Menu

ఈ నెల13న‌ ఖైదీల హక్కుల సంఘీభావ దినంగా పాటించండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

anadmin 2 months ago 0 131

మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ జతిన్ దా వర్ధంతి సందర్భంగా సెపటంబర్ 13 న దేశ వ్యాప్తంగా ఖైదీల హక్కుల సంఘీభావ దినంగా పాటించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…

కామ్రేడ్ జతీన్ దా అమర్ రహే!
13 సెప్టెంబర్ నాడు ఖైదీల హక్కుల సంఘీభావ దినంగా పాటించండి
దేశ వ్యాప్తంగా జైళ్లలో మావోయిస్టుల పై జరుగుతున్న దాడులను ఖండించండి.
ఖైదీల విడుదలకు, వారి హక్కుల పరిరక్షణకై నినదించండి

ప్రజలారా,
మన దేశంలోని మావోయిస్టు ఉద్యమంపై అపూర్యమైన స్థాయిలో దోపిడీ పాలకవర్గాలు విరుచుకుపడుతున్నాయి. కేవలం అడవులలోనున్న మావోయిస్టులను నరసంహారాల ద్వారా అంతమొందించడమే కాకుండా దేశంలోనే మావోయిజాన్ని రూపుమాపుతామని కంకణం కట్టుకున్న హిందుత్వ శక్తులు దేశ వ్యాప్తంగా పట్టణాలలో, మైదానాలలో, విశ్వవిద్యాలయాలలో, పత్రికా కార్యాలయాలలో, తుదకు తమ నియంత్రణలో వున్న జైళ్లలోని విచారాధీన ఖైదీలపై ఇతర ఖైదీలపై కూడా పాశవిక దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులను ఖండించండి. వీటికి వ్యతిరేకంగా మరింత బిగ్గరగా నినదించండి. రాజకీయ ఖైదీల హక్కులకై ఉద్యమించండి. వారి విడుదలకై అన్ని విధాలా పూనుకోవాలనీ మా పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిస్తున్నది. రాజ్యం వత్తాసుతో ఖైదీల పట్ల అనుచితంగా వ్యవహరించే ఏ స్థాయి అధికారైనా, భవిష్యత్తులో రెట్టింపు మూల్యం చెల్లించక తప్పదనీ హెచ్చరిస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రూపాలలో విప్లవ శక్తులు సంఘటితమవుతున్నాయి. సంఘటితమవుతున్న విప్లవ శక్తులపై దోపిడీ పాలకవర్గాలు హత్యలతో సహ అనేక రూపాలలో పాశవిక దాడులకు పాల్పడుతున్నాయి. మన దేశం ఇందుకు మినహాయింపు కాదు. మన దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా మితవాద శక్తులు అధికారంలో వున్న చోట ఈ దుష్పరిణామాలు అత్యంత పాశవికంగా మారాయి. మన దేశంలోని విప్లవ ప్రతిఘాతక హిందుత్వ శక్తుల సర్కార్ ఇప్పటికే మావోయిస్టుల అంతానికి ముహూర్తం నిర్ణయించుకొని వున్నందునా, ఆ తేదీలోపు దాని లక్ష్యాన్ని సాధించడానికి అది తహతహలాడుతోంది. ఈ పరిణామాల వెనుక ప్రపంచ వ్యాప్తంగా తీవ్రతరమవుతున్న సంక్షోభ పరిస్థితులే ఏకైక కారణం. సర్వత్రా పెరుగుతున్న నిరుద్యోగం, ఆకలి చావులు, పేదరికం, అధిక ధరలు, ఆత్మహత్యలు మున్నగు అనేక జీవన్మరణ సమస్యలు ప్రజలను పోరాటాల వైపు, పాలకులను అణచివేతల వైపు నెడుతున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించడానికి పాలకులు సుంకాల పెంపుకు, కొల్ల యుద్ధాలకు పాల్పడుతున్నారు. మారణహోమంగా మారిన పశ్చిమాసియా పరిణామాలు చూస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతునే వుంది. మన దేశ పాలకులు సిందూర్ కు తెరలేపడం ఆ వరుసలో ఒక భాగం. వీటిని వ్యతిరేకించే ప్రజానుకూల, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను అణచివేయడానికి జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి.

