస్టల్ కు పని చెప్పాడు. మోటార్ సైకిల్ మీంచి జాన్ సాండర్స్ కుప్ప కూలిపోయాడు. మర్నాడు హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తరఫున తామే ఈ పని చేశామని పోస్టర్లు వేశారు. కాని పోలీసులు మాత్రం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను పట్టుకోలేకపోయారు.

తర్వాత నాలుగు నెలలకు, 1929 ఏప్రిల్ 8న, ఢిల్లీలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ప్రస్తుత పార్లమెంట్) లో బాంబులు విసిరి, తప్పించుకునే అవకాశం ఉండి కూడా భగత్ సింగ్ పోలీసుల చేత చిక్కాడు. సాండర్స్ హత్య కేసు, అది ఒక భాగంగా తయారు చేసిన లాహోర్ కుట్రకేసు, విచారణ జరిగి, 1930 అక్టోబర్ 7న ముగ్గురికీ ఉరిశిక్ష విధించారు. భగత్ సింగ్ వాడిన పిస్టల్ అలా కోర్టు ముందుకు ఎగ్జిబిట్ గా వచ్చింది. తీర్పు తర్వాత 1931లో ఆ పిస్టల్ ను పోలీసు మాల్ ఖానా లో ఉంచమని కోర్టు పోలీసులకు అప్పగించింది. అది అక్కడి నుంచి న్యాయమూర్తి ఆదేశాల మేరకే జలంధర్ జిల్లాలోని ఫిల్లార్ పోలీసు అకాడమీ శిక్షణా కేంద్రానికి చేరింది. అది అక్కడికి చేరిందనేది కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ న్యాయస్థానపు కవిలెకట్టల్లో ఎవరికీ దొరకని సమాచారంగా మిగిలిపోయింది. 1965లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసి, దాని ప్రధాన ఆయుధ శిక్షణా కేంద్రం ఇండోర్ లో స్థాపించాక, ఫిల్లార్ నుంచి ఇండోర్ కు 1969లో బదిలీ చేసిన ఆయుధాలలో ఈ పిస్టల్ కూడా చేరింది. ఈ ప్రయాణమంతటిలోనూ అది 168896 అనే గుర్తింపు సంఖ్య గల ఆయుధంగా మాత్రమే గుర్తింపు పొందింది గాని అది భగత్ సింగ్ అరచేతిలో ఇమిడిన, ఆ ట్రిగ్గర్ మీద భగత్ సింగ్ మునివేలు ఆడిన పిస్టల్ అని ఎవరికీ తెలియదు. 1931 తర్వాత ఎవరికీ జాడ తెలియని ఈ పిస్టల్ ప్రయాణాన్నంతా వెతికి పట్టుకుని 2017లో జుపిందర్ ఇండోర్ లో ఆ పిస్టల్ ను కనిపెట్టాడు. తన అన్వేషణా అనుభవాన్నంతా అక్షరీకరించి ఈ పుస్తకం రాసి 2018లో ప్రచురించాడు.

సెషన్ ప్రారంభమయ్యే ముందు కొన్ని నిమిషాలు జుపిందర్ తో మాట్లాడాను. ఈ పుస్తకాన్ని భగత్ సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్ మోహన్ సింగ్ ఆవిష్కరించారని విని, నా పుస్తకం Understanding Maoists కూడా జగ్మోహన సింగే హైదరాబాదులో ఆవిష్కరించారని చెప్పాను. పుస్తకం చదివితే, మాట్లాడితే రాత్రి కలిగిన నొప్పి కాస్త తగ్గినట్టే అనిపించింది. తెలుగులో భగత్ సింగ్ మీద చాలా ప్రేమాభిమానాలు, ఆసక్తి ఉన్నాయని, ఈ పుస్తకం తెలుగులో వస్తే బాగుంటుందని, ఇప్పటికి ఎవరూ అడిగి ఉండకపోతే నేను చేస్తానని చెప్పాను. ఆయన సరేనన్నాడు. పుస్తకం ఎలాగూ తెలుగులో కొన్ని నెలల్లో మీ చేతుల్లో ఉంటుంది గాని ఈలోగా ఈ పుస్తకం ప్రేరేపించిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలి.
భగత్ సింగ్ పేరు ఎనిమిదో తరగతికి ముందే విని ఉన్నానేమో గాని అంత గుర్తు లేదు. ఎనిమిదో తరగతికి హనుమకొండ వస్తుండగానే, సృజన మార్చ-ఏప్రిల్ 1973 సంచిక ముఖచిత్రం భగత్ సింగ్. కొన్నాళ్లకే ʹవిప్లవమంటే...ʹ అనే భగత్ సింగ్ కోర్టు ఉపన్యాసానికి ముడార్ వేణు గారి అనువాదం కూడా సృజనలో వేశాం. అప్పటి నుంచీ ఈ దేశంలో కోట్లాది మందికి లాగానే నాకూ భగత్ సింగ్ ఆరాధ్యుడయ్యాడు. ఎమర్జెన్సీ అయిపోగానే, అంటే నేను ఇంటర్మీడియట్ లో ఉండగా, అప్పుడే కావలిలో కెవిఆర్ తదితరులు ప్రారంభించిన సంస్థ తరఫున భగత్ సింగ్ ʹనేనెందుకు నాస్తికుణ్నయ్యానుʹ చిన్న బుక్ లెట్ గా ప్రచురించారు. ఆ పుస్తకం అమ్ముతూ, చదువుతూ, కంఠోపాఠంగా ఉటంకిస్తూ ఆ రోజులు గడిచాయి. బహుశా ఆ తర్వాత రెండు మూడేళ్లకే జనసాహితి ప్రచురించిన భగత్ సింగ్ రచనల సంకలనం ʹనా నెత్తుటి కోనేటిలోʹ, ఆలూరి భుజంగరావు గారు అనువాదం చేసిన యశ్ పాల్ ʹసింహావలోకనంʹ మూడు భాగాలూ ప్రచురించారు. ఆ కాలమంతా భగత్ సింగ్ తో, ఆ వీరులతో సహజీవనమే.

అప్పటిదాకా మిత్రుల మధ్య, చిన్న గదుల్లో మాత్రమే మాట్లాడుతున్నవాణ్ణి, 1983 జనవరిలో ఆర్ ఎస్ యు సభల సందర్భంగా బహిరంగ సభల్లో మాట్లాడడం మొదలు పెట్టానని ఇదివరకు రాశాను. ఆ క్రమంలో 1983 మార్చ్ 23న గద్వాలలో తేరు మైదానంలో పటేల్ సుధాకర్ రెడ్డి, సాయి రెడ్డిల నిర్వహణలో భగత్ సింగ్ సంస్మరణ సభ. నేనక్కడ వక్తను. ఒక బహిరంగ సభా వేదిక మీదినుంచి, నాలుగైదు వేల మంది శ్రోతల ముందు భగత్ సింగ్ జీవితం గురించీ, స్ఫూర్తి గురించీ, ఇవాళ్టికీ ప్రాసంగికత గురించీ మాట్లాడాను. ఆ తర్వాత గడిచిన ముప్పై ఆరేళ్లలో భగత్ సింగ్ గురించి ఎన్నోచోట్ల ఎన్నోసార్లు మాట్లాడాను, రచనల్లో, ఉపన్యాసాల్లో ప్రస్తావించాను. ఇంగ్లిష్ లో వచ్చిన భగత్ సింగ్ రచనలన్నీ, భగత్ సింగ్ జీవిత చరిత్రల్లో అత్యధికం చదివాను. ఇరవై మూడేళ్లు నిండకుండానే ఎన్నెన్ని విషయాల మీద ఎంత స్పష్టతతో, ఎంత గాఢమైన వలసవాద వ్యతిరేక దృక్పథంతో ఆలోచించాడో చూసి ఆశ్చర్యపోతుంటాను. ప్రాణత్యాగం వల్ల మాత్రమే కాదు, ఆ త్యాగానికి ముందు చేసిన సాయుధ చర్య వల్ల మాత్రమే కాదు, విస్తారమైన, విస్పష్టమైన ఆలోచన వల్ల భగత్ సింగ్ భారతీయ యువతరానికి ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాడు.

నా ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కరణకు ఎవరిని పిలవాలని ఆలోచిస్తున్నప్పుడు భగత్ సింగ్ పోరాటానికీ, ఇవాళ సాగుతున్న పోరాటాలకూ వారధిగా ఉన్న భగత్ సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్ మోహన్ సింగ్ ను ఆహ్వానించాలని అనుకున్నాను. జగ్ మోహన్ హైదరాబాదు వచ్చి నా పుస్తకం ఆవిష్కరించడం అద్భుతమైన అనుభవం. మొన్నటికి మొన్న ఏదో అవసరం కొద్దీ మళ్లీ ఒకసారి దరిశి చెంచయ్య గారి ʹనేనూ నా దేశంʹ చదువుతూ, అందులో గదర్ పార్టీ వీరోచిత ప్రయత్నాల గురించి చదువుతూ కూడ భగత్ సింగ్ ను ఎంతగానో తలచుకున్నాను.

భారత ప్రజా పోరాటాలలో, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో ఎన్నటికీ ఆరని అరుణతార భగత్ సింగ్.

- ఎన్. వేణుగోపాల్
ఎడిటర్, వీక్షణం

Keywords : Bhagat Singh, Pistol, jupinder singh
(2020-06-04 05:31:38)No. of visitors : 428

Suggested Posts


0 results

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


భగత్