వెన్నెముకలేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? - వరవర రావు

వెన్నెముకలేని

సమస్య మిగులు మనుషులు. సమస్య మిగులు భూములు. సమస్య మనుషులు, భూములు కూడ - ఎవరికి? మార్కెటుకు? మార్కెటుకు వాళ్ల శ్రమ కావాలి. కాని ఆ శ్రమ స్వేచ్ఛ కోరుతున్నది. మార్కెటుకు భూమి కావాలి. ఆ భూమి కూడ స్వేచ్ఛ కోరుతున్నది. స్వేచ్ఛ కోరుతున్న మనుషులెవరూ మార్కెట్‌ ‌దాహం తీర్చగల వాళ్లు కారు. స్వేచ్ఛ కోరుతున్న భూమి మాత్రం మార్కెటుకు కావాలి. భూమి మీద, కింద ఉన్న ప్రకృతి సంపద కోసం. ఏమీ లేకున్నా సరుకుగా మారి కంపెనీలకు కట్టబెట్టడం కోసం.

ఒకప్పుడు అగ్వ (చౌక) శ్రమ కోసం అవసరమైన మనుషులు ఇప్పుడు సాంకేతిక విజ్ఞానం వల్ల పెట్టుబడికి అవసరం లేకుండా పోయారు. మనుషులు చేసే పని ఇప్పుడు యంత్రాలు చేస్తున్నాయి. మరి ఈ మనుషులేమైపోవాలి. విస్థాపితులైపోవాలి. నిర్వాసితులైపోవాలి. మార్జినలైజ్‌ అయిపోవాలి. ఎన్‌కౌంటర్లలోనో, పోలీసు కాల్పుల్లోనో చచ్చిపోవాలి.

వాళ్లెవరు? అమెరికాలో నల్లవాళ్లు. వాళ్లు ʹబ్లాక్‌ ‌మ్యాటర్స్ʹ అం‌టున్నారు. పోనీ ʹబ్లాక్‌ ఆల్సో మ్యాటర్స్ʹ అం‌టున్నారు. నలుపు పట్టించుకోవాల్సిన రంగు మాత్రమే కాదు స్వేచ్ఛ అంటున్నారు. పోనీ, నల్లవాళ్ల స్వేచ్ఛను కూడా మనుషులు కోరే స్వేచ్ఛలో విలువైందిగా భావించమంటున్నారు. అబ్రాహం లింకన్‌ ‌ముందుకాలపు స్థితి తేస్తామంటే సహించం, అంతా ఏక నలుపు చేస్తామని తిరుగబడుతున్నారు. వ్యవస్థ రాజ్యంగా మారుతున్నది. రాజ్యంగా టెరరిస్టుగా మారుతున్నది. ఎందుకంటే దాని స్వార్థ ప్రయోజనం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ. సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడిదారీ అత్యున్నత దశ. గుత్తపెట్టుబడి. మోనోపలి. నిజమే కాని, అది పెట్టుబడిదారీ మృత్యుశయ్య. అది శ్రమ స్వేచ్ఛను తన మృత్యు ఒడిలో బంధించాలని చూస్తున్నది. వ్యవస్థ తరఫున, రాజ్యం తరఫున, సామ్రాజ్యవాదం తరఫున తెల్లపోలీసు తలఎత్తిన నల్లమనిషిని కాల్చేస్తాడు. అమెరికాలో జరుగుతున్నదదే. బానిసత్వాన్ని అంగీకరించిన జాతిని కాదు, ధిక్కరించిన జాతిని, ప్రతిఘటించిన జాతిని ధ్వంసం చేయాలని చూస్తున్నది. సరుకు సంస్కమీతికి నల్లని శ్రామికస్వేచ్ఛ అవసరం లేనిదే కాదు భయం గొలిపే ప్రమాదం.

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ కశ్మీరియత్‌కు, ఆ ప్రజల స్వేచ్ఛాకాంక్షకు సాటిరావు. లోయలోని ప్రతి దేవదారు చెట్టుకు ఒక తుపాకీ, ఒక కశ్మీరీ యువతకు ఒక భారత సైనికుడు కాపలాకాసినా ఆ స్వేచ్ఛ లోయలో వేళ్లూనుకొని ఆకాశంలో ఎగిరే ఆకాంక్ష. ఎన్ని వేల వేల ఎన్‌కౌంటర్లు, ఎన్ని వేల మిస్సింగులు, ఎన్ని లక్షల సుదీర్ఘ జైలు జీవితాలు, ఎన్ని వందలసార్లు సైన్యం కర్ఫ్యూలు, కాల్పులు - ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని కాళ్లు చేతులు కట్టివేయబడి, కళ్లకు గంతలు కట్టినా మౌనంలోనూ, మాటలోనూ, బలి అయిపోయిన ప్రాణంలోనూ అక్కడ ఊపిరి పోసుకునేది ఆజాదీ - కశ్మీరు భూమికి, మనుషులకు ఆజాదీ - అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వం నుంచి, ఇండియా, పాకిస్థాన్‌ల ప్రభుత్వాల నుంచి వాళ్లను వాళ్లు పాలించుకునే ఆజాదీ. మక్బూల్‌ ‌భట్‌, అఫ్జల్‌ ‌గురులను ఉరితీసినా ముప్పై ఏళ్లుకూడా రాని యువకుడు బుర్హాన్‌ ‌వనీ ఫేస్‌బుక్‌లోనూ, ఎన్‌కౌంటర్‌లోనూ వేల కంఠాలై నినదించింది ఆ ఆజాదీ. హిజ్బుల్‌ ‌ముజహుదీన్‌ - ‌విదేశాలకు అమ్ముడుపోయిన మోడిత్వ దేశభక్తి కన్నా హీనమైంది కాదు. బుర్హాన్‌ ‌వనీ మృతదేహం నుంచి నిజమైన దేశాభిమానం ఆజాదీ రక్తమై కశ్మీర్‌ ‌లోయలో చిమ్మింది.

జమ్ము, కశ్మీరు, లద్దాక్‌, ‌ఫ్రాంటియర్‌ ‌ప్రాంతాలను నాలుగింటిని లౌకిక ప్రజాస్వామ్య కాశ్మీర్‌ ‌సూఫీ భావజాలంతోనూ, స్వావలంబన పాలనతోనూ ఒకటి చేయాలని సాయుధ పోరాటం 1989-90లలో ప్రారంభించారు కశ్మీరు ప్రజలు. జెకెఎల్‌ఎఫ్‌ ‌రాజకీయ లక్ష్యం అది. ముస్లింలను, పండిట్లను, బౌద్ధ మతస్తులను, ఆదివాసులను ఐక్యంగా ఉంచే లక్ష్యం. జమ్మును, కశ్మీరును, మైదానాన్ని, లోయలను, ముస్లింలను, పండిట్లను చీల్చడానికి భారత ప్రభుత్వం 1989లో జగ్‌మోహన్‌ను గవర్నర్‌గా పంపింది. మీకీ లోయలో ప్రమాదం, వెళ్లిపోండి అని ఎన్నో తాయిలాలు, రాయితీలు ఇచ్చాడు జగ్‌మోహన్‌, ఎన్నో భయాలు కల్పించాడు.

లోయలోని ప్రజలకు, పండిట్లకు మధ్యన ఈ ఇరవై ఏళ్లలో ఎన్ని అపార్థాలు, అపోహలు కల్పించాలో భారత ప్రభుత్వం, మీడియా అన్ని సృష్టించాయి. ఇప్పుడు కశ్మీర్‌ ‌లోయలో మాజీ సైనికులకు, పండిట్లకు వేరే కాలనీల నిర్మాణం చేస్తాననే ప్రతిపాదనతో వచ్చింది మోడీ ప్రభుత్వం. అంటే కశ్మీరు లోయలో ముస్లింలను మైనారిటీగా మార్చే కుట్ర. పంజాబ్‌లో సిఖ్కుల విషయంలో అదే చేసి హర్యానా రూపకల్పన చేశారు. పండిట్లు మాతోనే ఉంటారు. వాళ్లను మేము మా బాహువులు చాచి హృదయ వాటాలు తెరచి ఆహ్వానిస్తున్నాం. సైనికులు, సైనికులుగా గానీ, మాజీ సైనికులుగా గానీ కశ్మీరు గడ్డ మీద ఉండడానికి వీలులేదు. సైనికులకిచ్చిన ప్రత్యేక అధికారాలలోనే, ఆ పదఘట్టన కింద ధ్వంసమైపోతున్న మేము, వాళ్ల ప్రత్యేక అధికారాలనే కాదు, వాళ్ల ఉనికినే ఉద్యోగంలో గానీ, విశ్రాంత ఉద్యోగంలో గానీ సహించేది లేదన్నారు కశ్మీరు ప్రజలు.

సైన్యం సరిహద్దుల రక్షణకు కాదు. ప్రజల భూములు పాలకుల ఆస్తులుగా మార్చి వాళ్ల స్వార్థ ప్రయోజనాలు కాపాడడానికే నని, దాన్ని ప్రతిఘటించి తీరుతామన్నదే బుర్హాన్‌ ‌వనీ ప్రకటించిన ఆజాదీ ఆకాంక్ష. సోషల్‌ ‌మీడియాలో మాట్లాడిన దానికన్నా ఆయన ఇప్పుడు ఆయన మృతదేహం ఇప్పుడు వేనోళ్ల ఆజాదీ గానం చేస్తున్నది.

హైదరాబాద్‌ ‌పురానా షహర్‌లో చార్‌మినార్‌ ‌దగ్గర కృత్రిమంగా వెలసిన భాగ్యలక్ష్మి ఆలయం అడ్డంగా నిలువుగా బలుస్తున్నది. ఐఎస్‌ల, టెరిరిస్టుల టార్గెట్లుగా ఎన్‌ఎస్‌ఎ ఆరోపిస్తున్న కీలక మార్కెటు ఆదాయవనర్లు, వాళ్ల కాపలాదార్ల నిలయాలు అన్నీ క్షేమంగానే ఉన్నాయి. పాతబస్తీ పేద ముస్లిం యువకులు, వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబాలు చిత్రహింసలకు, సంక్షోభానికి గురవుతున్నారు. ఈ వ్యవస్థ వాళ్లందరినీ టెరరిస్టులుగా వేల మైళ్ల దూరంలో ఉన్న ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌కోసం పనిచేస్తున్న ఏజెంట్లుగా చిత్రిస్తున్నది. ఈ విషయంలో ఆరోపణ చేస్తున్న నిఘా సంస్థలు మొదలు మీడియా వరకు భావైక్యత ఉన్నది. నీడకు భయపడడమూ లేదా నీడను చూసి భయపెట్టడమూ, నీడతో యుద్ధం చేయడమంటే ఇదే. ఇంక తెలంగాణ ప్రభుత్వాన్ని అడగవలసిన ఒక్క మౌలిక అవసరమూ ఉండదు. ఒక్క ప్రజాస్వామిక డిమాండు ఉండదు. భద్రలోకమే కాదు ప్రజలందరూ భద్రత మొదలు, అభద్రత వరకు ఏ భావమైతేనేమిటి, ఏ అవసరం కోసమయితేనేమిటి క్రియాశూన్యులయి వదంతులకు, అపోహలకు గురయ్యే పిరికితనం సరఫరా అవుతుంది. అప్పుడు జిల్లాల విభజనలు, హరిత హారాలు ప్రజలకు ప్రకటించి మల్లన్నసాగర్‌ ‌నిర్మాణం మొదలు, గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ ‌దాకా ప్రభుత్వాలు సజావుగా అమలు చేయవచ్చు.

చెర్లల్లో నర్సింగరావు అనే ఆదివాసీ మొదలు కాటెపల్లిలో శోభన్‌, ‌మహేష్‌, ‌దినేష్‌ అనే మావోయిస్టు పార్టీ మంగి దళాన్ని కోవర్టు ఎన్‌కౌంటర్‌లో చంపడం దాకా ఆదివాసుల విస్థాపనయే లక్ష్యం. కంపెనీలకు అడవి భూములను కట్టబెట్టడమే లక్ష్యం. అటు విశాఖపట్నం నుంచి ఇటు ఆదిలాబాద్‌ ‌వరకు అడవి అంతటా - అది బాక్సైట్‌ ‌కంపెనీ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కావచ్చు, గోదావరి మీద ఎగువన తెలంగాణలో ప్రాజెక్టుల కోసమే కావచ్చు, ఓపెన్‌ ‌కాస్టుల కోసమే కావచ్చు - అంతటా విస్థాపితులు, ప్రాణోపహతులు ఆదివాసులే. వాళ్లకు అండగా ఉండేవాళ్లు మావోయిస్టులైనా, మరెవరయినా ఈ ప్రభుత్వానికి శత్రువులే. ఇది కేవలం అడవికి పరిమితమైన మిగులు భూముల, మనుషుల సమస్య కాదు.

గుజరాత్‌ అడవుల నుంచి సింహాలు నగరాల్లో ప్రవేశిస్తున్నాయట. తెలంగాణ అడవుల నుంచి కోతులు మొదలు గుడ్డేలుగులు, చిరుత పులులు, పాముల దాకా ఊళ్లల్లో ప్రవేశిస్తున్నాయి. గుట్టల విధ్వంసం, నీటి పట్టుల విధ్వంసం, ప్రకృతి సంపద అంతా సరుకై ఎగుమతయి మనుషులు, జంతువులు నిరాశ్రితులై పోతున్నారు. పనిలేదు. సంక్షేమ పథకాల పేరిట బిచ్చమే తప్ప, ఇళ్లు కూల్చి డబుల్‌బెడ్‌ ‌రూంల వాగ్దానాలు. పోడు భూములు ఆక్రమించి హరితహారం ఆకర్షణలు, దళితులకు, ఆదివాసులకు ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి వాగ్దానం మాత్రమే. కంపెనీల కోసం గోళ్లూడగొట్టి ల్యాండ్‌ ‌బ్యాంక్‌ ‌కోసం భూముల సేకరణ పేరిట ఆక్రమణ పాలక ఆచరణ.

నందిగ్రామ్‌, ‌సింగూరుల వలె చిన్నకారు, సన్నకారు రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్న ఏటిగడ్డ కిష్టాపురం, వేములగట్టు వంటి పద్నాలుగు గ్రామాల నుంచి ప్రజల్ని విస్థాపన చేసి, కాదంటే ముంచేసి మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌నిర్మాణం చేస్తున్నారు. నది మీద కాదు, కాలువ మీద. వ్యవసాయానిసి కాదు. కొత్తగా వచ్చే ప్రైవేట్‌ ‌పరిశ్రమలకు, ఫామ్‌హౌజ్‌లకు నీళ్లు ఇవ్వడానికి. నీళ్ల దారులు మళ్లించి చేసుకున్న ఒప్పందాల దాహం తీర్చడానికి.

కనుక ఎవరు మిగులు మనుషులు? మల్లన్నసాగర్‌ ‌కింద సన్నకారు, చిన్నకారు రైతులు మొదలు భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, ముంపుకైనా గురికావాలి. ప్రతిఘటించి చావో రేవో తేల్చుకోవాలి.

మూసీకి ఆవల ముస్లిం యువకులు. ఐఎస్‌ ‌టెర్రరిస్టులుగా, దేశద్రోహులుగా ముద్రపడినందుకు తెగించి అవును దేశద్రోహులమే అని ప్రకటించి ప్రతిఘటించి ప్రాణాలివ్వాలి. లేదా జీవితాంతం చిత్రహింసలు శారీరకంగా, మానసికంగా అనుభవిస్తూ ఈ హిందూ బ్రాహ్మణీయ వ్యవస్థ చూపుడువేలు కింద మాసిపోని మచ్చతో ఇరుకైన బందీఖానాలోనో, సమాజమనే ఓపెన్‌ ‌జైల్లోనో నిరసన, ఛీత్కారాలు, అనుమానాలు, అపోహలు, అవిశ్వాసాల మధ్యన బతకాలి.

కశ్మీరీ ప్రజలు ఆజాదీ, జాతి విముక్తి పోరాటాన్ని ఎంచుకున్నారు వేల లక్షల ప్రాణాలైనా పోనీ. అంతకన్నా విలువైంది వాళ్లకు ఆజాదీ.

గోదావరి, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి పరీవాహక ప్రాంత ప్రజలు గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ అనే ప్రజల మీద ప్రకటించిన యుద్దాన్ని ప్రజాయుద్ధంతో ఓడించే మార్గాన్ని, జనతన సర్కార్‌లో తన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఎంచుకున్నారు.

ఈ సమస్యల్లోని పరిష్కారాల్లో మనమెక్కడ? రచయితలేం చేస్తారు? ఏం చేయగలరు? ఇవన్నీ రాజకీయాలు కాదా?
రచయితలు ఏం చేయాలో 1968లో జీన్‌పాల్‌ ‌సార్్ర‌ ‌చెప్పాడు. ఆయన ఫ్రెంచ్‌ ‌తత్వవేత్త. అస్తిత్వవాది (ఎగ్జిస్టెన్షయలిస్టు). నోబెల్‌ ‌బహుమతి వస్తే తిరస్కరించిన రచయిత. అందుకు కారణం తాను అల్జీరియాకు స్వాతంత్య్రం కావాలని, ఆ దేశాన్ని వలసగా మార్చుకున్న ఫ్రెంచ్‌ ‌ప్రభుత్వంతో పోరాడినపుడు తనకీ ప్రైజ్‌ ఇవ్వాలని నోబెల్‌ ‌సంస్థకు ఎందుకనిపించలేదు - అని. 1968 డీగాల్‌ ‌నియంతృత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఫ్రాన్సులో స్థిరపడిన పాకిస్థాన్‌ ‌తత్వవేత్త తారిఖ్‌ అలీ, తన సహచరి సైమన్‌ ‌డి బావ్రా (ఫెమినిస్టు తత్వవేత్త) తో పాటు అండగా నిలిచినవాడు. ఈ పోరాట కాలంలో ʹపీపుల్స్ ‌కాజ్‌ʹ ‌పత్రిక నడుపుతున్న నలుగురు మావోయిస్టు విద్యార్థులను అరెస్టు చేసినందుకు నిరసనగా సైమన్‌ ‌డి బావ్రాతో పాటు ఆ పత్రిక ప్రచురణనూ, పంపిణీని ఆయన చేపట్టాడు. ʹమాకీ మావోయిస్టు విద్యార్థుల భావజాలంతో ఏకీభావం ఉండాల్సిన అవసరం లేదు. కాని వాళ్లకీ సమయంలో తమ భావాలు ప్రకటించుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని చెప్పడానికే మేమీ బాధ్యత తీసుకున్నాంʹ అని వీథుల్లోకి వచ్చి పంచారు. మరి సార్్ర‌్ను అరెస్టు చేస్తారా? అని నియంత డీగాల్‌ను అడిగితే - ఆయనను అరెస్టు చేయడమంటే ఫ్రాన్స్‌ను అరెస్టు చేసినట్లే అని డీగాల్‌ అసహాయత ప్రకటించాడు. అవి చైనా శ్రామికవర్గ సాంస్కమీతిక విప్లవ గాలులు ప్రపంచమంతా వీస్తున్న రోజులు. నక్సల్బరీ నలువైపుల తన నవనవోన్మేష విప్లవ భావజాలాలు వెదజల్లుతున్న రోజులు.

ఇప్పటివలె అప్పటికింకా ఫ్రాన్స్ ‌జాత్యాహంకార దేశం కాలేదు. వోల్టేరు ప్రజాస్వామిక దృక్పథం, ఫ్రెంచి విప్లవ నినాదం స్వేచ్ఛ, సమానవత్వం, సౌభ్రాతృత్వం భావాలింకా మసకబారలేదు. నియంతలను ప్రశ్నించే తరం ఒకటి ఫ్రెంచి ప్రజానీకంలోనే మిగిలిందనుకోవాలి. ప్రపంచం వాళ్లకు తోడయింది.

సమస్యలో ఉన్నామంటే పరిష్కారంలో ఉండవలసిందే. సమస్యల చీకటి గుయ్యారం (టనెల్‌)‌లో జీవితమనే వెలుగు నీడల నుంచి దూరుతున్నారు. మరి పరిష్కారం అనే వెలుగు వైపు ప్రయాణిస్తే తప్ప జీవితం మెరుగు కాదంటాడు సార్త్ర్.

ʹమేధావి అంటే ఈ కాలంలో వామపక్ష మేధావేʹ అని కూడ తేల్చేసాడు సార్త్ర్. అటువంటి మేధావులు, బుద్ధిజీవులు, రచయితల మీద ఆయన తానాచరించి అంతపెద్ద బాధ్యత పెట్టాడు.

ఇంచుమించు ఏభై ఏళ్లు అవుతున్నది. అమెరికా, ఇంగ్లండ్‌, ‌ఫ్రాన్స్‌లలోనే రంగు - మతము వంటి వివక్షలు ఉన్మాద స్థాయికి పోతుంటే ఇంక అర్ధవలస అర్ధ భూస్వామ్య బ్రాహ్మణీయ హిందూ భావజాల నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో పెరుమాళ్‌ ‌మురుగన్‌ను ఆయన పేరులో ఉండే రెండు మతాల దేవుళ్లు (వైష్ణవ పెరుమాళ్‌, ‌శైవ మురుగన్‌) ‌గానీ, ఆయన పుస్తకం మకుటం (ʹమధోరుబగన్‌ʹ) ‌గా మారిన అర్ధనారీశ్వరీ దేవతలు పార్వతీ, శివులు గానీ కాపాడుతారని ఆశించలేం. నాలుగు వందల సంవత్సరాల క్రితం తానుండే మధురై ప్రాంతంలో తన కులంలో ఉండే ఒక ఆచారాన్ని రచయితకుండే నిజాయితీతో చిత్రించినందుకు ఆయన కులంతో సహా వ్యవస్థ ఆయనను వేటాడింది. కలెక్టర్‌ ‌పరిష్కారానికి పిలిచి క్షమాపణ చెప్పించి పుస్తకాన్ని కాదు భావాలను వెనక్కు తీసుకోవాలన్నాడు. పెంగ్విన్‌ ‌వంటి అంతర్జాతీయ ప్రచురణ సంస్థకు కూడా ఆయనకుండే రాసే హక్కు, తనకుండే ప్రచురించే హక్కును సమర్థించుకోలేదు. ఆయన ఎక్కడెక్కడికని ఆశ్రయం కోరి పరుగెత్తగలడు? ఎట్లా అనుక్షణ కత్తి వేట్లు తప్పించుకుంటూ ఊపిరి పీల్చుకొని మిగలగలడు.
తన పుస్తకాలు వెనక్కి తీసుకుంటున్నానని, రచయితగా తాను చచ్చిపోయానని, తనను కేవలం పెరుమాళ్‌ ‌మురుగన్‌ అనే పేరుతో మాత్రమే గుర్తు పెట్టుకొమ్మని ప్రజలకు విజ్ఞప్తి చేసి మౌనం వహించాడు.

ఒక పియుసిఎల్‌, ‌వెంకటా చలపతి అనే రచయిత, మూల తమిళ పుస్తక ప్రచురణకర్త తప్ప ఆయకు అండగా ఎవరూ నిలబడలేదు. ఎన్నో హిందు ఉగ్రవాద సంస్థలు ఆయన ʹమధోరుబగన్‌ʹ (వన్‌ ‌పార్ట్ ఉమన్‌ - అర్ధనారి) నవలను నిషేధించి ఆయనను శిక్షించాలని హైకోర్టుకు పోయాయి. దేశ వ్యాప్తంగా, సోషల్‌ ‌మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికంగా వచ్చిన స్పందన ఫలితమో ఏమో హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కిషన్‌ ‌కౌల్‌, ‌జస్టిస్‌ ‌పుష్పా సత్యనారాయణతో కూడిన డివిజన్‌ ‌బెంచ్‌, ʹఇష్టం లేకపోతే ఆ పుస్తకం చదవకండిʹ అని ఫిర్యాదుదారులకు హితవు చెప్పి, రచయితగా పెరుమాళ్‌ ‌మురుగన్‌ను తిరిగి బతికించండి (రిసరెక్ట్ - ‌పునరుత్థానం చేయండి) అని ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేసింది. పెరుమాళ్‌ ‌మురుగన్‌ ‌నవలలో సంతానం లేని దంపతులు చాల అన్యోన్యమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్లెప్పుడూ మ్కొలు పెంచుతూ తాము పెంచుకున్న పూల పందిళ్ల కిందనే ఏకాంతాన్ని అనుభవిస్తుంటారు. అందుకే ఒక సాంప్రదాయిక ఉత్సవం రోజు ఒక చీకటి రాత్రి ముక్కు మొహం తెలియని పర పురుషునితో సంతాన ప్రాప్తి కోసం కలయికకు పార్వతి పడిన మానసిక ఘర్షణయే నవల - ఈ అద్భుతమైన మానవాంతరంగాల ప్రేమ - సంఘర్షణల చిత్రణ. ఈ తీర్పు వచ్చిన తర్వాత పెరుమాళ్‌ ‌మురుగన్‌ - ‌మా వాకిట్లో వాడిపోయిన మొక్క ఈ రోజే ఒక పూరేక తొడిగింది. నేనింక దానిని నీళ్లు పోసి బతికించుకుంటానని ఊపిరి పీల్చాడు. ఈ ఊపిరిని కఠోరమైన ఈ కుల వ్యవస్థ అడ్డుకోకుండా ఉంటుందా అనేది మన అనవరత జాగరూకత పై ఆధారపడి ఉంటుంది.

మణిపూర్‌లో పన్నెండు వందల ఎన్‌కౌంటర్లకు బాధ్యులైన సైన్యంపై సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ ‌పిటిషన్‌లో అరవై రెండింటిని విచారించి, పరిశీలించిన మేరకు అవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్‌ ‌హత్యలే అని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు - సైన్యం అయినా సరే, ఉగ్రవాదినైనా సరే, శత్రువునైనా సరే చంపడానికి ʹకల్లోలిత ప్రాంతాలుʹలో, ʹప్రత్యేకాధికారాలు పొందినా సరేʹ వీలు లేదు, హక్కు లేదు. వాళ్లు ఒక సాధారణ పౌరుని వలె హత్యానేరానికి విచారింపబడవలసిందేనని తీర్పు ఇచ్చింది. అయితే మెజిస్టేరియల్‌ ‌విచారణ, జాతీయ మానవహక్కుల కమిషన్‌ ‌మార్గదర్శకాలు - అనే రెండు దంతాలు లేని (పసలేని, సాధికారత లేని) సంస్థలు విచారించాలన్నది.
ఆ మాత్రమైనా మణిపూర్‌ ‌మహిళలు, ఇరోమి షర్మిళ పన్నెండేళ్ల నిరాహార పోరాట ఫలితంగా వచ్చిన తీర్పు. మరి ఈ తీర్పు వలన ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్‌లో సైన్యానికిచ్చిన ప్రత్యేకాధికారాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందా?

మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌కింద ముంపునకు గురయ్యే రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కోవద్దని ప్రభుత్వానికి హితం చెప్పిన కోర్టు గానీ, పెరుమాళ్‌ ‌మురుగన్‌ను పునురుత్థానం చేయమని చెప్పిన కోర్టు గానీ, కల్లోలిత ప్రాంతాల్లోనైనా సరే సైన్యం నిర్వచక్షణగా కాల్పులు జరిపి చంపకూడదని చెప్పిన కోర్టు, కశ్మీరులోకి మరిన్ని సైనిక బలగాలను పంపించి వారం రోజుల్లోనే ముప్పై ఆరు మంది కశ్మీరు యువకులను చంపిన భారత హిందూ రాజ్య రక్త దాహాన్ని ఆపుతుందా?

కశ్మీరులో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ ‌సంబంధాలు కట్‌ ‌చేసారు. కశ్మీరీ కవి చెప్పినట్లు కశ్మీరు పోస్టాఫీసులేని దేశంగా ఇంకెంత కాలం బయటి ప్రపంచంతో సైన్యం తుపాకితో తప్ప సంభాషణ లేని జాతిగా బతకాలి? బతకాలి అంటున్నాను గానీ ʹఆజాదీʹ ఆకాంక్షలతో ఇంకెంత కాలం ఇట్లా కశ్మీరీ యువతరం నవయవ్వన స్వప్నాలు ఛిద్రమవుతూ నేలరాలిపోవాలి?

కన్నయ్య కుమార్ తో పాటు ఆజాదీ నినాదాలు ఇచ్చిన వాళ్లంతా ఇవాళ ఎక్కడ ఉన్నారు. ప్రపంచ యువతరానికి విప్లవాల ఐకాన్‌ ‌చే గువేరాతో పోల్చాడు ఉమర్‌ ‌ఖలీద్‌ ‌బుర్హాన్‌ ‌వనీని. స్వయంగా తాను కశ్మీరీ యువకుడయినందుకు. కశ్మీర్‌ ‌పట్ల ఢిల్లీ వివక్షను, విద్వేషాన్ని స్వయంగా, ప్రత్యేకంగా తాను ఢిల్లీలో చూస్తున్నందున, అనుభవిస్తున్నందున. దేశద్రోహ ఆరోపణను చట్టబద్ధంగా ఎదుర్కొంటూ, ఈ మాట అన్నందుకు మళ్లీ ఎబివిపి సంఘ్‌ ‌పరివార్‌ ‌వంటి ʹదేశభక్తులʹ దాడిని ఎదుర్కొంటూ, తన దేశపు ఆజాదీ కోసం మన దేశంలో ʹద్రోహిʹగా నిలబడడానికి సిద్ధపడ్డాడు.

మనకు వెన్నెముకలేని దేశం కావాలా? సార్వభౌమత్వం లేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? ప్రొ. కంచె ఐలయ్య మీద హిందుత్వ వాదులు కేసు పెట్టినపుడు స్పందించిన రచయితలందరూ పాతబస్తీలో పేద ముస్లిం యువకుల కోసం, కశ్మీరులో ఎన్‌కౌంటరవుతున్న యువకుల కోసం స్పందిస్తారని ఆశించవచ్చునా!

Keywords : kashmir, varavararao, miletery, encounter, burhan wani
(2024-04-24 10:56:15)



No. of visitors : 2828

Suggested Posts


దేశంలో జడ్జ్ లు జస్టిస్ ను వదిలేశారు - హరగోపాల్

దేశంలో జడ్జీలు జస్టిస్ ను వదిలేశారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్థిని కాపాడవల్సిన న్యాయమూర్తులు తమ స్వం విశ్వాసాల ఆధారంగా తీర్పులివ్వడం అన్యాయమని ఆయన అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా....

ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు....

సాయిబాబా కేసుః జడ్జిమెంట్ లా లేదు,పోలీసాఫీసర్ రాసిన చార్జ్ షీట్ లా ఉంది- వరవరరావు

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా బెయిల్ రద్దు చేస్తూ నాగ్ పూర్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై విప్లవ రచయిత వరవరరావు మండి పడ్డారు. అది జడ్జిమెంట్ లాగా లేదని ఓ పోలీసు ఆఫీసర్ రాసిన చార్జ్ షీట్ లాగా

ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు

ఎంత అసంబద్ధమైన, ఎంత అన్యాయమైన వ్యవస్థలో జీవిస్తున్నామో ఇవ్వాళ్టి నా ఒక్క అనుభవాన్ని వివరిస్తాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో మాడరన్ లిటరేచర్ గురించి ప్రసంగించడానికి వెళ్తున్నాను.....

రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు

ఛత్తీస్ గడ్ లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లే హీరాఖంండ్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు....

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism !- RDF

Revolutionary Democratic Front calls upon the people and genuine democrats to boycott the (world) Social Forum, being held in Canada in August 2016 and all the related forums and preparatory meetings etc. being conducted in different parts of the country including Hyderabad....

కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వెన్నెముకలేని