ʹఉగ్రవాద సంస్థలో సభ్యుడుగా ఉండటం, మద్దతు యిచ్చినంత మాత్రాన UAPA నేరం కిందికి రాదుʹ: సుప్రీం కోర్టు ఆదేశం

ʹఉగ్రవాద

31-10-2021

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన కేరళ విద్యార్థులు త్వాహా ఫసల్, అల్లన్ షుయబ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.

1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) సెక్షన్ల కింద కేరళ పోలీసులు నమోదు చేసిన, ఆ తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టిన కేసులో కేరళ విద్యార్థులు త్వాహా ఫసల్, అల్లన్ షుయబ్‌లకు మంజూరైన బెయిల్‌ను పునరుద్ధరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందులో మావోయిస్ట్‌లతో సంబంధాలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని ఉపయోగించడం పైన ముఖ్యమైన పరిశీలనలున్నాయి.

ఒక తీవ్ర‌వాద సంస్థలో సభ్యుడిగా వుండడమూ లేదా ఇతరత్రా మద్దతు ఇచ్చినంత మాత్రాన UAPA కింద నేరంగా పరిగణించడానికి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ʹసెక్షన్ 38లోని సబ్-సెక్షన్ (1) ప్రకారం తీవ్రవాద‌ సంస్థతో సంబంధం ఉండడం లేదా ఉన్నట్లు ప్రకటించడం, సెక్షన్ 39 లో తీవ్ర‌వాద సంస్థకు మద్దతు ఇవ్వడానికి సంబంధించిన నేరం అని రెండు సెక్షన్లలోనూ వున్నది. అయితే ఆ రెండు సెక్షన్లలోనూ పేర్కొన్న చర్యలు ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశంతో జరిగితే తప్ప ఈ సెక్షన్లు అన్వయించబడవు.

"ఆ మేరకు, మెన్స్ రియాను (ఆంగ్లో-అమెరికన్ చట్టంలో mens rea అంటే నేర ఉద్దేశం లేదా దుష్ట మనస్సు. సాధారణంగా, ఒక క్రిమినల్ నేర నిర్వచనంలో ఒక చర్య లేదా మినహాయింపు, దాని పర్యవసానాలు మాత్రమే కాకుండా చేసిన వారి మానసిక స్థితికి సంబంధించి కూడా ఉంటుంది. అన్ని నేర వ్యవస్థలలో, అనేక నేరాలకు నేర ఉద్దేశ మూలాన్ని తెలుసుకోవడం అవసరం) పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల, కార్యకలాపాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆ సంస్థతో సంబంధం ఉంటే తప్ప, కేవలం తీవ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండడమో లేదా ఇతరత్రా అనుబంధాన్ని కలిగివుండడం మాత్రమే సెక్షన్ 38 కింద నేరంగా పరిగణించడానికి సరిపోదు. సెక్షన్ 39లోని సబ్‌సెక్షన్ (1)లోని క్లాజులు (ఎ) నుండి (సి) వరకు సూచించిన చర్యలకు పాల్పడడం ద్వారా నిందితుడు తీవ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చినప్పటికీ, తీవ్ర‌వాద సంస్థ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో కార్యకలాపాలు జరిపినట్లు నిర్ధారణ జరగకపోతే సెక్షన్ 39 ప్రకారం శిక్షార్హమైన నేరం చేసినట్లు కాదు.

ʹఅందువల్ల, 1967 చట్టంలోని సెక్షన్‌లు 38, 39 ప్రకారం తీవ్ర‌వాద సంస్థ కార్యకలాపాలను తదుపరి కొనసాగించే ఉద్దేశాన్ని కలిగి వుండడం శిక్షార్హమైన నేరాలలో ముఖ్యమైన అంశం.
ʹనిందితులిద్దరినీ బెయిల్‌పై విడుదల చేస్తూ, 2020 సెప్టెంబర్ 9న NIA ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో చేసిన ఇదే విధమైన పరిశీలనను కేరళ హైకోర్టు పక్కన పెట్టింది, రెండో నిందితుడు త్వాహా ఫసల్ బెయిల్‌ను రద్దు చేసి తిరిగి జైలుకు పంపింది. రెండో నిందితుడు షుయబ్‌ చిన్నవయస్సు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్‌ రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది.

ఇప్పుడు, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ధరిస్తూ, కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించడానికి అవసరమైన ప్రాథమిక సాక్ష్యాలు కేసులో లేవని స్పష్టంగా పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంది:

ʹమేము సెక్షన్ 43డిలోని సబ్-సెక్షన్ (5) సందర్భంలో నిందితులిద్దరికీ సంబంధించిన విషయాలను పరిశీలించాము. ఛార్జ్ షీట్‌లో భాగమైన విషయాలను యథాతథంగా తీసుకుంటే, సెక్షన్ 38, 39 ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడినట్లు నిందితులిద్దరిపై వచ్చిన అభియోగాలు ప్రైమా ఫేసీగా (prima facie - ఆధునిక చట్టపరమైన ఆంగ్లంలో (సివిల్ లా మరియు క్రిమినల్ లా రెండింటితో సహా) ప్రాథమిక పరీక్షలో, ఒక కేసుకు మద్దతుగా తగినంత ధృవీకరించే సాక్ష్యం ఉన్నట్లు సూచించడానికి ʹప్రైమా ఫేసీʹ అనే పదాన్ని ఉపయోగిస్తారు) నిజం కావు.

హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టే నిర్ణయాన్ని సమర్థిస్తూ, ధర్మాసనం ఇలా పేర్కొంది:

ʹ1967 చట్టంలోని అధ్యాయాలు IV, VI కింద నేరాలు అభియోగాలు మోపబడిన నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటప్పుడు, నిందితుడిపై అభియోగాలు ప్రాథమికంగా నిజమని విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయా అనేది కోర్టు పరిగణించాలి. నిందితుడిపై వచ్చిన అభియోగం ప్రాథమికంగా నిజమని నమ్మడానికి సహేతుకమైన కారణాలు లేవని రికార్డులో ఉన్న అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టు సంతృప్తి చెందితే, నిందితుడికి బెయిల్‌ పొందే అర్హత ఉంటుంది.
ʹఅందువల్ల, అధ్యాయాలు IV, VI కింద ఆరోపించబడిన నేరాలను నిందితులు చేసారనడానికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉందో లేదో నిర్ణయించడమనేది విచారణకు వున్న పరిధి. నిందితుడిపై వచ్చిన అభియోగం ప్రాథమికంగా నిజమని నమ్మడానికి గల కారణాలు సహేతుకమైన కారణాలుగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, సెక్షన్ 43(డి)లోని సబ్-సెక్షన్ (5) ప్రకారం అవసరమైన ప్రాథమిక కేసు(prima facie) సమస్యను కోర్టు పరిశీలిస్తున్నప్పుడు చిన్నపాటి విచారణను నిర్వహించాలని ఆశించకూడదు. సాక్ష్యానికి వున్న యోగ్యతను, లోపాలను కోర్టు పరిశీలించకూడదు.

అప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసి వుంటే, అటువంటి వ్యక్తిపై వచ్చిన అభియోగం ప్రాథమికంగా నిజమని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్ణయించడానికి ఛార్జ్ షీట్‌లో భాగమైన అంశాలను కోర్టు పరిశీలించాలి. అలా చేస్తున్నప్పుడు, ఛార్జ్ షీట్‌లోని అంశాలను కోర్టు యథాతథంగా తీసుకోవాలి.ʹ

ట్రయల్ కోర్టు తీర్పును బలపరుస్తూ, సుప్రీంకోర్టు ఇలా కూడాచెప్పింది:
ʹనిర్మాణాత్మక స్థితిలో వున్న యువక దశలో, నిందితులు నం.1, 2 సిపిఐ (మావోయిస్ట్) ప్రచారం చేసిన వాటి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు. అందువల్ల, CPI (మావోయిస్ట్)కి సంబంధించిన వివిధ పత్రాలు/పుస్తకాలను వారు ఈ ఫామ్ లేదా భౌతిక రూపంలో కలిగి ఉండవచ్చు.
కోర్టు ఇంకా యిలా నొక్కి చెప్పింది:

ʹఅంతే కాకుండా సిపిఐ (మావోయిస్ట్)తో సంబంధం ఉన్నదని ఆరోపించబడిన ఒక సంస్థ నిర్వహించిన నిరసన/సమావేశంలో నిందితులు పాల్గొన్నట్లు చూపించే కొన్ని ఛాయాచిత్రాలు తప్ప, నిందితులు నెం.1, 2 లకు CPI (మావోయిస్ట్) కార్యకలాపాలలో చురుకైన భాగస్వామ్యం వుందని, తీవ్ర‌వాద సంస్థ కార్యకలాపాలు లేదా తీవ్రవాద చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యం వారిలో ఉందని ప్రాథమికంగా అంచనా వేయగలిగే ఎటువంటి అంశాలు ఛార్జిషీట్‌లో లేవు అని కోర్టు చెప్పింది.ʹ

"వారు చేసిన బహిరంగ చర్యలు తప్ప నేరం చేయడానికి అవసరమైన ఉద్దేశ్యం లేదా మానసిక స్థితిల ఉనికిని చూపించే వివరాలు ఛార్జ్ షీట్‌లో కనబడలేదు. వారి స్థిరమైన అనుబంధం లేదా సుదీర్ఘ కాలం పాటు సంస్థకు మద్దతు యిస్తున్నట్లు కూడా, ప్రాధమిక దృష్టితో చూసినప్పుడు ఛార్జ్ షీట్‌లో లేదు."

"ఛార్జిషీట్‌లో భాగమైన దర్యాప్తు సమయంలో సేకరించిన విషయాలను యదాతధంగా స్వీకరించడం ద్వారా, నిందితుడు సీపీఐ (మావోయిస్ట్) కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యాన్ని కలిగి వున్నాడని చూపించడానికి ఎటువంటి మెటీరియల్ లేకపోవడంపై ప్రత్యేక న్యాయస్థానం ప్రాథమిక విచారణను నమోదు చేసిందని హైకోర్టు గమనించలేదు.

ʹʹఈ అంశానికి సంబంధించి హైకోర్టు ప్రైమా ఫేసీని నమోదు చేయలేదు. వతాలి (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్సెస్ జహూర్ అహ్మద్ షా వటాలి 2 ఏప్రిల్, 2019న) కేసులో నిర్దేశించిన చట్టాన్ని వర్తింపజేయడం ద్వారా, 38, 39సెక్షన్ల కింద నేరాలు చేసారని నెం.1, 2 నిందితులపై ప్రైమా ఫేసీ నిజమని నమ్మడానికి సహేతుకమైన కారణాలు లేవు.

"ప్రత్యేక న్యాయస్థానం విధించిన అన్ని షరతులను పునరుద్ధరించామని మేము కూడా స్పష్టం చేస్తున్నాము" అని కోర్టు పేర్కొంది.

ఇద్దరు నిందితులు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే పరిమిత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ 46 పేజీల తీర్పులో నమోదు చేసిన పరిశీలనలు, ఫలితాలు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ʹఅభియోగాలను తయారు చేయడానికి పరిగణించడానికి చెప్పబడిన అంశాలు భిన్నంగా వుండడం వల్ల ప్రత్యేక కోర్టు అభియోగాలను తయారుచేసేటప్పుడు వాటి ప్రభావానికి లోనుకాకూడదు. కేసు విచారణ సమయంలో ఈ తీర్పులో చేసిన పరిశీలనల వల్ల ప్రత్యేక కోర్టు ప్రభావితం కాబోదుʹʹ అని పేర్కొంది.
న్యాయ విద్యార్థి షుయబ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధృవీకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నేపథ్యం:
2019 నవంబర్ 1నాడు కోజికోడ్‌లోని పంథీరంకావు దగ్గర వారిని పోలీసులు పట్టుకున్నప్పుడు, న్యాయ విద్యార్థి అల్లాన్ షుయబ్‌కు 19 ఏళ్లు, పార్ట్‌ టైమ్ జర్నలిజం విద్యార్థి త్వాహా ఫసల్‌కు 24 ఏళ్లు. వారిద్దరూ కేరళ పాలక పార్టీ సిపిఐ(M)లో క్రియాశీల కార్యకర్తలు.
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్‌)తో సంబంధం ఉందన్న ఆరోపణలపై పోలీసులు వారిపై యూఏపీఏలోని 20, 38, 39 సెక్షన్‌ల కింద కేసు పెట్టారు. వీరిద్దరిపై కేసు పెట్టిన నిమిషం నుంచి అధికార సీపీఐ (ఎం) అనేక అంశాల్లో ఆత్మరక్షణలో పడింది. క్రూరమైన చట్టంపై పార్టీకి ఉన్న తీవ్ర వ్యతిరేకతపై రాజకీయాలలోని వామపక్ష విభాగం ప్రశ్న లేవనెత్తితే, మితవాదులు పార్టీ క్యాడర్ ముసుగులో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరికి మద్దతివ్వాలా వద్దా అనే అంశంపై పార్టీ నాయకత్వంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబి, డాక్టర్ టి. థామస్ ఇసాక్ బహిరంగంగా వారికి మద్దతు యిచ్చారు.

ప్రత్యేకించి అలన్ షుయబ్, వామపక్ష విధేయత కలిగిన కుటుంబానికి చెందినవాడు. అతని అమ్మమ్మ కోజికోడ్‌లో సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, 2018లో ఆమె మరణించే వరకు CPI(M)తో అనుబంధం కలిగి ఉన్నారు. డాక్టర్ ఇస్సాక్ సంఘీభావం తెలుపుతూ అలన్ ఇంటికి కూడా వెళ్లారు. కొన్ని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం యిలా వెళ్ళడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. తాము సీపీఐ(ఎం) కార్యకర్తలం మాత్రమేనని త్వాహ, అల్లన్‌లు చెప్పడంతో పార్టీ శ్రేణులు నిలువునా చీలిపోవడం మొదలైంది.
తొలి రోజుల గందరగోళం, సందిగ్ధతల తర్వాత, అల్లన్, త్వాహ నిజంగా మావోయిస్టు కార్యకర్తలే అనే పోలీసు సిద్ధాంతాన్ని సిఎం పినరయి విజయన్ సమర్ధించడాన్ని చాలా మంది రాజకీయ పరిశీలకులు విమర్శించారు. జరుగుతున్న విచారణపై రాష్ట్ర ప్రభుత్వాధినేతగా అలా వ్యాఖ్యానించకుండా ఉండాల్సిందని వారి అభిప్రాయం.

ʹఆ యువకులను కేవలం రోడ్డు పక్కన టీ తాగినందుకు అరెస్టు చేయలేదుʹ - అని అసెంబ్లీలో అతను చేసిన ప్రకటనను అవకాశంగా ప్రతిపక్షం పూర్తిగా వుపయోగించుకోవడంతో వివాదానికి దారితీసింది. వామపక్ష మొగ్గు చూపే ప్రజా క్షేత్రం నుంచి ఒత్తిడి పెరిగిన తరువాత, చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం తప్పనిసరిగా వుండాల్సిన UAPA సమీక్ష కమిటీ ద్వారా కేసును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది, అయితే NIA కేసుని తీసేసుకోవడంతో ఆ అవసరం లేకుండా పోయింది.

కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ సమర్పించిన ఛార్జ్ షీట్‌లో, నిందితులు తెలిసి, ఉద్దేశపూర్వకంగా, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా నిషేధించిన సీపీఐ (మావోయిస్ట్)తో సంబంధాలను పెట్టుకొన్నారని, ఆ సంస్థలో సభ్యులనీ, CPI (మావోయిస్ట్) ఇతర రహస్య పార్ట్-టైమ్, వృత్తిపరమైన (ఫుల్ టైమ్) సభ్యులతో పాటు వివిధ కుట్ర సమావేశాలకు హాజరయ్యారని, ఆ సంస్థలో సభ్యులను చేర్పించారని UAPAలోని సెక్షన్ 35 కింద తీవ్రమైన అభియోగాలను NIA నమోదు చేసింది.

CPI (మావోయిస్ట్) ప్రచురించిన, వారికి మద్దతునిచ్చే పత్రాలు త్వాహా దగ్గర ఉన్నాయని, భారత యూనియన్ నుండి కాశ్మీర్ విడిపోవడానికి మద్దతు ఇచ్చే ప్రచార సామగ్రిని సిద్ధం చేశారని ఛార్జ్ షీట్ ఆరోపించింది.

10 నెలల కారాగారవాసం తర్వాత 2020 సెప్టెంబర్‌లో వారిద్దరినీ ప్రత్యేక కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది, 2021 జనవరి లో హైకోర్టు బెయిల్‌ని రద్దు చేసే వరకు, ఓ మూడు నెలల పాటు త్వాహా ఫసల్ బయట వున్నారు. అలన్, త్వాహల పట్ల వైవిధ్యంగా హైకోర్టు వ్యవహరించడం కూడా సుప్రీం కోర్టు పరిశీలనకు గురైంది.

(thewire.in సౌజన్యంతో...)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : supreme court, kerala,Thwaha Fasal, Allan Shuaib,UAPA, ʹMere Support to Terrorist Org Not UAPA Offenceʹ: Excerpts From SC Order on Kerala Students
(2024-04-14 19:54:23)



No. of visitors : 838

Suggested Posts


తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్

2015 నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66(ఏ)ను ఇప్పటికే తొలగించగా, 22 మందిని ఈ చట్టం కింద ప్రాసిక్యూట్ చేశారని పీయూసీఎల్

పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన‌ పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹఉగ్రవాద