ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూ


ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూ

ఎవడి


*ఇది కాసులు కురిపిస్తే సమసిపోయే సమస్య కాదు, పెట్టుబడి స్వభావంతో ముడిపడ్డ సామాజిక సమస్య!*

*కార్మికవర్గ చారిత్రక కర్తవ్యాన్ని హెచ్చరించే సమస్యే విశాఖ పారిశ్రామిక ఉగ్రవాద చర్య!*

మనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు. కానీ వాటి కంటే నూరు రేట్ల మారణహోమం మాత్రం నేడు విశాఖలో సంభవించింది.

దేశంలోని నాలుగు విశ్వ విఖ్యాత "స్మార్ట్" నగరాలలో విశాఖ నగరం ఒకటి. అంటే అదో అతిపెద్ద "ఆదర్శ నగరం". దానికి తాజా ప్రమాదం ఓ అందమైన "కానుక" కాబోలు! అట్టి "స్మార్ట్ సిటీ" నుదుటి పై అలంకరణగా ధరించే బొట్టుబిళ్ళ ఈ మారణహోమం కాబోలు! స్మార్ట్ సిటీల భవిష్యత్తుకి అద్దంపట్టే ప్రతీక యిది.

ఇది ధనస్వామ్యం ఎలాంటిదో సూచించే ఓ మచ్చుతునక! తలకు కోటి రూపాయలు మన ప్రజల కర్మ ఫలమే! ముక్కు పిండి మన నుండి వసూళ్లు చేసిన పన్నులసొమ్ము మాత్రమే! అంతిమ పరిశీలనలో ధనస్వామ్యంపై జన ధర్మాగ్రహాన్ని చల్లార్చేవే ఈ ధనరాశులు! ఇది సారంలో మన ప్రజల చెమట చుక్కల ఫలమే! కాసుల రాశుల "కోటిదానం"తో ధనదాహపు దుర్నీతిపై జనంలో వెల్లువెత్తే తక్షణ భగభగలు సగం చల్లారతాయి. మిగిలిన సగాన్ని చల్లార్చే కౌటిల్యనీతి మున్ముందు ఉండనే ఉంటుంది.

ఇప్పుడు ఎన్ని ఆరాటాలైనా వుండొచ్చు. ఎన్నెన్ని నాటకచిత్రాలైనా ప్రదర్శించవచ్చు. వాటి అంతిమ లక్ష్యం సుస్పష్టమే! ఆఖరి ఘట్టం చేరేలోపు ఎన్నెన్ని మధ్యంతర ఘట్టాలున్నాయనేది కాదు. చివరి మజిలీ ఏమిటనేదే ముఖ్యమైనది. అదే ధనస్వామ్య వ్యవస్థ పరిరక్షణ! ఔనన్నా, కాదన్నా ఇది నిప్పులాంటి నిజం! ఈ సుదీర్ఘ నాటక ప్రక్రియ లో ఇప్పుడే తెరలేచింది. తెరపై ఆరంభ దృశ్యం రక్తికట్టిస్తేనే ఆద్యంతం అది అలాగే కొనసాగేది. ఔను, నేడు కాసుల కనకవర్షం కురిపించడం వెనక ఈ ప్రయత్నం దాచేస్తే దాగేది కాదు. అదో అనివార్యమైన ప్రక్రియే!

రాజ్య పాలనలో ఎవడుంటే నేమి! ఏ రంగు వాడైతేనేమి! ఏ జండా పట్టినోడైతేనేమి! వాళ్లేవరైనా కాపాడాల్సిన "దేవుడు" ఒక్కడే! వాడి పేరు "పెట్టుబడి" అందామా? లేదంటే "ధనస్వామ్యం" అందామా? లేదా "కార్పొరేట్" పేరుతో పిలుద్దామా? అదిమన ఇష్టమే! వాళ్ళ ని ప్రజలు గెలిపించారనేది ఒక అందమైన అబద్ధం! వికారమైన వికృత నిజం ఏమిటంటే, "ధనస్వామ్య దేవత" మాత్రమే వాళ్ళని గెలిపించిందనేది. ఔను, ఆమె వాళ్ళని గెలిపించింది. ఆమె కోసం వాళ్ళున్నారు. వాళ్ళు లేకుండా ఆమె జీవించగలదు. కానీ ఆమె లేకుండా వాళ్ళు ఒక్కరోజు కూడా జీవించలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే, వాళ్ళు "ఆమెయొక్క, ఆమెకోసం, ఆమెచేత"! ("పెట్టుబడి" ని "ఆమె"గా పోల్చి చెప్పినందుకు అన్యధా భావించరని ఆశిస్తా)

ఆమె ఇప్పుడు గాయపడింది. నోనో, అది నిజం కాదు సుమా! సమాజాన్ని గాయపరిచే నిత్య విధినిర్వాహణలో నిమగ్నమైన ఆమె నేడు తాను కూడా గాయపడింది. ఇక్కడ ఒక ముఖ్య తేడా ఉంది. ప్రతిరోజూ గాయపరిచే బాధ్యతలో "ఆమె" ఉంటుంది. కానీ అరుదుగా "ఆమె" కూడా గాయపడుతుంది. నేడు జరిగింది యిదే! అప్పుడే "ఆమె" ని కాపాడే రాజకీయ కర్తవ్యం చాలా చాలా జఠిలమైనది. ఆ సమయంలో ఆమె ముద్దుబిడ్డలైన పాలకులు చాలా రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఆ నైపుణ్యంతో తెరపై తొలిఅంకంలో తొలిదృశ్యం ప్రారంభ మైనది. అది రక్తికట్టే యుక్తితో కూడిందే!

చిమ్మే చెమట చుక్కల్లో నుండి, పిండే కండల్లో నుండి, కారే నెత్తుటి ధారల్లో నుండి ఉత్పత్తుల సృష్టి తెల్సిందే! అవి కురిపించే కాసుల మూటలు, కనక రాశులు తెల్సిందే! వాటికే కారల్ మార్క్స్ "అదనపు విలువ" అనే పేరు పెట్టాడు. వాడుక జనభాషలో "లాభం" అంటారు. అదిప్పుడు కరిగిపోదు. తరిగిపోదు కూడా! అది తరగకుండా కరగకుండా, పైగా పెరుగుతూ వుండాలంటే, మరోధనం నుండి దానానికి వెచ్చించాల్సి వుంది. అదే "విలువ"! అది పైన పేర్కొన్న"అదనపు విలువ" కు పూర్తి విరుద్ధదిశలోనిది. నేడు "ధర్మం"కై కేటాయించే సొమ్ము అదే! అది నేడు గొప్ప "త్యాగధనం"గా ప్రాచుర్యం పొందడం కూడా షరా మామూలే!

ఇప్పుడు మనల్ని బాధితుల్ని చేసింది ఎవడు? గాయపరిచింది ఎవడు? బలి తీసుకున్నదేవరు? బలిపీఠం ఎక్కించిందేవరు? వాడి దగ్గర గుట్టలుగా పేరుకుపోయిన నిన్నటి లాభాల నిల్వల నుండి లాక్కొని బాధితులకు పంచకుండా చేపట్టే పంపిణీ పనులన్నీ ఓ ప్రహసనాలే! ఇంతకి మించిన మాటలేదు.

వాళ్ళిప్పుడు పంపిణీ చేసింది ఎంత మొత్తం అనేది కాదు మనం చూడాల్సింది. నీ స్వంత ఆవును చంపి, దాని తోలుతో కుట్టిన పది చెప్పుల జతల్లో ఒక్కజత తిరిగి నీకు దానం చేసిన దాతృత్వం గూర్చి కాదు మనం చర్చించాల్సింది. గతంలో పాలకులు ఒక్కజత దానం చేస్తే, నేటి పాలకుడు ఒకటిన్నర జతల చెప్పుల్ని దానం చేసిన చర్య గూర్చి కాదు మాట్లాడాల్సింది. నిన్ను ఎవడు గాయపరిస్తే ఎవడి డబ్బును నీకు నష్టపరిహారంగా "దానం" చేస్తున్నారనేదే చర్చనీయాంశంగా మారాలి.

ఎంత "ప్రేమ"! ఎంత "దయ"! ఎంత "జాలి"! ఈ "ప్రేమ" "దయ" "జాలి" తానిచ్చిన జీవోల ప్రకారం లాక్ డౌన్ కాలానికి కార్మికులకు జీతాలు ఇప్పించడంలో ఎందుకు లేదు? గత రెండు వారాలుగా రాష్ట్రంలో ఏడు జూట్ మిల్లులకు చెందిన పదివేల కార్మికులు సాగించే న్యాయమైన ధర్మ పోరాటం పట్ల ఈ "దయ" లో పదోవంతు కూడా ఎందుకు లేదు? వారి ఆకలి మంటల పోరాటం కనిపించలేదా? నెల్లిమర్ల, సాలూరు వంటి చోట్ల ఇంతవరకూ లేని కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడే రీతిలో పెట్టుబడిదార్ల నిర్లక్ష్యం ఎందుకు కనిపించదు?

నేడు తలకి కోటి రూపాయలతో పాటు అరకోటి, పావుకోటి వంటి "దానధర్మాలు" ఒక చర్చగా మారింది. ఔనుమరి! గతంలో దానం చేసే ఒక్క రూపాయిని హఠాత్తుగా నేడు రెండు రూపాయలుగా పెంచితే ఆసక్తిని పెంచుతుంది. కాదనడం లేదు. కానీ మౌలికప్రశ్నని మరిచి పోవద్దు. దానికి సమాధానం వెదుక్కోవాలి.

అసలు సాయం చేసే ఈ డబ్బు ఎవడిది? ఇది ఎవడబ్బ సొమ్ము? ఇది పన్నుల సొమ్ము కాదా? ఈ పన్నులు చెల్లించేది ఎవరు? మన ప్రజలు కాదా! ఇప్పటివరకూ వాళ్లే లాభాలు సృష్టించేది. వాళ్లే నేడు గాయపడింది. వాళ్ళ గాయాలకు చికిత్సకోసం వాళ్ళ సొమ్మే ఖర్చు చేయడం ఇప్పుడు జరిగేది. వాళ్ళ నష్టాలకు పరిహారంగా వాళ్ళ డబ్బే వెచ్చించడం నేటి నాటక ప్రక్రియ! వాళ్ళని గాయపరిచిన ఘరానా నేరస్తుల బొక్కసాల నుండి ఒక్క పైసా నష్టపరిహారం చెల్లించకపోవడం నేటి క్రూర పరిహాస్యపు ప్రహసనం! మనం నేడు అడగాల్సిన అసలు ప్రశ్న యిదే!

"శ్రమశక్తి" సృష్టించి గుట్టలుగా నిల్వపడ్డ భారీ "విలువ" నుండి ఒక వంతు సొమ్ము పెట్టుబడిదార్ల వద్దకి లాభాల రూపంలో చేరుతుంది. మరోభాగం కూలిడబ్బురూపంలో శ్రామికవర్గం వద్దకు చేరుతుంది. అది అదనపు విలువ! ఇది విలువ! అది గుట్టలుగా నిల్వ పడుతోంది. ఇదేమో ఆహారం వగైరా రూపంలో ఏరోజుకి ఆరోజే ఖర్చవుతోంది. ఈ రెండో విలువ డబ్బు నుండి పన్నుల రూపంలో ఒక భాగం ప్రభుత్వాల ఖాజానాలకు చేరుతుంది. మొన్ననే మధ్యంపై పెంచిన అదనపు పన్ను అలాంటి కోవలోకే వస్తుంది. మౌలికంగా అది కూడా ప్రజాధనమే! పెట్టుబడిదార్ల చేత నేడు గాయపడ్డ క్షగాత్రుల వేడిని చల్లార్చి ఓదార్చే రాజకీయ అవసరం కోసం, క్షతగాత్రుల స్వంత సొమ్ము నుండి ₹కోటిచొప్పున మహాదానమిది. ఈ "దానం" నిజలక్ష్యం పెట్టుబడిదారుడి ఖజానా పరిరక్షణే! పైగా దాని పెంపుదలే!

నేడు స్మార్ట్ సిటీ లో కొరియా కంపెనీ ప్రదర్శించిన ధనస్వామ్య పిశాచపు వికృత వికటాట్టహాసమిది. వాడి చేతుల్లో విశాఖ వాసుల సామూహిక హననం! ఆనాడు యూనియన్ కార్బైడ్ కంపెనీ! ఈనాడు LG పాలిమర్స్ కంపెనీ! నాడు భోపాల్! నేడు స్మార్ట్ సిటీ విశాఖ! పెట్టుబడిదారుడు ఎవడైతేనేమి! పాలకుడు ఎవరైతేనేమి! నగరం ఏదైతేనేమి! ధనస్వామ్యం ఒక ఆధునిక పిశాచం! అదో ఉగ్రవాద భూతం! దానికి రంగు, తెగ, జాతి బేధంలేదు. మళ్లీ నేటి నిరూపిత సత్యమే!

నేటి జగనైనా, నిన్నటి బాబైనా, అది ఢిల్లీ దొరలైనా, మరొకరైనా అందరి లక్ష్యం ఒకటే! శ్రమశక్తిని కొల్లగొట్టే వాళ్ళను కాపాడటమే! ఈ నగ్న సత్యాన్ని గుర్తించడంతో పాటు గుర్తింపజేయడం నేటి ఓ నిజ కర్తవ్యం!

తాజా "₹కోటి కాంతుల ధగధగల్లో మనం చూడాల్సింది సామాజిక వెలుగులు కాదు. ₹కోట్లకుకోట్లు పడగెత్తి, నేడు బుసలుకొట్టే ధనస్వామ్య విషసర్పం ఓ భౌతిక సత్యం! అదో సామాజిక సమస్యగా మారడం ఓ చేదునిజం! అట్టి సామాజిక వికృత విషసమస్యగా మారిన ధనస్వామ్యాన్ని వదిలేసి, ఒక్కొక్క కోటితో కొనుగోలు చేసి స్థాపించే కృత్రిమ ప్రశాంతత ఓ బూటకం! ధనస్వామ్య నాటకంలో భాగమే!

ఇది వైపరీత్యమో లేదా కాకతాళీయమో గానీ, ఈరోజే భారత కార్మికవర్గాన్ని హెచ్చరించే పలు సంఘటనలు సంభవించాయి. యూపీ ప్రభుత్వం మూడేళ్ళ పాటు కార్మికచట్టాల్ని సస్పెండ్ చేసిన వార్త వెలువడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కార్మికచట్టాలపై ఇలాంటి మరో తరహా నిర్ణయం చేసినట్లు మరో వార్త కూడా వెలువడింది. ఈరోజే మరికొన్నిరాష్ట్రాల్లో ఇంకొన్ని ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ భారత కార్మికవర్గానికి హెచ్చరికలే! కోట్లాది మంది వలసకార్మికుల కన్నీళ్లు ఇంకా ఇంకిపోక ముందే మరో కొత్త విషాద మారణకాండ నేడు విశాఖలో చోటుచేసుకుని అట్టుడికిస్తోంది. నేడు పదునెక్కాల్సింది శ్రమశక్తి! కదం తొక్కే కర్తవ్యం శ్రమశక్తిది. అలా కదం తొక్కించాల్సిన రాజకీయ కర్తవ్యం శ్రామికవర్గ విప్లవ సంస్థలది. నేడు ధనస్వామ్యపు ఉక్కుపిడికిలి కింద నలిగిపోతోన్న బ్రతుకులు ఇచ్చే విప్లవ రాజకీయ సందేశం అదే! కుహనా స్మార్ట్ సిటీ విశాఖ నగరంలో ఆధునిక ధన పిశాచపు విషవాయుకీలల్లో నేడు దగ్ధమౌతోన్న దీనులు వినిపించే హాహాకారాలు, ఆర్తనాదాలు, మరణ వేదనలు శ్రామికవర్గ విప్లవ సంస్థలకి నేర్పే రాజకీయ పాఠం ఇదే!

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
7-5-2020

Keywords : visakhapatnam, Gas Leakage, death,
(2021-04-17 10:22:37)No. of visitors : 509

Suggested Posts


మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారు

మనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం.....

అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !

నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ

చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి

ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు....

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌

బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదను సామ్రాజ్యవాద, కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల చట్టాలను తీసుక వచ్చి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నది.

విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీ

ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇ

విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌

విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


ఎవడి