రాగో @ సృజన ఏం కోరుకుంది? -పి.వరలక్ష్మి


రాగో @ సృజన ఏం కోరుకుంది? -పి.వరలక్ష్మి

రాగో


ʹపుంజులు కూయంగా లేసి ఏరోజు గాసం ఆరోజే అన్నట్లు వడ్లు దంచుతూ జావ (అంబలి) గాసి పొలగాండ్లకు పోసి పొలంకాడ మొగనికి కొంటపోతది ఆడది. మొగుడు జావ తాగుతుంటేనే అది మెల్లగా పొలంలకు దిగుతది. నాగలి పట్టి మొగని దంటకు అది తీసిపోకుండా దున్నుతది. నాగలిడిసిందంటే అడవిల వడి ఆకు, అలము జమ చేసి ఆ రోజు కూర పూర్త తెస్తది. ఇంటికాడ ఆడదాని ఆసరా లేకుంటే ఆ ఇల్లెదుగదు. పూలు ఏరుడు, పండ్లు ఏరుడు, గడ్డలు తవ్వుడు ఇట్ల నూటొక్క పని చేస్తే గాని ఎల్లదు ఆడదాన్కి. గడియసేపు కూచోనీకి ఆరాం ఉండదు. అయినా ఆడదాన్ని అయ్యో అనేటోళ్ళెవళు?"
ʹపొద్దస్తమానం పని చేసిన ఆడది నడుం లాగుతుంటే, మంచంపై నడుం వాలుద్దామంటే కూడ పోలో (పనికి రాదు) అంటారు. పెళ్ళయిందంటే అక్కడ నేలమీద దొర్లాల్సిందే తప్ప మంచం మీద కూచోనైనా కూచోకూడదు… పేను (దేవుడు) పూజకాడికి కూడ మనల రానియ్యరు. సవరించేదంతా మనవంతే. కాని దేవుడికి మొక్కడానికి మాత్రం మనం పనికిరాం. ఆ దేవుడెట్ల మెచ్చుతాడో మరి! పంట చేతికొచ్చేవరకు దున్నుడు నుండి కోత వరకు ఏ పనికి మనం లేకుండా వెళ్ళదు. కానీ కళ్ళంలోకి మాత్రం రావద్దంటారు. ఆడది షికారుకు పోకుంటే కాదు అంటారు. పోయి, వేట అయితే కోసే దగ్గర మాత్రం పోలో (పనికిరాదు) అంటారు... ఏం చేసినా, ఏం తప్పినా ʹదండుగʹ అని బెదిరిస్తరు ఈ పెద్దలు... ఈ రీతులు రివాజులు అన్ని గలిసి ఆఖరికి ఆడది కోడిగుడ్డు తినకూడదని కూడా ఖాయిదా చేసిరిʹ
పై మాటలు సాధన రాసిన ʹరాగోʹ నవలలోని ఒక సన్నివేశంలోనివి. ఆదివాసీ మహిళల జీవితం ఇలా చెప్పుకుంటూ పోతే తెగేది కాదు. ఆ బాధలన్నీ రాగో కుప్పబోస్తుంది. ఇష్టం లేని పెళ్లిని, అడుగడుగునా కాళ్ళు, చేతులకు అడ్డం పడే బంధనాలను విడిపించుకొని స్వేచ్చ కోసం పరితపించిన రాగో ఉద్యమం బాట పడుతుంది. తన సహచరులతో ఆదివాసీ పల్లెలు తిరుగుతూ మహిళలందరి బాధలను వ్యక్తీకరిస్తుంది. రీతి రివాజుల పేరిట స్త్రీల జీవితాలు ఎలా కునారిల్లిపోతున్నాయో చెప్పడమే కాదు. మహిళలందర్నీ పోగేసి బాధల్ని మట్టుబెట్టే మార్గం చూపుతుంది రాగో. ఈ నవల 1993లో ప్రచురించబడింది. అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు సృజనలో సీరియల్ గా అచ్చయింది. నవల విడుదలయ్యాక రాగో పాత్ర మీద, ఉద్యమం మీద అనేక చర్చోపచర్చలు జరిగాయి. ఇన్నేళ్ళ తర్వాత రాగోకు వాస్తవ ప్రపంచంలో ఒక భౌతిక అస్తిత్వం ఉందని ఆమె మరణించిన తర్వాత తెలుగు సమాజానికి తెలిసింది.
మే 2 నాడు గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా సీన్‌భట్టి అడవుల్లో ʹఎన్కౌంటర్ʹ జరిగింది. కూంబింగ్ చేస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం, పోలీసులు ఎదురు కాల్పులు జరపడం, అందులో ఒక మహిళా మావోయిస్టు మరణించడం, మిగిలిన వాళ్ళు తప్పించుకోవడం, వారికోసం గాలింపులు కొనసాగుతుండడం... అదే అరిగిపోయిన పాత కథ. అయితే ఎప్పుడూ వినిపించే చావుకథతో పాటు ఈసారి ఒక జీవిత కథ వెలుగులోకి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన ʹసృజనʹ ʹరాగోʹ అని తెలుగు పాఠకులకు తెలిసింది. మీడియా భాషలో ఆమె ʹఎన్కౌంటర్ʹ అయిన మావోయిస్టు. లేదా ʹహతʹమైన మావోయిస్టు. ఆమె తల మీద లక్షల రివార్డ్ ఉందని, ఆమెను చంపడం ఒక పెద్ద అచీవ్మెంట్ అని పోలీసు భాషలో మీడియా పలికింది. రాగోని చదివిన పాఠకులు మాత్రం తామెన్నటికీ మరువలేని కథానాయకురాలుగా ఆమెను మరింత గాఢంగా హృదయాల్లో పదిలపరచుకుంటారు.
1988లో రాగో కామ్రేడ్ జైనిగా మారిందని తెలుస్తోంది. 80లలో ఉద్యమం దండకారణ్యం చేరినప్పుడు అక్కడి మహిళల స్థితిగతులు రాగో జీవితం ద్వారా, ఆమె మాటల ద్వారా మనకు కళ్ళకు కడతాయి. దండకారణ్య ప్రాంతంలో విప్లవ మహిళా సంఘాలు ఏర్పాటుచేస్తున్నప్పుడు అక్కడి సమాజంలో పితృస్వామ్యం ఎంత బలంగా ఉందో, మహిళల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఉద్యమం రికార్డ్ చేసింది. ఆదివాసీ ప్రజలపై మైదాన ప్రాంతం నుండి వెళ్ళిన షావుకార్ల దోపిడీ, చట్టాల పేరుతో ఫారెస్ట్ అధికారులు, గార్డులు చేసే దౌర్జన్యాలను అడ్డుకోడానికి ప్రజలను సంఘటితం చేసి ఉద్యమాలు నడుపుతున్న క్రమంలో ఆదివాసీ సమాజం లోపల ఉన్న వైరుధ్యాలు కూడా ముందుకు వచ్చాయి.
తెగ పెద్దల ఆధిపత్యం అక్కడి సమాజంపై బలంగా ఉంటుంది. చీటికీ మాటికీ జరిమానాలు విధిస్తూ ప్రజలను దోపిడీ చేస్తారు. క్రతువులు, కర్మకాండలు, పండుగలలో పూజారులు, తెగ పెద్దలు లాభపడుతుంటారు. అంతంత మాత్రం జీవితాలు వీటి కింద మరింత నలిగిపోతుంటాయి. ఆడవాళ్ళ మీద అడుగడుగునా ఆంక్షలు, వారిని మీరితే జరిమానాలు, శిక్షలు మామూలు విషయం.
రాగో మహిళల్ని కట్టడి చేసి, హింసించే రీతి రివాజుల్ని ప్రశ్నిస్తుంది. ఆమె మాడియా గోండు యువతి. వాళ్ళ తెగలో కట్టుబాట్లు ఎక్కువే. ఈ కట్టుబాట్లన్నీ ఆడవాళ్ళను మగవాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోడానికే అని రాగో అనుకుంటుంది. యుక్తవయసు రాగానే వెకిలి పోరగాండ్లు, వరుసైన వాళ్ళు తనను ఏడిపిస్తే ఊరి పెద్దలు నవ్వుతూ ప్రోత్సహిస్తారని ఆమెకు కోపం. చిన్నతనంలోనే మేన బావతో పెళ్లి నిశ్చయం చేస్తారు. చిన్నప్పటి నుండి అతనంటే తనకు ఏ మాత్రం ఇష్టం లేదు. రాగో ఇంట్లో నుండి పారిపోవడానికి ఇదే కారణం అయినా, తనకు తెగ ఆచారాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది.
మాడియా గోండు తెగలో పెళ్ళికొడుకు కన్యాశుల్కం చెల్లించాలి. ఇంటికాడ పనికి ఆసరా ఎవరూ లేకపోతే ఒక్కోసారి ఆడపిల్ల తండ్రి పడుచు పిల్లవాడికి తన బిడ్డనిస్తానని చెప్పి లామాడి (ఇల్లరికం) తెచ్చుకుంటారు. ఇక్కడా అమ్మాయి ఇష్టంతో పని లేదు. పిల్ల దొరక్క పెళ్లి కాని యువకుడు తన బలగాన్ని తీసుకొనిపోయి ఆడపిల్ల ఇంటి మీదికి పోయి పిల్లనివ్వమని అల్లరి చేస్తారు. ఇంకా పాత రోజుల్లో ఒంటరిగా అమ్మాయి కనపడితే ఎత్తుకుపోయేవాళ్లట. అయితే ఇష్టమైన వాడి ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా అమ్మాయికి ఉంటుంది. దీన్ని ఇల్లు చొచ్చడం అంటారు. తర్వాత ఆమెనతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తంతుకు బాగానే ఖర్చు పెట్టాలి. ఆ వెసులుబాటు లేకుంటే వాయిదా వేసుకోవచ్చు గాని ఆ తంతు జరిపేవరకు ఊరి పెద్దలకు యేటా డబ్బు చెల్లించాలి.
పెళ్ళయిన యువతుల మీద ఎన్నో ఆంక్షలు. పెళ్లి కాగానే మొదట చీరె, రవిక తీసేసి టవల్ వంటి చాలీచాలని గుడ్డ కట్టుకోవాలి. దానితో వారి అవస్థ వర్ణనాతీతం. రాగో మాటల్లో చెప్పాలంటే ʹజానెడు కిందికి, బెత్తెడు మీదికిʹ. కింద కూచోవాలంటే టవల్ అంచులు దగ్గరగా పట్టుకొని ముడుకులు ఆనించి కూచోవాలి. ఇలా బట్టలు మార్చేయడంతో పాటు పెళ్ళవగానే గాజులు పగులగొట్టి, మాట్టెలూదదీసి, బొట్టు చెరిపేస్తారు. మామూలుగా ఈ పద్దతి హిందువుల్లో వితంతువుల విషయంలో చూస్తాం.
"పెళ్ళి అయి అత్తగారింటికి పోతే బావ కంటిముందు పడొద్దు. బావ పిల్లగాండ్లను పేరు పెట్టి పిల్వదు. భీమారిపడ్డ ఆడది కూడ బావ కచ్చరం (ఎడ్లబండి) ఎక్కొద్దు. ఎక్కితే దండుగ. ఇవన్నీ చావుబతుకులు చూడని రివాజులు. తల్లిగారింటికి వస్తే అనల్ పేను అని అంటుముట్టు పెట్టి వంట గదిలోనికే రానియ్యరుʹ అంటుంది రాగో. బహిష్టు సమయంలో ఐదు రోజులు ఇళ్ళకు దూరంగా ఏర్పాటు చేసిన గుడిసెలో ఒంటరిగా ఉండాలి. పాములు, విషప్పురుగుల భయం వెంటాడుతుంది. ఆ సమయంలో మగవాళ్ళ కంట పడకూడదు. పూజారి కంటబడితే జరిమానా వేస్తారు. తిండి దగ్గరా ఆంక్షలే.
ఈ స్థితి నుండే ʹరాగోʹ ʹజైనిʹ అవుతుంది. ఆమె స్వేచ్చ మొత్తం ఆదివాసీ మహిళల స్వేచ్చతో ముడిపడి ఉన్నదని అర్థం చేసుకున్నందుకే ఆమె ఉద్యమంలో భాగమవుతుంది. మహిళలే కాదు, ఆదివాసీ సమాజం మొత్తం ఎంత అణచివేతకు గురవుతున్నదో అర్థం చేసుకుంటుంది. తెగ పెద్దల ఆధిపత్యానికి ఆడుకట్ట వేస్తూ వారి పంచాయితీ తీర్పులను ప్రజల ముందు రద్దు చేస్తుంది. ఇవన్నీ మొత్తంగా వ్యవస్థతో ముడిపడి ఉన్న అంశాలు గనకనే వర్గపోరాటంలో భాగంగా వాటిని పరిష్కరించే మార్గంలో రాటుదేలుతుంది.
ముప్పై ఏళ్ల తర్వాత చూసుకుంటే ఇవాళ ఉద్యమం అక్కడ ఎంతో మార్పు తీసుకొని వచ్చింది. ఈ మార్పు క్రమం తర్వాత వచ్చిన దండకారణ్య కథల్లో కనపడుతుంది. అంటే ʹరాగోʹ ద్వారా ఎందరో రాగోల ʹసృజనʹ జరిగింది. ఏ ప్రభుత్వాలు చేయలేని పని విప్లవోద్యమం చేసింది. రాగో ఎన్నో ప్రశ్నలకు సమాధానం అయింది. సమాధానంగా తన జీవితమే ప్రజల ముందు పెట్టింది. ఉద్యమం రాగోకు, అంటే ఆదివాసీ మహిళలకు ఏమిచ్చిందో, వాళ్ళ నుండి అంత నేర్చుకుంది. ఈ ముప్పై ఏళ్ల రాగో ఆచరణ గురించి నిర్దిష్టంగా తెలీదు కానీ రూపొందుతున్న రాగోల రూపంలో, మహిళా ఉద్యమం రూపంలో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో ఏ మహిళా సంఘాలకు లేనంత సభ్యత్వం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘానికుంది. అక్కడి జనతన సర్కార్లలో సగం మంది మహిళలే.
రాగో స్వేచ్చను కోరుకుంది. తాను కోరుకున్న స్వేచ్చను పొందడమే కాదు, ఎందరికో దానిని అనుభవంలోకి తెచ్చింది. రాగో జల్ జంగల్ జమీన్లపై ఆదివాసుల హక్కు కోసం పోరాడి ఒరిగింది. రాగో ఒక పాత్ర మాత్రమే కాదని ఆమె మరణ సందర్భంలో తెలుసుకోవడం ఎంత విషాదమో, అంత అద్భుతం కూడా. మిత్రులు కరుణాకర్ అన్నట్లు ʹసృజన హత్యతో నవలా నాయకిగా రాగోకు ఒక భౌతిక అస్తిత్వం ఉందని నిర్ధారణయింది. అలా కాల్పనిక పాత్రయిన రాగో తనకు మాతృకయిన వ్యక్తితో మరణాంతర కొనసాగింపయింది.ʹ
మా ఊర్లో మారాజ్యం అంటూ పోరాడుతున్న ఆదివాసులకు భారత రాజ్యాంగం 5 షెడ్యుల్ ప్రకారంమైనా వారి అనుమతి లేకుండా బైటి ప్రాంతాల పెట్టుబడిదారులను అడవుల్లోకి ప్రవేశంచనివ్వకూడదు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? పెట్టుబడిదారుల కోసం అడవిని ఆక్రమించడానికి బలగాలను పంపుతుంది. వాళ్ళు ఇళ్ళు తగలబెట్టి హత్యలు, అత్యాచారాలు చేస్తారు. ఇది ఎంత అప్రతిహతంగా సాగుతోంది అంటే దేశమంతా లాక్ డౌన్ తో స్థంబించిపోయినా రాగోలను వేటాడటం ఆగలేదు. గుంపులుగా దాడి చేస్తున్న పారా మిలిటరీ బలగాల ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లోకి కరోనా వ్యాపించే ప్రమాదముంది. కానీ మందిస్తే తగ్గిపోయే మలేరియాతో చనిపోతుంటేనే పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్ వ్యాప్తిని పట్టించుకుంటాయా? అసలు వాళ్ళు పోతున్నదే నిర్మూలించడానికాయె. మరి పారా మిలిటరీ బలగాల్లోనూ కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే అటువంటివి వింటున్నాం కూడా. అయితే బాడా బాబుల కోసం ప్రాణాలను బలిచెయ్యడానికే ఆ బలగాలున్నాయని ప్రభుత్వం భావిస్తుండవచ్చు. ఈ ఎన్కౌంటర్ కూడా ఎలా జరిగిందీ అంటే కరోనా నివారణ చర్యలు ప్రచారం చేస్తుండగా లాక్ డౌన్ పాటించని బలగాలు దాడి చేయడం వల్ల. రాగో ఏం కోరుకుంది? ఏ లక్ష్యం కోసం పోరాడింది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఏ లక్ష్యం కోసం రాగోలను చంపుతున్నది? పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు అని మాట్లాడే మేధావులకు మాత్రమే కాదు, రాగో ఏమవుతుంది అని సందేహించిన వాళ్లకు కూడా సమాధానం అయింది రాగో. రాగో మార్గం అలా ఉంచి రాగో మాటలైనా వినే సంసిద్ధత నాగరిక సమాజానికుందా?
-పి.వరలక్ష్మి

Keywords : rago, maoists, srujana, jaini, police, fake encounter
(2020-06-03 20:10:33)No. of visitors : 1085

Suggested Posts


కామ్రేడ్ సృజన అమరత్వంపై మావోయిస్టు పార్టీ ప్రకటన...20న గడ్చిరోలి జిల్లా బంద్ కు పిలుపు

మే 2 నాడు గడ్చిరోలి జిల్లా, ఏటపల్లి తాలూకా, జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న సీన్‌భట్టి అటవీ ప్రాంతంలో నరహంతక పోలీసు కమాండోలు సి-60 చేసిన దాడిలో ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలు సీనియర్ మహిళా ప్రజా నాయకురాలు కామ్రేడ్ సృజనక్క @జైనక్క తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసింది.

ʹరాగోʹ @ సృజనక్కను చంపేశారు ‌

సాధన రాసిన ʹరాగోʹ నవల తెలుగు సమాజంలో విప్లవాభిమానులు చదవని వారుండరు. రాగో పాత్రను ప్రేమించనివారుండరు. బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ʹరాగోʹ. తను అనుభవించిన క్షోభ,స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మిగతా స్తీలందరిలోనూ చూస్తుంది రాగో.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


రాగో