విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి

విప్ల‌వంలో

ఆర్‌కె మరణానంతర జీవితాన్ని ఆరంభించాడు.

రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. ఆయనతో, ఆయన నిర్మించిన విప్లవోద్యమంతో రక్తమాంసాల, మేధో సంబంధం ఉన్నవాళ్ల దగ్గరి నుంచి, ఆయన రాజకీయాలతో ఏకీభావం లేని వాళ్ల దాకా అందరూ కన్నీరు కార్చుతున్నారు.

అది కేవలం ఒక మరణానికి సాటి మనుషుల ప్రతిస్పందన కాదు. అదీ ఉంటుంది. అది అత్యంత మానవీయమైనది. నాగరికమైనది. దానితోపాటు ఆర్‌కెను ఒక వ్యక్తిగాకాక భారత విప్లవోద్యమానికి ప్రతీకగా భావించారు. విప్లవంలో రూపొందిన ఆయన మూర్తిమత్వం విప్లవానికి నిదర్శనమని అనుకున్నారు. అందుకే ఈ దు:ఖం. సరిగ్గా రెండు నెలల కింద హరిభూషణ్‌ అనారోగ్యంతో అమరుడైనప్పుడు కూడా ఇంతే.

ఇది మన సమాజ సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. కన్నీరొకలడంలోని సహజమైన మానవీయ లక్షణాన్ని సూచిస్తుంది. ఈ ప్రతిస్పందనల్లో, ప్రతిజ్ఞల్లో ఆర్‌కె పునర్జీవిస్తున్నాడు. మన కన్నీటి జడిలోంచి సుదూర చరిత్రలోలైనా మానవాళి నిర్మించుకోగల కొత్త జీవితంలో ఆర్‌కె రూపుదాల్చుతున్నాడు. ఆయన జీవితం సామాజికమైనందు వల్లే చారిత్రక శక్తిగా రూపాంతరం చెందుతున్నాడు. అది మరణం తర్వాత మరింత.. మరింతగా.

ఈ సమాజంలోని వైవిధ్యాన్నంతా పుణికిపుచుకున్నందు వల్లనే విప్లవోద్యమం అత్యద్భుతమైన, ఆసాధారణమైన, భిన్నమై విప్లవ వ్యక్తిత్వాలను నిర్మిస్తున్నది. మనకు తెలిసిన, మనం చదువుకున్న, విన్న వేలాది లక్షలాది విప్లవకారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రజా వ్యక్తిత్వం. వాళ్లంతా విప్లవ విలువలను, ఆదర్శాలను, ఆచరణను ఒక్కో వైపు నుంచి తీర్చిదిద్దిన వాళ్లే. విప్లవోద్యమం సమగ్రత దిశగా విస్తరించే మహత్తర ప్రయోగంలో భాగమైనవాళ్లే.

అలాంటి వాళ్లలో ఆర్‌కె అరుదైన నూతన మానవుడు. చర్చల ఆర్‌కెగా ఆయన ప్రజలందరికీ తెలుసు. రెండు విప్లవ పార్టీల తరపున అప్పటి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చిన విప్లవకారుల బృందానికి ఆయన నాయకుడు. చర్చలు ఆరంభం కావడానికి కొన్ని నెలల ముందు నుంచే ప్రభుత్వంతో, మధ్యవర్తులతో కొన్ని డజన్ల పత్రికా ప్రకటనల రూపంలో ఆయన సంభాషణ నడిపాడు. చర్చలలో ప్రస్తావించబోయే సామాజిక సమస్యలను ముందుకు తీసుకొచ్చాడు. తద్వారా ఆయన ప్రజలకు చిరపరిచిత నాయకుడయ్యాడు.

వీటన్నిటితోపాటు గుత్తికొండ బిలం దగ్గర జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం గుర్తించదగింది. ఆయన ప్రజలనుద్దేశించి.. మన పార్టీ.. అని మాట్లాడిన తీరు చెరగని ముద్ర వేసింది. కా. చారుమ‌జుందార్ న‌క్స‌ల్బ‌రీ నిప్పుర‌వ్వ‌ను దేశ‌వ్యాప్తం చేస్తూ గుత్తికొండ బిలానికి కూడా తీసుకొని వ‌చ్చాడు. విప్ల‌వోద్య‌మానికి సంబంధించిన కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్న స‌మావేశం అక్క‌డ జ‌రిగింది. ఆ మార్గంలో విప్ల‌వోద్య‌మ‌ నాయకుడిగా మళ్లీ కా. ఆర్‌కెకు గుత్తికొండలో మహా జనసంద్రం ముందు నిలబడి దేశ వ్యాప్త విప్ల‌వోద్య‌మ నేప‌థ్యంలో ప్రసంగం చేసే అవకాశం వచ్చింది. ఆనాటి గుత్తికొండ స‌మావేశం నిర్దేశించిన మార్గానికి సగర్వ వారసురాలైన విప్లవ నిర్మాణ ప్రతినిధిగా ఆర్‌కె వర్గపోరాటంలో శాంతి అనే భావనకు చారిత్రాత్మక నిర్వచనం ఇచ్చాడు.

వర్గపోరాటం పట్ల, మార్క్సిజం పట్ల ఆచరణాత్మక జ్ఞానం లేని పండితులకు ఎన్నటికీ ఆర్థం కాని విషయం ఇది. బహుశా శాంతికి ఉన్నన్ని నిర్వచనాలు మరి దేనికి ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికవాదులు, అహింసావాదులు, మానవతావాదులు, క్షుద్ర రాజకీయవాదులు, అమానుష హింసావాదులు, శుష్కపాండిత్యవాదులు.. ఒకరేమిటి అందరినోటపడి ʹశాంతిʹ అపభ్రంశ పదంగా మారిపోయింది.

అయితే నిజంగా మానవజీవితంలో శాంతి లేదా? సాధారణ ప్రజలకు శాంతి అర్థం తెలియదా? వారు శాంతిని కోరుకోరా? మానవ జీవితంలో అనివార్యమైన ఘర్షణలాగే శాంతి కూడా విడదీయలేని భాగం. ఆ ఘర్షణను శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో, నిర్దిష్ట రాజకీయ కార్యక్రమంతో వర్గపోరాటంగా తీర్చిదిద్దినట్లే శాంతినీ నిర్వచించవలసి ఉన్నది. శాంతి అంటే శ్మశాన శాంతి కాదు. లొంగుబాటు కాదు. రాజీ కాదు. అర్థరహితం కాదు. ప్రయోజనం లేనిది కాదు. శాంతి ప్రజా జీవితంలో హింసారహితమైన, మానవీయమైన, గౌరవనీయమైన భాగం కావాలి. అప్పుడే ఆ శాంతి అసలైన అర్థం సంతరించుకుంటుంది.

అందుకే ఘర్షణ ద్వారానే అభివృద్ధి అనీ, వర్గపోరాటంతోనే చరిత్ర నిర్మాణమవుతుందనీ విశ్వసించి ఆచరించే విప్లవపార్టీ తరపున ఆర్‌కే శాంతి చర్చలకు వచ్చాడు. వర్గపోరాటంలో యుద్ధం ఉంటుంది` శాంతి ఉంటుంది. సాయుధ సంఘర్షణ ఉంటుంది` శాంతి చర్చలు ఉంటాయి.. అనే అద్భుతమైన అవగాహనను ఆయన అందించాడు. శాంతిని నిర్వచించి, శాంతిని ప్రజల జీవితంలో అర్థవంతమైన అంతర్భాగం చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? ఉంటే దాన్ని విస్మరించడానికి లేదనే ఆశాభావంతో, హేతుదృష్టితో ఆయన ప్రభుత్వంతో శాంతి చర్చలు చేయడానికి వచ్చాడు.

యాభై నాలుగేళ్ల భారత విప్లవోద్యమంలో ఇదొక అపురూపమైన ఘట్టం. ఆద్భుతమైన క్రమం. ఇలాంటి అవగాహన సంతరించుకోగల స్థాయికి విప్లవోద్యమం ఎదిగింది. ఆ పరిణతి అంతా కా. ఆర్‌కెలో ప్రతిఫలించింది. వ్యక్తిగా, కార్యకర్తగా, నాయకుడిగా ఆయన వికాసమంతా వర్గపోరాటంలో భాగం. అట్లాగే వర్గపోరాటంలో భాగమైన శాంతి ప్రక్రియను విశ్లేషించగల అవగాహన కూడా ఆయనకు విప్లవోద్యమం నుంచే వచ్చింది.

బహుశా ఆయనలాంటివారి జీవితమే సామాజికం.

సమాజంలోని, విప్లవంలోని అన్ని ఆకాంక్షలు వాళ్ల ఆలోచనల్లో ప్రతిఫలిస్తాయి. విప్లవ అవసరాలకు తగినట్లు వాళ్ల జీవితం నిరంతరం పునర్నిర్మాణమవుతూ ఉంటుంది. అందువల్లే కావచ్చు.. ఆయన మరణంపై ఇంకా స్పష్టత రాకముందు నుంచే సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విప్లవోద్యమంపై చర్చలు ఆరంభయ్యాయి.

మామూలుగా అయితే శవం దగ్గర చర్చలేంది? అంటారు. ఇక్కడ శవం కూడా లేదు. కేవలం మరణవార్త మాత్రమే.

అయినా ఆ వ్యక్తిని విప్లవానికి ప్రతినిధిగా చూసి కన్నీటి ప్రతిజ్ఞలు చేసినట్లే విప్లవ సాధ్యాసాధ్యాల మీద చర్చలు చేసే వాళ్లు కూడా ఉంటారు. హితోపదేశాలు చేసేవాళ్లూ ఉంటారు. సమీక్షించుకోమని సలహాలు ఇచ్చేవాళ్లు ఉంటారు. అన్నిటినీ ఆలకించాల్సిందే.

దానికంటే ముందు ఆర్‌కె విప్లవాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడనేది ముఖ్యం. ఆయనకైనా, విప్లవోద్యమానికైనా ఏదీ పండిత చర్చకాదు. వాళ్లు ఏకకాలంలో సిద్ధాంత, ఆచరణల సమస్యగా చూస్తారు. విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్న వాళ్లు ఈ రెంటినీ వేరు చేయలేరు.

కొందరు విప్లవాన్ని సిద్ధాంత స్థాయిలో చూసి సరిపెట్టుకుంటారు. అక్కడక్కడే వాద వివాదాలు నడుపుతూ ఉంటారు. తప్పొప్పులను బేరీజు వేస్తుంటారు. ఏది తప్పో ఎందుకు తప్పో మళ్లీ సిద్ధాంత ప్రవచనమే వినిపిస్తారు.

ఆచరణలో ఉండే విప్లవకారులు అట్లా కాదు. మానవ జీవితంలో, సమాజంలో నిరంతర మార్పులను అట్టడుగు నుంచి చూస్తారు. అత్యున్నత తలంలోకి చేరుకుంటారు. చుట్టిముట్టిన ప్రశ్నలను, సవాళ్లను శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో క్షేత్ర స్థాయిలో చూస్తారు. అందువల్లే నిరంతరం రూపొందే కొత్త ప్రపంచాన్ని సునిశితంగా చూస్తారు. కల్లోలాలను ఈదుతూనే చేరుకోవాల్సిన గమ్యాన్ని స్పష్టపరుచుకుంటారు.

బహుశా సిద్ధాంతాన్ని ఎంత వల్లెవేసినా ఆ తీరం ఎవ్వరూ చేరుకోలేరు.

ప్రజల మధ్య ఉండే వాళ్లకే ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కొత్త సవాళ్లు అర్థం అవుతాయి. దానికి సిద్ధాంతం దారి చూపుతూ ఉంటుంది. కొత్త, విస్తృత ప్రపంచాల్లోకి చేరుకుంటారు. బహుశా గత పాతికేళ్లుగా దారుణ నిర్బంధం మధ్యనే విప్లవకారులు భిన్న ప్రజా సమూహాలకు చేరువయ్యారు. వేర్వేరు ప్రాంతాలకు, అనేకానేక వైరుధ్యాల మధ్యకు, జీవిత నేపథ్యాలకు చేరుకొని అక్కడి నుడికారాలతో ప్రజలను ముట్టకొని వాళ్లను సంఘటితం చేస్తున్నారు. ఎవరంతకు వాళ్లు ఒంటరితనంలోకి కూరుకపోతోంటే విప్లవోద్యమమే కలిపే పని చేస్తున్నది. ఇందులో ఎన్నో ఆటుపోట్లు ఉండవచ్చు. కానీ వాళ్లు సజీవ స్రవంతులను నడిపిస్తున్నారు. అనేక మందిని సంఘటితం చేస్తున్నారు.

విప్లవోద్యమాన్ని దాని ఆచరణ తలంలోకి, సిద్ధాంత తలంలోకి వెళ్లి సరైన దృక్పథంతో అర్థం చేసుకోగల స్థాయికి తెలుగు మేధో రంగంలో కొందరైనా ఎదగకపోవడం విషాదమే. దేన్నయినా రొడ్డకొట్టుడుగా మాట్లాడటం వెన్నతో పెట్టిన విద్యగా మారింది. తమ కళ్లకు గంతలు కట్టుకొని లోకమంతా చీకటిగా ఉందనే ఔద్ధత్యం అలుముకపోయింది. విప్లవకారులు మనలాగా పుస్తకాలు చదివి వల్లె వేసే వాళ్లు కాదు కదా, మనలాగా ఎన్నికల సమీకరణాలకు సకల శక్తులను బలి పెట్టేవాళ్లు కాదుకదా, అన్ని సందర్భాలను పాండిత్య ప్రదర్శనకు వినియోగించుకొనేవాళ్లు కాదు కదా.. కఠోరమమైన ఆచరణను దీర్ఘకాలం కొనసాగిస్తున్న వాళ్లు కాబట్టి వాళ్ల అవగాహన ఏందో, అనుభవం ఏందో కాసేపు ఓపికగా చూద్దాం విందాం అనుకోవడం లేదు. ఇలాంటి మేధో సహనం, నిజాయితీ కోల్పోయిన బృందం మన దగ్గర తయారైంది.

ఇదిగో వీళ్లే.. విప్లవోద్యమాన్ని సమీక్షించుకోమంటున్నారు. ఇది మునిగిపోయేదే అని నిట్టూర్పులు వదులుతున్నారు.

ఈ వైఖరి తీసుకున్నారంటే స్పష్టంగా ఉన్నట్లే. ఒక రకంగా ఇది చాలా మంచిది. ఇక అన్నీ స్పష్టంగానే మాట్లాడుకోవచ్చు.

అట్లని విప్లవోద్యమంలో సమీక్షించుకోవాల్సిన లోటుపాట్లు లేవా?

వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి సమీక్షించుకోకుంటే ఇంత కల్లోలాల మధ్య విప్లవోద్యమం ఉండేదా? విస్తరించడం సాధ్యమయ్యేదా? బహుశా ఆచరణాత్మక సిద్ధాంత దృక్పథమే వాళ్ల బలం. ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా ఈ విమర్శనాత్మక దృక్పథం ఆయుధంగా ఉన్నందు వల్లే లక్షల ఆయుధాలకు, కోటానుకోట్ల సవాళ్లకు ఎదురు నిలిచి పురోగమిస్తున్నారు.

దీన్ని గమనించడానికి పెద్ద కసరత్తు అక్కర్లేదు. ఇది ఆర్‌కె అమరత్వ సందర్భం కదా. ఆయన రూపొందిన పల్నాడు నుంచి, నల్లమల నుంచి, ఆంధ్రా ఒడిసా సరిహద్దులదాకా సాగిన ఆ మహాద్భుత ప్రయాణాన్ని గమనిస్తే చాలు. యుద్ధాన్ని, శాంతిని, ప్రత్యామ్నాయాన్ని ప్రజాపంథాలో, వర్గపోరాటంలో ఎలా తీర్చిదిద్దిందీ అర్థమవుతుంది.

ఆయన జీవితపర్యంతం నమ్మినమార్గానికి కట్టుబడి, వెనుదిరగకుండా కొనసాగడం చాలా మామూలు విషయం. అనేక మార్గాల్లో అలాంటి వాళ్ల ఉంటారు. నివాళి ప్రకటించాల్సింది దానికి కాదు. ఆ మార్గాన్ని సిద్ధాంత ఆచరణల మేళవింపుతో నిత్యనూతనం చూస్తూ, విస్తరిస్తూ, ఆశావాదంతోనే కాదు.. శాస్త్రీయ దృష్టితో కొత్త చారిత్రక ప్రపంచాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నివాళి ప్రకటించవలసి ఉంటుంది.

దానికి సిద్ధమవుతారా? లేదా? అనే ప్రశ్న తన మరణానంతర జీవితంలో మనకు సూటిగానే సంధిస్తున్నాడు.

తేల్చుకోవాల్సింది మనమే.

- పాణి

Keywords : ramakrishna, haragopal, RK, Maoist, death, Martyr, phani
(2024-11-05 16:08:13)



No. of visitors : 2316

Suggested Posts


పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం

చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు.

అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు.

చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం

ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా

మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ

విప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం.

ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది.

RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్

14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఆర్కే పుస్తకావిష్క‌రణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీష‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ

ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పు

రామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విప్ల‌వంలో