కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం -ఎన్. వేణు గోపాల్


కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం -ఎన్. వేణు గోపాల్

కమ్ముకొస్తున్న

(వీక్షణం అక్టోబర్ 2020 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

భారతదేశంలో ఇప్పుడున్నది ఫాసిజమేనా, ఈ పాలనను ఫాసిజం అనవచ్చునా, అసలు ఫాసిజం అంటే ఏయే ప్రామాణిక లక్షణాలుండాలి, ఇవాళ భారత దేశంలో అమలవుతున్న పాలనకు ఆ లక్షణాలున్నాయా అని ఒకవైపు కొందరు మేధావులు పండిత చర్చలు సాగిస్తుండగానే, మరొకవైపు సంఘ్ పరివార్ పాలకవర్గాలు తమ ఫాసిస్టు కార్యక్రమాన్ని వడివడిగా ముందుకు సాగిస్తున్నాయి. నిజానికి భారత ఫాసిజం పెరుగుదలలో విభిన్న పాలకవర్గ ముఠాలన్నిటికీ, అసలు మన సమాజ నిర్మాణానికే ఎంతో కొంత పాత్ర ఉంది గాని ప్రస్తుతం అధికారపక్షంగా ఉన్న సంఘ్ పరివార్ ముఠా ఫాసిస్టు ఎజెండాను పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతున్నది. చివరికి భారత పాలకవర్గాలలోని ఇతర ముఠాల మీద కూడ దాడి చేస్తూ, నోరెత్తలేని పరిస్థితిని కల్పిస్తున్నది. ఇక దశాబ్దాలుగా సైద్ధాంతికంగానూ, ఆచరణలోనూ శత్రువులుగా భావిస్తున్న కమ్యూనిస్టుల మీద, మత మైనారిటీల మీద, ప్రత్యేకించి ముస్లింల మీద, దళిత బహుజనుల మీద, మహిళల మీద, స్వతంత్ర అస్తిత్వాన్ని ప్రకటిస్తున్న విభిన్న జాతుల మీద సంఘ్ పరివార్ ఫాసిజం దారుణ దమనకాండను సాగిస్తున్నది. సంఘ్ పరివార్ సిద్ధాంత కర్తలు 1930లలోనే ముస్సోలినీ-హిట్లర్ లను, ఫాసిజాన్ని సమర్థించారనే చారిత్రక వాస్తవంతో పాటు, ఈ ఏడెనిమిది దశాబ్దాలుగా సంఘ్ పరివార్ సాగిస్తున్న ఆచరణ అంతా దాని అంతిమ లక్ష్యానికి చేరువవుతున్న సూచనలు గత ఐదారు సంవత్సరాలుగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాసిజం గురించీ, దాని ప్రమాదం గురించీ మరింత ఎక్కువగా, కూలంకషంగా, సునిశితంగా తెలుసుకోవలసిన అవసరం, ప్రజల్లో ప్రచారం చేసి ఫాసిజానికి క్రియాశీల వ్యతిరేకతను సమీకరించవలసిన అవసరం పెరుగుతున్నది.
భారత మేధో రంగంలో, ప్రత్యేకించి మార్క్సిస్టు శిబిరంలోని ఆలోచనాపరులలోనూ, ఉదార ప్రజాస్వామికవాదుల లోనూ గత ఏడెనిమిది దశాబ్దాలలో ఫాసిజం గురించి చాల ఎక్కువ చర్చే జరిగింది. అయినా అంతర్జాతీయ ఫాసిజంలోని కీలకమైన భావనల మీద, భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతల మీద, ఫాసిస్టు ప్రమాదం మీద, ఫాసిస్టు వ్యతిరేక కార్యాచరణ మీద ఇప్పటికీ తగినంత స్పష్టత రాలేదనిపిస్తుంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో పెచ్చరిల్లిన ఇటాలియన్, జర్మన్, స్పానిష్ ఫాసిస్టు నియంతృత్వాల గురించి దేశంలో అప్పుడు పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన ఏర్పడి, ఫాసిస్టు వ్యతిరేక భావజాల ప్రచారం గణనీయంగానే జరిగింది. కాని రెండో ప్రపంచ యుద్ధం ముగింపుతో, వలసానంతర ప్రభుత్వ స్థాపనతో ఫాసిజం ప్రమాదం అంతరించినట్టుగా భావించి, ఫాసిస్టు వ్యతిరేక భావజాల ప్రచారం, కార్యాచరణ ఆగిపోయాయి. ఆ తర్వాతి రెండు దశకాలలో ఫాసిజం గురించి చరిత్రగానే తప్ప వర్తమాన ప్రమాదంగా, భవిష్యత్తు ప్రమాదంగా అధ్యయనం, చర్చ జరగలేదు. ఇందిరాగాంధీ 1970 దశకంలో అమలు చేసిన విధానాలను, ప్రత్యేకించి ఎమర్జెన్సీని ఫాసిజం అని మార్క్సిస్టు లెనినిస్టు శక్తుల నుంచి గాంధేయ, సర్వోదయ వాదుల దాకా భావించారు. కాని అదే సమయంలో ఇందిరా గాంధీ అమలు చేస్తున్నవి ప్రగతిశీల విధానాలనీ, ఆ ప్రజాస్వామ్య పాలనను కూల్చడానికే అమెరికా, సిఐఎ ప్రోత్సాహంతో జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఫాసిజం ప్రయత్నిస్తున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ భావించింది, ఇందిరా గాంధీకి అనుకూల ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం కూడ చేసింది.
ఆ తర్వాత గడిచిన మూడు నాలుగు దశాబ్దాలలో ఫాసిజం అనే ప్రస్తావన పైపైన మాత్రమే, ఒక నినాదంగా మాత్రమే అప్పుడప్పుడు వచ్చింది గాని భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకత గురించి లోతైన చర్చ జరగలేదు. సిక్కుల ఊచకోత సందర్భంలో, 1984 తర్వాత కాంగ్రెస్ ఫాసిజం మీద, ముస్లింల విషయంలోనూ మొత్తంగానూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫాసిజం మీద కొంత చర్చ జరిగింది. మొత్తానికి ఆర్ ఎస్ ఎస్ ఒక్కటే భారత ఫాసిజానికి ముఖం అనీ, దాని రూపం హిందూ మతోన్మాదం అనీ అభిప్రాయాలు బలంగానే ఉండిపోయాయి. అందువల్లనే, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో అధికారానికి వచ్చి అమలు చేసిన విధానాలను, దేశవ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ జరిపిన మత మారణకాండలను, ప్రత్యేకించి గుజరాత్ మారణకాండను ఫాసిజపు వ్యక్తీకరణలుగా గుర్తించే చర్చలు జరిగాయి. ఇక 2014లో మోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమలు చేస్తున్న విధానాలు ఫాసిస్టు పాలన అనే చర్చ పెరిగింది.
ఈ మొత్తం చర్చలో ఫాసిజం అంటే మతోన్మాదం అనే సరళమైన సూత్రీకరణ, భారత ఫాసిజాన్ని ఒక పాలకవర్గ ముఠాకు మాత్రమే పరిమితమైనదిగా చూడడం, మిగిలిన పాలకవర్గ ముఠాలలో, అసలు మొత్తానికి భారత సమాజ నిర్మాణంలో ఫాసిజానికి ఉన్న అవకాశాల్ని విస్మరించడం, ఫాసిజానికి ఉన్న సాంస్కృతిక కోణాల్ని మాత్రమే చూస్తూ, దాని రాజకీయార్థిక కోణాల్ని విస్మరించడం వంటి లోపాలు జరిగాయి.
ఈ ఆరు సంవత్సరాలలో ఫాసిస్టు దౌర్జన్య ఘటనలుగా చెప్పదగినవి విపరీతంగా పెరిగిపోయి, ప్రతి ఒక్కరూ ఫాసిజం గురించి ఆలోచించక తపని స్థితి కల్పించాయి. అనేక ప్రజా సమూహాల మీద రాజ్య బలగాల దుర్మార్గం, రాజ్యం అండతో హిందుత్వ మూకల, ఆధిపత్య కులాల, గోరక్షక ముఠాల దుర్మార్గం విచ్చలవిడిగా జరుగుతున్న మాట నిజమే. కాని ఈ ఘటనలను ఘటనలుగా చూసి, వాటి మీద నిరసన ప్రకటించడం, కారకులను విమర్శించడం, శిక్షించాలని కోరడం ఎంత అవసరమో, అసలు ఈ ఘటనల మూల కారణాలను, ఆ కారణాల గత, వర్తమాన, భవిష్యత్తులను అర్థం చేసుకోవడం అంతే అవసరం. ఈ ఘటనలన్నీ కూడ ఫాసిజం విస్తరణకూ, విచ్చలవిడి ప్రవర్తనకూ చిహ్నాలు. 1920ల ఇటలీలో, 1930ల జర్మనీలో, స్పెయిన్ లో, 1960 ఇండొనేషియాలో ఫాసిజం ఇటువంటి ఘటనలతోనే ప్రారంభమై, చివరికి లక్షలాది మంది ప్రజలను ఊచకోత కోసింది, సమాజంలో భయభీతావహ పరిస్థితులు కల్పించి, ప్రగతిశీల ఆలోచనలకు తావు లేకుండా చేసింది. ఆ చరిత్రను గమనంలో ఉంచుకుంటే, ప్రస్తుత భయానక పరిణామాల చరిత్రనూ, స్వరూప స్వభావాలనూ ప్రజలకు విప్పిచెప్పి, ప్రతిఘటనకు వారిని ఉద్యుక్తుల్ని చేసేదాకా, విశాల ప్రజా ప్రతిఘటనను నిర్మించేదాకా ఫాసిస్టు ప్రమాదం ఈ దేశం నుంచి తొలగిపోదని అర్థమవుతుంది.
అసలు ఫాసిజం అంటే ఏమిటని నిర్వచిస్తూ, వివరిస్తూ, విమర్శిస్తూ, విశ్లేషిస్తూ గడిచిన వంద సంవత్సరాలలో వందలాది పుస్తకాలు వచ్చాయి, ఎంతో చర్చ జరిగింది. సరిగ్గా వంద సంవత్సరాల కింద, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, ఓడిపోయిన ఇటలీలోని ప్రజా అసంతృప్తిని వినియోగించుకుంటూ, 1919 మార్చ్ లో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తూ బెనిటో ముస్సోలినీ ఆ పార్టీకి ఫాసి డి కంబాటిమెంటో అని పేరు పెట్టడంతో, ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతం ఫాసిజం అని చెప్పుకోవడంతో ఈ మాట ఉనికిలోకి వచ్చింది. ఇటాలియన్ చరిత్ర నుంచి తీసుకున్న ఈ మాట మూలాలు గత వైభవం అనే అర్థం ఇస్తాయి. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే అధికారంలోకి వచ్చి ముస్సోలినీ అమలు చేసిన విధానాలను, ప్రత్యర్థుల మీద ప్రయోగించిన హింసా దౌర్జన్యాలను, ఆ పాలనలో ప్రయోజనం పొందిన వర్గాలను అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు ఫాసిజం సారం ఏమిటో రాయడం ప్రారంభించారు. ముస్సోలినీ ప్రేరణతో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్, స్పెయిన్ లో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో తమ విధానాలకు నాజీజం అనీ, ఫలాంగిజం అనీ భిన్నత్వం కోసం పేరు పెట్టుకున్నప్పటికీ వాస్తవంగా వారు అమలు చేసినది కూడ ఫాసిజమే. ఆ దశకంలోనే హంగరీలో మిక్లోస్ హోర్తీ, రుమేనియాలో మిరాన్ క్రిస్టే, డొమినికన్ రిపబ్లిక్ లో రాఫేల్ ట్రుజియో, పోర్చుగల్ లో ఆంటోనియో సలజార్, జపాన్ లో టోజో హిడెకి, గ్రీస్ లో అయొనెస్ మెటాక్సెస్ వంటి ఎందరో అభివృద్ధి నిరోధక, ప్రజావ్యతిరేక నియంతలు పుట్టుకొచ్చి, తమ తమ దేశాలలో వేరువేరు రూపాల ఫాసిజాన్ని అమలు చేశారు.
ఈ నేపథ్యంలోనే, ఫాసిజాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ప్రతిఘటించవలసిన అవసరాన్ని ప్రజలకు చెప్పడానికి 1928 జూలై - ఆగస్ట్ లలో జరిగిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రయత్నించింది. ʹనిర్దిష్ట చారిత్రక పరిస్థితుల్లో బూర్జువా, సామ్రాజ్యవాద, అభివృద్ధి నిరోధక దాడి ఒక క్రమ పరిణామంలో ఫాసిజం అనే రూపం ధరిస్తుంది. ఆ పరిస్థితులు: పెట్టుబడిదారీ సంబంధాల అస్థిరత, తమ వర్గ అస్తిత్వాన్ని మరిచిపోయిన గణనీయమైన శక్తులు ఉనికి లోకి రావడం, పట్టణ మధ్య తరగతి, పెటీ బూర్జువా, విద్యావంతుల సమూహంలో విశాల ప్రజా రాశులు మరింత దారిద్ర్యంలోకి దిగజారడం, గ్రామీణ పెటీ బూర్జువా శక్తులలో అసంతృప్తి పెరిగిపోవడం, చివరిగా, శ్రామికవర్గ ప్రజాశక్తుల కార్యాచరణ బలపడడం. ఈ స్థితిలో తమ పాలనను స్థిరపరచుకోవడానికి, కొనసాగించడానికి బూర్జువా వర్గం అంతకంతకూ ఎక్కువగా పార్లమెంటరీ వ్యవస్థను వదిలివేస్తూ, ఫాసిస్టు వ్యవస్థకు చేరువవుతుంది. ఆ ఫాసిస్టు వ్యవస్థ వివిధ పాలకవర్గ రాజకీయ పక్షాల మధ్య సర్దుబాట్లకూ, కలయికలకూ అతీతంగా ఉంటుందిʹ అని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ రాసింది.
ఈ వెలుగులోనే మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలెందరో ఫాసిజాన్ని విశ్లేషించారు. చాల తొలిరోజుల్లోనే ఆంటోనియో గ్రాంసీ, క్లారా జెట్కిన్, లియోన్ ట్రాట్స్కీ అమాడియో బోర్డిగా, జార్జి డిమిట్రావ్ వంటి ఎందరో మార్క్సిస్టులు ఫాసిజం మీద విశ్లేషణ ప్రకటించారు. ఇంకా హిట్లర్ తన అధికారంలో పూర్తిగా స్థిరపడక ముందే, 1934 మేలోనే బ్రిటిష్ మార్క్సిస్టు రజనీ పామీ దత్ రాసిన అద్భుతమైన విశ్లేషణ ʹఫాసిజం అండ్ సోషల్ రెవల్యూషన్ʹ ఫాసిజానికి ఏడు ప్రధాన లక్షణాలను సూత్రీకరించింది: 1. విస్తరిస్తున్న ఉత్పత్తి శక్తుల, వర్గ వైరుధ్యాల కాలంలో విప్లవాన్ని ఆపడం కోసం పెట్టుబడిదారీ విధానం చేసే ప్రయత్నం. 2. తత్ఫలితంగా పెరిగిపోయే పెట్టుబడిదారీ నియంతృత్వం. 3. కార్మికవర్గ ఉద్యమంపై అణచివేత. 4. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చడం. 5. పరిశ్రమలో, ద్రవ్య వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని విస్తరించడం. 6. సామ్రాజ్యవాద ఆర్థిక రాజకీయ శక్తుల కేంద్రీకరణ. 7. యుద్ధం అనివార్యమనే దిశగా కదలిక.
ఈ సూత్రీకరణ చేస్తూనే, ʹప్రతి ఒక్క దేశంలోనూ ఫాసిజం పెరుగుదల సరిగ్గా ఈ మార్గాన్నే చేపట్టాలని ఏమీ లేదుʹ అని కూడ రజనీ పామీ దత్ జాగ్రత్త చెప్పాడు. ʹతాము వివరించడానికి ప్రయత్నిస్తున్న నిర్దిష్ట వాస్తవికత ఒకటే అయినప్పటికీ, ఫాసిజం గురించి లెక్కలేనన్ని నిర్వచనాలు ఉన్నాయి. అవి విపరీతమైన భిన్నత్వంతో, చివరికి పరస్పర విరుద్ధంగా కూడ ఉన్నాయిʹ అని కూడ 1934లోనే అన్నాడంటే అప్పటికే ఫాసిజం మీద భిన్నమైన విశ్లేషణలున్నాయన్నమాట.
ఆ తర్వాత గడిచిన ఏడెనిమిది దశాబ్దాలలో ఫాసిజం మీద విశ్లేషణలు మరింత ఎక్కువగా జరిగాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన నిర్వచనం ఇటాలియన్ తత్వవేత్త అంబర్టో ఎకో 1995లో రాసిన ఒక వ్యాసంలో ఇచ్చినది. ఆయన ఫాసిజానికి పద్నాలుగు లక్షణాలను గుర్తించాడు: అవి. 1. కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం. 2. మానవహక్కుల పట్ల చిన్నచూపు. 3. శత్రువు బూచి చూపి కుహనా ఐక్యత సాధించడానికి ప్రయత్నించడం. 4. సైనిక, ఆయుధ శక్తి ప్రాధాన్యత. 5. స్త్రీల పట్ల చిన్నచూపు. 6. ప్రచార సాధనాల దుర్వినియోగం. 7. జాతీయ భద్రత ప్రాధాన్యత. 8. మతాన్ని, ప్రభుత్వాన్ని కలగలపడం. 9. కార్పొరేట్ శక్తుల పరిరక్షణ. 10. కార్మిక వర్గం మీద అణచివేత. 11. మేధావుల పట్ల, కళల పట్ల అసహనం. 12. పోలీసు రాజ్యం. 13. ఆశ్రిత పక్షపాతం, అవినీతి. 14. ఎన్నికల అక్రమాలు.
ఎనబై సంవత్సరాల కింద రజనీ పామీ దత్, ఇరవై ఐదు సంవత్సరాల కింద అంబర్టో ఎకో చేసిన విలువైన విశ్లేషణల్లో అత్యధిక భాగం భారత ఫాసిజానికి కూడ వర్తిస్తుంది. అయితే ఆ విశ్లేషణల ప్రాధాన్యతను గౌరవిస్తూనే, భారత సమాజ ప్రత్యేకతల నేపథ్యంలో ఇక్కడి ఫాసిజాన్ని ప్రత్యేకంగా నిర్వచించుకోవలసి ఉన్నది. వారు చెప్పిన లక్షణాలలో ఇక్కడ వర్తించేవాటిని అంగీకరిస్తూనే ఇక్కడి ఫాసిజపు లక్షణాలను నిర్దిష్టంగా అధ్యయనం చేసి అదనంగా కలుపుకోవలసి ఉన్నది. అలా భారత ఫాసిజం ప్రత్యేకతలను అధ్యయనం చేసేటప్పుడు ఒక శతాబ్ది ఆర్ ఎస్ ఎస్ చరిత్రతో పాటు, 1977 తర్వాత వివిధ రాష్ట్రాలలో, 1998 తర్వాత కేంద్రంలో అధికారానికి వచ్చిన, ప్రత్యేకంగా 2014 నుంచీ దూకుడుగా సాగుతున్న సంఘ్ పరివార్ పాలనా విధానాలనూ అధ్యయనం చేయవలసి ఉంటుంది. వలసానంతర పాలనలో ఐదు దశాబ్దాలపైగా ఆక్రమించిన కాంగ్రెస్ విధానాలు, వివిధ రాష్ట్రాలలో పాలించిన విభిన్న రాజకీయ పక్షాల విధానాలు భారత ఫాసిజానికి ఏ చేర్పులు చేశాయో అధ్యయనం చేయవలసి ఉంటుంది. రాజకీయార్థిక పాలనా విధానాల వైపు నుంచి మాత్రమే కాక, హిందూ బ్రాహ్మణీయ సంస్కృతి లోనే ఫాసిజం పెచ్చరిల్లడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఫాసిజానికి ప్రధానంగా ఉండే హింసాత్మక వ్యక్తీకరణలను అధ్యయనం చేయవలసి ఉంటుంది.
భారత పాలకవర్గాల ఫాసిజానికి సామ్రాజ్యవాద దళారీ, పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రయోజనాలను పరిరక్షించే లక్షణాలతో పాటే నిరిష్టంగా కుల అసమానతల సమర్థన, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం, మత దురహంకారం, జాతుల అణచివేత, భాషాధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యం వంటి లక్షణాలు కూడ ఉన్నాయి. ఫాసిజం భారతదేశంలో పొందిన నిర్దిష్ట చారిత్రక రూపం హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం. అందువల్ల భారత పాలకవర్గ ముఠాలన్నిటికీ ఎంతో కొంత, ఏదో ఒక దశలో ఫాసిజం లక్షణాలున్నప్పటికీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ఆ ఫాసిజానికి మూర్తీభవ రూపంగా గుర్తించవలసి ఉంది.
ఒకవైపు వలస వ్యతిరేక జాతీయోద్యమం ఉధృతంగా జరుగుతుండగా, వలసవాదాన్ని వ్యతిరేకించడం కోసం కాకుండా, ప్రజలను మతప్రాతిపదికన చీల్చడానికి పుట్టిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వంద సంవత్సరాల జీవితంలో ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా నిలబడిన చరిత్ర ఎంతమాత్రం లేదు. దాని పుట్టుక నుంచీ అది ఈ దేశ భూస్వామిక విలువల విస్తరణలో, సామ్రాజ్యవాద దళారీ ప్రయోజనాల పరిరక్షణలో మునిగి తేలుతూ ఉంది. వర్ణాశ్రమ ధర్మాన్నీ, మనుస్మృతినీ సమర్థించడం, ఈ దేశపు బహుళత్వ సంస్కృతిని తొక్కిపట్టి, హిందూ ఏకాత్మతను ప్రచారం చేయడం, అనేక కులాల, మతాల, ప్రాంతాల, భాషల, జాతుల, ఉత్పత్తి విధానాల సమ్మేళనమైన భారత సమాజాన్ని ఏకాత్మకంగా మార్చడం దాని లక్ష్యం. ఆ క్రమంలో కులాల నిచ్చెనమెట్ల వ్యవస్థను యథాతథంగా కాపాడడం, హిందూ మతాన్ని భారత సమాజంతో సమానం చేయడం, లేని భారత జాతిని ఉత్పత్తి చేసి, విభిన్న జాతుల ఆకాంక్షలనూ, రాజ్యాంగం కూడ అంగీకరించిన సమాఖ్య వ్యవస్థనూ ధ్వంసం చేయడం దాని కార్యక్రమం. బహుళత్వం నిండిన భారత చరిత్రను తుడిచేసి, హిందూ మతోన్మాద, వర్ణాశ్రమ ధర్మ చరిత్రనే భారత చరిత్రగా ప్రకటించడం దాని లక్ష్యం. ఈ లక్ష్యాల కోసం ఎంతటి హింసకైనా, ఎంతటి చరిత్ర వక్రీకరణకైనా తెగించడం దాని కార్యక్రమం. బ్రాహ్మణ దురహంకార పీష్వాలను ఓడించిన దళిత బహుజనుల చరిత్రను రద్దు చేసి, ఆ చరిత్రను స్మరించుకునే ప్రగతిశీల శక్తులను నిర్బంధాల పాలు చేసిన తాజా చరిత్ర దాని లక్ష్యాలకూ, కార్యక్రమాలకూ తిరుగులేని సాక్ష్యం.
గత ఆరున్నర సంవత్సరాలుగా వడివడిగా సాగివస్తున్న ఈ భారత ఫాసిజం జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతున్న, హతమైపోతున్న, బలహీనపడుతున్న భారత సమాజ బహుళత్వాన్ని చూస్తే, ఈ క్రమంలో బలోపేతమవుతున్న సామ్రాజ్యవాద, దళారీ కార్పొరేట్, భూస్వామ్య మత, కుల వ్యవస్థలను చూస్తే హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ఉద్దేశాలు తేటతెల్లమవుతాయి. ఈ దేశంలోకి ఇంకా ఫాసిజం రాలేదనో, అమలవుతున్నది ఫాసిజం కాదనో అనుకునేవాళ్లు, ఫాసిజం ప్రమాదాన్ని ఇంకా గుర్తించనివాళ్లు ఈ ఆరున్నర సంవత్సరాల్లో, ప్రత్యేకించి తిరిగి ఎన్నికైన తర్వాత గడిచిన ఏడాదిన్నరలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎంతగా ముంచుకు వస్తున్నదో అర్థమవుతుంది. అంతదూరం కూడ పోకపోయినా, కొవిడ్ మహావిపత్తు, లాక్ డౌన్ మొదలైన తర్వాత గడిచిన ఆరు నెలల్లో పాలకులు సాగిస్తున్న దమనకాండను చూసినా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ లలో కమ్యూనిస్టుల మీద, ఇతర మతస్తుల మీద, కార్మికవర్గం మీద, ప్రజాస్వామిక శక్తుల మీద ఫాసిస్టులు సాగించిన దమనకాండ పునరుక్తం అవుతున్న దృశ్యం కనబడుతుంది.
సరిగ్గా ముస్సోలినీ, హిట్లర్, ఫ్రాంకోలు కమ్యూనిస్టుల మీద ఎటువంటి చట్టబద్ధ, చట్టవ్యతిరేక దమనకాండ, వేధింపు, హింస, దౌర్జన్యం అమలు చేశారో భారత ఫాసిస్టు పాలకులు ప్రస్తుతం అర్బన్ నక్సలైట్లు, అర్బన్ మావోయిస్టులు పేరు మీద అటువంటి దమనకాండనే అమలు చేస్తున్నారు. అంతకు ముందు నుంచే విప్లవోద్యమం మీద సాగిస్తున్న మారణకాండకు అదనంగా, విప్లవోద్యమం గురించి బైటి సమాజంలో మాట్లాడే వారందరి గొంతులు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవస్థకు ప్రత్యామ్నాయాల గురించి ఎవరూ మాట్లాడడానికి, సమర్థించడానికి వీలులేని ఒక భయభీతావహ స్థితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. భీమా కోరేగాం కేసులో న్యాయవ్యవస్థను కూడ దుర్వినియోగం చేస్తూ, ప్రాసిక్యూషన్, జైలు, ఆస్పత్రి వంటి అన్ని వ్యవస్థలనూ కనీస చట్టబద్ధ పాలన, మానవతా విలువలు కూడ లేని స్థితికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పని తీరు చూస్తే, అది సరిగ్గా ఫాసిస్టు ఇటలీలో ఒవిఆర్ఎ, నాజీ జర్మనీలోని గెస్టపో, టోజో జపాన్ లో కెన్పెయిటాయి అనే హంతక పోలీసు వ్యవస్థలతో సమానంగా పనిచేస్తున్నది. పెట్టినవే అక్రమ కేసులు, సాగిస్తున్నవే వేధింపు కుట్రలు కాగా ఆ కేసులతో సంబంధం ఉన్నదనే సాకుతో వందలాది మందిని దర్యాప్తు పేరుతో పిలిచి, బెదిరించి, సామదానభేద దండోపాయాలు ఉపయోగించి వేధిస్తున్నారు. దేశంలో భిన్నస్వరాలు లేకుండా చేయడానికి, భిన్న స్వరాలకు మద్దతు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ భిన్నస్వరాలను తుడిచేసే కార్యక్రమంలో హిట్లర్ యూదుల మీద అమలు చేసినట్టుగానే, భారతదేశంలో ముస్లింల పట్ల అదే విధానం అమలు చేయాలని 1939లోనే గోల్వాల్కర్ రాసినట్టుగానే, ఇప్పుడు ముస్లింల మీద జాతి హననకాండ అమలవుతున్నది. అంతకు ముందు నాలుగు దశాబ్దాలుగా ఉత్తర భారత దేశంలో అనేకచోట్ల, ప్రత్యేకించి గుజరాత్ లో జరిగిన హంతక ప్రయోగాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా, జాతీయ జనాభా పట్టిక, అధికరణం 370 రద్దు, కశ్మీర్ అస్తిత్వాన్ని రద్దు చేసే కుటిల యత్నం, బాబ్రీ మసీదు స్థలాన్ని హిందువులకు అప్పగించిన సుప్రీంకోర్టు తీర్పు, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన, ఢిల్లీలో మతకల్లోలాల పేరిట ముస్లింల ఊచకోత, బాధితుల మీద, బాధితులకు సహాయం చేసిన వారి మీద క్రిమినల్ కేసులు, చివరికి పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుల మీద, విద్యార్థుల మీద, ప్రజా మేధావుల మీద, తమకు భిన్నంగా ఉన్నవారందరి మీద దాడులు, కేసులు – ముస్లింల మీద, వారికి మద్దతు ఇచ్చేవారి మీద సాగుతున్న ఈ హంతక దాడి జాబితా మాత్రమే చూసినా భారత హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ఎట్లా సమాజ విధ్వంసం వైపు, విద్వేషం వైపు పరుగులు పెడుతున్నదో అర్థమవుతుంది.
ఫాసిజం ఎప్పుడైనా ఒక వెయ్యి పడగల విషనాగు లాగ ఒక్కొక్క పడగనూ విప్పి, ఒక్కొక్క కోరనూ చాచి సమాజంలోని అన్ని వర్గాలనూ కాటు వేస్తుంది. అందుకు ఇరవయో శతాబ్ది చరిత్రే నిదర్శనం. సరిగ్గా అలాగే, భారత హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం విప్లవోద్యమం మీద, ముస్లిం ప్రజా సమూహం మీద దాడిని విస్తరిస్తూనే ఇతర వర్గాల మీదికి కూడ కోరలు చాస్తున్నది. దేశ ఖనిజ వనరులను బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ఆదివాసుల మీద, తన మనుధర్మ భావజాలం ప్రకారం దళితుల మీద, మహిళల మీద దాడులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నది. ఇప్పుడు రైతాంగం మీద, కార్మికుల మీద దాడుల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ దాడులలో భాగంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడ ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నది. దేశపు సమాఖ్య స్వభావాన్ని రద్దు చేసి ఒకే దేశం ఒకే పాలన, ఒకే మార్కెట్, ఒకే చట్టాలు, ఒకే మతం, ఒకే ఆహారపుటలవాట్లు, ఒకే ఆహార్యం అనే సర్వంసహాధికారాన్ని ప్రకటిస్తున్నది.
ఆరు సంవత్సరాల పాటు తన హంతక, విద్వేష, సమాజ విధ్వంసక రాజకీయాలను విస్తరిస్తూ వచ్చిన భారత ఫాసిస్టు పాలకులకు 2020 ప్రారంభంలో ప్రపంచాన్నీ, దేశాన్నీ చుట్టుముట్టిన కొవిడ్ మహావిపత్తు గొప్ప అవకాశంగా కలిసివచ్చింది. ఎంత భయానకమైన ప్రజావ్యతిరేక విధానాలు, నిర్ణయాలు ప్రకటించినా, అమలు చేసినా కొవిడ్ వల్ల ప్రజలు వీథుల్లోకి వచ్చి నిరసన, ప్రతిఘటన తెలియజేయడానికి అవకాశాలు తగ్గిపోయాయి గనుక, ఫాసిస్టు పాలకులు అత్యంత దుర్మార్గమైన విధానాలనూ చర్యలనూ ప్రవేశపెట్టడం, అమలు చేయడం ప్రారంభించారు. రాజ్యాంగబద్ధమైన సమాఖ్య భావనను ధ్వంసం చేస్తూ, రాష్ట్రప్రభుత్వాల హక్కులను హరిస్తూ, ఒకే దేశం ఒకే పన్ను విధానంగా తీసుకువచ్చిన జి ఎస్ టి చట్టం గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించారు. వ్యవసాయ రంగాన్ని బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్లకు అప్పగించడానికి చట్టాలు తెచ్చారు. కార్మికుల హక్కులను కొల్లగొట్టే కార్మిక చట్టాలు తెచ్చారు. దేశాన్ని బడా దళారీలైన అంబానీలకు, అదానీలకు అప్పగించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసేలా రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలను బహిష్కరించి, ప్రతిపక్షాలే లేని సభలో తమ విధానాలకు ఆమోదం పొందిందనిపించుకున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ʹఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజంʹ అని కాళోజీ ఎప్పుడో దశాబ్దాల కింద చెప్పిన మాటను సంఘ్ పరివార్ పాలకులు అక్షరాలా నిజం చేస్తున్నారు.
ఈ ఫాసిస్టు చర్యల అంతిమ లక్ష్యం రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలు సాధించడం, ఈ దేశ సంపదను దేశదేశాల సంపన్నులకు, బహుళ జాతి సంస్థలకు, దేశంలోని దళారీలకు, భూస్వాములకు దోచిపెట్టడం. ఈ విధానాలకు రాగల ప్రతిఘటనను అణచివేయడం. భూస్వామ్య, హిందూ బ్రాహ్మణీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించడం. అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఈ దేశ ప్రజల మెదళ్లలో నింపడం. ఈ లక్ష్యాలన్నీ సక్రమంగా అమలైతే లాభపడేది, ప్రయోజనం పొందేది ఈ దేశంలో భూస్వాములుగా, దళారీ పెట్టుబడిదారులుగా ఉన్న పిడికెడు మంది సంపన్నులు, అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలు, భావజాల పరంగా మనువాదులు. ఆ ప్రయోజనాల జల్లెడలోంచి జారిపడగా కొద్ది మంది ఉన్నత మధ్యతరగతి, మధ్యతరగతి వారికి కూడ కొన్ని మెతుకులు దొరకవచ్చు. మత, కుల ఆభిజాత్యాల తప్పుడు చైతన్యంలో ఉన్న మరికొందరికి నిజంగా ఏమీ దక్కకపోయినా, ఏదో దక్కిందన్న కుహనా సంతృప్తి అందవచ్చు. అలా ఈ ఫాసిస్టు విధానాల వల్ల లాభపడే వారు ఈ దేశ జనాభాలో ఎటువంటి పరిస్థితిలోనూ ఐదు, పది శాతానికి మించరు. కాని ఈ విధానాల పర్యవసనాలు, దుష్పరిణామాలు దేశంలో అసంఖ్యాక ప్రజానీకానికి, నూట ముప్పై కోట్ల మందికి, మత మైనారిటీలకు, ఆదివాసులకు, దళితులకు, బహుజనులకు, మహిళలకు, విభిన్న జాతులకు, ప్రగతిశీల శక్తులకు ప్రమాదకరమైనవి. అంటే ఈ ఫాసిజానికి అనుకూలమైనవారు ఐదు, పదిశాతం, వ్యతిరేకమైనవారు తొంబై, తొంబైఐదు శాతం ఉండడం ఒక వాస్తవం. కాని అటువైపు అత్యల్ప సంఖ్యాకులు ఉన్నంత ఐక్యంగా, సంఘటితంగా, ప్రణాళికాబద్ధంగా ఇటువైపు అత్యధిక సంఖ్యాకులు లేరనేది కూడ ఒక విషాద వాస్తవం.
ఈ చరిత్రను, ఈ వర్తమాన పరిణామాలను, రానున్న భవిష్యత్తును జాగ్రత్తగా మదింపు వేసి, విశాల ప్రజా రాశులకు ఈ ప్రమాదాలు విప్పిచెప్పి బలమైన ప్రజా ప్రతిఘటనను నిర్మించడమే ఇవాళ ప్రగతిశీల ఆలోచనాపరుల ముందున్న ఏకైక, ప్రధాన కర్తవ్యం.
(ఈ వ్యాసానికి తొలిరూపాలు గత పది పదిహేను సంవత్సరాల్లో చేసిన అనేక ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో ఉన్నాయి. ప్రధానమైనది, ʹహిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ప్రమాదం – ప్రగతిశీల శక్తుల కర్తవ్యాలుʹ అనే శీర్షికతో 2017 సెప్టెంబర్ 12న ఒంగోలులో చేసిన మాదాల నారాయణస్వామి స్మారకోపన్యాసం)
‍ - ఎన్.వేణు గోపాల్, సంపాదకులు, వీక్షణం ‍

Keywords : india, narendramodi, bjp, rss, fascism
(2020-11-28 21:26:29)No. of visitors : 306

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
more..


కమ్ముకొస్తున్న