సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు


సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు

సెప్టెంబర్

17-09-21

(విప్లవ రచయిత వరవరరావు రాసిన ఈ వ్యాసం 23-9-98, వార్త దిన పత్రికలో ప్రచురితమైనది.)

ముఖ్యమైన మార్పు చెప్పాలంటే రజాకార్ల దురంతాలు ఆగిపోయాయి. అయితే రజాకార్ల దురంతాలు ఆరంభమైన దగ్గర్నించీ ఆర్యసమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు సామాన్యప్రజలదాకా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. విజయాలు సాధిస్తూనే ఉన్నారు. దానికి వెలుపలినుంచి బలవత్తర రాజ్యం తోడ్పాటు దొరికింది. రజాకార్లకు నైజాం పోలీసు, రాజ్యం అండ ఉండేది. అంతమాత్రమేనా హిందూ ముస్లిం జాగీర్దార్ల, దేశముఖ్ , భూస్వాముల, పటేల్ పట్వారీల (భయంతోనో, భక్తితోనో) ప్రోత్సాహమో,, సహాయమో ఉండేది. సెప్టెంబర్ 13 నుంచి 17 దాకా వాళ్లను ఎదుర్కొనేవారికి (కమ్యూనిస్టులకు తప్ప) యూనియన్ మిలిటరీ, ప్రభుత్వాల ప్రత్యక్ష సహకారం లభించింది.

నైజాం రాజుతో నాలుగు నెలల ముందే నెహ్రూ, పటేల్ లు ఏ ఒప్పందం చేసుకున్నారో, ʹపోలీసుచర్యʹ తర్వాత కూడా ఆయనను ʹరాజప్రముఖ్ గా ఎంతకాలం కొనసాగనిచ్చారో, రాజభరణాలు ఎంతకాలం చెల్లించారో, ప్రిన్స్ మొకరాంజాహీకీ ఈ నాటికీ కేంద్రప్రభుత్వం కూడా ఎటువంటి హోదా ఇస్తున్నదో, రాజరిక ఆస్తుల విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా మెతకవైఖరి అవలంబించాయో అవన్నీ చరిత్రపుటలనిండా ఉన్న ఆధారాలే. కరణ్ సింగ్ వంటి హిందూ సంస్థానాధీశ్వరుల వలె అధికారాన్ని చవిచూడకపోవడానికి ఉస్మాన్ అలీఖాన్ కుటుంబానికి మతమే అడ్డువచ్చిందిగానీ రాజరికం మాత్రం కాదు.

రజాకార్లను ఎదుర్కొన్న విషయంలో తెలంగాణ ప్రజల పాత్రను, వాళ్లకు అండగా ఆర్యసమాజ్, కాంగ్రెస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పాత్ర ను మరుగు ప‌రచి ఇండియన్‌ యూనియన్లో సంస్థానాలను విలీనం చేసుకునే విధానంలో భాగంగా ʹపోలీసుచర్యʹకు కేంద్రప్రభుత్వం పూనుకుంటే అది అప్పటి హోంమంత్రి వల్లభభాయ్ పటేల్ వ్యక్తిగత విధానమూ, విషయమూ అయినట్లు, ఆయనకు ఇవ్వాళ కాషాయాంబరాలు వేయడం కూడా బిజెపికే చెల్లింది.

ఇక రెండవ అద్వితీయ విలువ యూనియన్ మిలిటరీ రజాకార్లకన్నా కమ్యూనిస్టుల కోసం వచ్చింది. రజాకార్ల పని సరిగ్గా నాలుగు రోజుల్లో అయిపోయింది. కాని కమ్యూనిస్టుల వేట మూడేళ్లు సాగింది. నైజాం కమ్యూనిస్టుల అణచివేత అతనికున్న అధికార పరిధి వల్ల హైదరాబాద్ సంస్థానానికి పరిమితమైతే యూనియన్ మిలిటరీ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రాంతమంతటా గాలించింది. 1946-48 మధ్య కాలంలో కమ్యూనిస్టు విప్లవకారులు, సానుభూతిపరులు వెయ్యిమంది అమరులైతే 48-51 మధ్యకాలంలో నాలుగువేలమంది బలి అయ్యారు. స్పష్టంగా సాయుధపోరాట విరమణ చేసి, ఆయుధాలు అప్పగించడానికి కూడ నెహ్రూ ముందు ఒప్పందం కుదిరాక గాని పిడిఎఫ్ నాయకత్వాన ఎన్నికల్లో పాల్గొనే విధానానికి ఒడబడినాక గానీ ఈ ఊచకోత ఆగలేదు.

తెలంగాణ సరే, నేడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలల్లో కనిపించే అమరవీరుల స్థూపాలన్ని అప్పుడు కొనసాగిన సాయుధ పోరాటంలో యూనియన్ మిలటరీ చేతుల్లో అసువులు బాసిన వారివే. కోస్తా జిల్లా (అగ్రకులాల) వాళ్లు తమ యుద్ధాన్ని తెలంగాణ గడ్డపై చేసారన్న ప్రత్యేక తెలంగాణవాదుల ఆరోపణ కూడ అవాస్తవం అన‌డానికి 48-51 మధ్యకాలంలో కోస్తా ఆంధ్రాలో సాగిన యూనియన్ దమనకాండే దాఖలా.

నెహ్రూ పటేల్ ప్రభుత్వం కమ్యూనిస్టులను అణచాలని ఎందుకనుకున్నది - అన్నది సిద్ధాంతపరంగా, చారిత్రక కారణాలతో వివరించడానికన్నా ముందు సెప్టెంబర్ 17 ముందుకు తెచ్చిన ఇంతకన్న ముఖ్యమైన విలువ గురించి తెలుసుకుందాం.
సెప్టెంబర్ 13న అన్నివైపుల నుంచి తెలంగాణలోకి యూనియన్ సైన్యం ప్రవేశంతో పాటే ఆకాశం నుంచి లక్షలసంఖ్యలో కరపత్రాలు వెదజల్లారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తున్నాం అన్న ఆశ్వాసంతో పాటు భూమిలేని పేదలు స్వాధీనం చేసుకున్న భూముల్ని యజమానులకు అప్పగించాలా? బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ʹభూసంస్కరణలుʹ తెచ్చి భూములు పంచాతామన్నది సారాంశం. ఫలితంగా ఏమైంది? కమ్యూనిస్టులు ఆయుధాలు అప్పగించడమే కాదు, ప్రజలు మూడువేల గ్రామాల్లో స్వాధీనం చేసుకున్న పదిలక్షల ఎకరాల భూమి ʹయజమానులకుʹ అప్పగించాల్సి వచ్చింది.

ఈ భూమితో పాటే 1946-51 మధ్యకాలంలో గ్రామాల్లో పీడిత ప్రజలు చవిచూసిన అధికారం ఎలా కోల్పోయారో ఆ వివరాలు ఇపుడు చెప్తే అతిశయోక్తిగా కనిపిస్తాయిగానీ, ప్రజాచైతన్యానికి, ప్రజా అధికారానికి దేశంలోనే ఆ కాలపు తెలంగాణ ఒక అపూర్వ ఆదర్శమని చరిత్రనిండా దాఖలాలు కనిపిస్తాయి.

బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం, కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూమంత్రిగా భూసంస్కరణలు చట్టం తెచ్చిన మాట నిజమే. కాగితంమీద జమీందారీ, జాగీర్దారీ విధానం, దేశ్ ముఖ్, దేశ్ పాండే వంటి ఎన్నోరకాల బిరుదులు రద్దయిన మాట నిజమే. ఈ అందరికీ ఎంతోకాలం దాకా పెద్దమొత్తాల్లో ప్రభుత్వ ఖజానా నుంచి నష్టపరిహారాలు చెల్లించినమాట అంతకన్నా చేదునిజం. వాస్తవంలో పన్నెండు సంవత్సరాలకు మించి వరుసగా కౌలుకుచేసిన రక్షిత కౌలుదారుకు కొంతభూమి చెందడం మినహా ఈనాటికీ తెలంగాణలో వేల ఎకరాలు హక్కుభుక్తంగా అనుభవిస్తున్న భూస్వాములు ఉన్నారని, కరడుగట్టిన భూస్వామ్యం ఉందని చెప్పడం చర్వితచర్వణం కావచ్చుగానీ అసత్యం మాత్రం కాదు.

సరిగ్గా అందుకోసమే కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం కొనసాగించాలనుకున్నది. ప్రజలు తాము స్వాధీనం చేసుకున్న భూములను కాపాడుకోవడానికి నెహ్రూ పటేల్ సైన్యాలను కూడా ఎదిరించి పోరాడాలనుకున్నారు. వాళ్లలో ఎవరికైనా నెహ్రూ ప్రభుత్వం తాము స్వాధీనం చేసుకున్న భూములపై అధికారం ఇస్తుందన్న భ్రమలు ఉంటే అవి పటాపంచలయినట్లు వాళ్లే పాటలు పాడుకున్నారు.

కమ్యూనిస్టులు, వాళ్ల నాయకత్వం పై విశ్వాసంతో ప్రజలు 51 నవంబర్ దాకానయినా, తిరిగి 68 నవంబర్ నుంచయినా తెలంగాణలో (మిగతా దేశం సంగతి అలా వుంచి) ముప్పై ఏళ్లుగా సుదీర్ఘ అసిధారాపోరాటం చేస్తున్నారంటే ఈ భూమి, భుక్తి, విముక్తి కోసమే.

విముక్తి అనగానే మానవేతిహాసంలో దశల గురించి గుర్తించకపోయే తీవ్రవాదమనిపించవచ్చు. కాని అట్టడుగు ప్రజానీకానికి విముక్తి, స్వేచ్ఛలకు అర్థం భూమి, భుక్తితో ముడిపడి ఉంటుందన్నది మూడో ప్రపంచదేశాల సాధారణసత్యం.
మరి ఎందుకు ఢిల్లీలోని నెహ్రూ - పటేల్ ప్రభుత్వం కమ్యూనిస్టులను అణచేయాలనుకున్నది? అదే ప్రధానమైన గురి. నవాబును దించడం, రజాకార్లను రూపుమాపడం సాకు మాత్రమే అని ఎలా అనగలం? అంటే ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు కమ్యూనిస్టు వ్యతిరేకులు గనుక. తెలంగాణలో కమ్యూనిస్టులు ప్రజల పక్షం నిలిచారు గనుక. ప్రజల తరఫున సాయుధంగా నిలబడి పోరాడి ప్రాణాలు ఒడ్డడానికైనా సిద్ధంగా ఉన్నారు గనుక.

చైనాలో ʹదున్నేవారికే భూమిʹ కార్యక్రమం మొదలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక విముక్తి పోరాటం దాకా కమ్యూనిస్టులు నాయకత్వం వహించి జపాను సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టడమే కాకుండా ప్రజల విప్లవాన్ని కూడ సాధించినట్లుగా తెలంగాణలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నైజాం వ్యతిరేక పోరాటం ʹదున్నేవారికే భూమిʹ ప్రాతిపదికగా ప్రజల రాజ్యా న్ని గ్యారంటీ చేసే దిశగా సాగుతున్నది కనుక. ఆంధ్రమహాసభ 1944 బోనగిరి మహాసభలో కమ్యూనిస్టుల నాయకత్వంʹలోకి వచ్చిన దగ్గర్నించీ 48 సెప్టెంబర్ దాకా అది అప్రతిహతంగా కొనసాగిన అనుభవం. అది కొనసాగితే 49 అక్టోబర్ 1న చైనా విప్లవంలో ఏ ఫలితాలను చూసామో, తెలంగాణలోనూ పరిమితంగానైనా పరిమిత పరిధిలోనైనా ఆ ఫలితాలనే చూసేవాళ్లం. మూడువేల గ్రామాలలో ఆ మార్పు ప్రభావాన్ని చరిత్ర రికార్డు చేసింది.

నెహ్రూ, పటేల్ లే కాదు, ఢిల్లీలోనే కాదు, దేశంలో ఎక్కడైనా దళారీ వర్గం పీడిత ప్రజల ఈ గమనాన్ని సహించదు. చరిత్ర అధ్యయనం చేసినవాడు గనుక, పొరుగుదేశంలో ఆ చరిత్ర నిర్మాణం చూసినవాడు గనుక, తెలంగాణలో తన కాళ్ల కింద ఆ మంటల్ని నెహ్రూ సహించలేకపోయాడు. నైజాం వంటి నిరంకుశ నవాబు, రజాకార్ల వంటి దుర్మార్గ మతోన్మాదులు - ప్రజల ఆకాంక్షలను సాకుగా తీసుకోవడానికి ఒక చారిత్రకదశలో అమోఘంగా సాకుగా పనికొచ్చారు.

ఆఖరునే అయినా, అంత కొట్టిపారేయడానికి వీలులేనిది, సందర్భాన్ని బట్టి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకునేది ఆనాడు తెలంగాణలో బీజప్రాయంలో కూడా లేని బిజెపి ఇపుడెందుకు ఇది భుజాలమీదికి ఎత్తుకున్నట్లు? ముఖ్యమంత్రిగా రెండోసారి భూసంస్కరణల చట్టాన్ని తెచ్చి తన భూములు కూడా పంచని భూస్వామి పివి నరసింహారావు ఇవ్వాళ అన్ని రాజకీయాలు వదిలి స్వామి రామానందతీర్థ పేరే ఎందుకు జపిస్తున్నట్టు? సూటిగా చెప్పాలంటే హిందూ భూస్వాములకు ఇవ్వాళ తెలంగాణలో ఆనాటివలెనే కమ్యూనిస్టుల ప్రమాదమున్నది. బయట ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం వలన అనుకూలమైన పరిస్థితి ఉన్నది. నక్సలైటు ఉద్యమాన్ని అణచివేసేందుకే కాదు, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల జాతివిముక్తి పోరాటాలను కూడ అణచివేయడానికి దృఢదీక్షతో వ్యూహం రచిస్తున్న అద్వానీలో వీళ్లు ఆనాడు సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన ఉక్కుమనిషి, సర్దార్ పటేల్ ను చూసుకుంటున్నారు.

నిజాం నవాబు మీద, రజాకార్ల మీద ఎవరికీ సానుభూతి, ప్రేమ ఉండనక్కర్లేదు. ఇవ్వాళ తెలంగాణలోనే కాదు, నిన్నటి తెలంగాణలో కూడ పీడిత ముస్లిం ప్రజలకెవరికీ తామే ప్రభువులమనే భ్రమలు లేవు. రజాకార్ల పట్ల ముస్లింలనే పక్షపాతం లేదు. బందగీ నుంచి, షోయబుల్లా ఖాన్ దాకా తెలంగాణ ఉజ్వల చరిత్రలో ప్రాణాలు బలి పెట్టిన ఎందరో సెక్యులర్, ప్రజాస్వామిక ముస్లిం యోధులను చూపవచ్చు. బాబ్రీ మసీదు విధ్వంసం, సూరత్ అత్యాచారాలు, బొంబాయి మారణకాండ (శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు సిరా ఇంకా ఆరిపోలేదు) కాశ్మీర్ లో అక్షరాలా మిలటరీ పాలన, (హైదరాబాద్ మతకల్లోలాలు కూడ ఉన్నాయి) నేపధ్యంలో బిజెపి ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహిస్తున్న రథయాత్రలు, తెలంగాణ విమోచన ʹస్వర్ణోత్సవాలుʹ దేనికి సంకేతం? ఎటు దారితీయనున్నాయి? ఏ విలువలు సాధించడానికి?

షోయబుల్లాఖాన్ సంస్మరణసభ జరిపినంతమాత్రాన బిజెపి సెక్యులర్ అయిపోయిందని తెలంగాణ ముస్లింలు, ప్రజాస్వామ్యవాదులు విశ్వసించే విలువలను ఈ వేడుకల్లో నిర్వాహకులు హామీ ఇవ్వగలుగుతున్నారా? ఇవన్నీ ప్రశ్నలే, సందేహాలే.

ఇవి తీవ్రవాదులకు మాత్రమే వచ్చే సందేహాలా? క్యూబా విముక్తమయ్యాక కూడ అది చాలదని లాటిన్ అమెరికా విముక్తి కోసం బయల్దేరి బొలీవియాలో అమరుడైన చేగువేరా విశ్వాసాలతో ఏకీభావం లేనివాళ్లు కూడా ఆయన మానవేతిహాసంలోని గమనాన్ని, దశలను నిరాకరించిన తీవ్రవాదిగా తోసిపారెయ్యజాలరనుకుంటాను.

- వరవరరావు
23-9-98, వార్త

Keywords : Telangana, armed struggle, nizam, razakars, communists, BJP
(2021-10-27 00:47:00)No. of visitors : 427

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

Solidarity statement by Democratic Studentsʹ Association for Comrade Tipu Sultan
పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
more..


సెప్టెంబర్