Menu

కర్రె గుట్టల్లో మారణహోమాన్ని ఆపాలి…27, 28 తేదీల్లో నిరసనలకు న్యూ డెమోక్రసీ పిలుపు

anadmin 10 months ago 0 187

చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమాన్ని తక్షణం ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మారణహోమానికి నిరసనగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

ఈ మేరకు న్యూడెమోక్రసీ విడుదల చేసిన ప్రకటన‌ పూర్తి పాఠం….

కర్రెగుట్ట ప్రాంతం లో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలి!

ఆదివాసి జాతిని హననం చేస్తున్న ఆపరేషన్ కగార్ ను ఆపాలి!!

ఏప్రిల్ 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు కొనసాగించండి!!!

చత్తీస్గడ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట గత నాలుగైదు రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నది. ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారు. ఇప్పటికీ హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాదాపు 20 వేల మంది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేయగా, ప్రతిరోజు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయు. గత రాత్రి నుండి పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 40 మందికి పైగా మావోయిస్టులు, ఆదివాసీలు హతమైనట్లు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ అడవులన్నీ బాంబుల మోతలతో తల్ల‌డిల్లుతున్నాయి..
తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపూర్, వాజేడు, ములుగు ప్రాంతాల్లోనూ వేలాదిగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్ట పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుండి ఇటు తెలంగాణ, అటు చత్తీస్గడ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉన్నది.
కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజనులని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్దమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించకుండా మొండిగా వ్యవహారిస్తున్నది. పైగా నేడు కర్రెగుట్ట అడవుల్లో ఏనాడు లేని విధంగా నరమేధాన్ని కొనసాగిస్తున్నది. దేశ వ్యాపితంగా మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక, ఆలోచనాపరుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకొస్తున్న వాస్తవాన్ని ఇప్పటికయినా గుర్తెరిగి చర్చలకు కేంద్రం ముందుకు రావాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే కర్రెగుట్ట బేస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరుతున్నది.
ఏప్రిల్ 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను పాటించాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

పి. సూర్యం
రాష్ట్ర కార్యదర్శి
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
తెలంగాణ రాష్ట్ర కమిటీ.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad