ప్రతి మనిషి జేబులో పోలీసు!

ప్రతి

29-07-2021

వీక్షణం మాసపత్రిక ఆగస్ట్ 2021 సంపాదకీయం

ఒక హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు రాజ్యం ఎంత దుర్మార్గంగా ఉండడానికి అవకాశం ఉందో, నరేంద్ర మోడీ – అమిత్ షా ప్రభుత్వం ఆ అవకాశాల చిట్టచివరి పరిధిని తాకదలచుకున్నట్టుందని తాజాగా బైటపడిన పెగాసస్ స్పైవేర్ ఉదంతం బైటపెడుతున్నది. స్పైవేర్ అంటే వ్యక్తుల ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి వారికి తెలియకుండా జొరబడి, వారి సమాచారన్నంతా సంగ్రహించే, వారి మీద నిరంతర నిఘా ఉంచే సాంకేతిక పరిజ్ఞానం.

సాధారణంగా నిఘా పోలీసులు చేసే పని ఈ పరిజ్ఞానం చేస్తుంది. అంటే మీ జేబులో ఉన్న ఫోన్ మీ మీద నిరంతర నిఘా ఉంచే పోలీసుగా పనిచేస్తుంది. ఈ దేశంలో ప్రజల మీద ప్రజా ఉద్యమకారులమీద ప్రభుత్వాల నిఘా, అక్రమ గూఢచార కార్యకలాపాలు కొత్తవేమీ కాదు. వలస పాలనాకాలంలో అటువంటి నిఘా ప్రయత్నాలు మొదలయ్యాయి. స్వాతంత్ర్యోద్యమకారుల జీవితాల మీద, వారి కార్యాచరణల మీద, వారు సమాజంతో పెట్టుకుంటున్న సంబంధాల మీద, వారి ఉత్తర ప్రత్యుత్తరాల మీద, టెలిఫోన్ సంభాషణల మీద నిరంతర నిఘా పెట్టి, విరివిగా సమాచారం సేకరించడమే హోం శాఖ పనిగా ఉండింది.

వలసానంతర భారత ప్రభుత్వాలన్నీ కూడ చట్టబద్ధంగానూ, చట్టవ్యతిరేకంగానూ కూడ ఆ అక్రమ గూఢచార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయి. వలస పాలకులు ఇండియన్ టెలిగ్రాఫ్ ఆక్ట్ 1885 తెచ్చి గూఢచారానికి చట్టబద్ధ అనుమతి ఇచ్చుకున్ననాటి నుంచి, కొత్త సమాచార వినిమయ సాధనాల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ 2000 నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ప్రొసీజర్ ఫర్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఇంటర్సెప్షన్, మానిటరింగ్ అండ్ డిక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) రూల్స్ 2009 దాకా ప్రభుత్వాలు ప్రజల వ్యక్తిగత, గోప్య సమాచారాన్ని రాబట్టడానికి, దొంగిలించడానికి, చొరబడడానికి చట్టబద్ధ మార్గాలు తెరిచిపెట్టుకున్నాయి. మొదట పాలక – పాలిత ఘర్షణ, పాలితుల తిరుగుబాటు పట్ల పాలకుల భయం మాత్రమే ఈ గూఢచర్యానికి పునాదిగా ఉండేవి.

ఈ స్థితిలో సంఘ్ పరివార్ ప్రభుత్వాధికారాన్ని చేపట్టింది. హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులకు పాలకవర్గ స్వభావంతో పాటు, అదనంగా అంతరాలను, అసమానతను పోషించే, ప్రతి ఒక్కరినీ అనుమానించి, అణచివేయాలని చూసే మానసిక స్థితి ఉంటుంది. తమవారు కాకపోతే శత్రువులే అనే విద్వేష భావన ఉంటుంది. దేశభక్తి, సాంస్కృతిక జాతీయవాదం అనే పదాల మాటున ఆధిపత్యకులాల, పాలకవర్గాల ప్రయోజనాన్ని కాపాడే స్వయంసేవక మనస్తత్వం అది.

ఈ భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న నరేంద్ర మోడీ – అమిత్ షా అప్పటిదాకా సాగుతున్న అక్రమ గూఢచర్యానికి తమ వికృత, అమానుష మానసిక స్థితిని జోడించారు. వారికి సరిగ్గా వారిలాగనే ఆలోచించే దుష్టరాజ్యం ఇజ్రాయిల్ యూదు పాలకవర్గాలు తోడయ్యాయి. నిజానికి హిట్లర్ ముస్సోలినీల నాజీజాన్ని, ఫాసిజాన్ని అభిమానించే సంఘ పరివార్ కు, నాజీజం దుర్మార్గాలకు లక్షలాది మంది బలి అయిన యూదుల ఇజ్రాయెల్ కు చుక్కెదురు కావాలి. కాని ఇద్దరిలోనూ ఉన్న ముస్లిం వ్యతిరేకత వారిని ఒక్కదగ్గరికి తెచ్చింది.

ఏడు దశాబ్దాలలో మొట్టమొదటిసారి భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన 2017లో జరిగింది. ఇజ్రాయెలీ పాలకవర్గాల ప్రయోజనాలు కాపాడుతూ వారి కనుసన్నలలో నడిచే ఎన్ ఎస్ ఒ గ్రూప్ అనే కార్పొరేట్ సంస్థ తయారుచేసిన పెగాసస్ అనే అక్రమ గూఢచర్యపు సాఫ్ట్ వేర్ సంపాదించడానికి బహుశా మోడీ అప్పుడే ఒప్పందం కుదుర్చుకుని ఉంటారు. తాము చట్టబద్ధమైన ప్రభుత్వాలకు మాత్రమే తమ స్పైవేర్ ను అమ్ముతామని ఎన్ ఎస్ ఒ చెపుతున్నది. ఆ స్పైవేర్ ను భారతదేశంలో కనీసం 300 మొబైల్ ఫోన్ల మీద ఉపయోగించారని ఇప్పుడు బైటపడింది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్ కు చెందిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే స్వచ్ఛంద సంస్థ కలిసి ప్రారంభించిన ఈ స్పైవేర్ బాధితుల పరిశోధనలో వేరువేరు దేశాలలో యాబై వేల ఫోన్లు ఈ స్పైవేర్ బారిన పడ్డాయని తేలింది. భారతదేశంలో ఇప్పటికి బైటపడిన పేర్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎన్నికల కమిషన్ మాజీ అధినేత, ప్రతిపక్ష రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఉద్యమ కార్యకర్తలు వంటి ఎందరో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూల్చిన రాష్ట్ర ప్రభుత్వాధినేతల, వారి సన్నిహితుల ఫోన్లు ఆ కూల్చివేతల సమయంలో అక్రమ గూఢచర్యానికి గురయ్యాయి.

భీమా కోరేగాం కేసు నిందితుల, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడ ఆ జాబితాలో ఉన్నాయి. చివరికి తమ మంత్రివర్గంలోనే మోడీ-షా లు అనుమానానికి గురైన సహమంత్రుల ఫోన్లు కూడ ఈ నిఘా బారిన పడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మోడీ, షా లు తమకు గిట్టనివారందరి ఫోన్లు, తమకు ఎప్పుడైనా ప్రమాదం తేగలరని అనుకుంటున్న వారందరి ఫోన్ సంభాషణలు రహస్యంగా వింటున్నారన్నమాట.

సామ్రాజ్యవాద, భూస్వామ్య వర్గాలకు ఊడిగం చేస్తున్న తమ పాలనను సుస్థిరం చేసుకోవడం కోసం, ప్రజలను, ప్రజల తరఫున మాట్లాడుతున్న, రాస్తున్న, పోరాడుతున్న వారిని అణచివేయడం కోసం మోడీ, షా లు పన్నిన మహా షడ్యంత్రం ఇది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకూ, వ్యక్తిగత గోప్యతా హక్కుకూ, ప్రజాస్వామిక పాలనా సంప్రదాయాలకూ గొడ్డలిపెట్టు వంటి రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక, అనైతిక చర్య ఇది.

ఇవాళ ఇది ఏ మూడు వందల మంది మీదనో ప్రయోగించారని, అక్కడితో ఆగిపోతారని అనుకోవడానికి వీలులేదు. ఒకసారి ఆ రహస్య చొరబాటు సాధనం తమ చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలోకి రహస్యంగా తొంగిచూసే అవకాశం ప్రభుత్వానికి వచ్చినట్టే. కేవలం దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి విచ్చిన్నకరంగా ఉన్నవారి మీద మాత్రమే, చట్టబద్ధంగా మాత్రమే అది వాడుతున్నామని ఎంత చెప్పినా, ఆ వినియోగంలో భాగస్వాములైనవారు దాన్ని వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం వాడకుండా ఉంటారని హామీ లేదు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పత్రికా సంస్థల మీద మాత్రమే కాదు, అమిత్ షా కొడుకు అక్రమ వ్యాపార లావాదేవీల మీద వార్త రాసిన జర్నలిస్టు మీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగికవేధింపుల ఆరోపణ చేసిన మహిళ మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద అది ఉపయోగించారంటే, ఇప్పటికే అది ఎంత చట్టవ్యతిరేక, అనైతిక వినియోగానికి గురవుతున్నదో అర్థమవుతుంది. పాలకుల అక్రమ ప్రవర్తనను నగ్నంగా బైటపెట్టిన ఈ పెగాసస్ ఉదంతాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, పాలకుల దుర్నీతికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలకు సమాయత్తం చేయడం ప్రజాశక్తుల ముందున్న తక్షణ కర్తవ్యం.
- ఎన్.వేణుగోపాల్, సంపాదకులు, వీక్షణం

Keywords : narendra modi, amit shah, pegasus, scam, bhimakoregaon, BK16,
(2024-04-13 18:59:32)



No. of visitors : 1003

Suggested Posts


పెగాసస్ స్కాం: జర్నలిస్టు రూపేష్, అతని భార్యల ఫోన్లు హ్యాక్... సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

జర్నలిస్ట్, కార్యకర్త రూపేష్ కుమార్ సింగ్, అతని జీవిత భాగస్వామి, కార్యకర్త ఇప్సా శతాక్షి పెగాసస్ గూఢచర్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వారిద్దరి తరపున న్యాయవాది ప్రతీక్ కుమార్ చడ్డా ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రతి