కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ
మలుపు ప్రచురణగా వెలువడుతున్న ʹకశ్మీర్ బహిరంగ చెరసాలʹ పుస్తకం ఈ నెల 24న సాయంత్రం 6 గంటలకు మలుపు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ల ఆద్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించబడుతుంది.

ఈ పుస్తకానికి ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ రాసిన ముందుమాటలోంచి కొంత భాగం మీ కోసం...
ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల- ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హ దయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీన కథనం నిర్మితం కావడం మొదలయింది.
ఆర్టికల్ 370 కశ్మీరీల జీవితాలను భద్రంగా, నిరపాయకరంగా ఉంచుతున్నదని కాదు. 370 ఆర్టికల్ ఏ యువకుడికీ యువతికీ, ఏ బాలుడికీ బాలికకీ భవిష్యత్తును వాగ్దానం చేసేస్థితిలో లేదు. పుట్టినప్పటి నుంచి
ఆ అధికరణాన్ని కొద్దికొద్దిగా చంపుతూనే వస్తున్నారు. అది తనను తానే కాపాడుకోలేదు. ప్రజలకేమి పూచీపడుతుంది? ఇది కశ్మీరీల కల్లోల జీవితంలో కొత్తగా ఒక పిడుగు పడినట్టు బాధపడడం కాదు. కశ్మీర్‌లో ఏదో ఒక చారిత్రక ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్న వారికి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కష్టమేమీ లేదు. 370 నుంచి చివరి ప్రాణపు బొట్టును కూడా పిండేయడం ద్వారా నష్టపోయింది ప్రజాస్వామిక శక్తులూ, ప్రజాస్వామిక ప్రక్రియలూ మాత్రమే. ఆ నష్టం కశ్మీర్ కే పరిమితం కాదు.
జమ్ముకశ్మీర్‌లో భారతదేశంతో కలసి ఉండడానికి చరిత్ర ఒక ప్రాతిపదిక ఇచ్చింది. అది విశ్వాసం నమ్మకం వంటిది కాదు. అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కొన్ని పద్ధతులను అనుసరించాయి. వాటి పాలకులు కొన్ని రాయితీలు, సదుపాయాలు పొంది తమ భూభాగాలను భారత్‌లో విలీనం చేశారు. మరి కొన్ని దేశీయ రాజ్యాలు, ముఖ్యంగా భూభాగం అధికంగా ఉన్న రాజ్యాలు భిన్నమైన పద్ధతిలో బేరసారాలు జరిపాయి.
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జమ్మూకశ్మీర్ భారత్‌తో అనుసంధానం అయింది. అందుకోసం ఒక అవగాహనతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని రాజ్యాంగంలో 370 అధికరణం రూపంలో పొందుపరిచారు. భారత్‌లో కశ్మీర్ ఉనికి ప్రత్యేకంగా, విశిష్ట ప్రతిపత్తితో ఉండేటట్టు ఆ అధికరణం రూపొందించారు. ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో భారత్‌లో కలసిన జమ్ముకశ్మీర్, పరిస్థితులు చక్కబడిన తరువాత తాను తన భవిష్యత్తును నిర్ణయించుకుంటుదన్నది
ఆ అధికరణం వెనుక అవగాహన. 70 ఏళ్ల కిందట జరిగిన ఈ చరిత్రకు కూడా ఇప్పుడు అనేక ముఖాలు. ఆధారాలున్నా, చరిత్ర చెబుతున్నా, కొన్ని అంశాలను కొందరు కాదంటారు. కశ్మీర్ జనాభిప్రాయ సేకరణ ప్రతిపాదనకు ఎప్పుడో కాలం చెల్లిందని, ఆ ప్రాంతం భారత్‌దే అనే వాదన సమాంతరంగా వినిపిస్తూనే ఉన్నది. ఇటువంటి వాదన కేవలం బి.జె.పి., దాని సోదర శక్తులది మాత్రమే అనుకోవడానికి లేదు, 370ను బలహీనపరచడంలోను, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడంలోను, కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని క్రమంగా దిగజార్చడంలోను కాంగ్రెస్, ఇతర మధ్యే వాద పార్టీల పాత్ర తక్కువేమీ కాదు. అయినా సరే, ఒక కీలక అవశేషంగా, ఒక చారిత్రక ఆధారంగా 370 కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు, ఆగస్టు 05 నాటి నిర్ణయాలు, ఆ అవశేషాన్ని, ఒక ప్రాతిపదికను తొలగించాయి....
ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కశ్మీర్ నోరు విప్పకుండా ఏమి చేశారు? ఈ పుస్తకం పేరు సూచిస్తున్నట్టు జమ్ముకశ్మీర్ అంతటినీ, ముఖ్యంగా కశ్మీర్ లోయను ఒక చెరసాలగా మార్చారు. కమ్యూనికేషన్ సంబంధాలను లేకుండా చేశారు. ప్రజలందరినీ గ హనిర్బంధంలో ఉంచారు. వేలాది మందిని నిర్బంధించారు. నిరసన తెలిపేవారి మీద కఠినంగా వ్యవహరించారు. కశ్మీర్ లోయలో ఇటువంటి స్థితి తరచు పాక్షికంగా వస్తుంటుంది. వారికి ఇది కొత్త కాదు. కానీ, ఒక కీలకమయిన విధాన నిర్ణయం తీసుకునే సమయంలో, అది కూడా ఏ ప్రాంతం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం వేస్తుందో అటువంటి విధాన నిర్ణయం తీసుకునే సమయంలో,
ఆ మొత్తం ప్రాంతాన్ని నిశ్శబ్దం చేయడం, సమాచారాన్ని బయటకు లోపలికి వెళ్లకుండా దిగ్బంధం చేయడం- ఒక యుద్ధ స్థాయి చర్య హింస పరిమాణం రీత్యా, ఆగస్టు 5 నుంచి ఇప్పటి దాకా కశ్మీర్‌లో జరిగిన మరణాలు, గతంలో పోలిస్తే అతి తక్కువే. కానీ, నిర్బంధపు తీవ్రత రీత్యా, స్థాయి రీత్యా ప్రస్తుత స్థితి తక్కువేమీ కాదు. పైగా, ఇంత కాలం విశ్వసిస్తూ వస్తున్న ఒక కథనం, లేదా ఆశకు ఆస్కారమిస్తూ వస్తున్న కథనానికి కాలం చెల్లడం అనేది కలిగించే ఆశాభంగం ఏ నిర్బంధం కంటె కూడా చిన్నది కాదు.
కశ్మీర్‌లోని నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవచ్చు. అందులో విధించబడినదే అధికం కావచ్చు, ప్రజలు ఒక సమీక్ష కోసం, ఒక వివేచన కోసం, ఒక ప్రయోజనం కూడా స్వచ్ఛందంగా కొంత మౌనాన్ని వరించి ఉండవచ్చు. అక్కడ ఒక భయానక, దయనీయ మౌనం ఉంటే, బయట సభల్లో, వీధుల్లో మాటలు, బాణాసంచాలు పేలాయి. ప్రజాస్వామిక స్వరాలు, స్థలాలు అన్నీ స్థాణువులై పోయిన క్షణాల్లో ఆవేశాలు, ఉన్మాదాలు, భయాలు, ఆందోళనలు, విజయోత్సాహాలు జరిగిన పరిణామానికి అమోఘమైన సమ్మతిని నిర్మించారు. అక్కడక్కడా కొన్ని బలహీనమైన గొంతుకలు, కొన్ని అసమర్థ గొంతుకలు, సంఖ్యలో అతిస్వల్పమైపోయిన గొంతుకలు.. వినిపించాయి. మతతత్వమూ తీవ్ర జాతీయవాదమూ కలగలసిన ప్రజాస్వామిక వాతావరణం వాటిని హేళనపూర్వకంగా అనుమతించింది.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ కశ్మీర్‌పై ఆగస్టు 5నాడు జరిగిన చర్యలపై ప్రజాస్వామిక స్పందనలు. కశ్మీర్ సమస్యకు ఫలానాదే శాశ్వత పరిష్కారమని ఈ వ్యాసాలు చెప్పడం లేదు. ఏ పరిష్కారానికైనా ప్రజల ప్రమేయం, భాగస్వామ్యం అవరమని, అందుకు అనువైన వాతావరణం కల్పించాలని, ఆగస్టు 5నాడు కశ్మీర్ విషయంలో జరుగుతుంది. వారి పంథాలో వారు చర్యలు చేస్తుంటారు. ఎన్‌కౌంటర్లలో మరణిస్తుంటారు. అంత్యక్రియలు, ఊరేగింపులు, మళ్లీ కాల్పులు షరామామూలే. కేంద్రపాలిత ప్రాంతం అయిన తరువాత, గతంలో ఉన్నంత ఎడం కూడా ఢిల్లీకి, కశ్మీర్ పాలనాయంత్రాంగాలకు ఉండదు. ఆ సామీప్యం ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుందో తెలియదు.
నెహ్రూ దగ్గరి నుంచి మోదీ దాకా ఏ ఒక్క ప్రధానమంత్రికి అయినా, ప్రేమించి విశ్వసించి, అభివ ద్ధికి స్వేచ్ఛకు ఆస్కారమిచ్చి, కశ్మీరీల హ దయాలను గెలుచుకోవాలని ఎందుకు అనిపించలేదో- తెలియదు. అశాంతి తొలగించడానికి ఏమి చేయవచ్చునో ఎవరూ ఎందుకు ఆలోచించలేదో తెలియదు. అసమ్మతిని, అటానమీ ఆకాంక్షలను ప్రకటించే వర్గాలపై దండప్రయోగంతోనే జాతీయతా భావానికి పోషణ దొరుకుతుందేమో?
కశ్మీర్‌ను దారికి తెచ్చామన్న విజయగర్వం ఏదో పాలకులలో కనిపిస్తున్నది,
ఆ గర్వం కశ్మీర్‌కు వెలుపలి భారతీయులలో ప్రతిఫలించి, వారిలో రాజుకుంటున్న తీవ్ర జాతీయతను సంత ప్తి పరుస్తున్నది. ప్రతి ఒక్కరికీ విజేత భావాన్ని అందిస్తున్నది. ఇందరిని విజేతలను చేసిన నేతలకు బలం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. వామనుడి మూడో పాదం దేశంలోని స్వేచ్ఛాకాంక్షులందరి శిరస్సుల మీదా ప్రతిష్ఠితం కానున్నది.
- కె. శ్రీనివాస్

Keywords : kashmir, bjp,article 370, jammu, malupu,
(2023-05-31 14:26:43)
No. of visitors : 1238
Suggested Posts
| 45 మందిని చంపి నదిలో తోసేసిన పోలీసుల హత్యాకాండపై...ఓ ఐపీఎస్ అధికారి పుస్తకం... ʹహాషీంపురా 22, మేʹహత్యలు జరిగినరోజున దినకూలీలు, నేతపనివాళ్లు అయిన దాదాపు నలబై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్ జిల్లా మురాద్ నగర్ లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చిచంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్షసాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద |
| నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట గాథఈ దేశంలో బూటకపు కేసులు బనాయించి అనేక మంది ముస్లింలను, దళితులను, విప్లవ కారులను, ప్రజా పక్షం వహించే మేదావులను జైళ్ళలోకి నెడుతున్నారు పాలకులు. అలా జైళ్ళలో దశాబ్దాల తరబడి మగ్గి నిర్దోషులుగా బైటడినవాళ్ళే ఎక్కువ మంది. |
| నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల చరిత్ర ʹసైరన్ʹ నవల
అల్లం రాజయ్య రాసిన ఈ సైరన్ నవలను చదివితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత నలభై, యాభై యేండ్ల కింద రైతాంగం, ఆదివాసులు, సింగరేణి కార్మిక వర్గపు స్థితిగతులు ఎలా ఉండేవో తెలిసి వస్తాయి. |