Menu

వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం

anadmin 3 months ago 0 547

విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో భారత పాలకవర్గాలు సాగిస్తున్న సైనిక, మానసిక యుద్ధాల ప్రస్తుత స్థితిలో విప్లవోద్యమ వర్తమానాన్నీ, భవిష్యత్తునూ చర్చిస్తున్నారు ఎన్ వేణుగోపాల్.

బైటి నుంచి భయంకరమైన మారణకాండ మధ్య, దాదాపు వారానికొకటైనా హృదయ విదారక విషాద ఘటనతో, భారత విప్లవోద్యమం కన్నీటి వరదల మధ్య ఉండగా, లోపల కూడా విచారకరమైన పరిణామాలను ఎదుర్కొంటున్నది. భారత ప్రజా ఉద్యమాల చరిత్రలో ఇటువంటి ఒడిదుడుకులు, విజయ వైఫల్యాలు కొత్తవేమీ కావు గాని, ప్రస్తుత దశ విప్లవోద్యమ సానుభూతిపరులలోనూ, మొత్తంగా ప్రజలలోనూ నిరాశా నిస్పృహలకు దారి తీస్తున్నది. రాజ్యం తేదీలు నిర్ణయించి మరీ సైనిక రంగంలో చుట్టుముట్టి, వేటాడి, నిర్మూలించాలని నిశ్చయించుకున్న ఈ తరుణంలోనే, చిరకాలంగా విప్లవోద్యమానికి శత్రువులుగా, విమర్శకులుగా ఉన్నవారూ, పైకి సానుభూతి నటించినా లోపల వ్యతిరేకతా, అనుమానాలూ ఉన్నవారూ కూడా భావజాల రంగంలో దాడి ప్రారంభించారు. ఈ రెండు దాడులతోనే సతమతమవుతున్న విప్లవోద్యమం మీద తాజాగా నిర్మాణంలోపలి నుంచి కూడా భిన్నాభిప్రాయాల దగ్గర మొదలై, తీవ్రమైన వైమనస్యాల దాకా, అనుమానాల దాకా మరొక దాడి సాగుతున్నది. ఇలా విప్లవోద్యమం మీద దాడి చేస్తున్న మూడు పక్షాలనూ ఒకే స్థాయిలో చూడనక్కరలేదు, ఒకే గాటన కట్టనక్కరలేదు గాని, ముప్పేట దాడి సాగుతున్నదనేది మాత్రం నిజం. ఇంత విస్తృతమైన దాడి నుంచి విప్లవోద్యమం గట్టెక్కగలదా అని అనుమానాలు చెలరేగడం, అవి మరింత నిరాశా నిస్పృహలకు కారణం కావడం నిజం.

ఇలా సైనిక, భావజాల, నిర్మాణ రంగాలు మూడింటా విప్లవోద్యమం సమస్యలు ఎదుర్కొంటున్న ఈ స్థితి కేవలం విప్లవోద్యమానికి, విప్లవోద్యమంలో భాగమైన ఒకానొక నిర్మాణానికి మాత్రమే ఇబ్బందికరం కాదు. ఇది మొత్తంగా భారత పీడిత ప్రజా ఉద్యమాలకు, పీడిత ప్రజలకు, మార్క్సిజం సిద్ధాంతానికి కూడా గడ్డు కాలమే. మావోయిస్టు పార్టీ అనే ఒకానొక పీడిత ప్రజా నిర్మాణం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ఎట్లా అనేది కేవలం ఆ పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇవాళ ఆ పార్టీ నిర్మూలనలో పాలకవర్గాలు విజయం సాధిస్తే అది మొత్తంగా పీడిత ప్రజానీకానికి, పీడిత ప్రజలు చేస్తున్న, చేయవలసిన అనేక పోరాటాలకు, అంతిమంగా పీడిత ప్రజా రాజ్యాధికార అంశానికి, పీడిత వర్గపు శాస్త్రమూ శస్త్రమూ అయిన మార్క్సిజానికి ఒక సవాల్. అందువల్ల ఈ వెనుకడుగు కాలాన్ని, ఈ ఆటు కాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్వీకరించాలి, వర్తమానం కోసమూ భవిష్యత్తు కోసమూ కూడా ఈ వెనుకడుగు నుంచి ఏ పాఠాల్ని గ్రహించాలి అనేది కీలకమైన ప్రశ్న. అలాగే ఈ వరుస నష్టాలతో, వెనుకడుగులతో, ఇంటా బైటా రేగుతున్న సమస్యలతో నిరాశా నిస్పృహలకు గురై గుండెజారిన పీడిత ప్రజానీకపు దండుకు ఎలా ధైర్యాన్నీ, విశ్వాసాన్నీ ఇవ్వాలి, ఎలా స్థైర్యాన్ని నిలిపి ఉంచాలి అనేవి కూడా ప్రధానమైన ప్రశ్నలు. వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ఎలా, వర్తమానంలో స్థైర్యాన్ని నిలిపి ఉంచుకోవడం ఎలా అనే రెండు ప్రధానమైన, అత్యవసరమైన ప్రశ్నలకు జవాబులు అన్వేషించడమే ఈ వ్యాస లక్ష్యం.

ప్రస్తుత విషాద వర్తమానం అర్థం కావాలంటే కాస్త గతంలోకి వెళ్లాలి. విప్లవోద్యమం, ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ కూడా గత యాబై ఎనిమిదేళ్ల చరిత్రలో ఎన్నెన్నో గడ్డు కాలాలు చూసింది, ఎన్నో నిర్బంధాలనూ, వెన్నుపోట్లనూ అధిగమించింది. ఇవాళ్టి మావోయిస్టు పార్టీ, అంతకు ముందరి పీపుల్స్ వార్, అంతకు ముందరి సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ యాబై ఐదు సంవత్సరాల జీవితమంతా కంటకావృత మార్గమే, నిర్బంధాల మయమే. రాజ్యం సాగించిన ఊచకోతల, చుట్టుముట్టి నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నాల చరిత్రే. ఆ దుర్మార్గ దాడుల నుంచి విప్లవోద్యమ నిర్మాణం ఎప్పటికప్పుడు బైటపడుతూ, అధిగమిస్తూ, పాఠాలు నేర్చుకుంటూ, విస్తరిస్తూ సాగివచ్చింది.

ఈ మొత్తం కంటకావృత మార్గంలో 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి మరింత అమానుషమైనది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాల పరంగా మావోయిస్టులను తన నిజమైన శత్రువులుగా భావిస్తుంది గనుక, దానికి కేంద్ర ప్రభుత్వ అధికారం రాగానే మావోయిస్టులను నిర్మూలిస్తాననే ప్రకటనలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో అంతకు ముందు లేని సమన్వయాన్ని, నిరంతర సంభాషణను, సమాచార వినిమయాన్ని ప్రారంభించింది. ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో “విజయం సాధించిన” విదేశీ భద్రతా సంస్థల, నిఘా సంస్థల సహాయం ఇదివరకటి కంటే ఎక్కువ తీసుకోవడం ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు పోగు చేసుకోవడం ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో భద్రతా బలగాలను తీసుకువెళ్లగలిగే రహదారులు నిర్మించింది. ప్రజల మధ్య ఉన్న అంతరాలను ఉపయోగించుకుని కొన్ని వర్గాల నుంచి అల్లరి చిల్లరి యువతను చేరదీసి, వారికి విపరీతంగా డబ్బు ముట్టజెప్పి ఇన్ఫార్మర్ వ్యవస్థను విస్తరించుకున్నది. దేశంలో నిరుద్యోగం పెరిగిన కొద్దీ, ప్రచార సాధనాలలో ఆడంబర, సంపన్న జీవనశైలిని పదేపదే చూపిస్తూ, దాని పట్ల మితిమీరిన ఆకర్షణను పెంచినకొద్దీ ఇటువంటి లంపెన్ యువతను ఆకర్షించడం సులభమయింది.

కేంద్ర ప్రభుత్వపు ఈ పనులు నిరాటంకంగా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘ్ పరివార్ చేతుల్లో ఉండాలనే రాజకీయ అవసరం భారతీయ జనతా పార్టీ మొదటి పాలన (2014-2019) కాలంలో నాలుగేళ్ల పాటు ఛత్తీస్ గడ్ లో కుదిరింది గాని, 2018 లో అక్కడ కాంగ్రెస్ పాలన రావడంతో అది కొంత కుంటుపడింది. కాంగ్రెస్ కూడా అదే తానులోని ముక్కే, అదే రాజకీయార్థిక విధానాన్ని కొనసాగిస్తున్నదే గాని పాలకవర్గ ముఠాల మధ్య వైరుధ్యం వల్ల తర్వాత ఐదు సంవత్సరాలు సంఘ్ పరివార్ అనుకున్నట్టుగా అణచివేత సాధ్యం కాలేదు. మావోయిస్టు రహిత భారతదేశంలోనే 2024 లోకసభ ఎన్నికలు జరుపుతామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రగల్భం సాధ్యం కాలేదు. అది సాధ్యం కాలేదని తెలిసిన తర్వాత ఎన్నికలకు ముందు సూరజ్ కుండ్ సమావేశంలో కొత్త ప్రణాళికను రచించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్ర శాసన సభకు 2023లో ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడంతో డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టుగా విప్లవోద్యమం మీద బుల్డోజర్ నడపడం ప్రారంభించారు. ఆపరేషన్ కగార్ ప్రారంభిస్తున్నామని 2023 డిసెంబర్ లో అమిత్ షా ప్రకటించగా, 2024 జనవరి 1న వాస్తవంగా అది ప్రారంభమయింది. 2026 మార్చ్ 31 నాటికి దేశంలో మావోయిస్టులందరినీ నిర్మూలిస్తామని, అసలు మావోయిజాన్నే నిర్మూలిస్తామని అమిత్ షా, సంఘ్ పరివార్ నాయకులు, పోలీసు అధికారులు ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో వేలాదిగా భద్రతా బలగాలను అడవి లోలోపలికి పంపుతూ, గతంలోకన్న భిన్నంగా లోతట్టు అడవులలో క్యాంపులు నిర్మిస్తూ, ఆదివాసి గూడాలనూ అడవులనూ కొండలనూ జల్లెడ పడుతూ మారణకాండను తీవ్రతరం చేశారు. మావోయిస్టులను నిర్మూలించి, ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, అడవి గర్భంలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం, తమ నిజమైన శత్రువులుగా భావిస్తున్న మావోయిస్టులను లేకుండా చేయడం, దశాబ్దాలుగా పాలకవర్గాలను చికాకు పెడుతున్న “సమస్య”ను తొలగించామనే పేరు తెచ్చుకోవడం సంఘ్ పరివార్ తన ఎజెండాగా పెట్టుకుంది. 

అయితే ఆ సైనిక యుద్ధం ఆపరేషన్ కగార్ సాగుతుండగానే మానసిక యుద్ధంలో, ప్రజలను మభ్యపెట్టడంలో భాగంగా చర్చలకు సిద్ధమే అని ఛత్తీస్ గడ్ హోమ్ మంత్రి విజయ్ శర్మ ప్రకటించాడు. ఆ పిలుపును స్వీకరించిన మావోయిస్టు పార్టీ మార్చ్ చివరి నుంచి వరుసగా జూలై వరకు ఐదు లేఖలు రాసింది. ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకవైపు ఈ లేఖలు సాగుతుండగానే, అధికారికంగా ఏ సమాధానమూ ఇవ్వకుండానే, అనధికారికంగా చర్చలను తిరస్కరిస్తూనే, సైనిక యుద్ధ వ్యూహాన్ని మరింత పెద్ద ఎత్తున కొనసాగించింది. కర్రెగుట్టలలో మావోయిస్టులు తలదాచుకున్నారనే అర్ధసత్యాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి చక్రబంధం చేసి మూడు వారాల పాటు ఏక్షణాన ఏమి జరగనుందో అనే మానసిక యుద్ధాన్ని కొనసాగించి, ఆందోళన, నిరాశ వ్యాప్తించేలా చేసింది. ఈ మొత్తం క్రమంలో ప్రభుత్వం రెండంచెల వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు సైనిక దాడిని ముమ్మరం చేస్తూ అగ్రనాయకులను గురి పెట్టి చంపుతూ, ఉద్యమానికి నాయకత్వం లేకుండా చేసే ప్రయత్నం, మరొకవైపు విప్లవోద్యమ నిర్మాణం చెల్లా చెదురవుతున్నదనే ప్రచారాన్ని విస్తారంగా సాగిస్తూ విప్లవోద్యమంలో, విప్లవ సానుభూతి పరులలో, ప్రజలలో మొత్తంగా నిరాశామయ పరిస్థితిని కల్పించడం ఆ లక్ష్యాలు. ఒక రకంగా ఈ రెండు లక్ష్యాల లోనూ భద్రతా బలగాలు విజయం సాధించడం మొదలు పెట్టాయి. 

బైట సమాజంలో, ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో చాల వరకు, పంజాబ్, బెంగాల్, ఢిల్లీ వంటి చోట్ల కూడా కొంతవరకు ఆపరేషన్ కగార్ ఆపాలనీ, మావోయిస్టులతో చర్చలు జరపాలనీ పౌరసమాజ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ – అమిత్ షా ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా మారణకాండలో ఇంకా ఇంకా దూకుడుగా సాగింది. చివరికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవ రావు (బసవరాజు) ను నేరుగా ఎక్కు పెట్టి, కోవర్టుల ద్వారా ఆయన, సహాయకులు 27 మండి ఉన్న స్థలం తెలుసుకుని పదివేల మంది అర్ధసైనిక బలగాలతో చుట్టుముట్టి, అరవై గంటల పాటు వేటాడి హత్య చేశారు.

ప్రధాన కార్యదర్శి, ఆయనతో పాటు 27 మండి సహచరుల హత్యా ఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను,విచారాన్ని కలిగించింది. చారు మజుందార్ తర్వాత ప్రధాన కార్యదర్శి పోలీసుల చేతిలో హత్యకు గురి కావడం ఇప్పుడే. ఆ విచారం ఇంకా ఆరిపోకముందే వరుసగా మరో ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యుల హత్యలు, మరెంతో మంది నాయకుల, కార్యకర్తల హత్యలు ఆ విచారాన్ని మరింత పెంచాయి. విప్లవోద్యమ సానుభూతిపరులు ఇంకెన్నాళ్లీ హత్యాకాండ అని దుఃఖంలో మునిగిపోయారు. 

అప్పటికే ఐదారు నెలలుగా, యాదృచ్ఛికంగానో, ఉద్దేశపూర్వకంగానో అసలు విప్లవ మార్గమే తప్పు అని, ఆ మార్గం వల్లనే ఈ అనవసర త్యాగాలు జరుగుతున్నాయని, సాయుధపోరాటానికి కాలం కాదని, దీర్ఘకాలిక ప్రజా యుద్ధం అనే ఆలోచనకే కాలం చెల్లిందని, దేశంలో ఉత్పత్తి విధానం మారినందువల్ల విప్లవానికే అర్థం లేదని ఉదారవాదులు, పార్లమెంటరీ కమ్యూనిస్టులు, ఎంతో కొంతకాలం విప్లవోద్యమంలో పని చేసి వచ్చినవారు, ప్రభుత్వానికి లొంగిపోయినవారు కూడా అనడం ప్రారంభించారు. ఇటువంటి అవకాశం వస్తే విప్లవోద్యమం మీద రాళ్లు రువ్వదలచిన వదరుబోతుల సంగతి చెప్పనక్కరలేదు. 

అలా విప్లవోద్యమానికీ, విప్లవకారులకూ, సానుభూతిపరులకూ నలువైపులా నిరాశ చీకటి కమ్ముకురావడం మొదలయింది. ఒకవైపు నిరాశ, మరొకవైపు మార్గం మీద అనుమానాల అబద్ధ కథనాలు మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేయసాగాయి. అటువంటి వాతావరణంలోనూ ఇంకా విప్లవోద్యమం తల వంచకుండా, వెనుకడుగు వేయకుండా నిలబడి ఉన్నదనే ఆశారేఖ మాత్రమే మిగిలి ఉండింది. ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని, చర్చలు జరపాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్లతోనూ, అమరుల అంతిమయాత్రలలోనూ, సంస్మరణ సభల్లోనూ తమ బలగం ఉన్నదనే ఆశ్వాసం విప్లవోద్యమ సానుభూతి పరుల్లో ఆశ కొడిగట్టిపోకుండా కాపాడుతూ వచ్చింది. 

సరిగ్గా ఆ సమయంలో ఒక పిడుగుపాటులా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 15, 2025 అని తేదీ ఉన్న ఆ ప్రకటన సెప్టెంబర్ 16న విడుదలయింది. ఆ ప్రకటన విప్లవోద్యమ సంప్రదాయాలకు భిన్నంగా విడుదల చేసిన వ్యక్తి ఫొటోతో ఉండడం, అంతకు పది రోజుల ముందే వెలువడిన పార్టీ స్థాపన వారోత్సవాల ప్రకటన స్ఫూర్తికి భిన్నంగా ఉండడంతో ఈ అభయ్ లేఖ నిజం కాదని చాలా మంది అనుమానించారు. అది పాలకవర్గాల మానసిక యుద్ధంలో భాగమని ఊహించారు.  

ఆ లేఖ నిజమైనది అవునా కాదా అనే చర్చ కన్నా ముఖ్యమైనవి అందులోని వివాదాస్పద అంశాలు. సాయుధపోరాటం ఆపివేయడానికి పార్టీ నిర్ణయించిందనీ, ఆ నిర్ణయం నంబళ్ల కేశవరావు స్వయంగా తీసుకున్నదనీ, ఆయన హత్య తర్వాత ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికే ఇప్పుడు ప్రయత్నిస్తున్నామనీ ఆ లేఖ రాసింది. ఒకవైపు సాయుధపోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించి మరొకవైపు ఈ విషయం కేంద్ర హోమ్ మంత్రితో, లేదా ఆయన నియమించిన వ్యక్తులతో చర్చిస్తామనీ, ఈలోగా మారిన అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేసి, చర్చలకు అనుకూలంగా ఉన్నవారితో బృందం ఏర్పాటు చేస్తామనీ కూడా ఈ లేఖ రాసింది. మారిన అభిప్రాయంతో పరిమిత క్యాడర్, కొంతమంది నాయకత్వ సహచరులు ఏకీభవిస్తున్నారని, వివిధ రాష్ట్రాల సహచరులతో, జైళ్లలో ఉన్నవారితో ఈ మారిన అభిప్రాయం గురించి చర్చించడానికి ఒక నెల సమయం కావాలని ఈ లేఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అంటూ, తమ మారిన అభిప్రాయం మీద అభిప్రాయాలు ఆహ్వానిస్తూ బహిరంగంగా ఇమెయిల్, ఫేస్ బుక్ ఐడి కూడా ఇచ్చారు. జైళ్లలో ఉన్న ఖైదీలు “జైలు అధికారుల అనుమతితో” తమ అభిప్రాయాలను పంపవచ్చునన్నారు.  

ఈ లేఖలోని విషయాలు అసంగతమైనవి, హాస్యాస్పదమైనవి, పరస్పర విరుద్ధమైనవి, విప్లవోద్యమ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమైనవి. పార్టీ నిర్ణయించిందని ఒక చోట, పార్టీకి తెలియజేయాలని ఒకచోట అన్నారు. అనుకూలంగా ఉన్నవారితో చర్చల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారంటే, అది పార్టీ ఏకాభిప్రాయమో, కనీసం మెజారిటీ అభిప్రాయమో కాదని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఒక అజ్ఞాత పార్టీ అత్యంత మౌలికమైన రాజకీయ నిర్ణయం గురించి ఇమెయిల్ లో, ఫేస్ బుక్ లో, జైలు అధికారుల ద్వారా బహిరంగ చర్చకు ఆహ్వానించడమే హాస్యాస్పదం.

నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంతో ఉండి, అనేక స్థాయిల నిర్మాణ బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇంత హాస్యాస్పదమైన లేఖ రాయడం ఆశ్చర్యకరం. అందువల్లనే ఇది ఆయన రాసినది కాకపోవచ్చుననీ, మానసిక యుద్ధంలో భాగంగా పోలీసులు విడుదల చేసినదనీ అనుమానాలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన గొంతులో, ఆయన స్వయంగా చదివి వినిపించిన ప్రకటన కూడా బైటికి వచ్చింది. అప్పటికీ ఆయన గొంతును పోలీసులే ఏఐ ద్వారా రూపొందించి ఉంటారని అనుమానాలు వచ్చాయి.

కాని అటువంటి అనుమానాలను తొలగిస్తూ, ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ అనే ఆరు పేజీల, ఆగస్ట్ అని నెల మాత్రమే ఉండి, తేదీ లేని లేఖ ఒకటి కూడా వచ్చింది. ఈ లేఖలో “కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్” అనే బదులు “పీబీ సభ్యుడు సోనూ” అని సంతకం చేశారు. “అపరాధ భావనతో” అని ముగించారు. 

ఈ లేఖ కూడా వైరుధ్యాల పుట్ట. సాగుతున్న వరుస నష్టాల పట్ల ఆందోళనతో ఉన్న విప్లవోద్యమ కార్యకర్తల, సానుభూతిపరుల భావోద్వేగాలను ఆకర్షించే వాక్యాలు ఉన్నాయి. ఉద్యమం ముందుకు పోవడం లేదనే విచారాన్ని ప్రకటిస్తూ, చిత్తశుద్ధితో ఉద్యమం ముందుకు పోవాలని కోరుకునేవారి భావోద్వేగాలను ఆకర్షించే వాక్యాలు ఉన్నాయి. కాని ఆ మమేకతతో కూడిన నిరాశను తొలగించే బదులు, “వారి ఆశయాల సాధనకై సరియైన మార్గంలో ముందుకు పోదాం” అంటూనే అసలు మార్గాన్ని తప్పించే, వెనక్కు తిప్పే ప్రయత్నం ఉంది. ఐదు దశాబ్దాల విప్లవోద్యమం సాధించిన విజయాల గురించి మొక్కుబడి మాటలు చెపుతూనే, ఆ విజయాలకు పునాది ఐన వ్యూహం – ఎత్తుగడలు దస్తావేజు మార్గదర్శకత్వాన్ని ఒకవైపు ఒప్పుకున్నట్టు కనబడుతూనే, అసలు మార్గమే, పంథానే తప్పు అనే నిర్ధారణలు ఉన్నాయి. విప్లవోద్యమ చరిత్ర గురించి తప్పుడు అంచనాలు, అసత్యాలు, అర్ధసత్యాలు ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు ఉద్యమ నిర్మాణాలు చేసుకున్న ఆత్మవిమర్శల్లో, జరిగిన చర్చల్లో అంశాలనే ప్రస్తావిస్తూ, వాటి నుంచి అసలు పోరాటమే తప్పు అనీ, ముగించాలనీ తప్పుడు నిర్ధారణ ఉంది. దేశంలో విప్లవ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని ఒప్పుకుంటూనే, వాటిని పార్టీ కాలదన్నుకుందనే నిర్ధారణ ఉంది. 

“ఈ పరిస్థితులను తిరిగి చక్కదిద్దుకోవడానికి ఎంత పట్టుదలగా పని చేసినప్పటికీ, మిగిలిన విప్లవ శక్తులకు మౌలికంగానే పార్టీ వ్యూహం-ఎత్తుగడలను, విధానాలను మార్చుకోకుండా సాధ్యం కాని స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో, పార్టీ గత తప్పులనుండి నేర్చుకుంటూ తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయకుండా సాధ్యం కాదనేది తేలిపోయింది… ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లి ప్రజా సమస్యలపై వారిని పునఃసంఘటితం చేస్తూ, గత తప్పులకు తిరిగి నెట్టబడకుండా, విప్లవోద్యమాన్ని నిర్మించడమే ఇక పార్టీ ముందు మిగిలిన ఏకైక మార్గంగా మిగిలింది” అనే అర్థరహితమైన నిర్ధారణ ఈ లేఖ సారాంశం.

అనవసరమైన, మితిమీరిన ఆత్మనిందా ధోరణిలోకి వెళ్లిన ఈ లేఖ దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా, సాయుధ పోరాటం అనే మాటలను కూడా వెటకారం చేసింది. చిట్టచివరికి, ఇక మేం ఉండబోవడం లేదు గనుక, మీమీద దాడులు పెరుగుతాయి గనుక, మీ పోరాటం మీరే చేసుకోండి అనే ఉచిత సలహాతో, “న్యాయమైన ప్రజాసమస్యలపై న్యాయబద్ధమైన పోరాటాలకు పూనుకుందాం” అనే ఊహాలోకపు పిలుపుతో ముగిసింది. 

ఈ లేఖలో కొన్ని అభిప్రాయాలు చర్చనీయమైనవే. గతంలో లోపలా బైటా చర్చించినవే. ఇంకా చర్చించవలసినవే. కాని ఈ లేఖ వచ్చిన సమయ సందర్భాలే అనుమానాస్పదమైనవి.          

ఈ లేఖలలో సైద్ధాంతిక, రాజకీయ అంశాలతో పాటు నిర్మాణపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి గనుక, అధికార ప్రతినిధి సంతకంతో వెలువడిన మొదటి ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చునని, పార్టీ అభిప్రాయం కాదని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సెప్టెంబర్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆయుధాలు అప్పగించి, ప్రధాన స్రవంతిలో చేరి, పీడిత ప్రజలకు నమ్మకద్రోహం చేయడం మా పార్టీ విధానం కాదు, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ వర్గపోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడమే మా కర్తవ్యం’ అంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ల పేరిట సెప్టెంబర్ 20న ఒక ప్రకటన వచ్చింది. పార్టీ తన మౌలిక పంథాకు కట్టుబడి ఉందనీ, ఉంటుందనీ ఆ ప్రకటన చెప్పింది.

ఒకవైపు సంఘ్ పరివార్ ప్రభుత్వపు మతోన్మాద, కార్పొరేటీకరణ, సైనికీకరణ రాజకీయార్థిక వ్యూహాలు సమాజాన్ని అతలాకుతలం చేస్తుండగా, కుల, మత, స్త్రీపురుష, ప్రాంతీయ, భాషా అంతరాలు, అధికధరలు, నిరుద్యోగం, సామ్రాజ్యవాద దోపిడీ, పీడన నానాటికీ పెరిగిపోతూ, ప్రజల అసంతృప్తి, విప్లవ అవసరం పెరుగుతుండగా, ఇంతకాలమూ ఆశారేఖగా ఉండిన ఏకైక విప్లవోద్యమ నిర్మాణం ఇటువంటి ముప్పేట దాడిలో విచారకరంగా చిక్కుకోవడం చరిత్రకు, సమాజానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. ఈ దాడిని అధిగమించి, బైటపడి, పదునెక్కుతున్న వర్గపోరాటంలో పీడిత ప్రజలకు నాయకత్వం వహించే శక్తి సంతరించుకుంటుందా, ఈ దాడికి బలహీనపడిపోతుందా చెప్పలేం. చరిత్రలో ఇటువంటి సంక్షోభాలూ వచ్చాయి. ఆ సంక్షోభాలను అధిగమించి లేచి నిలిచి ఉజ్వలమైన కొత్త దారులు వేసిన సందర్భాలూ ఉన్నాయి. క్రమంగా శ్రేణులనూ, చొరవనూ పోగొట్టుకుని, నిష్క్రియలోకి జారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే ఎంతగా అణగిపోయినదనుకున్నా, వర్గపోరాటం భౌతిక నియమం గనుక, ఏదో ఒక సందర్భంలో మళ్లీ పునర్వికాసం పొందిన సందర్భాలూ ఉన్నాయి. 

అందువల్ల, ‘ఏమీ జరగలేదు, ఇది తాత్కాలిక వెనుకంజ మాత్రమే, త్వరలోనే పుంజుకుంటాం’ అనే నిరాధార ఆశావాదానికీ చరిత్రలో స్థానం లేదు. ‘అంతా అయిపోయింది, ఇక ఆచరణ మానుకుని ఇంటికి పోదాం, ఎవరి సొంత బతుకు వాళ్లం బతుకుదాం’ అనే నిరాశావాదానికీ చరిత్రలో స్థానం లేదు. ఆ రెండు కొసల మధ్య వాస్తవం ఎక్కడో ఉంది. మన దేశంలోనే అనేక పోరాటాల చరిత్రలు ఈ రెండు కొసల వాదనలూ అర్థరహితమని చూపుతున్నాయి. భయానకమైన పాలక దమనకాండలో, లేదా ప్రజా ఉద్యమాల స్వీయ తప్పిదాలలో అంతర్ధానమైన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. అలా ఆగిపోయిన ప్రతి ఒక్క పోరాటమూ తదనంతర కాలంలో మరింత బలమైన, మరింత విస్తారమైన, మరింత ఆలోచనాయుతమైన, మరింత వైవిధ్యభరితమైన పది పోరాటాలుగా వికసించిందనీ చరిత్ర చెపుతుంది. ఇవాళ భారత విప్లవోద్యమం, ప్రజా ఉద్యమాలు మొత్తంగా గురి అవుతున్న నష్టాలు తీవ్రమైనవే. బహుశా అవి ప్రజా సంచలనాలను కొంతకాలం మందకొడిగా మార్చవచ్చు. కాని ఈ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తులో మరింత విస్తారమైన ప్రజా ఉద్యమాలు చెలరేగక తప్పదు. 

కాకపోతే ప్రస్తుత అనుభవం నుంచి తక్షణమే గుర్తించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.   

ప్రస్తుత చర్చలో సాయుధ పోరాటం విరమించడమా, తాత్కాలికంగా విరమించడమా, కొనసాగించడమా అనే అనవసరమైన చర్చ జరిగింది. దానికి అనుబంధంగానే ఎవరు ఎప్పుడు సాయుధపోరాటాన్ని విరమించవచ్చు, ఎవరు ఎప్పుడు కొనసాగించవచ్చు అని కూడా చర్చ జరిగింది. సాయుధపోరాటం అనేదేదో ఒకరో, ఒక బృంధమో, ఒక రాజకీయ పార్టీయో ప్రారంభిస్తుందనీ, లేదా విరమిస్తుందనీ, లేదా కొనసాగిస్తుందనీ ఒక అభిప్రాయం రెండు వైపులా బైటపడింది. నిజానికి సాయుధ పోరాటం అనేది ఎవరో ప్రారంభిస్తే ప్రారంభమయ్యేదీ కాదు, ఎవరో విరమిస్తే ఆగిపోయేదీ కాదు. సాయుధ పోరాటం చరిత్ర నియమం. అది స్వీయాత్మక నిర్ణయం మీద ఆధారపడినది కాదు. అది భౌతిక ప్రపంచంలో, వర్గ సమాజంలో అనివార్యమైన పరిణామం.

వర్గ సమాజం ఏర్పడినప్పుడే ఆస్తి మీద, దోపిడీ పీడనల మీద అధికారం వహించిన పాలకవర్గాలు ఆ ఆస్తినీ, దోపిడీనీ, పీడననూ నిరంతరం యథాతథంగా కొనసాగించడానికి ఆయుధాలు చేపట్టాయి. మరెవరూ, అంటే పీడిత వర్గాలు, ఆయుధాలు చేపట్టగూడదని ఆంక్షలు విధించాయి. ఆయుధ ధారణ మీద, ఆయుధ వినియోగం మీద తమదే గుత్తాధిపత్యం అన్నాయి. కాని ఆ దోపిడీ పీడనల పట్ల తమ నిరసన ప్రకటించడానికి, ఆ ఆస్తి మీద దాడి చేయడానికి పీడితులలో అనేక మంది వ్యక్తులుగా, కుటుంబాలుగా, చిన్న బృందాలుగా సాయుధ ప్రతిఘటన చేపట్టారు. అవతలి ఆయుధాలకు ఇవతలి ఆయుధాలతో జవాబు చెప్పడం ప్రారంభించారు. చరిత్ర పొడవునా చెదురుమదురుగా, చిన్న స్థాయిలో, రైతాంగ తిరుగుబాట్లుగా, యంత్ర విధ్వంసంగా, సామాజిక నియమావళి మీద అరాచకంగా వ్యక్తమైన ఈ సాయుధ ఘర్షణ, వ్యవస్థ పరివర్తన సందర్భాలలో పెద్ద ఎత్తున వ్యక్తమయింది.

చరిత్ర పట్ల భౌతికవాద దృక్పథాన్ని అనుసరించిన మార్క్స్ ఎంగెల్స్ లు ఈ చరిత్ర అధ్యయనం నుంచే, వర్గపోరాటమే చరిత్ర చోదక శక్తి అని గుర్తించారు. హింస విప్లవానికి మంత్రసాని అన్నారు. బలప్రయోగం ద్వారా తప్ప వ్యవస్థ మారలేదు గనుక ఇక ముందుకూడా మారబోదు అన్నారు. ఈ అవగాహనను తలకిందులుగా అర్థం చేసుకున్న అకడమిక్ పాఠ్యపుస్తకాలు వర్గపోరాటాన్ని, హింసను, బలప్రయోగాన్ని మార్క్సే ప్రారంభించినట్టుగా చెపుతుంటాయి. ఇప్పుడు కూడా ఎక్కడైనా వర్గపోరాటపు సమరశీల వ్యక్తీకరణ ఉన్నదంటే, వ్యవస్థీకృత హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనబడిందంటే, ఆయుధ ప్రయోగం, బలప్రయోగం కనబడిందంటే అది మార్క్సిస్టుల పనే అని పాలకవర్గ మేధావులూ ప్రచార సాధనాలూ అంటుంటారు. మార్క్స్ అయినా, మార్క్సిస్టులైనా చేసేదల్లా సమాజంలో అంతర్గర్భితంగా, నిశ్శబ్దంగా సాగుతున్న వర్గపోరాటాన్నీ, దానికి ఒకానొక వ్యక్తీకరణ అయిన సాయుధ పోరాటాన్నీ బహిరంగం చేయడం, లక్ష్యశుద్ధితో, క్రమశిక్షణాయుతంగా, చైతన్యయుతంగా అమలు చేయడం మాత్రమే. అంటే కచ్చితమైన ఆర్థంలో సాయుధ పోరాటాన్ని ఒకరు ప్రారంభించడమూ ఉండదు, ఒకరు విరమించడమూ ఉండదు.

చరిత్ర చలన నియమం అయిన వర్గపోరాటాన్ని, సాయుధ పోరాటంతో సహా దాని అనేక వ్యక్తీకరణలను, స్థల, కాల, సందర్భ, స్వీయాత్మక అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి మార్క్సిస్టులు చేపడతారు. వారు చేపట్టకపోయినా అది కొనసాగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇవాళ సాయుధ పోరాటం గురించి చర్చ జరుగుతున్న స్థలంలో, ఆదివాసి సమూహంలో పాలకులతో సాయుధ ఘర్షణలకు రెండు, మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. మార్క్స్ కన్నా, మార్క్సిస్టుల కన్నా, మావోయిస్టుల కన్నా ముందు నుంచీ సాయుధ పోరాటం ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. 

ఆదివాసి పోరాటం మాత్రమే కాదు, సమాజంలో మరెక్కడైనా, ఏ ఘర్షణ అయినా అట్టడుగున ఉత్పత్తి సంబంధాల ఘర్షణకు, అంటే వర్గపోరాటానికి ఒకానొక ప్రతిఫలనంగా మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి ఉత్పత్తి సంబంధాలకూ, వర్గానికీ ఈ ఘర్షణకూ ఏమీ సంబంధం లేనట్టు పైకి కనబడవచ్చు గాని, ఎక్కడో భూగర్భం లోపల శిలా ఫలకాల కదలిక భూ ఉపరితలంలో భూకంపానికి ఎలా కారణమవుతుందో, వర్గపోరాటమూ సామాజిక ప్రకంపనలూ అలాంటివే. అది నిరంతరాయంగా సాగుతుంది. అనేక రూపాలు తీసుకుంటుంది. దశాబ్దాలూ శతాబ్దాలూ మందకొడిగా మౌనంగా సాగినట్టనిపించినా, ఒక్కొక్కసారి వారాలలోనే దశాబ్దాలూ శతాబ్దాలూ గడవడం పేరుకున్న వర్గపోరాట ఫలితమే. నిర్బంధం ద్వారా, ఒత్తిడి ద్వారా, స్వీయాత్మక శక్తులను నిర్మూలించడం ద్వారా, స్వీయాత్మక శక్తుల వ్యక్తీకరణను అడ్డుకోవడం ద్వారా వర్గపోరాట భౌతిక నియమాన్ని రద్దు చేశామని పాలకులు సంబరపడవచ్చు. కాని అది చరిత్ర చలనపు భౌతిక నియమం గనుక ఎప్పుడో ఒకసారి పెటిల్లున విస్ఫోటనానికి దారి తీస్తుంది. అటువంటి విస్ఫోటనాలు యాదృచ్ఛికంగా, లక్ష్య శుద్ధి లేకుండా, దిశానిర్దేశం లేకుండా, అరాచకంగా, ఎటు పడితే అటు జరగవచ్చు గనుకనే, క్రమశిక్షణాయుత, చైతన్యయుత, నిర్మాణాత్మక మార్గదర్శకత్వం అందించి తక్కువ నష్టంతో ఎక్కువ ఫలితాల సామాజిక పరివర్తన సాధించడానికే ఒక సైద్ధాంతిక అవగాహన గల పార్టీ అవసరం అవుతుంది.

ఒక్కొక్కసారి వర్గపోరాట బలాబలాలలో మార్పు వల్ల అటువంటి పీడితవర్గ పార్టీలను పాలకవర్గాలు నిర్దాక్షిణ్యంగా తుడిచిపెట్టడానికి ప్రయత్నించవచ్చు. లేదా ఆ పీడితవర్గ పార్టీలే నిర్బంధానికి లొంగిపోయి, స్వీయాత్మక శక్తులను పోగొట్టుకుని, భ్రమలకు లోనై, అన్యవర్గ భావజాలానికి లోనై తమను తాము కోల్పోవచ్చు. పీడిత ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవచ్చు. ఆశలను రద్దు చేయవచ్చు. అయినా సరే, వర్గపోరాటం చరిత్ర నియమమనీ, పీడితులు తమ మీద దోపిడీ పీడనలను ఇంకెంతమాత్రమూ సహించలేని స్థితి వచ్చినప్పుడు విస్ఫోటనం అవుతుందనీ, ఆ సమయానికి శక్తులు కూడదీసుకుని, నాయకత్వం వహించడానికి, మార్గనిర్దేశనం చేయడానికి సిద్ధంగా ఉండాలనీ అవగాహనతో, ఓపికతో ఉండడం, ఈలోగా తాత్కాలిక నష్టాలకు జడిసి స్థైర్యం కోల్పోకుండా ఉండడం పీడిత ప్రజా పక్షం వహించదలచుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. 

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad