సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్


సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్

సాంస్కృతిక

28-04-2022

వీక్షణం మే 2022 సంపాదకీయం

భారత సమాజపు విభిన్న సంస్కృతుల బహుళత్వాన్ని తొక్కేస్తూ ఒకే జాతి, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆచారవ్యవహారాలు అనే ఏకశిలాధిపత్యాన్ని స్థాపించడానికి ʹసాంస్కృతిక జాతీయవాదంʹ అనే సిద్ధాంతాన్ని ప్రవచించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాని పరివారం ఆ సిద్ధాంతంతో దేశంలో హిందూ బ్రాహ్మణీయ ఫాసిజాన్ని అమలు చెయ్యడానికి, మనుస్మృతిని దేశ సాధారణ ధర్మంగా మార్చడానికి, మత మైనారిటీల పట్ల, ప్రత్యేకించి ముస్లింల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, కుల వివక్షను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారం చేజిక్కినతర్వాత ఆ సిద్ధాంతం ఇంకెంత మాత్రమూ మాటగా, ప్రచారంగా మిగలలేదు. అంతకు ముందు నుంచే అలవాటైన హింసా ధోరణులను, దుందుడుకుతనాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. సాంస్కృతిక జాతీయవాదం అనే మేలిముసుగు తొలిగిపోయి విధ్వంసక, విద్వేషరూపం బైటపడుతున్నది. ఈ ఎనిమిది సంవత్సరాల్లో వరుస పెట్టి ఒక్కొక్క వ్యవస్థ మీద బుల్డోజర్ నడిపించి ధ్వంసం చేసే పని విజయవంతంగా చేస్తూ వస్తున్నారు. పాలనా వ్యవస్థను, విద్యావ్యవస్థను, సిబిఐ, ఐటి, ఇడి, ఎన్ ఐ ఎ వంటి ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి, వాటిని సంఘ్ పరివార్ శక్తులతో నింపివేశారు. న్యాయవ్యవస్థను ధ్వంసం చేశారు. భారత సామాజిక అధికారిక వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసి ఆ శిథిలాల మీద అధికారాన్ని నాగపూర్ కు అప్పగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుల్డోజర్ సంస్కృతినే సాంస్కృతిక జాతీయవాదానికి మారుపేరు చేశారు.

ఇంతకాలం భావజాలంలో ఉండిన బుల్డోజర్ క్రమంగా భౌతిక యంత్రం రూపంలోకి మారుతున్న పరిణామం ఇటీవల పెద్ద ఎత్తున కనబడుతున్నది.

గతంలో కనబడని బుల్డోజర్ ఫలానా తిండి తినొద్దు, ఫలానా బట్ట కట్టొద్దు, ఫలానా భావాలు ఉండొద్దు, ఫలానా రచనలు చేయొద్దు, నెత్తిమీద ముసుగు వేసుకోవద్దు, నీ భాష మాట్లాడొద్దు, నీ దేవునికి ప్రార్థన జెయ్యడానికి మైకు పెట్టొద్దు, అసలు నీ దేవునికి ప్రార్థనే చేయొద్దు, మా దేవుని ముందర పూలు అమ్మొద్దు అని ఒత్తిడి తెస్తుండేది. ఎందరో ఆలోచనాపరులను, ఎన్నో సున్నితమైన భావనలను, ఎన్నో జీవన దృశ్యాలను ఆ బుల్డోజర్ అణచివేసింది. ఇప్పుడిక నాల్గు పడగల హైందవ నాగపూర్ నడుపుతున్న ఆ బుల్డోజర్ వెయ్యిపడగల దుర్మార్గపు కోరలు విప్పి విషం చిమ్ముతూ దేశం మీద పరుగులు పెడుతున్నది. సర్వసంగ పరిత్యాగిగా కాషాయ దుస్తులు ధరించిన దొంగ సన్యాసి ముఖ్యమంత్రి వేషంలో బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్నాడు. తనకు వోటేయని వారిమీదికి బుల్డోజర్ నడుపుతానని బహిరంగంగా, నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఆ బుల్డోజర్ అక్కడ ఆగలేదు. అబద్ధపు ఆరోపణలతో, ఆరోపితులకు శిక్ష విధించాలంటూ, ఆరోపితుల ఇళ్ల మీదికి, చిరు వ్యాపారాల మీదికి, ప్రార్థనాస్థలాల మీదికి బుల్డోజర్ దూసుకొస్తున్నది. ఆరోపణ చేసేదీ, దర్యాప్తు చేసేదీ, విచారణ జరిపేదీ, శిక్ష విధించేదీ అన్నీ వారే. గంటల్లో, లేదా రోజుల్లో ఆరోపితులు శిక్షకు గురవుతారు. మూకస్వామ్యపు, అన్యాయపు, దుర్మార్గపు, ఏకపక్ష నిర్దాక్షిణ్యపు దారిలో న్యాయం, చట్టం, నాగరికత, ప్రజాస్వామ్యం అన్నీ బుల్డోజర్ కింద నేలమట్టమైపోతాయి.

కర్ణాటకలో అదృశ్య బుల్డోజర్ సాగుతుండగానే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలలో భౌతిక బుల్డోజర్ బీభత్సం ప్రారంభమయింది. హిందువుల ఊరేగింపు మీద రాళ్లు విసిరారనే అబద్ధపు ఆరోపణతో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లో ముస్లింల మీద దాడి మొదలయింది. రాళ్లు విసిరినవారి ఇళ్లు రాళ్ల కుప్పలుగా మార్చేస్తాం అని రాష్ట్ర హోం మంత్రి బహిరంగంగా అన్నాడు. వెంటనే అధికారులు బుల్డోజర్లు నడిపి యాబై ముస్లింల ఇళ్లు ధ్వంసం చేశారు. రాళ్లు విసిరిన ఘటన నిజమే అయినా, దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ʹసకారణమైన సందేహాలన్నిటినీ తీర్చిన తర్వాతనేʹ, ʹచట్టం నెలకొల్పిన ప్రక్రియ తర్వాతనేʹ నేరస్తులు నిర్ధారణ కావాలి, వారికి శిక్ష విధించవలసింది న్యాయస్థానమే తప్ప అధికారంలో ఉన్న రాజకీయ నాయకులో, అధికారులో కాదు. ఈ బుల్డోజర్ల విధ్వంసంతో పాటుగానే ఖార్గోన్ కు ఎనబై కి.మీ. పరిధిలోని అనేక గ్రామాల్లో ముస్లింల మీద దాడులు, ఆస్తుల విధ్వంసం, చిత్ర హింసలు జరిగాయి. ఇటువంటి వార్తలే గుజరాత్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ బుల్డోజర్ల దాడుల వార్తలన్నిటినీ తలదన్నుతూ స్వయంగా దేశ రాజధానీ నగరంలో బుల్డోజర్ల దాడి జరిగింది. జహంగీర్ పురి లో సంఘ్ పరివార్ శక్తులు అనుమతి లేకుండా ఆయుధాలు చేబూని తీసిన ఊరేగింపు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే, అవమానించే, బెదిరించే నినాదాలతో ముస్లిం ప్రార్థనా స్థలం ముందు రభస చేసింది. రంజాన్ ప్రార్థనల్లో ఉన్న ముస్లింలతో ఘర్షణకు దిగింది. పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అక్కడ జరిగిన ఘర్షణలో అటూ ఇటూ రాళ్లు రువ్వుకోవడం, ఆయుధాలతో బెదిరించుకోవడం జరిగాయి. ఇరు పక్షాలనూ అదుపులోకి తీసుకుని కేసు పెట్టవలసిన పోలీసులు, కేవలం ముస్లింల మీద కేసులు పెట్టి అరెస్టు చేశారు. బలవంతం మీద అరెస్టు చేసిన సంఘ్ పరివార్ నాయకులను వెంటనే వదిలేశారు. ఇవన్నీ చాలనట్టు అది రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్న స్థలం అనే అబద్ధపు ఆరోపణను సంఘ్ పరివార్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడ మొదలుపెట్టింది. పోలీసుల సాయంతో ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లు నడిపి ఒక మసీదుతో సహా ఎన్నో ఇళ్లను కూలగొట్టారు. పోలీసులు, అధికారులు అని ఊరికే అనవలసిందే గాని అందరికందరూ సంఘ్ పరివార్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. బాధితులు, బాధితుల తరఫున పౌర సంఘాలు, పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టగా, కూల్చివేతలు ఆపమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూల్చివేతలు కొనసాగాయి. చివరికి బృందా కరత్ తో సహా అనేక మంది కార్యకర్తలు, బాధిత ప్రజలు అడ్డు నిలవగా బుల్డోజర్లు ఆగిపోయాయి. ఇక్కడ ఆపాం గాని ఢిల్లీలో ఇంకా చాలా చోట్ల బుల్డోజర్లు నడపవలసి ఉంది అని సంఘ్ పరివార్ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారు. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు రాజ్యపు బుల్డోజర్ నిస్సిగ్గుగా, దూకుడుగా, దుర్మార్గంగా, అనాగరికంగా దూసుకొస్తున్నది. అది ఈ దేశాన్ని, బహుళ సమాజాన్ని, నాగరికతను, ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను భూస్థాపితం చేయదలచింది. ఈ దేశం మీద, బహుళత్వం మీద గౌరవం, ప్రేమ ఉన్నవాళ్లందరూ, ఈ దేశ భవిష్యత్తును కాంక్షించేవాళ్లందరూ మిగిలిన వివాదాలన్నీ పక్కనపెట్టి మొట్టమొదట ఈ బుల్డోజర్ ను అడ్డుకోవలసి ఉంది.

- ఎన్.వేణుగోపాల్, సంపాదకులు, వీక్షణం

Keywords : bulldozer, yogi, uttarpradesh, delhi, karnataka, bjp, RSS, attacks on muslims
(2022-06-28 13:45:59)No. of visitors : 241

Suggested Posts


మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ అని బ్

కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?

మిత్రులారా, నిన్న కొమురం భీం ʹవర్ధంతి సందర్భంగాʹ (ఒక పత్రిక అయితే ʹజయంతిʹ అని కూడ రాసింది!) రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన సభలు, సమావేశాలు, శ్రద్ధాంజలి ప్రకటనల వార్తలు చూస్తుంటే మనం మన పొరపాట్లను సవరించుకోవడానికి సిద్ధంగా లేమని తెలిసివచ్చి జాలీ నవ్వూ వచ్చాయి.....

దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్

రైతుల భూములు గుంజుకోని కంపెనీలకు కట్టబెట్టుటానికి, రైతులు ఏమి పండిచ్చాల్నో, ఏమి పండిచ్చొద్దో కంపెనీలు చెప్పుటానికి, తిండిగింజలు గుమ్ముల్ల దాసుకొని కరువు పుట్టిచ్చి పిరంగ అమ్ముకోవటానికి కంపెనీలకు సౌలత్ జెయ్యటానికి ఢిల్లి సర్కారు ఖానూన్లు జేసింది.

ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ

మనమిప్పుడు దేశంలో పెద్దఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి సాక్షులుగా ఉన్నాం. ఇక్కడ బలి పీఠం మీద ఉన్నది కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మత సమూహాలకు చెందినవారో మాత్రమే కాదు, మన రాజ్యాంగమే బలి పీఠం మీద ఉన్నది.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


సాంస్కృతిక