ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
11-07-2022
(అమరుల బంధు మితృల సంఘం 20 ఏళ్ళ మహా సభలు జూలై 17 ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఆ సందర్భంగా ఆ సంఘం వేసిన కరపత్రం పూర్తి పాఠం...)
ఈ జూలై 18కి అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడి 20 ఏళ్లు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాన్ని ఇరవై వసంతాల వేడుకగా జరుపుకుంటారు. మేం ఆ మాట అనలేకపోతున్నాం. ఇది వసంతమూ కాదు, వేడుకా కాదు. ఇంత కాలంగా ఈ సంస్థను నడపవలసి వచ్చినందుకు అత్యంత విషాదంతో ఈ సభలకు మేం సిద్ధమవుతున్నాం. అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడ్డాకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది అద్భుతమైన మా బిడ్డలను, సహచరులను, రక్తసంబంధీకులను మేం కోల్పోయాం. అపురూపమైన వాళ్ల దేహాలను మాంసం ముద్దలుగా తీసుకొచ్చుకున్నాం. శవాల గుట్టల మధ్య మా వాళ్లెవరో, ఇతరులెవరో తెలుసుకోలేక తల్లులందరి, భార్యలందరి ఒకే ఒక దు:ఖంలో మేం మావాళ్లను పోల్చుకున్నాం. ఇరవై ఏళ్లుగా దుఃఖాన్ని మూటగట్టుకొని ఈ సంస్థను నిర్వహిస్తున్నాం. కొడుకులను, కూతుళ్లను, భార్యలను, భర్తలను, తల్లిదండ్రులను, తోడబుట్టినవాళ్లను... సకల రక్త సంబంధాల్లో మా జీవితాల్లో భాగమైన వాళ్లను కోల్పోయి మోడువారి, ఈ కన్నీటి జడిలో చిగురించి అమరుల బంధుమిత్రుల సంఘంగా రూపాంతరం చెందాం.
ఇలాంటి సంఘానికి వసంతం ఉంటుందా? ప్రకృతి గతి క్రమంలో వసంతం ఉన్నది. కానీ మా వ్యక్తిగత జీవితంలో అదెన్నటికీ రాదని తెలుసు.కానీ మానవాళి చారిత్రకంగా ఒక మహాద్భుతమైన దశకు చేరుకుంటుందని మా బిడ్డల, సహచరుల ఆశయాల్లోంచి అర్ధం చేసుకున్నాం. అది పూలు పూచే వసంతానికన్నా, వెన్నెల కురిసే హేమంతానికన్నా సౌందర్యవంతంగా ఉంటుందని తెలుసుకున్నాం. మా ఇండ్లలో పుట్టి, మా జీవితాల్లో భాగమైన అమరుల గురించి తలచుకున్నప్పుడల్లా వాళ్ల స్వప్నాల్లో మాకు ఇవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ల కోసం ఏడ్చి ఏడ్చి తడారిపోయిన మా కళ్లలో విప్లవ స్వప్నాలు ప్రతిఫలిస్తుంటాయి. వాటిని పదిలపరుచుకోడానికి ఈ సంస్థను ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. వాళ్ల ఆశయాలపట్ల మా గౌరవాన్ని చాటడానికి ఈ సంఘం జెండాను మోసుకుతిరుగున్నాం.
ఈ ఇరవై ఏళ్లుగా అడవులకు, పల్లెలకు, శ్మశానాలకు మధ్య సంచరించాం. మార్చురీలకు, అంతిమయాత్రలకు మధ్య గడిపాం. కుళ్లిపోయి, పురుగులుపడి, నీరైపోయిన శవాల కోసం రోజుల తరబడి ప్రయాణాలు చేశాం. మృతదేహపు వాసన తప్ప మరే వాసనా తెలియకపోవడమే సహజ స్థితిగా జీవించాం. మాట్లాడటమంటే దు:ఖించడమనే ఏకైక వ్యక్తీకరణగా బతికాం. ఈ సమాజం ఎంత హింసాత్మకంగా ఉన్నదో మా సొంత జీవితంలో ఎంత తెలిసిందో చెప్పలేం కాని, మా రక్తసంబంధీకులైన విప్లవకారుల మృతదేహాల కోసం పని చేస్తూ తెలుసుకున్నాం.
మానవులు ఎంతగా హింసకు గురైనప్పటికీ హింసను అంగీకరించరు. దు:ఖాన్ని అదిమిపట్టుకోవడం, జ్ఞాపకాలను జ్వలింపచేసుకోవడం అతి పెద్ద హింస. అమరుల గురించి మేమే కాదు, ఈ సమాజం గుర్తు పెట్టుకోవడంలో కూడా ఈ విషాదం ఉన్నది. అయితే ఇది దు:ఖంగానే ఉండిపోదు. జ్ఞాపకంగానే మిగిలి ఉండదు. దాని నుంచి విముక్తి కావాల్సిందే. అందుకే దు:ఖం ధిక్కారమైంది. కడుపుకోత మమ్మల్ని లేపి నిలబెట్టింది. కన్నీటి తలపోత అమరుల ఆశయాలను ఎత్తిపట్టమని ఆక్రోశించింది. జీవితంలోని హింసను రద్దు చేసే పోరాటంలో రాజ్యహింస రద్దు కావాలనే పోరాటం ముఖ్యమైన భాగమని అర్థమైంది.
అందుకే రాజ్యానికి అమరుల బంధుమిత్రుల సంఘం అంటే కోపం, అమరుల జ్ఞాపకాలను సజీవం చేసే ఏ పనినీ అది అంగీకరించదు. స్టూపాలు కడితే కూలగొట్టింది. నలుగురు కూడి సభ పెడితే కేసు పెట్టింది. పాట పాడితే నోరు నొక్కేసింది. పుస్తకం అచ్చేస్తే దాడిచేసి స్వాధీనం చేసుకుంది. ఎక్కడ అమరుల స్మృతి రవరవలాడుతుందో అక్కడల్లా రాజ్యం పాగా వేస్తుంది.
అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుల మీద చాలాసార్లు ప్రభుత్వం దాడి చేసింది. వ్యవస్థాపక కన్వీనర్ ఉప్పుకృష్ణను కొట్టి చంపాలని చూసింది. ఏబీఎంఎస్ గౌరవాధ్యక్షుడు గంటి ప్రసాదాన్ని చంపేసింది. సంఘ నాయకుల మీద కేసులకు లెక్కేలేదు. గతంలో ఎందరో సభ్యులను జైలుపాలు చేసింది. తాజాగా అధ్యక్షురాలు అంజమ్మను అక్రమ కేసులో అరెస్టు చేసి ఎనిమిది నెలలు జెయిల్లో పెట్టింది...
అయినా ఈ ఇరవై ఏళ్లుగా అమరుల ఆశయాలను, రాజకీయాలను ఏబీఎంఎస్ చర్చనీయాంశం చేస్తూనే ఉంది. సమాజంలో సజీవం చేస్తూనే వచ్చింది. శవ స్వాధీనం, అంత్యక్రియలు, స్థూప నిర్మాణం, సంస్మరణ సభల వంటి అన్ని రూపాల్లో అమరుల మానవీయ సంస్కృతిని ప్రజల మధ్యలోకి తీసికెళ్లింది. విప్లవ రాజకీయాలకు తావు లేకుండా చేయాలని రాజ్యం చూస్తున్నది. కానీ విప్లవకారులు తమ ఆచరణ వల్లేగాక, తమ మరణం ద్వారా కూడా విప్లవ రాజకీయాలను నిలబెట్టుకుంటున్నారు.
పెద్దగా చదువులేని, ఏ ప్రత్యేక నైపుణ్యంలేని, లోకం మీది విషయలేవీ తెలియని మామూలు మనుషులం మేం, చనిపోయినవాళ్లు విప్లవోద్యమంలో అగ్రనాయకులైనా, కార్యకర్త అయినా మా తల్లుల దు:ఖం ఒక్కటి కావడమే ఏబీఎంఎస్ ఆచరణకు గీటురాయి. ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేయగల విప్లవకారులను కన్నవాళ్లమో, కట్టుకున్న వాళ్లమో, రక్తసంబంధీకులమో కావడం తప్ప మరే ప్రత్యేకత లేని వాళ్లం. మేం ఇరవై ఏళ్లుగా ఈ సంస్థను నిర్వహించామంటే, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఇంత పోరాటం చేశామంటే అది మా ఒక్కళ్ల వల్లనే సాధ్యం కాలేదు. ఇరవై ఏళ్ల కింద ఈ సంఘం ఏర్పాటు ముందు వెనుకల ఎందరో ఉన్నారు. ఈ రెండు దశాబ్దాల్లో మాతో కలిసి నడిచిన వారు ఎందరో ఉన్నారు. మాతో కలిసి దు:ఖించి, మా పనులను తమ పనులుగా భావించిన వాళ్లు లేకుండా అమరుల బంధుమిత్రుల సంఘం లేదు. న్యాయవాదులు, రచయితలు, కళాకారులు, పౌరహక్కుల ఉ ద్యమకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, సోదర ప్రజాసంఘాల కార్యకర్తలు,మొత్తంగా విప్లవాన్ని ప్రేమించేవాళ్లు లేకుండా అమరుల కోసం మేం ఈ పనులేవీ చేయగలిగేవాళ్లం కాదు. అమరుల త్యాగాలపట్ల సమాజంలో ఉన్న గౌరవమే దీనికి కారణం.
ఈ సంస్థను ఏర్పాటు చేసిన నాయకులు నరసన్న, ఉప్పు క్రిష్ణ, గోరు మాధవరావు, గార్రి లక్ష్మమ్మ, జయమ్మ, సూర్యావతమ్మ వంటి వాళ్లంతా అమరులయ్యారు. అమరుల తల్లిదండ్రులు ఎందరో అమరుల వరుసలో చేరిపోయారు. సంస్థకు దీర్ఘకాలం మార్గదర్శిగా వ్యవహరించిన గంటి ప్రసాదం హత్యకు గురయ్యాడు. ఆవిర్భావం నుంచి సంస్థ లోపలి మనిషిగా, ఎబీఎంఎస్ హృదయం తెలిసిన అమరుల కుటుంబ సభ్యుడు చలసాని ప్రసాద్ వయోభారంతో అమరుడయ్యాడు. సంస్థతో పాటు అనేక దుఃఖాల్లో పెద్ద దిక్కుగా నడిచిన వరవరరావు నిరవధిక జైలు జీవితంలో ఉన్నాడు. అమరుల కుటుంబసభ్యుడు, తొలి కార్యవర్గ సభ్యురాలు సూర్యావతమ్మ కుమారుడు, ప్రొ, సాయిబాబ అనంతమైన జైలు జీవితం గడుపుతున్నాడు. జననాట్యమండలి కళాకారుడు, అమరుల కుటుంబసభ్యుడు కా, డప్పు రమేష్
ఈ ఏడాది అనారోగ్యంతో అమరుడయ్యాడు. ఆయన అజ్ఞాత జీవితం నుంచి వచ్చాక స్థూపం దగ్గర, సంస్మరణ సభల్లో తప్పక పాటలు పాడేవారు...
ఈ ఇరవై ఏళ్ల సందర్భంలో వీళ్లందరినీ తలుచుకుంటున్నాం. వీళ్ళేకాదు, ఆర్థికంగా, హార్ధికంగా వేలాది మంది అండ లేకపోతే మేం ఈ దు:ఖభరిత ప్రయాణం చేయగలిగే వాళ్లం కాదు. అమరుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేవరకు ఈ త్యాగాలు ఉంటాయి. అమరుల బంధుమిత్రుల సంఘం కన్నీటి బిగువున బిడ్డల నిర్జీవ దేహాల కోసం ఇంకా నడవాల్సిందే. పీడనలేని, హత్యలు లేని, త్యాగాలు అవసరం లేని రోజు దాకా ఈ కడుపు కోత కన్నీటి వెత సాగవలసిందే. దాన్ని ధిక్కారంగా, ఆగ్రహంగా మలచవలసిందే, తప్పదు. అందులో భాగమే ఈ ఇరవై ఏళ్ల సభలు. మీరంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.


Keywords : ABMS, Amarula bandhu mitrula sangham, Martyrs, hyderabad
ganti prasad, uppu krishna, narsanna, varavararao
(2023-11-28 02:41:12)
No. of visitors : 1442
Suggested Posts
| అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. |
| మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్నదశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న. |
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు. |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమతయేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను |