నలుగురు సీనియర్ మహిళా న్యాయవాదులు, తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ పంచోలీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫార్సుల్లో జస్టిస్ బి.వి. నాగరత్న వ్యక్తం చేసిన “ఏకైక అసమ్మతికి” మద్దతు ఇచ్చారు.
జస్టిస్ నాగరత్న జస్టిస్ పంచోలీ పదోన్నతికి సంబంధించిన ప్రతిపాదనలో తన అసమ్మతిని వ్యక్తం చేశారని కొలీజియం బహిర్గతం చేయడంలో విఫలమైందని సీనియర్ న్యాయవాదులు నిరాశ వ్యక్తం చేశారు.
వారు ఇలా అన్నారు, “మీరు వ్యక్తపరిచిన ఏకైక అసమ్మతికి ఈ వైపు నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. మీ ఆకాంక్షకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, మీ ఏకైక అసమ్మతిని సిఫార్సులలో కూడా వెల్లడించనందుకు మేము నిరాశ mahalakshamiవ్యక్తం చేస్తున్నాము.” జస్టిస్ పంచోలీ, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కొత్త న్యాయమూర్తులు ఈరోజు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు.
సంస్థ సమగ్రతను కాపాడటానికి ధైర్యమూ, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సామర్థ్యమూ అవసరమని చెబుతూ, నలుగురు సీనియర్ న్యాయవాదులు – మహాలక్ష్మి పావని, శోభా గుప్తా, అపర్ణా భట్, కవితా వాడియాలు – జస్టిస్ నాగరత్న అసమ్మతిని పరిష్కరించిన విధానంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
వారు ఇంకా ఇలా అన్నారు, “గౌరవనీయులైన న్యాయమూర్తుల నియామకాలపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా, ఈ నియామకాల పద్ధతిపై మీ ఆందోళనతో మేము ఏకీభవిస్తున్నాము. సుప్రీంకోర్టు బార్ సభ్యులుగా, మేము సంస్థలో ముఖ్యమైన భాగస్వాములుగా భావిస్తున్నాము. దాని గౌరవాన్ని కాపాడటానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. సుప్రీంకోర్టు ధర్మాసనంలో మహిళల స్థితితో సహా మాకు చాలా ఆందోళనలు ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తి సమగ్రతకు సంబంధించిన ఇటీవలి సంఘటనలో చూపిన పారదర్శకత, ప్రజా జవాబుదారీతనం గత మూడు రోజులలో జరిగిన సంఘటనల ద్వారా దారి తప్పిందని స్పష్టమవుతోంది.”
సీనియర్ న్యాయవాదులు ఈ విషయంలో కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేకపోవడంపై బార్- బెంచ్ (న్యాయమూర్తులు-న్యాయవాదులు) వహిస్తున్న తీవ్రమైన మౌనాన్ని కూడా విమర్శించారు. వారు ఇంకా ఇలా అన్నారు, “పారదర్శకత ఆవశ్యకతను బహిరంగంగా అంగీకరించిన తర్వాత కూడా, బార్- బెంచ్ ఇద్దరూ పూర్తి మౌనాన్ని పాటిస్తూ, దానిని అమలు చేయడంలో ఆశ్చర్యకరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తున్నందుకు మేము ఆందోళన చెందుతున్నాము. అసమ్మతి ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మూలం అయినప్పుడు, పూర్తి జవాబుదారీతనమూ పారదర్శకతా లేకపోవడం మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. సుప్రీంకోర్టు తరచుగా చెప్పినట్లు, ‘అసమ్మతి హక్కు ప్రజాస్వామ్యానికి చిహ్నం’.”
రోమిలా థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ((2018) 10 ఎస్‌సీసీ 753) కేసులో ఈ సూత్రం బలంగా వ్యక్తం చేశారు; అందులో ఇలా పేర్కొన్నారు – “అసమ్మతి ఒక సజీవ ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇష్టంలేని సమస్యలను లేవనెత్తేవారిని వేధించడం ద్వారా నిరసన గళాలను అణచివేయలేము.”
సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల పదోన్నతి విషయంలో కొలీజియం వైఖరి ఏకరీతిగా ఎందుకు ఉండటం లేదని కూడా సీనియర్ న్యాయవాదులు ప్రశ్నించారు.
ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ పదవీకాలంలో, చరిత్రలో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు – జస్టిస్ నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ హిమా కోహ్లీ – ఒకేసారి సిఫార్సు చేయబడి, 2021లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారని గమనించాలి.
“మహిళా న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడంలో సుప్రీంకోర్టు కొలీజియం అనుసరిస్తున్న నిరంతర, ఏకరూప వైఖరి మాకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. చివరిసారిగా ఒక మహిళా న్యాయమూర్తిని 2021 ఆగస్టు లో నియమించారు. నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ, హైకోర్టులలో స్పష్టంగా అర్హత, యోగ్యత కలిగిన సీనియర్ మహిళా న్యాయమూర్తులు ఉన్నప్పటికీ, ఏ ఒక్క మహిళా న్యాయమూర్తికి సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించలేదు. ఈ క్షమించరాని వైఖరి ఒక నిష్పాక్షిక, సమానత్వ న్యాయవ్యవస్థ ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధం; జెండర్ న్యాయం, సమానత్వ స్థాపిత సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘిస్తుంది.”
సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కూడా ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఈ విషయాన్ని లేవనెత్తారు. పదోన్నతికి అవకాశం ఉన్న ముగ్గురు మహిళా న్యాయమూర్తులు – జస్టిస్ సునీతా అగర్వాల్ (గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ రేవతి మోహితే డేరే (బాంబే హైకోర్టు), జస్టిస్ లిసా గిల్ (పంజాబ్ & హర్యానా హైకోర్టు) -ను జస్టిస్ పంచోలీ అధిగమించారని ఆమె పేర్కొన్నారు.
న్యాయమూర్తి నాగరత్న తన అసమ్మతి లేఖలో జస్టిస్ పంచోలీ ఒకప్పుడు గుజరాత్ హైకోర్టు నుండి పట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారని, ఇది సాధారణ బదిలీ కాదు అని పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న అసమ్మతి వార్తల తర్వాత, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (సిజెఎఆర్) ఒక ప్రకటన విడుదల చేసి, ఆమె అసమ్మతి లేఖను ప్రచురించాలని, జస్టిస్ పంచోలీ 2023లో గుజరాత్ హైకోర్టు నుండి పట్నా హైకోర్టుకు బదిలీ కావడానికి గల కారణాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చింది. నివేదికల ప్రకారం, ఇది సాధారణ బదిలీ కాదు.
రిటైర్డ్ జడ్జి ఏ.ఎస్. ఓక్ కూడా ఆమె అసమ్మతిని బహిరంగపరచకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. సీనియర్ న్యాయవాదులు, స్థాపించబడిన సీనియారిటీ ప్రమాణాలు, మహిళల న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం రెండింటినీ పక్కన పెట్టడానికి గల కారణాలను కోరారు. వారు ఇలా అన్నారు, “అత్యంత పవిత్ర న్యాయ స్థానంపై ప్రజల నమ్మకం సన్నగిల్లినప్పుడు, మన ప్రజాస్వామ్యంపైన మళ్ళీ తిరిగి రాలేనంత చీకటి కమ్ముకుంటుంది. ఈరోజు ఉన్న నిశ్శబ్దం ఆ నమ్మకాన్ని నాశనం చేస్తోంది; మనందరి కంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభమైన ఆ సంస్థను ధ్వంసం చేస్తోంది.”
-జె పి సింహ్
(janchowk.com సౌజన్యంతో)
తెలుగు: పద్మ కొండిపర్తి

”Sorry Ankita… This is India… Common women lives don’t matter” 