అపసవ్యపు ఎన్నికలను ఇంకా అపహాస్యం చేసే చట్టం - ఎన్.వేణుగోపాల్

అపసవ్యపు

30-12-2021

(వీక్షణం జనవరి 2022 సంపాదకీయం)

భారత పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ దానికదే ఒక వికృత వస్తువు. ఏడు దశాబ్దాల ఎన్నికల రాజకీయాలు దాన్ని మరింత అష్టావక్రంగా మార్చి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే మాటే అవమానపడే స్థాయికి దిగజార్చాయి. ఇప్పుడిక సంఘ్ పరివార్ పాలకులు డిసెంబర్ 20న ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది, చట్టంగా మారడంతో దేశంలో ఎన్నికల వ్యవస్థ అర్థమే మారిపోనున్నది. వోటర్ గోప్యత అనే మౌలిక సూత్రం రద్దయిపోయి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నామమాత్రం అయిపోనున్నది.

ఇప్పటివరకూ ఎన్నో సవరణలతో అమలులో ఉన్న ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950, 1951 అనే రెండు చట్టాలలో మౌలిక సవరణలు చేయడానికి ప్రస్తుత చట్టం ఉద్దేశిస్తున్నది. వీటిలో మొదటి చట్టం ఎన్నికల స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పరిధి, వోటర్ల అర్హతలు, వోటర్ల జాబితాల తయారీకి సంబంధించినది కాగా, రెండో చట్టం ఎన్నికల నిర్వహణ, ఎన్నికల నేరాలు, ఎన్నికల వివాదాలకు సంబంధించినది.

మొదటి చట్టం ప్రకారం వోటర్ గా నమోదు చేసుకోవడానికి పౌరులందరికీ అర్హత ఉండగా, ప్రస్తుతం చేసిన సవరణ ప్రకారం వోటర్ గా నమోదు చేయించుకోవడానికీ, వోటర్ల జాబితాలో ఉన్న పేరు ధ్రువీకరించడానికీ, కొనసాగడానికీ ఆధార్ నంబర్ ను తప్పనిసరి చేస్తున్నది. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే (జనవరి 1న) వోటర్ల నమోదు ప్రక్రియ ఉండగా, ప్రస్తుత సవరణ దాన్ని ఏడాదికి నాలుగు సార్లుగా మారుస్తున్నది. అలాగే ఎన్నికల నిర్వహణ సమయంలో వినియోగించే స్థలాలకు సంబంధించి, సైనిక కుటుంబాల నమోదుకు సంబంధించి 1951 చట్టానికి కూడ కొన్ని సాంకేతిక సవరణలు చేశారు.

ఆ సాంకేతిక సవరణలు ఎలా ఉన్నా, ఆధార్ నంబర్ ను తప్పనిసరి చేయడం చాలా వివాదాస్పదమైనది, అభ్యంతరకరమైనది. డూప్లికేట్ వోటర్ల సమస్యను పరిష్కరించడానికే ఈ అనుసంధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది గాని, అది కేవలం సాకు మాత్రమే. డూప్లికేట్ వోటర్ సమస్యను, రిగ్గింగ్ ను, వోటింగ్ అక్రమాలను సృష్టించి, పెంచి పోషిస్తున్నదే రాజకీయ పార్టీలు. ఆ సమస్యల పరిష్కారానికి అనుసరించవలసిన పద్ధతులు వేరు. వోటర్ కార్డ్ – ఆధార్ కార్డ్ అనుసంధానం వల్ల అర్హులైన వోటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి, వోటర్ల జాబితాను ఇష్టారాజ్యంగా మార్చడానికి అవకాశం వస్తుంది.

అధికారంలో ఉన్న ప్రభుత్వం గాని, అధికారులు గాని ఈ రెండిటి అనుసంధానాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. అటు ఆధార్ జాబితా గాని, ఇటు వోటర్ జాబితా గాని లోపభరితంగా ఉన్నాయి గనుక, రెండిటి అనుసంధానం మరింత గందరగోళానికి దారి తీస్తుంది. ప్రధానంగా వోటర్ గోప్యతను భంగపరుస్తుంది. రహస్య వోటింగ్ పద్ధతికి తూట్లు పొడిచి, ఏ వోటర్ ఎవరికి వోటు వేశారో తెలుసుకోవడానికి, ఎన్నికైన ప్రభుత్వాలు ఆ సమాచారాన్ని వాడుకుని తమకు వోటు వెయ్యని వారిమీద కక్ష సాధింపు జరపడానికి అవకాశం వస్తుంది.

వోటర్ కార్డునూ ఆధార్ కార్డునూ అనుసంధానం చేయాలనే ప్రయత్నం మోడీ ప్రభుత్వ మొదటి విడతలోనే ఎన్నికల కమిషన్ ద్వారా ప్రారంభమై, సుప్రీంకోర్టు జోక్యం వల్ల కొన్ని నెలల్లోనే ఆగిపోయింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు రాకముందే చాల రాష్ట్రాల్లో ఆ అనుసంధానం పని మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే కనీసం 55 లక్షల మంది వోటర్ల పేర్లను ఆధార్ నంబర్ లేదనే సాకుతో తొలగించారని, 2018 ఎన్నికల మీద ఆ తొలగింపు ప్రభావం ఉందని విమర్శలున్నాయి. ఆ ఎన్నికల్లో చాలా మందికి తమ పేరు వోటర్ జాబితా నుంచి తొలగించబడిందని పోలింగ్ బూత్ కు వెళ్లినప్పుడు గాని తెలియలేదు. అప్పటికప్పుడు వారు వోటు వేయదలచుకుంటే కూడ చేయగలిగింది లేదు. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ అదే అనుసంధానానికి ప్రయత్నించడం ఇటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నందువల్లనే. ఈ అనుసంధానంతో తలెత్తగల సమస్యల దృష్ట్యానైనా, సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యానైనా ప్రస్తుత సవరణ బిల్లు అభ్యంతరకరమైనది. కాని సంఘ్ పరివార్ శక్తుల దూకుడు వల్ల ఆ బిల్లు చట్టంగా కూడ మారిపోయింది.

అయితే ఈ ఎన్నికల చట్టాల సవరణల, ʹఎన్నికల సంస్కరణలʹ సమస్య, కనబడుతున్న కారణాల కన్న, వివాదాల కన్న మరింత లోతైనది. అసలు దేశంలో పార్లమెంటరీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికి లోకి రావడమే అపసవ్యమైన మార్గంలో వచ్చింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఒక మనిషికి ఒక వోటు, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటి పార్లమెంటరీ వ్యవస్థలన్నీ యూరప్ లో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాల ఫలితంగా, రెండు మూడు శతాబ్దాలు ఆ సమాజాలు కళపెళ ఉడికిన చరిత్ర నుంచి ఆవిర్భవించినవి.

ఆ సమాజ మథనంలోంచి మనిషి వ్యక్తిగా రూపొందిన ఫలితంగా వ్యక్తి స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక వోటు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటువంటి సామాజిక సంచలనం ఏదీ లేకుండా భారత సమాజంలోకి బ్రిటిష్ వలసవాదం పార్లమెంటరీ సంస్థలను తీసుకొచ్చి, అంటుకట్టింది. ఈ అంటుకట్టిన మొక్క ఇక్కడి నేలలో పుట్టి, ఇక్కడి వాతావరణంలో ఢక్కామొక్కీలు తిని ఎదిగి వచ్చినది కాదు. ఇది బోన్సాయి ప్రజాస్వామ్యం. కుండీలో మొక్క. ఇది పూలు పూయదు, కాయలు కాయదు. దీని ఆకుల మీద నీళ్లు చిలకరించి నిగనిగలాడేట్టు చేసినా, ప్లాస్టిక్ పూలు అలంకరించినా, కుక్కమూతి పిందెలనే కాయలని భ్రమింపజేసినా, ప్రజలకు దక్కేది ప్రజాస్వామ్య పాలనా ఫలితాలు కావు.

ఐదేళ్లకొకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు జరిపించినంత మాత్రాన, ఆ ఎన్నికల విధానానికి సవరణలు చేస్తున్నామని అతుకులూ మాట్లూ అలంకరణలూ చేసినంత మాత్రాన ఇది రూపంలో పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే తప్ప, సారంలో ఈ దేశ ప్రజలకు అవసరమైన, ఈ దేశ ప్రజా ప్రయోజనాలను తీర్చే ప్రజాస్వామ్యం కాజాలదు. అందులోనూ అసలు ఎన్నికలు అనే ప్రహసనాన్ని కూడ అంగీకరించని, నిరంకుశ, మతోన్మాద, విద్వేష పాలనను కోరుకునే హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు పాలకులు ఎన్నికల వ్యవస్థను కనీసంగా కూడ సంస్కరించజాలరు. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలనే ఆలోచనకే వాళ్లు వ్యతిరేకం. ఈ స్థితిలో ఇటు ఎన్నికల సంస్కరణల పేరు మీద సాగుతున్న ఈ బూటకాన్ని మాత్రమే కాక, అసలు ఎన్నికల, పార్లమెంటరీ ప్రజాస్వామ్య బూటకాన్ని కూడ ప్రజల్లో వివరించే బాధ్యత చేపట్టడమే బుద్ధిజీవుల కర్తవ్యం.

- ఎన్.వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం

Keywords : elections, parliament,
(2024-04-14 06:22:29)



No. of visitors : 813

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అపసవ్యపు