ʹపూచిన చెట్టుకిందనే రాలిన పువ్వుʹ -ఎన్.వేణుగోపాల్

ʹపూచిన

10-04-2022

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. నాలుగు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి పీడితురాలైన నిర్మల, ఆ చికిత్స కోసం హైదరాబాదు వచ్చి ఉన్న సందర్భంలో 2019 లో అరెస్టయింది. బొంబాయిలోని బైకుల్లా జైలులో కరోనా రెండు సంవత్సరాలూ సరైన చికిత్స కూడా అందక కాన్సర్ వ్యాధి ముదిరిపోయి, అనేక అవయవాలకు వ్యాపించింది. ఇక కొద్ది నెలల కన్న ఎక్కువ బతకదని వైద్యులు చెప్పిన తర్వాత, బొంబాయి హైకోర్టు ఆదేశం మేరకు ఆమెను జైలు నుంచి, హాస్పైస్ (చికిత్స కూడా అవసరం లేని స్థితికి చేరినవారిని ఆదరణతో చూసే అంతిమ శరణాలయం) కు కొన్ని నెలల కింద పంపించారు. అక్కడే ఆమె నిన్న ఉదయం 11.30కు తుది శ్వాస విడిచిందని పత్రికలు రాస్తున్నాయి. కెవిఆర్ ఎప్పుడో ఒక కవితలో రాసినట్టు నిర్మల ʹపూచిన చెట్టు కిందనే రాలిన పువ్వుʹ.

నిర్మలది కృష్ణా జిల్లా గన్నవరం సమీపం లోని కొండపావులూరు గ్రామం. 1980ల తొలిరోజుల్లో ఏదో హిందీ కోర్సు చదివి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండింది. ఆమె తండ్రి ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ సానుభూతిపరుడుగా కె జి సత్యమూర్తికి స్నేహితుడు. ఆ రోజుల్లో ముమ్మరంగా విస్తరిస్తున్న విప్లవోద్యమ ప్రభావంలో ఆమె కూడా ఆ ప్రభావానికి లోనై, విప్లవోద్యమ కార్యకర్తగా వచ్చింది. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అప్పటికి విజయవాడలో క్రాంతి పక్షపత్రిక, క్రాంతి ప్రచురణలు ప్రింటింగ్ వ్యవహారాలు చూస్తుండిన కిరణ్ (రాణి సత్యనారాయణ) ను పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ʹఆట, పాట, మాట బంద్ʹ అనే తీవ్ర నిర్బంధంలో క్రాంతి అచ్చుపనులు ఆగిపోయాయి. కిరణ్ అజ్ఞాతవాసానికో, మరొక పనికో వెళ్లిపోయాడు. నిర్మల కొద్ది కాలం ఇంటి దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. (బహుశా 1988లోనో, 89లోనో, ఆమెను కిరణ్ దగ్గరికి పంపించడానికి ఏర్పాట్లు జరిగినప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పడానికి జి శ్రీనివాస్, నేనూ బెజవాడ నుంచి స్కూటర్ మీద కొండ పావులూరు వెళ్లి ఆమెకు ఆ ఉత్తరం ఇవ్వడం నిన్ననో మొన్ననో జరిగినట్టు ఉంది).

కొన్నాళ్లకే ఆమె కూడా అజ్ఞాతజీవితంలోకి వెళ్లిపోయిందని, దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో భాగమయిందని, నర్మద అనే పేరుతో పని చేస్తున్నదని, కిరణ్ అజ్ఞాతంలోనుంచే వెలువడుతున్న క్రాంతి, ప్రభాత్ పత్రికల పని చూస్తున్నాడని అట అటలుగా వార్తలు తెలుస్తుండేవి. అప్పటి నుంచి ఇరవై ఏళ్ల పాటు ఆమె గురించి ఎప్పుడో ఒకసారి గడ్చిరోలీ, బస్తర్ లలో ఏదో ఘటన సందర్భంగా నర్మదక్క అనే పేరు పత్రికల్లో చూడడమే తప్ప ఇతర సమాచారం లేదు. 2012లో సాయిబాబా మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసులో నర్మద పేరు వినవచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగుండడం లేదని కూడా వార్తలు వచ్చాయి. చివరికి 2018లో ఆమెకు కాన్సర్ అని తేలిందని, ఇంక అడవిలో, అజ్ఞాతంలో ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని, అందువల్ల ఆమెనూ, కిరణ్ నూ కూడా ఏదైనా నగరంలో కాన్సర్ చికిత్స తీసుకుంటూ ఉండమని పంపించారని వార్తలు వచ్చాయి.

ఆమెకు హైదరాబాద్ లోనే కాన్సర్ చికిత్స జరుగుతున్నదని, ఆమెనూ, కిరణ్ నూ సికిందరాబాద్ లో ఆల్వాల్ లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారని 2019 జూన్ లో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో చాలా గందరగోళం కూడా ఉండింది. హైదరాబాద్ లో అరెస్టు చేశారని ఒకవైపు, మహారాష్ట్రలోని సిరొంచలో అరెస్టు చేశారని మరొక వైపు పోలీసులే పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇచ్చారు. ఆమె ఆలూరు భుజంగరావు కూతురు అని తప్పు సమాచారం ఇచ్చారు. గడ్చిరోలీ, దక్షిణ బస్తర్ లలో ఆమె మీద 65 కేసులున్నాయని ప్రకటించారు. అరెస్టు చేసినప్పుడు వారి దగ్గర పది లక్షల రూపాయలు దొరికాయని, అవి కాన్సర్ చికిత్స కోసం అని తెలుస్తున్నదని, ఆ మేరకు ఆస్పత్రుల కాగితాలు దొరికాయని చెపుతూనే, అది ʹలెక్క చూపని అక్రమ ధనంʹ అని రెండు మూడు నెలల కింద బెయిల్ వాదనల్లో వాదించడం దాకా ఆమె విషయంలో పోలీసులు ఎన్ని తిమ్మిని బమ్మిని చేసే మాటలు అన్నారో లెక్కలేదు. కాన్సర్ తీవ్రస్థాయిలో ఉన్న మనిషిని కళ్లారా చూస్తూ, ఆస్పత్రుల కాగితాలూ, మందుల కుప్పలూ చూస్తూ కూడా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించి బొంబాయి తీసుకువెళ్లి బైకుల్లా జైలులో ఉంచారు. ఆ 65 కేసుల్లో ఒక్కొక్క కేసుకూ తిప్పడం మొదలుపెట్టారు. ఈ లోగా కరోనా వల్ల తిప్పడం ఆగిపోయినా, కాన్సర్ కు చికిత్స అందించడంలో జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాధి ఇంకా ముదిరింది. మొదట రొమ్ము కాన్సర్ గా ప్రారంభమైనది మరెన్నో అవయవాలకు పాకింది.

భీమా కోరేగాం కేసులో నిందితులను బొంబాయికి మార్చినప్పుడు షోమా సేన్, సుధా భరద్వాజ్ లను ఆ జైలుకే మార్చారు. ప్రాణాంతకమైన వ్యాధితో కూడా నిర్మల గొప్ప స్ఫూర్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉన్నదని వాళ్లిద్దరూ చెప్పారు.
ఆమె పేరు మీద బైకుల్లా జైలుకు ʹవీక్షణంʹ పంపితే, ఆశ్చర్యకరంగా జైలు అధికారులు ఆమెకు ఇచ్చారు. ʹఎన్నాళ్లకిందనో తప్పిపోయిన స్నేహితుడు దొరికినట్టుగా ఉంది. పత్రికంతా చదివాను. క్రమం తప్పకుండా పంపండిʹ అని ఇంగ్లిష్ లో చిన్న ఉత్తరం రాసింది.
ఆమెకు తగిన చికిత్స ఇప్పించాలని హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే, వ్యాధి చికిత్సకు లొంగనంతగా ముదిరిపోయిందని, ఇప్పుడిక ఆమెకు ఏ చికిత్సా అవసరం కూడా లేదని, చివరి రోజులు ప్రశాంతంగా గడపగలిగే ఆహ్లాదకర వాతావరణం కావాలని, అందువల్ల హాస్పైస్ లో ఉంచాలని 2021 సెప్టెంబర్ లో బొంబాయి హైకోర్టు ఆదేశించింది. అది మరికొన్ని వారాలకు అమలు లోకి వచ్చి, ఆమెను బాంద్రాలోని ఒక క్రైస్తవ హాస్పైస్ లోకి మార్చారు.

2019 జూన్ అరెస్టు తర్వాత కిరణ్ ను బొంబాయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. సహచరి అంత తీవ్రమైన అనారోగ్యంతో ఉండగా, తుదిదశ కాన్సర్ చికిత్స జరుగుతుండగా, కనీసం ఆమెను కలుసుకునేందుకు కూడా ఆయనకు అనుమతి ఇవ్వలేదు. చివరికి గత వారం ఈ పరిస్థితినంతా వివరిస్తూ హైకోర్టు ముందుకు వెళితే, ఆమె అంత్యదశలో ఉంది గనుక గురు, శుక్ర, శని వారాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకూ ఆయనను పోలీసుల బందోబస్తులో ఆమె దగ్గర ఉండనివ్వాలని బుధవారం నాడు హైకోర్టు ఆదేశించింది. అయినా శనివారం 11.30 వరకూ ఆయనను తీసుకురాలేదు. 11.30కు ఆమె మరణించాక, అరగంటకు తీసుకువచ్చారు. కనీసం ఆమె చివరి క్షణాల్లో ఆయనతో పాటు గడిపే అవకాశం కోర్టు ఇచ్చినా పోలీసులు, జైలు అధికారులు దాన్ని అమలు జరగకుండా చూశారు.
నిర్మల హిందీ నుంచి తెలుగుకు, తెలుగు నుంచి హిందీకి అనువాదాలు చేసింది. స్వతంత్ర రచనలు చేసింది. కథలు రాసింది. మంచి వక్తగా, సిద్ధాంత, నిర్మాణ విషయాలు చెప్పే అధ్యాపకురాలిగా ఎదిగిందని విన్నాను. దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు ఆదివాసుల మధ్య విప్లవోద్యమ నిర్మాణం చేసింది.
నిర్మలకు కన్నీటి నివాళి.

ఈ సందర్భంగానే కిరణ్ గురించి కూడా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాణి సత్యనారాయణ డ్రాఫ్ట్స్ మన్ డిప్లొమా చదివి, 1971లో ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో, విద్యుత్ సౌధలో ఉద్యోగంలో చేరాడు. అతి కొద్ది రోజుల్లోనే విప్లవోద్యమంతో సంబంధంలోకి వచ్చి 1972-75 మధ్య పిలుపు పక్షపత్రిక పనుల్లో భాగమయ్యాడు. ఆరోజుల్లోనే ఉజ్వల పేరుతో రచనలు చేయడం ప్రారంభించాడు. ఎమర్జెన్సీలో అరెస్టయి, తప్పించుకుని అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఎమర్జెన్సీ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకే ఉద్యోగం వదిలేసి, క్రాంతి పక్షపత్రిక, క్రాంతి ప్రచురణలు అచ్చుపనుల బాధ్యుడుగా 1980-85 మధ్య విజయవాడలో ఉన్నాడు. 1985 నుంచి తీవ్రతరమైన నిర్బంధ కాలంలో మళ్ళీ అజ్ఞాతవాసానికి వెళ్లి, అక్కడ కూడా క్రాంతి, ప్రభాత్ తదితర పత్రికల అచ్చుపనుల బాధ్యుడుగా ఉన్నాడని విన్నాను. అది కాకుండా అరెస్టు వరకూ, దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఎక్కడ ఏయే బాధ్యతల్లో ఉన్నాడో తెలియదు. డెబ్బయో పడికి చేరిన కిరణ్ అనారోగ్యంతో, ఇప్పుడు సహచరి మరణించిన దుఃఖంలో, నిర్బంధంలో ఎంత ఆందోళనతో, వేదనతో ఉన్నాడో...

- ఎన్.వేణుగోపాల్

Keywords : narmada, nirmala, cpi maoist, n venugopal, martyr
(2024-04-24 22:34:02)



No. of visitors : 720

Suggested Posts


దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!

కా. నిర్మల @ నర్మద శనివారం ఉదయం కేన్సర్ తో మరణించిందనే విషాద వార్త తెలిసింది. ఆమె మరణంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది.

విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెక్రటేరియట్ సభ్యురాలూ, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం (కేఏఎమ్ ఎస్) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మలా కుమారి) ఏప్రిల్ 9వ తారీఖున ప్రభుత్వ నిర్బంధంలో తుదిశ్వాస వదిలిందనే సమాచారం మాకు ఆలస్యంగా తెలిసింది. కేఏఎంఎస్ ఆమెకు వినమ్ర నివాళి అర్పిస్తున్నది. ఆమె త్యాగాల దారిలో మరింత దృఢంగా ముందుకు సాగమని కేఏఎంఎస్ కార్

నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

అత్యంత సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు నిర్మల అలియాస్ నర్మదా దీదీ మహారాష్ట్ర జైలులో మరణించిన నేప‌థ్యంలో ఏప్రిల్ 25న దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అన్ని కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹపూచిన