మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

మనలో

(ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి గురించి సీనియర్ జర్నలిస్టు, వీక్షణం ఎడిటర్, రచయిత ఎన్. వేణుగోపాల్ 1997 లో రాసిన రచన. ఇది 3 ఆగస్ట్ 1997 ఆంధ్రజ్యోతిలో ముద్రించబడినది)

గుర్తు చేనుకుంటుంటే అదంతా నిన్ననో మొన్ననో జరిగినట్టు కళ్లలో కదలాడుతోంది. అప్పడే ఆరు సంవత్సరాలు గడిచిపోయింది. 1991 సెప్టెంబర్ చివరి వారం. సమయంలో తొమ్మిది నెలల నిర్వ్యాపక ఉద్యోగం అప్పడపడే వదిలిపోయి, మంచి నిరుద్యోగం చేస్తున్నాను. "మహాశ్వేతాదేవి ఊళ్ళోకొస్తోంది. కలవదలచుకుంటే అన్వేషికి రండి" అని కబురు.

నిజానికి మహాశ్వేత రచనతో అప్పటికి పది సంవత్సరాలకు పైగా పరిచయం. 1980 మొదట్లో ఆమె రాసిన రైటింగ్ టుడే - సమ్ క్వశ్చన్స్ అనే వ్యాసం చిన్న పుస్తకంగా వచ్చి చేతికందింది. సాహిత్య, కళారూపాల్లో హింస చిత్రణ క్రమక్రమంగా మనిషిని హింస పట్ల ఎట్లా నిరాసక్తం చేస్తుందో, నక్సల్బరీ మార్గపు విశిష్టత ఏమిటో, ప్రజా సాహిత్యం రాయదలచిన వాళ్లు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే అంశాలు అధ్యయనం చేయాలో ఆమె ఆ వ్యాసంలో అద్భుతమైన విశ్లేషణా శక్తితో వివరించింది. వస్తువులో గొప్ప ఆర్ధతను, శైలిలో నిరాండబరమైన సూటిదనాన్ని నింపుకున్న ఆ వ్యాసాన్ని వెంటనే తెలుగు చేశాను. ఆ వ్యాసం ఇవాల్టి రచన - కొన్ని ప్రశ్నలు పేరుతో 1980 అక్టోబర్ సృజనలో అచ్చయింది, బహుశా తెలుగులోకి వచ్చిన మహాశ్వేత మొదటి రచన అదే కావచ్చు.
ఆ తర్వాత హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుణ్యమా అని రాకాసి కోర, ఎవరిదీ అడవి, ఒక తల్లి నవలలు కూడా తెలుగులోకి వచ్చాయి. కొన్ని కథలూ పత్రికల్లోను, సంకలనం గాను తెలుగులోకి వచ్చాయి. బెంగాల్, బీహార్ సరిహద్దు అటవీ ప్రాంత గిరిజనుల మధ్య మహాశ్వేత సాగిస్తున్న కృషి గురించీ వార్తలు అప్పటికే తెలుస్తూ ఉన్నాయి. ఇంతగా పరిచయమయ్యీ, ముఖ పరిచయం లేని మహాశ్వేతను చూడటానికి అన్వేషికి వెళ్లాం, అప్పడు రెండు రోజులు, ఆ తర్వాత ఉత్తరాల్లో, అక్షర ప్రపంచంలో మహాశ్వేతతో ఎన్నో జ్ఞాపకాలు, సంతోషాలు, సంభ్రమాలు, నిష్ణురాలు. మొట్టమొదట ఆమె గురించి వ్యానం రాయడం కోసం ఇంటర్వ్యూగా మొదలయినదల్లా, ఇష్టాగోష్టిగా, స్నేహ సంభాషణగా, మైత్రిగా పరిణమించింది. ఆరోజు
అన్వేషిలో సంభాషణ సాహిత్యం కన్న ఎక్కువగా సమాజం మీదనే నడిచింది. రచనల్లో లాగానే, మాటల్లోనూ ఆమెది లోతయిన, ఆవేశం నిండిన అభివ్యక్తి హృదయానికి దగ్గరి విషయం మాట్లాడేటపుడు ఆమెది ఏకాగ్ర దృష్టి, చాదస్తమనిపించేటంత గాఢమైన అభినివేశం,

అందువల్లనే సంభాషణ వెంటనే ప్రెసిడెన్సీ జైల్లో మహిళల దుర్భర స్థితి గురించి మొదలయింది. ఏ విచారణా లేకుండా ఇరవై ముప్పై ఏళ్ళుగా ఆ జైల్లో మగ్గుతున్న స్త్రీల గురించి మహాశ్వేత మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటికామె బెంగాలీ పత్రిక బర్తమాన్లో ఒక వారం వారం శీర్షిక రాస్తోంది. ఆ శీర్షికలో ఖైదీల గురించి రాసినాకనే ప్రభుత్వం అటువంటి సమస్య ఒకటుందని గుర్తించి వాళ్ల పునరావాస చర్యలు చేపడతానని ప్రకటించిందట. "కాని చిన్న పిల్లలుగా రోడ్ల మీద దొరికిన వాళ్లను ఎత్తుకొచ్చి జైల్లో పడేస్తే ఇప్పడు యువతులుగా వాళెక్కడికి పోవాలి? బంధువులమనే తప్పడు ఆధారాలతో వచ్చేవేశ్యాగృహాల యజమానులకన్న మరొక దిక్కులేదు." చెపుతూ చెపుతూ మహాశ్వేత ఏడ్చేసింది. పాఠకుడిగా ఆమె ప్రతి రచనలోనూ ఎక్కడో ఒకచోట కళ్ళు చెమర్చిన నాకు ఆ ఆర్థ్ర రహస్యం తెలిసింది.
అక్కడ్నించి సంభాషణ బీహార్, బెంగాల్లో మంత్రగత్తెల పేరుమీద హత్యలకు గురవుతున్న స్త్రీల మీదికి మళ్లింది. అటు నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలో నేరస్థ తెగలుగా, భారత రాజ్యాంగం కింద అనుసూచిత తెగలుగా గుర్తించబడి అన్యాయానికీ, దోపిడీ పీడనలకూ గురవతున్న గిరిజనుల గురించి, వారి మధ్య తను చేస్తున్న పని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా కనబడడానికైనా ఎన్నో చట్టాలు చేసింది, వాటిని వాడుకోవాలని గిరిజనులకు చెప్పడం నా పని. అంటే ప్రభుత్వం చట్టాలను, ప్రభుత్వవనరులను వాడుకునిగిరిజనుల్లో చైతన్యం కలిగించడం. ఇందుకు విదేశీ నిధులు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించను" అంటూ తన చేతి సంచిలోంచి ఒక బెంగాలీ పుస్తకం తీసింది. మామూలు భాషలో గిరిజనుల హక్కుల గురించి తెలియజేసే పుస్తకమది.

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది. నేను గిరిజనుడ్నేనంటే గలగలా నవ్వి ఫ్రాంక్ఫర్ట్ రచయితల సమావేశంలో ఈ ప్రశ్నే అడిగానని, అక్కడికొచ్చిన వాళ్లందరూ గిరిజనులమేనన్నారని చెప్పింది.
అక్కణ్ణించి సంభాషణ ఒక తల్లి మీదికి మళ్ళింది, "ఒక తల్లిలో తల్లి చిత్రణ ఉన్నంత బిగువగా ఉద్యమ చిత్రణ ఉన్నదా అని, ఆ నవలలో ఉద్యమ చిత్రణ భయం గొలిపేదిగా ఉంది గదా అని నాకెన్నాళ్ల నుంచో ప్రశ్నలు. "కావచ్చునేమో. నేను హజార్ చౌరాషిర్ మా రాసే వరకూ ఉద్యమంలో భాగమయిన తల్లుల గురించే రాశాను. గ్రామీణ కార్యకర్తల తర్వాత ఇద్దరు పట్టణ యువకులు నా దగ్గరకొచ్చితమ గురించి రాయమన్నారు. వాళ్ల వేదనలోంచి, రాజకీయాలు తెలియని వాళ్ల తల్లి వేదన నుంచి ఒక తల్లి పుట్టుకొచ్చింది" అంది మహాశ్వేత, కొడుకు గురించి వేదన. కొడుకు బాగుకోసం తపన, కొడుకు విజయాల పట్ల గర్వం, ఒక తల్లిలో తల్లిని మాత్రమే కాదు, అని మహాశ్వేతని కూడ, నేను పత్రికల్లో పనిచేస్తానని తెలిసి, "నా కొడుకు నబురణ్ కూడ పత్రికల్లో పనిచేస్తాడు. ఇప్పడు బెంగాలీ సోవియట్ లాండ్లో సబ్ ఎడిటర్. వాళ్లేమో మూసేయబోతున్నారు. ఏమవుతాడో." అని విచారపడింది.
"నబురణ్. అంటే నబురణ్ భట్టాచార్యేనా?" అని సంభ్రమంతో అడిగాను. ఆయన రాసిన మృత్యులోయ నా మాతృభూమి కాదు అనే ఒక దీర్ఘకవితను 1984లో నేను తెలుగు చేశాను. ఆ కవిత అచ్చయిన సృజన సంచిక మీద, సంపాదకురాలి మీద ఆ కవితలోని కొన్ని పదాలు రాజద్రోహకరంగా ఉన్నాయని కేసు పెట్టారు.
"ఔను, నీకెట్గా తెలుసు?" అని ప్రశ్నించి, నేను చెప్పిన కథ విని ఉప్పొంగిపోయింది మహాశ్వేత, "నబురణ్ ను ఇక్కడికి పంపిస్తాను. మీరు కలిసి మాట్లాడుకోవాలి" అంది,

ఆమెకు ఇష్టం లేకపోయినా ఇక కుటుంబం కథ మొదలయింది. మహాశ్వేత తండ్రి మనీష్ ఘటక్ నవలాకారుడు, తల్లి ధరిత్రీదేవి రచయిత, సంఘ సేవకురాలు. మేనమామ సచిన్ చౌధురి ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాపక సంపాదకుడు. చినాన్న రిత్విక్ ఘటక్ ఈ దేశపు అత్యద్భుత సినిమా దర్శకుల్లో ఒకరు, మహాశ్వేత చిన్నతనం కమ్యూనిస్ట్ర రాజకీయాలు నిండిన ఈ వాతావరణంలో గడిచింది. వైవాహిక జీవితం ఎక్కువ కాలం సరిగా నడవకపోయినా, బెంగాలీ అభ్యుదయ నాటకకర్త బిజన భట్టాచార్యతో కొన్నాళ్న సహజీవనం చేసింది. కమ్యూనిస్టు గనుక ఒక ఉద్యోగం పోగొట్టుకుంది.
సంభాషణ సహజంగానే కమ్యూనిస్టుల మీదికి సాగింది. రాజకీయాలు కాదు, నంస్కృతి, విలువలు. "కమ్యూనిస్టులవి పాషాణ హృదయాలని చాలామంది అనుకుంటుంటారు గదా. ఒక సంఘటన చెప్పనా? అది కథ రాద్దామని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను" అంటూ హాస్య, కరుణ, వీర, ఆశ్చర్య రసభరితమైన ఒక ఉదంతం చెప్పింది. "ఝాన్సీ రాణి పస్తకానికి సమాచారం సేకరిస్తూ మధ్యప్రదేశ్లో తిరుగుతున్నాను.

1950ల తొలిరోజులు. తెభాగా పోరాటం ముగిసిపోయి, కమ్యూనిస్టులు నిషేధం నుంచి, నిర్బంధాల నుంచి తప్పించుకోవడానికి బెంగాల్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్లి తలదాచుకుంటున్నారు. అటువంటి ఒక ప్రవాసి కుటుంబంతో రెండు రోజులున్నాను. ఆయన తెభాగా పోరాటంలో వీరోచితంగా పాల్గొన్న యోధుడు. తన పోరాట జ్ఞాపకాలు తలుచుకుంటూ, ఆ రోజుల్లో అక్కడ్నించి వస్తుండగా, గంగా తీరాన ఒక గాయపడిన మొసలి కనబడితే దాన్ని దగ్గరికి తీసి చికిత్స చేసిన వైనం చెప్పకొచ్చాడు. ఒక వైపేమో రహస్య జీవితం. తానే తలదాచుకోవడానికి మరోచోటికి పారిపోతున్న స్థితి. అందువల్ల ఇక గత్యంతరం లేక, ఆ మొసలిని ఒక గంపలో పెట్టి హౌరా స్టేషన్లో షాట్ ఫారం మీద వదిలేసి మధ్యప్రదేశ్ బండెక్కాడని చెప్పాడు. అప్పటికీ రెండు సంవత్సరాల కింది కలకత్తాలో పత్రికల్లో మార్మోగిపోయిన వార్త నాకు గుర్తొచ్చింది. అది హౌరా స్టేషన్లో గంపలో మొసలి దొరకిన వార్త ఆ మొసలి ఫోటోలు పత్రికల్లో వేశారు. దాన్ని చివరకు జూకు ఇచ్చేశారు. ఈ పత్రికల వార్తల సంగతి నేనాయనకు చెప్పడం మొదలుపెట్టానో లేదో ఆయన సంతోషంతో నిలువెల్లా ఊగిపోయాడు. వయసు, అనారోగ్యం లెక్కచెయ్యకుండా ఎగిరి గంతులు వేస్తూ "అమ్మయ్య బతికి ఉందన్నమాట! బావుందా? నువు చూశావా? నుదుటి మీద నిలువగా ఓ చార ఉంటుంది! అదే గదూ! నా మనస్సిపుడు శాంతించింది! అని ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు" అంటున్న మహాశ్వేత కళ్లలో మళ్లీ తడి,
"ఎవరిదీ అడవిʹ లాంటి గొప్ప నవల రాసి, అడవి పుత్రులను అణచివేసే ప్రభుత్వపు అవార్డు పద్మశ్రీ ఎందుకు తీసుకున్నారని నా ప్రశ్న అడగకుండానే ఆరోజు గడిచిపోయింది.

తర్వాత ఆ రెండు రోజుల అనుభవాన్ని వ్యాసంగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రాసి, ఒక కాపీ ఆమెకు పంపాను. రెండు వారాలు తిరక్కుండానే, ఆ ఆలస్యానికీ బోలెడంత వివరణ ఇస్తూ ఆర్థ్రమైన ఉత్తరం: "ఆంధ్రకు చేరగానే, నేల మీద మన్ను తీసి నా నుదుటికి పెట్టుకున్నాను. అక్కడ నేను గడిపిన రోజులు, ఇప్పటి వరకు నా జీవితమంతటిలోకీ గొప్పవి, సంపన్నమైనవి, మీరందరూ (గిరిజనులు) నాలో కొత్త రక్తాన్ని కొత్త ప్రేరణను నింపారు. నీ వ్యాసం చూసి ఎంత పొంగిపోయానో చెప్పలేను. కాని నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగిడేశావు, మనం ఒకరినొకరం పొగుడుకోనక్కరలేదు. మన ఆచరణలు ప్రచారం కావాలి అంతే. నా జ్ఞాపకాల నిండా గద్దర్ నిండిపోయి, కిక్కిరిసిపోతున్నాడు." అంటూ మూడు కథలు సృజన కోసమని పంపింది.

ఆ తర్వాతోసారి నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డు పంపితే, "అన్నీ పోస్టు కార్డులే, గ్రీటింగ్ కార్డులొద్దు. అయినా కొత్త సంవత్సరం పాత సంవత్సరాల కన్న ఏం భిన్నంగా ఉంటుందని? ఇంకా ఘోరంగా ఉంటుందేమో!" అని రాసింది.

గిరిజనుల మీద నిర్బంధం గురించి, తన కార్యక్రమాల గురించి మధ్య మధ్య ఉత్తరాలు, అనువాదం కోసం సమాచారం పంపుతూనే ఉంది.

తన కథ ద్రౌపదిని గాయత్రి చక్రవర్తి ఇంగ్లీష్లోకి అనువదించి ప్రపంచానికంతా పరిచయం చేస్తే, "ఆమె చేసిన అనువాదం చదివితే నా కథ నాకే అర్థం కాలేదు" అని కొట్టివేయగల మహాశ్వేత, భేషజాలకు పోని మహాశ్వేత జ్ఞానపీఠాన్ని అంగీకరించడం బాధ కలిగించింది. "ఆ డబ్బుతో ఎన్నిగిరిజన గూడాల్లో బావులు తవ్వించొచ్చునో తెలుసా" అని ఆమె వివరణ ఇచ్చినా కసాయివాడి భూతదయ సదస్సుకు జీవకారణ్యవాది వెళుతున్నట్లే అనిపించింది. చిట్టచివరికి ఆమె ఇప్పడు కమ్యూనిస్టవ్యతిరేకి రామన్మెగసేసే అవార్డును కూడా అంతే నిర్లిప్తంగా అంగీకరిస్తుంటే, తెలుగు పాఠకులకు తెలిసిన మహాశ్వేతను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవానిపిస్తోంది. గుర్తు చేసుకుంటుంటే అదంతా నిన్ననో మొన్ననో జరిగినట్టే ఉంది. కాకపోతే ఇవాళ ఆ నిన్న నుంచి వికసించినట్టు లేదు.

ఆంధ్రజ్యోతి 3 ఆగస్ట్ 1997

Keywords : mahaswetadevi, bengal, tribals, adivasi, venugopal
(2018-12-11 10:37:29)No. of visitors : 2119

Suggested Posts


GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


మనలో