అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!


అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!

అనూరాధ,

మిత్రులారా, నిన్న సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ʹరాచకొండ పోలీస్ కమిషనరేట్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ʹ పేరుతో, ʹఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మావోయిస్టు కార్యకర్తల అరెస్టుʹ అనే పత్రికా ప్రకటన ఒకటి అన్ని ప్రచారసాధనాల కార్యాలయాలకూ చేరింది. నార్ల రవిశర్మ, బెల్లపు అనూరాధ అనే మావోయిస్టు అగ్రనాయకుల అరెస్టు గురించి వార్త అది. అదే యథాతథంగా నిన్న ప్రసారసాధనాలలో, ఇవాళ పత్రికల్లో వచ్చింది.

ఆ పత్రికా ప్రకటనలో ʹబెయిల్ పై ఉన్న ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు విప్లవ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారనే నమ్మకమైన సమాచారంతో ... పోలీసులు సోదా జరపగా... ప్రమాదకరమైన మావోయిస్టు సాహిత్యం, మూడు లాప్ టాప్ లు, పెన్ డ్రైవ్ లు, మెమొరీ కార్డులు, మావోయిస్టులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, వగైరా...దొరికాయిʹ అని ఉంది. ʹదొరికిన ఆధారాలను బట్టి వారి మీద ఐపిసి సెక్షన్ 120 బి రెడ్ విత్ ఐపిసి సెక్షన్ 34, యుఎపిఎ సెక్షన్ 10, 13, 18, 18 (బి), 20, తెలంగాణా స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ సెక్షన్ 8(1)(2) కింద క్రైం నం. 1275/2019 కేసు నమోదు చేయడమైనదిʹ అని పత్రికా ప్రకటనలో ఉంది. కేసు వివరాలలో రవి శర్మ మీద 1988 లో హైదరాబాదులో నమోదైన కేసులనుంచీ చరిత్ర, 1998 నుంచి 2009లో అరెస్టు అయ్యే వరకూ బీహార్, జార్ఖండ్ లో ʹఅజ్ఞాత కార్యకలాపాలుʹ, ఆ సమయంలో హాజరైన సమావేశాల వివరాలు రాశారు. 2016లో బెయిల్ పై విడుదలయ్యాడని రాసి, ఆశ్చర్యకరంగా ఆ తర్వాత జరిగిన నిర్దిష్ట నేరాలు ఒక్కటి కూడ రాయలేదు. ʹతరచుగా ఎక్కువరోజుల పాటు అజ్ఞాతవాసానికి వెళ్లి చత్తీస్ గడ్ లో, దేశంలోని ఇతరప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనాయకులతో సమావేశమవుతున్నాడుʹ అనీ, ʹమాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంతు ముఖర్జీ, బి పి సింగ్, వారణాసి సుబ్రమణ్యం లను కలిశాడుʹ అనీ, ʹఅఖిల భారత హిందుత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక ను స్థాపించడంలో చురుగ్గా పాల్గొన్నాడుʹ అనీ, ʹరాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగిస్తూ, రాష్ట్రంలోనూ, దేశంలోనూ విప్లవ కార్యకలాపాలను చురుగ్గా ప్రోత్సహిస్తున్నాడుʹ అనీ పత్రికా ప్రకటనలో రాశారు. ʹఆయన మీద మొత్తం పదహారు కేసులు నమోదయ్యాయి. అందులో పదకొండు జార్ఖండ్ లో, నాలుగు హైదరాబాదులో, ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం రూరల్ చింతపల్లిలో ఉన్నాయిʹ అని రాశారు.

ఆశ్చర్యకరంగా, ఈ పత్రికా ప్రకటనలో అనూరాధ గురించి ఒక్క ముక్క కూడ లేదు. రవి శర్మ గురించి రాసిన విషయాలలో కూడ ఆయనను పదహారు కేసుల్లో ఇరికించిన మాట నిజమే గాని, అందులో పద్నాలుగు కేసులను కోర్టులు కొట్టివేశాయి. పద్నాలుగు కేసుల్లో పోలీసులు ఆయన మీద ఒక్క నేరారోపణనైనా రుజువు చేయలేకపోయారు. న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా విడుదల చేశాయి. అంటే కోర్టులు కొట్టివేసిన కేసులనే పోలీసులు ఇప్పుడు ʹనేరాలుʹగా చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన మీద జార్ఖండ్ లో ఒక కేసు, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు మాత్రమే విచారణలో ఉన్నాయని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అలాగే, ఆయన ʹమాజీ కేంద్ర కమిటీ సభ్యులను కలిశాడుʹ అని పత్రికా ప్రకటన చెపుతుండగా, వారందరూ బెయిల్ మీద విడుదలై బహిరంగ ప్రజా జీవనంలో ఉన్నవారే.

అనురాధ, రవిశర్మలు 2009లో జార్ఖండ్ లో అరెస్టయ్యారు. వెంటనే వారి మీద పోలీసులు న్నో కేసులు బనాయించారు. అనురాధ నాలుగు సంవత్సరాల పాటు జైల్లో ఉండి, దాదాపు సగం కేసులు కొట్టివేయబడి, మిగిలిన సగం కేసుల్లో బెయిల్ మీద 2013లో బైటికి వచ్చింది. ఆ తర్వాత గడిచిన ఆరు సంవత్సరాల్లో మిగిలిన కేసులన్నీ కూడ కొట్టివేయబడ్డాయి. జైలు నుంచి బైటికి వచ్చాక అనూరాధ జైలులో తనతో పాటు ఉండిన సాధారణ మహిళాఖైదీల జీవితాల మీద అద్భుతమైన కథలు రాసింది. ఆ కథలన్నీ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో సీరియల్ గా ఎన్నో వారాలు వెలువడ్డాయి. ఆ కథలన్నీ కలిపి ʹఏది నేరం? హజారీబాగ్ జైలు గాథలుʹ పేరుతో 2015లో పుస్తకంగా వెలువడి ఎంతగానో ప్రశంసలు పొందింది. ఆ కథలు ఎంత జనాదరణ పొందాయంటే అవన్నీ హిందీలోకి, ఇంగ్లిష్ లోకి కూడ అనువాదమయ్యాయి. ఒక వర్ధమాన సుప్రసిద్ధ ఇంగ్లిష్ ప్రచురణ సంస్థ మొత్తం పుస్తక అనువాదాన్ని త్వరలో ప్రచురించనున్నది. ఈ ఆరు సంవత్సరాలుగా కూడ ఆమె కేసుల విచారణకు జార్ఖండ్ కు వెళ్లి రావడంతో పాటు, రచనలతో, ఉపన్యాసాలతో బహిరంగ ప్రజాజీవితంలో ఉంది. ఒక ఏడాదిగా ఆమె అఖిల భారత హిందుత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక అనే సంస్థలో పని చేస్తూ, దాని కన్వీనర్ గా కూడ ఎన్నికైంది. (నిజానికి నిన్న ఈ వేదిక అయోధ్య తీర్పు మీద తమ అభిప్రాయం తెల్పడానికి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. పోలీసులు ఆ సమావేశపు హాలును చుట్టుముట్టి, సమావేశం జరగకుండా చేసి, మిగిలిన కన్వీనర్లను, కార్యకర్తలను అరెస్టు చేసి, రోజంతా అక్రమ నిర్బంధంలో ఉంచారు!)

రవిశర్మ మూడు సంవత్సరాల కింద బెయిల్ మీద బైటికి వచ్చి అప్పటి నుంచి బహిరంగ ప్రజా జీవితంలో ఉన్నాడు. ఈ మూడు సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రయాణాలన్నీ జార్ఖండ్ లో కోర్టు వాయిదాలకు హాజరు కావడానికే. ఆ క్రమంలోనే ఒక్క కేసు మినహా మిగిలినవన్నీ కొట్టుడు పోయాయి. ఈ లోగా ఆయన కూడ రచనలు చేస్తూ వచ్చాడు. ఆయన రాసిన రాజకీయ విశ్లేషణా వ్యాసాలు ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజీలోనూ, ఇతర పత్రికల్లోనూ అచ్చయ్యాయి. బహిరంగ సభల్లో, సమావేశాల్లో ఉపన్యాసాలు కూడ చేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల కిందనే చారు మజుందార్ శతజయంతి సదస్సులో కూడ ఉపన్యసించాడు.

ఇద్దరూ కలిసీ, విడివిడిగానూ ఈ మూడేళ్లలో మూడు నాలుగు పుస్తకాలు అనువదించారు.

వారిద్దరితో పాటు అనారోగ్యంతో ఉన్న రవిశర్మ తల్లి (వయసు ఎనబై సంవత్సరాలు) ఉండగా మంగళవారం ఉదయం ఆరు గంటలకే పోలీసులు వారి ఇంటి మీద దాడి చేశారు. వెంటనే వారి ఫోన్లు లాగేసుకుని పదిహేను గంటలపాటు వారికి బైటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. ఉదయం పదకొండు గంటలకు ఆ ఇంటికి చేరిన రవిశర్మ చెల్లెలి దగ్గర, మూడు గంటలకు చేరిన రవిశర్మ తండ్రి దగ్గర, సోదరుడి దగ్గర కూడ ఫోన్లు లాక్కుని వారిని కూడ ఇంట్లో నిర్బంధించారు. పోలీసులు ఆ ఇంట్లో రాత్రి 9.30 వరకూ ఉన్నారంటే ఆ పదిహేను గంటల పాటు ఏమి చేశారో ఎవరికీ తెలియదు. దాదాపు మధ్యాహ్నం నుంచే పత్రికా విలేఖరులు ఆ ఇంటి ముందు వేచి చూస్తుండగా ఒక పోలీసు అధికారి బైటికి వచ్చి, సాయంత్రం ఆరు గంటలకు పత్రికా సమావేశం నిర్వహిస్తామని చెప్పాడు. కాని అక్కడ విలేఖరులు పడిగాపులు పడుతూ ఉండగానే, పైన చెప్పిన పత్రికా ప్రకటనను నేరుగా పత్రికాకార్యాలయాలకు పంపారు. తమను ఇంతసేపు పడిగాపులు కాయించి, తమకేమీ చెప్పకుండా నేరుగా పత్రికా ప్రకటనను తమ కార్యాలయాలకు పంపించడం ఏమిటని విలేఖరులు ప్రశ్నించారు. ఇంకా విచిత్రం ఏమంటే, వారిద్దరినీ అరెస్టు చేశామని ఎనిమిది గంటలకు పత్రికలకు ప్రకటన పంపిన పోలీసులు, మరొక గంటన్నర దాకా, 9.30 దాకా ఇంట్లోనే ఉన్నారు!

- ఎన్. వేణుగోపాల్,
ఎడిటర్, వీక్షణం.

Keywords : Maoists, B Anuradha, N Ravi Sharma, Arrest, Rachakonda, Police
(2019-12-08 02:09:20)No. of visitors : 406

Suggested Posts


0 results

Search Engine

నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
more..


అనూరాధ,