మధ్య భారతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. వందల మంది ఆదివాసులను, మావోయిస్టులను రాజ్యాంగ వ్యతిరేకంగా హత్యలు చేస్తున్న మోడీ ప్రభుత్వం పై ఆ ప్రదర్శన తీవ్రంగా విరుచుకపడింది.
పంజాబ్ లోని డెమాక్రటిక్ – రివల్యూషనరీ మూవ్ మెంట్’ (ప్రజాస్వామిక-విప్లవోద్యమం) అనే వేదిక మరోసారి తన విప్లవకర పాత్రతో కదం తొక్కింది. ఈ దేశంలో అత్యంత అణచివేతకు గురవుతున్న, వివక్షకు గురవుతున్న ఆదివాసీ ప్రజలపై ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా, మొగా పట్టణం నుండి ఒక బలమైన స్వరాన్ని వినిపించింది. ఆదివాసీ ప్రజలు, వారికి మద్దతుగా నిలబడ్డవారు, వారి కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య, రక్తపాత దాడులను ఆపాలని హెచ్చరించారు. మేధావులు, హక్కుల కార్యకర్తలు, మావోయిస్టు విప్లవకారులు, ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి శక్తిపైనా జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని స్వరాన్నెత్తారు.
పంజాబ్ రైతుల భూములపై జరుగుతున్న దాడులు, ఉపాధి నిర్మూలనకు, పర్యావరణ విధ్వంసం, ఆదివాసీ రైతుల నరమేధానికి అసలు బాధ్యులైన ప్రపంచ కార్పొరేట్ సంస్థల మధ్య సంబంధాలు మరింత స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాలు మొదలుకొని కశ్మీరీ ప్రజలపై అమలవుతున్న హింసాకాండ, పంజాబ్‌లోని సారవంతమైన భూములపై జరుగుతున్న దాడులు, దేశంలోని విప్లవ స్వరాలను అణచివేయడం వరకు విస్తృతమైన అంశాలపైన ఈ సభలో వక్తలు మాట్లాడారు.
ఈ దౌర్జన్యాలు, ప్రజా హక్కులపై దాడుల సాధారణ సూత్రం “ఆర్థిక సంస్కరణలు” అని పిలిచే సామ్రాజ్యవాద దాడితో ముడిపడి ఉందని స్పష్టం చేసారు. గాజాలో జరుగుతున్న అమానవీయ దారుణాలకు వ్యతిరేకిస్తూ పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు ఈ ప్రదర్శన మద్దతు తెలిపింది.
పంజాబ్‌లోని వేలాది మంది పోరాట యోధులు హాజరైన ఈ సమావేశం, మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసుల ఉద్యమానికి ఒక సంఘీభావం నినాదం మాత్రమే కాదు, ప్రపంచ సామ్రాజ్యవాద సంస్థలు, వారి సేవకులైన భారత ప్రభుత్వమూ, దళారీ పెట్టుబడిదారీ వర్గాలైన ఉమ్మడి శత్రువులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉమ్మడి పోరాటానికి ఇచ్చిన పిలుపు కూడా.
సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం దేశంలోని ఏ మూలనైనా జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా శ్రమజీవుల దేశవ్యాప్త ప్రతిఘటనను ముందుకు తీసుకెళ్లడంలో పంజాబ్ విప్లవ ప్రజలు కీలక పాత్ర పోషిస్తారని ఈ ప్రదర్శన తేల్చి చెప్పింది.

