కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సహచరులకు
అభినందనలు!
మేము చైనాకు చెందిన మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ విప్లవకారులం. 2025 మే 21 మాకు చాలా విషాదకరమైన రోజు – కామ్రేడ్ బసవరాజ్ అమరత్వం గురించి తెలిసింది. ఆ రోజు, మా సంపాదకీయ బృందం చైనీస్ భాషలో రాసిన ఒక చిన్న వ్యాసాన్ని చైనాలోని విప్లవ వామపక్షాలలో వ్యాప్తి చేయడానికి మా శాయశక్తులా ప్రయత్నం చేశాం. మా స్మారక వ్యాసాన్ని వీడియోగా చేసి చైనాలో అమలులో ఉన్న కఠిన నియంత్రణల ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేసాం.
వేలాది మంది చైనా యువత కామ్రేడ్ బసవరాజ్‌ను ఘనంగా స్మరించుకున్నారు. అతని విప్లవ స్ఫూర్తితో ఎంతో ప్రేరణ పొందారు.
మా నివాళిలో, మేము ఇలా రాసాము:
“మీ నమ్మకాలను మావిగా చేసుకుంటాము. మీరు నేలకొరిగిన చోట, మేము మరిన్ని విశ్వాస విత్తనాలను నాటుతాము; మీరు నిద్రించిన నిశిలో మేము ఒక ప్రచండ నిప్పురవ్వను వెలిగిస్తాం. మీ పేరునే కర్తవానికి పిలుపుగా మారుస్తాం. మీ స్ఫూర్తినే ఒక తేజోమయ జ్వాలగా వెలిగిస్తాం. నీ త్యాగం సుత్తీ (కార్మిక చిహ్నం) కొడవలి సంకేతమవుతుంది.”
“ ఈ విషాదం మా విశ్వాసాన్ని అణచివేయజాలదు . కామ్రేడ్ బసవరాజ్ స్ఫూర్తి మన పోరు జెండాలను ఎగురవేసే గాలి అవుతుంది, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటాన్ని కొనసాగించడానికి మాకు ప్రేరణనిస్తుంది. శత్రువు ఒక పోరాట యోధుడిని చంపగలడు, కానీ విప్లవ సంకల్పాన్ని నాశనం చేయలేడు; వాడు ఒక జ్వాలను ఆర్పగలడు, కానీ దావానల వ్యాప్తిని ఆపలేడు. కామ్రేడ్ బసవరాజ్ ఆశయాల్ని వారసత్వంగా పొందుదాం. ఆయన ఆదర్శాలను మన దిశానిర్దేశం చేసుకుందాం. ఆయన రక్తసిక్తం చేసిన భూమిపై విత్తడం కొనసాగిద్దాం. ఆయన ఆశయాలను కొనసాగించడానికి పోరులో ముందుకు సాగుదాం!”
చైనాలో సోషలిస్ట్ విప్లవమూ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవమూ ఒకటే ; దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. మేము ఇంకా పార్టీని స్థాపించనప్పటికీ, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో జెడాంగ్ మార్గదర్శకత్వంలో పార్టీ నిర్మాణం చేసి, రాజకీయాధికారాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. చైనాలో విప్లవకర వామపక్షానికి సుదీర్ఘ చరిత్ర ఉంది, ఇది అక్టోబర్ 1976లో జరిగిన ప్రతిఘాతుక -విప్లవ తిరుగుబాటు తర్వాత ఆవిర్భవించింది. 1976 నుండి 2025 వరకు, చైనా విప్లవకర వామపక్షం తన ప్రాథమిక దృక్పథాన్ని, పద్ధతులను ఏర్పాటు చేసుకొన్నది. విప్లవ ఆచరణ నుండి కొత్త సిద్ధాంతాలు కూడా పుట్టాయి. మీకు వీటిపై ఆసక్తి ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించడానికి వెనుకాడకండి.
ప్రపంచ శ్రామికవర్గ సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి!
ప్రపంచ శ్రామికవర్గం ఐక్యంగా కమ్యూనిజం కోసం చివరి వరకు పోరాడాలి!
కామ్రేడ్ బసవరాజ్ విప్లవ స్ఫూర్తి వర్ధిల్లాలి!
ప్రజల యుద్ధం విజయం సాధిస్తుంది!
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పట్ల అత్యున్నత శ్రామికవర్గ గౌరవంతో!
ఆగస్టు 3, 2025
(redspark.nu:సౌజన్యంతో )
తెలుగు అనువాదం పద్మ కొడిపర్తి