జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
27-05-2022
కవి, కబీర్ కళా మంచ్ సాంస్కృతిక కార్యకర్త సాగర్ గోర్ఖే జైలులో పరిపాలనా దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మే 20వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. జైలు సిబ్బంది తనను బెదిరించి తన సొంత దోమతెరను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ మే 20న ఖార్ఘర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జైలు అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుకు సంబంధించి మే 20న హోంమంత్రి దిలీప్ వాల్సే-పాటిల్కు గోర్ఖే లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం -
గౌరవనీయులైన గృహ మంత్రి గారికి,
మహారాష్ట్ర
విషయం: తలోజా సెంట్రల్ జైలు పరిపాలనా నిర్దయ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష
సర్,
నేను, సాగర్ తాత్యారామ్ గోరఖే, రాజకీయ ఖైదీని, ఎల్గార్ పరిషత్ భీమా కోరేగావ్ కేసులో సెప్టెంబర్ 2020 నుండి తలోజా సెంట్రల్ జైలులో బందీగా వున్నాను. మొదటి నుంచీ కూడా జైలు పరిపాలన భీమా కొరేగావ్ కేసు నిందితుల పట్ల అత్యంత పక్షపాతంతో వ్యవహరించిందని చాలా బాధతో మీకు తెలియజేస్తున్నాను. ఫలితంగా, నాకు, నా సహ నిందితులకు జైలు ఒక చిత్రహింసల కొలిమిగా మారింది. గత సంవత్సరం ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ మరణానికి దారితీసింది జైలు పరిపాలన దుశ్చర్యలే అనే విషయం మీకు తెలిసి వుంటుంది.
నేటికీ, ప్రతిరోజూ జైల్లో మా ప్రాథమిక మానవ హక్కులను కాలరాచివేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా భరించలేనిదిగా మారడంతో నేను నిరసనగా మనోవేదనతో నిరాహారదీక్ష చేయాల్సి వస్తోంది. ఫాదర్ స్టాన్ స్వామి ప్రథమ వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో ఈ దురాగతాలను వివరించాల్సి రావడం మరింత యాతనగా వుంది.
నేను వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, చర్మ అలెర్జీల వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ, జైలు వైద్య అధికారులు ఉద్దేశపూర్వకంగా నాకు చికిత్స చేయడం లేదు. జైలు సూపరింటెండెంట్ వైద్యాధికారులతో కుమ్మక్కై వైద్యం అందకుండా అడ్డుపడుతుండడం వల్ల నేను చాలా బాధననుభవిస్తున్నాను. బయటి ఆసుపత్రుల నుండి వైద్య సేవలను పొందడం గురించి కోర్టు తన ఆదేశాలలో స్పష్టం చేసినప్పటికీ సూపరింటెండెంట్, వైద్యాధికారులు తమకిష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకొంటున్నారు.
నా సహ నిందితులు గౌతమ్ నవ్లఖా, రమేష్ గయ్చోర్, సుధీర్ ధావలే, మహేష్ రౌత్, సురేంద్ర గాడ్లింగ్, ఆనంద్ తెల్తుంబ్డే, హనీ బాబు కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు, వారి చికిత్సను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. న్యాయవాదులు, కుటుంబాలు అందించే మందులను (ముఖ్యంగా ఆయుర్వేదం)యివ్వ నిరాకరించి మొత్తంమీద నిస్సహాయ స్థితికి నెట్టేస్తున్నారు.
డిమాండ్ నం. 1: దయచేసి ఎల్గార్ పరిషత్ కేసులో వున్న నాకు, నా సహ నిందితులకు తక్షణ వైద్య సేవలు అందించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య అధికారులపై చర్యలు తీసుకోవాలి.
నాకు, నా సహ నిందితులకు వచ్చిన ప్రతి లేఖను జైలు సూపరింటెండెంట్ చట్టవిరుద్ధంగా స్కాన్ చేసి నేరుగా దర్యాప్తు సంస్థలకు పంపుతున్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన గోప్యత హక్కును ఉల్లంఘించి, చట్టాలను కాలరాసి జైలు పరిపాలన నేరానికి పాల్పడుతోంది. లేఖలను మా ముందు తెరవడానికి బదులుగా, మాకు వచ్చిన ప్రతి లేఖా మాకు చేరే సమయానికి తెరిచి వుంటుంది. పుస్తకాలు, వాటితో పాటు ఉన్న కాగితాలు, స్టాంపులను దొంగిలిస్తారు. అదేవిధంగా బయటికి పంపుతున్న లేఖను నా ముందు సీల్ చేయకుండా నేరుగా స్కానింగ్ కోసం పంపుతారు.
డిమాండ్ నెం. 2: పరిపాలన, దర్యాప్తు సంస్థలు చేసే లేఖల స్కానింగ్‌ను పూర్తిగా నిలిపివేయాలి, దోషులపై తగిన ప్రక్రియతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
జైలు నిబంధనల ప్రకారం ప్రతి ఖైదీకి తప్పనిసరిగా 135 లీటర్ల నీటిని అందజేయాలి, కానీ నిర్లక్ష్యధోరణిని ప్రదర్శించే తలోజా సెంట్రల్ జైలు పరిపాలన ప్రతి ఖైదీకి 15 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తుంది. వాస్తవానికి జైలు నిర్వాహకులు కృత్రిమ నీటి కొరతను సృష్టించి, అమ్ముకుంటున్నారు. ఖైదీలు కేవలం 15 లీటర్ల నీళ్లతోనే బతకాల్సిన పరిస్థితి వుండడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అనేక ఇతర ఖైదీలతో పాటు నేను చర్మ వ్యాధులతో బాధపడుతున్నాను, వేసవిలో ఈగలు, దోమల సంఖ్య కూడా పెరిగింది.
డిమాండ్ నెం. 3: జైలులో సృష్టించిన నీటి కొరతను, అమానవీయంగా అమ్ముకోవడాన్ని వెంటనే ఆపాలి. తక్షణమే ప్రతి ఖైదీకి 135 లీటర్ల నీరు అందేట్లు చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలి.
కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదులుగా ఖైదీలను కలవడానికి ప్రతిరోజూ 500 మందికి పైగా పౌరులు జైలుకు వస్తారు. అమలులో వున్న పురాతన వ్యవస్థ వల్ల పేరు నమోదు చేయడం నుండి ఖైదీని కలిసే వరకు సుమారు 5-7 గంటలు పడుతుంది. ఈ సమయంలో కూచోడానికి లేదా సందర్శకుల గదిలాంటి సాధారణ సౌకర్యాలు లేవు. స్వచ్ఛమైన తాగునీరు, ఫ్యాన్లు, సార్వజనిక శౌచాలయాలు కూడా సందర్శకులకు అందుబాటులో లేవు. ఈ అసమర్థ జైలు పరిపాలన వల్ల నన్ను కలవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే నా కుటుంబ సభ్యులు మరింతగా అలిసిపోతున్నారు.
డిమాండ్ నంబర్ 4: శాశ్వత సందర్శకుల గదిని వెంటనే నిర్మించాలి. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అత్యాధునికమైన టోకెన్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి.
కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో అన్ని రకాల/వర్గాల ఖైదీలకు టెలిఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నక్సలిజంతో సంబంధం ఉన్నట్లు నాపైన అభియోగాలు మోపబడినప్పటికీ, విపత్తు సమయంలో నేను నా కుటుంబ సభ్యులతో, నా న్యాయవాదులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడగలిగాను. అన్ని జాగ్రత్తలు తీసుకొని, తనిఖీ చేసి, నా పై మోపిన అభియోగాల గురించి తగిన ఆలోచన చేసిన తర్వాతనే, అందరిలాగే నన్ను టెలిఫోన్ లో మాట్లాడనిచ్చారు.
నాకు అందుబాటులో ఉండిన టెలిఫోన్ సదుపాయాన్ని ప్రస్తుతం నిలిపివేసారు. కారణం అడిగితే అడిషనల్ డి.జి.పి సర్క్యులర్- జైళ్లు& కరెక్షనల్ సేవలు (కాయిన్ బాక్స్/టెలిఫోన్ సేవలు/ 1411/ 2019 గది – 9(B) పూణే- 1 తేదీ: 12-02-2019) గురించి చెప్పారు. అందులోని క్లాజ్ 3 ప్రకారం – టెర్రరిస్ట్ కార్యకలాపాలు/ విద్రోహం/నక్సలిజం/ముఠా యుధ్ధాలు/వ్యవస్థీకృత నేరాలు/ అలవాటుగా నేరాలు చేసే ఖైదీలకు కాకుండా మిగిలినవారికి టెలిఫోన్ సేవలు అందించాలి.
ఒక నిందితుడిపై మోపిన ఆరోపణలన్నీ నిజమని రుజువయ్యే వరకు నేరస్థుడిగా పరిగణిస్తే, అది అతని ప్రాధమిక మానవహక్కులను నిరాకరించడమే అవుతుంది. కాబట్టి, నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని రుజువయ్యే వరకు నన్నుగానీ, అలాంటి మరెవరినీ గానీ నేరస్థులుగా పరిగణించకూడదు. అందువల్ల, జైళ్లు&కరెక్షనల్ సర్వీసెస్ జారీ చేసిన సర్క్యులర్‌ను అన్యాయమైనదిగా పరిగణించాలి.
డిమాండ్ నం. 5: పైన పేర్కొన్న సర్క్యులర్‌ను రద్దు చేయాలి. సమాన న్యాయ సూత్రం ప్రకారం విచారణ ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలందరికీ కోవిడ్-19 విపత్తు సమయంలో అందుబాటులో ఉన్న సేవలను తగిన ధృవీకరణతో, గుజరాత్, తెలంగాణా రాష్ట్ర జైలు టెలిఫోన్ సౌకర్యాల నమూనాను అనుసరించి అమలుచేయాలి.
గౌరవనీయులైన సర్,
పైన పేర్కొన్న డిమాండ్లపై తక్షణమే చర్య తీసుకోవాలని, ఆమోదించాలని, తదనుగుణంగా చర్య తీసుకోవాలని జైలు & కరెక్షనల్ సేవలను ఆదేశించాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను,
Yours Faithfully,
Sagar Tatyaram Gorkhe
MB – 335 Room. 5
High Security Cell
(తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి)
Keywords : kabeer kalamanch, sagar gorkhe, maharashtra, jail, Taloja Jail, hunger strike, FreeBK16, bk15
(2023-09-26 04:08:08)
No. of visitors : 928
Suggested Posts
| bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |