నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల చరిత్ర ʹసైరన్ʹ నవల
09-01-2022
ప్రముఖ విప్లవ రచయిత అల్లంరాజయ్య రాసిన సింగరేణి కార్మికోద్యపు నవల ʹసైరన్ʹ విడుదలయ్యింది ʹమలుపుʹ ప్రచురణలు ప్రచురించిన ఈ నవల కు యం. సుధాకర్ రావు ముందుమాట రాశారు. ఆ ముందుమాటలోని కొంత భాగం మీ కోసం...
ఆరంభం
అల్లం రాజయ్య రాసిన ఈ సైరన్ నవలను చదివితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత నలభై, యాభై యేండ్ల కింద రైతాంగం, ఆదివాసులు, సింగరేణి కార్మిక వర్గపు స్థితిగతులు ఎలా ఉండేవో తెలిసి వస్తాయి. అలాగే ఉద్యమ సంస్థల కార్యకలాపాల వలన శ్రామిక వర్గం చైతన్యం పొందుతూ, సంఘటిత పడుతూ, నెత్తుటి త్యాగాలతో సాగించిన పోరాటాల వల్ల అనేక విజయాలు సాధించుకున్నారనేది అర్థమవుతుంది.
ఉద్యమాల ప్రాంతానికి మధ్యలో నాలుగు రోడ్ల కూడలి లాంటి మంచిర్యాలలో ఉద్యోగం చేసి, రిటైర్మెంటయ్యి మంచిర్యాలలోనే స్థిరపడిన అల్లం రాజయ్య మంచిర్యాలకు నలువైపులున్న ప్రజల బతుకుల్ని ఆ కాలపు విద్యార్థులు, యువకులందరిలాగే అధ్యయనం చేస్తూ వచ్చిండు.
మంచిర్యాలకు ఒకవైపు గ్రామాలూ, పల్లెలతో కూడిన రైతాంగ ప్రాంతం. అక్కడ పాలకుల అండతో కరడు గట్టిన దొరలు భూస్వాములు సాగిస్తూ వచ్చిన దుర్మార్గాలు. భూములు లేక, బువ్వకు లేక, శ్రమకు తగ్గ ఫలితం రాక, వెట్టిచాకిరీలతో, మాన ప్రాణాలకు భద్రత లేక, అర్థ బానిసల్లాగా, ʹʹఅయ్యా`బాంచన్` దొరా!ʹʹ అంటూ అనిగి మనిగి బతుకు తుండేటి బడుగు బలహీన వర్గాల గ్రామీణ ప్రజలు మరోవైపు. ముఖ్యంగా దళితులు. ఆనాటి ఆ బతుకులు గుర్తుకస్తే`
ఏనాటి కానాడు ఎండ వానల్లోన
చేసి చేసి ప్రాణ మిసిగి పోతున్నాది
కూలి చాలని కూలి ఓరన్నా`
దొరల కుక్కలే నయము రా కూలన్న...
పచ్చ జొన్న గడుక
తెల్ల కారపు ముద్ద(తాళు మిరుపకాయల కారం)
చేదు నోటికి పోదు
బాధ దేవుడెరుగు
ఏడుపే మిగిలెరా ఓరన్నా`
మనకు ఏందిరా ఈ బతుకు కూలన్న...ʹʹ అంటూ ఆ రోజుల్లో పాడుకున్న పాటలు యాదికి వస్తాయి.
మంచిర్యాలకు మరొకవైపు విశాలమైన అడవులు, కొండలు, విస్తారమైన ఖనిజ సంపదలు, ఎప్పుడూ నీరు పారేటి జీవనదులు, వాగులతో కూడిన ఆదివాసి ప్రాంతం. పాలకులు, ఫారెస్ట్ అధికారులు, షావుకార్లు సాగించే దోపిడీ, దౌర్జన్యాల వలన భూములు లేక, బువ్వకు లేక తాగనీకి నీరు లేక, రోగమస్తే మందుల్లేక, కట్టుకోను సరిపడు బట్టలేక, ఉండనీకి సరైన గుడిసెలు సైతం లేక ఆకలి బాధలతో, అనారోగ్యాలతో, అర్ధనగ్నంగా బతుకుతుండే ఆదివాసులు. ఆ ప్రాంతానికి ఆనుకొని విస్తారమైన అడవి దండకారణ్యం.
ఇంకొకవైపు దక్షిణ భారత దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి పారిశ్రామిక ప్రాంతం. దక్షిణ భారతదేశానికే వెలుగుల నిస్తున్న కరెంటు ఉత్పత్తికి, వేలాది పరిశ్రమలకు ఇంధనంగా ముడి సరుకుగా ఉపయోగపడుతున్న బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. దోపిడి, పీడన, హింస, దౌర్జన్యాలతో చితికి పోతూ, చీకటి బతుకు నీడ్చే వేలాది గని కార్మికులు. కార్మిక ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటాలు సాగించకపోగా కంపెనీ యాజమాన్యాలకు తొత్తులుగా, పైరవీ కారులుగా, లంచ గొండులుగా, వ్యాపారులుగా మారి కార్మిక వర్గానికి క్షమించరాని ద్రోహం చేస్తున్న ట్రేడ్ యూనియన్ల నాయకులు...
ఆదివాసీ, మైదాన గ్రామీణ రైతాంగం, పారిశ్రామిక కార్మిక వర్గం పక్కపక్కనే నివసించే కూడలి మంచిర్యాల.
సింగరేణి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ. పాలకులకు మరియు వారికి ఏజెంట్ గిరి చేసే సింగరేణి యాజమాన్యానికి అతి తక్కువ ఖర్చుతో అధికోత్పత్తి కావాలి. ఆ బొగ్గుతో పెట్టుబడిదారుల అవసరాలు తీరాలి. అతి భయంకరంగా, ప్రమాదకరంగా మృత్యు గుయ్యారాల్లాంటి భూగర్భ గనుల్లోకి పోతూ, ప్రమాదాలకు, దీర్ఘకాలిక రోగాలకు గురవుతూ, అతి కష్టమైన పనులను బానిసల్లా చేయగలిగే కార్మికులు కావాలి.
సింగరేణిలో కోల్ స్క్రీన్ ప్లాంట్((సియస్‌పి)ల నుండి ప్రతి రోజు మూడు షిప్టులప్పుడు కార్మిక బస్తీలకు విన పడేలాగా సైరన్ కూతలు వినిపిస్తుంటాయి. పని భారంతో, శ్రమదోపిడితో, వెట్టి చాకిరీలతో, ఆసౌకర్యాలతో, హక్కుల లేమితో కార్మికుల నెత్తురును, శ్రమ శక్తిని జుర్రుకుంటూ అధికోత్పత్తిని రాబట్టుకునే దురాశపూరితమైన అంతులేని దాహంతో ఆవురావురుమన్నట్లుగా కార్మికులను పిలుస్తూ సైరన్ కూతలు కూస్తుంటాయి.
గనుల నుండి ఉత్పత్తి అయ్యే బొగ్గు వెంట వెంటనే ట్రాన్స్పోర్టు కాని పరిస్థితుల్లో గనుల పైన డంపింగ్ చేయగా కుప్పలుగా పేరుకు పోతుంది. అలాంటి బొగ్గును చిన్న పరిశ్రమల వాళ్లకు, చిల్లర వ్యాపారులకు అమ్మడం జరుగుతుంది. ఆ బొగ్గును కొనుక్కుపోయేందుకు రోజూ వందలాది లారీలు వస్తుంటాయి. అలాంటి స్టాక్ కోల్‌ను లారీలల్లో నింపేందుకు గ్యాంగ్‌కు ఎనిమిది మంది చొప్పున వందలు, వేలాది మంది నిరుద్యోగులు కాంట్రాక్టు లేబర్లుగా పని చేస్తుంటారు. ఈ కార్మికుల కడుపులు కొడుతూ కమాయించుకునేందుకు కాంట్రాక్టర్లు, యూనియన్ల నాయకులు, వారి గూండాల దోపిడీ దౌర్జన్యాలు, అణచివేతలు, హత్యలు, అత్యాచారాలు కొనసాగాయి.
గ్రామాలూ, పల్లెలల్లో బతుకుల్లేక, బతక లేక కడుపు చేత పట్టుకొని కాలరీ ప్రాంతాలకు వచ్చి గని కార్మికులుగా మారడం జరుగుతూ వచ్చింది. మొదట్లో దళితులు, బలహీన వర్గాల వారు రాగా కాలక్రమంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ పై కులాల వాళ్ళు, మధ్య తరగతికి చెందిన విద్యావంతులు బొగ్గుగని కార్మికులుగా రెక్కలమ్ముకునేందుకు సింగరేణికి రావడం పెరిగింది. ఫలితంగా లంచాలు ఇస్తే తప్ప ఉద్యోగాలు లభించని పరిస్థితులు పెరిగాయి. లంచాల రేటూ పెరుగుతూ వచ్చింది.
ఉద్యోగాలు లభించక కాంట్రాక్ట్ కార్మికులుగా, చిల్లర వ్యాపారులుగా, అడ్డా కూలీలుగా, కుల వృత్తులు చేసుకుంటూ సింగరేణి లో జీవించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలాంటి అసంఘటిత కాంట్రాక్టు కార్మికులు అసౌకర్యాలు, అణిచివేతలు, హత్యలు, అత్యాచారాలు, ఎదుర్కొంటూ సింగరేణి ప్రాంతంలో జీవనం సాగించారు.
సింగరేణి కార్మికుల, వారి కుటుంబాల బాధలు వివరించాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది. గనులల్లో రక్షణ నిబంధనలు సరిగా అమలు కావు. ఉచితంగా లభించే గాలిని సైతం గని పని స్థలాల్లోకి సరిపడినంతగా సప్లై చేయక గాలి కోసం కూడా సమ్మెలు చేయవలసి వచ్చేది. యాక్సిడెంట్లు, అకాల మరణాలు, దీర్ఘకాలిక రోగాల పాలవ్వడం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంలాంటి సమస్యలతో అర్ధాంతరంగా తనువులు చాలించడం, అంగవైకల్యం జరగడం, పరిహారాలు లభించక పోవడం లాంటి సమస్యలు ఉండేవి.
కంక బొంగులు, వరిగడ్డి కప్పులు, తంగేడు పొరకల దడులు, చిన్న చిన్న సందులతో కూడిన గుడిసెలు, బురద గుంటలు, బూడిద కుప్పలు, దోమల బాధలు, పందుల రొదలు, బస్తీలను కమ్ముకునే బొగ్గు పొయ్యిల పొగలు, కరెంటు లేని చీకటి కొంపలు, చితికిన బతుకులతో కార్మిక బస్తీలు నరకకూపాలుగా ఉండేవి. నీటి కోసం నల్లాల వద్ద నిత్యం కొట్లాటలు. విద్య, వైద్యం, కరెంటు, నీరు, పారిశుద్ధ్యం సౌకర్యాలు లేక సకల బాధలతో బతకవలసి వచ్చేది. అధిక శ్రమ, అధిక దోపిడికి గురవుతూ, అనారోగ్యాల పాలవుతూ, శారీరక, మానసిక బాధలను తట్టుకోలేక కల్లూ, సారా, గుడుంబా, బ్రాందీ ల్లాంటి మత్తు పదార్థాలు సేవించడానికి కార్మికులు అలవాటు పడుతూ ఆర్థికంగా, శారీరకంగా మరింత నష్టపోవడమే గాకుండా కుటుంబాల్లో గొడవలు, అశాంతి కొనసాగుతూ ఉండేది.
రాజకీయ పార్టీల నాయకులు, భూస్వాములు, ట్రేడ్ యూనియన్లు, వడ్డీ వ్యాపారులు, కల్లు, సారా కాంట్రాక్టర్లు గూండాలను పోషిస్తూ వచ్చారు. చివరకు కార్మికులను కొట్టి, బెదిరించి సమ్మెలకు తలపడకుండా చేసేందుకు సింగరేణి యాజమాన్యం కూడా స్ట్రయిక్ కంట్రోలింగ్ కమిటీల పేర గూండా కమిటీలను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. గ్రామాల్లోలాగే సింగరేణి ప్రాంతంలో కూడా అధికారులను ʹʹబాంచన్` దొరాʹʹ అంటూ అణిగి ఉండడం, గుండాల దాడులు, హత్యలు, అత్యాచారాలకు గురవుతూ బతకవలసి వచ్చేది. వేలాది ఎకరాల భూములు, కల్లూ, సారా, మావులాలు, కంట్రాక్టులు, సినిమాహాల్లు కలిగి రాజకీయ నాయకులుగా, ట్రేడ్ యూనియన్ నాయకులుగా కొనసాగిన చుట్టుపక్కల దొరలు భూస్వాములు సాగించిన అరాచకాలు, దుర్మార్గాలు, అత్యాచారాలు హత్యలకు లెక్కేలేదు.
1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించబడిరది. విప్లవ సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులపై, ప్రజా ఉద్యమాలపై అణచివేత, రాజ్యహింస పెచ్చరిల్లింది. దేశమే జైలుగా మారింది. సింగరేణి కార్మిక వర్గం పై దోపిడీ, పీడనలు, అణిచివేతలు మరింతగా పెరిగాయి.
ఎమర్జెన్సీ 21.03.1977 నాడు ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో విప్లవ సంస్థల బహిరంగ కార్యక్రమాలు జోరందుకున్నాయి. విప్లవోద్యమ పార్టీల ప్రజాసంఘాల నాయకత్వంలో ఉత్తర తెలంగాణలో విద్యార్థి, యువజన, రైతాంగ పోరాటాలు తీవ్రమయ్యాయి. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో బూర్జువా, రివిజనిస్టు యూనియన్ల నాయకత్వాలను ఎదిరిస్తూ రాడికల్స్ విద్యార్థుల నాయకత్వంలో అనేక సమస్యలపై సంఘటిత పోరాటాలు మొదలయ్యాయి. కార్మిక వర్గంలో ఐక్యత రావడమే గాకుండా కార్మికుల పోరాటాలకు మద్దతుగా విద్యార్థులు, యువజనులు కదలడం పెరిగింది. ఇలా సంఘటిత, నిరవధిక, సమరశీల పోరాటాలు సాగుతున్న పరిస్థితుల్లో మరొకవైపు ఈ పోరాటాలను, విప్లవ సంస్థలను దెబ్బతీసేందుకు రాజ్య హింస పెరిగింది. అణిచివేత చట్టాలు అమలుకు వచ్చాయి. సస్పెండ్లు, డిస్మిస్‌లు, టర్మినేషన్లు, ట్రాన్స్‌ఫర్లు, అరెస్టులు, స్ట్రయిక్ కంట్రోలింగ్ కమిటీలు, గ్రీవెన్స్ ప్రొసీజర్లు, లాకౌట్లు, సమ్మెల నిషేధం, చట్టవిరుద్ధ సమ్మెల పేరుతో జీతాల్లో కోత విధించడం లాంటి మేనేజ్మెంట్ అణిచివేత రూపాలు పెరిగాయి. మరొకవైపు కూలిపోతున్న తమ పునాదుల్ని కాపాడుకునేందుకు బూర్జువా, రివిజనిస్టు జాతీయ యూనియన్లు సింగరేణి యాజమాన్యం తో, పోలీసులతో చేతులు కలిపి బూటకపు ఎన్‌కౌంటర్లు ఆరంభమయ్యాయి. అరెస్టులు, అక్రమ కేసులు లాంటివి పెరిగాయి. మరొకవైపు ఈ రాజ్యహింసను ప్రతిఘటిస్తూ, విధిలేని పరిస్థితిలో ఉత్తర తెలంగాణలో గెరిల్లా దళాల నిర్మాణాలు, కార్యక్రమాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
సింగరేణి పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా ఎంతో మంది కార్మికులు, విద్యార్థులు, యువకులు పూర్తికాలం కార్యకర్తలుగా మారి ప్రజల కోసం, విప్లవం కోసం పనిచేయడం కొనసాగింది. 1980 వరకు రాడికల్స్ పేరుతోనే కార్మికోద్యమాలకు నాయకత్వం వహించడం జరిగి 1981 ప్రథమార్ధంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సి.కా.స) ను కార్మికులు చరిత్రాత్మకమైన 56 రోజుల సమ్మె మధ్యలో స్థాపించుకున్నారు. సికాస నాయకత్వంలో అనేక సమస్యలపై సంఘటిత, నిరవధిక, సమరశీల, చారిత్రాత్మక సమ్మె పోరాటాలు సాగుతూ కార్మిక వర్గం అనేక విజయాలు సాధించుకున్నారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతం సంఘటిత పోరాటాల ప్రాంతంగా నెత్తుటి త్యాగాల నేలగా, ఎంతోమంది విప్లవకారులకు జన్మనిచ్చిన పురిటిగడ్డగా పేరుగాంచింది. ఇది మన కాలంలో మనందరికి తెలిసిన చరిత్రే.
భూమి, భుక్తి, విముక్తి కోసం గ్రామ ప్రాంతాల్లో రైతాంగ పోరాటాలు, జల్` జంగల్, జమీన్ కోసం, అడవిపై హక్కు కోసం ఆదివాసి ప్రాంతంలో తుడుందెబ్బలు, సింగరేణి ప్రాంతంలో సమ్మెల సైరన్లు, ఇలాంటి పోరాటాల నుండి రైతులు, కార్మికుల నుండి అనేక మంది రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు పుట్టుకొచ్చి తమ వంతు కర్తవ్యంగా అనివార్యంగా అనేక పాటలు, నవలలు, కథలు, కథనాలు రాసి ప్రచురించారు. అల్లం రాజయ్య` విప్లవోద్యమాల పుట్టుకకు ముందూ, ఆ తర్వాత సమాజం లోని ప్రజల జీవితాలను, ఉద్యమాలను, రాజ్యహింసలను, మార్పులను గతితార్కిక, భౌతికవాద అవగాహనతో అర్థం చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ, అక్షర రూపమిస్తూ తన సహచర రచయితలైన పి.చంద్, తుమ్మేటి రఘోత్తమరెడ్డిలతో కలిసి అనేక కథలు, నవలలు రాస్తూ వచ్చాడు. రచయితలకు కళాకారులకు కవులకు ప్రజల ఆరాట పోరాటాలు స్ఫూర్తినిచ్చాయి. ఆ క్రమంలో ఆలస్యంగా నైతేనేమి ఈ సైరన్ నవల వెలువడుతోంది.
సూటిగా సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే` మానవ సమాజ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రే నన్నట్లుగా, పోరాటాలు లేకుండా ఎప్పుడూ, ఎక్కడా, ఎలాంటి మార్పులు జరుగలేదు. సింగరేణి కార్మికవర్గం పనిలో, గనిలో, నివాసాల్లో, జీవితాల్లో వచ్చిన మార్పులు, పొందుతున్న హక్కులు, అనుభవిస్తున్న సౌకర్యాలు, తదితరాలన్నీ పాలకులు, కంపెనీ యాజమాన్యం దయతలచి ఇచ్చినవి కానేకాదు. కార్మికవర్గం చైతన్యయుతంగా, సంఘటితంగా సాగించిన పోరాటాల వల్లనే చేకూరాయని, అదంతా అమరుల త్యాగాల ఫలితమేనని మర్చిపోకూడదు.
ఈ సైరన్ నవలలో 1980 నాటి వరకున్న పరిస్థితులు, కొన్ని సమస్యలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఈ నవలలో పేర్కొన్న వ్యక్తుల పేర్లు ఏవైనప్పటికీ ఏరియాలు, బస్తీల పేర్లలో కొన్ని మార్పులున్నప్పటికీ స్థల, కాలాలు, సందర్భాల్లో మార్పులున్నప్పటికీ చెప్పిన సంగతులు, సంఘటనలు, పరిస్థితులన్నీ అక్షర సత్యాలే. మందమర్రిలో భూస్వాముల దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున కదిలి సినిమా హాల్ ఫర్నిచర్ను ధ్వంసం చేయడం, గూండాల ఇండ్లు కాలబెట్టడం, బ్రాందీ షాపు పైన దాడి చేయడం లాంటి ప్రజాప్రతిఘటన జరిగిÑ ప్రజలపై పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు చేయగా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయి ఎంతో మంది గాయపడిన దినం 1979 జనవరి ఆరవ తేది.
ఈ విధంగా` గత యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలి పెట్టి కడుపు చేతపట్టుకొని కాలరీ ప్రాంతాలకు ఎందుకు పోవలసి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డా కూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు, యూనియన్లు, రాజకీయ నాయకులు, గూండాలు ప్రజల జీవితాలతో ఎలా చెలగాట మాడారో? విప్లవ సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాక సింగరేణి ప్రాంతంలో ఎలా చిచ్చు రగిలి నిప్పు రాజుకుందో? అర్థం గావడానికి ఈ నవలను చదవడం ఎంతైనా అవసరం.
చివరగా ఒక విషయం ఏమంటే` సైరన్ పేరుతో అల్లం రాజయ్య రాసిన ఈ నవల 1985 నాటికి రావాల్సి ఉండే. ప్రజల కోసం రాసేటి ఏ రచన అయినప్పటికీ సకాలంలో రాగలిగితేనే ఆశించిన ఫలితాలు రాగలిగే అవకాశం ఉంటుంది. చదువు రాని వారికి చదువు నేర్పునట్లుగా, అంబాడుతున్న పిల్లలకు నడక నేర్పునట్లుగా, నడక నేర్చిన వారికి పరుగు నేర్పునట్లుగా రచనలు ఉండాలి. ఆయా ప్రాంతాల్లో, ఆయా కాలాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఫీుకంగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజల బతుకులకు, ప్రజా ఉద్యమాలకు, నాయకత్వ సమస్యలకు అద్దం పట్టేలా రచనలు ఉండాలి. అంతే కాదు ప్రజలను చైతన్యపరిచేలా, సంఘటిత పర్చేలా, ప్రజా ఉద్యమాలు మరింత బలపడి ముందడుగు వేసేలా సాహిత్యం, కళలు ఉండాలి. కవులు, రచయితలు సమయానుకూలంగా, సకాలంలో స్పందిస్తూ ప్రజా ఉద్యమాలకు, సామాజిక మార్పులకు దోహద పడుతుండాలి.
అయితే సైరన్ నవల రావడానికి నాలుగు దశాబ్దాల ఆలస్యం జరిగినప్పటికీ ʹʹస్వాతంత్రం, గణతంత్రం, ప్రజాస్వామ్యంʹʹ పేరుతో పాలన సాగుతున్న దేశంలో ఈనాడే కాదు గత ఐదు దశాబ్దాల క్రితం కూడా పాలకుల, భూస్వాముల కంపెనీల యాజమాన్యాల, వామపక్ష సంస్థలుగా చెప్పబడే పార్టీల, ప్రజా సంఘాల, వాటి నాయకుల ఆచరణ ఎలా ఉండేదో? వారి రాజకీయ స్వభావం నాటినుండి నేటికీ ఎలా ఉందో? మరిచిపోకుండా ఉండేందుకు ఈ నవల దోహదపడుతుంది. సమస్యల పరిష్కారానికి, సమాజ మార్పుకు ప్రజా పోరాటం తప్ప మరో మార్గం లేదనే స్ఫూర్తిని సైరన్ నవల కలిగిస్తుంది. మన కాలపు కార్మికులు, వారి చుట్టూ విస్తరించిన ప్రజలందరి భావోద్వేగాల సృజనాత్మక రూపమైన సైరన్ నవల అందరు తప్పక చదవతగిన నవల.
యం. సుధాకర్ రావు
20 అక్టోబర్ 2020
ఈ పుస్తకం లభించు చోటు:
తెలంగాణ: నవతెలంగాణ అన్ని బ్రాంచీల్లో, 94900 99350.
నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్, 040-24652387
ఆంధ్రప్రదేశ్ : విశాలాంధ్ర అన్ని బ్రాంచుల్లో, 099489 50282.
ప్రజా శక్తి అన్ని బ్రాంచుల్లో.8331-829907
ʹఅనేకʹ విజయవాడ, 92472 53884
Keywords : allam rajayya, telangana, singareni, siren, malupu, revolutionary movement, radikals, singareni karmika samkhya
(2023-03-23 02:44:14)
No. of visitors : 574
Suggested Posts
| కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల- ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హ దయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీ |
| 45 మందిని చంపి నదిలో తోసేసిన పోలీసుల హత్యాకాండపై...ఓ ఐపీఎస్ అధికారి పుస్తకం... ʹహాషీంపురా 22, మేʹహత్యలు జరిగినరోజున దినకూలీలు, నేతపనివాళ్లు అయిన దాదాపు నలబై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్ జిల్లా మురాద్ నగర్ లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చిచంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్షసాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద |
| నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట గాథఈ దేశంలో బూటకపు కేసులు బనాయించి అనేక మంది ముస్లింలను, దళితులను, విప్లవ కారులను, ప్రజా పక్షం వహించే మేదావులను జైళ్ళలోకి నెడుతున్నారు పాలకులు. అలా జైళ్ళలో దశాబ్దాల తరబడి మగ్గి నిర్దోషులుగా బైటడినవాళ్ళే ఎక్కువ మంది. |