Menu

జూన్ 10న దేశవ్యాప్త బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

anadmin 10 months ago 0 590

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావుతో సహా 28 మంది మావోయిస్టుల హత్యకు నిరసనగా జూన్ 10 వ తేదీన దేశవ్యాప్త బంద్ కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ (బీఆర్) సహా 27 మంది అమరుల స్మారక సభలు జరపాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ ఓ ప్రకటన విడుదల చేశారు.

అభయ ప్రకటన పూర్తి పాఠం…

భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ (నంబాల కేశవరావు) అమర్ రహే.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. కార్యకర్తలను హత్య చేయడాన్ని ఖండిస్తూ జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ ను పాటించండి.

జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ (బీఆర్) సహా 27 మంది అమరుల స్మారక సభలు జరపండి

మే 21 భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటిరోజు. ఆ రోజున బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు, రక్తపిపాసులు, నరహంతకులైన దేశ ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్ షాల ఆదేశాలను అనుసరించి భారత సైన్యం, పారామిలిటరీ, కమాండో బలగాలు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు నారాయణపుర్ జిల్లా, మాడ్ ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్ సహా పార్టీ, పీ.ఎల్.జీ.ఏ.కు చెందిన వివిధ స్థాయి నాయకత్వ కామ్రేడ్స్ ను, సభ్యులను హత్యచేసాయి. ఈ హత్యకాండ సాగించిన భద్రతా బలగాల పట్ల తనకెంతో గర్వంగా ఉందని మోదీ, ఇది చారిత్రాత్మక విజయమని అమిత్ షాలు ప్రకటించారు. ఈ ప్రకటనల ద్వారా వారు తమ రక్తపిపాస, నరహంతక స్వభావాన్ని మరోమారు నిర్లజ్జగా ప్రకటించుకున్నారు.

ఈ హత్యకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూన్ 10 నాడు బంద్ పాటించాలని దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారకసభలు జరపాల్సిందిగా పిలుపునిస్తున్నాం.

మార్చి చివరి వారంలో జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ప్రకటన విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సానుకూల పరిస్థితిని కల్పిస్తే మా పార్టీ అందుకు సిద్ధమేనని మార్చి 28న పత్రికా ప్రకటన ద్వారా మా వైఖరిని ప్రకటించాం. ఆ తర్వాత రెండు సార్లు మా కేంద్రకమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ అభయ్, దండకారణ్య స్పెషల్ జోన్ లోని ఉత్తర్-పశ్చిమ్ సబ్ జోన్ల మీడియా ప్రతినిధి కామ్రేడ్ రూపేష్ రెండు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘కగార్’ యుద్ధాన్ని ఆపివేసి శాంతి చర్చలకు సానుకూల పరిస్థితిని కల్పించాలని కోరారు. ఈ ప్రకటనలను ఏమాత్రం లెక్క చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరమ ఫాసిస్టు పద్దతుల్లో ‘కగార్’ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 85 మంది కామ్రేడ్స్ ను హత్య చేసాయి. ఏప్రిల్ 21 నాడు ఝార్ఖండ్ రాష్ట్రంలోని బొకారొ జిల్లాలో మా పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ (ప్రయాగ్ మాంజీ)ని హత్య చేసారు. 24 ఏప్రిల్ నుండి మే 8 మధ్య కర్రెగుట్టల్లో 31 మందిని హత్యచేసారు. గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు 540 మంది విప్లవకారులను, జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతున్న సాధారణ ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయి. మావోయిస్టు రహిత భారత్ ఏర్పాటు కోసం మార్చి 31, 2026 వరకు ఈ హత్యకాండను కొనసాగిస్తామని దేశప్రధాని, హోంమంత్రులు పదే పదే ప్రకటిస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించినప్పటినుండి దాదాపు గత 2 నెలలుగా మేము ప్రభుత్వ సాయుధ బలగాలపై దాడులు చేయకుండా సంయమనం పాటించాం. ఈ స్థితిలో శాంతి చర్చలకు సిద్ధంగా లేని బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫాసిస్టు వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన, విశాలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.

కామ్రేడ్ బసవరాజ్ శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం, జియన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు. ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు శ్రీకాకుళం జిల్లాలో విద్యాభ్యాసం చేసిన ఆయన 1974 నుండి 1979 వరకు వరంగల్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. 1974 చివర్లో విప్లవ విద్యార్థి సంఘ సభ్యుడిగా చేరారు. 1975 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాడికల్ విద్యార్థి సంఘ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ గెరిల్లా జోన్ పర్ స్పెక్టివ్-దండకారణ్య ఉద్యమ పర్ స్పెక్టివ్ సర్క్యులర్ ప్రకారం ఆనాటి రాష్ట్రకమిటీ దండకారణ్య ప్రాంతానికి 7 దళాలను పంపింది. ఆ సమయంలో తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాల్లోకి పంపబడిన దళానికి కామ్రేడ్ గంగన్న పేరుతో కమాండర్ గా ఉన్నారు. 1983లో రెండు దళాలకు నాయకత్వాన్ని అందించే కో-ఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టి జిల్లాకమిటీ సభ్యుడిగా ఎదిగారు. 1985లో డివిజనల్ (జిల్లా) కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 1987లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. 1991లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, కేంద్రకమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) కాంగ్రెస్ లో కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయి, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య భారతంలో జాతుల విముక్తి కోసం సాయుధ పోరాటం చేస్తున్న కొన్ని సంస్థలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కృషి చేసారు. 1998లో పీపుల్స్ వార్, పార్టీ యూనిటీల ఐక్యతా కృషిలో పాల్గొన్నారు. 2004లో పీపుల్స్ వార్, ఎంసీసీఐ పార్టీలు కలిసి సీపీఐ (మావోయిస్టు)గా ఏర్పడడానికి కారణమైన ఐక్యతా కృషిలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 2013లో సీపీఐ (మావోయిస్టు), నక్సల్బరీ పార్టీల ఐక్యతా కృషిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2007లో ఐక్యతా కాంగ్రెస్-9వ కాంగ్రెస్ లో మరోమారు కేంద్రకమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు, మరోమారు సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. 2017 వరకు అదే బాధ్యతల్లో కొనసాగారు. 2017 నుండి ఇప్పటివరకు గత 8 సంవత్సరాలుగా సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు.

51 సంవత్సరాల తన విప్లవ జీవితంలో కామ్రేడ్ బసవరాజ్ భారత విప్లవోద్యమానికి గొప్ప సేవలు (కంట్రిబూషన్) అందించారు. 1970వ దశకంలో వరంగల్-హన్మకొండ-కాజీపేట ప్రాంతంలో విప్లవ విద్యార్థి-యువజన ఉద్యమాన్ని నిర్మించారు. 1980వ దశకంలో దండకారణ్య విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. 1990వ దశకంలో ఉత్తర తెలంగాణ, దండకారణ్య ఉద్యమాలను గెరిల్లా జోన్ స్థాయి ఉద్యమాలుగా అభివృద్ధి చేయడంలో ప్రత్యక్ష నాయకత్వాన్ని అందించారు. 2000 నుండి 2017 వరకు దండకారణ్యం, బిహార్ – ఝార్ఖండ్ గెరిల్లా జోన్లను విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రజావిముక్తి గెరిల్లా సైన్యాన్ని (పీ.ఎల్.జీ.ఏ.ను) ఏర్పాటు చేయడంలో, గెరిల్లాయుద్ధాన్ని/ప్రజాయుద్ధాన్ని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడంలో, ప్రజారాజ్యాధికార అంగాల (జనతన సర్కార్ల) ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. ఈ మొత్తం కృషిలో సైద్ధాంతిక, రాజకీయ, మిలిటరీ, నిర్మాణ రంగాల్లో గొప్పగా కృషి చేసారు. 1985, 1991లో పార్టీలో తలెత్తిన అతివాద, మితవాద పంథాలను ఓడించడంలో, 2001, 2007 కాంగ్రెస్ ల్లో ముందుకు వచ్చిన అతివాద పంథాలను ఓడించడంలో ముందున్నారు. 2016లో ‘చైనా సోషల్ సామ్రాజ్యవాదం’ డాక్యుమెంట్ ను రూపొందించడంలో, 2021లో ‘భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం’ డాక్యుమెంట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 2001 నుండి 2025 వరకు కేంద్రకమిటీ రూపొందించిన అన్ని డాక్యుమెంట్ల, పాలసీ పేపర్లన్నింటిలో కీలకపాత్ర పోషించి భారత విప్లవోద్యమానికి సైద్ధాంతిక, రాజకీయ నాయకత్వాన్ని అందించారు. దారగడ్డ ఆంబుష్ నుండి మొదలుకొని ముకరం ఆంబుష్ (2010) వరకు అనేక సైనిక చర్యల పథక రచనలో (ప్లానింగ్), బలగాల మోటివేషన్ లో అగ్రగామి పాత్ర పోషించారు. కొన్ని చర్యల్లో ప్రత్యక్షంగా కమాండర్ గా వ్యవహరించారు. పీ.ఎల్.జీ.ఏ.ను సుశిక్షితమైన ప్రజా సైన్యంగా తీర్చిదిద్దడానికి అవామీ జంగ్ పత్రికకు ప్రధాన సంపాదకుడిగానే కాకుండా, అనేక మిలిటరీ శిక్షణా శిబిరాలను నడిపారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ సిద్ధాంత పత్రిక ‘పీపుల్స్ వార్’ కు ప్రధాన సంపాదకుడిగా ఉంటూ సమర్థవంతంగా నడిపారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం భారత విప్లవోద్యమానికి, పార్టీకి నిస్సందేహంగా భారీ నష్టమే. అయితే ఈ నష్టం శాశ్వతం కాదు. 1972లో ఆనాటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారుమజుందార్ ను పొట్టన బెట్టుకున్న దోపిడీ పాలకవర్గాలు దేశంలో విప్లవోద్యమం సమసిపోయిందని సంతోషపడ్డాయి. అనతి కాలంలోనే 1978లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో విప్లవోద్యమం పెల్లుబికింది, ఇతర రాష్ట్రాల్లో విప్లవ పార్టీ విస్తరించింది. 1999 డిసెంబర్ లో కామ్రేడ్స్ శ్యాం, మహేష్, మురళిలను హత్య చేసి విప్లవోద్యమ వెన్ను విరిచాం అని దోపిడీ ప్రభుత్వాలు సంభరపడ్డాయి. కానీ సంవత్సర కాలంలోనే 2000 సంవత్సరంలో ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి పాలక వర్గాల గుండెల్లో సింహస్వప్నమైంది. ఆనాటి నుండి పార్టీ నాయకత్వంలో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలన కోసం పీ.ఎల్.జీ.ఏ. ప్రజాయుద్ధాన్ని సాగిస్తోంది. కామ్రేడ్ చారుమజుందార్ అమరత్వం తర్వాత గడిచిన 53 ఏళ్లలో దేశవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో కేంద్ర, రాష్ట్రకమిటీల సభ్యులు అమరులయ్యారు. వారి అమరత్వంతో భారత విప్లవోద్యమం నష్టపోయినప్పటికీ ఆ నష్టాల నుండి విప్లవోద్యమం కోలుకుంటూ వస్తోంది. భారతదేశంలో సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడి, పీడనలున్నంత వరకు పీడిత వర్గాలు, పీడిత సాంఘిక సముదాయాలు, పీడిత జాతులు వాటికి వ్యతిరేకంగా వర్గపోరాటాలు చేస్తాయి, ప్రజాయుద్ధం చేస్తాయి. ఈ పోరాటాల, ప్రజాయుద్ధ క్రమంలోనే సామాన్య ప్రజలనుండే అసామాన్య నాయకులు రూపొందుతారు. అందుకే ‘ఒక వీరుడు మరణిస్తే పుడతారు వేనవేలు’ అనేది వర్గపోరాట నియమంగా మారింది.

జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా, కామ్రేడ్ బసవరాజ్ భారత విప్లవోద్యమానికి చేసిన సేవలను ఎత్తిపడ్తూ, ఆయనతో అమరులైన కామ్రేడ్స్ అమరత్వాన్ని ఎత్తిపడ్తూ, విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని ప్రతిఘటించేలా ప్రజలను సిద్ధం చేస్తూ అమరుల స్మారక సభలను జరపాల్సిందిగా యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. అమరుల ఆశయాల సాధన కోసం విప్లవోద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా విద్యార్థి యువజనులకు, మేధావులకు, కార్మికులకు, కర్షకులకు, మధ్యతరగతికి, జాతీయ పెట్టుబడిదార్లకు, మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, మతమైనారిటీలకు, పీడిత జాతులకు పిలుపునిస్తున్నాం.

అభయ్,
అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad