జైలు నుంచి కామ్రేడ్ మోడెం బాలకృష్ణ లేఖ
గరియాబంద్‌లో అమరుడైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ చంచల్‌గూడ జైల్లో ఉన్న సమయంలో సహచర ఖైదీలతో కలిసి చారిత్రాత్మక జైలు పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రస్తుత పాలకులు ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులపై ప్రయోగిస్తున్న ఊపా చట్టం కారణంగా ఎన్ని వేల మంది జైళ్లలో మగ్గుతున్నారో తెలిసిన విషయమే. ఊపాకు ముందు ఇలాంటి చట్టాలెన్నో వచ్చాయి. వాటిల్లో ఒకటి టాడా. టెర్రరిస్టు కార్యకలాపాలను కట్టడి చేసే పేరుతో తీసుకువచ్చిన టాడా చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు పెల్లుబకడంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. కానీ… ఆ చట్టం కింద అరెస్టు చేసిన వారందరూ జైళ్లలోనే మగ్గుతున్న కాలం అది. అలాంటి సమయంలో ప్రజాస్వామికవాదుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ… 1996లో అప్పటి పీపుల్స్ వార్ ఖైదీలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ రాసిన లేఖ పూర్తి పాఠం ఇది. చట్టాలు మారినా, కాలం మారినా… రాజకీయ ఖైదీల పరిస్థితి నేటికీ ఇదే.
1947 తర్వాత భారతదేశంలో ఏ నల్లచట్టంపై జరగనంత చర్చ, ఉద్యమాలూ టాడా చట్టాన్ని రద్దు చేయాలని జరిగాయి. చట్టాల దుర్వినియోగం అన్ని చట్టాల విషయంలో జరిగినా దుష్ఫలితాలు టాడా దుర్వినియోగం వల్ల అత్యధికంగా ఉన్నాయి. వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఈ చట్టం హరించినంతగా మరే చట్టం హరించకపోవటమే దీనికి కారణం. మౌలికమైన సహజన్యాయ సూత్రాలకే విరుద్ధమైనది ఈ చట్టం.
మొదట్లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో టెర్రరిజాన్ని అణచటానికి అనే సాకుతో టాడా చట్టాన్ని ప్రవేశపెట్టినా కొద్ది కాలానికే ఆక్టోపస్ లా ఇది దేశాన్నంతా కబళించింది. రాజకీయ ప్రత్యర్థులనూ, విభిన్న రాజకీయ అభిప్రాయాలనూ గొంతు నులిమి చంపటానికే ఈ చట్టాన్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తూ వస్తున్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే వారినుంచీ ట్రేడ్ యూనియన్ నాయకులూ, చివరకు మంచి నీళ్ల కోసం ఖాళీ కుండలతో ప్రదర్శనలు చేసిన మహిళల వరకూ ఈ చట్టం ఎవరినీ వదలలేదు. పార్టీలతో ప్రమేయం లేకుండా అధికారంలోనున్న అన్ని రాజకీయ పార్టీలూ ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచాయి. టెర్రరిజం (ప్రభుత్వ దృష్టిలో) ప్రభావం ఉన్న రాష్ట్రాలలోకంటే అటువంటి ప్రభావమే లేని రాష్ట్రాలలోనే టాడా కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయంటే దీని దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదులు రౌలత్ చట్టాన్ని ప్రయోగించి స్వాతంత్ర పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నించారు. కాని రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం దానికదే ఒక పెద్ద ప్రజాస్వామిక ఉద్యమంగా మారి స్వాతంత్య్ర పోరాటానికి ఎంతగానో ఉపకరించింది. టాడాను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కూడా దేశంలోని పౌరహక్కుల సంఘాలన్నీ తమ నిరసనను తెలిపాయి. టాడాలాంటి నల్లచట్టాలను ప్రవేశపెట్టకూడదనీ, అది మనిషి స్వేచ్ఛా స్వాంతంత్య్రాలను హరించివేయడమే కాక పోలీసులకు అపరిమితమైన అధికారాలను కల్పిస్తుందనీ, దీనివల్ల పౌరుల ప్రాథమిక హక్కులు సైతం హరించుకుపోతాయనీ భిన్న రాజకీయ విశ్వాసాలలున్న వారిని తప్పకుండా అణచివేసే ప్రయత్నం చేస్తారనీ వాదించారు. కానీ ఆనాడు టెర్రరిస్టు బూచిని పెద్దదిగా చేసి చూపించటంలో కేంద్ర ప్రభుత్వం సఫలం కావటం వల్ల ప్రజాతంత్ర ఉద్యమాలు అంతగా గుర్తింపులోకి రాలేకపోయాయి. అయినప్పటికీ పౌరహక్కుల సంఘాలూ, ప్రజాస్వామిక వాదులూ, మేథావులూ తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.
దేశ వ్యాప్తంగా 70వేలకు పైగా రాజకీయ కార్యకర్తలూ, కార్మికులూ, రైతులు, అమాయక ప్రజలూ టాడా కింద అరెస్టు చేయబడి సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నా ఊపందుకోని టడా వ్యతిరేక ఉద్యమం సంజయ్‌దత్ లాంటి వ్యక్తులు టాడా కింద అరెస్టయి బెయిల్ కూడా దొరకక జైల్లో ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు సైతం టాతడాకు వ్యతిరేకంగా ఉద్యమించటానికి ముందుకువచ్చారు. లేనివాడకి అన్యాయం జరిగినప్పుడు పాలకవర్గాల్లో ఉండే స్పందనకీ ఉన్నవాడికి అన్యాయం జరిగిప్పటి స్థితికీ తేడా వుంటున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్యుడికి అందనప్పుడు చలనంలేని వాళ్లు, ఉన్నత వర్గాలవారి హక్కులు కాలరాచివేయబడ్డప్పుడు ఉద్యమంలోకి ఉరికివచ్చినట్టు కనిపిస్తారు. తిరిగి వారి హక్కులు వారికి దక్కిన తరువాత సామాన్యుల వైపు తిరిగి చూడనైనా చూడరు. వాస్తవానికి టాడాను రద్దు చేయలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడం, పార్లమెంట్‌లో తగిన మెజార్టీ లేకపోవటం, ఎన్నికల సంవత్సరం కావడంతో మళ్లీ పొడగించలేదు. దీనితో టాడా చట్టంలోని సెక్షన్ (14) ప్రకారం ఇప్పటికే పెట్టిన కేసులు టాడా చట్టం కిందనే ట్రయిల్ జరుగుతాయన్నమాట. అంటే టాడా పోయినా టాడా బాధితులకు వొరిగింది ఏమీలేదు. బెయిల్స్ తీసుకొని నిర్బంధం నుండి బయట పడటానికి వీలులేకుండా ఉంది.
టాడా చట్టంలో నిందితుడిని 2 నెలల వరకు పోలీసు కస్టడీకి ఇవ్వవచ్చు. వాస్తవానికి ఈ కస్టడీ కొరకు ముందుగానే పోలీసులు ఇల్లీగల్ కస్టడీలో ఉంచుకోవటం ఆనవాయితి. కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు అరెస్టు అయిన వారిని ఏ కోర్టులోనూ హరచకుండా చిత్రహింసలకు గురిచేసి వాళ్లకవసరమైన కన్ఫెషనల్ (అంగీకార ప్రకటన) స్టేట్‌మెంట్ ను తీసుకుంటున్నారు. ఆ తర్వాతనే కోర్టుల్లో హజరుపరిచి తిరిగి లీగల్ కస్టడీని తీసుకుంటున్నారు. లీగల్ కస్టడీ కేవలం మానసికంగా కృంగదీయటానికే. ఆ తర్వాత కోర్టులు నిందితులను జైళ్లకు పంపడం చాలా సాధారణ విషయంలా జరిగిపోతుంది.
కోర్టులు, జైళ్లు అంటే ఏమిటో తెలియని గ్రామీణ రైతాంగంపై టాడా కేసులు పెట్టి జైళ్లలో తోయటం వల్ల కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చుచేసి బికారులుగా మారిపోతున్నారు. పట్టపగలు నట్టబడిబజారులో హత్యలు చేసిన వాళ్లు దర్జాగా బజారుల్లో తిరుగుతుంటే ఏ నేరమూ చెయ్యని వాళ్లు సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఒకవేళ టాడా ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించినట్టయితే ఇక సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వుంటుంది. ఎంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లగలుగుతారు?
మిగతా ఏ చట్టంలో లేని విధంగా టాడాలో చాలా ఘోరమైన నిబంధనలున్నాయి. పోలీసులు ఎవరికి బెయిల్ ఇవ్వాలనుకుంటే వారికే బెయిల్ దొరుకుతుంది. ఇది న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే చట్టం. పోలీసులు ఎవ్వరినైనా సతాయించాలనుకుంటే ఒక్క టాడా కేసు పెడితే సరిపోతుంది. వాళ్లు విచారణ లేక, బెయిల్ దొరకక జైళ్లలో మగ్గిపోవల్సిందే. కొన్ని సందర్భాలలో కోర్టులు బెయిల్స్ మంజూరు చేస్తున్నాయి. నిందితులు జమానతు కట్టి విడుదల అవుతారు కాబట్టి ఒక వ్యక్తి పైననే ఎక్కువ కేసులు పెట్టడం వల్ల అన్ని కేసుల్లో బెయిల్ రావడం కష్టం అవుతుంది. ఒకవేళ బెయిల్ వచ్చినా పెద్ద మొత్తంలో జమానతు కట్టడం పేదవాళ్లకు సాధ్యంకాదు. చంచల్‌గూడ మహిళా జైలులో పి. పుష్పకు మొత్తం 18 కేసులు ఉండగా వీటిలో 17 కేసుల్లో ఆమెకు బెయిల్ వచ్చింది. కానీ ఒక్క కేసులో బెయిల్ ఇవ్వకుండా ట్రయిల్ మొదలు పెట్టడంతో ఆమెకు అన్ని బెయిల్స్ వచ్చి కూడా విడుదల కాలేకపోయింది.
కొందరి రిమాండ్ రిపోర్టులో ఎన్నో కేసుల్లో నిందితుడిగా చూయిస్తారు. కానీ 2, 3 కేసుల్లోనే కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ 2, 3 కేసుల్లో బెయిల్ వచ్చినా లేదా కేసులు కొట్టివేయబడినా వెంటనే మిగతా కేసుల్లో కోర్టుకు హాజరుపరిచి తిరిగి జైలుకు పంపుతారు. ఒకవేళ పోలీసుల అంచనాలు తలకిందులై ఎవ్వరికైనా బెయిల్ వచ్చి విడుదల అయితే జైలు ముందే మళ్లీ అరెస్టు చేసి కొత్త కేసులను పెడుతున్నారు. ఈ విధంగా అండర్ ట్రయిల్ ఖైదీలుగానే జైళ్లలో మగ్గతున్న వారు ఎంతోమంది ఉన్నారు.
నా తెలుగు ఆడపడుచులు అని డైలాగ్ కొట్టే రామారావు రాజ్యంలో ఏళ్ల తరబడి ఎంతోమంది మహిళలు టాడా కేసుల్లో నలిగిపోతున్నారు. ఎంతో మంది మహిళలు ఇప్పటికీ విచారణ లేక, బెయిల్స్ రాక, వచ్చినా జమానతు ఇచ్చేవాళ్లు లేక జైళ్లలో మగ్గుతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో పెట్టిన చిత్రహింసల వల్ల ఆరోగ్యాలు పాడై, సరైన చికిత్సలేక జైళ్లలో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఆడబడుచులను పట్టించుకోరా? మరీ ఘోరమైన విషయమేమిటంటే వీళ్లలో ఎక్కువ శాతం ప్రభుత్వానికి సరెండర్ అయిన వాళ్లే.
టాడా కేసుల్లో ప్రాసిక్యూషన్ సకాలంలో చార్జ్‌షీట్ వెయ్యకపోతే నిందితుడికి కోర్టులు బెయిల్ ఇవ్వాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని నిందితులకు బెయిల్స్ మంజూరు కాకుండా వుండటానికి నామమాత్రంగా చార్జిషీట్లను వేస్తారు. తర్వాత ఇక ఆ కేసును పట్టించుకోరు. నిందితులు మాత్రం జైళ్లల్లో మగ్గుతారు. నేరం నిరూపించబడకుండా నిందితుడు నేరస్తుడు కాడనేది సహజ న్యాయసూత్రం. కాని టాడా కేసుల్లో నేరం నిరూపించబడకుండానే కనీసం విచారణ జరగకుండానే సంవత్సరాల తరబడి జైలు శిక్షను అనుభవించాల్సిందే. 5 సంవత్సరాల తర్వాతనో, 6 సంవత్సరాల తర్వాతనో నిందితుడు నిర్దోషిగా కోర్టులు తీర్పులు చెబితే అతను అనుభవించిన జైలు శిక్షకు బాధ్యులు ఎవరు? ఈ మధ్యకాలంలో నిందితునికి జరిగిన శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘీక నష్టాలకు పరిహారమెవరిస్తారు?
కేంద్ర ప్రభుత్వం ఇంక నాలుగు రోజులకు రద్దు చేస్తుందన్న వాతావరణాన్ని పసిగట్టిన నేషనల్ ఫ్రంట్, అందులో భాగస్వామి అయిన తెలుగుదేశం ప్రభుత్వం టాడాను దుయ్యబట్టాయి. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే టాడాను రద్దు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రామారావు ప్రభుత్వం ఇక టాడాను ఉపయోగించబోనని ప్రకటించింది. సూత్రప్రాయంగానే టాడాకు వ్యతిరేకమని ప్రకటించింది. టాడానే లేకుండా పోయిన తర్వాత ప్రస్తుతమున్న కేసుల నుండి టాడా సెక్షన్‌లను ఎందుకు తొలగించటం లేదు? అసలు టాడా ఘోరంగా దుర్వినియోగం అయ్యిందన్న కారణంగానే కదా దాన్ని పొడిగించకుండా అందరూ అడ్డుపడింది. అటువంటప్పుడు టాడా కేసులను ఎందుకు కొనసాగించాలి? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టాడా కేసులను సమీక్షించి ఎత్తివేయవచ్చని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది కదా! మరెందుకు టాడా కేసులను ఎత్తివేయటం లేదు?
ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడలో కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ. వంగవీటి మోహన్ రంగా హత్య చేయబడ్డప్పుడు కొస్తా జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు లూటీలూ, గృహదహనాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తిని నష్టపరిచారు. ఆ సందర్భంగా వేలాది కేసులు కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదయ్యాయి. కాని కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో ఆ కేసుల్ని ఎత్తివేసింది.
రాజీవ్ గాంధీ హత్యానంతరం రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై నమోదైన వందలాది కేసుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. గత సంవత్సరం జనవరి చివర్లో రామారావు ప్రభుత్వం కొండపల్లి సీతారామయ్యని విడుదల చేసింది. గతంలో సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డిలాంటి వారిపై కనీసం కేసులను కూడా నమోదు చేయలేదు. ఎందుకంటే గతంలో వారికి గల రాజకీయ అభిప్రాయాలను వదులుకోవటమే ఇందుకు కారణం. అంటే నేరం చేశారా లేదా అన్నది ప్రధానం కాక ఒక వ్యక్తి ప్రభుత్వానికి, పాలకవర్గాలకు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నట్లయితే సంవత్సరాల తరబడి జైళ్లల్లో ఉంచవచ్చునన్న మాట! ఏ నేరం చేయకపోయినా ఆ వ్యక్తి తన రాజకీయాలను ప్రచారం చేసుకోకుండా వీలైనంత ఎక్కువ కాలం నిర్భందించడమన్న మాట!
కుట్ర కేసులను ఎత్తివేయాలి!
టాడా చట్టం అమల్లోకి రాకముందు కూడా రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలున్న వారిపై పిడి, ఎన్ఎస్ఎ, ఎమ్ఐఎస్ఎ వంటి నల్ల చట్టాలను ఉపయోగించారు. ఈ నల్ల చట్టాల కంటే కూడా ఎక్కువ కాలం నిందితులను జైళ్లలో ఉంచే సాధనం కుట్ర కేసులను బనాయించడం. ఒక వ్యక్తి నేరమేమీ చెయ్యనప్పటికీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రపన్నాడనే ఆరోపణపై అరెస్టు చేసి జైళ్లల్లో పెట్టవచ్చు. కేసులో ఎంతమందినైనా ఇరికించవచ్చు. నిందితుడు కుట్రపన్నలేదనేది కోర్టుల్లో విచారణ ద్వారా తేల్చవలసి ఉంటుంది. విచారణ పూర్తి కావడానికి ఒకటి, రెండు దశాబ్దాలు గడిచిపోతాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిటీష్ వలస పాలకుల ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నది. కాని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన ఏ ఒక్క కుట్ర కేసు కూడా రుజువు కాలేదు. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులను దీర్ఘకాలంగా జైళ్లలో పెట్టడానికి ఒక సాధనం మాత్రమే. కాబట్టి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్యలను అందరూ ఖండించాలి. ప్రభుత్వం నమోదు చేసిన కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎన్.హెచ్.ఆర్.సి. చైర్మన్ రంగనాథ్ మిశ్రా సహితం టాడా రాక్షస చట్టం అని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. అది సామాన్యులను భక్షించక ఏం చేస్తుంది. అలాంటప్పుడు ఇంకా టాడా కేసులను కొనసాగించటంలో అర్థమేమిటి? అందుకే టాడా కేసుల్ని, కుట్ర కేసుల్ని ఎత్తివేయాలి. వెంటనే జైళ్లలో ఉన్న టాడా ఖైదీలందరినీ విడుదల చెయ్యాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు మేధావులు, పత్రికలు టాడా చట్టాన్ని రద్దు చెయ్యటానికి ఎందుకు పోరాడారో ఆ లక్ష్యం టాడాను రద్దు చెయ్యటంతో సాధింపబడలేదు. టాడా కోరల్లో చిక్కుకొని సంవత్సరాలుగా జైళ్లలో విలవిలలాడుతున్న టాడా ఖైదీలందరిపైన టాడా తొలగించబడిన రోజే ఆ లక్ష్యం సాధింపబడుతుంది. అది సాధించటానికి మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని ఆశిస్తున్నాం. అటువంటి ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారానే మాకు విముక్తి కలుగుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆ ఉద్యమాలలో మేం ప్రత్యక్షంగా పాల్గొనలేనప్పటికీ మాకుండా పరిధిల్లోనే ఉద్యమంలో భాగస్వాములవుతాం.
ఆంధ్రప్రదేశ్ జైళ్లలోని రాజకీయ ఖైదీల తరుపున
పటేల్ సుధాకర్ రెడ్డి
శాఖమూరి అప్పారావు
మోడెం బాలకృష్ణ
2 ఏప్రిల్ 1996

నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ ద్రోహులు,పార్టీ విచ్చిన్నకులు, విప్లవ ప్రతిఘాతకులు -సోను, సతీష్ ముఠాపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
Jammu Kashmir National Students Federation statement in support of Maoist party
బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు
కగార్‌లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్ 