మన దేశంలో వేలాది మంది విప్లవకారులు యేళ్ల తరబడిగా దేశ వ్యాప్త జైళ్లలో మగ్గుతున్నారు. ఆపరేషన్ కగార్ దాడుల నేపథ్యంలో జైళ్లలో మావోయిస్టు విప్లవకారులపై జైలు అధికారులు పాశవిక దాడులకు పాల్పడుతున్నారు. బిహార్ లోని బక్సర్ జైలులో ఉన్న మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యడు కామ్రేడ్ జశ్ పాల్ జీ ని కొద్ది మాసాల క్రితం ఆ జైలు అధికారులు అమానవీయంగా హింసించారు. ఆ వివరాలన్నీ ఆయన అత్యంత ధైర్యంగా ప్రపంచం ముందుంచాడు. యేళ్ల తరబడిగా విచారణలో వుంటూ, జైలు శిక్షలను అనుభవిస్తున్న విప్లవకారుల శిక్షా కాలం పూర్తయినా, వారిని విడుదల చేయకుండా కొత్త కొత్త కేసులతో పోలీసులు తిరిగి వారిని కటకటాల వెనక్కి తోస్తున్నారు. ఇటీవలే కేరళలో కామ్రేడ్ ప్రవీణ్ జీ, ఝార్ఖండ్ లో పాత్రికేయుడు కామ్రేడ్ రూపేశ్ జీల విడుదలను పోలీసులు అడ్డుకున్నారు. పోతే, దేశ వ్యాప్తంగా జైళ్లలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, జైళ్ల బయట పోలీసులతో పాటు ఎన్.ఐ.ఏ తీవ్రం చేసిన వేధింపులు తెలిసినవే. గ్రామాలపై పడి పోలీసులు విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ, వాస్తవాలను వెలుగులోకి తేవడానికి పాత్రికేయులు కలం ఎత్తినా, స్వరం విప్పినా వారిని వివిధ రూపాలలో వేధిస్తూ, హింసిస్తున్నారు. వీటిని మనం తీవ్రంగా ఖండించాలి. వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. జైళ్లలో విచారణలో వున్న, ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న అన్ని రకాలవారి హక్కులకై నినదించాలి. ఇది నేటి తక్షణ ప్రజాస్వామిక కర్తవ్యాలలో ఒకటి.

నేటి జైళ్ల పరిస్థితులు బ్రిటిష్ హయాంనాటి దారుణాలను తలపిస్తున్నాయి. జైళ్లలో తెల్లవాళ్ల స్థానంలో నల్లవాళ్లు వచ్చారే తప్ప అమానవీయ పరిస్థితులలో మౌలికంగా మార్పేమీ లేదు. కనీస సౌకర్యాలు సమకూర్చడం లేదు. జైళ్లు సంస్కరణా కేంద్రాలని చెప్పుకునే పాలకులు వాటిని మృత్యు కుహరాలుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రోద్యమ‌ కాలంలో విప్లవకారులైన కామ్రేడ్స్ భగత్ సింగ్ తో పాటు ఆయన అనుచరులు జైళ్లలో అసమానతలు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలో భాగంగా కామ్రేడ్ జతిన్ దా 62 రోజుల నిరహారదీక్షతో పాలకుల పాశవిక విధానాలకు బలై అమరుడైనప్పటికీ, ఆ ఖైదీలు తుదకు సమ్మో డిమాండ్లు సాధించుకున్నారు. ఆ అమరుల త్యాగాల స్ఫూర్తితో, జైలు సహచరులు వాటిని పోరాట కేంద్రాలుగా మలచాలి. వారి హక్కుల కోసం దేశ వ్యాప్తంగా సంఘీభావ వుద్యమాన్ని సంఘటితం చేయాలి. అంతర్జాతీయంగా భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ కొనసాగిస్తున్న కృషిని అభినందిస్తూ వారితో సమన్వయంతో మన దేశ, ప్రపంచ ఖైదీల హక్కులకై పోరాడాలనీ మేధావులకు, ప్రజాస్వామిక వాదులకు, న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు, పాత్రికేయులకు మా పార్టీ పిలుపునిస్తున్నది.

అభయ్, అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భాకపా (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad