ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ

ఏడు


సరిగ్గా నెల కింద, జూలై 11 సాయంకాలం వరవరరావు గారి నుంచి వచ్చిన ఫోన్, ఆయన మాటల్లో పొంతన లేకపోవడం, ఆయన దగ్గరి నుంచి ఫోన్ తీసుకున్న సహ ఖైదీ ఆయన శారీరక, మానసిక ఆరోగ్య స్థితి గురించి అత్యంత విచారకరమైన విషయాలు చెప్పడం కుటుంబ సభ్యులకూ, అభిమానులకూ, విప్లవ, వామపక్ష, ప్రజాస్వామిక శిబిరంలో వేలాది, లక్షలాది మందికి భయానకమైన ఆందోళన కలిగించాయి. ఈ ఏడు వందల ఇరవై గంటల్లో తెలుగు రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆ ఆందోళన, నిరసన, సంఘీభావం, విడుదల కోసం తీవ్రమైన ఆకాంక్షల ప్రకటనలు వెల్లువెత్తాయి. పౌర సమాజం, బుద్ధిజీవులు, ఆలోచనాపరులు, కవులు, రచయితలు, సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున ప్రశంసనీయమైన ప్రతిస్పందన చూపారు. అయినా ఇప్పటికీ, ఏడువందల ఇరవై గంటల ఆవేదన, ఆందోళన తర్వాత కూడ ఎటువంటి ఉపశమనం, కనీసం ఆశారేఖ కనుచూపు మేరలో లేదు. పాలకవర్గాలు, ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, జైలు అధికారవర్గం, ఆస్పత్రి అధికారులు, న్యాయవ్యవస్థ – అన్ని వ్యవస్థా నిర్మాణాలు ఎంత నిర్దాక్షిణ్యంగా, కనీస చట్టబద్ధ, ప్రజాస్వామిక, మానవీయ విలువలు లేకుండా ఉన్నాయో, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తున్నాయో ఈ నెల రోజుల పరిణామాలు చూపుతున్నాయి.

ఈ నెల రోజుల్లో ప్రజల వైపు నుంచి, పౌర సమాజం వైపు నుంచి వెల్లువెత్తిన సంఘీభావాన్ని నమోదు చేసి దాన్ని ఎత్తిపట్టవలసి ఉన్నది. ధన్యవాదాలు చెప్పవలసి ఉన్నది. అలాగే ఈ నెల రోజుల్లో ఒకవైపు మనిషి చావు బతుకుల్లో ఉంటే అన్ని అధికార వ్యవస్థలూ ఎటువంటి తాత్సారం ప్రదర్శించాయో, ఎన్నెన్ని అసత్యాలు, అర్ధసత్యాలు, డొంకతిరుగుడు, దుర్మార్గ వాదనలు ముందుకు తెచ్చాయో కూడ నమోదు చేయవలసి ఉన్నది. లెక్కలు తేల్చుకునే రోజు కోసం గుర్తుంచుకోవలసి ఉన్నది.

జూలై 11 సాయంత్రం వివి నుంచి మామూలుగా ఫోన్ వచ్చింది. (కొవిడ్ – లాక్ డౌన్ సందర్భంలో ఖైదీలకు కుటుంబసభ్యులతో, న్యాయవాదులతో ములాఖాత్ లు, ఉత్తరాలు రద్దు చేసినందువల్ల, వారికి వారానికి ఒకసారి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడే సౌకర్యం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దొరికిన ఫోన్ సౌకర్యం ఇది. కాని వరవరరావు గారి విషయంలోనూ, భీమాకోరేగాం కేసులో సహనిందితుల విషయంలోనూ జైలు అధికారులు వారానికొకసారి ఫోన్ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఒకసారి పద్దెనిమిది రోజుల వరకూ కూడ ఫోన్ ఇవ్వకుండా ఉన్నారు). అప్పటికే ఆయన మే 28 నుంచి జూన్ 1 వరకు ముంబాయి లోని సర్ జెజె ఆస్పత్రిలో చేర్చబడి, ʹకుదుట పడ్డారని, కోలుకున్నారనిʹ వైద్యుల నివేదికతో డిశ్చార్జి చేయబడి, తిరిగి జైలుకు వచ్చాక నలబై రోజులుగా జైలులో ఆస్పత్రి అనబడే వార్డులో ఉంటున్నారు. ఆ ఆస్పత్రి వార్డు నుంచే ఆయన అంతకు ముందు జూన్ 24న, జూలై 2న రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు.

ఆ రెండుసార్లు కూడ మాట తడబడడం, మాటల కోసం వెతుక్కోవడం, బలహీనంగా మాట్లాడడం, కొంతవరకు జ్ఞాపకశక్తి లేకుండా, పొంతన లేకుండా మాట్లాడడం విని ఆందోళనలో ఉన్నవాళ్లం, ఈ జూలై 11 ఫోన్ లో ఆయన మాట్లాడిన ఒకటి రెండు వాక్యాలతోనే హతాశులమయ్యాం. ఆ వాక్యాలు ఎంత మాత్రమూ పొంతన లేనివీ, ఏదో ఊహాలోకంలో ఉన్నవీ, డెబ్బై సంవత్సరాల కింది గతం గురించి మాట్లాడినవీ కావడంతో అవి విని బాధతో, దుఃఖంతో, భయంతో వణికిపోయాం. ఆయన అలా మాట్లాడుతుండగానే పక్కన ఉన్న సహఖైదీ వర్నన్ గోంజాల్వెస్ ఆ ఫోన్ తీసుకుని వివి సొంతంగా నడవలేని స్థితిలో ఉన్నారని, కాలకృత్యాలకు కూడ తానే నడిపించుకుని తీసుకు పోతున్నానని, పళ్లు తోముకోవడానికి కూడ తన సాయం అవసరమవుతున్నదని, శారీరక స్థితి అలా ఉండగా, మానసికంగా చాల కలత చెందినట్టున్నారని, రోజంతా ఏవేవో సంబంధం లేని, పొంతన లేని మాటలు పరాకుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పాడు.

ఆయనను ఫిబ్రవరి 29న తలోజా జైలుకు మార్చారు. మార్చి మూడోవారం నుంచీ కొవిడ్ - లాక్ డౌన్ వల్ల పత్రికలూ, పుస్తకాలూ, కుటుంబ ములాఖాత్ లూ, న్యాయవాది ములాఖాత్ లూ రద్దు చేశారు. అలా ఈ జూలై 11 ఫోన్ కు ముందరి నాలుగున్నర నెలలు మనుషులు కలవక, మరాఠీ జవాన్ల మధ్య మాట్లాడే మనిషి లేక, పత్రికలూ పుస్తకాలూ లేక, శారీరక ఆరోగ్యం దిగజారుతుంటే చికిత్సలేక, రక్తంలో సోడియం, పొటాషియం పడిపోతుంటే చికిత్స జరగక, మెదడు కణాలు దెబ్బతినడం మొదలయింది. ఆ స్థితికి ఫలితమే జూలై 11 ఫోన్ మాటలు.

ఆ మాటలతో వణికిపోయిన మేం, తక్షణమే ఏదైనా చేయాలని ఆందోళన పడ్డాం. ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవలసింది న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తేగల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు.

వీరిలో న్యాయవ్యవస్థ ముందర ఇప్పటికే అనేకసార్లు బెయిల్ దరఖాస్తులు దాఖలై తిరస్కరణకు గురయ్యాయి. ఆరోగ్యం, వయసు, కొవిడ్ రాగల ప్రమాదం కారణాలతో దాఖలైన ఐదో బెయిల్ దరఖాస్తు జూన్ 26న ఎన్ ఐ ఎ స్పెషల్ సెషన్స్ కోర్టులో తిరస్కరణకు గురయింది. ఆ తిరస్కరణ మీద హైకోర్టులో వేసిన అప్పీలు మీద వాయిదాలు, వాదనలు సా......గు....తూ......నే ఉన్నాయి.

ప్రభుత్వానికి కూడ ఎన్నో సార్లు ఎన్నో రూపాల్లో ఈ కేసు ఎంత అబద్ధమైనదో, చూపుతున్న సాక్ష్యాధారాలు ఎలా తయారు చేసినవో, ఇది ఎలా ప్రత్యామ్నాయ ప్రజా స్వరాలను వినిపించకుండా చేయడానికి జరుగుతున్న కుటిల యత్నమో వివరించే ప్రయత్నం జరిగింది. కేసును ఎత్తి వేయాలనీ, కనీసం బెయిల్ ఇవ్వాలనీ, న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడానికి వీలుగా అడ్డంకులు తొలగించాలనీ విజ్ఞప్తులూ డిమాండ్లూ రాష్ట్రపతి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎంతమందికో అందాయి.

ఆ స్థితిలో న్యాయవ్యవస్థనైనా, ప్రభుత్వ యంత్రాంగాన్నైనా కదల్చడానికి నిజమైన శక్తి ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లడం కన్న మరొక మార్గం లేకపోయింది. తమ ప్రియమైన కవి ఎట్లా ఉన్నారో, ఆయన పట్ల పాలకవర్గాలు ఎటువంటి కక్ష చూపుతున్నాయో, ఆయనను తక్షణమే విడిపించుకొని ఆరోగ్యం బాగు చేయించుకోవలసిన అవసరం ఎంత ఉందో ప్రజలకు తెలియజెప్పడం, ప్రజాశక్తిని మేల్కొల్పడం మాత్రమే మిగిలింది.

అలా జూలై 12 ఉదయం జూమ్ ఉపయోగించుకుని ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. జూమ్ లో వందమంది మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉండడంతో, దాన్ని అదే సమయంలో ఫేస్ బుక్ మీద కూడ లైవ్ ప్రసారం అయ్యేలా చూశాం. ఆ పత్రికా సమావేశానికి ప్రజల నుంచి అపారమైన స్పందన వచ్చింది. అది ఎంతో మందిని కదిలించింది. ఇప్పుడు నెల గడిచాక చూస్తే దాన్ని మొత్తం ఇరవై వేల మంది చూశారు. దాదాపు నాలుగు వందల మంది షేర్ చేశారు.

అప్పటికప్పుడే ఆ వార్త ప్రపంచ వ్యాప్తంగా వందలాది దినపత్రికల్లో, చానళ్లలో, ఇతర పత్రికల్లో వచ్చింది. ఆ సమావేశంలో మాట్లాడిన విషయాల ఆధారంగా వందలాది మంది సంపాదకీయం పేజీ వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ సంఘీభావ ప్రదర్శనలు, వివిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తో ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులైన 146 మంది విద్యావేత్తలు సంతకాల ప్రకటన చేశారు. దేశంలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, రొమిలా థాపర్ వంటి ప్రముఖులతో సహా వందలాది మంది కవులు, రచయితలు, మేధావులు వివిని విడుదల చేయమని డిమాండ్ చేశారు. అంతకు ముందు నుంచే దేశవ్యాప్తంగా విడుదల డిమాండ్ తో జరుగుతున్న ప్రదర్శనలు, ఉద్యమాలు ఎన్నో ఉండగా, ఈ పత్రికా సమావేశం తర్వాత అవి మరింత బలోపేతమయ్యాయి. దేశవ్యాప్తంగా వందలాది మంది కవులు వరవరరావు గారి నిర్బంధం మీద, విడుదల డిమాండ్ మీద కవితలు రాశారు. ఒక ఫేస్ బుక్ కవిత్వ పేజీ వివి విడుదల డిమాండ్ తో ఆయన కవిత్వాన్ని ఆయా భాషల్లోకి అనువదించి, చదివి ఆ పేజీ మీద పోస్ట్ చేయమని కోరితే కొద్ది గంటల్లోనే 26 అంతర్జాతీయ, దేశీయ భాషల్లో వివి కవితల అనువాదాలు చదివి పెట్టారు. ఐర్లాండ్ కు చెందిన సుప్రసిద్ధ కవి గాబ్రియెల్ రోజెన్ స్టాక్ వివి నిర్బంధం ఇతివృత్తంతో ఐరిష్ భాషలో రాసిన కవిత కొద్ది రోజుల్లోనే ఇంగ్లిష్, గ్రీక్, లాటిన్, ఫ్రెంచి, జర్మన్ తదితర అనేక భాషల్లోకి అనువాదమైంది. ఇండియన్ కల్చరల్ ఫోరం అనే వెబ్ సైట్ వివి విడుదల కోరుతూ డజన్లకొద్దీ సాహిత్య, సినిమా, కళా, సంగీత రంగ ప్రముఖుల సందేశాలు సేకరించి పోస్టర్లు తయారు చేసింది.

ఒకవైపు ప్రజాస్పందన ఇలా ఉండగా, మహారాష్ట్రలో, జాతీయ స్థాయిలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొందరు నాయకులు వివి ఆరోగ్య స్థితి గురించి తమ ఆందోళన ప్రకటిస్తూ, వెంటనే ఆయనను జైలు నుంచి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ లోగా జాతీయ మానవ హక్కుల సంఘం కూడ ఆయన ఆరోగ్యం విషయంలో తన ఆందోళనను మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. వీటిలో దేని ఫలితమో గాని జూలై 13న ఆయనను జైలు నుంచి సర్ జెజె ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రభుత్వ ఆస్పత్రే అంతకు నలబై రెండు రోజుల ముందు, ఆయన సోడియం, పొటాషియం కనీస స్థాయికి కూడ రాకముందే, అవి నిలకడగా ఉంటున్నాయో లేదో నిర్ధారించుకోక ముందే ఆయన ʹకుదుటపడ్డారని, నిలకడగా ఉన్నారనిʹ నివేదిక ఇచ్చి డిశ్చార్జి చేసి జైలుకు పంపింది. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ జూన్ 2 న రానుండగా, జూన్ 1న ఆయన బాగున్నారని డిశ్చార్జి చేసి ఆ బెయిల్ దరఖాస్తు కొట్టివేయడానికి కారణమైంది.

ఆయనను అలా ఆస్పత్రిలో చేర్చారని తెలియగానే ఆయనను చూడడానికి అనుమతించమని జైలు అధికారులను అడిగితే, జైలుకు వచ్చి అనుమతి పత్రం తీసుకుని ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. అలా జూలై 15న జైలు నుంచి అనుమతి పత్రం తీసుకుని ఆ మధ్యాహ్నానికి ఆస్పత్రికి వెళ్లాం. కొవిడ్ వల్ల ముంబాయి నగరం భయభీతావహంలో, అల్లకల్లోలంగా ఉంది. ఆస్పత్రిలో వార్డ్ బాయ్స్ లేరు. అరవై మంది పేషంట్లున్న వార్డును ఇద్దరు నర్సులు నడుపుతున్నారు. ఆ వార్డు ముందర ఐదారుగురు సాయుధ జవాన్లు కాపలాగా కూచున్నారు. మేం జైలు కాగితం చూపెట్టి లోపలికి వెళ్లేసరికి వివి ఆ వార్డులో ఒక మంచం మీద ఒక మూలన ముడుచుకుని కూచుని ఉన్నారు. మిగిలిన మంచం మీద దుప్పటి ఉచ్చలో తడిసి ఉంది. దాన్ని తీసేవారు లేరు. ఆయన అక్కడ ఒక అనాథగా ఉన్నారు. ఆధునిక ఆస్పత్రులలో బెడ్ పక్కన ఉండే డ్రిప్, కాథెటర్, ఆక్సీ మిటర్, ఇసిజి వంటి పరికరాలలో ఒక్కటి కూడ లేదు. కొవిడ్ పరీక్ష జరిపి, ఫలితం వెలువడేవరకూ ఉంచే ట్రాన్సిట్ వార్డు అది. అందువల్ల అక్కడ ఏ చికిత్సా జరగదట, పేషంట్లను ముట్టుకోను గూడ ముట్టుకోరట.

ఆయన మొదట మమ్మల్ని గుర్తు పట్టనే లేదు. తర్వాత కాస్త మనుషుల్లో పడ్డట్టు కనబడ్డారు గాని శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నదని, తక్షణమే విడుదల జరిగి, మనుషుల మధ్యకు, చదువులోకి, రాతలోకి, మెరుగైన వైద్యచికిత్సలోకి వస్తే తప్ప ఆరోగ్యం కుదుట పడదని మాకు అర్థమైంది. ఈ లోగానే జవాన్లు, నర్సులు వచ్చి మమ్మల్ని బైటికి తరిమేశారు.

ఆ మరుసటి రోజు, ఆయనను ప్రత్యక్షంగా చూసిన ఆ అనుభవాన్ని ఒక అఫిడవిట్ గా రాసి, ఆయనను బెయిల్ పై విడుదల చేయమని అడగడానికి అదనపు సమాచారంగా జోడించమని దాన్ని న్యాయవాదికి ఇచ్చాం. మళ్లీ ఒకసారి కలవనివ్వమని అడగడానికి ఆస్పత్రికి వెళ్లాం. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతిస్తూ జైలు ఉత్తరం మీదనే నోట్ రాశారు. అది తీసుకుని రెండో అంతస్తుకు వెళ్లేసరికి వార్డు లోపలికి వెళ్లనివ్వకుండానే ఒక జూనియర్ డాక్టరో, నర్సో, ʹఆయనకు కొవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కనుక కలవడానికి వీల్లేదు. కొవిడ్ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన సేంట్ జార్జెస్ కు పంపుతున్నాంʹ అన్నారు. మమ్మల్ని అక్కడి నుంచే వెనక్కి పంపేశారు.

ʹకొవిడ్ వచ్చే అవకాశం ఉంది, బెయిల్ ఇవ్వండిʹ అంటే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టును, ʹజైలులో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి, ప్రమాదం లేదుʹ అని చెప్పిన కోర్టును ఇప్పుడెవరు ప్రశ్నించాలి?

ఆస్పత్రిలో మేం చూసిన దృశ్యం బైటపెట్టిన తర్వాత, కొవిడ్ పాజిటివ్ సమాచారం కూడ బైటికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య స్థితి గురించి, జీవిత భద్రత గురించి మరింత ఆందోళన చెలరేగింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించమని జాతీయ మానవ హక్కుల సంఘం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పుడిక జూలై 18న ఆయనను నానావతి ఆస్పత్రికి తరలించారు.

ఇంత జరుగుతున్నా, ఆయన ఆరోగ్య స్థితి గురించి కుటుంబానికి వాస్తవ సమాచారం అధికారికంగా, పారదర్శకంగా ఇవ్వాలని ప్రభుత్వం, జైలు వ్యవస్థ, ఆస్పత్రి వ్యవస్థ అనుకోలేదు. అటువంటి అధికారిక వాస్తవ సమాచారం లేని స్థితిలో పుకార్లు, ఊహాగానాలు, నమ్మాలో నమ్మకూడదో తెలియని సమాచారం ప్రచారంలోకి వచ్చాయి. ఆయనకు డిమెన్షియా వచ్చిందని డాక్టర్లు అన్నారని ఒక పత్రిక రాసింది. ఆయన న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్నారని ఒక పత్రిక రాసింది. నానావతి ఆస్పత్రికి చేరేసరికి ఆయన తల మీద గాయం ఉందని, కుట్లు పడి ఉన్నాయని ఒక పత్రిక రాసింది.

మరొక వైపు జూలై 17న, అంటే ఆయనకు కొవిడ్ బైటపడిన మర్నాడు కోర్టులో బెయిల్ విచారణ ఉంది. ఈలోగా ఆస్పత్రి పరిస్థితి మీద మేం ఇచ్చిన కొత్త అఫిడవిట్ కోర్టుకు చేరింది, ఈలోగానే కొవిడ్ పాజిటివ్ ఫలితం వచ్చి ఉంది. కనీసం ఆయన ఆరోగ్య స్థితి ఎలా ఉందో కుటుంబానికి క్రమబద్ధంగా, పారదర్శకంగా, అధికారికంగా చెప్పమని ఆస్పత్రిని ఆదేశించాలి అనే పిటిషన్ ఉంది. కాని కోర్టు అవేవీ వినడానికి సిద్ధపడనే లేదు. ఉద్దేశపూర్వకంగానో, యథాలాపంగానో ఈ కేసును జాబితాలో యాబయో స్థానంలో, అరవయో స్థానంలో పెట్టి జూలై 17న, జూలై 20న, జూలై 23న అసలు విచారణకే రానివ్వలేదు. ఈలోగా ఎన్ ఐ ఎ ʹవరవర రావు వయసును, కొవిడ్ ను చూపి అనుచిత అవకాశం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు, బెయిల్ ఇవ్వగూడదుʹ అని ఒక కౌంటర్ పిటిషన్ వేసింది.

ఎట్టకేలకు జూలై 27న వాదనలు విన్న న్యాయమూర్తులు, మూడు రోజుల్లో మెడికల్ రిపోర్టు తమకు ఇమ్మని ఆస్పత్రిని ఆదేశించారు. ఆ రిపోర్టు తాము చూసి కుటుంబానికి ఇవ్వవచ్చునో లేదో తేలుస్తామన్నారు. కొవిడ్ పేషంట్లను కలుసుకునే విషయంలో ఆస్పత్రి నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు అనుమతిస్తే, కుటుంబాన్ని కలవడానికి అనుమతించాలన్నారు. కేసును ఆగస్ట్ 7కు వాయిదా వేశారు. పేషంట్ ఆరోగ్య స్థితి గురించి కుటుంబానికి చెప్పవచ్చునో లేదో తాము తేలుస్తామనడం ఏ నాగరిక మానవ సమాజపు విలువనో ఆ న్యాయమూర్తులకే తెలియాలి. ఇంతకూ ఒకవైపు పది రోజులకు వాయిదా వేస్తూ, రిపోర్టు మాత్రం మూడు రోజుల్లో ఇమ్మంటే, మరి ఆ రిపోర్టును కుటుంబానికి ఇవ్వాలని అనుకుంటే ఎప్పుడిస్తారో తేల్చలేదు!

ఆ తీర్పు వచ్చినప్పటి నుంచి ʹకుటుంబం కలవడానికి అనుమతి దొరికింది గదా, వెళ్తున్నారాʹ అని మిత్రులందరూ అడుగుతుండగా, మాకు మాత్రం ఆ తర్వాత మూడు రోజులు ఆస్పత్రికి ఉత్తరాలతో, మెసేజిలతో, ఫోన్లతోనే గడిచింది. చిట్టచివరికి కలవడానికి కొవిడ్ పేషంట్ల నిబంధనలు అనుమతించవని, వీడియో కాన్ఫరెన్స్ మాత్రం అనుమతిస్తామని చెప్పిన ఆస్పత్రి అధికారులు జూలై 31 మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తే ఆయన శారీరక ఆరోగ్యం ఏమీ బాగు లేదు. మేం జూలై 15న చూసినప్పటి కంటె ఒక్క రవ్వ మెరుగ్గా ఉన్నారు గాని, బలహీనంగా, పాలిపోయి, శక్తిలేకుండా, జుత్తు రాలిపోయి, పలచబడి ఆ సమ్మోహక ఆకారం పూర్తిగా మారిపోయి ఉంది. ఇక మానసికంగా ఇంకా స్వస్థత చేకూరలేదు. కనబడిన వాళ్లందరినీ గుర్తు పట్టినట్టే కనిపించారు గాని వర్తమానంలో లేరు. అడిగిన మామూలు ప్రశ్నలకు కూడ ప్రత్యక్షంగా సూటిగా సమాధానాలు లేవు. అడగకుండానే 1970ల, 80ల, 90ల జ్ఞాపక శకలాలు ఒక్కొక్కటి రెండు మూడు సార్లు మాట్లాడుతున్నారు. వర్తమానంలో కన్న ఎక్కువ గతంలో ఉన్నారు.

ఆ వీడియో కాన్ఫరెన్సే దుఃఖంలో మునిగి, ముగిసిందంటే ఆ తర్వాత పదకొండు రోజులుగా మరింత దుఃఖం, ఆందోళన కొనసాగుతున్నాయి. ఆరోగ్య స్థితి గురించి ఏ అధికారిక సమాచారం లేదు. ఆగస్ట్ 7 వాయిదా భారీ వర్షాల వల్ల కోర్టు కూచోక జరగనే లేదు. న్యాయవాదులు చాల ప్రయత్నించి, మరొక న్యాయమూర్తి ముందర ఆగస్ట్ 10 జాబితాలో ఈ కేసు చేర్పిస్తే, ఆ న్యాయమూర్తి భీమా కోరేగాం నిందితులలో ఒకరి న్యాయవాది తనకు బంధువు అవుతారనే కారణంతో ఆ నిందితుడి కేసు మాత్రమే కాక, మిగిలిన నిందితులందరి కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. మళ్లీ కేసు ఎవరి ముందుకు, ఎప్పుడు వస్తుందో తెలియదు.

అంటే, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడినప్పుడు కూడ, ఎనబై సంవత్సరాల, అనారోగ్య పీడితుడైన, ప్రముఖుడైన ఒక ప్రజా మేధావి విషయంలో జైలు, ఆస్పత్రి, న్యాయస్థానం, ప్రభుత్వం – అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయి. ఇలా విచారణలో ఉన్న ఖైదీల పట్ల నిర్ధాక్షిణ్యంగా, చట్టవ్యతిరేకంగా, అమానునుషంగా వ్యవహరించిన జైలు వ్యవస్థ, చికిత్స కోసం వచ్చిన రోగి విషయంలో నిర్లక్ష్యంగా, అమానుషంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆస్పత్రి వ్యవస్థ, మనిషి చావు బతుకుల సమస్యను కూడ అవసరమైన తీవ్రతతో పట్టించుకోకుండా తాత్సారంతో, అర్థరహితమైన నిబంధనలతో, అధికార గర్వంతో, అలసత్వంతో వ్యవహరించిన న్యాయవ్యవస్థ.... ఇంత విస్తారమైన సంఘీభావం పెల్లుబికిన సందర్భంలోనే, ఇంత సుప్రసిద్ధుడైన జనమేధావి విషయంలోనే ఇలా ప్రవర్తించాయంటే, నిస్సహాయులూ అమాయకులూ పీడితులూ గొంతులేనివారూ అయిన ఆదివాసులకు, దళితులకు, బహుజనులకు, మైనారిటీలకు, మహిళలకు ఈ దేశంలో న్యాయం దొరుకుతుందనే ఆశ ఉందా? ఈ వ్యవస్థకు మనుగడ ఉందా?
- ఎన్.వేణుగోపాల్
(ఎన్.వేణుగోపాల్ 11/08/2020న చేసిన ఫేస్ బుక్ పోస్ట్)

Keywords : varavararao, bhimakoregaon, maharashtra, high court,
(2024-04-18 14:45:59)



No. of visitors : 928

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏడు