Menu

‘నక్సలైట్’ అంటే ఎవరు? – జస్టిస్ కె. చంద్రు

anadmin 5 months ago 0 291

ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై హోంమంత్రి చేసిన ఆరోపణ, ఉపయోగించిన కొన్ని పదాలను ప్రజాహిత మేధావుల జీవితకృషిని పనికిరానివిగా చేయడానికి ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించారో; ఉన్నత న్యాయవ్యవస్థనే స్వయంగా దీనికి ఎలా దోహదపడిందో అనే విషయాలు మనని లోతుగా ఆలోచించేలా చేయాలి.
జస్టిస్ కె. చంద్రు (రిటైర్డ్ జడ్జి, మద్రాసు హైకోర్టు)
25 ఆగస్టు 2025,
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి పూర్వ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పైన (2007- 2011 మధ్య సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు) గత శుక్రవారం, హోంమంత్రి అమిత్ షా అకస్మాత్తుగా విమర్శలు చేస్తూ, ఆయన నక్సలైట్ ఉద్యమానికి మద్దతుదారుడని ఆరోపించాడు. 2011లో నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ కేసులో జస్టిస్ రెడ్డి ఇచ్చిన తీర్పును షా ప్రత్యేకంగా దృష్టికి తీసుకువచ్చాడు. “ ‘సల్వా జుడుం’ అనే మిలీషియాను రద్దు చేయాలని ఆయన ఆదేశించారు. నక్సలైట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు కార్యకలాపాలను చేపట్టడానికి ఛత్తీస్‌గఢ్‌ రాజ్యం ఆదివాసీ యువతకు జీతం ఇచ్చి ఈ మిలీషియాను ఏర్పాటు చేసింది. జస్టిస్ రెడ్డి తీర్పు లేకపోయీ ఉంటే కనక కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతం నుండి నక్సలైట్లను తుడిచిపెట్టేసేది” ఆని షా అన్నాడు.
హోంమంత్రి ఆరోపణలను సుప్రీంకోర్టు, హైకోర్టుల అనేక మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, అలాగే ఒక సీనియర్ న్యాయవాది, ఒక న్యాయనిపుణుడు కూడా తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఉదయం విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో, రిటైర్డ్ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలను “దురదృష్టకరం” అని అభివర్ణించారు. నందిని సుందర్ కేసులో నిర్ణయం , స్పష్టంగానో లేదా పరోక్షంగా కూడా, నక్సలిజం లేదా దాని భావజాలానికి మద్దతు ఇవ్వలేదని గుర్తించారు.
ఆ ప్రకటనలో ఇంకా ఇలా ఉంది:
“ఒక ఉన్నత రాజకీయ అధికారి సుప్రీంకోర్టు తీర్పును పక్షపాతవైఖరితో తప్పుగా అర్థం చేసుకొంటే కనక అది సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది; న్యాయవ్యవస్థ స్వతంత్రతను కుదిపేస్తుంది”.
గవర్నర్ పదవుల కోసం రాజకీయ ప్రచారాలను మర్యాదగా, గౌరవంగా నిర్వహించాలని ఆ న్యాయమూర్తులు కోరారు. భావజాలానికి సంబంధించి అభ్యర్థులకు పేర్లు పెట్టి వారిపై దాడి చేయడం నిలిపివేయాలని అన్నారు.
సల్వాజుడుం కేసు కాల పరీక్షలో ఎలా నిలిచింది?
ఈ సందర్భంలో, సల్వా జుడుం కేసులో తీర్పు హోంమంత్రిని ఎలా రెచ్చగొట్టిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉపయోగపడవచ్చు. సీనియర్ విద్యావేత్తలు నందిని సుందర్, రామచంద్ర గుహ, పూర్వ సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ ఇ.ఎ.ఎస్. శర్మలు కోర్టులో దాఖలుచేసిన కేసులో, కేంద్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలను జారీ చేస్తూ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు:-
“పైన సుదీర్ఘంగా చర్చించినట్లుగా, మావోయిస్టు/నక్సలైట్ కార్యకలాపాలను, హింసను ఎదుర్కోవడంలో సమర్థవంతమైనవని, అవి “మరింత ప్రభావాన్ని” కలిగి ఉన్నాయని చత్తీస్‌గఢ్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసరుల (ఎస్‌పిఒ) నియామకాన్ని హేతుబద్ధీకరించడానికి భారత యూనియన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రెండూ ప్రయత్నించాయి. పైన ఎత్తి చూపినట్లుగా, దానివల్ల ప్రస్తుత, భవిష్యత్ సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలు భయంకరమైనవిగా ఉంటాయి. రాజ్యం అవలంబించే ఇటువంటి విధానాలు చత్తీస్‌గఢ్‌లో ఎస్‌పిఒలుగా పనిచేస్తున్న, మావోయిస్టులు/ నక్సలైట్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చర్యలు చేపట్టిన, అలాగే ఆ ప్రాంతాలలో నివసిస్తున్న పౌరులకు ఉన్న ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 రెండింటినీ ఉల్లంఘిస్తున్నాయి.( భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, భారతదేశ భూభాగంలో ఉన్న ఏ వ్యక్తికి అయినా చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను రాజ్యం తిరస్కరించకూడదని తెలియజేస్తుంది. దీని అర్థం పౌరులందరినీ సమానంగా చూడాలి, వారి కులం, జాతి, మతం, జెండర్ లేదా జన్మస్థలంతో సంబంధం లేకుండా చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ఈ సూత్రం “చట్ట నియమం”గా పరిగణించబడుతుంది; ఇది ప్రజాస్వామ్యానికి పునాది. ఆర్టికల్ 21 అనేది భారత రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు, ఇది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. చట్టం ద్వారా నిర్దేశించిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని ఈ ఆర్టికల్ చెబుతుంది. భారత న్యాయవ్యవస్థ ఈ ఆర్టికల్ కు విస్తృత అర్థాన్ని ఆపాదించింది. జీవించే హక్కులో అనేక ఇతర హక్కులు కూడా ఉంటాయి.
రాజ్యాంగ అనుమతిని నిర్ధారించడానికి బలగాల ప్రభావం ఏకైక కొలమానంగా ఉండకూడదు, ఉండలేదు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు/నక్సలైట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్‌పిఒలు “సమర్థవంతంగా” ఉన్నారా లేదా అనేది, చత్తీస్‌గఢ్‌లోని వ్యవహారాల స్థితిని బట్టి సందేహాస్పదంగాను, ఖండించదగిన ప్రతిపాదనగానూ అనిపిస్తుంది.
మావోయిస్టులు/నక్సలైట్లపై ఎస్‌పిఒలు నిజంగానే ప్రభావవంతంగా ఉన్నారని మనం వాదన కొరకు భావించినప్పటికీ, వాటి వలన కలిగే సందేహాస్పద ప్రయోజనాలు రాజ్యాంగం పట్ల విధేయత తీవ్రంగా క్షీణించడానికి, సామాజిక క్రమానికి నష్టం కలిగించడానికి మాత్రమే దారితీశాయి. రాజ్యం పేర్కొంటున్న “శక్తి”, ఈ సందర్భంలో , రాజ్యాంగం తన శక్తిని దారుణంగా కోల్పోవడానికి దారితీస్తుంది
రాజ్యాంగ విశ్వాసం అటువంటి శక్తిని ఉపయోగించడాన్ని లేదా అధికం చేయడాన్ని అనుమతించదు, అనుమతించకూడదు. రాజ్యాంగ ఔచిత్యాన్ని “శక్తి గుణకాలు” వంటి ఏకపక్షంగా ఎంచుకున్న, అనవసరంగా ఉపయోగించే పదబంధాలను విసిరేయడం కాదు. రాజ్యాంగ తీర్పు, ఈ కోర్టు ద్వారా పౌర స్వేచ్ఛలను కాపాడటం అనేది అటువంటి వాదనలు, సమర్థనల ద్వారా ప్రభావితం కావడం కంటే చాలా పవిత్రమైన విధి.
ఈ తీర్పు కాల పరీక్షకు నిలబడింది. అయితే, బహుశా హోంమంత్రి ఈ దుశ్చర్యలో పాల్గొనడానికి ధైర్యాన్ని ఇచ్చింది కూడా మళ్ళీ న్యాయవ్యవస్థకు ఉన్న బలహీనతనే. నందిని సుందర్ తీర్పులో ఆదేశాలు ఉన్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. అందుకు విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్ సహాయక సాయుధ పోలీసు దళ చట్టం-2011ను అమలు చేయడం ద్వారా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పోలీసు బలగాన్ని సాయుధంగా ఉంచడాన్ని కొనసాగించింది. ఆ చట్టాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ముందు సవాలు చేశారు; కోర్టు ధిక్కార దరఖాస్తును ప్రొఫెసర్ సుందర్ సమర్పించినప్పుడు, 2025లో అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కోర్టు తన సమర్థనను ఈ క్రింది విధంగా ఇచ్చింది:-
“రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం, ఏ వైపు నుండి హింస తలెత్తినా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నివాసితులకు శాంతి, పునరావాసం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవడం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమూ, భారత కేంద్ర ప్రభుత్వాల విధి అని మేము గమనించాము.
ఈ కోర్టు ఆదేశం తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాసనసభ ఒక చట్టాన్ని ఆమోదించడాన్ని, మా దృష్టిలో, ఈ కోర్టు ఆమోదించిన ఆదేశాన్ని ధిక్కరించే చర్యగా చెప్పలేమని కూడా మేము గమనించాము. ప్రతి రాష్ట్ర శాసనసభకు ఒక చట్టాన్ని ఆమోదించడానికి పూర్తి అధికారాలు ఉన్నాయని, ఆ చట్టం రాజ్యాంగవ్యతిరేకంగా ఉన్నదని లేదా ఏ విధంగానైనా రాజ్యాంగ న్యాయస్థానం రద్దు చేసేంతవరకు, ఆ చట్టం చట్టబద్ధంగా ఉంటుందని గమనించాం. అయితే, ఏదైనా పక్షం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని రద్దు చేయాల్సిఉన్నదని కోరుకుంటే, ఆ విషయంలో చట్టపరమైన పరిష్కారాల కోసం సమర్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. వాస్తవానికి, పార్లమెంటు లేదా ఏదైనా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం చెల్లుబాటు లేదా ఇతరత్రా అంశాల గురించి వివరణాత్మక సందేహాలు, వివాదాలను పరిష్కరించే అధికారంఉన్న న్యాయవ్యవస్థ రాజ్యాంగం కింద ఉంది.”
ఒక కార్యనిర్వాహక చట్టాన్ని ఇప్పటికే రాజ్యాంగ విరుద్ధమని పరిగణిస్తే, రాష్ట్ర శాసనసభ, అదే అంశంపై చట్టాన్ని తిరిగి అమలు చేస్తున్నప్పుడు, వారు ఎటువంటి రాజ్యాంగ నిషేధం నుండి తప్పించుకోగలరు? ఎలా వాదించగలరు అనేది ఇక్కడ తలెత్తే ప్రశ్న. అయితే, ఈ మలుపు అనేక మంది కార్యనిర్వాహక అనుకూల, మితవాద వ్యాఖ్యాతలను ప్రత్యర్థులను “నక్సల్స్”ను సమర్థించేవారిగా దాడి చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది.
జస్టిస్ రెడ్డి నిష్పాక్షికతకు బిజెపినే మద్దతు ఇచ్చినప్పుడు
జస్టిస్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై బిజెపి ఇప్పుడు ఈ ఆరోపణలు లేవనెత్తినప్పటికీ, గతంలో ఆయన పట్ల పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం నిజంగా ఒక విపర్యాసం. 2013లో, గోవా శాసనసభను బిజెపి కైవసం చేసుకున్నప్పుడు, మనోహర్ పారికర్ దాని మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పటిలాగే, పాలన మారినప్పుడు, సాధారణంగా మునుపటి పాలక పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది; గోవా విషయంలో, మునుపటి పాలక పార్టీ కాంగ్రెస్. బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు, రాష్ట్రానికి లోకాయుక్త లేదా పార్లమెంటరీ అంబుడ్స్‌మన్‌ను నియమిస్తామని పారికర్ తమ ఎన్నికల హామీలో ప్రకటించారు. వెంటనే, ఒక జాబితా తయారు చేసారు. షరతు ఏమిటంటే, తటస్థంగా ఉండి ఎవరూ సంప్రదించలేని వ్యక్తి మాత్రమే లోకాయుక్త పదవికి అనువైన ఎంపికగా ఉండాలి. అది వారి సాధారణ నమ్మకం కాబట్టి కాదు. కానీ ప్రతిపక్షంతో వ్యవహరించేటప్పుడు, నైతికత లేని న్యాయమూర్తి చేతిలో తాము పడకూడదని అనుకున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బిజెపికి నచ్చినవాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి; ఆయన సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేసి, “సల్వా జుడుం” కేసులో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన తీర్పు ఇచ్చి అప్పటికి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అయినప్పటికి పారికర్ జస్టిస్ రెడ్డిని ఎంచుకుని, అతని అధికారసమయ కొనసాగింపుకు లోకాయుక్త చట్టాన్ని సవరించడానికి కూడా సిద్ధమయ్యాడు. 2013 మార్చిలో జస్టిస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రెండు ప్రతిపక్ష పార్టీలు – ఐఎన్‌సి, ఎన్‌సిపి – జస్టిస్ రెడ్డిని బిజెపికి తొత్తుగా నిందిస్తూ, ఆయనను నియమించాలనే నిర్ణయంపై దాడి చేశాయి. అయితే, కొంత వ్యక్తిగత విషాదం కారణంగా, జస్టిస్ రెడ్డి అక్టోబర్ 2013లో పదవికి రాజీనామా చేశారు; ఆ పదవిని తదుపరి మూడు సంవత్సరాలు భర్తీ చేయలేకపోయారు.
ఇండియా కూటమి జస్టిస్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత, పాలక పార్టీ మద్దతుదారులు ఆయనను ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఎందుకని ఎంపిక చేసారు అని ప్రశ్నిస్తూ న్యాయమూర్తిపై చేసిన పాత ఆరోపణలను కాంగ్రెస్‌కు వెంటనే గుర్తు చేశారు. నా అభిప్రాయం ప్రకారం, ఈ ఆరోపణను బయటకుతీయడం ద్వారా, పారికర్ ఒకానొక సమయంలో నమ్మినట్లుగానే జస్టిస్ రెడ్డి న్యాయంగా, తటస్థంగా ఉంటారనే ఖ్యాతిని మరింతగా నిరూపించడంలో కార్యనిర్వాహక అనుకూల వ్యాఖ్యాతలు సహాయపడ్డారు.
నక్సల్ ఎవరు?: ప్రజా మేధావులపై దాడి; న్యాయవ్యవస్థ నిశ్శబ్ద సహకారం
ఇటీవల, పాలక పార్టీ మద్దతుదారులు తమను వ్యతిరేకించిన ప్రజా మేధావులకు ‘నక్సల్’, ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర వేయడాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. భీమా కోరెగావ్ కేసులో అపఖ్యాతి పాలైన చట్టవిరుద్ధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (‘UAPA’) కింద జైలులో నిర్బంధించిన మేధావులు, సామాజిక కార్యకర్తలపై ఇలాంటి ఆరోపణలు మోపడాన్ని మనం చూశాము.
ఈ కేసులో చిక్కుకున్న వారందరూ క్షేత్రస్థాయి సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు; నిర్బంధంలో ఉన్నప్పుడూ అవిశ్రాంత పోరాటాలు చేసారు. దశాబ్దాలుగా ఆదివాసుల హక్కుల ఉద్యమం అమూల్యమైనవారుగా పరిగణించిన ఫాదర్ స్టాన్ స్వామి మరణం మన న్యాయ వ్యవస్థ విషాద చరిత్రలో లిఖితమవ్వాలి.
భీమా కోరెగావ్ కేసులో నిందితులైన మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ వంటి కొంతమందికి ఇంకా బెయిల్ ఎందుకు రాలేదో, లేదా ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ, పదిహేను మంది నిందితులపై నిజంగా ఉన్న అభియోగాలు ఏమిటో హోంమంత్రి వివరిస్తారా?
ఒకరిని ‘నక్సల్’ అని నిందించడం కేవలం రాజకీయ వర్గాల జవాబుదారీతనానికి మాత్రమే పరిమితం కాలేదు అనే విషయాన్ని కూడా గమనించాలి. న్యాయవ్యవస్థ కూడా ఇటువంటి నామవాచకాల వాడకాన్ని నిషేధించడం లేదా ఖండించడం చేయకుండా నేరంలో భాగంపంచుకుంది. ‘మార్క్సిజం’, ‘కమ్యూనిజం’ లేదా ‘విప్లవం’ వంటి రాజకీయ సిద్ధాంతానికి సంబంధించిన నిరపాయకరమైన పదాలను న్యాయవ్యవస్థ ఎంతగా గ్రహించిందంటే, ఈ భావజాలాలతో ముడిపడి ఉన్న “ప్రమాదాలను” ఎత్తి చూపడానికి తమ మార్గం నుంచి బయటికి వచ్చిఅయినా సరే తమ వంతు కృషి చేయడం ముఖ్యమని కోర్టులు భావించాయి.
ఉదాహరణకు, 2022 అక్టోబర్ లో, జెఎన్‌యు స్కాలర్ ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదానికి తమదైన వివరణను ఇలా ఇచ్చింది.
“…..ఏమైనప్పటికీ, విప్లవం కోసం యిచ్చే పిలుపు అక్కడ సమావేశానికి హాజరు అయినవారిని మాత్రమే ప్రభావితం చేస్తుందని కాదు కాబట్టి, అప్పీలుదారుడి వాదనను ఈ కోర్టు అంగీకరించలేదు. విప్లవం కోసం ఇచ్చిన పిలుపు అక్కడ ఉన్నవారి కంటే ఇంకా చాలా మందిని ప్రభావితం చేయవచ్చు; అందుకని ఫ్రెంచ్ విప్లవంలో అగ్రగామిగా ఉన్న రోబెస్పియర్ గురించి ప్రస్తావించడం ఈ కోర్టు సముచితంగా భావిస్తుంది. అప్పీలుదారుడు విప్లవం అంటే ఏమిటో చెప్పడానికి మాక్సిమిలియన్ రోబెస్పియర్ గురించి ప్రస్తావించి ఉంటే కనక మన స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి ప్రధానమంత్రికి కూడా విప్లవం అంటే ఏమిటో తెలిసే ఉంటుందని ఈ కోర్టు అభిప్రాయపడింది. స్వాతంత్ర్యం తర్వాత ప్రజాస్వామ్యం విప్లవాన్ని అవసరం లేనిదిగా చేసిందని, విప్లవం అనేది రక్తరహిత మార్పుకు పూర్తి వ్యతిరేకమని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వసించాడనేది వాస్తవం.
విప్లవం ఎల్లప్పుడూ దానంతటదే రక్తరహితంగా ఉండదు; అందుకే దీనిని ‘రక్తరహిత’ విప్లవం అనే ఉపసర్గతో ఉపయోగిస్తారు. కాబట్టి, మనం ‘విప్లవం’ అనే వ్యక్తీకరణను ఉపయోగించినప్పుడు, అది తప్పనిసరిగా రక్తరహితంగా ఉండనవసరం లేదు. “విప్లవ” కార్యాచరణకు సంబంధించి ముఖ్యమైన నాణ్యతలో భిన్నంగా ఉండకపోవచ్చు కానీ రోబెస్పియర్, పండిట్ నెహ్రూ దృక్కోణం నుండి, దాని సామర్థ్యంలోనూ, ప్రజా ప్రశాంతతపై కలిగించే దాని ప్రభావంలోనూ చాలా తేడా ఉంటుందని ఈ కోర్టు గుర్తు చేస్తోంది.”
‘విప్లవం’ అనే పదాన్ని న్యాయవ్యవస్థ ఆందోళనకరంగా చూడటమే కాదు. రాజ్యాంగ చరిత్రలో మేధావులైన న్యాయమూర్తులు వి. కృష్ణయ్యర్, ఓ. చిన్నప్ప రెడ్డి చేసిన పరిశీలనలు కూడా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) వివరణకు సంబంధించి, ‘ఒక నిర్దిష్ట… ఆలోచనా విధానాన్ని’ న్యాయపరమైన వివరణకు తీసుకువచ్చాయని ఆరోపించారు.
2024లో, తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయంలో, అప్పటి ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ చంద్రచూడ్ తన ప్రముఖ అభిప్రాయంలో ఇలా రాశారు:
“గుర్తించదగిన విషయం ఏమంటే, ఈ ఆర్ధిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యాంగ నిర్మాతల దార్శనికతనే ఆధారం అని జస్టిస్ కృష్ణ అయ్యర్ (రంగనాథ రెడ్డి, భీమ్ సింగ్ జీ కేసులలో) జస్టిస్ చిన్నప్ప రెడ్డి (సంజీవ్ కోక్ కేసులో) నిరంతరం ప్రస్తావించారు.
“ఆర్టికల్ 39(b) లో అన్ని వ్యక్తిగత వనరుల పంపిణీ కూడా ఉందని ప్రకటించడం అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఒక నిర్దిష్ట ఆర్థిక భావజాము, నిర్మాణము ఉన్నదని ఆమోదించడమే అవుతుంది. రంగనాథ రెడ్డి కేసులోనూ తీర్పు, ఆ తరువాత సంజీవ్ కోక్, భీమ్ సింగ్‌జి కేసులలోనూ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పులు ఒక నిర్దిష్ట ఆర్థిక ఆలోచనా విధానంతో ప్రభావితమైనవి.”
ఆ బెంచ్‌లో ఉన్న జస్టిస్ సుధాంషు ధులియా కూడా ఇద్దరు న్యాయమూర్తులు చేసిన కృషి ప్రాముఖ్యతను చాలా ధైర్యంగా ఎత్తి చూపారు. తన భిన్నాభిప్రాయంలో ఆయన ఇలా రాశారు:
“కృష్ణయ్యర్ సిద్ధాంతం, లేదా ఓ. చిన్నప్ప రెడ్డి సిద్ధాంతం, చట్టం లేదా జీవితంతో సంబంధం ఉన్న వారందరికీ సుపరిచితమైనదే. ఇది న్యాయబద్ధత, సమానత్వంల బలమైన మానవతా సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇది చీకటి కాలంలో మన మార్గాన్ని ప్రకాశవంతం చేసిన సిద్ధాంతం. వారి తీర్పుల సుదీర్ఘ భాగం వారి అంతర్దృష్టి తెలివితేటల ప్రతిబింబం మాత్రమే కాదు, ముఖ్యంగా వారి న్యాయ తత్వశాస్త్రంలో మానవులు కేంద్రంగా ఉండడం ప్రజల పట్ల వారికి ఉన్న సానుభూతిని చూపిస్తుంది. జస్టిస్ కృష్ణయ్యర్ మాటల్లోనే: “న్యాయస్థానాలకు కూడా ఒక నియోజకవర్గం ఉంది – దేశం – ఒక ప్రణాళిక – రాజ్యాంగం”.”
రాజకీయ ప్రత్యర్థులను ‘నక్సల్స్’గా ముద్ర వేయడం అనేది విస్తృత ప్రజా చర్చలో పైచేయి కోసం పోటీపడే మేధావులను నేరస్థులుగా చూపించడానికి హిందూ మెజారిటీ పాలన అవలంబించే కీలకమైన రాజకీయ వ్యూహం. ‘నక్సల్’ అనే పదానికి ఉండే నిజమైన అర్థానికి సంబంధించి ప్రజల ఊహను వక్రీకరించే ప్రయత్నం చేయడం దీనికి ప్రాతిపదిక.
మహ్మద్ యూసుఫ్ రాథర్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ & కాశ్మీర్ (1979)కేసులో ఒకరిని నక్సలైట్ అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జస్టిస్ చిన్నప్ప రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఆయన ఇలా రాశారు:
“నిర్బంధానికి కారణాలు నిర్బంధించిన వ్యక్తి ఒక ‘డై-హార్డ్ నక్సలైట్’ అనే ప్రకటనతో ప్రారంభమవుతాయి. డాక్టర్ సింఘ్వి ఒక నక్సలైట్‌ను ‘హింసను ఆశ్రయించడం ద్వారా మార్పును సమర్థించేవాడు’ అని అభివర్ణించారు. డైలీ ప్రెస్ (మార్క్సిస్ట్ ఆశ్చర్యార్థకం: ది క్యాపిటలిస్ట్ ప్రెస్!) వ్యక్తీకరణకు ఆ అర్థం ఆపాదించారు. చాలామంది డాక్టర్ సింఘ్వితో ఏకీభవించకపోవచ్చు. కొందరు నక్సలైట్లను రక్త దాహం గల రాక్షసులుగా భావిస్తారు; కొందరు వారిని జోన్ ఆఫ్ ఆర్క్‌ తో పోలుస్తారు. ఇదంతా ఒకరు ఏ వర్గానికి చెందినవారు, ఒకరి రాజకీయ రంగులు, సైద్ధాంతిక అవగాహనలపై ఆధారపడి ఉంటుంది.”
రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టను మాత్రమే కాకుండా, మన రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయమూర్తుల మొత్తం పని వ్యవస్థల ప్రతిష్టను చెల్లాచెదురు చేసేట్లుగా పాలక ప్రభుత్వం ప్రజల ఊహను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కాలంలో జస్టిస్ రెడ్డి మాటలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

theleaflet.in సౌజన్యంతో
తెలుగు: పద్మ కొండిపర్తి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad