Menu

ఈ నెల 9,10న హైదరాబాద్ రండి…ఆదివాసులతో చేతులు కలుపుదాం, వాళ్ళ కోసం గొంత్తెతుదాం !

anadmin 2 years ago 0 142

ఆదివాసీ హక్కులు – కార్పొరేటీకరణ – సంఘీభావ ఉద్యమాలు
అఖిల భారత సదస్సు
ఆగస్టు 9 (శుక్రవారం), 10 (శనివారం), 2024 – సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్

మిత్రులారా..
భారతదేశంలోని ఆదివాసులు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోడానికి జీవన్మరణ ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు వాళ్ల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. అదివాసీ సంక్షేమం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రాజ్యాంగ ఆదేశాలను విస్మరించి పాలన సాగిస్తున్నాయి. అనేక ఉన్నత మానవీయ విలువలను, లక్ష్యాలను ప్రకటించుకున్న రాజ్యాంగం అదివాసుల విషయంలో ఘోరంగా విఫలమవుతున్నది. అదివాసుల కోసం నిర్దేశించిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. సమాజంలోని ఆధిపత్య శక్తులు ఆదివాసీ చట్టాలకు, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు పాలకులు అడ్డుకోవడం లేదు.

ఈ స్థితి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఉన్నది. దీనివల్ల బ్రిటీష్ పాలనలో పోరాడినట్లే ఆ తర్వాత కూడా ఆదివాసులకు పోరాడ‌క తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం చట్టబద్ధ పాలన అనే అతి ముఖ్యమైన రాజ్యాంగ మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వాలు స్వీకరించకపోవడం, రాజ్యాంగ ఆదర్శాలను ఆచరణలో నిజం చేయాల్సిన ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకమైన ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఒకటే అయినప్పటికీ బీజేపీ మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నది.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి, స్వావలంబన లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేట్ ఆర్థిక విధానాన్ని బీజేపీ శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. గత ప్రభుత్వాలకంటే మరింత బాహాటంగా కార్పొరేటీకరణను కొనసాగిస్తున్నందు వల్ల దేశంలో పౌర ప్రజాస్వామిక హక్కులకు పూర్తి విఘాతం కలుగుతోంది. అందులో ఆదివాసీ హక్కులు మరింతగా సంక్షోభంలో పడిపోయాయి. అడవితో, ప్రకృతితో ముడిపడిన పరంపరాగత జీవన విధానం గడిపే ఆదివాసులు పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అడవిలోకి కార్పొరేట్ శక్తుల చొరబాటును అడ్డుకోవాల్సి వస్తున్నది. దేశవ్యాప్తంగా కార్పొరేట్ ఆర్థిక విధానానికి వ్యతిరేకంగా వివిధ పీడిత సమూహాలు సాగిస్తున్న ప్రతిఘటనలో ఆదివాసుల సమరశీల పోరాటాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా రాజ్యాంగబద్ధ పాలన రావాలని అదివాసులు పోరాడుతున్నారు. రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్చ వంటి భావనలకు ఎదురవుతున్న సవాళ్లను ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని పాలకులు సహించలేకపోతున్నారు. చత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి మధ్య భారతదేశ రాష్ట్రాల్లోని ఆదివాసుల మీద కేంద్రంలోని బీజేపీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అణిచివేతను ప్రయోగిస్తున్నాయి.

అటవీ ప్రాంతాల కార్పొరేటీకరణకు ఆటంకంగా ఉన్న ఆదివాసులను అక్కడి నుంచి బైటికి పంపించడమో లేక చంపివేయడమో లక్ష్యంగా హింసాకాండ‌ పెరిగిపోయింది. దీనికి తాజా ఉదాహరణ ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్ కౌంటర్ల పేరుతో అదివాసులను చంపేస్తున్నది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆరంభమైన ఈ అణచివేత చర్యల కోసం దేశ సరిహద్దుల్లోని సైనిక బలగాలను కూడా అదివాసీ ప్రాంతాలకు తరలించారు. ఒక్క చత్తీస్ ఘడ్ లోనే సుమారు 150 మంది ఆదివాసులను చంపేశారు. మహారాష్ట్రలో, ఝార్ఖండ్ లో, తెలంగాణలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది.

కేవలం హత్యలే కాకుండా నిరంతర నిఘా, వేల సైనిక బలగాలతో క్యాంపులు, అత్యాధునిక సాంకేతికతతో నేల మీద, ఆకాశంలోంచి దాడులు, మహిళల మీద అత్యాచారాలు, లెక్కలేనన్ని అక్రమ‌ కేసులు, విచారణ లేని జైలు నిర్బంధం మొదలైన అనేక హింసా రూపాలు ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దీని వల్ల మూలవాసుల జీవితం అతలాకుతలం అవుతున్నది. ఆదివాసీ తెగల ఉనికి ప్రశ్నార్థకంగా తయారైంది.

దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసీ సంఘీభావ ఉద్యమాలు ఉదృతమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పడ్డ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఈ అఖిల భారత సదస్సును ఏర్పాటు చేసింది. ఆదివాసులపై హత్యాకాండను నిలువరించడమే లక్ష్యంగా దేశంలో జరుగుతున్న సంఘీభావ ఉద్యమాలను వేగవంతం చేయడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని భావిస్తున్నాం. అందరికీ ఇదే సాదర ఆహ్వానం.

-ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad