గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
09-05-2022
తన ప్రేమ-ప్రతిఘటనల జ్వాల నిరంతరం జ్వలిస్తూనే ఉండాలని జరుపుతున్న పోరాటం ఏ తేదీన ఏ మలుపు తిరిగిందో, ఏ తేదీన ఏమి ఎదురైందో ఆ తేదీలను ఒకటొకటిగా తన జ్ఞాపకం నుంచి తవ్వి తీస్తూ ఉంటుంది రచయిత్రి సహ్బా హుసేన్. ఆమె సహచరుడు, మానవ హక్కుల కార్యకర్త, భీమా కోరేగాం కేసులో నిందితుడు గౌతమ్ నవ్లాఖాను అరెస్టు చేయడానికి పూణే పోలీసులు తన ఇంటి మీద దాడి చేసిన 2018 ఆగస్ట్ 28 ఆమెకింకా గుర్తు. వేరువేరు న్యాయస్థానాలలో ఏ దరఖాస్తులు ఎన్నడు దాఖలు చేశారో ఆమె గుర్తు తెచ్చుకుంటుంది – ఆ దరఖాస్తుల మీద ఏ తీర్పులు ఏ తేదీన వచ్చాయో కూడ.
నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ముందు వారం రోజుల లోపల లొంగిపోవాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన 2020 ఏప్రిల్ 8 ఆమె స్మృతి ఫలకం మీద శిలాక్షరంలా చెక్కి ఉంది. సరాగంగా సాగిపోతున్న జీవనగానం స్వరం తప్పిన సంగీత వాయిద్యమైపోయిన ఆ క్షణాన, ఏప్రిల్ 13న నవ్లాఖా తన చిట్టచివరి పత్రికా శీర్షికను ఎట్లా రాశాడో ఆమె ప్రశంసతో గుర్తు చేసుకుంటుంది. ఆ మర్నాడే ఆయన ఢిల్లీ ఎన్ ఐ ఎ కేంద్ర కార్యాలయంలోపలికి అదృశ్యమవుతుండగా ఆమె వీడ్కోలు పలికింది.
ఇంకా ఏమి అనుభవించవలసి ఉన్నదో అని, ఇప్పటికి అనుభవించిన దాని నుంచి శక్తి పొందడానికి, సహ్బా ఈ గడిచిన నాలుగేళ్ల దృశ్యాలను మళ్లీ మళ్లీ తనకు తానే ప్రదర్శించుకుంటూ వీక్షిస్తూ ఉంటుంది. నవ్లాఖాకు స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది, తాము మళ్లీ ఎప్పుడు కలిసి ఉంటారు అనే ప్రశ్న నుంచే ఆమె వేదన, ఆందోళన పెల్లుబుకుతుంది. దాన్ని వియోగ వేదన అనుకుందాం. కాని దాన్ని రాజ్యం కల్పించింది గనుక అది మరింత దుర్భరం అయింది. రాజ్యం పట్ల తమ వ్యతిరేకతను సమర్థంగా వ్యక్తీకరించిన సాహసవంతులను వేధించడానికి రాజ్యం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టాన్ని ప్రయోగిస్తున్నది. నవ్లాఖా తన జీవితంలో అత్యధికభాగం రాజ్యవ్యతిరేకతను సమర్థంగా వ్యక్తీకరించాడు.
ఆ వేదన గురించి చెపుతుండగానే, హఠాత్తుగా అమె కళ్లలో మెరుపులు మెరుస్తాయి. 2021 నవంబర్ 24న ఏం జరిగిందో చెపుతున్నప్పుడు ఆమె గొంతులో సంతోషం ముప్పిరిగొంటుంది. ఆ రోజున నవ్లాఖాను ముంబాయిలోని తలోజా జైలు నుంచి ఆరోగ్య పరీక్షల కోసం జెజె ఆస్పత్రికి తీసుకువస్తున్నారని ఆమెకు తెలిసింది.
సహ్బా ఆ ఆస్ప్రతి వరండాలో నిలబడి ఎదురుచూస్తూ ఉండగా ఆయన చూశాడు. ముందుకు ఒక్క గంతు వేసి ఆమెను బిగ్గరగా కౌగిలించుకున్నాడు.
ఆ కౌగిలి ఎంత సేపుండిందంటే పక్కన ఉన్న కానిస్టేబుల్ ʹఎవరామె?ʹ అని అడగక తప్పదనుకున్నాడు. ʹయే తో మేరీ జిందగీ హై – ఆమె నా ప్రాణంʹ అన్నాడు నవ్లాఖా. ఆ కానిస్టేబుల్ అప్పటికీ అర్థం కానట్టు ముఖం పెట్టాడు గనుక ʹనా భార్యʹ అన్నాడు. ఒకవైపు ఆయనకు ఆరోగ్య పరీక్షలు జరుగుతుండగా, సహ్బా ఆయనను ఆట పట్టించింది: ʹఏయ్, ఇరవై ఆరేళ్లుగా కలిసి ఉంటున్నాం గాని, నువ్వు నన్నెప్పుడూ భార్య అనలేదుʹ అని.
అవును, సహ్బా నవ్లాఖా భార్య కాదు. వారు సహజీవనం సాగిస్తున్నారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఇద్దరికీ వారి మొదటి వివాహాల నుంచి పిల్లలున్నారు. ఇద్దరికీ మనవలూ మనవరాళ్లూ ఉన్నారు. దేశం బైట ఎక్కడెక్కడో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరూ సహ్బా గురించీ నవ్లాఖా గురించీ నిరంతరం ఆందోళన పడుతూనే ఉంటారు. ఆ ఇద్దరూ తమ ఎడబాటు విషాదాన్ని ఒంటరిగా అనుభవిస్తున్నారని.
ద్వేషం గురించి మాత్రమే తెలిసినవాళ్లకు ఈ ప్రేమ గురించి ఏం తెలుస్తుంది?
వాళ్ల ప్రేమ క్రియాశీల కార్యాచరణలో పుట్టింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి వ్యతిరేక ఆందోళనల్లో, కశ్మీరీల హక్కుల కోసం పోరాటంలో, చత్తీస్ గడ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాటంలో, కార్పొరేట్ శక్తుల పక్షాన నిలుస్తున్న రాజ్యాన్ని ప్రశ్నించడంలో, భారత సమాజాన్ని సైనికీకరించడానికి ఉత్సాహపడుతున్న రాజ్యాన్ని నిలదీయడంలో వాళ్లిద్దరూ కలిసి పనిచేశారు.
అసలు సహ్బా వారసత్వమే కార్యకర్తృత్వం. ఆమె తండ్రి ఆలం కుంద్ మీరీ 1939లో హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్ తొలి అధ్యక్షుడు. హైదరాబాద్ పాకిస్తాన్ లో కలవాలని కోరుకున్న రజాకార్లకు వ్యతిరేకమైనది ఆ సంస్థ. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ రాజ్యంలో రైతాంగ పోరాటం పెల్లుబికింది. హైదరాబాద్ విలీనం తర్వాత అప్పటి తొలిరోజుల కాంగ్రెస్ పాలన కమ్యూనిస్టులను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. కుంద్ మీరీని అప్పట్లో ʹకాఫిర్ʹ అని పిలిచేవారు.
ఆ కాఫిర్ కొడుకు జావేద్ ఆలం ఢిల్లీలో సల్వన్ కాలేజిలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1970ల్లో జయంతిని పెళ్లి చేసుకున్నాడు. ఆలం జయంతిని ఎత్తుకుపోయాడని అప్పటి జనసంఘ్ ʹజయంతి ఎక్కడ?ʹ అని పోస్టర్లు వేసి గోల చేసిందని అర్థశాస్త్రవేత్త ప్రభాత్ పట్నాయక్ గుర్తు చేసుకున్నారు. అప్పుడది ఎంత పెద్ద గొడవయిందంటే ఆ జంటను ఇందిరా గాంధీ పిలిపించారట. తాను తన ఇష్టప్రకారమే ఆలం ను పెళ్లి చేసుకున్నానని జయంతి ఇందిరా గాంధీకి చెప్పిందట.
లవ్ జిహాద్ అని ఆరోపణలు విసిరే రాజకీయ నాయకులు రావచ్చు, పోవచ్చు. కాని ప్రధానమంత్రి మాత్రం మౌనంగా ఉండిపోయారు.
కుటుంబ గతం ఏమైనప్పటికీ అది మారిన కాలంలో కష్టాలకూ కడగండ్లకూ సహ్బాను మాత్రం సిద్ధం చేయలేదు. ఉదాహరణకు, 2019 నవంబర్ 12న సహ్బా పుస్తకం ʹలవ్, లాస్ అండ్ లాంగింగ్ ఇన్ కశ్మీర్ʹ ఆవిష్కరణ జరగవలసి ఉండింది. అదే రోజు, నవ్లాఖా ముందస్తు బెయిల్ దరఖాస్తును పూణే సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆ కొట్టివేత జరిగిన 15 నిమిషాల లోపల పూణే పోలీసులు నవ్లాఖాను అరెస్టు చేయడం కోసం ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఆయన అప్పుడు ఇంట్లో లేడు. పుస్తకావిష్కరణ సభ రద్దు చేద్దామా సూచన వస్తే సహ్బా అంగీకరించలేదు. అలా చేస్తే తమను వేధించదలచుకున్న రాజ్య పన్నాగానికి లొంగినట్టే అవుతుందని అందామె. రెండు రోజుల తర్వాత, అరెస్టు చేయకుండా హైకోర్టు రక్షణ దొరికిన తర్వాత నవ్లాఖా ఇంటికి తిరిగి వచ్చాడు.
కొవిడ్ అనంతరం, జైళ్లలో ఖైదీలను కుటుంబ సభ్యులు కలవడానికి అనుమతించడం మొదలయ్యాక, 2021 నవంబర్ 26న తలోజా జైలులో నవ్లాఖాను కలవడానికి సహ్బాను అనుమతించలేదు. కారణం, ఆమె ఆయన భార్య కాదు. సహచరి మాత్రమే అని. అది చట్టంలో చెల్లని వాదన. అందుకే ఆ తర్వాత ఎన్ ఐ ఎ కోర్టు కూడ ఆ కారణాన్ని పక్కన పెట్టింది. ఇంకా హాస్యాస్పదంగా, నవ్లాఖాకు పోయిన కళ్లజోడు స్థానంలో మరొక కళ్లజోడు ఇవ్వడానికి, పి జి ఉడ్ హౌజ్ పుస్తకాలు ఇవ్వడానికి కూడ జైలు అధికారులు నిరాకరించారు. ప్రచారసాధనాల్లో ఆ వార్తలు వచ్చాక, న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాక మాత్రమే జైలు అధికారులు దిగివచ్చారు.
నాలుగు సంవత్సరాల వేధింపులతో సహ్బా తన తొలి దిగ్భ్రాంతి నుంచీ, అపనమ్మకం నుంచీ బైటపడింది. నవ్లాఖా నిర్బంధంతో ఆమె నరనరానా వ్యాపిస్తున్న లోతైన దుఃఖాన్ని అధిగమిస్తున్నది. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు ఇంకిపోయాయి. ʹకాని అప్పుడప్పుడు నన్ను విషాదం ముంచెత్తుతుందిʹ అందామె.
విచారణలో ఉన్న ఖైదీలకు త్వరితగతిన బెయిల్ ఇవ్వాలని ఇటీవల నరేంద్ర మోడీ అన్నాడు. మరొక అబద్ధపు వాగ్దానమా? సహ్బా ఒక ఎదురు ప్రశ్న వేస్తుంది: ఒక మనిషి నిరపరాధి అని తేల్చి చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు జైలు నిర్బంధాన్ని అనుభవించవలసి ఉంటుంది? అంతవరకూ సహ్బా నవ్లాఖాకు రాసిన ప్రతి ఉత్తరంలోనూ ʹఐ లవ్ యుʹ అని రాస్తూనే ఉంటుంది. ప్రేమా ధిక్కారమూ ఒకటే గదా.
(ముంబాయి నుంచి వెలువడే మిడ్ డే పత్రిక మే 9, 2022 ఆదివారం సంచికలో సీనియర్ జర్నలిస్టు అజాజ్ అష్రఫ్ రాసిన కాలమ్ కు తెలుగు: ఎన్ వేణుగోపాల్)
Keywords : Gautam Navlakha, Writer Sahba Husain, bhima koregaon, bk16. bk15
(2024-08-30 19:28:58)
No. of visitors : 900
Suggested Posts
| bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |